సమస్యల్లో ఉన్న స్త్రీల కోసం భూమిక హైల్ప్‌లైన్ ప్రారంభించి పన్నెండు సంవత్సరాలు అయింది. సమస్యల్లో ఉన్న బాధిత మహిళలకు సలహా, సమాచారం ఇవ్వడంతోపాటు అవసరమైతే వారికి సమీపంలో ఉండే భూమిక వాలంటీర్‌కి వారిని అనుసంధానించడం కూడా జరుగుతుంది. అలాగే భూమిక ప్యానెల్ అడ్వకేట్‌ల ద్వారా వారికి న్యాయపరమైన సలహాలు, సహాయం కూడా ఏర్పాటు చేస్తాం. భాదితులకు మరింత మద్దతు కూడగట్టడం కోసం ఆయా ప్రాంతాలలో పనిచేసే ఎన్.జి.వోలతో కూడా కలిసి పనిచేస్తాం. ప్రతి సంవత్సరం వీరందరితో ఒక సమావేశం ఏర్పాటు చేయడం చాలా సంవత్సరాలుగా చేస్తున్నాం.
జూన్ 27వ తేదీన హబ్సిగూడలోని స్వాగత్ గ్రాండ్ హోటల్లో భూమిక వాలంటీర్లు, న్యాయవాదులు, కౌన్సిలర్లు, ఎన్‌జివోలతో కలిపి రోజంతా సమావేశం జరిగింది. దాదాపు 80మంది పాల్గొన్నారు. సమావేశాన్ని ప్రారభించిన సత్యవతి ఆ సమావేశ అవసరాన్ని గురించి చెబుతూ ”ప్రస్తుతం స్త్రీలు, పిల్లలపై వివిధ రూపాల్లో విస్తరిస్తున్న హింసను గురించి మనమందరం చర్చించుకోవాల్సిన అవసరముంది. రోజంతా మనం మాట్లాడుకుందాం. తీర్మానాలు చేసుకుందాం. ప్రశాంతి, సంధ్యలు రిసోర్స్ పర్సన్స్‌గా ఉంటారు. మీరంతా చర్చలో పాల్గొని సూచనలు చేయాల్సిందిగా కోరుతున్నాను. అలాగే భూమికకు మీ సపోర్ట్ ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాను” అన్నారు.
”మారుతున్న హింసారూపాలు – మన కర్తవ్యాలు” అనే అంశం మీద తొలి సెషన్‌ను ప్రశాంతి చాలా సమర్థవంతంగా నిర్వహించింది. వరకట్న మరణాల నుంచి సైబర్ నేరాల వరకు చాలా లోతుగా మాట్లాడి పార్టిసిపెంట్స్ అందరూ చర్చలో పాల్గొనేలా చేయగలిగింది. రెండో సెషన్‌లో సంధ్య మాట్లాడింది. వివిధ రకాల హింసలు, మారుతున్న సామాజిక పరిస్థితులు, సహాయ సంస్థల గురించి వివరంగా మాట్లాడింది. ఆ తర్వాత వాలంటీర్లు, బాధిత మహిళలు, న్యాయవాదులు తమ అనుభవాలను, ఆలోచనలను పంచుకున్నారు.
రోజంతా చాలా ఉత్సాహంగా జరిగిన సమావేశం అనేకానేక చర్చల్ని చేపట్టడంతోపాటు కొన్ని తీర్మానాలను కూడా చేసింది. తరచుగా ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటే బావుంటుందనే ప్రతినిధుల సూచనని భూమిక అంగీకరించడంతో ఆనాటి సమావేశం ముగిసింది.