పూర్వం రామాపురంలో రామయ్య సోమయ్య అనే అన్నదమ్ములుండేవారు. అన్న రాజయ్య ఎంతో కష్టజీవి. తమ్ముడు సోమయ్య మహా సోమరిపోతు. రామయ్య ఎల్లప్పుడూ కష్టపడ్తూ వుండటం వల్ల ఆరోగ్యంగా ఉండేవారు. సోమయ్య సోమరిగా కూర్చుని తింటూ కాలం గడుపుతూండడం వల్ల చిన్న వయసులోనే ఒళ్ళు పెరిగి స్థూలకాయం ఏర్పడి బిపి, షుగర్ గుండె జబ్బు, కీళ్ళనొప్పులు, ఆయాసం, మడమనొప్పి పాదాలు పగిలి నడవలేకపోవడం లాంటి జబ్బులు వచ్చాయి.
ఒకసారి రామయ్యకి జబ్బు చేసి మంచానపడి బయట వాళ్ళని నమ్ముకుంటే ఈ రోజుల్లో లాభంలేదు. జాగ్రత్తగా మన పొలం పనులు చూసుకో. రేపు నాకేదైనా జరిగి మరణిస్తే ఈ ఆస్థి అంతా నువ్వే జాగ్రత్తగా ఒక్కడివే చూసుకోవాలి అని తమ్ముడ్ని పురమాయించాడు.
సోమయ్య ఎంత సోమరిపోతైనా భవిష్యత్తును ఊహించుకొని భయపడి అన్నమాటలు వినకపోతే అన్యాయమైపోతానని గ్రహించి గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితిలో పొలంపనులు చూసుకోవటం ప్రారంభించాడు. మొదట అదంతా ఎంత కష్టంగా అనిపించినా రాను రాను ఆ పనులన్నీ అలవాటయి తేలికగా అయ్యాయి. కష్టపడటం వల్ల వచ్చే ఫలితాలు ….. పనిచేయటం ప్రారంభించాడు.
అంతే! సోమయ్యకి వచ్చిన జబ్బులన్నీ మటుమాయమై శరీరం తేలికై హాయిగా సుఖంగా అనిపించసాగింది.
ఒకరోజు సోమయ్య అన్న రామయ్యను కలిసి పొలం ఎంత బాగా పండిందో సంతోషంగా చెప్పి పొలం గురించి నువ్వేం దిగులుపడకన్నయ్యా! నీలాగే నేనూ అన్ని పనులూ నేర్చుకొని కష్టపడి పనిచేస్తున్నాను. నీ ఆరోగ్యం ఎలా ఉంది అన్నయ్యా! అని రామయ్యను పరామర్శించాడు.
రామయ్య సంతోషంతో మంచం మీద నుంచి లేచి కూర్చోని నా ఆరోగ్యానికేంరా? బ్రహ్మండంగా వుంది. కష్టజీవిని నాకెందుకు రోగాలు వస్తాయి! నీకు కష్టపడటం అలవాటు చేసి, నీ ఆరోగ్యం బాగు చేయటానికే నాకు జబ్బు చేసినట్టు నటించాను అన్నాడు తమ్ముడు సోమయ్యతో నవ్వుతూ…
అన్న తన క్షేమం కోరి ఆడిన నాటకం వల్ల తనకు కష్టపడటం అలవాటై ఆరోగ్యంగా తయారైనందుకు సోమయ్య సంతోషపడి అన్నకు కృతజ్ఞతలు తెలిపాడు. అప్పటి నుండి అన్నతో సమానంగా కష్టపడి పనిచేస్తూ సిరి సంపదలు పెంచుకొని కష్టజీవి రామయ్యకు తగ్గ తమ్ముడు సోమయ్య అని ఊరి వాళ్ళందరితో శభాష్ అనిపించుకున్నాడు.