”ఎవరినైనా అడిగి చూడండి మీ జీవితాదర్శం ఏమిటి?” అని, లేదా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒక్కొక్కరి నుండి ఒక్కొక్క సమాధానం వస్తుంది… మీ మీ సమాధానాలని అలాగే గుర్తుపెట్టుకోండి.
తాను కన్న కలలను నిజం చేసుకోవడం కోసం, అసలైన జీవితం జీవించడం కోసం, ఏళ్ళకేళ్ళు, మైళ్ళకు మైళ్ళు ఎడతెరగని ప్రయాణం చేసే ప్రేమార్తుల్ని ఎవరిని చూసినా చలం గుర్తొస్తాడు నాకు. జీవితాంతం వెతికి వెతికి… అలిసిపోయినా… మనసులోని సహజత్వపు తడి ఏ మాత్రం కోల్పోని, పసిపిల్లల్లా మెరిసే ఏ కళ్ళు చూసినా చలం గుర్తొస్తాడు.
అసలు ఒక స్త్రీ మనసు ఏం కోరుకుంటుంది!! చలం అర్థం చేసుకున్నట్లు ఎవరైనా అర్థం చేసుకున్నారా అనిపిస్తుంది.
అంతేకాదు… మనం చూసే చూపులు మన మనసుతో ముడిపడి ఉంటే రోజూ మనం చూసే చిన్ని చిన్ని నీటి గుంటల నుండీ పెద్ద సముద్రాల వరకూ, చిన్ని గులకరాయి నుండీ ఆకాశాన్ని అంటుతున్నట్లుండే పర్వతాల వరకూ ఎప్పుడూ మన దృష్టికి రాని అందాన్ని చూపిస్తూ విశ్వరహస్యాన్ని విప్పి చెపుతూ ఉంటాయి. మనలో మనకు తెలియని సౌందర్యభావం దాగి ఉన్న మనసుమీది మూతల్ని తీసివేస్తే, అందాన్ని పరిచయం చేసే మిగిలిన పని అంతా మన చుట్టూ ఉన్న ప్రకృతి చేసేస్తోంది. మనుషుల్ని స్వచ్ఛంగా పలకరించటం తెలిసినచోట ఆనందం కుప్పబోసుకుని ఉంటుందన్న సత్యం ఏదో ఒక రోజున మనకి పరిచయం అవుతుంది.
కావాలంటే మీరూ ఒక్కసారి ”జీవితాదర్శం” చదివి చూడండి. కథగా చాలా చిన్నది. మనసు ద్వారాలు తెరిపించే విషయంలో మాత్రం చాలా పెద్దది ఈ నవల.
లాలస అనే స్త్రీ జీవిత ప్రయాణమే ఈ నవల. ఆమె జీవితంలో నలుగురు వ్యక్తులు, వ్యక్తిగతంగా వారెవ్వరూ చెడ్డవారూ కాదు, అయినంత మాత్రాన మొదటి ముగ్గురు వ్యక్తుల విషయంలో వారి వారి సాహచర్యంలో ఆమె క్షోభపడకుండానూ లేదు. అదెలా సాధ్యం అంటే… అదే కదా జీవితం అంటే. వీరందరిలో తాళి కట్టిన భర్త లక్ష్మణ్‌సింగ్, అతను ఎంత ప్రేమగా ఉన్నా మాల్వంకర్ సంగీతపు ఆకర్షణలో సింగ్ నుండి దూరంగా మాల్వంకర్‌తో వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయే సమయానికి మాల్వంకర్‌కి స్త్రీ అంటే ఎలాంటి ఉన్నత భావాలు లేవని మనకు తెలుస్తాయి. అతనికి కావలసింది ఎప్పటికప్పుడు తన సంగీతానికి కొత్త ఆరాధకులు. ఆమె విషయంలో తప్ప మిగిలిన విషయాల్లో అతను ఉన్నతుడు. తానూ కష్టాల్లో ఉన్నా తనది కాని డబ్బును స్నేహితులు వచ్చేవరకు కాపాడి పూచిపుల్లతో సహా అప్పగిస్తాడు. ఆ స్నేహితుడే దేశికాచారి. డిఫాల్కేషన్ కేసులో జైలుశిక్షను అనుభవించి వచ్చినవాడు అతను. ఒక విధంగా చెప్పాలంటే అతనే ఈ కథలో నాయకుడు. తనకు కావాల్సిందేదో దొరకలేదనిపిస్తూ ఇప్పటి జీవితంలో నుండి మరొక జీవితంలోకి ప్రయాణం చేస్తూ ఆనందాన్ని అన్వేషించిన స్త్రీ లాలస. ఊహకయినా, కథకయినా ఒక అర్హత రావాలంటే మానవ హృదయంలోని సత్యం మీద ఆధారపడాలి. సత్యానికి విరుద్ధం కానీ, దూరంగానే కాకూడదు అని ఇందులో ఒక పాత్ర చేత చెప్పిస్తాడు చలం.
నిజమే కదా? సత్యానికి మనం ఎంత దూరంగా జరుగుతూ ఉంటామో, మన బ్రతుకులంత భ్రమల్లో ఉంటాయని ఇప్పటికిప్పుడు మనం ఒప్పుకోకపోయినా ఏదో ఒక సమయంలో మన మనసుకి మనం సంజాయిషీ ఇచ్చుకుంటాం. ఈ కథలో లాలస ఊహకి దగ్గరగా సత్యమై నడచి వచ్చిన మనిషి దేశికాచారి. మనో విశాలత్వం, ఆతిధ్య దృష్టి, తనలోకి ఎవరినైనా ఆకర్షించుకునే శక్తి ఎవరికైనా ఉంది అంటే అతనే దేశికాచారి.
ఇదిగో ఈ భూమి మీద ఆదర్శవంతుడైన పురుషుడు కానీ, ఆదర్శమైన స్త్రీ కానీ ఉండరంటుంది లాలస. అంతేకాదు ఇందులో లాలస ఇంకా ఏమంటుందో తెలుసా? దుర్మార్గులకి స్త్రీ రెండు కారణాలవల్లే లోకువవుతుంది. అతను తననేం చేస్తాడో అన్న భయం, తననేమన్నా చెయ్యాలనే కుతూహలం.
అవును కదా… ఈ రెండు భావనల నుండి స్త్రీ బయటపడినప్పుడే ఆమెకి ఆమె మిగిలి ఉంటుంది. శతాబ్దాలుగా స్త్రీ కూడా ఒక నిశ్చలమైన వస్తువులాగే మగవాడి స్వంత ఆస్తిలా పరిగణించబడుతూ వచ్చిందే కానీ… ఆమె కూడా తనలాంటి మనిషే అన్న భావన ఏ కొందరిలోనో తప్ప అందరిలోనూ లేదు. కానీ ఆ స్త్రీకి తెలుసు, తానూ అతనిలాంటి మనిషినే అని. అప్పుడు ఆమె జీవితాదర్శం ఏమవుతుంది? తన అభిప్రాయాలుల, కోరికలు, హక్కులను స్వేచ్ఛగా పరరక్షించుకునే ‘శాంతి’ తప్ప.
నిజంగా మనుషుల్ని కలిపి ఉంచేవి ఏమిటంటే ఏమని చెప్తాము మనం?
ప్రేమ, శృంగారం, ఆత్మబంధం, ప్రాణస్నేహం, విడువలేనితనం, ఆశ, ఉద్రేకం… ఇలా ఎన్నెన్నో మన మనసుల్లో నుండి ఏకధాటిగా బయటకు వస్తాయి. కానీ ఇవన్నీ మనం అనుభవించి చెప్పేవి కాదు. ఇన్నాళ్ళుగా మనం చదువుతున్న, వింటున్న వాటి నుండి మనలో నాటుకున్న భావజ్ఞానం. ఇవికాదు ఇద్దర్ని కలిపి ఉంచేవి. ఇద్దరు మనుషుల్ని కలిపి ఉంచేవి ఐక్యము… శాంతి. ప్రేమకు అతీతమైన శాంతి. కోర్కెలూ, భయాలూ ఏమీ లేనిచోట ఏ మనిషి మనసు కంపనమైనా మరో మనసుని సున్నితంగా తాకుతూ శాంతిని పండిస్తూ ఉంటుంది. అందుకేనేమో లాలస దేశికాచారిలో ప్రేమకి అతీతమైన శాంతిని కనుగొంది. ఇందులో దేశికాచారీ, లాలస మధ్యన ఉన్నది ఐక్యం విడబడని సంపూర్ణమైన ఏకీభావం. తమ తమ ఇష్టాలను మార్చుకోవాల్సిన అవసరం లేని ఏకీభావం కన్నా జీవితంలో శాంతి ఇంకేమి కావాలి?
నిజం కదూ… ఆనందం ఎంత సులభం, ఎంత సహజం. మరి వాటిని కనిపెట్టే కళ్ళు మనిషికి ఎందుకు ఉండవో.
ఇది మాత్రమే కాక ఈ పుస్తకంలో మన దేశపు దారిద్య్రానికి కారణం బ్రిటిష్ వాళ్ళు కాదని, మన ఆచారాల్లోని ఆడంబరాలని, కొత్తగా మనమేమీ బ్రిటిష్ వాళ్ళకు బానిసత్వం చేయడం లేదనీ, పొద్దున్న లేచిన దగ్గర్నుండీ పెద్దలకీ, కుటుంబాలకీ, ఇంటిపక్క మనుషులకీ, పురోహితుడికీ చేసే దాస్యంలోనే అది ఉందికదా అన్న ప్రశ్న లేవనెత్తాడు చలం. పరుల ప్రభుత్వం బానిసత్వమే అయి ఉండవచ్చు కానీ మనమీద బరువై కూచోదు అని చెప్పాడు చలం. అంతేనా… ఇందులో లాలస స్వాతంత్రోద్యమంలో జైలుకి వెళ్ళి, అక్కడ ఉన్న స్వాతంత్రోద్యమ నాయకులు దేవురింపులూ, లంచాలూ, మోసాలతో కాలం గడపటం చూసి ఇలా తయారైన యోధులతో గొప్ప మార్పు ఎలా వస్తుంది అని ప్రశ్నిస్తుంది. అది చదివినప్పుడు మనకి అర్థమవుతుంది… నాయకుల తకరారులు ఇక్కడే కాదు, అప్పటికే ఉన్నాయి, అప్పుడప్పుడూ చలం నాయకుల మీద విసుర్లు వేస్తూ ఉంటాడని. ఇప్పుడు మీ జీవితాదర్శం ఏమిటి అన్న ప్రశ్నకి మీరు రాసిన సమాధానాల పక్కన ”శాంతి” అన్న ఒక్క పదాన్ని రాసి చూసుకోండి. అంతకు మించి తూగే జీవితాదర్శం ఏదైనా ఉంటే నాకూ చెప్పండేం…