హేమలత పుట్ల స్మృతితో వచ్చిన ప్రత్యేక సంచిక చదివాను. కవయిత్రులు, రచయిత్రులు, ఆచార్యులు తమ తమ పరిచయాలను స్మరిస్తూ హేమలత వ్యక్తిత్వాన్ని సాహిత్య వ్యక్తిత్వాన్ని స్మరిస్తూ నివాళులు ఘటించారు. హేమలత సహచరుడు ఎండ్లూరి సుధాకర్ నాకు చాలా బాగా పరిచయం.
పుట్ల హేమలత పరిచయం కథలు, కవిత్వం వ్రాస్తుందని స్త్రీలు, దళితులపై జరిగే అన్యాయాలను సాహసంతో ఎదిరించే రచయిత్రి అని రచనల ద్వారా పరిచయం. ప్రరవే మొదట్లో జరిగిన రెండు సభల్లో హేమలత ప్రత్యక్షంగా పరిచయమైంది. ధైర్యంగా మాట్లాడుతుందని ఆమె గురించిన నా మొదటి అభిప్రాయం. తర్వాత ఆమె నవ్వుతూ పలుకరిస్తుందని, స్నేహంగా మాట్లాడుతుందని తెలుసుకున్నాను. అయితే ఆమె అంత మంచి రచయిత్రి, వక్త, కానీ ఆమెకు రావలసినంత గుర్తింపు రాలేదేమో అనుకున్నాను.
రచనలతో ఆగిపోలేదు హేమలత మన – బంగారుతీగ. వెబ్‌లో ‘తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశం మీద పరిశోధన చేసింది. ఇంకా అంతటితో ఆగిపోలేదు. స్త్రీలెవ్వరూ తొక్కని గడపను తొక్కి ”విహంగ” అనే పేరుతో వెబ్ పత్రికను ప్రారంభించి దానికి సంపాదకత్వం నిర్వహించింది. ఆధునిక యుగంలో మహిళలు కూడా సాంకేతిక రంగంలో నైపుణ్యం సాధించడంలో ఏమీ తక్కువ కాదని ముందుకు నడిచి చూపించింది. కొత్త తరంతో పోటీపడుతూ ఫేస్‌బుక్, గూగుల్ సమూహాలతో చాలా క్రియాశీలంగా ఆధునిక సాంకేతిక విద్యను అర్థం చేసుకుని అరచేతిలో పెట్టుకుంది. రచయిత్రులకు ఆధునికత అంటే ఏమిటో చూపించింది. తెలుగు విశ్వవిద్యాలయం బొమ్మూరు సాహిత్య పీఠంలో ఎన్నో సదస్సులు నిర్వహించింది. తన కార్యనిర్వహణ దక్షతను చూపించింది. దృఢ నిశ్చయం, ధైర్యం, సంకల్పబలంతో పాటు స్నేహ సౌశీల్యం కలిగిన మృదుభాషిణి హేమలత మరణంతో తెలుగు సాహిత్యం ఒక సాంకేతిక విద్యను ముందుకు నడిపించే శక్తిని కోల్పోయింది. మళ్ళీ ”విహంగ”ను ఎగురవేసేవాళ్ళు ఎప్పుడు జన్మిస్తారో తెలియదు.
హేమలత, సుధాకర్ వాళ్ళిద్దరి కుమార్తెలు మానస, మనోజ్ఞలు నలుగురూ సాహితీ సూత్రంతో బంధింపబడిన ప్రేమ నిండిన కుటుంబం. వాళ్ళకు హేమలత లేని లోటు ఎన్నడైనా తీరుతుందా? ఒకరికొకరు తండ్రీ కూతుళ్ళు సాంత్వనం పలుకుతూ, ముచ్చట్లు చెప్పుకుంటూ ఉంటారు. అయినా వాళ్ళకు కలిగిన లోటు తీరదు. అలా చెప్పుకుంటూ స్మరించుకుంటూ పోతూ పోతూ ఉంటే కాలమే వాళ్ళకు ఊరటనిస్తుంది. కానీ మరేదీ ఇవ్వలేని సంతాపం హేమలత మరణం. మానస మనోజ్ఞలు తమ తల్లిదండ్రుల నుంచి గొప్ప సాహిత్య రచనా నైపుణ్యాన్ని వారసత్వంగా పొందారు. ఆ వారసత్వంతోనే వాళ్ళు తమ తల్లి లేని లోటును తీర్చి తండ్రికి ఊరట కలిగిస్తారు.అవధుల్లేని దుఃఖానికి చెలియలి కట్టలు వేస్తారు. – ముదిగంటి సుజాతారెడ్డి, హైదరాబాద్