భూమిక ఎడిటర్ గారికి!
భూమిక సెప్టెంబర్ సంచిక ఎంతో మానవీయంగా సాగింది. అమరేంద్ర అనువదించిన ఒకరికోసమొకరు శీర్షికలో ఇలాభట్ గారు తన భర్త రమేష్ ఆరోగ్యం గురించి ఆలోచించలేకపోయానే అని పడ్డ బాధకు కన్నీళ్ళు వచ్చేశాయి. చాలామంది సహచరులకు ఇలాగే జరుగుతూ ఉంది. ఇది చదివాక అయినా కార్యకర్తలు తమ సహచరుల గురించి పట్టించుకుంటారని ఆశిస్తాను. లేకుంటే జీవితమంతా లోటుగానే ఉంటుంది. పోలవరం ప్రాజెక్ట్ ఏ విధంగా ప్రకృతిని నాశనం చేసిందో తలుచుకుంటే ఇదేనా మన సాటి ప్రజలకు మనం చేస్తున్న న్యాయం అని చాలా బాధగా అనిపించింది. ఇక అక్కడకు వెళ్ళి వచ్చిన శాంతి, సత్యలు ఎంత బాధపడ్డారో… పారిజాత పరిమళం లాంటి సినిమా అంటూ భవానీఫణి గారు అందించిన సమీక్ష దర్శకుని హృదయాన్ని పూర్తిగా దర్శించి షూలీని మరచిపోలేని దృశ్యంగా అందించింది. ఆ సినిమా ఎప్పుడు చూద్దామా అనిపించింది. రాచనాగు అని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి గారి భర్త గురించి మంచి పేరు పెట్టారు. కానీ రాచనాగు కాదు అతడు కాలనాగు. అలాంటివాళ్ళు ఇంకా చాలామందే ఉన్నారు. అలాంటి వాళ్ళ గురించి హెచ్చరిక ఇస్తుందీ వ్యాసం. వేములపల్లి సత్యవతిగారికి కృతజ్ఞతలు. శిలాలోలితగారి వ్యాసం వేసేటప్పుడు ఎవరి గురించి రాస్తున్నారో వారి ఫోటో కూడా ప్రచురించితే బాగుంటుంది కదా… భూమిక భూమిక మాత్రమే కాదు భూమి itself.
– డి. నటరాజ్, విశాఖపట్నం