వర్ణమయ భవిష్యత్‌ లేఖ – సుభాషిణి తోట

ఇంతకీ ఇప్పుడీ గుండె గొంతుక కొట్లాట దేనికంటే మీకు ప్రేమలేఖ రాద్దామని… ముందుగా నేనెవరికి లేఖ రాస్తున్నానో తెలియజేస్తూ మీ పేరు పేర్కొనటం లేఖ నియమం కదూ… అయినా ఏదీ నేనింక లేఖ మొదలెట్టందే… నా దేవులాటంతా సముద్రమంత భాషలో కొన్ని అందమైన పదాలను పట్టి మిమ్మల్ని ఎరుక చేసే సంభోదన వాటితో మొదలు పెట్టేందుకు…

శిలాలోలిత గారూ… ఎందుకో ఇవాళ భావాలు తూనీగల్లా ఝుమ్మంటున్నా… ఏదీ ఒకచోట కుదురుగా వాలటం లేదు… నేనే తోటను కదా… పువ్వులకూ కొదువలేదు అయినా రొదల తుమ్మెదల సయ్యాటే… ఇప్పుడు మిమ్మల్ని ఎలా పిలువను… మేడం అని, అమ్మా అని… ఊహు… అవేవీ ఇప్పటి నా భావోద్వేగానికి సరిపోవు. ఎలా పిలిచినా పలుకుతారు మీరు. ఆ తత్వం కలవారిని మహనీయులంటారు. మహనీయులు మనుషులకు అతీతులు. ఈ పిచ్చి జనం తెలుసుకోవటంలేదు కానీ దేవుడు కూడా వేల ఏళ్ళుగా ఏ పేరుతో పిలిచినా పలుకుతున్నాడని. నా పసి కలానికి ఎంతకూ అర్థం కాదు మీ పేరులోని ఆ విరోధాబాస… వెన్నపూసలా కరిగిపోయే కలిసిపోయే లాలిత్యమే కదా మీది. మరి మొదటనే శిల ఎలా చేరిందో…

మిమ్మల్ని చూసిన మొదటిసారే మీపై గౌరవం పుట్టింది. ఈ రెండేళ్ళలో అది పెరిగి పెద్దదయింది. పుట్టటం అంటూ జరిగాక పెరగటమే సహజం కదా… మా ఖమ్మంలో నిర్గున్‌ భయ్యా పుస్తక పరిచయ సభలో మొదటిసారి కలిశాను మిమ్మల్ని. ఎంత ప్రేమగా దగ్గరకు తీసుకున్నారు. ఎంత గొప్పగా ఆదరించారు. ఆ తరువాత ఎప్పుడు కలిసినా నన్ను చూడగానే ఒక చిరునవ్వు మీ పెదవి కొమ్మల్లో విరబూసేది. ఆ మొక్కను ఎలా నాటుకోవాలో నాకు నేర్పరూ… లేదంటే ఒక కొమ్మను నా పెదవికీ అంటు కట్టరూ ప్లీజ్‌…

చుక్క తెగిపడ్డట్టు హఠాత్తుగా ఈ భావావేశం ఏమిటని అనుకుంటున్నారా. ప్రేమ ఏ దేశంలోనైనా, ఏ భాషలోనైనా అసంకల్పితమే కదా… అందానికి అలంకారం అవసరం లేదు. మీరూ అంతే ఎంత సహజంగా ఉంటారు. ఎవరో ఆకాశం నుండి దిగివచ్చినట్టు ఎంత నిర్మలంగా ఉంటారు… వర్తమాన లేఖ పేరుతో మీరు ఇటీవల విడుదల చేసిన పుస్తకం నాలాంటి కొత్త తరానికి ఎంత మార్గదర్శకంగా

ఉందని… అది చదువుతూ చదువుతూనే ఇదిగో ఇలా మీ అక్షరాల వ్యామోహానికి గురయ్యా… చైనా మాంజా లాంటి ఆధునిక వర్తమానాల ధాటికి ఎన్నో ఏళ్ళ క్రితమే గాయపడిన తోకలేని పిట్టకు కొత్త రెక్కలతికించారు. ఎంత విషయ పరిజ్ఞానం అందించారు. ఒక్కో లేఖను చదువుతూ నేను బాల్య కాలానికి ఎన్నిసార్లు వెళ్ళొచ్చానో… నా చెవుల్లో ఇప్పటికీ పోస్ట్‌మేన్‌ కేక, అతని సైకిల్‌ బెల్లు మార్మోగుతోంది.

ప్రేమ ఒక నది. ఆ నదీ ప్రవాహంలో నీరై మీ జ్ఞాపకాలు ఉన్నాయి. వాటిని జ్ఞాపకాలని అనలేము, ఆరాధనా కుసుమాలనాలి. ఎదురు కిటికీలో ఏవేవో కదులాడుతుంటాయి. అలాంటి కొన్ని అపురూపాలను మీ డైరీలో ఎన్ని పేజీలుగా రాసుకున్నారు. మీదైన ప్రపంచంలోకి కొన్ని నక్షత్రాలను ఆహ్వానించారు. అవి మెరిసే తారలను తెలిసిన మీ ఆస్వాదనలో వెన్నెల పూలను కురిపించాయి. ఒకరా, ఇద్దరా… 52 మంది కవయిత్రుల పరిచయాల నుండి నీతో కలిసి ప్రయాణించిన తీరును వారి వృత్తి ప్రవృత్తులతో సహా క్షేమసమాచారాలను తెలుసుకుంటూ సాగిన తీరు న భూతో న భవిష్యత్‌ అనే చెప్పాలి. భూమిక వారపత్రికలో పదేళ్ళకు పైగా మనోభావం పేరుతో స్త్రీల రచనలపై మీ కాలం తెలియని రచయిత్రులు ఉంటారా? నిత్యం వారి వారి రచనల ఇష్టతను చెబుతూ సాగించిన తీరు, లబ్ద ప్రతిష్టులైన కవయిత్రుల శైలి వివరణ అసమాన్యం. వాట్సప్‌ మెసెంజర్‌ నుండి ఈ మెయిల్‌ దాకా ఆన్‌లైన్‌ పలకరింపుల నేపథ్యం కొనసాగుతున్న కాలంలో మరోసారి లేఖా రచనకు జీవం పోస్తున్న పంథా ఎన్నో ఆత్మీయ ఆలోచనలకు దారి, ఏకాంతంగా కూర్చుని గుండె తలుపులు తెరిచి జ్ఞాపకాల తలపుల్ని నెమరేస్తూ రాసే ఉత్తరంలో ఎంత కమ్మదనం, ఉత్తరం రాయాలంటే ముందుగా మనలోని శూన్యాన్ని తరిమేయాలి. చెట్టును కదిలిస్తే రాలుతున్న ఆకుల్ని ఒడిసి పడుతూ నేల దాచుకునే జ్ఞాపకాలే మీ ఉత్తరాలు.

అలాంటి 52 ఉత్తరాలను 2014 నుండి 2018 వరకు దాదాపు నాలుగు సంవత్సరాలు ఎదలోయల్లో పదిల పరుచుకునేంత హృద్యంగా తెరకెక్కించారు. అయితే 52 మంది కవయిత్రులలో గొప్పవారు, సీరియల్‌ కవులు, వర్తమానాన్ని శాసిస్తూ భవిష్యత్తుకు అడడుగులు వేయించిన వారు ఉన్నారు. వారి వారి స్వీయానుభవాల్ని మీతో పంచుకున్న ఆత్మీయ క్షణాల్ని పూసగుచ్చినట్టు రాయడం మీకే సాధ్యం అమ్మా. ఏదేమైనా ఇదొక ఆల్కెమీ అనొచ్చేమో. ఎక్కడా అలంకారాలు, అతిశయోక్తులు ఉండని శుద్ధ తెలుగును ఈ లేఖలో మనం చదవొచ్చు. ఇక లేఖల్లో నాకు బాగా నచ్చిన కొన్ని మాటలు.

1) మేఘాలు కనబడగానే నువ్వు గుర్తొస్తావ్‌

ఆ మబ్బుల రథమెక్కి నీదాకా వచ్చేద్దాం అనిపిస్తుంది, వానంటే నీకిష్టం కదా!

2) స్నేహం ఎప్పుడూ పచ్చగానే ఉండాలి గుర్తు రాగానే చిరునవ్వుల పుప్పొడులం కావాలి

3) నాకెందుకో నగరంలోని మనుషుల్ని చూస్తుంటే కరెంట్‌ స్తంభాలే గుర్తొస్తాయి

4) మీ నుంచి వచ్చే ఉత్తరం కోసం ఇలా అక్షరాల దుప్పటి కప్పుకొని కలగంటూ

5) మధ్య మధ్యలో వానచినుకుల్లా స్నేహితుల్ని కలవకపోతే జీవితంలో రంగులేముంటాయ్‌, ఇంద్రధనుస్సులేముంటాయ్‌ చెప్పు

6) నువ్వు ఉన్నావ్‌ అన్న స్పృహే నన్ను సంతోషపరుస్తుంది, నేను నిన్ను చూడలేకపోయినా. ఎండలు అగ్ని శరీరాన్ని తొడుక్కుని కూర్చున్నాయి. రోళ్ళేకాదు మనుషులు కూడా బద్ధలైపోయేటంతటి ఎండ. దేహమంతా చెమట వర్షం కురుస్తూనే ఉంది.

7) ఆ అమ్మ ఇప్పుడు లేదు కదూ మట్టి మడతల్లో కలిసిపోయింది ఇలా ఎన్నో….

ఇకపోతే ఉత్తరం ఉత్త కాయితమేనా అంటూ భూమిక సంపాదకురాలు, కవయిత్రి గారైన కొండవీటి సత్యవతి గారు ఈ వర్తమాన లేఖ గురించి చెబుతూ ‘ఉత్తరం రాయాలి అంటే తన లోపలికి తాను చూసుకోవాలి. చీకటి కోణాల మీద వెలుతురు ఫోకస్‌ చేసుకోవాలి. వేళ్ళకొసల్లోంచి వాక్యం తర్వాత వాక్యం జాలువారడం ఎంత మనోహరం’ అంటూ రాబోయే ఎవరి గురించి రాస్తుంది అని రచయితలు ఎదురుచూసేలాగా సాగుతుందన్నారు.

ఇక ప్రముఖ సాహతీవేత్త, ప్రసిద్ధ విమర్శకులు జి.లక్ష్మీ నరసయ్యగారు ఈ పుస్తకం గురించి మాట్లాడుతూ…

ఆత్మీయ కబుర్ల టోన్‌తో అరుదైన అందమైన చర్చ, పూజారి సంస్కృతి లేదు అంటూ ప్రవచనాల నీతులు లేవని ఎంత బాగా చెప్పారు. అయితే ఈ లేఖలో గతమానం సాహిత్య స్నేహితులని పలకరిస్తూ వర్తమానంలో సాగిన సంభాషణ అత్యద్భుతం అనే చెప్పాలి. స్వార్ధమో, ఆతృతో, చిన్నతనమో తెలీదు, మరోలా అనుకోకుంటే ఇప్పటి వర్తమాన కవయిత్రుల్ని కూడా కాస్త సలహాల రూపంలో, శైలిని, గమనింపును గ్రహిస్తూ రాసుంటే నాలాంటి లేత కలాలకు ఉజ్జాయింపుగా ఉండేదేమో అన్న చిన్న అనుమానాన్ని వ్యక్తపరుస్తూ I శ్రీశీఙవ జూశీవ్‌తీవ శ్రీవ్‌్‌వతీర. ఎప్పటికీ మర్చిపోని మంచి పుస్తకాన్ని, గొప్ప గొప్ప కవయిత్రుల్ని మాకు మరోసారి మీదైన రీతిలో పరిచయం చేశారని, వీలుంటే మా కోసం భవిష్యత్‌ లేఖలు మీ కలంలో నుండి జాలువారాలని కోరుకుంటూ…

వర్తమానలేఖ (లేఖా సాహిత్యం)

– పసుపులేటి రమాదేవి

లేఖలు అనేవి లేక కనుమరుగైపోయిన రోజుల్లో పాఠకులకు నూతన సంవత్సర కానుకగా 32వ హైదరాబాద్‌ బుక్‌ ఫెయిర్‌లో డిసెంబరు 21వ తేదీన వర్తమాన లేఖ అనే లేఖా సాహిత్యం పుస్తకావిష్కరణ చేశారు.

ఈ వర్తమాన లేఖ అనే లేఖా సాహిత్యం ద్వారా దాదాపు 52 మంది మహిళా రచయిత్రులను, వారు రాసిన రచనలను, వారు పొందిన అవార్డులను పాఠకులకు పరిచయం చేశారు. ఈ పుస్తకం చదువుతుంటే నిజంగా ఇంత గొప్ప మహిళా రచయిత్రులు ఉన్నారా! అనే ఆశ్చర్యం, ఆనందం కలిగింది. వారి రచనలను ఎలాగైనా సంపాదించాలనే ఆసక్తి కూడా కలిగింది.

ఈ వర్తమాన లేఖ పుస్తకంలో, శిలాలోలిత గారు తాను లేఖ రాసే రచయిత్రి మనసును అక్షరాలలో వివరించిన విధానం చదువుతుంటే ఆ రచయిత్రి మనకు పరిచయం లేకపోయినా వారి మనోచిత్రం ఊహించుకునేలా ఉంటుంది.

ఈ పుస్తకంలో మనకు పరిచయం చేసిన 52 మంది రచయిత్రుల రచనల్లోని ప్రత్యేకతలు మచ్చుకు కొన్ని. ”స్త్రీలు కుటుంబాల్లో ఎంత ముడుచుకుపోతున్నారో, లోలోపల ఎంత పెనుగులాడుతున్నారో, ఎంత సంఘర్షణకు గురవుతున్నారో, స్త్రీలకు ఊహల్లో సైతం స్వేచ్ఛ లేదనే వాస్తవాలు…”. అలాగే శిలాలోలిత గారు తన మిత్రురాలిని ఒక మీటింగ్‌లో కలిసినపుడు ఆమె తన నాలుగేళ్ళ మనవరాలి గురించి చెబుతూ స్కూల్లో కావ్యా మీ ఇంటి పేరేమిటి అని అడిగితే ‘బి’ అని చెప్పిందట, మీ నాన్నగారి ఇంటిపేరు ‘కె’ కదా అంటే నేను మా అమ్మ పొట్టలోంచే వచ్చాను కదా అందుకే అమ్మ పేరు ముందున్న ‘బి’నే నా ఇంటిపేరు అందట, నాలుగేళ్ళకే తన మనవరాలికి తెలిసిన వివరం ఇన్నాళ్ళూ ఇంతమందికి తెలియకుండా పోయిందని, పెద్దయ్యాక తనకు ఇంకా చాలా తెలివితేటలు వస్తాయంటూ ఆమె సంబరం వ్యక్తం చేశారట.

ఇలా ఎన్నో సున్నితమైన విషయాలు మనకు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ఆరోగ్యం జాగ్రత్త! మనం చేయాలనుకున్న పనులకు దేహం అవసరం కదా! అంటూ సున్నితమైన హెచ్చరికలూ ఇందులో చూడవచ్చు. ముఖ్యంగా మధ్య తరగతి స్త్రీల జీవితాలనే ఇందులో ఎక్కువగా చిత్రించారు. కుటుంబ వ్యవస్థ స్త్రీలను, పురుషులను ఎలా తయారు చేస్తుందో ఆ రోజుల్లోనే ప్రతిభావంతంగా చెప్పారు. స్త్రీలు మారాల్సిన తీరును, లోపాలను చెబుతూనే, పురుషుల పట్ల వ్యతిరేకత కాకుండా సంయమన ధోరణిలో కథలను మలిచారని… నలభై ఏళ్ళు నిండీ నిండకుండానే నూరేళ్ళ జీవితాన్ని వదిలేస్తున్న స్త్రీలను చూసి బాధపడుతుండేదానివి. అమ్మతనాన్ని, ఆలితనాన్ని మోస్తూ మోస్తూ స్త్రీలు అనారోగ్యాల పాలు పడుతున్న తీరు నిన్ను ఆవేదనకు గురిచేసేది. పౌష్టికాహార లోపంతో డెలివరీలలో చనిపోతున్న స్త్రీలను చూసినా వారికి తీరని కనీస అవసరాలను చూసినా మధన పడుతుండేదానివి అని…

అప్పటికే మీరొక మేటి రచయిత్రి. ”వటవృక్షపు నీడలో సేదతీరే చిన్నారి గడ్డిమొక్కలా” కాదు, తాను ఒక వృక్షాన్నై ఠీవిగా నడవాలని స్త్రీ కోరుకుంటుందని భావించారు అని… ఇలా ఎన్నో… ఎన్నెన్నో… విషయాలను మనం ఈ పుస్తకంలో చదవొచ్చు.

అలాగే రచయిత్రులకు రచనలు కొనసాగించాలంటూ సున్నితంగా చేసే హెచ్చరికలు, ప్రేరణలు కూడా మనం ఇందులో చదవొచ్చు. మొత్తంగా ఈ పుస్తకం చదవడం పూర్తయ్యేసరికి మనం కూడా నిత్యం పని వెసులుబాటు చేసుకుని ఏదో ఒకటి చదువుతూ, రాయడానికి ప్రయత్నించాలన్న ఆసక్తి మనలో కలుగుతుంది. కొండపల్లి కోటేశ్వరమ్మ గారికి రాసిన లేఖ చదువుతుంటే ఆమే మన కళ్ళముందు కనిపించినట్లయింది.ఈ వర్తమాన లేఖ అనే లేఖా సాహిత్యం చదివిన తర్వాత ఈ పుస్తకంపై సమీక్ష రాయాలి అనే ప్రేరణ కలిగి ఇది రాశాను. ప్రతి ఒక్కరూ, ముఖ్యంగా మహిళలందరూ తప్పక చదవాల్సిన పుస్తకం ఇది.

Share
This entry was posted in పుస్తకావిష్కరణ and tagged . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.