మరీ అంత హఠాత్తుగా కాదు గానీ
చాప కింద నీరు – పన్నెండోళ్ళ వయసు
చెప్పకుండానే వస్తాయి
శరీరం పొడుగెక్కి నును పెక్కి
గాజు కుప్పెలా పారదర్శకమైన చోట
కేంద్రీకరించిన దిగుల్లా
కలుగులో చిట్టెలుక లాంటి గుబుల్లా
తలవంచి చూపుని ఆరేసిన చోట
ఆశ్చర్యార్థకంలా పుట్టి
కొమ్మ చివర పూల తొడిమలా సాగిన మెడకింద
అరిటాకు లాంటి చీలికకు అటూ యిటూ
ఘనమూ ద్రవమూ కాని మనసుకి
అచ్చమైన బహువచనం
ఓహ్!
మనసునిప్పుడు అరచేత్తో పట్టుకోవచ్చు
రెండు చిట్టి పర్వతాల్లా ఎదిగి
వెన్నెలను ప్రశ్నిస్తున్న చూపుడు వేలికున్న
గోరింట మిసమిసల్లా
మాట్లాడని మల్లెమొగ్గలు
నడిచినప్పుడు సన్నగా కంపిస్తూ
స్నానంలో స్నానిస్తూ
నిద్రలోనిద్రిస్తూ
మెలకువలో మెలాంకొలీ పూస్తూ
ఎటువంటి కళ్లకైనాయివి మెత్తలుపరుస్తాయి.
రాగద్వేషాల్లేని విరాగులకు మల్లే.
సౌందర్య జ్వరంతో తడిసి
తపనతో వొణికి –
నమస్కరించే చేతుల్ని జోడించనీకుండా
కనికట్టు చేసినట్టు
కరిగిన శిలలై
ఘనీభవించిన అలలై
తమకి తామే వశం కాక
రెండు అద్భుత ప్రపంచాలవుతాయి.
ఇష్టంలేని క్షణం
ఊహామాత్రానికే మొహం చిట్లించుకుని
యుద్ధ ఖైదీలుగా పట్టుబడినట్టు
పారిపోయి
ఆత్మహత్యించుకుని కనిపిస్తాయి.
అమ్మతనం కోసం
తలక్రిందులుగా తపస్సుచేసినప్పుడు
మాతృగర్వంతో బరువెక్కి
పూలమాలాలంకృతుల్లా కొంచెం తలవాల్చి
ప్రేమంటే నలుపా తెలుపా — అంటూ
చిక్కు ప్రశ్న లేస్తాయి.
నట్టనడి వయసులో వేసవిలో
మరుగుజ్జుతనం నీడయి పాకుతుంటే
నీకేం తెలీదు నువ్వూరుకో…’
అంటున్న స్వజనం మాటకి గతుక్కుమని
గతుక్కుమన్నట్టు కనిపించకుండా వుండేందుకు
ఏదో అంటూ వాదన పెంచుకుంటూ
కొంగుతో కళ్ళద్దాలు తుడిచినంత చప్పున
ఏది బాధా ఎందుకు లాస్యం… చెప్పలేక
పాచ్ వర్కయి నడుచుకుంటూ
‘ఎక్స్‌గ్రేషియా’ లుగా చేర్చుకున్న
కంచిపట్టుచీరల సంఖ్యా, చంద్రహారపు వరసల
అంకే
అవతల పెట్టి చూసుకుంటే
జాకెట్టు అచ్చొత్తినంత మేరా
చిక్కబడని చీకటి ఒక గీతగా
వెన్నుని చుట్టుకుంటూ వచ్చి గుండె మీద
అడుగులేస్తుంటే
దొరికిపోయిన బిక్కతనంలా యిమిడిపోయి-
ఆరుపదుల వయసులో
కాలానికి చిక్కి
రోగానికి చిక్కి
చేదెక్కిన వాస్తవాలకు చిక్కి
ఇదే మనసుని జోలెగా
పేగులు చీల్చి మెళ్ళో వేసుకున్నట్టు
పల్చటి నరాలు సాగి కనిపిస్తాయి
రసవఝరికి తెరవేస్తూ
రాజీకి, జీవరాహిత్యానికి
తాంబూలమిస్తున్నట్టు
పరచిన ఆకులమీద వక్కలు పేర్చిన పోలికతో
చెప్పలేనంత వేదనగా —
దయగా, ఓరిమిగా —