పల్లెటూళ్ళలో కూడా
బ్యాంకులుంటాయి.
ఆ బ్యాంక్ పైన
కాకులు అరుస్తున్నప్పుడే
ఏదో జరగరానిది
జరుగుతున్నట్టనిపించింది.
అప్పుడప్పుడు సర్కారు కూడా
మంచి పనులు చేస్తుంది.
వృద్ధాప్య పెన్షన్ల కోసం
ముసలమ్మలు క్యూలో నిలబడ్డారు.
బ్యాంకు ముందు
గుంపుల్లో ఏదో అలజడి.
మొట్టమొదటిసారి కొడుకులు
గద్దల్లా కనిపిస్తున్నారు.
‘వద్దురా!
నా మందులగ్గావాల్రా
ఆకు వక్కలు కొనుక్కుంట బిడ్డా!’
అని శోకాలు పెట్టింది ముసల్ది.
ఎవడు వింటడు!
యముడు ప్రాణాలు ల్కాపోతున్నట్టు
పైసలు వదలదీసిండు.
గుడ్లు తేలేసింది కన్నతల్లి
ఇప్పుడవే పైసల్తో
అంత్యక్రియలు జేస్తడు గావచ్చు.