టి. సంపత్ కుమార్
శ్రీహరికోట పేరు వినగానే మనందరికి రాకెట్లు గుర్తుకొస్తాయి. ఎంత మంచి జోడి! శ్రీరాముడు – స్వయాన పరమాత్ముడు – ఈ అందమైన ప్రదేశంలో రాక్షస ప్రభావాన్ని తొలగించడానికి అరకోటి లింగాలను ప్రతిష్టించాడని, దానివల్లే శహరికో్టఅయ్యిన్ద ని అది కాస్త కాలంతో ముందుకు సాగుతూ ఇంపుగా, సొంపుగా శ్రీహరికోటగా రూపాంతరం చెందిందని స్థానికుల కథలు.
ఏమైతేనేం! మన కథకిది లాంచింగు పాడ్. ద్వీపం, గిరిజనుల జీవనం, సుందరమైన ప్రదేశం, రాముడు, యాభై లక్షల లింగాలు, అంతరిక్ష కేంద్రం, చంద్రుని చుట్టు చక్కెర్లు కొడుతున్న చంద్రయాన్-1……
నమ్మకాల ఉయ్యాలలో రాకెట్ల చిందులాట! నడకలు నేర్చుకున్న రాకెట్లు ఏకంగా చంద్రునిపైనే మకాం కొరకు మరో ఉయ్యాల…. ఆ రాకెట్ ఉయ్యాల్లో వ్యోమనౌక – చంద్రయాన్-1.
అక్టోబర్ ఇరవై రెండు :
ఉదయం ఆరు గంటల తరువాత వేల శాస్త్రవేత్తల పసిబిడ్డ చంద్రయాన్-1 నింగికెగిసింది. అదే సమయానికి కొండ ప్రాంతంలో ఉన్న ఓ చిన్న ఊర్లో.. ఎనిమిది నెల్ల కడుపుతో ఉన్న చంద్రి ఆ ఊరినుండి తన ప్రయాణం……
ఃఃనీ పనుల్లో వేగిరమేలేదు. తొందరగా కానియ్… రేపటి వరకు ఆ ఊరికి చేరుకోకపోతే మనకు బస్సు దొరకదు. ఈ రోజు సాయంత్రం కల్లా కమలాపూర్ చేరుకొని అక్కడ రాత్రి ఉండి తెల్లవారి బయలుదేరుదాం చంద్రి అసహనంతో, చిరుకోపంతో భర్తతో అంది. రాజన్న తొందరగా దోతి కట్టుకొని షర్టు వేసుకొని అప్పటికే సిద్ధంగా ఉంచిన బ్యాగుని పట్టుకొని చుట్టుప్రక్కవాళ్లకి చెప్పి బయలుదేరారు… ఆరోగ్యంగా ఉన్న మనిషి చకచకానడిస్తే నాలుగు గంటలు పడుతుంది, వారు ఆ రోజు బసచేసే ఊరు చేరుకోడానికి.
రాజన్న తనవేగాన్ని తగ్గించి భార్యతో కబుర్లు చెబుతూ నడుస్తున్నాడు. చంద్రికి అన్న మల్లేశం చెప్పిన మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయి. చంద్రి… నేను పెద్ద ఊర్లో ఉన్నాను కదే! కాన్పుకి నా దగ్గరకు రావే! అన్నీ నేను చూసుకుంటాను…. మరీ ఆలస్యం చేయకు. నెలరోజుల ముందే రావేః…. అని పలుమార్లు ప్రేమతో చెప్పి బ్రతిమాలిమరీ వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు చెల్లెలి చేతిని తీసుకొని వెయ్యి రూపాయలు వారి ఖర్చులకని పెట్టాడు.. ఃఃఎక్కడ ఆటోలు దొరికితే అక్కడ ఎక్కండి….. నడచి ఆయాస పడవద్దని.ఃః మరీమరీ చెప్పాడు.
చెల్లిని చూసిపోదామని వచ్చినపుడు పళ్ళు ఫలాలు, చిన్న ఊర్లో ఏమీ దొరకవని రకరకాల బిస్కట్ ప్యాకెట్లు, హార్లిక్స్ బాటిల్… తీసుకొనివచ్చాడు. ఉన్న మూడు రోజులు చెల్లి సరిగా తినేటట్టు చూసుకున్నాడు. మొదటి కాన్పని ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలని బావతో మరీ మరీ చెప్పాడు మల్లేశం.
అంతా సవ్యంగా జరుగుతున్నట్లు చంద్రయాన్-1 రిపోర్టులు వస్తున్నాయి. చంద్రయాన్-1ని మోసుకెళ్తున్న రాకెట్ ఆకాశంలోకెగిసినపుడు శ్రీహరికోటలో హర్షద్వనాలు. కంట్రోలు రూమ్‌లో ఉన్నవాళ్ళంతా కూర్చీల్లోంచి లేచి తమపక్కవాళ్ళని ఆప్యాయంగా ఆలింగనం చేసుకొన్నారు. అందరి ముఖాల్లో అంతులేని ఆనందం.
చంద్రి కాన్పుకి అన్న దగ్గరికి వెడుతుందని చుట్టుప్రక్కలందరికీ తెలుసు. వెళ్ళే సమయానికి కొందరు అక్కడ పోగై చంద్రిని ప్రేమతో సాగనంపారు… ఃఃపండంటి పాపతో రా. నీకోసం ఎదురుచూస్తాం..ఃః అని వాత్సల్యంతో దగ్గరికి తీసుకున్నారు. చంద్రి కళ్ళలో ఆనందం… తల్లితండ్రులు లేని చంద్రికీి చుట్టుప్రక్కల వారిలోనే వాళ్ళను చూసుకొంది. కళ్ళల్లో దుఖం. కన్నీళ్ళు రాకుండా ఆపుకుంది.
చిన్నపాటి అడవి మార్గంలో భార్యనే గమనిస్తూ రాజన్న నడుస్తున్నాడు. చంద్రి మెల్లిగానే అయినా ఉత్సాహంగా నడుస్తోంది. రాజన్నకి అదే తృప్తి.
చంద్రి నడక…. చంద్రయాన్-1 ప్రయాణం సాఫీగా సాగుతున్నాయి.
అక్టోబర్ ఇరవై మూడు :
ఉపగ్రహం చంద్రయాన్-1 భూమి నుండి ముప్పై ఎనిమిది వేల కిలోమీటర్ల దూరానికి వెళ్ళింది.
చంద్రి నిండుకడుపుతో మధ్య మధ్యలో కూచుంటూ, విశ్రాంతి తీసుకుంటూ నడిచింది. వెంట తెచ్చుకొన్న రొట్టెల్ని ఒకచోట కూర్చుని తిన్నారు. దారిలో మోటరు సైకిల్‌పై వెడుతున్న జంటని ఆవిడా కడుపుతో ఉండడం గమనించాడు. తనవద్ద కూడా మోటార్ సైకిల్ ఉంటే చంద్రిని కూడ తను అలాగే తీసుకెళ్లేేవాడు గదా అన్న ఆలోచనలొచ్చాయి రాజన్నకి. సాయంత్రాని కల్లా మరో ఊరు చేరుకొన్నారు. శిశువు కదలికలని అనుభవిస్తూ అలసటని ఉత్సాహంగా మార్చుకొంటుంది చంద్రి. రాజన్న తోవంతా ఎంతో సహకరిస్తూ చంద్రిని అపురూపంగా చూసుకుంటూ అనుకూలంగా నడిచాడు.
చంద్రి రెండు రోజుల ప్రయాణంలో పన్నెండు కిలోమీటర్లు ముగిసాయి.
చంద్రి బాగా అలసిపోయింది. తెలిసినవారింట్లో ఒళ్ళుమరచి నిద్ర పోయింది. బారెడు పొద్దయినా చంద్రి లేవకపోతే రాజన్న వెళ్ళి చూసాడు. ఃఃఏమే చంద్రి, ఎలా ఉంది?.. సుస్తీగా ఉందా?ఃః చంద్రి మెళకువతోనే ఉంది. బాగా అలసిపోవడంతో లేవాలని ఉన్నా లేవలేక పోతుంది.
ఃఃచాతనవడం లేదు. నీరసంగా ఉంది…ఃః భర్తని చూస్తూ బేలగా అంది.
ఃఃలేచి నోరుకడుక్కో. నేను పాలు తెస్తాను. కాస్త బలంవస్తది.ఃః అని మంచంపై చంద్రికి దగ్గరగా కూచున్నాడు.
అక్టోబర్ ఇరవై ఆరు :
చంద్రయాన్ డెభ్బై అయిదు వేల కిలోమీటర్లు ప్రయాణించింది. అన్ని కార్యకలాపాలు బాగా జరుగుతున్నాయి. శాస్త్రవేత్తల సందేశాల కనుకూలంగా చక్కగా పనిచేస్తుంది. ఎక్కడా కూడా ఇంతవరకు ఒక్క పొరపాటు జరుగలేదు.
చంద్రికి ఇంకా అలసట తగ్గకపోవడంతో అదే ఊరిలో ఆగి పోయారు. రాజన్న చంద్రిని ఎటూ కదలనీకుండా ప్రేమతో చూసుకున్నాడు. బంధువులు కూడా ఆప్యాయతతో చూసుకొని త్వరలో కోలుకునేట్టుగా తోడ్పడ్డారు. మూడు రోజులకి చంద్రి మాములు మనిషయ్యింది.
అక్టోబర్ ఇరవై తొమ్మిది :
చంద్రయాన్-1 భూమి నుండి రెండు లక్షల అరవై ఏడు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. ప్రెసిడెంట్, ప్రధాన మంత్రి, ఇతర దేశాల శాస్త్రవేత్తలు, నాయకులు… ఏక కంఠంతో చంద్రయాన్ -1 గమనం పట్ల ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు.
రాజన్న కాస్త కోలుకున్న చంద్రితో కదిలాడు. మరో మజిలీకి ప్రయాణం.
క్రిక్కిరిసిన ఆటోలో కూర్చున్న చంద్రి ఎప్పుడు ప్రయాణమైపోతుందని ఎదురు చూస్తుంది. గతుకు రోడ్లపై ఆటో కదలికలతో చంద్రి శరీరమూ అటూ ఇటూ కదలుతూ ఎంతో అసౌకర్యానికి గురవుతోంది.
అది గమనించిన రాజన్న ఃఃఅన్నా, కొంచెం మెల్లగ పోనియ్యవే! కడుపుతో ఉంది. కష్ఠంగ ఉన్నట్టుంది…ఃః అని డ్రైవర్ని బతిమాలాడు.
ఃఃనేను మెల్లగాపోతే, నా ఎనకున్న ఆటోడు దంచుకవోతడు. నా నోట్లో మన్నే. నేనెట్ల బతకాల? సుఖం కావాలంటే కార్లల్ల పోవాలా.. ఆటోలల్ల ఎందుకెక్కిండ్రుఃః ఎదురుగా దూసుకువస్తున్న జీపుకి సైడు ఇవ్వడానికి ఒక్క ఉదుటున ఆటోని పక్కకు దించుతూ అన్నాడు.
రాజన్న ఇంకేం మాట్లాడలేదు. చంద్రి వైపు అసహాయంగా చూసాడు. మనస్సులో దేవున్ని స్మరించుకొని చంద్రికి ఏ ఆపదా రావద్దని కోరుకున్నాడు.
నవంబర్ నాలుగు :
చంద్రయాన్-1 భూమిని వదలి పదమూడు రోజులైంది. గగనంలోకి ఎంచక్కా మూడు లక్షల ఎనభైవేల కిలోమీటర్లు దూరం ఎలాంటి సాంకేతికలోపం లేకుండా ప్రయాణం చేసింది. భూమితో బంధాన్ని తగ్గించుకుంటూ, కొత్త మిత్రుడు చంద్రుని ఆకర్షణకి లోనౌతూ ఆయన ముంగిట్లోకి చేరింది.
భారతదేశమంతటా ఉత్సాహం. చంద్రయాన్-1 కి ఇక ఒకే ఒక సంక్లిష్టమైన గండం ఉంది.
చందమామ రావే.. జాబిల్లి రావే.. అని పాడుకుంటాం. అది రాదని మనకు ఖచ్చితంగా తెలుసు. అయినా పాడు కుంటాం. అదో సరదా! ఇపుడు మాత్రం దానికి వ్యతిరేకంగా ఆ జాబిల్లి కక్ష్యలోకి మన వస్తువొకటి పంపడం… అద్భుతం.
ఆటో కదలికలు చంద్రిని ఎంతో ఇబ్బందికి గురిచేస్తున్నా కడుపులో తీయని కదలికలు ఃనేనున్నానుః అని తన ఉనికిని తెలియచేస్తున్న తన చిన్నారి ఆలోచనలు సేదదీరుస్తున్నాయి.
ముందు ప్రయాణాన్ని ఇంకా బస్సులో చేయలేక ఆరోజుకి అక్కడే ఆపాల్సివచ్చింది. బీరకాయ పీచులాంటి బంధువుల ఇల్లొకటి వెతుక్కొని అక్కడికి వెళ్ళారు. రాజన్న పరిస్థితిని వివరించాడు.
ఃఃదాంట్లేముంది తమ్మి…. ఇదంతా నువ్వు చెప్పాలా! మీ పెళ్లి అయిందని తెలిసింది కాని చంద్రి కడుపుతో ఉందని ఎవ్వరూ చెప్పలేదు. కాళ్లు, చేతులు కడుక్కోండి. అన్నం తిందురు కాని….ఃః ఆ ఇంటావిడ చంద్రిని చూసి ఎంతో ప్రేమగా ఆదరించింది.
చంద్రి కాస్త తిన్నాననిపించుకుని అలసటగా మేనువాలిచింది. ఏమైందో ఏమో అరగంట తరువాత ఃఃవదినా…. వదినా….అంటూ గట్టిగా అరిచింది. బయట బీడి కాలుస్తున్న రాజన్న పిలుపులు విని ఒకసారే లోపలికి పరుగెత్తాడు. ఆ ఇంటావిడ కూడా గాభరాగా చంద్రి దగ్గరకు వెళ్ళింది.
కడుపులో నొప్పి…. మూలుగుతూ చెప్పింది. ఆమె తన చేతుల్ని కడుపుపై వేసి నిమిరింది. రాజన్నకి ఆటో డ్రైవర్‌పై చాలా కోపం వచ్చింది.
ఆ ఆటో డ్రైవర్ని బాగా బతిమాలినక్కా. మెల్లగా నడపమని.. ఎదవ ఇననేలేదు.. ఇష్టం వచ్చినట్లు దంచుకచ్చిండు…
అందరంతే తమ్మి! ఆల్లేందుకు ఇంటరు ఎద్దుపుండు కాకికినోప్పా అని అంటరందుకేః….
ఃఃబాగా నొప్పిగా ఉంది..ఃః చంద్రి.
ఃఃదగ్గరనే డాక్టరున్నడు. మెల్లగా పోదాం నడు తమ్మి.. నువ్వొక రిక్షా మాట్లాడుక రాపో..ఃః అని రాజన్నని పంపింది.
డాక్టరు మందులిచ్చి, నాలుగురోజుల వరకు ఎలాంటి ప్రయాణం వద్దని గట్టిగా చెప్పాడు. ఇక గత్యంతరంలేక వారు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఆ ఇంటావిడ కూడ ఃఃఎంతో దూరం నుండి వచ్చినవుపిల్లా… నువ్వేమి ఫికరు పడకు. మంచిగయ్యేదాక ఇక్కడే ఉండుఃః అని ప్రేమగా ఊరడించింది.
నవంబర్ ఎనిమిది :
చంద్రయాన్-1 ప్రయాణంలో ఎంతో కీలకమైన రోజు. ప్రమాదాలభరితం. సంక్లిష్టాలతో కూడుకున్న ఘట్టం ఎలా గట్టెక్కుతుందో? అన్న ఉత్కంఠ. ఇస్రో శాస్త్రవేత్తలకు మహాసవాల్. చంద్రయాన్-1 భూమ్యాకర్షణ శక్తి నుండి విడిపోతూ మెల్లగా చల్లగా చంద్రుని కక్ష్యలోకి దూరాలి. ఎన్నో అవరోధాలని తప్పించుకొని ఇంకా ముందుకు పోవాలి. చంద్రయాన్-1 గమనంలో ఉంటుంది. చంద్రుడు భూమి చుట్టూ పరిభ్రమిస్తుంటాడు. ఈగమనాగమన పరిస్థితుల్లో భూమితో దోస్తానిని ఃకటాఫ్‌ః చేసుకొని చంద్రుని అండలోకి చేరాలి. ఎంతో నిక్కచ్చిగా అమలుచేస్తే కాని ఆ పనులు కావు. పదమూడున్నర నిమిషాల మహా వేధన! అయితేనేం! మొదటి ప్రయత్నంతోనే శాస్త్రవేత్తలు అక్షర రూపంలో రాసుకున్న దాన్ని అంతరిక్షంలో అమలు చేసి చూపారు. భేేష్! ఢిల్లీ నుండి శుభాకాంక్షల జల్లులు……
చంద్రికి నాలుగురోజుల విశ్రాంతితో హుషారుతనం వచ్చింది. మందులవల్ల మంచి ఉపశమనం కలిగింది. ఇప్పటికే తమ బంధువులకి ఇబ్బంది కలిగించానన్న భావనతో ముడుచుకు పోయింది. ఉన్న నాలుగు దినాలు రాజన్న తనకు తోచిన రీతిలో వారికి, పొలం పనుల్లో ఎంతో చొరవతో సహాయపడ్డాడు.
పొద్దున్నే భోంచేసి బస్టాండ్‌కి చేరుకొన్నారు.
చంద్రికి పట్నం (హైద్రాబాద్)కి పోవాలని ఎప్పటినుండో కోరిక. మల్లేశం అన్న ఎన్నో ముచ్చట్లు చెబుతాడు. ఎంతో ఉత్సాహంగా, ఆశతో వినేది. ఇన్నేళ్ళ కోరిక ఈ రోజు నెరవేరబోతుంది. ఏడు గంటలు బస్ ప్రయాణం చేస్తే హైద్రాబాద్. రాజన్న పెళ్ళికి ముందు ఒకసారి హైద్రాబాద్ చూసాడు. చూసొచ్చిన జ్ఞాపకాలు తాజాగానే ఉంచుకున్నాడు.
చంద్రికి ఉత్సాహంతో పాటు గుబులు కూడా ఉంది. శరీరంలో జరిగే మార్పుల వల్ల అసౌకర్యంగా ఉంది. మొదటిసారి తన ఇంటి నుండి బయలు దేరి ప్రయాణం చేస్తూ ఊరికి ఎంతో దూరంగా పట్టణం వైపు ప్రయాణిస్తోంది. నాలుగు రోజులు మకాం చేసిన ఊరు తనకు కొత్తగా ఉంది. మరీ ఊరి పోలికలు లేకున్నా ఊరి మనుషుల మధ్య గడపడంతో దిగులు కాస్త తగ్గినట్లనిపించింది. అక్కడి నుండి బస్ ప్రయాణం కదలికలు ఒడుదుడుకులు ఎలా ఉంటాయో ఊహించుకొంటోంది. రాజన్న ధైర్యం చెబుతూనే ఉన్నాడు. బస్సు ఘాట్ల నుండి ప్రయాణిస్తుందని, చంద్రికి వాంతివస్తుందేమోనని నాలుగు ఉసిరి గాయలు తనతో తెచ్చాడు.
పల్లె నుండి చంద్రి పట్టణ ప్రయాణం.
భూమి నుండి చంద్రునికి చంద్ర యాన్-1 ప్రయాణం.
వింత లోకం…. విచిత్ర లోకాలు…
రాజన్న చురుకుగా భుజంపై ఉన్న తన తువ్వాలని బస్సు కిటికీ నుండి విసిరి రెండు సీట్లపై పరిచి సీట్లని ఃరిజర్వుః చేసుకొన్నాడు. చంద్రిని కూర్చోబెట్టి తానూ పక్కన కూర్చున్నాడు… నిండు కడుపుతో చంద్రి…… నిండు జనంతో బస్సు కదిలింది. కదిలే బస్సులో ఊగుతున్న జనం. ఒక్కొక్క కిలోమీటరు ముందుకు కదులుతున్న చంద్రి. తన కడుపులో శిశువు కదలికలు. ప్రపంచబ్యాంకు అప్పుతో వేసుకున్న నల్లని రోడ్డుపై అవార్డుల్ని గెలుచుకున్న రవాణా సంస్థ వారి బస్ సాఫీగా సాగుతుంది.
మూడు గంటల ప్రయాణం తరువాత డ్రైవరు స్టాపొకటొస్తే ఆపాడు. టీ కోసం దిగాడు. బస్సు పదినిమిషాలాగుతుందని కండక్టరు ప్రకటించి తానూ దిగాడు…
డ్రైవరు టీ తాలుకు హుషారుతో వచ్చి సీట్లో కూర్చొని బస్సుని ఆన్ చేసాడు… గుర్ గుర్ మంది… ఇంజన్ స్పార్క్‌ని పట్టుకోలేదు. మళ్లీ గుర్ గుర్ మనిపించాడు…
ఐదు నిమిషాలు తన ఏళ్ళ అనుభవాన్నంతా చూపాడు. డ్రైవరు కిందకు దిగాడు. వంగి కింది బాగాన్ని పరిశీ లించాడు.. అదృష్టవశాత్తు బస్సు స్టాండ్‌లోనే ఉంది. డిపో నుండి మెకానిక్ వచ్చేంత వరకు కదలదని ప్రయాణికులందరికి తెలిసింది. వారిలో కోపం, అసహనం. చంద్రి సీట్లోనే కదలకుండా కూచుంది.
రెండు గంటల తరువాత బస్ కదలింది.
చంద్రి బాగానే ఉంది. రాజన్న తెచ్చిన ఉసిరికాయల అవసరం కలుగలేదు.
నాలుగు గంటల ప్రయాణం తరువాత బస్ హైద్రాబాద్ సరిహద్దుల్లోకి చేరుకొంది.
చంద్రయాన్-1 జాబిలి కక్ష్యలోంచి మరింత ప్రయాణించి చంద్రునికి వంద కిలోమీటర్ల చేరువలో ఉంది. అక్కడి నుండే చంద్రుని చుట్టూతా చూసుకుంటూ, లోతుల్ని లెక్కించుకుంటూ రెండు సంవత్సరాలు గడుపుతుంది.
ఇస్రోకి జేజేలు. ఇతర దేశాల నుండి భారతదేశానికి శుభాకాంక్షల పరంపర. సరికొత్త అంతరిక్ష శక్తిగా అవతరించిన దేశం… స్పేస్ క్లబ్బులో మరో కొత్త మెంబర్…. గడియారం నడిచినంత నిక్కచ్చిగా జరిగిన మిషన్….. ఎక్కడా పొరపాటు జరగలేదు.
సక్సెస్! సక్సెస్!! గ్రాండ్ సక్సెస్!!!
నవంబర్ పద్నాలుగు :
కార్తీకమాసం. నెహ్రూ జన్మదినం. పిల్లల పండుగ. మనందరికి చంద్రుడు చక్కగా, చల్లగా మెరిసిపోతూ కనబడు తున్నాడు. సరిగ్గా రాత్రి ఎనిమిది గంటల ఆరు నిమిషాలకి విన్యాసాలు చేస్తున్న చంద్రయాన్-1 మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ని జారవిడిచింది. ఇరవైఐదు నిమిషాలు ప్రయాణం చేసి ఠంచనుగా ఎనిమిది గంటల ముప్పైఒక్క నిమిషాలకి చంద్రుని ఉపరితలాన్ని ముద్దాడింది. దానికి అక్షరాలా సాక్షి మన జాతీయ పతాకమే!
అన్నీ అనుకున్నట్లుగానే జరిగాయి. చిన్న పొరపాటు కూడా జరగలేదు. కరతాళ ధ్వనులు మిన్నంటాయి.
ఇస్రో డైరెక్టర్ చిన్నారులకిది ఃఃమా కానుకఃః అని ప్రకటించాడు.
చంద్రి హాస్పత్రిలో ఉంది. వార్డు నంబర్ పదకొండు, బెడ్డు నంబర్ పద్నాలుగు. ఏమయ్యిందో ేఏమో….? అన్న ఇంటికి చేరిన రాత్రే కడుపులో విపరీతమైన నొప్పి వచ్చింది. మల్లేశం రెంట్‌కి ఉన్న ఇంటి యజమాని భార్యని సహాయం కోరాడు. తన ఇంట్లో ఆడమనిషి లేదు. బ్లీడింగు మొదలయ్యింది…. హాస్పత్రికి తీసుకెళ్దామని నిర్ణయం తీసుకున్నారు. మల్లేశం చెల్లెలి బాధని చూసి మరీ కంగారు పడిపోయాడు.
ఇంటి యజమాని కారు తీసాడు. చంద్రిని హాస్పత్రికి రాత్రికి రాత్రే తరలించారు.
ఆ పూట కేదో చికిత్స చేసి చంద్రికి కాస్త ఊరట కలిగించారు. మరునాడు పొద్దున డాక్టరు వచ్చి పూర్తి పరీక్షలు చేస్తారన్నారు.
రాజన్న, మల్లేశం ఆ వచ్చే ఉదయం కోసం ఆతురతతో ఎదురు చూసారు.
కాలెండర్లో తేది మారింది. స్టాఫ్ డ్యూటీలూ మారాయి.
ఆస్పత్రి ఆవరణలోంచి ఒక్కసారే అరుపులు వినబడ్డాయి. ఏదో హడావుడి, అలికిడి.. ఎవరికీ అర్ధం కాలేదు. జూనియర్ డాక్టర్లు సమ్మె ప్రకటించారని సూచనగా తెలిసింది. ఎవరో రాజకీయ నాయకుడు డ్యూటీలో ఉన్న డాక్టరుపై రాత్రి చేయి చేసుకున్నాడని….
చంద్రి బెడ్డు పైన మూలుగుతుంది. ఓ కొత్త కక్ష్యలోకి ప్రవేశించినట్లుగా ఉంది. అపరిచిత వాతావరణం, బెరుకుతనం, దిగులు…. బెంబేలు పడిపోతుంది.
హాస్పత్రిలో మనుషుల కదలికలు మరీ ఎక్కువయ్యాయి.
టీ.వి. ఛానల్స్ వారి హడావిడి.
గట్టిగా అరుపులు వినబడుతున్నాయి.
డౌన్… డౌన్…..
క్షమాపణలు….. చెప్పాలి….. క్షమా పణలు…… చెప్పాలి………
నినాదాలు…..
రోగులకి, వారి బంధువులకి……. అశక్తతని డ్రిప్ ద్వారా ఎక్కిస్తున్నట్లుగా ఉంది.
సాయంత్రం వరకు కాని పరిస్థితులు చక్కబడలేదు.
పంతాలు….. పట్టింపులు….. మంతనాలు….. రాజీలు….. డాక్టర్లు డ్యూటీల్లో చేరారు.
లేడీ డాక్టరు బెడ్డు ప్రక్కన పేషెంట్ రిజిస్ట్రేషన్ కాగితాన్ని చూస్తూ చంద్రిని పలకరించింది. పల్స్‌కోసమని చేతిని పట్టుకొంది.
మూన్ ఇంపాక్ట్ ప్రోబ్‌ని ఖచ్చితంగా మన శాస్త్రజ్ఞులు అనుకున్న ప్రాంతం- షాకిల్టన్ గోతిని తాకేలా చేసారు. ప్రోబ్ చంద్రయాన్-1 నుండి విడిపోయింది. తన పని పూర్తి చేసాక కొన్ని క్షణాలలోనే చిన్నా భిన్నమైపోయింది.
ఇస్రో శాస్త్రవేత్తలు ఇంత ఖచ్చితంగా ఎలా చేయగలిగారో? భూమిపైనే ఉంటూ అంతరిక్షంలో కదులుతున్న ఉపగ్రహాన్ని చెప్పినట్టు వినేలా, మాంత్రిక విన్యాసాలు చేయించడంలో ఎంతో నిపుణులయ్యారు.
చంద్రయాన్-1 తన పనులని సక్రమంగా చేస్తుంది. ఉపకరణాలు పని చేస్తున్నట్లు తాజా వార్తలు.. ప్రతి పదిన్నర గంటలకొకసారి చంద్రయాన్-1 చంద్రుని చుట్టు తిరుగుతోంది. ఇలా రెండు సంవత్సరాలు తిరుగుతూ ఉంటుందట.
దినపత్రిక చదువుతున్న మల్లేశానికి మన దేశంలో ప్రతి ఏటా 78,000 మహిళలు మాతృత్వ మరణానికి గురవు తున్నారన్న వార్తని చదువుతుంటే చెల్లి గుర్తుకొచ్చి ఏడుపు ఆగలేదు. పేపర్ని పక్కకు విసిరి ఃఃచంద్రిఃః అని అరుచుకుంటూ భోరున ఏడ్చాడు.
చంద్రి-1…. చంద్రి-2…. చంద్రి-3…. చంద్రి-4…. చంద్రి-78,000
ఈ చావులకి భారత ప్రభుత్వమే జవాబు చెప్పాలి.
రాజన్న చుట్టూ చంద్రి జ్ఞాపకాలు తిరుగుతున్నాయి.
ఆ తీపి జ్ఞాపకాలు రాజన్న చచ్చేెంత వరకు ఆయన చుట్టూ పరిభ్రమిస్తూనే ఉంటాయి.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags