దశాబ్దాలుగా ఒకానొక కుల సంస్కృతి, భాష, కట్టుబాట్లే తెలుగు సినిమాని నిండా ఆక్రమించాయి. ఇటీవల మళ్ళీ ఆ కులానికి పోటీగా ఇతర కులాల సంస్కృతి చిన్నగా సినిమాలలో చొప్పిస్తున్నా మొత్తానికి సారాంశం ఒక్కటే! ఆధిపత్య సంస్కృతి, భాష, ఆయా కులాల గొప్పదనం, యదాతథవాదం తప్ప దృక్పథాలలో మార్పేమీ లేదు. వారి సినిమాలలో స్త్రీ పాత్రలకైతే పూచిక పుల్ల విలువ ఉండదు. స్త్రీ పాత్రలు కూడా తమ కుల ప్రయోజనాలతో పాటు పురుష ప్రయోజనాలనే కాపాడుతుంటాయి. ఏ కుల కాంతలు ఏ ధర్మం నెరవేర్చాలో వారే చెబుతుంటారు అమాయకంగా… అందంగా…
పా. రంజిత్ అసలు సినిమాకు ‘కాలా’ అనే పేరు పెట్టడం దగ్గర నుంచి ఈ సినిమాలోని అన్ని సన్నివేశాల్లో దళిత గ్రామర్‌ని చాటింపేశాడు. ఈ సినిమా మనువాద మూస భావాలను కాలితో తన్నడమే కాదు సమకాలీన రాజకీయ పరిస్థితిపై అంబేద్కరైట్ చూపును కళ్ళారా చూపించింది. నలుపు, నీలం రంగుల్ని సెల్యులాయిడ్ పైన అద్దిన సినిమా ‘కాలా’. ఈ సినిమాకు దర్శకుడి దృక్పథమే హీరో అని చెప్పాలి. ‘నేల నీకు అధికారం, నేల మాకు జీవితం’ అనే రజనీ డైలాగ్‌తో నేలతో ముడిపడి ఉన్న అధికార సంబంధాలను సూటిగా తేల్చి చెప్పాడు. దేశభక్తి పేరున తెల్ల తెల్లగా జరుగుతున్న సమస్త దుర్మార్గంపై పెద్ద డబ్బాడు నల్ల రంగును పోశాడు రంజిత్. ‘నలుపు శ్రమ జీవుల వర్ణం… మా వాడకొచ్చి చూడు, మురికంతా ఇంద్రధనుస్సులా కనిపిస్తుంది’ అంటూ అసలైన దళిత సౌందర్యాన్ని ‘కాలా’ గట్టిగానే ప్రదర్శించాడు. బొంబాయి మురికివాడ ‘ధారావి’లో దళిత శ్రమ జీవుల ఉనికిని కాపాడే ప్రయత్నంలో దళితుడు వీరయ్య పెత్తందారుల చేతిలో హత్యకు గురవుతాడు. ఆ సాహసోపేతమైన వారసత్వాన్ని కొనసాగిస్తూ కుల, మత రాజకీయాలు సాగించే మనువాదులకు అడుగడుగునా కొరకరాని కొయ్యగా మారిన ‘కరికాల’ దళిత ధిక్కారానికి ప్రతీక. ఈ సినిమాలో రోహిత్ పోలికలున్న అబ్బాయి కథానాయకుడు రజనీ చిన్న కొడుకు లెనిన్‌లో కనిపిస్తాడు. భారతి అనే అమ్మాయిది లెనిన్ ప్రేమికురాలిగా, ఉద్యమ సహచరిగా డైనమిక్ రోల్. ఆమె పోలీసులు తన పై బట్టలు తీసి అపహాస్యం చేయబోతే మూస యువతి పాత్రలాగా ముడుచుకుపోయి ఏడుస్తూ కూర్చోకుండా తిరగబడి వారితో ప్రాణాలకు తెగించి పోరాడి చనిపోతుంది. ఈ అమ్మాయి పాత్రని బాబాసాహెబ్ పుట్టి పెరిగిన మహారాష్ట్ర నీలి డైనమైట్‌గా సిసలైన దళిత ధిక్కారిగా మలిచాడు రంజిత్. ఇతర స్త్రీ పాత్రలైన స్వర్ణ, జరీన స్వంత వ్యక్తిత్వంతో మెరుస్తూ కనిపిస్తాయి. స్వర్ణ ఆత్మగౌరవాన్ని చాటే సగటు దళిత గృహిణి అయితే, జరీనా రాజకీయ చైతన్యం కలిగి దళిత సమూహాల పట్ల ముస్లింలకు ఉండవలసిన సహానుభూతిని ప్రదర్శిస్తూ అన్ని విషయాలలో వారితో మమేకమయ్యే విద్యావంతురాలైన అర్బన్ ముస్లిం పాత్ర… సింగిల్ మదర్. కాళ్ళు పట్టించుకుని తన అహాన్ని సంతృప్తిపరచుకునే పెత్తందారీ వర్గపు ప్రతినిధియైన ప్రతినాయకుడికి ఎదుటివారికి షేక్ హ్యాండ్ ఇవ్వడంలో ఉండే సమానత్వ భావనేంటో అర్థం చేయిస్తుంది.
‘కాలా’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ శరీరం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకునేలా ఒక గంభీరమైన ధ్వనితో సినిమా అయిపోయాక కూడా మనల్ని వెంటాడే మంటలా ఉంది. కథానాయకుడు ‘కాలా’ టేబుల్‌మీద ఆనంద నీలకంఠన్ ‘అసురుడు’ నవల కనిపించడం, చాలా సన్నివేశాల్లో బుద్ధుడు, ఫూలే, అంబేద్కర్‌ల చిత్రపటాలు గోడలమీద కనిపించడం దర్శకుడు రంజిత్ ఆలోచనల వెనక ఎవరున్నారో పరోక్షంగా చెప్పినట్లయింది. ‘కాలా’ని బైక్‌మీద తీసుకెళ్ళే అబ్బాయి ‘I aఎ జూa్‌తీఱశ్‌ీ, I షఱశ్రీశ్రీ షశ్రీవaఅ ్‌ష్ట్రవ రశీషఱవ్‌వ’ అని రాసుకుని నాలుగు రోడ్ల కూడలిలో పెద్ద ఫ్లెక్సీ పెట్టుకున్న ప్రతినాయకుడి మొహాన పేడ ముద్ద విసరడంలో దర్శకుడు తానేమి చెప్పదలచుకున్నాడో సింబాలిక్‌గా చెప్పేశాడు. అసలు అందం అంటే నలుపుదే అని ఈ సినిమా పదే పదే చెబుతుంది. కథానాయకుడికి ఈ సినిమా మొత్తంమీద నలుపు, నీలం తప్ప వేరే రంగు బట్టలు పెద్దగా వేయకపోవడంలో కూడా దర్శకుడి ఉద్దేశం కనిపిస్తుంది.
విజయవాడలో ఒక ప్రముఖ ఐమాక్స్‌లో చూస్తే పిడికెడు మంది కూడా థియేటర్‌లో లేరు. సినిమా అయిపోయాక ప్రేక్షకులు ఎవరై ఉంటారని మొహాలు చూస్తే వాళ్ళు కూడా జాగ్రత్తగా, రహస్యంగా మా ముఖాలు గమనిస్తున్నారు. బహుశా మా ఇద్దరిదీ ఒకే భాష కావచ్చు.
మనవి కాని జీవితాలను పదే పదే చూస్తూ తెలుగు సినిమాలకు కమర్షియల్ హిట్లు ఇచ్చే దళిత యువకులు, స్త్రీలు, వాడ వాడంతా తరలి వెళ్ళి కేరింతలతో సినిమాను చూడాలి… వర్ణ అంధత్వంతో గుడ్డిదైన సమాజాన్ని బోనులో నిలబెట్టిన ‘కాలా’ పా.రంజిత్‌ను గుండెలకత్తుకోవాలి…