సమిష్టిగా కృషి చేస్తే సాధించలేనిదీ, సృష్టించలేనిదీ ఏదీ లేదన్న వాస్తవాన్ని ఆస్వాదిస్తూ, కలిసి శ్రమిస్తే అలుపులు సొలుపులు ఆమడ దూరంలోనేనన్నది అనుభవంలో తెలుసుకుంటూ ‘మనలో మనం’ అంటూ 2008 నుండి సంవత్సర కాలం పాటు తనలో తాను పరీక్షకు పెట్టుకుని, 2009 నుండి నిర్మాణాత్మకంగా ”ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక”గా ప్రయాణం చేస్తూ వచ్చి ప్రగతిశీల రచయిత్రుల కలెక్టివ్ కృషితో ఈ 2018కి పదేళ్ళ మైలురాయిని దాటుతున్నది.
పదేళ్ళ ఈ ప్రయాణం మొదలయ్యింది ఏ ఒక్కరి నుండో కాదు. అనేక ఆలోచనలు, ఆశయాలు, చర్చల అనంతరం ఆచరణాత్మక రచయిత్రులు కలిసి కొనసాగించిన ప్రయాణం. సమాజంలో స్త్రీలు అన్నింటా మార్జినలైజ్ చేయబడినట్లుగానే సాహిత్యంలోనూ చేయబడ్డారు. సమాజం స్త్రీలను సంఘటిత శక్తులుగా ఎదగకుండా విడదీసింది. నమూనాల్లోకీ, మూసల్లోకీ తోసేసింది. వారి వికాసానికి పరిమితులు విధించింది. స్త్రీలలో కులాల, మతాల, ప్రాంతాల, సాంఘిక, ఆర్థిక హోదాల స్థాయిల్లో చీలికలు తెచ్చింది. వారిని విడదీసి పాలించడంలో విజయం సాధించింది పితృస్వామ్యం. సాహిత్య కళా రంగాల్లో కూడా పాలకవర్గాలు, పాలక కులాలకు చెందిన కొన్ని ప్రాంతాల రచయితలు, రచయిత్రులదే మొదటినుండీ ఆధిక్యతగా ఉంటూ వస్తున్నది. ప్రాధాన్యతలూ వాళ్ళకే ఇవ్వబడుతున్నాయి. వివిధ కులాల, అస్తిత్వాల స్త్రీలు ఈ రంగాల్లోనూ అనామకులుగానే ఉండిపోయారు. రచయితల వేదికల్లో వారి ప్రవేశం, అస్థిత్వం, భాగస్వామ్యం అరకొరగానే ఉంటోంది.
రొటీన్‌గా ఏర్పడే సాహిత్య సంఘాలకు భిన్నంగా వివిధ రచయిత్రులకు దామాషా ప్రాతిపదికన చోటు కల్పిస్తూ వేదికను నిర్మించడమే ‘ప్రరవే’ మొదటి అడుగు. ‘ప్రరవే’కు పునాది దామాషా పద్ధతి కావడం, దాన్ని పదేళ్ళుగా పాటిస్తుండడం ‘ప్రరవే’ నిబద్ధతకు నిదర్శనం. ఇది ‘ప్రరవే’ ముఖ్య విజయం. ‘ప్రరవే’ ఎప్పుడూ సమాజానికి మొదటి ప్రాధాన్యతనిచ్చి కృషి చేస్తూ వచ్చింది. సాహిత్యంలో సామాజిక దృక్పథం కలిగి ఉంటూ వస్తున్న మార్పులను ఆహ్వానిస్తూ అలవర్చుకుంటూ కొత్త నీటిని దోసిటపట్టి నూతన సృష్టికి సమాయత్తం అవుతోంది. ‘ప్రరవే’ను గైడ్ చేస్తున్న సీనియర్ రచయిత్రుల్లో మొదటినుండి సామాజిక కార్యకర్తగా పనిచేస్తున్న వాళ్ళూ ఉన్నారు. వాళ్ళు నిరంతరం ప్రత్యక్ష సమాజంతోనూ, సాహిత్య సృజనలోనూ దశాబ్దాలుగా మహిళా సమస్యకు, పీడితుల సమస్యలకు నిబద్ధులై ఉన్నారు. వాళ్ళు వివిధ అస్తిత్వాల, సమూహాల స్త్రీల పట్ల, పీడితుల పట్ల అమలయ్యే వివక్షతలను గుర్తెరిగి విస్తృతంగా రచనలు చేశారు, చేస్తున్నారు. సవాళ్ళూ, సమస్యలూ లేని సమాజం కాదు మనది. సమాజంలోని వివిధ రంగాల్లోనూ, మానవీయ కళల్లోనూ మనం ప్రవేశించాలనుకుంటే ముందు సమస్యలూ, సవాళ్ళూ ఎదుర్కోవాలి. అందులో స్త్రీలకు మరింత కఠిన పరిస్థితులు ఎదురవుతాయి. అన్ని ద్వారాలు మూసుకుపోయి
ఉంటాయి. అందువల్ల ‘ప్రరవే’ క్షేత్రస్థాయిలో పూర్తి స్థాయిలో పని చేయలేకపోయింది. కానీ క్షేత్రస్థాయిలో అధ్యయనాలూ, పర్యటనలూ, సమస్యలపై స్పందించి పని చేయకుండా లేదు. ఈ కోణంలో మరింత బలపడాల్సిన అవసరం నిర్మాణం రీత్యా ‘ప్రరవే’ ముందున్న అంశమని గుర్తించడం జరిగింది. ఈ పదేళ్ళ కాలంలో ‘ప్రరవే’ లక్ష్యాలను పాక్షికంగానైనా నెరవేర్చగలిగింది. సంక్లిష్టమైన, సంఘర్షణా పూర్వకమైన విశాల సమాజపు ప్రభావం ‘ప్రరవే’ సభ్యులపై కూడా అనివార్యంగా ఉండడం వలన కొన్ని ల్యాప్సెస్ ఏర్పడడం జరిగింది. వ్యక్తులైనా, రచయితలైనా తమ మైండ్‌సెట్‌ను మార్చుకోవడం పూర్తిగా జరుగుతుందనుకుంటే అది అత్యాశే అవుతుంది. అయితే రాబోయే కాలంలో ‘ప్రరవే’ లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉందనే నమ్మకంతో ఉన్నాము.
భిన్న స్త్రీల సాహిత్య కృషిని తెలుగు రాష్ట్రాల నాలుగు మూలల నుండి వెలికితీసి ప్రపంచానికి పరిచయం చేయడం కోసం
ఉమ్మడి రాష్ట్రం నలుమూలలా సదస్సులు నిర్వహించింది వేదిక. ప్రాంతీయ అస్థిత్వాలు మొదలుకొని స్త్రీల సాంఘిక అస్థిత్వాల వరకు విభిన్న సామాజిక అంశాలతో వివిధ సాహిత్య ప్రక్రియల్లో సదస్సులు నిర్వహించింది. ఈ దశాబ్ద కాలపు ప్రస్థానంలో అవగాహన, ఆచరణ, పటుత్వ సాధనలో నిలకడతో ముందంజ వేస్తూ సామాజిక ఉద్యమాలు సమన్వయం చేస్తూ వస్తున్నాము. అనేక సవాళ్ళను అధిగమిస్తూ విభేదించిన వాళ్ళను కూడా స్నేహపూర్వకంగా గౌరవిస్తూ, తమ కార్యక్రమాలకు ఆహ్వానిస్తూ, వైరుధ్యాలను పరిహరించుకుంటూ, పొరపాట్లను సరిదిద్దుకుంటూ ప్రజాస్వామిక దృక్పథం అలవర్చుకునే అభ్యాసం చేస్తోంది ‘ప్రరవే’. ప్రజాస్వామిక సమాజ సంబంధాల కోసం అచంచల విశ్వాసమే అంతిమ ధ్యేయంగా, సమానత దృక్పథమే శ్వాసగా, ధ్యాసగా ప్రజాస్వామిక సంస్కృతిని అలవర్చుకునే మార్గంలో ‘ప్రరవే’ ఎప్పటికప్పుడు తనను తాను విమర్శనాత్మకంగా పరిశీలించుకుంటుంది. అది జరగనిరోజు ‘ప్రరవే’ అంతర్థానమైపోతుంది.
యువ, వర్ధమాన రచయిత్రులను వేదికలోకి కూడగట్టుకోవడంలో మేము వెనకబడి ఉన్నామనే ఒప్పుకోవాలి. రచయిత్రుల విశాల సమూహానికి సంబంధించిన ఈ వేదిక అనునిత్యం కొత్త రచయిత్రుల కోసం (ప్రణాళికను అంగీకరించే) అన్వేషణ, శిక్షణ కొనసాగిస్తుంది. ‘ప్రరవే’ నాయకత్వాన్ని (లీడింగ్ స్థాయిని) యువ రచయిత్రులతో పంచుకోవడానికి, వారి చేతుల్లో పెట్టడానికి ‘ప్రరవే’ ముందుంటుందనే భావిస్తున్నాను. ‘ప్రరవే’తో వ్యవస్థాపన నుండీ నాది, నాతోపాటున్న రచయిత్రులతో కలిసి నేను, మాది, మనందరిదీ అస్థిత్వ ప్రయాణమే. ఈ నడకా, నడతా సుదీర్ఘమైనదే. ఆలోచన నుండి ఆచరణకు, ఆచరణ నుండి రచనలకు ప్రేరణగా ‘ప్రరవే’
ఉండడం, నేనూ ‘ప్రరవే’లో ఉండడం ఒక ఆత్మీయ సృజన సందర్భం.
‘ప్రరవే’ మరొక దశాబ్దంలోకి అడుగు పెడుతున్న సమయం. ‘భూమిక’తో పాతికేళ్ళ సహవాసం, ‘ప్రరవే’తో పదేళ్ళ సాహచర్యం… ముందూ, వెనుకా ప్రయాణం ఒక్కటే. లక్ష్యం, గమ్యం ఒక్కటే. సమీక్షించుకుంటూ, సమీకరించుకుంటూ, మానవీయ కళా సృష్టి వైపునకు ఈ పయనం… కలిసి పనిచేయడం మహా యోగం అని భావిస్తూ ప్రజాస్వామ్య సమాజం కోసం పునరంకితం కావాలని మనమందరం ఆకాంక్షిస్తూ… స్నేహాభివందనాలు! (2019 ఫిబ్రవరి 2, 3 తేదీలలో ‘ప్రరవే’ పదేళ్ళ ప్రయాణం సమాలోచన సదస్సు సందర్భంగా)