”అమ్మ…” నాకు తెలుగులో తెలిసిన తియ్యని పదం. ఆ పదం తెలియని ఏ మనిషి ఉండడు. ఆ దేవుడు ఉంటే కనుక ఆయనకు నేను ఎంతో ఋణపడి ఉంటాను. ఎందుకంటే ఆ దేవుడు నాకు ఒక అమ్మని ఇచ్చాడు. అమ్మ గురించి రాయాలంటే పేజీలు సరిపోవు. ఒక పుస్తకం సరిపోదు. ఈ భూమిమీద ఎన్ని పుస్తకాలు ఉన్నాయో ఆ పుస్తకాల్లో రాసినా సరిపోవు. అమ్మ గురించి చెప్పాలంటే మన జీవితాంతం మాట్లాడినా సరిపోదు. దేవుడు ప్రతిచోట ఉండలేక ఆయన స్థానంలో అమ్మని పెట్టాడంట. అమ్మ నన్ను నవమాసాలు మోసింది. తను ఎంతగానో కష్టపడింది. నేను లోపల తంతున్నా తను ఎంత మాత్రమూ బాధపడకుండా సంతోషపడింది. నేను పుట్టేటప్పుడు తాను ఎంతగానో కష్టపడి ఏడ్చి నన్ను కనింది. నేను పుట్టాక నన్ను ఎంతో జాగ్రత్తగా, ఎంతో సుకుమారంగా చూసుకుంది. నేను ఎన్ని తప్పులు చేసినా, ఎంత ఏడ్చినా ఎప్పుడూ నా పక్కనే ఓ చిరునవ్వుతో కనిపిస్తూ ఉంటుంది. ఎదిగేకొద్దీ నేను ఎన్ని తప్పులు చేసినా ఏమీ అనకుండా, మాటలతో తన చిరునవ్వుతో అది తప్పని నాకు చెప్పింది.
నేను ఎన్నిసార్లు అన్నం తిననని మారాం చేసినా, నాకు ఒక కమ్మని పాటను పాడి నాకు అన్నం తినిపించింది. ఎన్నిసార్లు నేను ఓడినా తన ముఖం చూపించి నన్ను గెలిపించింది. నేను ఎన్నిసార్లు కిందపడి దెబ్బ తగిలించుకొని ఏడ్చినా మా అమ్మ ముఖాన్ని చూస్తే, ఏంటో మరి వెంటనే తగ్గిపోతుంది. అమ్మ నన్ను జీవితాంతం మోస్తూనే ఉంది. నాకు నిజంగా ఆ దేవుడు ఒక అవకాశం ఇస్తే నా ప్రతి జన్మలో తననే అమ్మగా ఇవ్వమంటాను.