(గత సంచిక తరువాయి…)
తొలిరోజుల్లో ఆయన పని నుండి వచ్చాక ”పార్క్‌కి వెళ్దాం పదండి” అనేదాన్ని. ”నువ్వు ఒక క్లర్కుని పెళ్ళి చేసుకుని
ఉండాల్సింది” అని ఆయన వెక్కిరించేవారు. ఫ్రాన్స్ నుండి తిరిగొచ్చాక ”వీకెండ్ (వారాంతానికి)కి బయటకు వెళ్దాం” అనేదాన్ని. ‘నేను ఇప్పటికే వీకయిపోయాను’ అని జవాబిచ్చేవారు. విదేశాల్లో వారాంతంలో పార్టీలు, పిక్నిక్‌లు నాకు మంచి ఆనందాన్నిచ్చేవి. మనకు భారతదేశంలో ఆ సంస్కృతి లేదు. కేవలం ఏవో కొత్త వంటలు వండుకుని, కొత్తవేవో తిని, అతిధులతో కూర్చుని గంటల తరబడి కబుర్లు చెప్పుకుంటూ గడిపేయడమే మనకు కావాల్సింది. ప్రయాణాలు, ప్రదేశాలు చూడటాలు మనకు నచ్చవు. ఆయన్ని నేను పీడిస్తే, మేము ఒకసారి కాశ్మీర్ వెళ్ళాము. ఆయన అక్కడ నీళ్ళకు భయపడి హౌస్ బోటు ఎక్కనన్నారు. ఆ పడవవాడు మనల్ని మోసం చేస్తాడు, మళ్ళీ మనం వాడికి ఇంకాస్త డబ్బులివ్వకపోతే తిరిగి ఒడ్డుకు తీసుకురానంటాడు అన్నారు. ఇతర పర్యాటకుల్ని చూడండి వాళ్ళంతా వెళ్ళొస్తున్నారు కదా అంటే వినరు. నాకు బాగా కోపం వచ్చింది. ఆయనతో మాట్లాడడం మానేశాను. నా కోసం ఆయన కొన్న శాలువా వాడడానికి నిరాకరించాను. ఒక చిన్న పిల్లలా ప్రవర్తించేదాన్ని. అప్పుడది అంతే. నేను దాని మీద కథ కూడా రాశాను. స్వర్గానికి పోయినా, సవతి పోరు తప్పదన్న సామెతలాగే ప్రేమికుల ఉద్యానవనానికి వెళ్ళినా సరదా లేదు. మనం ఇంటి దగ్గర ఉండి పోట్లాడుకుంటే బాగుండేది, ఆ విధంగా డబ్బులన్నా మిగిలేవి అని మా వారు అన్నారు.
మా ఆఫీసులో సెలవుల్లో ప్రయాణ రాయితీ (లీవ్ కన్సెషన్ ట్రాన్సాక్షన్-ఎల్టీసీ) అవకాశం ఉంది. ఆఫీసులో అందరూ, బంట్రోతులు కూడా ఆ అవకాశాన్ని వినియోగించుకుని కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా తిరిగి వచ్చేవారు. మనమెందుకు వెళ్ళలేము, అది అంతా
ఉచితంగానే కదా అంటే కానీ రిజర్వేషన్లు ఎవరు చేస్తారు అన్న సమస్యను ఆయన లేవదీసేవారు.
వాస్తవం ఏంటంటే ఆయన సమావేశాల కోసం ప్రయాణాలు బాగానే చేస్తారు. నేను ఎక్కడికీ వెళ్ళలేదు, ఏదీ చూడలేదు. నేనంటూ ఎక్కడికీ వెళ్ళలేదు. మా అన్నయ్య డెహ్రాడూన్‌లో ఉన్నప్పుడు అక్కడకు కొన్నాళ్ళు, తర్వాత విశాఖపట్నం, తిరుపతి వెళ్ళాను. నా బాధ ఏంటంటే మాకు అవకాశాలున్నా మేము వాడుకోలేకపోయామని. ఇంతా చేస్తే ఇవన్నీ యాత్రా పర్యటనలే, తీర్థయాత్రలు కావు. నేను కేరళలోని కోవళం సముద్రతీరం చూద్దామనుకున్నాను. తొలిరోజుల్లో ఆయన నన్ను బొంబాయ్, కలకత్తా తీసుకువెళ్ళారు. ఆఫీసు పనిమీద నేను బెంగుళూరు, చండీగడ్ వెళ్ళాను. వెనక్కి తిరిగి చూసుకుంటే ఆయన అప్పటికే చాలా తిరిగారు. కాబట్టి ఆయనకు ప్రయాణాలంటే అంత ఉత్సాహం లేదు. ఆయన ఈ పర్యటనల్ని ఎందుకు ఆనందించలేకపోయేవారో ఇప్పుడు నేను అర్థం చేసుకోగలను. మాకు ఆనందాల్నివ్వని పర్యటనల మీద డబ్బు ఎందుకు దండగ చేసుకోవడం. ఇప్పుడు నాకు అర్థమవుతోంది. మా వాదనలన్నింటిమీద నేను కథలు రాశాను. నిజానికి ప్రయాణాలు ఆయనకు ఇష్టం లేకపోవడమే కాక, అవి చాలా ఖర్చుతో కూడుకున్నవి కూడా. పైగా నడపవలసిన కుటుంబం
ఉంది. అందువల్ల మీ కోరికల్ని చంపుకోవడం నేర్చుకుని త్యాగాలు చేయాలి. వేదాంతం సైతం అదే చెబుతుంది కోరికల్ని జయించమని, జిడ్డు కృష్ణమూర్తి అనేవారు కోరికల్ని అర్థం చేసుకోవాలని.
మా వారు నా కోసం చింతించేవారు. ఆయన మంచి సంరక్షకులు. కానీ ఆయన నాకు ఎప్పుడూ ధైర్యాన్ని ఇవ్వలేదు. నిజానికి మౌలికంగా నేను చాలా మొండిదాన్ని. ఒక్కోసారి నాకు అనిపిస్తుంది ఆయన కలతలే నన్ను అంత మొండిదాన్ని చేశాయని. ఇప్పట్లా కాదు, అప్పట్లో నేను భయపడిపోలేదు. పని నుండి కాస్త ఆలస్యంగా వస్తే ఆయనకు బీపీ పెరిగిపోయేది. ఆయన ఆలస్యంగా ఇంటికి వస్తే మాత్రం ఏమీ కాదు. ఒక సమావేశంలో పాల్గొనేందుకు ఒకసారి నేను బెంగుళూరు వెళ్ళాను. మా వారు అక్కడ వారి అనుబంధ కార్యాలయాన్ని సంప్రదించి నా తిరుగు ప్రయాణం టికెట్ ఏర్పాటు చేయించారు. సమాపక సమావేశం చూసుకుని వద్దామని నేను అనుకున్నాను. కానీ దీనివల్ల ఉన్న టికెట్‌ను రద్దు చేసుకుని మర్నాడు విమానంలో తిరిగి రావాలి. నా ఉద్దేశ్యం ప్రకారం పనికిరాని ఖర్చు అది. మా వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దని ఆయన ఎప్పుడూ అనలేదు. కానీ ఎంతగానో సంకటంలో పడిపోయేవారు. అందుకని ముందుగానే నా తిరుగు ప్రయాణం టికెట్ తీసేసేవారు. ఇది నన్నెప్పుడూ ఆనందపరచలేదు. నిజానికి ఇది మా అందరికీ కోపం తెప్పించేది. మా అత్తగారు కూడా దాన్ని ప్రోత్సహించేవారు. మానసికంగా ఆయన నా మీద ఆధారపడ్డారు. నేనే వారికంటే ముందు పోతే ఆయన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని అప్పుడప్పుడూ అనుకునేదాన్ని. నాకు ఆయన లేకపోయినా, ఎవరో ఒకరు సమయం గడపడానికి, మాట్లాడడానికి అవసరం ఉన్నా నేను దాన్ని ఎదుర్కోగలుగుతున్నాను.
నన్ను అందులో వదిలేసి…
ఒకసారి నేను ఆయన్ని వదిలేద్దామనుకున్నాను. నాకంత కోపమొచ్చింది. అది రాత్రి సమయం. ఆయన నిద్రపోతున్నారు. ఒక దిండు తీసుకుని బాల్కనీలో చాలాసేపు నిల్చున్నాను. మేము పోట్లాడుకున్నా అదే గదిలో ఉండాలి. మాకు వేర్వేరు గదుల్లేవు. వేరుగా నిద్రించడం మాకు అలవాటు లేదు. పోట్లాట తర్వాత మా వాళ్ళ ఇంటికి వెళ్ళడం సరైన నిర్ణయం కాదు.
ఒకసారి ఆయన విజయవాడ వెళ్తున్నామన్నారు. నేనూ వస్తానన్నాను. ఆయనతో తీసుకువెళ్ళారు. కానీ ఒక మిత్రుల ఇంటిలో నన్ను దింపి ఆయన తన పనిమీద వెళ్ళిపోయారు. అక్కడ ఎక్కడా మేము తిరగలేదు, ఏదీ చూడలేదు. అప్పుడు నేను ఆయన మిత్రుల ఇళ్ళను చూసేందుకు కూడా పోలేదు. మా వాళ్ళు ఉన్న రాజమండ్రి అక్కడకు కేవలం మూడు, నాలుగు గంటల ప్రయాణం. దాంతో ఒకరోజు చిన్న సంచితో నేను రాజమండ్రి వెళ్ళాను. నన్నొక్కర్తినే చూసి మా నాన్నగారు ఆశ్చర్యపోయారు. ఎందుకిలా వచ్చావని ద్వారం దగ్గర నిల్చునే తీవ్రంగా అడిగారు.
ఆయన బహుశా అనుకుని ఉండవచ్చు నేను నా భర్తను వదిలేసి వచ్చేశానని. నేను వీథిలోనే నిల్చుని ఆయనకి సంజాయిషీ ఇచ్చుకోవలసి వచ్చింది. నేను ఆయన్ని సంతృప్తి పర్చేవరకూ నన్ను లోపలికి రానివ్వలేదు. ఆహ్వానం లేదు, కనికరాలు లేవు. నన్ను చూసిన ఉద్వేగం లేదు, ఒక తీవ్రమైన చూపు. ఆ క్షణమే నేను నిర్ణయించుకున్నాను, విడాకులు కనుక తీసుకుంటే మా వాళ్ళ ఇంటికి పోకూడదని.
అయినప్పటికీ మా అన్నయ్య విశాల హృదయుడు. మాకు పెళ్ళయిన కొత్తలో మా వారు తరచూ సిర్పూర్ కాగజ్‌నగర్ వెళ్ళేవారు. ఆయన లేనప్పుడు నేను మా అన్నయ్య దగ్గరకు వెళ్దామనుకున్నాను. మా అన్నయ్య ఇంటిలో వదిలి వెళ్ళమని మా వారిని బతిమాలాను.. అక్కడకు రాత్రి చేరుకున్నాము. నన్నక్కడ దించి ఆయన వెళ్ళిపోయారు, లోపలికి కూడా రాలేదు. మర్నాడు ఉదయమే వెళ్ళిపోదామనుకున్నాను కాబట్టి ఒక చిన్న బ్యాగ్ మాత్రమే తీసుకెళ్ళాను. మా అన్నయ్య పరిహాసంగా అడిగాడు – మీ వారితో గొడవపడి వచ్చేశావా ఏంటి? అప్పుడు నేను గ్రహించాను. భర్త లేకుండా మనవాళ్ళ ఇంటికైనా పోకూడదని. ఆ కారణంగా నేను మా వాళ్ళ ఇంటికి కానీ, మా అక్కల పిల్లల పెళ్ళిళ్ళకు కానీ పోలేదు. మా వారు ఎలాగూ రారు. నాకు ఒక్కర్తికీ వెళ్ళాలని లేదు. ఆ విధంగా అందర్నీ కలుకుసునే అవకాశం నేను కోల్పోయాను. నాకు బాధగా ఉండేది కానీ ఎన్నాళ్ళు అలా బాధపడుతూ ఉంటాము. మా కుటుంబం నన్ను అర్థం చేసుకుంది, నన్ను నా స్థితి అలా దూరం ఉంచుతుందనుకున్నారు. మా నాన్నగారు సైతం అన్నారు నువ్వు ఒక్కర్తివే ఎందుకు వెళ్ళాలి అని.
అప్పుడప్పుడూ స్థానిక స్నేహితుల్ని కలిసేదాన్ని కానీ అలా ఎన్నాళ్ళు? ప్రేమో, అనురాగం పేరుమీదో, మనం మన పిల్లల మీద భర్తమీద ఆశ్రితులమై పోతున్నాము.
మా వారు నన్నొక ద్వితీయశ్రేణి మనిషిలా చూస్తూ నిత్యం నాకు బోధించే ప్రయత్నం చేసేవారు. అవును నాకు వర్తమాన రాజకీయాల గురించి పెద్దగా తెలియదు. రాజకీయ వ్యవహారాల స్పృహ పెరిగేది. మన తోటివారు తమ భాగస్వాములతో కలిసి వాటిని చర్చించినప్పుడే కదా కానీ, మేము ఎప్పుడూ అది చేయలేదు. చర్చించుకోవలసిన విషయాలు చాలా ఉండేవి. ఆయన ఒక మేధావి. కానీ మేము ఎప్పుడూ కలిసి కూర్చుని మాట్లాడుకోలేదు. వాళ్ళంతా మాట్లాడుకున్నది విని నేనే నేర్చుకున్నాను.
స్త్రీల సమస్యల మీద నేను జిడ్డు కృష్ణమూర్తిని చదివాను. అది చాలా పనికొచ్చింది. ఢిల్లీలో వారి ఉపన్యాసాలకు హాజరయ్యాను. ఆయన ఆంగ్లంలో అద్బుతంగా ప్రసంగించారు. జిడ్డు జిడ్డు అని మా వారు నన్ను వేధించేవారు. నాకు జిడ్డు పులిమి, నన్ను చంపొద్దు అని ద్వంద్వార్ధాలతో మాట్లాడేవారు. ఇద్దరు వ్యక్తుల మధ్య అంతరాలు ఎప్పుడూ ఉంటాయి. ఏ ఇద్దరు వ్యక్తులూ ఒకటి కాదు. అది ఇప్పుడు నేను గ్రహించగలుగుతున్నాను. కొంత అర్థం లేనిది అది.
మా ఆఫీసులో గిరిజాకుమార్ అనే గంథ్రాలయాధికారి ఉండేవారు. కుమార్ చాలా ఖచ్చితమైనవారు, అందరూ ఆయన్ని గౌరవించేవారు. మా వారు నన్ను ఏడిపించేవారు, ”అతనికి భయపడి పనికి తొందర పడతావు” అని. ఆ ఆఫీసు విషయాలు నేను చెప్పడానికి ప్రయత్నిస్తే ఆయన చిరాకుపడేవారు. తానూ నాతో ఎప్పుడూ తన ఆఫీసు విషయాలు చర్చించేవారు కాదు. ఒక్కోమారు ఏవో చెప్పినా ఆ తరువాత అవి అడిగినపుడు అవి అంత ముఖ్యం కాదు అని కొట్టిపడేసేవారు. ఇరుగు పొరుగు వారి పట్ల ఆసక్తి గాని, వారితో నేను కలవడం గానీ ఇష్టం ఉండేది కాదు. మేము మాట్లాడుకోవలసినవి ఏమిటి? కవిత్వం, రాజకీయాలు వారికి నచ్చినవి. వేర్వేరు ప్రపంచాల్లో మేము ఉన్నట్టు, ఒక్కోమారు ”మీరెందుకు మాట్లాడరు?” అని అడిగితే వెంటనే ఆయన ”అయితే కెన్నడీ ఏమి అన్నారు?” అనేవారు.
మద్రాసులో నేను, ఓల్గా (స్త్రీ వాద రచయిత్రి) ఒకే గది పంచుకున్నప్పుడు కప్‌బోర్డుకు ఇరువైపులా పక్కలున్నాయి. చదువుకుని మన పక్కనే ఉన్న లైటు ఆర్పేసుకోవచ్చు. కానీ భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకోరు సరికదా చదువుకునేందుకు, లైటు వేసేందుకు లేదు. వేర్వేరు గదుల్లో ఉండనూ లేము. అన్ని విషయాలూ పురుషుడికి అనుకూలంగానే ఉండాలి.
నేను ఖచ్చితంగా అతని మార్గాన్నే అనుసరించాలి. అది చివరికొచ్చేసరికి మరీనూ. పక్క గదిలోనైనా నేను టి.వి. చూడలేను. అది ఆయనకు ఇబ్బంది కలిగిస్తుంది. నిద్ర వచ్చినా, రాకపోయినా రాత్రి 9.30కు టి.వి. ఆర్పేసి నిద్రపోవాలి ఆయనతోపాటు. మరో గదిలో నేను చదువుకోనూ లేను. సరే చేసేదేమీ లేక, నేను అది తేలికగా తీసుకున్నాను. ఎవరైనా సర్దుకోవాలి. మా అన్నయ్య శాస్త్రవేత్త. కానీ భార్యతో తాను హాయిగా గడిపేవాడు. జోకులు చెప్పుకుంటూ, వాళ్ళు ఆనందంగా గడిపేవారు. వాళ్ళు చర్చించుకునేవాళ్ళు, కానీ వాడికి మా వారిలా మగ మిత్రులుండేవారు కాదు. నేను నా మిత్రులందర్నీ వదిలేశాను. పాత మిత్రులకు రాయడం మానేశాను. పూర్తిగా ఇదే నా ప్రపంచం అనుకున్నాను. అయినా ఆయన్ని అన్ని వేళలా విసిగిస్తున్నానని ఫిర్యాదు చేసేవారు. నా విసుగుని, ఒంటరితనాన్ని సరిచేయడానికి కృష్ణమూర్తి బోధనలు నాకు సాయపడేవి. నాకు తెలుసు నేను నా మీదనే ఆధారపడాలి, ఇతరుల మీద కాదని. ఒకవైపు మా ఇద్దరి మధ్య దగ్గరితనం, మరోవైపు బోలెడంత దూరం. నేను ఎక్కడికైనా వెళ్తే ఆయన ఒక్కరూ ఉండలేరు, నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఎప్పుడొస్తావు అని అడిగేవారు. టైము చూసుకుంటూ ఉండేవారు. నేను ఆయనతో ”మీరు ఒక్కరూ ఉండలేరు, నేను ఉండగలను” అనేదాన్ని. ఆ తరువాత అలా అన్నందుకు నేను బాధపడ్డాను. బహుశా ఆయన లేకపోయినా నేను చూసుకోగలను అంటున్నానని ఆయన అనుకుని
ఉంటారు. అది మూడు నాలుగు సార్లు అన్నారు- మీలా కాదు నేను చూసుకోగలనని. ఈ ఆధారపడడం వల్ల నేను ఎక్కడకూ వెళ్ళలేకపోయేదాన్ని, ఆయన నాతో రారు. మా అత్తగారు పిలిస్తే నేను వంటగదిలో ఉన్నా నేను ఎక్కడికో బయటకు వెళ్ళిపోయినట్లు నాకోసం పెద్దగా అరిచేవారు. ఇద్దరికీ హై బీపీ. కానీ ఆయనకు నా పట్ల ఎంత చింత అంటే, నా మీదే ఆయన ఆధారపడ్డట్లు అభిప్రాయం కలిగించేవారు. బంధనంగా అది మారొచ్చు. ఆయన నువ్వు లేకుండ బతకలేరు, నువ్వే ఆయన పూర్తి ప్రపంచం అని మా వాళ్ళు అన్నారు.
”ఎవర్ని చేసుకోను?” అన్న కథ రాసినప్పుడు కూడా నేను మరొకరిని పెళ్ళి చేసుకుని ఉంటే ఎలా ఉండేది అని ఆలోచించాను. కానీ నాకు ఎప్పుడూ అనిపించేది ”కాదు, కాదు అది కాదు”, ఎంత చెప్పినా మా వారు నా అవసరాల పరంగా మారేవారు కూడా అని.
ఒక సమయంలో జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయంలో నాకు బస కేటాయించారు. అదే సమయంలో నేను ఫ్రాన్స్ వెళ్ళాల్సి వచ్చింది. నేను తిరిగొచ్చేవరకూ అది ఖాళీగానే ఉంచారు. మేము అందులోకి మారిపోయాము. పత్ర నిర్వహణ అధ్యయనం కోసం ఇండో-ఫ్రెంచ్ సాంస్కృతిక ఒప్పందం మీద నేను ఫ్రాన్స్ వెళ్ళాను. నన్ను ఫ్రెంచ్ మహిళలు అడిగారు, ”మీరంతా పతివ్రతలని అంటారు కదా, మీరు మీ భర్తతో కలిసి రాలేదేమిటి?” అని. నేను దానికి ”నా భర్త యునైటెడ్ స్టేట్స్ (అమెరికా) వెళ్ళినపుడు నన్ను తీసుకుని వెళ్ళలేదు. అందువల్ల నేను ఫ్రాన్స్‌కి ఒక్కదాన్నే వచ్చాను” అని చెప్పాను. ఫ్రెంచ్ వాళ్ళు మనం ఎప్పుడూ ఆధారపడేవాళ్ళమని అనుకుంటుంటారు. కానీ వాళ్ళకే వాళ్ళ భాగస్వామి వారిని ప్రేమిస్తున్నట్లు ఎప్పటికప్పుడు చెప్తూ ఉండాలి.
మా వారు నన్ను గౌరవించేవారు. నన్ను సంప్రదించేవారు కూడా. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన వాళ్ళింటికి వెళ్ళినపుడు వారి తల్లిదండ్రుల పరిస్థితి బాగోలేదు. ఆయన తల్లి గుండె రోగి. చూసేవాళ్ళెవరూ వాళ్ళకు లేరు. నాకు ఫోన్ చేసి నన్ను సంప్రదించారు. మనతో ఉండేందుకు నాతో వారిని తీసుకురావాలనుకుంటున్నాను ఏమంటావు? అని. నేను వాళ్ళను వెంటనే తీసుకురమ్మన్నాను. ఎవరినైనా డిన్నర్‌కి పిలిచినా ముందు నన్ను అడిగేవారు. అలాగే ఎవరినైనా వారితో తీసుకువస్తున్నా తెలియచేసేవారు. నా విషయానికి వస్తే నా చీరలు ఆయన ఎంపిక చేసేవారు. నాకంటే ఆయనకి మంచి అభిరుచి ఉంది. అందువల్ల నేను వాటికి ఒప్పుకునేదాన్ని. మా చెల్లెలు నాలా కాదు, తన బట్టలు తానే ఎంపిక చేసుకునేది. నాన్నగారిలా, మా వారు అంతా తనకే తెలుసనుకునేవారు. స్త్రీలకు ఏమి కావాలి, వాళ్ళు ఏమి వేసుకోవాలి, వాళ్ళకు ఏమి నప్పుతాయి వగైరా అన్నీ. నాకు నేను ఒక మంచి చీర ఎంచుకున్నా, మా వారు అది పనిమనిషిదిలా
ఉందని అనేవారు. మా వాళ్ళు ఇచ్చినవి వేసుకోవటం ఆయనకి నచ్చేది కాదు. అది మార్చేసేవరకూ సాధించేవారు.
ఆయన్ని తృప్తిపర్చడం నా ధర్మమని త్వరగానే తెలుసుకున్నాను. నా అభిరుచుల్ని ఆ ప్రకారంగా మార్చుకున్నాను. మా తోటికోడలికి నేను చీర తీసుకోవాలన్నా ఆయన అభిప్రాయం తీసుకొని కొనేదాన్ని. అందువల్ల ఆయన ఒక విధంగా నా బుర్ర పాడుచేసి నా మీద అధికారం చెలాయించేవారు. ప్రేమానురాగాలు వ్యక్తపరిచే వారిదైన ఒక పద్ధతి అది.
ఒకరోజు ఆయన దారుణంగా జబ్బు పడ్డారు. డాక్టర్ ఆయనకి ఆక్సిజన్, ప్రత్యేకమైన ఇంజక్షన్లు వెంటనే అవసరమన్నారు. అనేక ఆస్పత్రులలో ప్రయత్నించాం. చివరకు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు తీసుకువెళ్ళాము. అయిదు నక్షత్రాల ఆస్పత్రుల మీద మా అనుభవం బాగోలేదు, అక్కడికి తీసుకువెళ్ళొద్దని ఆయన నన్ను బ్రతిమాలారు. వాళ్ళు తనని చంపేస్తారని అన్నారు. కానీ మేము ఆయన్ని అలా వదిలేయలేక నిమ్స్‌లో చేర్చాము. అక్కడ ఆయన వెంటిలేటర్ గొట్టాల్ని పీకేసి ఇంటికి వెళ్ళిపోదామన్నారు. డాక్టర్లు ఆయనకి నచ్చచెప్పారు. ఒక గంటసేపు ఓర్చుకుంటే ఆ తర్వాత ఇంటికి పంపేస్తామన్నారు. ఒక గంటకోసం ఇంటికి వెళ్ళి ఆ తర్వాత తిరిగొస్తానని ఆయన అన్నారు. డాక్టర్లు చికిత్స చేస్తున్నప్పుడు ఈ గొట్టాలు ఎప్పుడు తీసేస్తారు అని అడుగుతుండేవారు. వాటివల్ల మాట్లాడలేకపోయేవారు. చిన్న నోట్‌పాడ్ మీద రాసేవారు. తన పర్సులో బంగారం నాణెం దొరికిందా అని ఒకసారి అడిగారు. ఆ తర్వాత అది ఇంటిలో దొరికింది. అది జర్మనీ నాణెం. మా వారు నాణేల్ని సేకరించేవారు. పూర్వ నవాబుల ఫోటోల్ని కూడా సేకరించారు. నాణెం ఉందని ఆయనకు చెప్పాను. పెట్టుబడులు ఫిక్స్‌డ్ డిపాజిట్ల లాంటివి మా ఇద్దరి పేర్ల మీద ఉన్నాయి, ఒక్కటి తప్ప. సమస్యల్ని ఊహించి మా వారు డబ్బు వాపసు తీసేసుకోమన్నారు. ఆ తర్వాత అవి ఇబ్బందుల్ని కలిగిస్తాయన్నారు. ఇది దానికి సమయం కాదని నేను అంగీకరించలేదు. కానీ, ఆయన పట్టుబట్టి నాతో తీయించేశారు. ఆయన అన్నింటికీ సిద్ధపడే ఉన్నారు. ఈ లోగా వారి పరిస్థితి బాగుపడుతున్నట్లుగానే నాకు అనిపించింది. ఆయన పోతారని నాకు అనిపించలేదు. తన గదికి, ఇంటికి ఎప్పుడు వెళ్తున్నామని అడుగుతూనే ఉండేవారు. ఎవరో డాక్టర్ మేము ఇంటి దగ్గరే ఆక్సిజన్ ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. మీరు ఎంత తొందరగా డిశ్చార్జ్ చేస్తే అంత తొందరగా మేము మా ఇంటికి తీసుకువెళ్తామని నేను అన్నాను. కానీ వాళ్ళు చేయలేదు. ఆయన తన పెద్ద చెల్లెల్ని బతిమాలుకుంటూ లేద్దామని ప్రయత్నిస్తూ వెనక్కి పడిపోయారు. ఆయన అంతగా బలహీనమైపోయారు. నేను మానసికంగా సిద్ధపడి ఏడ్వలేదు. కొన్ని రోజుల తర్వాత ఆయన కోమాలోకి వెళ్ళిపోయి స్మృతి కోల్పోయారు. డాక్టర్ నన్ను బయటికి పంపి, ఏవో ప్రయత్నాలు చేసి కాసేపటికి ఆయన మరణించినట్లు ప్రకటించారు.
నేను లోపలికెళ్ళాను. అప్పటికే వాళ్ళు ఆయనమీద తెల్లగుడ్డ కప్పి ట్రాలీ మీదకు చేర్చారు. నేను వారిని తర్వాత చూడొచ్చని ఇప్పుడు కాదని ఆస్పత్రి అధికారులు చెప్పారు. అంతలోనే శ్రద్దాంజలి ఘటించేందుకు వస్తున్నారంటూ అప్పటి ముఖ్యమంత్రి శ్రీ విజయభాస్కర రెడ్డి నుంచి ఫోనొచ్చింది. అది తెలిసిన వెంటనే ట్రాలీని వెనక్కి తిప్పి ఆయన ముఖం మీద కప్పిన గుడ్డను తీసి మృతదేహాన్ని మంచంమీదకు మార్చారు. అయితే ముఖ్యమంత్రి రాలేదు. ఆ తర్వాత హంగామా మొదలయింది. మేము ఆస్పత్రికి మా వ్యక్తిగత హోదాలో వెళ్ళాము. రూ.48000 బిల్లు చెల్లించాకే వారి మృతదేహాన్ని ఇస్తామన్నారు ఆస్పత్రి వారు. అప్పటికి నా దగ్గర అంత డబ్బు లేదు. మేము డబ్బు తెచ్చి చెల్లిస్తామని అధికారుల్ని ఒప్పించడానికి ప్రయత్నించాము. అయినా వారు లిఖితపూర్వకంగా హామీ ఇచ్చాకే మృతదేహాన్ని ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఆఖరికి ఆయన మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చాము. అప్పటివరకూ నేను ఏడవలేదు. నాలోనే అంతవరకూ అణచుకున్నాను. (అంతకు ముందు) ఒక డాక్టర్ నన్ను మీది ప్రేమ వివాహమా అని అడిగారు. ఎందుకలా అడుగుతున్నారని అంటే, ”ఆయన మిమ్మల్ని మంచం దగ్గర నుంచి కదలనిచ్చేవారు కాదు. మీరు బాత్‌రూమ్‌కి వెళ్ళినా మీరు ఎక్కడున్నారని అడిగేవారు” అన్నారు. అది ప్రేమ అవునో కాదో కానీ, మాది తప్పకుండా పెద్దలు కుదిర్చిన పెళ్ళి మాత్రం కాదు అన్నాను. ఆస్పత్రిలో ఉండగా మా ఆడపడుచు ఆయన దగ్గర
ఉంటానంది. ఆయన నేను ఉండాలన్నారు. ఈ హింస ఎన్నాళ్ళుంటుందని ఆయన అడుగుతూ ఉండేవారు. ఈ అయిదు నక్షత్రాల ఆస్పత్రులలో ఎవరైనా జాగ్రత్తగా ఉండాలని నేను అనుకుంటాను. ఆయనకు మొదట్లో చేసిన అన్ని పరీక్షలవల్ల ఆయన పట్ల ఆస్పత్రి వారు బాగానే శ్రద్ధ తీసుకుంటున్నారని అనుకున్నాను. బిల్లులు చూశాకనే నేను నిజాన్ని గ్రహించాను. మా వారు అనేవారు, ”ఆస్పత్రి ఖర్చులు భరించడానికి ఆయనకు కావాల్సింది ‘విల్ పవరే’ కాదు, ‘బిల్‌్ పవర్’ కూడా” అని. ఆ జోకులన్నీ ఆయన ఉన్నప్పుడు బాగుండేవి. కానీ నాకు ఇంటికొచ్చేశాక అనిపించింది, వాళ్ళు ఆయన్ని చంపేశారని. అయినా నేను ఏడవలేదు. మనమీద మనం జాలితోనే మనం ఏడుస్తామేమో అని ఎందుకో నాకు అనిపిస్తుంది. వచ్చిన సందర్శకులంతా అడిగేవారు ఏమయిందని, నేను వారికి చెప్పేదాన్ని. కానీ మా తోటికోడలు అనేది ఊరుకొమ్మని, మేమున్నాము కదా, కథంతా చెబుతామని అనేది. కానీ అదెలా? పత్రికలవారొస్తే ఫోటోలు ఎక్కడున్నాయో ఏమిటో నాకే తెలుసు. ఆయన భోగట్టా వారికి కావల్సి వస్తే నేనే కదా వారికి దాన్ని వెతికిపెట్టాలి. నేను ఒక మూలన కూర్చుని తలొంచుకుని ఏడుస్తూ ఎలా ఉండగలను? నాకు ఆయన ఇంట్లో ఉన్నట్లే అనిపించింది. వాళ్ళందరూ మంగళసూత్రాన్ని తీసేయాల్సిందేనని అంటే అవసరం లేకున్నా నేను నా మంగళసూత్రాన్ని తీసేశాను. మా మరిది, తోటికోడలు ఒక నెలపాటు ఇక్కడ నాతో ఉన్నారు. తర్వాత వారం రోజుల కోసం వారు నన్ను విశాఖపట్నం తీసుకువెళ్ళారు. నేను మామూలుగానే మాట్లాడుతుండడంతో నేను దాన్ని తేలికగానే తీసుకున్నానని వాళ్ళనుకున్నారు. అక్కడ ప్రఖ్యాత రచయిత కాళీపట్నం రామారావు గారు నన్ను చూడడానికొచ్చి ‘అమ్మా’ అనేసరికి నా కన్నీళ్ళు ఆగలేదు. నా పాత గాయాల్ని ఆయన కెలికినట్లయింది. వాళ్ళు ఎంతో నిర్ఘాంతపోయారు.
నేను అక్కడ ఆనందంగా ఉండలేకపోయాను. ఇక్కడకు వచ్చేసి, నా పనిలో నేను పడిపోయాకే నాకు ఉపశమనం కలిగింది. లోపల ఆయన పడుకున్నారని ఊహించుకునేదాన్ని. నా వాచీ చూసుకుంటూ ఇది ఆయనకు జ్యూస్ ఇచ్చే సమయం, కాఫీ ఇచ్చే వేళ అనుకుంటూ ఉండేదాన్ని. కర్టెన్లు కదిలితే ఆయన వచ్చారనుకునేదాన్ని. ఆయన గురించి నిరంతరం ఆలోచిస్తూ ఉండేదాన్ని. నేను టీవీ పెట్టుకుంటే నేను సుఖపడుతున్నానని ఆయన అనుకుంటారా? వంటగదిలోకి వెళ్ళి వండుకోవాలని ఉండేది కాదు. నా కోసం బ్రెడ్ తెచ్చుకుని కాస్త పాలు తాగేదాన్ని. నా మనసు సంకోచాలతోను, భయంతోనూ నిండి ఉండేది. నాకు చదువు జ్ఞానం ఉన్నప్పటికీ, ఇంటినుండి బయటకు వెళ్ళడం చాలా కష్టంగా ఉండేది. పొరుగు బ్రాహ్మణులు ఉదయం నా మొహం చూసి తిట్టుకుంటారేమోనని అనుకునేదాన్ని. నాకు నేనుగా వండుకోవడానికి కూడా భయపడేదాన్ని. ఆయన పోయాక నేను హాయిగా తింటున్నాను, తిరుగుతున్నాను అని జనం అనుకుంటారేమోనని అనుకునేదాన్ని. పని లేకుండా కూర్చోవడం నాకు ఎప్పుడూ నచ్చదు. అందువల్ల ఆయన స్మారక సంచిక తయారుచేస్తూ ఆయన గురించి ఆలోచిస్తూ ఆనందించేదాన్ని. మీకు చూపించిన ఆ సంచికకు నేనే సంపాదకురాల్ని. నేనొక్కదాన్నే
ఉండలేనని అందరూ అనుకునేవారు. కానీ ఆయన ప్రయాణాల్లో ఉన్నప్పుడు, వారి రాజకీయ మిత్రులతో మునిగిపోయినప్పుడు, నాకు ఒంటరిగా ఉండడం అలవాటయ్యింది. నా జీవితాన్ని ఆయనతో ముడివేసేసుకున్నా. మానసికంగా ఆయనమీద ఆధారపడలేదు. అది చాలా వ్యత్యాసాన్ని తీసుకొచ్చింది. (సమాప్తం…)