చెట్లంటే ప్రాణం – ప్రాణాధారం – సత్యవతి

హరితహారం పేరుతో మొక్కల పెంపకం, పర్యావరణ పరిరక్షణ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న తెలంగాణలో చాలా చోట్ల మొక్కలు నాటారు. లక్షల్లో, కోట్లల్లో నాటామంటూ లెక్కలు తేల్చారు. కానీ ఎన్ని చెట్లను కొట్టేశారో ఎవరూ చెప్పడం లేదు. ఈ మధ్య కళ్ళ ముందు కొట్టేసిన చెట్ల గురించి తలచుకున్నప్పుడల్లా నాకు దుఃఖమొస్తుంది. చాలా పెద్ద చెట్లను నిర్దాక్షిణ్యంగా నిముషాల్లో రంపంతో కోసేసి నేల కూల్చారు.

బాగ్‌లింగంపల్లిలో ఉండే భూమిక ఆఫీసు మండు వేసవిలో కూడా ఊటీలో ఉన్నంత చల్లగా ఉండేది. ఒకవైపు ఓవర్‌ హెడ్‌ వాటర్‌ ట్యాంక్‌, వాటర్‌ సంపూ, బోలెడన్ని చెట్లు ఉంటాయి. చింత, అశోక, తురాయి, కానుగ లాంటి చెట్లతో పచ్చగా, చల్లగా ఉంటుంది. ఇదంతా వెనక వేపు దృశ్యం. ఆఫీసు ముందు ఇంతకు ముందు పెద్ద మామిడి చెట్టు, చాలా పురాతనమైన రావిచెట్టు, బలంగా, ఏపుగా పెరిగిన అల్ల నేరేడు చెట్టు నేలమీద ఎండపడకుండా కమ్ముకుని ఉండేవి. రావి చెట్టు ప్రతి సీజన్‌లోను ఆకులు రాలుస్తూ, ఎర్రటి చిగుళ్ళతో, పసుప్పచ్చ లేత ఆకులతో, గల గల సంగీతం విన్పిస్తూ ఉండేది. వసంతం రాగానే, మామిడి చిగుర్లొచ్చి, పూత పూయగానే కోయిలలు వచ్చి చేరేవి. రోజంతా కూస్తూ ఉండేవి. ఆ రావిచెట్టంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. రంగులు మారే ఆకులు, ఆ ఆకుల సంగీతం, కోయిల పాట…

పురుగులొచ్చాయని, పుచ్చిపోయాయని, పడిపోతే ప్రమాదమని పిచ్చి పిచ్చి కారణాలు చూపెట్టి అపార్ట్‌మెంట్‌ అసోసియేషన్‌ వాళ్ళు తీర్మానించి ఒక్కొక్క చెట్టుని కొట్టుకుంటూపోయారు. నేను ఎంత వ్యతిరేకించినా అరణ్య రోదనే అయ్యింది. ఇప్పుడు ఆఫీసు ముందు ఒక్క చెట్టూ లేదు. పెద్ద మామిడి చెట్టును కొట్టేసి పెట్టిన చిన్న మామిడి మొక్క నా వైపు చూస్తూంటుంది.

ఆఫీసు వెనకున్న పెద్ద చింత చెట్టు కొమ్మల్ని మా ప్లాట్‌ పైన ఉన్న వాళ్ళు హఠాత్తుగా ఒకరోజు కొట్టేయించారు. మాకు చక్కటి నీడనిచ్చే కొమ్మ అది. వాచ్‌మెన్‌ని ఎందుకు కొట్టేసారు అని అడిగితే, ‘కొమ్మలు వాళ్ళ కిటికీ లోకి వెళ్ళిపోతున్నయంట, పొద్దున్నే లేచి చింత చెట్టు చూడకూడదంటమ్మా! అందుకే కొట్టేయించారు.!” అన్నాడు. హతవీధి! పొద్దున్నే లేచి చెట్టును చూడకూడదా? ఏం మూఢత్వం? చెట్టులేకపోతే స్వచ్ఛమైన ఆక్సిజన్‌ ఎక్కడి నుండి వస్తుంది. పువ్వులు, చిన్న చిన్న చింతకాయలు ఉన్న కొమ్మని ఏమాత్రం కనికరం లేకుండా కొట్టిపారేయించారు.

ఆఫీసు గేటుకి ఎదురుగా చాలా కాలం నుంచి పెనవేసి పెరిగిన వేపచెట్టు, రావి చెట్టు ఉండేవి. ఆ ఇంటావిడ ఆ చెట్టుకి పసుపు రాసి, కుంకుమబొట్టు పెట్టేది. చాలా చోట్ల ఇలా వేప, రావి చెట్టు కలిసిపోయి ఉండడం, పసుపురాసి, కుంకం బొట్టు పెట్టడం ఆ తర్వాత అక్కడే ఒక గుడి వెలియడం తెలిసిందే. ఇక్కడ కూడా ఓ గుడి కట్టే అవకాశం ఉంది అనుకునే దాన్ని ఆ చెట్లను చూసినపుడు. ఇటీవల ఓ ఉదయాన ఆ రెండు చెట్లని నేల కూల్చేసారు. నాకు ఏడుపొచ్చినంతపనైంది. ఎవరో కార్పోరేటర్‌ ఆ స్థలం కొన్నాడని, ఓ పెద్ద బిల్డింగ్‌ కడతాడని సమాచారం. కొన్ని రోజులు తర్వాత కొట్టేసిన చెట్టు మొదల్లోంచి చిన్న చిన్న చిగుళ్ళు వస్తే పెట్రోల్‌ పోసి కాల్చేసారు. వేళ్ళతో సహా పెకిలించేసారు. ప్రస్తుతం మూడంతస్థుల బిల్డింగ్‌ దిష్టిబొమ్మలా ఆ చెట్టు స్థానంలో నిలబడి ఉంది.

2018 సంవత్సరాంతాన నాకు అమిత దుఃఖం కలిగించిన సంఘటన కూడా చెట్లతోనే ముడిపడి ఉంది. అది గుర్తొస్తే నా కళ్ళు తడయిపోతాయి. హుస్సేన్‌ సాగర్‌ ప్రక్కనున్న లుంబిని వనాన్ని ఆనుకుని ఒక పార్కింగ్‌ ప్లేస్‌ ఉంది. ఆ స్థలాన్ని పార్కింగ్‌ చేయడానికి వీలుగా తయారు చేయడంతో పాటు, ఆ స్థలాన్ని డెవలప్‌ చేసిన వ్యక్తి ఎవరోకానీ దాన్ని అత్యంత కళాత్మకంగా తీర్చిదిద్దాడు. పున్నాగపూల చెట్లని నాటించి, వాటి చుట్టూ రచ్చబండలు కట్టించి, చక్కటి రంగులతో అలంకరించారు. ఖైరతాబాద్‌ నుండి హిమాయత్‌నగర్‌ వైపు ప్రయాణించిన ప్రతివాళ్ళు లుంబిని కార్నర్‌కి రాగానే పున్నాగపూల పరిమళాలను ఆస్వాదించకుండా వెళ్ళరు. పార్కింగ్‌ ప్లేస్‌లో ఉన్న ఆ పున్నాగ చెట్లు సీజన్‌ రాగానే విరగబూసేవి. ఆకాశంలో విరిసే ఆ పువ్వుల్ని ఆకాశమల్లెలని కూడా అంటారు. సీజన్‌లో నాలుగైదు సార్లన్నా ఆ చెట్లల్లోకి వెళ్ళడం, రచ్చబండమీద కూర్చుంటే గిరగిరా తిరుగుతూ మన మీద ఎంతో ప్రేమగా రాలే పున్నాగపూలని ఒడిసి పట్టుకోవడం, రాలిన పువ్వులేరి మాల కట్టడం… ఎంత ఇష్టమైన పనో నాకు. చాలా సార్లు ఫ్రెండ్స్‌ని తీసుకెళ్ళి ఆ వనాన్ని చూపించడం, వాళ్ళతో కలిసి రచ్చబండ మీద కూర్చుని పున్నాగ పూల సౌరభాన్ని ఆస్వాదించడం… ఇవన్నీ ప్రాణప్రదంగా ఉండేవి. పున్నాగ పూల సీజన్‌ మొదలైంది. లుంబినీ పక్కనున్న పున్నాగవనం పిలుస్తోంది. వెళ్ళాలి… వెళ్ళాలి అనుకుంటూ సంతోషంగా ఒక రోజు వెళ్ళాను. ఒక్క చెట్టు కనబడలేదు. ఆకాశంలోకి ఎదిగిన చెట్ల స్థానంలో శూన్యంగా ఉంది. అయ్యో! చెట్లేవీ… పున్నాగపూల వనం ఎక్కడ? గుండె గొంతులోకొచ్చి వేగంగా కొట్టుకుంటోంది. కళ్ళనిండా నీళ్ళు. డ్రైవింగ్‌కి కన్నీళ్ళు అడ్డం పడుతున్నాయి. చెట్ల స్థానంలో నీలంరంగు రేకులు కట్టి ఉన్నాయి. కారాపి చూద్దును కదా, భూకంపమొచ్చినప్పటి విధ్వంశంలా ఉందక్కడ. పున్నాగ చెట్లు స్థానంలో ఓ పెద్ద గొయ్యి తవ్వేసి ఉంది. పెద్ద భవనానికి పునాదులేస్తున్నట్లుగా కనబడుతోంది. పున్నాగచెట్లు, రచ్చబండలు ఆనవాలు కూడా లేవు. నాకు బిగ్గరగా ఏడవాలనిపించింది. పనుల్ని పర్యవేక్షిస్తున్న మనిషిని అడిగాను ఇక్కడ ఏం కడుతున్నారని. ‘కళ్యాణ మండపమట’. ప్రభుత్వ భూమి కాబట్టి ప్రభుత్వమే కడుతుందా? లీజ్‌కిచ్చారా? అన్యాయంగా అన్ని చెట్లను నరికేసి ఓ కాంక్రీట్‌ బిల్డింగ్‌ కట్టబోతున్నారన్న మాట. నా కళ్ళల్లో నీళ్ళను చూసి ‘ఏమైంది మేడం!’ అని అడిగాడతను. ఏమైందని చెప్పను? ఆ వనంతో నాకెన్ని మధుర స్మృతులున్నాయో అతనికెలా చెప్పను? అంతెత్తు ఎదిగిన, పూలతో నిండి ఉన్న అన్ని చెట్లను కొట్టేయడం అన్యాయమని అతనికెలా చెప్పను? కోపంగా వెనుతిరిగి వచ్చేశాను. ట్యాంక్‌బండ్‌ మీద బుద్ధుడికెదురుగా ఉన్న పున్నాగ చెట్టు కింద చాలా సేపు కూర్చుండిపోయాను.

అప్పుడు ఇటీవల పత్రికలలో చదివిన ”బలరాంపూర్‌” అటవీ గ్రామంలోని మహిళలు గుర్తొచ్చారు. ఒడిస్సాలో బలరాంపూర్‌ అనే గ్రామంలో చెట్లను కాపాడడానికి ఆ గ్రామ మహిళలు చేసిన ఉద్యమం గుర్తొచ్చింది. మూడు తరాల మహిళలు సమిష్టిగా రేయింబవళ్ళు అడవిలో గస్తీ తిరుగుతూ ఒక్క చెట్టునూ కొట్టనీయం అంటూ నినదిస్తున్న దృశ్యం కళ్ళముందు ఆవిష్కృతమైంది. కార్పొరేట్‌ మాఫియా నుండి తమ అడవిని కాపాడుకోవడానికి వంతుల వారిగా గ్రామ ప్రజలంతా గస్తీ తిరగడంతో ఆ అడవిని నరికేసి తమ బెవరేజి కంపెనీ పెట్టాలని ప్రయత్నిస్తున్న కార్పోరేట్ల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయ్‌. చిప్కో ఉద్యమం తర్వాత బలరాంపూర్‌ మహిళలు అదే స్థాయిలో ‘ఒక్క చెట్టునూ కొట్టనీయం’ అంటూ తెగేసి చెబుతున్నారు.

ఈ నగరంలో ఇన్ని చెట్లు కొట్టేస్తే ఎవరూ ఏమనలేదు. ప్రభత్వమే దగ్గరుండి లుంబినీలోని పున్నాగ వనాన్ని నరికేయించింది. అదే ప్రభుత్వం మళ్ళీ హరిత హారమంటూ మొక్కలతో బయలుదేరుతుంది. చెట్లను కొట్టేసి, మొక్కల్ని నాటడమే హరిత హారమనుకోవాలా?

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.