భూమిక ప్రారంభ సంచికను 1993లో విడుదల చేస్తూ, మేము ప్రచురించిన లక్ష్యాలకే కట్టుబడి ఈనాటివరకూ భూమికను నడుపుతున్నాం. అన్వేషి రిసెర్చి సెంటర్ ఫర్ వుమెన్ స్టడీస్ అండదండలతో ఒక సామూహిక ప్రయత్నంగా మొదలైన భూమిక ఎన్నో గండాలను, ఆటుపోట్లను ఎదుర్కొని ఈ రోజు సర్వ స్వతంత్రంగా నిలదొక్కుకుంది. తెలుగు సాహిత్యం మీద, సమాజం మీద తన ముద్రను స్పష్టంగా వెయ్యగలిగింది. స్త్రీల అంశాలను స్త్రీవాద దృష్టిికోణంతో విశ్లేషించే ఏకైక పత్రికగా భూమిక ప్రాచుర్యం పొందింది. ప్రకటించుకున్న ప్రధాన లక్ష్యాలను తూచా తప్పకుండానే అనేక ఇతర కార్యక్రమాలను చేపట్టాం. స్త్రీల అంశాలతో పాటు భిన్న సామాజిక అంశాలపట్ల మా బాధ్యతని నిర్వర్తించే దిశలో ఎన్నో ప్రత్యేక సంచికలు వెలువరించాం.
వ్యవసాయం తీవ్ర నిర్లక్ష్యానికి గురౌతున్న వైనాన్ని వ్యవసాయ ప్రత్యేక సంచికలో చర్చించాం. చేనేత విధ్వంసం గురించి ప్రత్యేక సంచికను తెచ్చే సందర్భాన్ని పురస్కరించుకుని కొయ్యలగూడెం, పోచంపల్లి గ్రామాలను సందర్శించాం. నల్లగొండలో ప్రతిపాదించిన యురేనియం ప్రాజెక్టు దుష్ఫ్రభావాల గురించి వివరించడానికి ఆయా గ్రామాలలో పర్యటించి, ఆ ప్రాంతాల ప్రజల మనోభావాలను విమరిస్తూ ప్రత్యేక సంచిక తెచ్చాం. ప్రత్యేక ఆర్ధిక మండళ్ళ ప్రభావిత ప్రాంతమైన పోలేపల్లికి వెళ్ళి, ఆ ప్రజల పోరాట కథనాలు భూమికలో ప్రచురించాం. పిల్లల సమస్యల్ని ప్రతిబింబిస్తూ పిల్లల ప్రత్యేకం, దళిత స్త్రీ నాయకత్వాన్ని ఆకాంక్షిస్తూ దళిత స్త్రీ ప్రత్యేక సంచిక, తెలంగాణ ప్రత్యేక సంచిక, స్త్రీల మానసికారోగ్యం, రచయిత్రుల ప్రత్యేకం, దశాబ్ది ప్రత్యేక సంచిక, హెచ్‌ఐవి/ఎయిడ్స్ ఇలా వివిధ అంశాలను చర్చిస్తూ, ప్రత్యేక సంచికలు వెలువరించాం. 1998లో భూమిక, అన్వేషి సంయుక్తంగా నిర్వహించిన కధా వర్క్‌షాప్ అద్భుత ఫలితాలనిచ్చింది. ఎందరో కొత్త రచయిత్రులను రూపొందించింది. అంతేకాకుండా భండారు అచ్చమా౦బ తొలి తెలుగు కథా రచయిత్రిగా వెలుగులోకి వచ్చింది కూడా ఈ కథావర్క్‌షాప్‌లోనే. చరిత్ర చీకటి కోణంలో కనుమరుగైన ఆనాటి రచయిత్రులను తెరమీదకు తెచ్చే బాధ్యతని భూమిక అద్వితీయంగా నిర్వహించిందని చెప్పడానికి భండారు అచ్చమా౦బే గొప్ప ఉదాహరణ. పురుష విమర్శకారులు ఆమెను వెనక్కు నెట్టడానికి ఎంత ప్రయత్నించినా, అచ్చమా౦బను మరింత బలంగా, దృఢంగా ముందుకు తెచ్చే ప్రయత్నాన్ని భూమిక భుజాల మీద వేసుకుంది. విజయం సాధించింది.
ఒక స్త్రీవాద పత్రికగా భూమిక రచయిత్రులందరితోను చక్కటి, సహృదయ సంబంధాలనే కలిగి వుంది. రచయిత్రులందరితో నిరంతర సంభాషణ నెెరపాల్సిన ఆవశ్యకతని గుర్తించడంవల్లనే ‘కలవడం, కలబోసుకోవడం’ కోసం గత మూడు సంవత్సరాలుగా ప్రతినెల రెండో గురువారం భూమిక రచయిత్రుల వేదిక తరఫున భూమిక ఆఫీస్‌లో అందరం కలుస్తున్నాం. ఎన్నో అంశాల మీద చర్చలు నిర్వహిస్తున్నాం. కలుసుకోవడం, కలబోసుకోడంతో పాటు పర్యటనలు చేయడం సృజనకారులకు అంత్యంతావశ్యకం కాబట్టి మూడు సంవత్సరాలుగా పెద్ద సంఖ్యలో రచయిత్రులం కొత్త కొత్త ప్రాంతాలకు వెళుతున్నాం. ఆయ ప్రాంతాల సమస్యలను అధ్యయనం చెయ్యడంతో పాటు, బాధితుల పక్షాన అక్షరసైన్యాన్ని నిలబెట్టే బాధ్యతని నెరవేరుస్తున్నాం. మొదటి పర్యటనలో భాగంగా పోలవరం ప్రాజెక్టు సృష్టించే విధ్వంసాన్ని గురించి, విలయాన్ని గురించి చర్చించడం, ముంపు ప్రాంతాలను ప్రత్యక్షంగా చూడ్డం జరిగింది. భారీ ప్రాజెక్టులు మిగిల్చే భయానక ఫలితాలను అధ్యయనం చేయడం జరిగింది. రెండో పర్యటన పులికాట్ సరస్సు, తలకోన, మామండర్ అడవుల్లోకి సాగింది.
భూమిక నిర్వహించిన మూడో పర్యటన మొత్తం వివిధ ఉద్యమ పోరాటాలు కొనసాగుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతాలకే పరిమితమైంది. గంగవరం ప్రాజెక్టు కింద నిర్వాసితులైన మత్స్యకారులతోను, పోలీసుల కౄర, అమానవీయ అకృత్యాలకు గురైన వాకపల్లి మహిళలను కలిసి వాళ్ళ బాధను పంచుకోవడం, జిందాల్‌లాంటి మెగా కంపెనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరు సల్పుతున్న కాకి దేవుడమ్మలాంటి అతి సామాన్య, ఆదివాసీ మహిళను, ఆమె అసామాన్య పోరాటాన్ని ప్రత్యక్షంగా చూడడం కోసం మాత్రమే ఈ పర్యటనను ప్లాన్ చేయడం జరిగింది. నలభైమంది వివిధ వయస్కులైన రచయిత్రులను ఒక తాటి మీదకు తెచ్చి, ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి ఈ పర్యటనను రూపొందించడం జరిగింది. మీ పక్షాన మా అక్షరాలను మొహరిస్తామని పోరుబాటలో వున్న వారికి బాస, చేసి ప్రత్యేక సంచికను వెలువరించి, ఆయా ఉద్యమాల వాస్తవ చిత్రాలను ఆవిష్కరించింది భూమిక.
ఉత్తరాంధ్ర పర్యటన సందర్భంలోనే వి. ప్రతిమ, పి. సత్యవతిగార్లు ఒక వినూత్న ఆలోచనను అందరితో పంచుకున్నారు. పుస్తకాలను ప్రేమించే వారందరం తరుచూ కలుద్దాం. అందరినీ కలుపుకుందాం అనే ప్రతిపాదనను తెచ్చారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భూమికకి సహకరించిన మల్లీశ్వరి ఈ ఆలోచనను అందిపుచ్చుకుని మనం కలుస్తున్నాం, యాత్రలు చేస్తున్నాం దీన్ని మరింత విశాలం చేసుకుంటూ ఉమ్మడి వేదికని నిర్మిద్దాం అనే ఆలోచనని అందరి ముందు పెట్టడంతో అనకాపల్లిలో మనలో మనం తొలి సమావేశం జరిగింది. అందరం కలిసి పని చెయ్యలనే ఆశయంతో చాలా మంది రచయిత్రులు అనకాపల్లిలో కలవడం జరిగింది. అనకాపల్లి సమావేశానంతర పరిణామాల గురించి నేను ప్రస్తుతం రాయబోవడం లేదు కానీ భూమిక పట్ల, భూమిక నిర్వహిస్తున్న సాహితీ యాత్రల పట్ల కొంతమంది వెళ్ళగక్కిన అసహనం నన్ను దిగ్భ్రమకు గురి చేసింది. వాకపల్లి వెళ్ళడం గురించి నిండు సభలో నన్ను నిలదీసినట్లు మాట్లాడినా నేను ఆ రోజు సమాధానం ఇవ్వకపోవడం వెనుక వున్నది ఆనాటి సమావేశ సందర్భాన్ని గౌరవించడం మాత్రమే. ఉచితానుచితాలు గుర్తించడం వల్లనే నేను ఆ రోజు మౌనం వహించాను.
అయితే భూమికను ప్రశ్నించిన వారి పక్షానే భూమిక ఎప్పుడ వుందనేది జగమెరిగిన సత్యం. అస్తిత్వ చైతన్య ఉద్యమాల యుగంలో భిన్న అస్తిత్వ చైతన్యాలతో, అస్తిత్వ ఉద్యమ నేపధ్యాలతో వున్న రచయిత్రులను ఒక వేదిక మీదకు తెచ్చి వారి వారి అనుభవాలనుండి నేర్చుకుని స్త్రీలందరి ప్రయెజనం కోసం కృషి చెయ్యలనే ఆకాంక్షను భూమిక ఏనాటినుండో కలిగి వున్నదనేది చారిత్రక సత్యం. జూపాక సుభద్ర వెంటపడి, వేధించి ”మాక్క ముక్కు పుల్ల గీన్నేపోయింది” పేరుతో కాలమ్ రాయించినా, తెలంగాణా ప్రత్యేక సంచిక తెచ్చినా ఈ అవగాహనతోనే చేసాం. భిన్న అస్తిత్వ చైతన్యాలను అర్ధం చేసుకుంటూ, నేర్చుకుంటూ ప్రజాస్వామికంగాపనిచేసే భూమికకు అగ్రవర్ణ, కోస్తాంధ్ర రంగు పులమడం తగదని నేను ఈ సందర్భంగా స్పష్టం చెయ్యదలిచాను. అలాగే మీరు ఫలానా చోటుకి ఎందుకెళ్ళారు? ఫలానా చోటుకు ఎందుకు వెళ్ళలేదు? వాకపల్లి వెళ్ళారా? అరకు అందాలు చూసారా? అని దబాయించే వారికి నాదొక్కటే ప్రశ్న. వాకపల్లి ఎందుకెళ్ళారని మమ్మల్ని ప్రశ్నించిన మీరు ఆ పని ఎందుకు చెయ్యలేకపోయరో వివరిస్తే బావుంటుంది. తస్లీమా నస్రీన్ దాడికి గురైనపుడు అంబేెద్కర్ విగ్రహం దగ్గర జరిగిన నిరసన ప్రదర్శనకి మీరెందుకు రాలేదు? వాకపల్లి స్త్రీలు కన్నీళ్ళు కారుస్యూ వివిధ ప్రభుత్వ విభాగాల గుమ్మూలెక్కి దిగుతూ అవమానపడినప్పుడు కనీసం హైదరాబాదులోనైనా మీరు వారినెందుకు కలిసి ఓదార్చలేకపోయారు? మీరు ఏ బాధితులను కలిసారో, ఏ ఆచరణకు పూనుకున్నారో ముందు స్పష్టం చెయ్యండి. ఆ తర్వాత తీరిగ్గా బండలేద్దురుగాని.
భూమిక కొన్ని స్పష్టమైన లక్ష్యాలతో ప్రారంభమై ఆ లక్ష్యాలకు కట్టుబడే వుంది. 16 సంవత్సరాలుగా నిరాటంకంగా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. భిన్న సామాజిక రంగాలకు, చెందిన స్త్రీలకు వారి వారి అనుభవాలు, అనుభూతులు భిన్నంగా వుంటాయనే స్పృహను భూమిక కలిగి వుంది. వీటిని అర్ధం చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ మొత్తం స్త్రీల విముక్తి కోసం ఐక్యంగా పనిచేయలన్న ఎరుకను భూమిక ఖచ్చితంగా కలిగి వుంది.
ఈ సందర్భంగా నా విన్నపం ఒక్కటే. భూమిక పీడిత, బాధిత స్త్రీల పక్షాన పనిచేస్తుంది.స్త్రీలందరూ ఒకటే వారి సమస్యలన్నీ ఒకటేనని భూమిక ఏనాడ అనలేదు. దళిత, ముస్లిం మైనారిటీ, బహుజన, క్రిస్టియన్ మైనారిటీ స్త్రీలు భిన్నమైన సామాజిక నేపధ్యాలతో భిన్న అస్తిత్వాల చైతన్యంతో, భిన్నమైన సమస్యలను ఎదుర్కొంటున్నారనే స్పృహతోనే భూమిక నాడూ నేడూ వుంది. భిన్న అస్తిత్వాల చైతన్యంతో పనిచేస్తున్న సోదరీమణులారా! భూమికను మీ వేదిక చేసుకోండి. సంఘర్షిస్తూనే, వాదించుకుంటూనే మన లక్ష్యం వేపు సాగుదాం. బలమైన, నిర్మాణాత్మకమైన ఆచరణను ఆవిష్కరిద్దాం. రండి. కలిసి పని చేద్దాం భుజం భుజం కలిసి
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags