అలరాస పుట్టిళ్ళు – శ్రీమతి ఎన్‌.కళ్యాణసుందరీ జగన్నాథ్‌

అమ్మవారి గుడి పాడుపడి ఉంది, తల వాకిళ్ళు దుమ్ము, సాలీళ్ళు.

మునసబుగారి లోగిలి అరుగులు విరిగి, రాళ్ళు బయటపడ్డాయి. అరుగుమీద స్తంభంలోనుంచీ కూడా రాళ్ళు ఊడిపడినాయి. లోగిలి సింహద్వారం వద్ద మెట్లు గచ్చుపోయి, రాళ్ళు పెల్లగిలిన చోట్లల్లో రావిమొక్కలు చిన్న గడ్డిపరకల్లా మొల్చుకొచ్చినయి. మేడమీద వేసిన కిటికీలకి సాలీడు పట్టింది. భవంతి గోడలన్నీ నల్లబలడిపోయి, అక్కడక్కడా పెచ్చులు రాల్తూ, బీటలు కూడా పడ్డాయి. లోగిలి పెరట్లో ఒక నూతి చుట్టూ తప్ప అంతా నిలువెత్తు గడ్డి పెరిగి ఉంది. నుయ్యి ఒకవైపు కూలింది. ఖాళీ ధాన్యపు గాదులన్నీ పందికొక్కుల కన్నాలు.

లోగిలికి ప్రక్కగా, వీథికటుప్రక్కనున్న పెద్ద దొడ్డిలో గడ్డి వాములు ఉన్నచోట వరిగడ్డి కుళ్ళి మోకాటి లోతున పడి

ఉంది. సగం విరిగిన చావిడిలో, ఒక మూలన నులక మంచాలూ, విరిగిన గోనె మడత మంచాలు మేటగా పడి ఉన్నాయి. మరోవైపున తుప్పు పట్టిన నాగటికర్రులూ, కొడవళ్ళూ, గొడ్డళ్ళూ, విరిగిన నాగలి కొయ్యలూ, చీకిపోతున్న గోనెలు, పలుపులూ యేటిగా పడి

ఉన్నాయి. కట్టు కొయ్యలన్నీ ఖాళీ పై కప్పుమీద పెంకులు లేచిపోయినయి. చాలాచోట్ల పెద్ద గాలి వానకి విరిగిన కొబ్బరి చెట్లు, బాదం చెట్టూ పడినవి పడినట్టే ఎండిపోయినయి. సగం విరిగిన కమ్మ రేగు చెట్లు రెండూ విరిగినంతవరకూ తల్లి చెట్టునుంచీ వ్రేలాడుతూ, అలాగే ఎండిపోయినయి. కుంకుడు, బూరగచెట్ల కింద పండాకులు మోకాళ్ళ ఎత్తున రాలి ఉన్నాయి. చుట్టూ ఉమ్మెత్త, జిల్లేడి చెట్ల మయం – గడ్డిలో.

పున్నయ్య చెరువు పామంచాలు విరిగి చెరువులోకి ఒదిగి ఉన్నాయి. వాట్లల్లో కొన్ని పెద్ద రాళ్ళు మాత్రం కొంచెం దూరంగా పడేసి ఊరు వాళ్ళు బట్టలు ఉతుక్కుంటున్నారు. పొలంలో ఉన్న పున్నయ్య, చిన్నాయమ్మగారి సమాధుల సున్నం నల్లబడిపోయింది. చుట్టూ గడ్డి మొలిచి సమాధుల్ని కప్పుతోంది. సమాధుల మీద రాళ్ళు రెండు మూడు చోట్ల ఊడి వచ్చేసినయి.

తాడిచెట్లమీద కాకులు గుంపులు గుంపులుగా కూచుని ‘కావు కావు’మని కూస్తున్నాయి. లోగిలి వెనకవైపు నుంచీ తుమ్మచెట్ల మీదుగా సూర్యుడు అస్తమిస్తున్నాడు. ఆ సాయంత్రపు ఎర్రటి ఆకాశం ముందు నల్లగా నిటారుగా మొండి తాడిచెట్టు ఒకటి నించుని ఉంది. దానికీ, తామర గుంటకీ మధ్య ఉన్న మట్టి దారిలో నుంచి రిక్షా ఒకటి వస్తోంది. తామర గుంట అంతా నాచుతో నిండి ఉంది. చుట్టూ బురద పాములు వరసగా తలలు మాత్రమే నీళ్ళలో నించీ బయటికి పెట్టి గాలి పీల్చుకుంటున్నాయి.

ఆ రిక్షా లోగిలి సింహద్వారం దగ్గర ఆగింది. దానిలోనుంచీ ఒక వృద్ధాప్యం సమీపిస్తున్న ఆవిడ దిగింది చేతిలో ఒక సంచి పట్టుకుని. లోపలినుంచీ అడుగుల చప్పుడు ఖాళీ భవంతిలో ప్రతిధ్వనించింది. ఈవిడకంటే మరి కాస్త పెద్ద వయస్సు గల మరో ఆవిడ లోపలినుంచీ వచ్చింది. ఎండలో వెలిసి, వానల్లో తడిసిన ముఖం, ఈ వేళ ఆ ముఖం దుఃఖంగా కూడా ఉంది. ”వచ్చేశారు గదా, అక్కమ్మ గారూ! మీరు అందుకోలేరేవో అనుకున్నానండి” అంది అక్కమ్మ పమిట చెంగు ముడి విప్పి చిల్లర తీసి రిక్షావాడి కిస్తుంటే. క్రింద పెట్టి

ఉన్న సంచీ పట్టుకుని చంద్రమ్మ ముందూ, అక్కమ్మ వెనక ఆ శిథిల సోపానాలు ఎక్కి ఆ నిశ్శబ్దాలలోకి వెళ్ళారు. వీథి అరుగుమీద నిశ్శబ్దంగా పడుకుని ఉన్న మేకపిల్ల బే బే అని అరచి, ప్రక్కనుంచీ దూకి పారిపోయింది, ఈ మాత్రం అలజడికే.

లోపలకెళ్తుంటే, లోపల గుమ్మంలోనుంచీ వ్రేళ్ళాడుతున్న సాలీడు అక్కమ్మ ముఖానికి చుట్టుకొంది. ”ఇల్లంతా తుడిశానమ్మా. ఇంకా బూజు ఇక్కడ ఉండిపోయిందన్నమాట. ఈ పెద్ద గవిడి కూడా నేను వచ్చాక తెరిశానండి, నాలుగు రోజులే అయింది. ఆరూ, ఈరూ రావాలిగందా ఇక ఇప్పుడు అని తెలిసి తెరిసేశాను” అంది చంద్రమ్మ, అక్కమ్మ సాలీడు బూజు తుడుచుకుంటుంటే. ఎత్తయిన స్తంభాల మధ్య చంద్రమ్మ గొంతు ‘బొంయ్‌ బొంయ్‌’ మని మారుమ్రోగింది. ముందర మండువాలో గచ్చు ఊడిపోయిన చోటా, బీటలు వారిన చోటా గడ్డి మొలిచింది. మండువా వసారా అంచులలోంచీ రావి మొక్కలూ, మర్రి మొక్కలూ మొల్చుకొచ్చినయి. మండువాలో అడ్డంగా ఒక తొండ ప్రాక్కుంటూ వెళ్ళిపోయింది. ”ఏమన్నా ధారకం దిగుతూందా?” అంది అక్కమ్మ నడుస్తూనే విచారంగా, నిమ్మళంగా. ”కొంచెం గంజి” అంది చంద్రమ్మ. ”ఈ పాటికి వాళ్ళందరికీ ఉత్తరాలు అందే ఉండాలి. వచ్చే సమయం అయింది” అంది అక్కమ్మ రెండో మండువా దాటుతూ. ఆ మండువా వెనక వసారాలో నులక మంచంమీద ఒక వృద్ధుడు పడుకొని ఉన్నాడు. పైన మెడవరకూ బూర్నిసు కప్పి ఉంది. నేల అంతా అక్కడక్కడ గోతులు పడి ఉంది. మంచానికి కొంచెం దూరంలో ప్రక్క వసారాలో పాతదై, తుప్పుపట్టి ఊడిపోతున్న ఒక చిలక పంజరం వ్రేళ్ళాడుతోంది. అక్కమ్మ మంచం దగ్గర కొంచెం వంగి ”అన్నా!” అని నెమ్మదిగా పిలిచింది. వృద్ధుడు పలకలే. ”ఒక అరగంట నుంచీ నెమ్మదిగా ఉండారమ్మ, మూలుగుడూ అదీ లేదు” అంది చంద్రమ్మ.

లోపలి గదిలో నుంచి సుబ్బారాయుడు భార్య వచ్చింది అడుగులు పట్టి వేసుకుంటూ. ”డాక్టరు ఏమన్నాడు వదినా?” అంది అక్కమ్మ. ”వచ్చావా అమ్మా. కాళ్ళు కడుక్కున్నావా? ఎవ్వరేమంటారు? ఏం లాభం లేదంట. పేరంటాలయ్య కొడుకు అన్నాడు” అంది. ”తెల్ల వైద్యం తెలిసిన వారిని పిలవకపోయావా?” అంది అక్కమ్మ. ”సరే! మందూ వద్దు, మాకూ వద్దు. డాక్టరు అసలే వద్దని ఎంత పట్టుబట్టారో చంద్రాయి నడుగు అసలే పట్టుదల మనిషాయె” అంది సుబ్బారాయుడి భార్య. ”అసలు ఆయన బ్రతుకులో మందెప్పుడైనా తిన్నారేంటండి?” అంది చంద్రమ్మ. అంతలో లోపలి గదుల్లో నుంచి ఒక చూరు గబ్బిలాయి గదికడ్డంగా ఎగురుతూ వచ్చి రోగి మంచమూ, ఆడవాళ్ళనీ దాటి, ఇవతల గదుల్లోకి వెళ్ళిపోయింది శబ్దం లేకుండా. క్రింద పడి ఉన్న విసనకర్ర అందుకుని కాస్సేపు రోగికి విసిరింది అక్కమ్మ నించుని. ”నేను వంట చేస్తాను. నువ్వు కాస్సేపు గాలికి బైట కూచో వీథి అరుగుమీద. లోపల మరీ ఒంటరిగా

ఉంటుంది” అంది సుబ్బారాయుడు భార్య. ”ఎందుకొదినా, నేను చేస్తానులే. నువ్వన్న దగ్గర కూచో” అంది అక్కమ్మ. ”రేపణ్ణించీ ఎట్లాగా చాకిరీ తప్పదు గదమ్మా నీకు” అంది ఆమె. ”ఇప్పుడెట్టాగా నిద్రోతుండారు గందా అయ్య. మీరూ అల్సిపోయారు గిందా కాళ్ళు కడుక్కోండి, బయట కూకుందాం” అంది చంద్రమ్మ.

బయట గోడనానుకుని అరుగు మీద కూచుంది అక్కమ్మ. చంద్రమ్మ స్తంభాన్ని ఆనుకుని కూచుంది. దూరంగా ఎక్కడనుంచో ఆవు ‘అంబా’ అని అరిచింది. ”ఎసువంటి మారాజు! ఎంత మెత్తని గుండెకాయ! ఏ కథలే” అంది చంద్రమ్మ తలవంచుకుని. ”ఒకప్పుడూ మా ఇంటి మడిసి” అని తల ఎత్తుతూ చెప్పసాగింది ”నన్ను బాదాడు. ఒక్క పరుగుచ్చుకుని ఇక్కడకొచ్చి పడ్డా. ఈ మారాజు కూసుని

ఉండాడు. నాకింకేం తోసలే. ఆయన రెండు పాదాలు పట్టుకున్నా. మా ఇంటోడు నా యనకాల్నే వచ్చేశాడు బడితుచ్చుకుని. ఈ బాబు లేసి ఒక్కటిచ్చుకున్నాడు శంపమీద. ఈ మడిసి ఇంకంతే! రొండు సేతులూ మొకంమీద అదిమి పట్టుకున్నాడు. కళ్ళలో నీళ్ళు తిరిగినయి అతగాడికి. నా కడుపాగలే, మల్లా కాళ్ళుచ్చుకున్న ‘బాబయ్య బాబయ్య కొట్టబోకుండి ఒదిలెయ్యుండి’ అని ఏడిశా. ఆయన నా మాట ఇన్నాడో లేదో గాని జేబులో సెయ్యెట్టి, సేతికొచ్చిన రూపాయిలిచ్చేశారు మావోడి దోసిల్లో”. మావోడు అన్నాడు గిందా ”నేను ఉత్తినే కొట్టానాండి అయ్యగారూ, నేను గొడ్డల్లే కట్టపడి ఇంటికొచ్చేతలికి ఇది కూడు ఒండకుండా ఆ కన్నిగాడితో మాట్టాడతా కూకుంది. ఆడేంటేంటో గట్టిగా సెప్పా… ఇది గంటే పడీ పడీ నవ్వా” అన్నాడు. అయ్యగారి కళ్ళు సింతనుప్పులయినయి. ‘ఈసారి కన్నిగాడితో మాట్లాడితే, దీన్ని ఒక్క ఏటున నరికెయ్యరా’ అన్నారు మా మడిసితో. ఆయన ముఖం సూత్తే అంత బయ్యం ఏసింది నాకు… ఆ బయ్యం ఇప్పుడికీ వదలలే నాకు. మా నీతిమంతుడండి ఆయన. కోపం ఉంటే ఉండాదిగాని, అంతా కనికరం. ఆయన ఇచ్చిన రూపాయలు పెట్టుకుని కడుపారా, ఇందు చేసుకు తిన్నాం. మావోళ్ళు శానామంది ఇంకా నిలకడ లేకుండా కుప్పలూ గట్రా నలుపుకు తింటా, దొంగతనాలే గిందా! ఇంత కులవుత్తే గిందా! ఈ మారాజు మమ్ముల్ని పిల్సి పున్నయ్య సెరువు మీద కావిలిగా పెట్టి ఇల్లూ, వాకిలీ ఇచ్చే. మా రాజుకి పువ్వుల ఇమానం వత్తాది ఎల్లేటప్పుడు. ఆ సెరువు కూడా ఈరి తాతగారు తొవ్వించిందేనంటండి. ఆ తాతగారియేనంటగా ఆ సమాధులు” అంది. కాస్సేపు అంతా నిశ్శబ్దం.

ఎదురుగా తామర గుంట గట్టుమీద నుంచీ కప్పలు బెకబెకమని అరుస్తున్నాయి. చుట్టూ కీచురాళ్ళు కూస్తున్నాయి. కనుచీకటి పడుతోంది. ”ఈ జబ్బు ఫలానా అని తేల్చిన వైద్యులు లేరు గదా, ఇన్నేళ్ళన్నూ!” అంది అక్కమ్మ. ”అసలే వైద్యులతో పలకరిచ్చారు ఆయన? అసలు ఒకళ్ళతో మాట్లాడారా, ఇన్నేళ్ళూ? ఏదో గట్టి కాయం గనక ఇట్టా గెంటుకొచ్చారు గానుండీ!” అంది చంద్రమ్మ. అక్కమ్మకి ఈ లోగిలిలో తాను గడిపిన బాల్యం జ్ఞాపకాలన్నీ మనసులోకొస్తున్నాయి. ”ఈ ఇంటి సిరిసంపద లేమయిపోయినయ్యో చంద్రా! రోజులెట్లా మారిపోయినయ్యో” అంది అక్కమ్మ నిమ్మళంగా. ”ఎందుకు సెపుతారమ్మా ఆ సత్తవతమ్మ గారి పెళ్ళి అయిందీ లచ్చిమి తొలిగిందీ. ఒకేల యేమన్నా శాతమా, గిట్టనోళ్ళు యామన్నా, సేసారా అనిపిత్తాది నాకు” అంది చంద్రమ్మ.

సత్యవతి పేరు ఎత్తేటప్పటికి అక్కమ్మ మనస్సు బరువెక్కింది. సత్యవతీ, అక్కమ్మా కలిసి పెరిగారు. దూరపు బంధువులు. చిన్న బ్రతుకు బ్రతకడంవల్ల అక్కమ్మ తండ్రి వీరయ్య, సుబ్బారాయుడు తండ్రి మునసబుగారిని ఆశ్రయించి లోగిట్లోనే ఉండిపోయాడు సకుటుంబంగా. తల్లిలేని సత్యవతికి పాలిచ్చింది అక్కమ్మ తల్లి. బ్రతికి ఉన్నన్నాళ్ళూ లోగిలి సువ్వారాలన్నీ ఆవిడే నిర్వహించింది. అక్కమ్మకీ, సత్యవతికీ బలీయమైన స్నేహం, ఇద్దరికీ మరుగులు లేవు. ఇద్దరూ ప్రాణ స్నేహితురాళ్ళు కూడాను.

చంద్రమ్మ లాంతరు వెలిగించుకు రావడానికి లోపలికెళ్ళింది. అక్కమ్మ మనసులో జ్ఞాపకాలు కదిలినయి బాధతో. సుమారు నలభై ఏండ్ల క్రితం జరిగిన గాధ అదంతా. సుబ్బారాయుడు తరుణప్రాయంలో అది. నెల పొడిచింది. రాత్రి రెండు జాములయింది. ప్రపంచం పగటి వేసవి తాపం అంతా మరచి నిద్రపోతోంది.

ఎప్పట్లాగా లేచి చేతిలో హరికేను లాంతరు పట్టుకుని గొడ్ల చావిడి అంతా కలియచూచి, ధాన్యపు కొట్లు తాళాలు లాగి చూచి, వాకిట్లో ధాన్యం గరిసెల చుట్టూ తిరిగి వచ్చి, చెప్పులు వదిలి మండువాలో మంచం మీద పండుకోబోతున్నాడు సుబ్బారాయుడు. ముందరి వాకిట్లో ధాన్యం పాతర మీద వరిగడ్డి మీద చాపలు పరిచి పండుకున్న చింతాలూ, నల్లిగాడూ పెట్టే గుర్రు తప్ప అంతా నిశ్శబ్దం. ఒక్కసారి గాలి గట్టిగా విసిరింది. ఇంటి ముందర తామర గుంట నుంచీ పెద్ద గుమ్మానికి కట్టి ఉన్న కొంచెంగా ఎండిన మామిడాకుల తోరణాలు ఆ చిరుగాలికి ‘గలగల’మన్నయి. ఎక్కడో చిన్న అడుగుల చప్పుడైంది. పండుకోబోయే సుబ్బారాయుడు తిరిగి లేచి కూచున్నాడు, మరి కాస్త ఆలకించాడు. అవును అడుగులే! అడుగులు ముందరి వాకిట్లోకి వస్తున్నాయి. ధాన్యం పాతర వద్దకే లాగుంది. గరిసెల సుమారున ఆగినట్టుగ ఉన్నాయి. ఊళ్ళో దొంగల ముఠాలు తిరుగుతున్నట్టు వినికిడి. సుబ్బారాయుడు బస్తాలమీద వెండి పొన్నుకర్ర చేత పట్టుకుని తెరిచి ఉన్న తలుపులోంచి బయటకొచ్చాడు. గరిసె దగ్గర ఎవ్వరూ లేరు.

ఒక్కసారి గొంతు సవరించుకుని ”ఎవ్వరదీ” అన్నాడు దృఢంగా. ఎవ్వరూ పలకలే. మళ్ళీ పిలిచాడు. అంతా నిశ్శబ్దం. కానీ గరిసెల అవతల ప్రక్కగా, గాలికి బట్ట రెపరెప కొట్టుకుంది. సుబ్బారాయుడు ధైర్యం చేసుకుని గరిసెల అవతల ప్రక్కగా వెళ్ళాడు ”ఎవ్వరది?”. వాడిన పువ్వుల వాసన కొట్టింది. ఆ ప్రక్క వేపచెట్టు నీడ పడుతోంది. ఆ నీడలో మసక వెన్నెలలో ఒక స్త్రీ రెండు చేతులతోనూ ముఖం అంతా కప్పుకొని ఉంది. ఈ సారి ”ఎవరు నీవు” అని గర్జించాడు. బదులు లేదు, కానీ ఆ అరుపుకి ఇంటికి దూరంగా మొండి తాడిచెట్టుకి రెండు పలుపులతో కట్టేసిన కారుదున్న ఒకటి తలకాయ క్రిందకు చాపి హు!హు! అని అరిచి ముందరి కాలుతో కోపంగా నేలను వెనక్కి త్రవ్వింది, నాలుగైదు సార్లు. బండెడు దుమ్ము లేచింది. పలుపు తెంచుకోడానికి ప్రయత్నించింది. సుబ్బారాయుడు అక్కడే ఆగాడు… ఒక్క క్షణం. ఆ స్త్రీని పరకాయించి చూచాడు. ఆవిడ తల్లో వాడిన ఎర్ర బంతి పువ్వు, బొగడ చెండూ ఆ మసక వెన్నెలలో కొంచెం నల్లగా కనిపించాయి. ఇంకా దగ్గరగా వచ్చాడు సుబ్బారాయుడు. అనేక తలంపులు ఒక్కసారిగా వచ్చాయి.

”సత్యవతీ!” అన్నాడు.

”అన్నా! నేనే” సత్యవతి దీనస్వరం వినేటప్పటికి సుబ్బారాయుడికి, మనస్సు కరిగిపోయింది. వెంటనే భయం కూడా కలిగింది. ”కూడా వచ్చిందెవరు?” అన్నాడు. సత్యవతి మాట్లాడలేదు. ఇంత అర్థరాత్రి సత్యవతి ఎందుకొచ్చింది? ఎల్లా వచ్చింది? ఏమాపద కలిగిందో? ఏమాపద కలుగుతుంది?

పెండ్లి అయ్యి రెండు వారాలే గదా అయింది. పందిరైనా విప్పలేదే! ఎంత ఆపద అయితే మాత్రం అర్థరాత్రి పూట, ఆడకూతురు ఇల్లు విడిచి నడిచి రావడమా… ఇంత దూరం! అందులోనూ అత్తవారిల్లు విడిచి పుట్టింటికి. ఏమి అఘాయిత్యం! భూమి పుట్టినప్పటినుంచీ ఈ ఇంట్లో ఆడవాళ్ళు ఇట్లా చేశారా? అట్లాని ప్రపంచంలో ఎవ్వరైనా విన్నారా? రేపు ప్రొద్దున్న నలుగురిలో తల ఎత్తుకోవడం ఎలాగ! సుబ్బారాయుడు కోపం ఆపుకుని ”లోపలికి రా” అన్నాడు. అన్నా చెల్లెలూ ఎదురు పడి మాట్లాడుకోవడం అరుదు. అందులోనూ అతను పెద్దవాడైన తర్వాత అసలు ఆ మాటకొస్తే, పెద్దన్న గారితో అతని ఆరుగురు తమ్ములూ బదులు మాట్లాడరు. పిలవకుండా ఎదురుగా రారు. అతను చావిట్లో ఉన్నంతసేపూ ఆడపిల్లల గొంతులు బయట ఆ ప్రాంతాల్లో వినిపించవు. పైగా పెద్దబ్బాయంటే తండ్రి మునసబు గారికే, అదొక మోస్తరు.

సత్యవతి ఆడవాళ్ళంతా పడుకున్న రెండో మండువాలోకి వెళ్ళింది. మండువాలో తూర్పున వసారాలో సత్యవతి గదిముందు వ్రేలాడగట్టిన పంజరంలోనించీ చిలుక సత్యవతిని చూడంగానే పాట మొదలెట్టింది, కీచు గొంతుతో…

”వచ్చేవు పోయేవు ఓ రామ చిలుకా

అలరాస పుట్టిళ్ళులా వార్తలేమి?

పట్టు చీరలు కొన్నారు పణతి మీ యన్నలు

వనిత మీ యన్నలూ వచ్చుచున్నారు”.

నడిరేయి ఈ సందడికి పండుకున్న వదినెలు లేచారు. ”ఇదేమి ఆగడమమ్మా! ఎప్పుడూ ఎరగం ఈ విచిత్రం. పేరూ, ప్రతిష్టలూ మన్ను గలిశాయి” అన్నారు. ”నలుగురు నోళ్ళల్లో వేస్తావుంది నాయనా ఈ ఇంటిని. మిగతా ఆడపిల్లలలకి పెళ్ళిళ్ళు ఎట్లా అవుతయి ఇక?” అంటూ సత్యవతి మారుతల్లి ప్రక్కమీద లేచి కూచుని విసనకర్ర చేత్తో అందుకుంటూ. ఈ మాటలకి మారుటి చెల్లెళ్ళు నలుగురూ లేచారు, ఆవిలిస్తూ, విరుచుకుంటూను. సవితి తల్లి చావిట్లో పెద్ద మంచంమీద పండుకున్న మునసబుగారి చెవిలో అప్పటికప్పుడు వెళ్ళి ఊదేసింది. ఆయన ప్రక్కగానే మడత మంచంమీద పండుకున్న వీరయ్యా లేచాడు దిగ్గున ప్రక్కన

ఉన్న తువ్వాలుతో మెడ చెమట తుడుచుకుంటూ. పై మేడమీద పండుకున్న మునసబుగారి కొడుకులందరికీ కూడా తెలిసింది. ఆ రాత్రి మునసబుగారి ఇంట్లో ఎవ్వరూ నిద్రపోలేదు.

అక్కమ్మ వచ్చింది సత్యవతి గదిలోకి. అక్కమ్మని చూచి కళ్ళు తుడుచుకుంది సత్యవతి. అక్కమ్మ తలుపు జారగిలవేసి దగ్గరగా వచ్చి కూర్చుంది. ”బయటదారులన్నీ దొంగలు తిరుగుతున్నారంట ఎట్టా రాగలిగేవు సత్యవతీ?” అంది. ”ఇవిగో అందెలూ, కడియాలూ దారాలతో కట్టాను మోగకుండా. మిగతా నగలన్నీ తీసేసి వాళ్ళింట్లోనే పారేశాను” అంది సత్యవతి తలవంచుకుని. కొంచెంసేపు ఇద్దరూ మౌనం. ”ఏమయిందీ?” అడిగింది అక్కమ్మ. సత్యవతి ఇంకా తలవంచుకుంది. ”నిన్న సాయంత్రం నన్ను బలవంతంగా ముస్తాబు చేశారు. పడకింటి వైపు తొంగి చూడనైనా చూడకుండా నేను పారిపోయి వచ్చేశాను”. అక్కమ్మ తన పవిట కొంగుతో సత్యవతి కళ్ళు అద్దింది, ”ఏటికి ఎదురీదడం కష్టం సత్యవతీ” అంటూ.

మర్నాడు మధ్యాహ్నం వేళకల్లా అత్తవారి పాలేరు వచ్చాడు. చింతాలు సవ్వారి బండి కట్టాడు. వీరయ్య, అక్కమ్మా, సత్యవతి వెంట బయలుదేరారు అత్తవారి ఇంట్లో దిగబెట్టడానికి. ”అసలు ఆడదానికి ఇష్టమూ, అయిష్టమూ ఏంటి?” అంది సవతి తల్లి. ”పరువు ప్రతిష్టలు కొంపకీడ్చకు తల్లీ” అన్నారు మునసబుగారు నిమ్మళంగా దగ్గుతూ. ”తిరిగి వచ్చావా, గడపకడ్డంగా నరికేస్తాను” అన్నాడు కోపంగా సుబ్బారాయుడు.

బండిలో ఎవ్వరూ పైకి మాట్లాడలేదు. తన కష్టాలన్నీ మనసులో తలపోసుకుంది సత్యవతి. ఒక వారం దినాలకి ముందు ఇట్లాగే చడీ చప్పుడూ లేకుండా అత్తవారి ఇంట్లోనుంచీ చీకటి కడ్డం పడ్డది. ఎక్కడా మనుష్య సంచారం లేదు. పండిన చేల పక్కనుంచీ బళ్ళ దారిని నడిచింది. కొంతదూరం వచ్చేసరికి వెన్నెల వచ్చింది. ఎంత దూరం చూచినా వెన్నెల వెలుగులో అనంతంగా పొలాలు తప్ప మానవుడు కనిపించలే. పొలాల్లో ఎక్కడో ఒక నక్క అరుస్తూ, పరిగెట్టింది. తన కాళ్ళ అడుగుల చప్పుడు తనకే పెద్దగా వినిపిస్తోంది. ఆఖరికి గోనలేరు దగ్గరికి వచ్చింది… అడ్డదారిన. వేసవిలో నీరు ఎండి నీళ్ళు నడుము వరకే వస్తాయి. ఏరు ప్రశాంతంగా ప్రవహిస్తోంది. అలలమీద చంద్రుడు మెరుస్తున్నాడు, కానీ వెంటనే భయం వేసింది. నీళ్ళలో కాలు పెట్టబుద్ది కాలేదు ఒంటరిగా. తన చిన్నతనపు భయం ఇంకా ఉండిపోయింది. ఈ గోనలేట్లోనే చాలా భయపడింది ఒకసారి బాల్యంలో. మూడు రోజులు జ్వరం కూడా వచ్చింది అప్పుడు. ఒకనాడు రోహిణి కార్తె ఎండలకి, భూమి మాడి మాడి ఉంది. ఆనాడు మృగశిర కార్తె వచ్చిన క్రొత్త, కాలువలు వదిలే రోజులు. ఎవ్వరూ చూడకుండా అక్కమ్మా, తనూ ఆ ఏట్లో దిగారు ఒడ్డున ఆడుకోవడానికి. ఇంకా దిగువన ప్రక్క ఊరి పిల్లలు తడి ఇసుక ముద్దలు మీద జల్లుకుంటూ ఆడుకుంటున్నారు. కాలువకి ఎగువనించీ క్రొత్త నీళ్ళు వస్తున్నాయి. వీళ్ళెవరూ దాన్ని చూడలేదు. నీళ్ళు చిక్కగా, ఎర్రగా, బురదతో, నురగలతో పొర్లుకుంటూ వస్తున్నాయి. వీళ్ళని దాటుకుంటూ పోతున్నాయి. పిల్లలు కాస్త ఇంకా ఒడ్డుకి తప్పుకున్నారు. చెట్ల మొద్దులూ, విరిగిన పచ్చి చెట్ల కొమ్మలూ అన్నీ నీళ్ళలో కొట్టుకొస్తున్నాయి. ఒడ్డుకి తప్పుకోబోతున్న సత్యవతికి నీళ్ళలో ఒక ముళ్ళ కంప గీచుకుపోయింది. ఆ గాయాలు తడుముకుని, తల పైకెత్తేలోపుగా నీళ్ళలో ఒక ఆడమనిషి చెయ్యి కనబడింది గాజులతో సహా. ఆ చేతి ప్రక్కనే నల్లటి జుట్టూ, నీళ్ళమీద సగం మునిగీ, సగం తేలీ చేతితో సహా ప్రవాహ వేగంలో ఏటి మధ్యనుంచీ క్షణంలో కళ్ళముందు నుంచీ వెళ్ళిపోయింది. ఆ శవం, ప్రవాహ వేగం ఇప్పుడు గుర్తుకు వచ్చి ముచ్చెమటలు పోశాయి. కాళ్ళు శక్తిహీనమై మడతలు బడ్డాయి. ఒక నిమిషానికి ధైర్యం తెచ్చుకుని కాళ్ళు నిలద్రొక్కుకుని వచ్చిన దారినే వెనక్కి తిరిగింది. వెనక్కి తిరిగి చూడకుండా గబగబా నడిచింది. అత్తగారు అప్పుడే లేచి పెరట్లోకి వెళ్ళి వస్తోందనుకుని ”ఒంటరిగా ఎందుకు లేచి వెళ్ళా”వంది.

ఈ ఆలోచనలూ, భయాలతో అత్తవారిల్లు సమీపిస్తోంది బండికీ, బండిలోని సత్యవతికీ.

ఇక్కడ పాలేరులో బండి వెళ్తున్న దారే చూస్తూ నిలబడ్డాడు సుబ్బారాయుడు. బండి పది బారలు పోయాక వెనక్కి తిరిగాడు. లోగిలివైపు అరుగుమీద కూర్చుని అరుగు క్రింద ఉన్న పెంపుడు లేళ్ళయిన గౌరీ, రాజాలకు లేత గడ్డి మేపుతున్నాడు. లోపలి నుంచీ కొండలయ్య వచ్చాడు. అమ్మవారి కొలువుల ఖర్చుల వివరాలకి, ఉత్సవాలకీ, ప్రభలకీ అయ్యే రొక్కం విషయం అంతా మాట్లాడి, ఇనపపెట్టె తాళం తీసుకుని లోపలికి వెళ్ళాడు. కొండలయ్య మునసబు గారికి దూరపు మేనల్లుడు, ఆశ్రితుడు కూడాను. మునసబుగారి ఈ వ్యవహారాలన్నీ చూచే బాధ్యత ఈ మధ్యనే సుబ్బారాముడి భుజాలపై పడింది. మునసబుగారి వయసు క్రుంగిన తర్వాత ఈ నిర్వహణ అంతా చెంగల్వరాయుడు మోశాడు. అతని పేరు జ్ఞాపకం రాగానే కొంచెం కళ్ళెర్రనయ్యాయి. ఏమి అభిమానం! ”వెళ్ళేటప్పుడు డబ్బిస్తే పుచ్చుకోలే! వద్దంట!” ఇంకా ఇంట్లోనే ఉంటే ఇంకా ముదురును వ్యవహారం. ఎందుకైనా మంచిది పంపించెయ్యడం! ఇంకా నయం ఇంత గల ఇంటికి ఎంత అప్రతిష్ట. బయట ఎక్కడైనా ఏమన్నా మాట పుట్టుకొచ్చిందంటే… ఇక చావాల్సిందే!

చేతిలో గడ్డి అయిపోయింది. అరుగు దూకి చావిట్లోకి వెళ్ళి కొయ్య పడక కుర్చీలో కూచుని లంక పొగాకు చుట్ట చుట్టుకుంటున్నాడు… కొంచెం మనస్సు నెమ్మదిగా. గుమ్మం ముందరనుంచీ గవిడి పోతుల్ని బీడుకి తీసుకెళుతున్నాడు నల్లిగాడు. సుబ్బారాయుడు ”ఒరేయ్‌ నల్లిగా… నెమళ్ళకి మేత పెట్టావుట్రా?” అని అరిచాడు. అతని గొంతు వినగానే, జతలో ఒక కారుదున్న హు! హు! అని కొమ్ములు పైకి పెట్టి, తల నేలకి వంచి, ముందర కాళ్ళతో వెనక్కి నేల దువ్వడం ఆరంభించింది పలుపులు తెంచుకోవడానికి ప్రయత్నిస్తూ. మిగతా పాలేళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి పలుపులు బలంగా లాగి తీసుకుపోయారు మేతకి. నల్లిగాడు ఒక్కడివల్ల కాలేదు దున్నపోతుని ఆపడం. అతను ఉన్నంత కాలమూ, అతను ఒక్కడూ ఆ దున్నను అదుపులో పెట్టగలిగేవాడే. ఇప్పుడు నలుగురు కావలసి వచ్చారు. తిరిగి చెంగల్వరాయుడే గుర్తుకొచ్చాడు సుబ్బారాయుడికి. మనిషి వీళ్లందరికంటే ఏమంత బలాఢ్యుడేమీ కాదు కానీ అదేమి మాయో ‘దా దా’ అంటూ అతను దగ్గరికెళ్ళేసరికల్లా ఆ పాపిష్టి దున్న తల పైకెత్తి కాళ్ళు దువ్వడం ఆపేసి పసిపిల్ల చూచినట్టు చూచేది.

సుబ్బారాయుడు లేచి, గొడ్ల చావిడిలో ఉన్న పెద్ద దొడ్లోకి వెళ్ళాడు. దొడ్లో వరిగడ్డి మేటుల్లో గడ్డి మీదేసుకుని ఆటలాడుకుంటున్న పాలేళ్ళ పిల్లలందరూ ఎక్కడ వాళ్ళక్కడ మీద ఉన్న వరిగడ్డి కదలనీయకుండా గప్‌చుప్‌గా ఉండిపోయారు. సుబ్బారాయుడు చేతులు వెనక్కు కట్టుకుని తలవంచుకుని ఆలోచనగా, నిమ్మళంగా అడుగులు వేస్తూ ఇంకా దొడ్డి లోపలికి వెళ్ళాడు. పందెపు కోడిపుంజులకి తవుడు కలిపి పెడుతున్న చిన్న పాలేళ్ళు లేచి నిల్చున్నారు. కానీ సుబ్బారాయుడు అక్కడ కూడా ఆగకుండా ఇంకా వెళ్ళాడు. చిన్న చావిట్లో ఏడు సంవత్సరాలు చెంగల్వరాయుడు పండుకున్న మడత మంచం జారవేసి ఉంది. చావిట్లో ఒక ప్రక్క కప్పుకంటుకుంటూ పేర్చిన తుమ్మ మొద్దులు, సరుకు మొద్దులు ఉన్నాయి, సువ్వారాలకి. పెద్ద గొడ్ల చావిట్లో ఆరు లేగలు మూతులకి చిక్కాలు కట్టుకొని పండుకొని

ఉన్నాయి. నాలుగు ముసలి ఎద్దులు కట్టు కొయ్యల వద్ద పండుకుని నిమ్మళంగా నెమరు వేస్తున్నాయి… లేవలేక రోజులు లెక్కబెట్టుకుంటున్నట్లుగా. పెద్ద ఎద్దు వీపుమీద జోరీగని చేత్తో కొట్టేశాడు. ఎద్దు తృప్తిగా ఎత్తలేక ఎత్తలేక తల పైకెత్తి చూచింది. ఆ కట్టు కొయ్యల దగ్గరినించీ, పావురాయి గూళ్ళ దగ్గిరకెళ్ళి పావురాళ్ళను బయటకు తీసి ఒక్కొక్కటే ఎగురవేశాడు. పావురాలు కాళ్ళ అందెల రవళితో ”గలగల” మంటూ ఆకాశంలోకి గుంపుగా ఎగిరి మొగ్గలేస్తున్నాయి. సుబ్బారాయుడు ఒక తుమ్మ మొద్దు మీద కాళ్ళు దగ్గరగా పెట్టుకుని కూర్చున్నాడు తృప్తిగా చుట్ట పీలుస్తూ. పాలేరు ఒకడు బుట్టెడు పెసలు పావురాల మేతకోసం తెచ్చి అతని కాళ్ళ దగ్గర పెట్టి వెళ్ళిపోయాడు. ”ఛ ఛ పేరూ, ప్రతిష్ట! ఈ సారి తిరిగి రానియ్యి చెబుతా!” అన్నాడు తనలో తానే పళ్ళు బిగించి, కనుబొమలు చిట్లించి.

… … …

అక్కమ్మ మనసులో ఇంకా ఈ గాథ నడుస్తూనే ఉంది. పైకి మాత్రం ఏమీ మాట్లాడడం లేదు. చంద్రమ్మ కూడా మాట్లాడకుండా కూచునే ఉంది. ఇద్దరి మధ్యా లాంతరు వెలుగుతోంది. దూరాన కుక్కలు మొరిగాయి. తామర గుంటలో కప్పలు ఇంకా పెద్దగా అరుస్తున్నాయి. ఇంకో రిక్షా వచ్చి ఆగింది గుమ్మం ముందు. సుబ్బారాయుడి మూడో తమ్ముడూ, అతని భార్య, మనుమడూ వచ్చారు. వాళ్ళని తీసుకుని లాంతరు చూపిస్తూ అక్కమ్మ, చంద్రమ్మా లోపలికి వెళ్ళారు.

”అన్నా, అన్నా ఇదిగో చూడు. కళ్ళు తెరువు. చిన్నన్న వచ్చాడు” అంది అక్కమ్మ సుబ్బారాయుడు నుదురుమీద చెయ్యివేస్తూ. ”ఎవరు నువ్వు? సత్యవతా? ఆ!” అంటూ కళ్ళు కొంచెం తెరిచి చూచి ”నీవా అక్కమ్మా వచ్చావా?” అన్నాడు. ”ఆ వచ్చానన్నా”. ”సత్యవతి ఏదీ? ఇంకా రాలే” కొంచెం ఆయాసంగా అడిగాడు. అక్కమ్మ కళ్ళు తుడుచుకుంటూ ఒక చాప పరిచింది, వచ్చిన వదినగారిని కూచోమంటూ. చంద్రమ్మ గోడకి ఆనించి ఉన్న బెంచీమీద దుమ్ము దులిపి చిన్నన్నగార్ని, మనవడ్ని కూచోబెట్టింది.

మళ్ళీ బయటకు వస్తుంటే మండువా వసారాలో తగిలించి ఉన్న పాత చిలక పంజరం అక్కమ్మ తలకి తగిలింది. చిలుక లేదు. పంజరం మాత్రమే ఉంది. ఆ చిలుకమీద చెంగల్వరాయుడు జ్ఞాపకం వచ్చాడు తిరిగి వచ్చి బయట అరుగు మీద కూర్చుని ఉన్న అక్కమ్మకి. పంజరం చూడకపోయినా జ్ఞాపకం రాక తప్పదు. అతను పుట్టిందెక్కడ? వచ్చిందెక్కడికి? ఈ లోగిలి సిరి సంపదలతో, అతని బ్రతుకు పెనవేసుకుపోయింది. విధి నిర్ణయాలు, భగవల్లీలలు, ఎంత విచిత్రం! ”ఆ చెంగయ్య ఎక్కడున్నాడో పాపం! సత్తవతమ్మ గారిని తల్చుకుంటే ఆయన మతి కొత్తారండి. ఆయనా మా దొడ్డ మడిశండి. ఊరంతా అట్టుడికినట్టూ ఉడికింది గందా!” అంది చంద్రమ్మ సగం పైకి వినబడుతూ తనలో తానే. ఎదురుగా స్తంభాన్ని ఆనుకొని కూచుని తల గోడకి జేరవేసి కూచున్న అక్కమ్మకి మరికొన్ని గడచిన దృశ్యాలు మనసులో మెదిలాయి.

… … …

అప్పుడు సుబ్బారాయుడికి మంచి ప్రాయం. సత్యవతి గాలిలో పువ్వు ఎగిరినట్టూ, బంగారు జడ కుచ్చులతో, కాళ్ళ గజ్జెల తోడాలతో, చేతి కంకణాలతో, లోగిలి ఆవరణంతా ఎగిరి ఆడుతుండేది… ఎనిమిది సంవత్సరాల వయసులో.

చెంగల్వరాయుడు వచ్చాడు ఒక ఉదయం. చేతిమీద బాగా గీసుకుపోయిన గాయాలున్నాయి. పచ్చి రక్తం చారికలున్నాయి చేతిమీద. చెయ్యి కొంచెం పైకి ఎత్తి పెట్టుకున్నాడు. ప్రక్కన ఇంకా బండ్లవాళ్ళు నిల్చుని ఉన్నారు. మునసబు గారి చావిట్లో మునసబుగారు మంచంమీద కూచుని ఉన్నారు. సుబ్బారాయుడు వచ్చి పడక కుర్చీలో కూచున్నాడు. ఒక బండివాడు చెబుతూ ఉన్నాడు, ”ఇందాకండీ పొద్దుటేల చెరువు ప్రక్కనుండీ, ఈయన గారు చెట్టెక్కాడండీ, వణ్ణం చేసుకోటానికి… ఎండు కొమ్మలు వడతా ఉండాయి పైన. ఈయనగారి తండ్రేమో చెరువులో తపేలాతో నీళ్ళు ముంచాడండీ. మా ముసిలాయన లెండి. ఒడ్డుకు చేరాడండి. అంతే! ‘రామా’ అంటూ నేలమీద కూలబడిపోయాడు. మరి ఏమన్నా పురుగే కుట్టిందో ఏమోనండి. మేమంతా దగ్గరికి లగెత్తేతలికి ఈయనగారు చెట్టుమీదనుంచి కిందకి గాబరాగా దూకబోయాడండి. చెట్టుమీద ఎండిన కొమ్మ ఒకటి ఇరిగి చేతి అద్దమీద నుంచీ దూసుకుపోయిందండీ. సూడండి ఈ నెత్తురు, మా మంచోరండీ. ఇదుగో ప్రక్క ఇంటోరిని అడిగామండీ కామందులు పొలంలోకెల్లారు కాస్త ఆగమన్నారండి. తవురు దయ చేయించాలండి. తెచ్చిన దాన్నం తెచ్చినట్టుగానే ఉండాది. రొక్కం లేకపాయె. ఏదో ఇంటికో పువ్వేత్తే ఈస్పరుడికి ఒక మాలన్నారు కదండీ”. అంతవరకూ మౌనంగా ఉన్న సుబ్బారాయుడు ”అట్టాంటిదేమీ అక్కరలేదు. అంతా మేమే చూస్తాం. ఇంకొకళ్ళ ప్రసక్తి ఏంటి? అక్కర్లేదు. మనకి అలవాటూ లేదు” అన్నాడు కఠినంగా.

అంతవరకూ ఏదో మైకంలో ఉన్న చెంగల్వరాయుడు ”ధాన్యం ఏదో ధరకట్టి మీరే తీసుకోండి” అన్నాడు సుబ్బారాయుడితో. సుబ్బారాయుడు కొంచెం వెటకారంగా చిరునవ్వు నవ్వాడు చిన్నగా. ”నీ పేరేంటబ్బాయి?” అని అడిగారు మునసబుగారు. ”ఇనుగంటి చెంగల్వరాయుడు”.”ఇనుగంటా?” అన్నారు మునసబుగారు తిరిగి ప్రశ్నార్థకంగా. ”మా ఊర్లో ఈరిని ఎరగనోళ్ళంటూ లేరండి. బాగా బతికిన మారాజులేనండీ. తమరికేమన్నా బందుగులేమోనండీ, సుట్టరికాలు తిరగేత్తే” అన్నాడు అతనితో పాటు ఉన్న బండివాడు. ”కాదు కాదు” అన్నాడు పడక కుర్చీలోనుంచీ సుబ్బారాయుడు కత్తిలా. చెంగల్వరాయుడు చటుక్కున తల పైకెత్తాడు. నల్లటి గిరజాలు ముందర కళ్ళల్లోనించీ వెనక్కి చెదిరినయి. ”ఇనుగంటారు అన్న పేరు ఎక్కడో విన్నట్టుగా ఉంటే” అన్నారు మునసబుగారు. లోపలినుంచీ ఆటల్లో వగర్చుకుంటూ, అప్పుడే గుమ్మంలోకి వచ్చిన సత్యవతి అతన్ని చూచి అట్టే ఆగిపోయింది. మౌనంలో మాటలాగా అతని ముఖంలో ఆగివున్న దుఃఖాన్ని చూచి, చైతన్యం లేనట్టు అయిపోయింది. చెంగల్వరాయుడు ఒక్క క్షణం సజీవంగా చూశాడు సత్యవతికేసి.

”తోబుట్టువులూ, అన్నదమ్ములూ ఎంతమంది?” అన్నారు మునసబుగారు. ”ఈయన ఒక్కడే సంతుండి. కొండ్ర గట్రా ఏమీ లేదు. ఇప్పుడు అంతా పోయింది. ఒట్టి కౌలుకే చేత్తా ఉండారు. ఇటు పక్క బత్తీలలో, మరి కాసిని రాళ్ళు గిట్టుబాటు అవుతయ్యన్నారు. అందుకని మాతోపాటు ఆయనా బండి కట్టుకొచ్చారండి” అన్నాడు వెంట ఉన్న మరొక బండివాడు. ఈలోగా సత్యవతి తడిసిన గుడ్డ ఒకటి తీసుకొచ్చి గుమ్మంలోనించి చెయ్యి చాపింది. ఎవ్వరూ అందుకోలే. సుబ్బారాయుడు ”సత్యవతీ! ఏంటది!” అని గర్జించాడు. గుమ్మం మీదనే ఆ గుడ్డ పెట్టి సత్యవతి వెనక్కి పారిపోయింది రెండంగలలో. చెంగల్వరాయుడు ఆ గుడ్డ అందుకుని, చేతినున్న రక్తం చారికలు తుడుచుకున్నాడు.

వివరాలన్నీ తెలుసుకున్న మీదట ”ఇక్కడే ఉండిపో అబ్బారు. పాపం! మంచీ చెడ్డా అంతా మేమే చూస్తాంలే. భయం లేదు” అన్నారు మునసబుగారు. చనిపోయిన తన తండ్రికి దహన సంస్కారాలన్నీ మునసబుగారే చేయించారు, లోగిట్లో. ఆ ధాన్యం అమ్మించి ఆ రొక్కం దగ్గరే ఉంచుకోమన్నారు చెంగల్వరాయుడ్ని.

ఆనాటినుంచీ మునసబుగారికి కుడి భుజంలాగా మునసబుగారి లోగిట్లోనే ఉండిపోయాడు చెంగల్వరాయుడు. చెంగల్వరాయుడ్ని చూచినప్పటినుంచీ సత్యవతికి కన్నతల్లి తిరిగి లేచి వచ్చినట్టుండేది. పొలం వెళ్ళినా, బయటికెళ్ళినా సత్యవతికి ఇష్టమైనదేదైనా ఒకటి తెచ్చి ఇచ్చేవాడు చెంగల్వరాయుడు. సత్యవతి జ్వరం పడి లేస్తే సోలెడు గుమ్మపాలు తెచ్చి సత్యవతి మంచం దగ్గర స్వయంగా పెట్టేవాడు. ఎవరైనా అడిగితే, గుమ్మపాలు వంటికి మంచిదమ్మా అని సమాధానం ఇచ్చేవాడు. రోజులు గడుస్తున్నాయి.

సత్యవతి పెద్దదయింది. గడప దాటనివ్వడం లేదు. ఇంట్లో పెద్దవాళ్ళూ, సంప్రదాయమున్నూ. కానీ సత్యవతికి మాత్రం చెంగల్వరాయుడ్ని తల్చినంతనే దేవగానం వినిపించినట్టుండేది. అతను ఎదుట ఉన్నంతసేపూ తన ముఖానికి వన్నెలు వచ్చేవి. ఒకనాడు చెంగల్వరాయుడు ఎప్పట్లాగే పొలంలో పాలకోడు ఒడ్డుగా పెరిగిన పెద్ద పెద్ద మల్లె పొదలలో నుంచీ దోసెడు మల్లె మొగ్గలు తెచ్చాడు

ఉత్తరీయంలో. ”ఆ దుబ్బుల్లో పాము ఉందంట ఎందుకక్కడికి పోతావు? ఈ పువ్వులు లేకపోతే పోయిందిలే వెళ్ళొద్దు” అంది పువ్వులందుకుంటూ సత్యవతి. ”నన్నే పామూ ఏమీ చేయదు, నీవు నా పక్క చూస్తా ఉన్నన్నాళ్ళూ” అన్నాడు కళ్ళు నేలకు వాల్చి. నిండు చంద్రుణ్ణి చూచి సముద్రం పొంగినట్టు పొంగింది సత్యవతి హృదయం. రోజులు గడుస్తూనే ఉన్నాయి. మరొకనాడు పొలంనుంచీ వస్తుంటే మొండి తాటిచెట్టు క్రింద ఎగరలేక పడిపోయిన చిలక పిల్ల కనిపించింది. ఆ చెట్టు మానులో దాని గూడులో నుంచీ పడ్డది. దాన్ని సత్యవతికి ఇచ్చాడు. ఆ చిలుకను ఒక బుట్టలో పెట్టి అరటి పండ్లు పెట్టింది సత్యవతి.

ఆ సాయంత్రం ఇంటి ఖర్చులకి గాను చెంగల్వరాయుడు బండి కట్టుకుని సంతకు వెళ్తున్నాడు. అతను ఎప్పుడు, ఎందుకు కట్టినా తన స్వంత బండి, స్వంత ఎడ్లనే వాడతాడు. కొంత దూరం వెళ్ళేటప్పటికి సత్యవతి దారికడ్డంగా నించుంది, ప్రక్కనుంచీ చెట్టు కిందనుంచీ దూకి వచ్చి. ముందర రోజు వర్షానికి రోడ్డంతా తడిసి పారాణి పూసుకున్నట్టుగా ఉంది. సత్యవతిని చూచి చెంగల్వరాయుడు నిర్ఘాంతపోయాడు. ”ఎందుకొచ్చావు ఇంత దూరం? తిరిగి నిన్ను ఎట్లా తీసుకెళ్ళడం ఇంటికి?” అన్నాడు చిరునవ్వు, భయం కలిసి. ”ఏం భయం లేదులే. నన్నెవరూ ఈ చుట్టుపక్కల ఏం చెయ్యలేరు. నేనందరికీ తెలుసుగా ఇక్కడ. నువ్వు మాత్రం భద్రంగా వెళ్ళిరా” అంటూ తన తలలో వాడిపోయిన మల్లెపూల చెండ్లు తీసి ఎడ్ల కొమ్ములకి కట్టింది. ”ఇదిగో అమ్మవారి కుంకం” అని చెంగుముడిలో ఉన్న కుంకం తీసి నించుని ఉన్న అతనికి బొట్టు పెడుతూ ”నీ కూడా నేను ఉండనుగా. సంతలో అమ్మవారే కాపాడుతుందిలే. అందుకనే ఇది” అంది. చెంగల్వరాయుడి హృదయంలో పువ్వులు వికసించి, కళ్ళలో తేనెలొలికినయి.

ఆ సాయంత్రం తిరిగి వచ్చేటపుడు చిలకకి ఒక పంజరమూ, గోధుమ పూసలూ తెచ్చాడు సత్యవతికి. ఈ పెరుగుతున్న మైత్రి సుబ్బారాయుడికి అంత నచ్చలేదు, కళ్ళు చిట్లించాడు. వదినలు రుస రుస లాడారు. మరో సంవత్సరం గడిచింది. ఒకనాడు రవికె అంచులకి చెంగల్వరాయుడు తెచ్చిన గోధుమ పూసలు కుట్టుకుంటూ, చిలకకి పాటలు నేర్పుతోంది సత్యవతి. మధ్యాహ్నం ఎండకి నిద్రపోతున్న సుబ్బారాయుడు త్రుళ్ళిపడి లేచాడు. ”ఏం సత్యవతీ! ఏంటీ శని. ఈ చిలుకని ఎప్పుడో పీక పిసికేస్తాను. ఏం గోల నిద్ర లేకుండా” అని అరిచి ఛటాలున లేచి బయటకెళ్ళిపోయాడు. క్రొత్తగా కొన్న కారె దున్నల జతని కట్టేస్తున్నాడు చింతాలు. దున్నపోతులు గున్న ఏనుగుల్లాగున్నాయి. వాటికి ముక్కులు కుట్టారు. చింతాలుని అవి ముప్పుతిప్పలు పెడుతున్నాయి. ఇంట్లో కోపంమీద చావిట్లోకి వచ్చిన సుబ్బారాయుడు చెట్టుకు నిలబడి

ఉన్న దుక్కి కర్రతీసి దున్నల్ని ఒక్క పెద్ద దెబ్బ వేశాడు. జతలో ఒక పోతుకి నడుంమీద పడ్డది దెబ్బ. దున్న దద్దరిల్లిపోయింది. అప్పటినుంచీ, ఆ దున్న మరీ పొగరుబోతు అయ్యింది. సుబ్బారాయుడి గొంతు వినిపించినా, నీడ మీద పడినా అతన్ని చీరెయ్యడానికి చూస్తోంది. అతని మీద పగబట్టింది.

”దోసెడు ముత్యాల్లోనూ, దోసెడు రత్నాల్లోనూ పుట్టావు నువ్వు. నేనంటే ఎందుకిట్లా నీకు?” అన్నాడు చెంగల్వరాయుడు ఒకనాడు పై కొమ్మల నుంచీ ఎర్ర మందార పువ్వులు కోస్తూ. పువ్వుల కోసం దోసిలి పట్టి పైకి చూస్తూ ప్రతిమలా నించుంది సత్యవతి. ”నా పుట్టుక మాటకేం కానీ, నాకు నువ్వే పుట్టెడు బంగారం” అంది కొంచెం కొంటెగా. ”నేనూ ఆలోచిస్తా ఉండా నాకు చిన్న తాత కొడుకు ఉండాడు. నాకు పినతండ్రి. ఆయనతో నీకోసం అడిగిద్దామని. ఎట్లొచ్చీ డబ్బులు సంపాదించాలి. అదే చిక్కు” అన్నాడు విచారంగా. ఒకనాడు సుబ్బారాయుడుతో ”వయస్సు వచ్చిన పిల్ల. అతగాడితో ఈ సఖ్యం ఏంటండీ?” అంది ఆయన భార్య. అతను ఉలిక్కిపడ్డాడు. కోపంగా చూచి ఊర్కున్నాడు. కాస్త ఆగి ”ఏం ఎవరన్నా ఏవన్నా అన్నారా ఊళ్ళో?” అన్నాడు.

తన మేడమీద గదిలో ఒక్కడే పచార్లు చేస్తున్నాడు. ఆనాడు ఆ నగల మూట విషయమూ అంతేగా, ఈ పేరు ప్రతిష్టల కోసమేగా అంత భయపడింది? ఆ రోజు ఎవ్వరూ వెళ్ళని, ఆ మల్లి దుబ్బల దగ్గరికి ఎందుకు వెళ్ళడం ఆ చెంగల్వరాయుడు… దానికి పువ్వులకి అంటే, ఆ సత్యవతికి. ఎవరో దొంగాళ్ళు దాచిపెట్టుకున్న ఆ నల్లగుడ్డ మూట వాడి కంటబడింది… అనుకుంటూ తిరిగాడు తనలో తాను. ఆనాడు ఆ మూట దొరికిందని, మల్లెపొదలో పెట్టారని వచ్చి సుబ్బారాయుడితో చెప్పాడు చెంగల్వరాయుడు. సుబ్బారాయుడు వళ్ళంతా వణికిపోయింది. ”మన పంట బోదెలోనా? మన పొలంలోనా? దొంగల సొమ్ము! రెండో కంటి వాడికి తెలియనివ్వద్దు” అని ఆ మూట మోయించుకెళ్ళి గోనలేట్లో వదిలేయించేశాడు. లోకనింద ఏదైనా ఎట్లా భరించడం? ఎందుకైనా మంచిది, ఈ చెంగల్వరాయుడ్ని వదుల్చుకోడం మంచిది అనుకుంటూ కిటికీలోంచి చూస్తూ నిలబడ్డాడు. ఎదురుగా తామర గుంటలో నించీ మునసబుగారి గూసుబాతులు ఈదుకుంటూ ఒడ్డు చేరుతున్నాయి. గట్టుమీద వెళ్తున్నవాళ్ళని పొడవడానికి మెడలు బారెడేసి చాచుకుంటూ. మునసబుగారి రాశి కావలి కుక్కలు చెరువు గట్టుమీద తోకలమీద కూర్చుని నీళ్ళు చూస్తూ ఈగల్ని నాలుకతో పడుతున్నాయి. చుట్టూ పచ్చని చేలన్నీ పసిరి కప్పినట్టున్నాయి.

ఆ రాత్రి పొలంలోనించీ రాంగానే రమ్మన్నారని వీరయ్య చెప్పడంతో చెంగల్వరాయుడు సుబ్బారాయుడి గదిలోకి వెళ్ళాడు. ఒక అరగంట అయ్యాక, మేడమీద మంచినీళ్ళు పెడుతూ అక్కమ్మ చూచింది. సుబ్బారాయుడి గదిలో నుంచీ బయటకొస్తూ గుమ్మం బయట చెంగల్వరాయుడు అతని పలుచటి, తెల్లటి ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాడు.

మర్నాడు ఉదయం తెల్లవారక ముందే అక్కమ్మ చూసేసరికి సత్యవతి తన గదిలో లేదు. చెంగల్వరాయుడు తన బండి కట్టుకుని వెళ్ళిపోయిన దారినే నడుచుకుంటూ, వెతుక్కుంటూ వెళ్ళింది అక్కమ్మ. కొంత దూరంలో పున్నయ్య కోనేటి ప్రక్కన, పున్నయ్యగారి సమాధులకెదురుగా, ఒక చెట్టుకింద, ఒక ప్రక్కగా ఒరిగి ముడుచుకొని పండుకుని ఉంది సత్యవతి. ఆమె కౌగిట్లో ఒక తెల్లటి ఉత్తరీయం ఉంది. నిన్న రాత్రి చెంగల్వరాయుడు వేసుకున్నదే అది. ఉత్తరీయం ఒక చోట కొంచెం తడిగా ఉంది. గడ్డం క్రింద, మొఖం అంతా కన్నీళ్ళు జారిన ఆనవాళ్ళు ఉన్నాయి. కళ్ళు ఇంకా వాచి తడిగానే ఉన్నాయి. అప్పుడే నిద్రపట్టినట్లుగా ఉంది. సత్యవతికి తెలియకుండా ఆ ఉత్తరీయం లాక్కుని, మరుగుగా ఒళ్ళో పెట్టుకుని ఎవ్వరికీ కనబడకుండా దాచింది అక్కమ్మ. రోడ్డు మీద నుంచీ, చెట్టు వరకూ ఉన్న పల్లంలో సన్న మన్నుమీద రెండు జతల అడుగులు కనిపించాయి. ఒకటి చిన్నది, ఇంకోటి పెద్దది. అక్కమ్మ అడుగుజాడలు చేత్తో తుడిచేసింది.

ఆ ఎండల్లో ముహూర్తాల రోజుల్లోనే సత్యవతికి పెండ్లి అయింది.

పక్షం తిరగకముందే పుట్టింటికి పారిపోయి రావడమూ, అక్కమ్మ, వీరయ్య తిరిగి తీసుకువెళ్ళడమున్నూ.

మరొక వారం పోయాక, జుట్టు విరియబూసుకుని మునసబుగారి అమ్మాయి పొలాల్లో తిరుగుతోందనీ, ఎక్కడో తూముమీద కూచుని ఉందనీ పాలూరు గ్రామానికి రకరకాల వార్తలు చేరినయి. ఊళ్ళో అమ్మలక్కలు చెప్పుకోసాగారుః ”అదేంటి, ఆ అన్నల్ని చూస్తే మనలాంటి వాళ్ళకే బయ్యం. ఆ పిల్లదేమి రాతి గుండెమ్మా! బయమే లేదు గదా” అంది ఒకావిడ. ”ఏమీ ఎరగనట్టే ఉంటాది. ఎంత జాణతనం. జట్టీల్లాంటి అన్నలుండగా ఇట్లా కాపురం ఎగెయ్యటం” అంది రెండవ ఆవిడ బిందె తోముతూ, నీళ్ళాట రేవులో. ”కాపురంమీద ఎట్లా ఉంటాది?” అన్నాడు ఒకతను ఎడ్లను కడుగుతూ. ”ఆ! చెంగల్వరాయుణ్ణి ఇన్నాళ్ళు ఇంట్లో గట్టా ఉంచుకోకూడదు. ఆడపిల్లలున్న ఇంట్లో ఇట్లాగే అవుతాయి” అంది మరొక వేదాంతి బిందె భుజం మీద పెట్టుకుంటూ. అన్ని వార్తలూ సేవకుల ద్వారా మునసబుగారి కోడళ్ళకు తెలుస్తున్నయి. సుబ్బారాయుడు వినక తప్పింది కాదు. పిచ్చివాడిలా కోపం తెచ్చుకున్నాడు. పండ్లు పటపట కొరికాడు, పరవళ్ళు త్రొక్కుతున్నాడు.

మునసబుగారి ఒత్తిడివల్ల సత్యవతిని భూతవైద్యం చేయించడానికి పుట్టింటికి తీసుకొచ్చారు. నిశ్చయంగా సత్యవతికి దయ్యం పట్టింది అన్నాడు వైద్యుడు పేరంటాలయ్య. చెంగల్వరాయుడు రంగూన్‌లో ఉన్నాడనీ, రెండు సంవత్సరాలు అక్కడే ఉంటాడనీ అక్కమ్మ మరిది రంగూన్‌ నుంచీ ఉత్తరం వ్రాశాడు. అక్కమ్మ సత్యవతితో ఈ విషయం చెప్పింది. ”అవును! డబ్బు సంపాదించుకుని వస్తానన్నాడు” అంది సత్యవతి విచారంతో. ”ఏం లాభం సత్యవతీ, ఇక ఇప్పుడు?” అంది అక్కమ్మ. సత్యవతి ముఖం చేతులతో కప్పుకొని చిన్నగా ఆపుకుంటూ వెక్కివెక్కి ఏడ్చింది.

సత్యవతిని తిరిగి పంపించే రోజున సుబ్బారాయుడు అగ్నిపర్వతంలా బుస్సల్తొక్కాడు. మొండి తాడికి కట్టేసిన కారు దున్న ఇంకా బుస కొట్టింది. ఇంకా పగబట్టే ఉంది. రోజులు గడుస్తున్నాయి. తొలకరి వచ్చింది. రాత్రిళ్ళంతా తామర గుంటలో కప్పలు బెకబెకమంటున్నాయి. పున్నయ్య చెరువులోనూ, తామర గుంటలోనూ, తామర పువ్వులు వర్షానికి నలిగిపోయాయి. మొండితాడిమీద చంద్రుడుదయించాడు. పౌర్ణమి చంద్రుడు ఎర్రగా, నిశాదేవి కుంకుమ బొట్టులా… రాత్రి గడిచినకొద్దీ పున్నమి నెల తెల్లవారింది. భోజనాల వేళకి సత్యవతి వచ్చింది. ఈ సారి నగలు తీయాలన్న స్పృహ కూడా లేదు. తిరిగి సత్యవతికి చూచేటప్పటికి, పంజరంలో చిలక ”కిలకిల”లాడింది. రెక్కలు ”రెపరెప” కొట్టుకుంటూ, పాట మొదలెట్టింది. ఆ గోలకి పెంపుడు కుక్కని పరీక్షిస్తున్న సుబ్బారాయుడు, తలపైకెత్తి చూచాడు కళ్ళు ఎర్రబారాయి. ఒళ్ళు వణికింది, కోపంతో ”ఈ గడప తొక్కొద్దు అనలే? ఈ శని ఇంకా మాకు విరగడ కాలే? తల ఎత్తుకుని బ్రతకనివ్వదల్లే ఉంది” అంటూ అంగలమీద లేచి, చావిట్లో చిలకకొయ్యకి ఉన్న ఉత్తరీయం వేసుకుని, చెప్పుల్లో కాళ్ళు పెడుతూ ”వచ్చిన దారినే నడు” అన్నాడు. సత్యవతి వెనక్కి వెనక్కి చూచింది వెళ్ళబోతూ. తనకేసే చూస్తూ చిలక పాట పాడుతూనే ఉంది.

”పరువు గల అన్నలూ పయనమైనారా?

రాకాసి వదినలూ, రానివ్వరేమో”

మండువాలోకి వచ్చిన పెద్ద వదిన ”తెల్లారాక తీసికెళ్ళండి” అంది. ”ఎవళ్ళన్నా వస్తే తిరిగి వచ్చేసినట్టూ?” అంటూ అతను ముందూ, సత్యవతి వెనకా నడిచి పోతూనే ఉన్నారు. దారిలో తుమ్మ మానులు నల్లగా నించుని ఉన్నాయి. నేవళంగా, పచ్చగా పెరిగి ఉన్న చెట్లన్నీ పూర్తిగా, విభూదిలో ముంచెత్తినట్టు ఉన్నాయి ఆ పున్నమి వెలుగులో. అతని కిర్రు చెప్పుల చప్పుడికి, దారికి అడ్డంగా ఉన్న ఒక పెద్ద పాము ప్రక్కగా తప్పుకుపోయింది. దారి ప్రక్కన మళ్ళల్లో నీళ్ళు తళతళలాడుతున్నాయి.

సుబ్బారాయుడు ఇంటికి తిరిగి వచ్చేటప్పటికి చుక్క పొడిచింది. ”వాళ్ళ గుమ్మం వరకూ పంపించి వచ్చాను, లోపలికి వెళ్ళడానికి నాకు ముఖం చెల్లలేదు” అన్నాడు భార్య అడుగగా. తిరిగి మర్నాడు వాళ్ళ అత్తగారి మనుషులు వచ్చారు వెతుక్కుంటూ. అన్నగారి ముఖం వెనక్కి తిరగంగానే, ఇంట్లోకి వెళ్ళకుండా ఎక్కడికో పారిపోయింది. నూతులూ, గోతులూ దేవించారు. చెరువులు గాలించారు. ఆ చుట్టపక్కల ఎక్కడా సత్యవతి జాడ కనబడలేదు. వెతికి వెతికి వేసారిపోయి, మునసబుగారు మంచం ఎక్కారు. చేతినున్న షాహుకారు మురుగు అరచేతిలో పడుతోంది. క్షీణించిపోయి మూడు నెలలు కాకముందే కాలం చేశారు.

సుబ్బారాయుడు ఇంటి విషయం, ఆస్తి విషయం పట్ల ఏమీ శ్రద్ధ పెట్టడంలేదు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తూ చావిట్లోనే కూచుని

ఉంటాడు. సత్యవతి పరారైన సంవత్సరంలోనే గమిడిపోతుల జత అమ్మేశారు, వెంట వెంటనే దుక్కిటెడ్లు, పాడి పశువులూ అన్నీ అమ్ముడయిపోయాయి. సుబ్బారాయుడు తన పట్టె మంచం పడక మార్చేశాడు. చావిట్లో ఒక నులక మంచం వేసుకున్నాడు. భోజనం, పడక అన్నీ అక్కడే. అమ్మవారి గుడి ముఖం చూడడం మానేశాడు. సత్తెమ్మ సంబరాలు ఆగిపోయాయి. ఆస్తి క్షీణించసాగింది. ఆశ్రిత సేవక వర్గం లోగిలి విడిచిపోయారు. క్రమంగా ఏదో తగుపాటి సంబంధాలకి ఆడపిల్లల్ని ఇచ్చేశారు. ”ఎంత పౌరుషవంతుడు! ఆ సంబంధాలకు ఎట్లా అందాడో! ఏదో మతి పోయిందతనికి, చెల్లెలు తెచ్చిపెట్టిన తలవంపులకి” అని అందరూ ఉసూరుమన్నారు. ఆఖరుకి ఆస్తి అంతా పోయింది. ఆ లోగిలి ఒక్కటి నిల్చింది. దాని కోసం రక్షణలేదు. దానిమీదా అప్పులవుతున్నాయి.

సుబ్బారాయుడు ఆ కాలంలోనే వృద్ధుడయ్యాడు. మండుటెండలకి తన పొలంలో నల్ల రేవడిలా బీటలు వారినట్టు ముఖం అంతా తీరని భారంతో ముడతలు పడింది. అతన్ని చూడగానే పంజరంలో చిలుక భయపడి రెక్కలు ‘టపటప’లాడించి బయటకు ఎగిరిపోవడానికి ప్రయత్నించేది. సుబ్బారాయుడు చిలుకమీద కోపం కూడా తెచ్చుకోవడంలేదు. సత్యవతి వెళ్ళిపోయినప్పటి నుంచీ చిలుక తిండీ తిప్పలు మానేసింది. అక్కమ్మ పెట్టినా తినకుండా ముక్కు రెక్కలలో పెట్టుకుని అలాగే పడి ఉండేది. రంగూన్‌ నుంచీ వచ్చిన మరిది, చెంగల్వ రాయుడు జ్వరం పడి రంగూన్‌లోనే పోయాడని అక్కమ్మతో చెప్పాడు. అక్కమ్మ గుండెలో బరువుతో వెళ్ళి చిలుక పంజరం తెరిచి చిలుకను వదిలేసింది. పేదరికం భరించలేకా, పువ్వులమ్మిన ఊళ్ళో కట్టెలమ్మడం కష్టమై తమ్ముళ్ళందరూ తలొకదారిన బస్తీల బాట పట్టారు. వాళ్ళ కుటుంబాలతో, దుకాణాలు పెట్టుకుని, గుమాస్తాగిరులు సంపాదించుకుని చిన్న బ్రతుకులు బ్రతుకుతున్నారు. జరిగిన ఈ గాథ అంతా ఈ లోగిలి విచిత్ర పరిణామం అంతా ఆ అరుగుమీద కూచున్న అక్కమ్మ తలపోసుకుంది.

ఆ రాత్రంతా వచ్చిన కొద్దిమంది బంధువులు, అందరూ సుబ్బారాయుడు మంచం చుట్టూ జాగారం చేశారు. మధ్య రాత్రికి వృద్ధుడికి మళ్ళీ మెలకువ వచ్చింది. ”ఇంకా రాలేదూ సత్యవతి?” అన్నాడు. ”లేదన్నా” అంది అక్కమ్మ. ”అక్కమ్మా! ఇకమీదట సత్తెమ్మ సంబరాలు చేయిస్తావా? ఆయమ్మ పేరే సత్యవతిది” అన్నాడు ఆగి ఆగి కొంచెం ఆయాసంతో. ”అట్లాగే అన్నా, తప్పకుండా చేయిస్తాం” అంది నుదురుమీద చెయ్యి వేస్తూ. రోగికి ఆయాసం కాస్త ఎక్కువయింది. బయటనుంచీ తొలకరి గాలులు చల్లగా వీస్తున్నాయి. ఆ చిన్న గాలిలో ఆ పాత చిలుక పంజరం కొంచెం ఊగిసలాడింది. వెలిమబ్బు చాటునుంచీ చంద్రుడుదయించాడు. నీళ్ళల్లో వజ్రంలా నడిరాత్రి గడిచిపోయింది.

మలి కోడి కూసేటప్పటికి ”సత్యవతీ సత్యవతీ” అని గట్టిగా అరిచాడు. ”అన్నా అన్నా ఇంకా రాలేదు” అంది అక్కమ్మ. ”ఆ! ఆ! గోనలేరు పొంగింది. అదిగో నురగలు, కన్నయ్య లేడూ?” అన్నాడు ఆగుతూ, ఆయాసంతో కొంచెం ఆగాడు. ”బల్లకట్టు కన్నయ్య లేడే అక్కమ్మా! లేడు. నేనే బల్లకట్టు వేస్తానే! అక్కమ్మా నేనే! ఎక్కనందే బల్లకట్టు! చేత్తో లాగి బల్లకట్టు మీద పడేశానే అక్కమ్మా అంతే!” అన్నాడు. అంతా నిశ్శబ్దం మళ్ళీ. ”సత్యవతీ?” కేక. ”వస్తాదిలే పడుకో అన్నా” అంది అక్కమ్మ మృదువుగా. సుబ్బారాయుడు కండ్లు ఇంకా తెరిచాడు. ”ఎర్రిదానా! సత్యవతి రాదు! గోనలేరు మింగేసింది. బల్లకట్టు మీదనుంచీ నీళ్ళలోకి పోయింది. అదిగో అదిగో… నేనే నా చేతులారా…” సగం తెరిచిన కళ్ళు మూతబడ్డాయి.

గదిలో చుట్టూ వస్తున్న కన్నీళ్ళన్నీ గడ్డలు కట్టాయి. శ్వాస వినబడడం ఆగింది…రోగిది.

నీడలా ప్రమిద వెలిగించి, గాలికి దీపానికి చెయ్యి అడ్డం పెట్టుకుని లోపల్నుంచీ వచ్చింది చంద్రమ్మ తల దగ్గర పెట్టడానికి.

Share
This entry was posted in దారి దీపాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో