అబ్బూరి ఛాయాదేవి (జ.1933) తెలుగు రచయిత్రి. డిఫెన్స్ సర్వీసెస్ లైబ్రరీలోను, ఇండియన్ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్ గ్రంథాలయంలోను పనిచేసి జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం నుండి ఉప గ్రంథాలయాధికారిణిగా ఉద్యోగ విరమణ చేశారు. 2005 సంవత్సరానికి కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి పొందారు. ఆమె కథలు నిగ్రహం, వక్రోక్తితో విశిష్టమై జాన్ ఆస్టిన్‌ని గుర్తుచేస్తాయి. వనిత మాసపత్రికకు, వచన కవిత్వ పత్రిక కవితకు ఆధునిక తెలుగు కవిత్వ అనువాదానికి సంపాదకత్వం వహించారు. ఆమెకు ప్రముఖ రచయిత, సాహిత్య విమర్శకులు అబ్బూరి వరద రాజేశ్వరరావుతో వివాహమయింది.
మీ తొలి రోజులతో మొదలెడదాం…
రాజమండ్రిలో నేను బి.ఎ. చదువుతున్నప్పుడు మా నాన్నగారు నాకు పెళ్ళి చేయాలని నిర్ణయించారు. వరుడు ఒక పైలట్ ఆఫీసర్. అతనికి తల్లి లేదు. నన్ను పెళ్ళి చేసుకోవడం ఇష్టం లేకపోయినా, బహుశా తన తండ్రిని, సోదరిని ఎదిరించలేక నిశ్చితార్దం చేసుకుని కొన్ని రోజుల్లోనే తన ఒప్పందాన్ని నిలుపుకోలేకపోయాడు. పెళ్ళి ఎప్పుడు, ఏమయింది అని బంధువులు అడగడం మొదలెట్టారు. నా ఇబ్బందిని మా నాన్నగారు గ్రహించి నన్ను హైదరాబాద్‌కి పంపించారు.
హైదరాబాద్ తార్నాకలోని రీజియనల్ రీసెర్చ్ లేబొరేటరీలో సహాయ సంచాలకుడు శాస్త్రజ్ఞుడిగా పనిచేస్తున్న మా అన్నయ్య దగ్గర ఉన్నాను. ఆ తరువాత నిజాం కాలేజీలో ఎం.ఎ.లో చేరాను. రేడియో నాటకాల్లోను, ప్రసంగాల్లోను పాల్గొనడం మొదలుపెట్టాను. ఆ సమయంలోనే భాస్కరభట్ల(1) కృష్ణారావు గారితో పరిచయం ఏర్పడింది. ‘భర్తను ఎంచుకోవడం ఎలా’ అన్న అంశం మీద ఒకసారి నన్ను వారు మాట్లాడమన్నారు. ఆడపిల్లలు భర్తల్ని తెలివిగా ఎన్నుకోవాలని, వారి కట్నం కోరికల్ని మొత్తంమీద దృఢంగా తిప్పికొట్టాలని అన్నాను. ఏది ఏమైనా వివాహం ఒక సామాజిక నియమం, ఒక విధమైన దూరాలోచన అందులో ఇమిడుంటుంది, ఆడపిల్లలు అన్ని అంశాలనీ ఆలోచించాలని, గుడ్డిగా ప్రేమలో పడిపోకూడదని అన్నాను. అప్పుడు భాస్కరభట్ల అడిగారు, నువ్వు ఎప్పుడు పెళ్ళి చేసుకుంటున్నావని. నాకు ముందు ఒక మంచి మనిషి దొరకాలని అన్నాను. ఒక మంచి మనిషిని నేను తెస్తే నువ్వు చేసుకుంటావా? అని అడిగాడు. అతను కట్నం కోరకుండా ఉంటేనే అని నేను అన్నాను.
కానీ నా గుండె లోతుల్లో నేను భయపడ్డాను. మా నాన్నగారు గట్టి క్రమశిక్షణాపరులు. ఆడపిల్లలు నవ్వడాన్ని సహించేవారు కాదు. కానీ మా అన్నయ్య నన్ను నవ్వించేవాడు. మా వదినని, నన్ను నోర్లు మూసుకోకుండా నవ్వమనేవాడు. ఆ విధంగా నన్ను నవ్వించే భర్తను కోరుకునేదాన్ని. అది నేను చెప్పలేదు. కానీ నా మనస్సులో అది ఉండింది. అటువంటి వారినే వివాహం చేసుకున్నందుకు నేను అదృష్టవంతురాలిని.
నా పెళ్ళి పెద్దలు కుదిర్చింది కాదు… భాస్కరభట్ల నన్ను నా భర్తకు పరిచయం చేశారు. అది కొంచెం క్లిష్టమైన విషయం. కులం, గోత్రం ఇబ్బందులేమీ లేకపోయినా వారి కుటుంబానికి మేము ఈ విషయం తెలియచేయకూడదని మా వారు పట్టు పట్టారు. తనే వారికి ఆ విషయం చెబుతానన్నారు. అది నాకు పెద్ద తప్పుగా అనిపించింది. అనేక ప్రశ్నలు నా మదిలో మెదిలాయి. ఎందుకతను ఇలా ప్రవర్తిస్తున్నారు. ఏమయ్యుంటుంది విషయం?
అతను నా ఫోటో తీసుకుని వెళ్ళిపోయారు. ఒక నెలరోజుల వరకూ అతని దగ్గరనుండి ఏమీ తెలియకపోవడంతో, మా నాన్నగారు చాలా ఆదుర్దా పడ్డారు. ముహూర్తాలున్నాయి, శ్రావణం పోతే మళ్ళీ ఆగాలి. ఇప్పటికే ఒక మంచి సంబంధం చెడిపోయింది. ఇది మంచి సంబంధం. ఇది కూడా జారిపోతుందా మళ్ళీ.
ముహూర్తం నిశ్చయించాలనుకుని, మా పెళ్ళి విషయాలు చర్చించేందుకు నాకు కాబోయే మావగారి దగ్గరకు మా నాన్నగారు విశాఖపట్నం వెళ్ళారు. వాళ్ళు ఆశ్చర్యపోయినట్లు కనిపించారు. అదృష్టవశాత్తు మా వారు వాళ్ళ అక్కతో చెప్పారు. తానొక పిల్లను చూశానని, పెళ్ళి చేసుకుందామని నిర్ణయించుకున్నానని. వాళ్ళక్క ఆ విషయం తన తండ్రికి ఉత్తరం రాసింది – వరద(2) ఒక పిల్లను ఎన్నుకున్నాడని, పెళ్ళి చేసుకుందామనుకుంటున్నాడనీ. అయితే ఆయన కుటుంబం అటువంటి ఉత్తరం అందిందని కానీ, ఆ పరిణామం గురించి తెలిసినట్టు గాని తెలియనివ్వలేదు. అంచేత మా నాన్నగారు తను రావడంలోని ఉద్దేశాన్ని వారికి చెప్పాల్సి వచ్చింది. గోత్రాలు చూసుకోవడం జరిగిందని, అవి సరిపోయాయని వారికి హామీ ఇచ్చారు. సమస్యలేమీ లేవని తన కూతురు జాతకం బాగుందని చెప్పారు. చివరికి వరద నాన్నగారు ఒప్పుకున్నారు. అయితే వాళ్ళ కొడుకు వారితో ఏ విషయం చెప్పనందున వాళ్ళు వాగ్దానం చేయలేదు. అంచేత మా నాన్నగారు తిరిగొచ్చేశారు. కొన్నాళ్ళ తర్వాత మా నాన్నగారు ఒక ముహూర్తం నిశ్చయించి అది ఉత్తరం ద్వారా తెలియపర్చాలనుకున్నారు. అది ఒక విధంగా ఆయన అవకాశం తీసుకున్నట్లు. అయితే అది పని చేసింది.
ఈ లోగా వరద ఢిల్లీ నుండి వచ్చారు. ఆయన స్నేహితులు ఈ పెళ్ళికి ఒప్పుకోమని లేకపోతే మరెప్పుడూ పెళ్ళి కాదని ఆయన మీద ఒత్తిడి తెచ్చారు. అప్పటికి నాకు కేవలం ఇరవయ్యేళ్ళు. అతనికి అప్పటికే ముప్ఫయ్యేళ్ళు. రాయప్రోలు (రాజశేఖర్), ఇతరులు ఆయనను ఒప్పుకోమని కోరారు. ఆయన స్నేహితులు ఎంతో బలవంతం చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారితో వరద మాట్లాడారు. అతను ఎవరిని పెళ్ళి చేసుకున్నా తనకు అభ్యంతరం లేదని, తన ఆశీస్సులు అతనికి ఎప్పుడూ ఉంటాయని ఆయన అన్నారు. ఆయనకు నిస్సందేహంగా కోపం వచ్చింది. ఆ తర్వాత ఎప్పుడో అది నాకు తెలిసింది. ఆ తర్వాత ఆయన్ని బతిమాలమని వారి బావగారిని పంపించారు. ఏదయితేనేం అంతా స్థిరపడ్డాక వాళ్ళు పెళ్ళికి వచ్చారు.
వరదల్లో రాజమండ్రి మునిగిపోయినప్పుడు, ఆ వర్షాకాలంలో పెళ్ళి జరిగింది. పెళ్ళికి రెండు రోజుల ముందే మా వాళ్ళు ఇంటికి వెల్ల వేయించారు. మా పెళ్ళికి మా మావగారు ఉండాలని మా నాన్నగారు పట్టుబట్టారు. వరుని తల్లిదండ్రులు పెళ్ళిలో పాల్గొంటేనే తాను వ్యక్తిగతంగా పెళ్ళిలో పాల్గొనగలనని, నాకు డబ్బు ఇస్తానని అది నేను ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చని అన్నారు. చివరి నిమిషంలో వాళ్ళు తంతి పంపారు వాళ్ళొస్తున్నట్లు. అయితే వరదలు… నా భర్త సహోద్యోగులు వేళాకోళం చేశారు వరద పెళ్ళి పూర్తిగా వరద పాలయింది అని. మద్రాసు నుండి మా బావగారు వచ్చారు. తంతు ప్రథమ భాగంలో ఆయన పీటలమీద కూర్చున్నారు. వివాహం జరిగే చోటుకు మా మావగారు చేరుకున్నారు. పెళ్ళి అర్థరాత్రి జరిగింది. ”మేము కూడా వరద బాధితులం” అని ఆయన అన్నారు. మా అత్తగారు బాగా అలసిపోయి ఉన్నారు. కార్యక్రమం తగ్గించి పూర్తిచేయమని ఒత్తిడి చేశారు. ‘గృహప్రవేశం’ కార్యక్రమం లేదు. పైగా సమయం కూడా లేదు. పెళ్ళి పూర్తయింది. వాళ్ళు ఆ మర్నాడు వెళ్ళిపోయారు. వరద ఉండిపోయారు. మా టిక్కెట్టు వాళ్ళు వెళ్ళిన మర్నాటికి తీసుకున్నారు.
మా ఇంటిలోనే మొదటి రాత్రి జరిగింది. నేను గదిలోకి వెళ్ళినపుడు ఆయన లోపల కుర్చీలో కూర్చుని ఉన్నారు. మీరు నేపథ్యం అడిగారు కాబట్టి ఇదంతా చెప్తున్నాను. పూల అలంకరణలేమీ లేవు. మా అమ్మ నాకు కూజాతో నీళ్ళిచ్చి లోపలికి వెళ్ళి అతని కాళ్ళు పట్టు అని చెప్పింది. జ్వరంగా ఉన్నప్పుడు మా నాన్నగారికి నేను కాళ్ళు పట్టేదాన్ని. అయితే అది ఈయనకు చేయాలన్నది నేను ఊహించలేకపోయాను. అంచేత వణుకుతూ లోపలికి వెళ్ళి నీళ్ళు ఆయన పక్కన పెట్టి, ఆయన పక్కనున్న కుర్చీలో కూర్చున్నాను. నన్నడిగిన మొదటి ప్రశ్న ఇది, ‘ఎందుకు మీ నాన్న వెళ్ళి మా నాన్నను కలిశాడు?’ అని. నేను అదిరిపోయాను. మా నాన్నగారిని అంత అమర్యాదగా ఏకవచనంలో ప్రస్తావించడం, అదీ మా పెళ్ళినాటి మొదటి రాత్రే. ”ఉన్న ముహూర్తాలు గురించి ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటే బాగుంటుందనుకున్నారు. పైగా మీ దగ్గర నుండి ఏ సమాచారమూ లేదు” అన్నాను. వాళ్ళ నాన్నగారు వాళ్ళ అక్కకు ఫిర్యాదు చేస్తూ రాసిన ఉత్తరం బయటకు తీశారు. అది చదువుతుండగా నన్ను నిశితంగా పరిశీలిస్తూనే ఉన్నారు. మామూలుగానే నేను ఆందోళనలో ఉన్నాను. అతనొస్తారా, రారా? వరదలు దారుణంగా ఉన్నాయి. ఏ సమాచారమూ లేదు. మిత్రుల ఒత్తిడి వల్ల తప్ప పెళ్ళి చేసుకోవాలని లేదేమో. మేము పెళ్ళి పీటల మీద కూర్చుండగా, నేను లేచినప్పుడు నా రుమాలు కిందపడితే ఆయన దాన్ని తీసి నాకు అందించారు. అప్పుడనుకున్నాను, ఫరవాలేదు ఆయన నన్ను బాగానే ఇష్టపడుతున్నారని. ఆ తర్వాత ఆయన ఎక్కువ సేపు కోపం లేకుండా బాగానే ఉన్నా, అది నాకు ఒక పెద్ద దెబ్బ.
ఆ తరువాత బాగానే ఉంది. ఆయనకి నేను బాగా దగ్గరయ్యాక ముందుగా నేనడిగింది ”నన్నెప్పుడూ వదిలేయొద్దు” అని. అభద్రతలో ఉన్నాను. ఎంతగానో భయపడ్డాను. రాజమండ్రి మధ్య తరగతి కుటుంబాల్లో చాలా వరకు కట్నాల కోసం వాళ్ళ భార్యల్ని వదిలేసిన భర్తల కథలు ఎన్నో ఉన్నాయి. మాస్టరు పట్టా ఉండి, ప్రగతి శీల భావాలు పెంచుకుంటున్నా, సంపాదించుకోగలిగే సత్తా ఉన్నా, భయపడి అభద్రతకు లోనయ్యాను.
”ఛ! నిన్ను వదలను. అది జరగదు. పెళ్ళి చేసుకున్నది వదిలేయడానికా?” అన్నారు. ఏదయితేనేం ఆయన నన్నిక్కడకు తీసుకొచ్చారు. ఆయన దగ్గర నుండి నాకు మంచి ఆదరణ దొరికింది.
నేను వారి స్నేహితుల్ని కలిసాను. వారు బాగా తాగేవారు. మొదటిసారి మేము పార్టీకి వెళ్ళినప్పుడు, ఆయన తాగుడుకు దూరంగా ఉన్నారు. బహుశా నా పట్ల మర్యాదతో ఆలోచనలతో ఉండటాన్నో ఏమో, ఇంటికి తిరిగొస్తున్నప్పుడు ఆయనతో నేను చెప్పాను, మా అన్నయ్య ఒకసారి మమ్మల్ని ఒక పార్టీకి తీసుకువెళ్ళాడని, అక్కడ వివిధ రకాల పానీయాలు సరఫరా చేశారని, కొందరు ఆడవాళ్ళు సైతం వాటిని తీసుకున్నారనీ. అలా అన్నానో లేదో ఆయన కారును వెనక్కి తిప్పి ఒక షాంపేన్ సీసా తెచ్చుకుని పండగ చేసుకున్నారు. అంతే ఆ తరువాత మద్రాసు నుంచి ఆయన మిత్రులు శ్రీ శ్రీ(3), ఆరుద్ర(4), పార్టీలు ఇష్టపడే ఇక్కడి మిత్రుల్ని కలుసుకుని తరచూ బార్‌లకు వెళ్ళేవారు. దీనిమీద మా మధ్య తరచు వివాదాలు జరిగేవి. నేను నీకు చవకబారున దొరకడం వల్ల నువ్విలా మాట్లాడుతున్నావు అన్నారు. అంటే మా నాన్న పెళ్ళిలో కట్నం ఏదీ ఇవ్వలేదని. దానికి నేను తిప్పికొట్టాను. ”అవును, నేను మిమ్మల్ని ‘చవకబార్’లోనే సంపాదించాను” అని. నేను తరచు ఇంటిలో గంటల తరబడి ఆయన కోసం ఎదురు చూసేదాన్ని. వాళ్ళు బార్‌లకు వెళ్ళిపోయాక, ఒక్కోమారు ఏ అర్థరాత్రో, అపరాత్రో తిరిగి వచ్చేవారు. నేను ఒకరోజు ఆయనతో, ”నన్ను ఇంటిలో ఒక్కర్తినీ వదిలి అర్థరాత్రి వరకూ అక్కడే గడిపే బదులు, ఇంటిలోనే కలుసుకోవచ్చు కదా” అన్నాను. ఇంటిలో అలా కలుసుకోవడాన్ని నేను ప్రోత్సహించాను. బహుశా దాన్ని తతిమా వారి భార్యలు సాధారణంగా ఒప్పుకోరు.
వారితో పాటు ఉంటూ నేను వారికి పకోడీలు, చిరుతిండ్లు అందించేదాన్ని. ”నువ్విక్కడ కూర్చోవద్దు లోపలికి వెళ్ళి కూర్చో” అని ఆయన ఎప్పుడూ అనలేదు. వాళ్ళతోపాటు నన్నూ కూర్చోనిచ్చేవారు. నాకూ చాలా విషయాలు తెలిసేవి. నేర్చుకునేందుకు, జ్ఞానం పెంచుకునేందుకు అలా పాల్గొనడం నాకు ఒక మంచి అనుభవం. వారితో ఉంటూ నేను ఆనందం పొందాను. ఎప్పుడూ వారి తాగుడుకు అడ్డు చెప్పలేదు. అది నాకు అసమ్మతిగానూ అనిపించలేదు.
బీరు నేను ఎప్పుడూ ఇష్టపడలేదు. రుచి గానీ, వాసన గానీ… కుంకుడు కాయ రసం లాంటి రుచి. తరువాత
వాళ్ళు నాకు జింలెట్ ఇచ్చారు తమాషాకి. అది బాగుంటుంది గానీ, అదైనా నేను ఇష్టపడలేకపోయాను. నేను ఫ్రాన్స్ వెళ్ళినపుడు చాలా రకాల మద్యాల్ని రుచి చూశాను. జింలెట్ తాగాను. నిషేధం సమస్య లేదు. నేనేదో అభాసు పాలవుతానని వేరుగానూ కూర్చోలేదు. మా ఇంటిలో పొగతాగే అలవాటు ఎవరికీ లేకపోయినా, వారి పొగ తాగడానికీ నేను నెమ్మదిగా అలవాటు పడ్డాను.
సాహిత్యం పట్ల నాకు ఎప్పుడూ ఆసక్తి ఉండేది. అందుకని 1954లో ఆయన నన్ను ‘కవిత’ అనే తెలుగు కవిత్వ పత్రికకు సంపాదకురాలిని చేశారు. మేధాపరంగా నన్ను ప్రోత్సహించేవారు. సంపాదకురాలిగా నా బాధ్యత కూడా నాకు అప్పుడు తెలియదు.
‘మోడర్న్ తెలుగు పొయట్రీ’ సంకలనానికి నన్ను సంపాదకురాలిని చేశారు. అన్ని పనులూ ఆయన చూసుకునేవారు. నేను అచ్చుతప్పుల్ని చూసుకునేదాన్ని. క్రమేపీ అన్నింటినీ నేను చూసుకోగలిగాను. నాకు నేనుగా నేర్చుకుంటూ నా నైపుణ్యాన్ని పెంచుకునేందుకు పాటుపడ్డాను. ఆంగ్ల కథల్ని తెలుగులో అనువాదం చేయమని కూడా ఆయన నన్ను ప్రోత్సహించారు. నేను మొదటిసారి ఆయన దగ్గర బోలెడంత ఆంగ్ల సాహిత్యం చూశాను. పుస్తకాలు చదవడంలోనే నేను సమయం గడిపేదాన్ని. అయినా నాకు సంతృప్తి ఉండేది కాదు. ఆయనెప్పుడూ ఆయన మిత్రులతో గడిపేవారు. నాకు నచ్చేది కాదు. ఆయనతో గడపాలని నాకూ ఉండేది. తరాల అంతరం ఒకటి
ఉండేది. నేను ఆయనకి అనుభవంలేని ఆడపిల్లని ఎప్పుడూ, ఆయనకేమో అంతా తెలుసు అనుకునేవారు. అయినా ఆయన శాసించే భర్త కాదు. ఆయన జీతం తీసుకువచ్చి నాకు ఇచ్చేసేవారు. మొదటిసారి నూరు రూపాయల నోటుని వాడాను. అంతవరకూ చిల్లర మాత్రమే నేను వాడేదాన్ని. అదొక పెద్ద బాధ్యతగా నేను భావించాను. ఆయన నన్ను నమ్మినట్టేనా అనుకున్నాను. నన్ను ఆయన చాలా జాగ్రత్తపరురాలివి అన్నారు.
బిర్లా బ్రదర్స్‌లో ఆయన ప్రజా సంబంధాల అధికారిగా పనిచేస్తున్నప్పుడు ఉదయం కాఫీ తాగి వెళ్ళి మధ్యాహ్నం భోజనానికి ఆలస్యంగా వచ్చేవారు. కాఫీ లేదా టీ నాకు అంతగా అలవాటు లేదు. అయినా ఆయన కోసం ఎదురు చూస్తుండేదాన్ని. పస్తులుండడానికి నేను పెళ్ళి చేసుకున్నానా అని ఒక్కోమారు అనుకునేదాన్ని. ఆయనకంటే ముందు భోజనం చేయడం మర్యాద కాదు.
జీవితం అలా గడిచిపోతున్నా ఇంకా ఒక విధంగా శూన్యంగా అనిపించేది. పుస్తకాలు అనువాదం చేస్తుండేదాన్ని. ఇంకేవో పనులు. అయినా బంధువులు అడిగేవారు ఇంకా పిల్లలు లేరేమి అని. అది నన్ను ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా చూసుకోవడానికి నన్ను నేను మేధోపరమైన పనుల్లో పెట్టుకునేదాన్ని. రచయిత్రులు ఉన్నవ విజయలక్ష్మి, తురగా జానకీరాణి, నాయని కృష్ణకుమారి గార్లు పరిచయమయ్యారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్ గారిని కలిశాను. బాల్యం నుండీ మా అమ్మ, అక్కల వల్ల నాకు అర్థమవుతున్నా, స్త్రీల సమస్యల మీద ఆలోచించడానికి నాకు అది దోహదపడింది. ఇప్పుడది మరొక కథ…
నేను ఆయన్ను ఎప్పుడూ విసిగించేదాన్ని. నాకేమీ తోచనప్పుడు బయటకు వెళ్ళే బదులు ఇంటిలోనే ఉండిపోయి నాతో గడపొచ్చు కదా అని ఆయన్ని బతిమాలేదాన్ని. ఆయన నన్ను సినిమాలకు తీసుకువెళ్ళాలని కోరుకునేదాన్ని. ఆయన సినిమాలను ఏవగించుకునేవారు. నేను మరెవ్వరితోనూ వెళ్ళేదాన్ని కాదు. అందువల్ల ఆ విషయంలో ఘర్షణ ఉండేది. విసుగుదల నుండి తప్పించుకునేందుకు ఉద్యోగం చేయమన్నారు. చదువు చెప్పాలన్న ఆలోచన నాకు అంత సౌకర్యంగా కనిపించలేదు. నా కంఠం సంగతి నాకు తెలుసు. విద్యార్థులు నన్ను వెక్కిరిస్తారు. నా ఉపన్యాసాల్లో నేను మరచిపోవచ్చు. నేనొక ఇంటర్వ్యూకి వెళ్ళాను. కానీ దానికోసం సిద్ధం కాకుండా హాజరయ్యాను.
మా అత్తగారింట్లో ఉండి నేను గ్రంథాలయ శాస్త్రం చదువుకోవచ్చని మా వారు నాకు సలహా ఇచ్చారు. మా మామగారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గ్రంథాలయ శాస్త్ర శాఖాధిపతి. ఈ నిర్ణయానికి వచ్చే ముందు మా మామగారితో ఆయన సంప్రదించారు. కానీ వారెవరూ ఈ సంగతిని మా అత్తగారికి ముందుగా తెలియనివ్వలేదు. ఆడవాళ్ళకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటారు కదా. నేను అక్కడకు వెళ్ళాను. అక్కడ నేను ఉండడం ఆమెకు అసౌకర్యంగా ఉండేది. మా మామగారు నాతో ఎప్పుడు మాట్లాడినా ఆమెకు నచ్చేది కాదు. ఆయనతో నేను మాట్లాడకుండా ఎలా? ఆ సంక్షోభంలో పడి నాకు ఇక్కడ చదవాలని లేదని నా భర్తకు ఉత్తరం రాశాను. ఇంటి దగ్గర కొంత పని ఉంది, వెంటనే వచ్చేసేయ్ అని ఆయన జవాబిచ్చారు. నా భర్త సహాయకారి. కానీ చదువు కొనసాగించమని తాను అన్నా నాకు అంతగా ఇష్టం లేదని, ఆయన మా నాన్నగారికి తెలియజేశారనుకుంటాను. స్త్రీలు చదువుకోవడానికి మా నాన్నగారు అనుకూలం. ”ఎక్కడ దొరుకుతారు నీకు అలా చదువుకోమనే భర్త, ఆయనతో నువ్వు సహకరించనందుకు నేను సిగ్గుపడుతున్నాను” అన్నారు. మా నాన్నగారి భయంతో నేను మళ్ళీ చదువుకునేందుకు వెళ్ళాను. మా మామగారు నన్ను మళ్ళీ చేర్చుకోగలిగారు. అదే తరగతిలో చేరాను నేను.
మా అత్తగారు మంచి వ్యక్తి. మా అమ్మలా ఛాందసురాలు కాకుండా పూర్తిగా ఆధునికురాలు. కానీ పరీక్షల సమయంలో ఇంటినుండి నిరసనతో కూతురి దగ్గరకు వెళ్ళిపోయారు. అందువల్ల వాటన్నింటినీ భరించాల్సొచ్చింది.
మా వారు బిర్లాస్ నుండి రాజీనామా చేసి ఢిల్లీ చేరారు అక్కడేదో పని చూసుకోవచ్చని. హెచ్.సి.హెడా అప్పుడు పార్లమెంట్ సభ్యులు. వారి భార్య జ్ఞాన్ కుమారి ‘మహిళావరణం’లో ఉన్నారు. దాదాపు మూడు నెలలు వారితో కలిసి ఉన్నాము. మా వారికి ఢిల్లీలో చాలా మంది మిత్రులు, ఎక్కువగా పాత్రికేయులు, రాజకీయ వేత్తలు ఉన్నారు. అప్పుడే ఆయన ఆధునిక భారతీయ కవిత్వం (ఆంగ్లానువాదాలు) సంకలనంగా తీసుకువచ్చారు. మా వారు దాన్ని జవహర్‌లాల్ నెహ్రు గారికి బహుకరించారు. మా వారు ఆధునికి తెలుగు కవిత్వం (ఆంగ్లానువాదాల) సంకలనాన్ని జవహర్‌లాల్ నెహ్రు గారికి నన్ను స్వయంగా ఇమ్మన్నారు. కానీ అందుకు బదులుగా సంకోచంతో నేను ఇందిరాగాంధీ గారికిచ్చాను, నెహ్రు గారికి అందజేయమని.
మేమిద్దరం ఒకే రోజు ఉద్యోగంలో చేరాము. ఆయన ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్‌లో సంపాదకుడిగా చేరారు. నేను యునైటెడ్ సర్వీసెస్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (రక్షణ దళాల వారి సంస్థ)లో చేరాను. నాకు ఉద్యోగం పూర్తిగా నచ్చింది కానీ అందులో స్త్రీలెవరూ లేరు. ఇంటిలో నాకు తోడ్పడే భర్త ఉన్నారు. వంటలో నాకు ఆయన సహాయం ఉండేది కాదు, కానీ తిండి విషయంలో వంకలు పెట్టేవారు కాదు. మేము వేర్వేరు చోట్ల దిగినా, ఇద్దరం కలిసి చాలా రోజులపాటు ఒకే బస్సులో వెళ్ళేవాళ్ళం. ఒకరోజు మేము బస్సు కోసం ఎదురుచూస్తున్నపుడు మా సహోద్యోగి నాకు లిఫ్ట్ ఇస్తానన్నారు. మేము ఆయన్ని దాటిపోతున్నప్పుడు ఆయన ఇంకా బస్సు కోసం నిరీక్షిస్తూనే ఉన్నారు. అప్పుడు నాకు జ్ఞానోదయం అయింది ఆయన అనుమానపడొచ్చేమోనని. ఆ ఆలోచన నన్ను లోలోపల పీడించింది. చివరికి నా స్నేహితురాలు, సహ ఉద్యోగిని శ్రీమతి ముఖర్జీతో ఆ విషయం పంచుకున్నాను. ఆమె నన్ను దాని గురించి మరచిపొమ్మంది. ”ఆయన మిమ్మల్ని చూస్తే మాత్రం ఏమిటి?” అంది. అది నాకు కొంత ధైర్యాన్నిచ్చింది. అయినా నేను ఇంకా ఉద్రిక్తతలోనే ఉన్నాను.
కొన్ని సాయంత్రాలు కొంతమంది మిత్రులకు మా ఇంటి దగ్గర ఆతిధ్యమిచ్చేవాళ్ళు. ఇంటికొచ్చినవారికి నేను భోజనం తయారుచేసి ఉండేదాన్ని. కొన్నిసార్లు పని నుంచి వచ్చాక కూడా వండాల్సి వచ్చేది కొన్ని ప్రత్యేకమైన వంటలు. అప్పట్లో నగరంలో బార్లు ఉన్నాయని నేను అనుకోను. అందువల్ల వాళ్ళంతా మా ఇంటి దగ్గర చేరేవాళ్ళు తాగడానికి. అనేకసార్లు పని నుండి వచ్చి పొయ్యిమీద కుక్కర్ పెట్టి ఆయన్ను చూసుకోమని చెప్పి నేను కరోల్‌బాగ్‌కు కూరగాయల కోసం పరిగెత్తేదాన్ని. ఇంటి పనుల్లో ఆయన నాకు కొంత సాయపడేవారు. మాకు పిల్లలు కలగనందుకు ఆయన ఎప్పుడూ అసంతృప్తి వ్యక్తం చేయలేదు. ఒకసారి మా వాళ్ళు ఇక్కడ నన్ను ఒక డాక్టర్ దగ్గరకు తీసుకువెళ్ళారు. ఒక చిన్న ఆపరేషన్‌తో దాన్ని సరిచేయొచ్చన్నారు డాక్టర్లు. నాకు ఆపరేషన్ చేయించుకోవాలని లేదు. పిల్లల్ని ఎవరు చూస్తారు? అదొక సమస్య. మేము పెద్దవాళ్ళతో ఉండడం లేదు. మా అత్తగారు చాలా కానుపులు, గర్భస్రావాలు చూశారు కాబట్టి ఆమెకూ ఆసక్తి లేదు. దాంతోపాటు ఇంకా స్థిరపడవలసిన తన సంతానంతోనే ఆమెకు తీరిక లేదు.
హైదరాబాద్‌లో మా పొరుగింటిలో బొమ్మలు తయారుచేయగల ఒక ముదలియారు అమ్మాయి
ఉండేది. కేవలం అసక్తితో బొమ్మలు చేయడం నేర్చుకున్నాను. బొమ్మలు చేయడం గమనిస్తూ ఎలా చేయడమో నేర్చుకుంటూ నేను చాలా సమయం గడిపేదాన్ని. ఢిల్లీలో బొమ్మల ప్రదర్శనశాల ఉండేది. నాకు దొరికిన ఖాళీ సమయంలో బొమ్మలు చేయడం నేర్చుకుంటూనో, కథలు వగైరాలు రాసుకుంటూనో నా నైపుణ్యాల్ని పెంచుకునేదాన్ని. కానీ నాకు ఒక లక్ష్యమంటూ లేకపోయింది. నేను ఎక్కువగా రాయలేదు. మా వారి శైలిని నేను ఎప్పుడూ అనుకరించలేదు. నాకు ప్రత్యేకంగా ఉండాలనీ లేదు. ఆయన ముఖ్యంగా ఒక కవి. బొమ్మల తయారీ చాలా సమయం తీసుకునేది. నాకు సంతోషాన్నిచ్చే ఏ పనిలోనైనా నన్ను నేను పెట్టుకునేదాన్ని.
నా ఒంటరితనాన్ని పోగొట్టుకునేందుకు కొన్నాళ్ళకు నేను జిడ్డు కృష్ణమూర్తి గ్రంథాలవైపు మళ్ళాను. 1955లో మా నాన్నగారు కృష్ణమూర్తి తత్వాన్ని నాకు పరిచయం చేశారు. నా పుట్టినరోజుకి నాకు వారి (ది ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడం) పుస్తకం బహుకరించారు. మా అన్నయ్య దగ్గర వారి (కామెంటరీస్ ఆన్ లివింగ్) మూడు సంకలనాలున్నాయి. కృష్ణమూర్తి పుస్తకాల గురించి తను మాట్లాడడం విని, నాకు వాటిని చదవాలనుందని చెప్పగా అన్నయ్య నాకు పుస్తకాలిచ్చాడు. నిరంకుశత్వం పట్ల నేను ఎప్పుడూ స్పందించేదాన్ని. ఈ పుస్తకాలు చదివాక జీవితంలో ఏకాంత భావన నాకు అర్థమయింది. తతిమావి నేను అర్థం చేసుకోలేని లోతులు. అందువల్ల నేను వాటిని చాలాకాలం వరకూ మరీ గంభీరంగా తీసుకోలేదు (కామెంటరీస్ ఆన్ లివింగ్) పుస్తకాలు చదివేదాకా. ఈ ఒంటరితనం బాల్యం నుండీ నాకు అలవాటయినదే. మా నాన్నగారి ఆఫీసు మేడమీద ఉండేది. మేము చదువుకునే గది దానికి మరోవైపు ఉండేది. ఆయన నన్ను అక్కడ కూర్చుని చదువుకోమనేవారు. నేను మా అమ్మ చుట్టూ ఉండటాన్ని ఆయన ఒప్పుకునేవారు కాదు. నాకు ఆయన చదువు చెప్పించారు కాబట్టి నేను మగపిల్లాడిలా పెరగాలని కోరుకునేవారు. మా అక్కాచెల్లెళ్ళలా కాకుండా నాకు చదువు చెప్పించారు. నేను పెరిగింది పిల్లాడిలానూ కాదు, పిల్లలానూ కాదు. నేను ఒక్కర్తినే ఉండేదాన్ని. ఒంటరితనానికి అలవాటు పడ్డాను. వాటిని నేను కోల్పోలేదు, పెళ్ళి తర్వాత కూడా అదే. ఆయన పనికి వెళ్ళిపోతే నేను ఒక్కర్తినే ఉండేదాన్ని. ఏదో ఒక పనిలో నన్ను నేను తీరిక లేకుండా చేసుకునేదాన్ని.