ఫ్రెండ్లీ పోలీసింగ్‌ అంటే… ఎలా ఉండాలి? -కొండవీటి సత్యవతి

నిన్న భూమిక హెల్ప్‌లైన్‌కి ఒక కాల్‌ వచ్చింది. అది ఒక పోలీస్‌ స్టేషన్‌కి సహాయం కోసం వచ్చిన ఒక మహిళలకి సంబంధించి వచ్చింది. ఆమె తొమ్మిది నెలల గర్భవతి. ఆమెకి తోడుగా 75 సంవత్సరాల పండు ముసలావిడ ఉన్నారు. అప్పటికి రెండు గంటలుగా ఆమె పోలీస్‌ స్టేషన్‌ బయట ఎండలో నిలబడి ఉంది. ఆ పోలీస్‌ స్టేషన్‌కి వేరే పనిమీద వెళ్ళిన ఒక స్టూడెంట్‌ మాకు ఫోన్‌ చేసి వివరాలు చెప్పింది. కేసు వివరాల్లోకి వెళ్తే తొమ్మిది నెలల గర్భంతో ఉన్న ఆమెను ఒక వ్యక్తి చాలాకాలంగా ఫోన్‌లో వేధిస్తున్నాడట. ఆమె భర్తకి అసభ్య మెసేజ్‌లు పంపించడం, ఆమెకి తనకి లైంగిక సంబంధం ఉందని, ఆమె కడుపులో బిడ్డకి తానే తండ్రినని, ఆమెను వదిలేయమని… ఇంకా రకరకాలుగా వేధిస్తున్నాడు. ఒకసారి ఆమె, ఆమె భర్తా అతన్ని పిలిచి మాట్లాడారట, వార్నింగ్‌ ఇచ్చారట. అయినా అతను మారలేదట. వాట్సాప్‌లో, ఫేస్‌బుక్‌లో మీ గురించి రాస్తాను, మీ ఫోటోలు మార్ఫింగ్‌ చేస్తానని బెదిరిస్తున్నాడట. ముందు సహకరించిన భర్త తర్వాత ఆమెనే తిట్టడం మొదలుపెట్టాడట. దీనిపై కంప్లెయింట్‌ ఇవ్వడానికి ఆమె పోలీస్‌ స్టేషన్‌కి వచ్చింది.

తొమ్మిది నెలల గర్భిణి. గంటల తరబడి ఎండలో నిలబడడం… కనీసం ఆమెను కూర్చోబెట్టి ప్రయారిటీగా మాట్లాడి, ఆమె కంప్లయింట్‌ని తీసుకుని వెంటనే పంపించేయాల్సిన పోలీసులు ఆమెపట్ల వ్యవహరించిన తీరు చాలా అమానవీయంగా ఉంది.

ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన తర్వాత కానీ వాళ్ళు ఆమెతో మాట్లాడలేదు. ఆ స్థితిలో ఆమె పోలీస్‌స్టేషన్‌కి రావాల్సిన అగత్యం ఏమొచ్చిందో విచారించలేదు. మూడు, నాలుగు గంటలపాటు తీవ్ర మానసిక వేదనతో పాటు నిలబడడం, కనీసం మంచినీళ్ళు తాగకపోవడంతో ఆమె పోలీస్‌ స్టేషన్‌ నుంచి హాస్పిటల్‌కి వెళ్ళాల్సి వచ్చింది. ఆమెకు సహాయంగా వచ్చిన 75 సంవత్సరాల వాళ్ళ అమ్మమ్మ ఇదంతా మేనేజ్‌ చేయాల్సి వచ్చింది.

పోలీసులను విమర్శించడానికి నేను ఇదంతా రాయలేదు. పోలీస్‌స్టేషన్లు మానవీయంగా, జెండర్‌ స్పృహతో ఎందుకుండాలో రాయాలని నా ఉద్దేశ్యం. రకరకాల సమస్యలతో, పోలీసులు తమ సమస్యలు వింటారు, పరిష్కారం చూపిస్తారనే ఆశతో, నమ్మకంతో ప్రజలు పోలీస్‌ స్టేషన్‌కి వస్తారు. ప్రజల రక్షణ కోసమే పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది కాబట్టి తమకొచ్చే ప్రతి చిన్న సమస్యకి స్టేషన్‌కి పరిగెత్తి వస్తారు. ముఖ్యంగా మహిళలు. మన దేశంలో స్త్రీల మీద జరుగుతున్న దాడులు, హింస, లైంగిక నేరాలు చాలా ప్రమాదకర స్థాయిలో పెరిగిపోతున్నాయి. గృహహింస స్త్రీల జీవితాలను ఏ స్థాయిలో అతలాకుతలం చేస్తున్నదో పోలీసులకు తెలియనిది కాదు. ప్రతిరోజూ ఎంతోమంది బాధిత మహిళలు పోలీస్‌ స్టేషన్లకు వస్తూనే ఉంటారు. సాధారణంగా మహిళలు తమకు తెలిసిన పద్ధతుల్లో తాము ఎదుర్కొనే గృహ హింసకు పరిష్కారాలు అన్వేషిస్తారు. కుటుంబ పెద్దలతో, కుల పెద్దలతో చెప్పుకుని భర్తని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. తాగి వచ్చి ఒళ్ళు హూనం చేస్తూ హింసిస్తున్నప్పుడు, తమ బ్రతుకు ప్రమాదంలో పడినప్పుడు రక్షణ కోసం పోలీసులను ఆశ్రయిస్తారు. పూర్వం స్టేషన్‌లకి రావడానికి భయపడేవారు. ప్రస్తుతం ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పేరుతో ప్రజలకి దగ్గరవుతూ తమ ముఖచిత్రాలను మార్చుకుంటున్న పోలీసుల దగ్గరకు రావడానికి, తమ సమస్యలను చెప్పుకోవడానికి ప్రజలు భయపడడంలేదు. పోలీస్‌ వ్యవస్థలో ఇదొక మంచి పరిణామం. అంతేకాదు ప్రజలతో మమేకమవ్వడానికి పోలీస్‌ వ్యవస్థ ఎన్నో కొత్త కొత్త కార్యక్రమాలను చేపట్టి అమలు చేస్తున్నారు. షీ టీమ్స్‌, మహిళా రక్షక్‌, సబల, చేరువ వంటి అనేక మంచి కార్యక్రమాలు ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా పనిచేస్తున్నాయి. అయితే పై స్థాయిలో ఉండే అధికారులకు కింది స్థాయిలో పనిచేసే సిబ్బంది ప్రవర్తన ఎలా ఉంటోంది, ఎలాంటి భాషను ప్రయోగిస్తున్నారు’, తమ వద్దకు వచ్చిన వారి పట్ల ఎలా వ్యవహరిస్తున్నారు లాంటి వాటి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునే వ్యవస్థ

ఉందో లేదో నాకు తెలియదు. పోలీసు వ్యవస్థ ప్రతిష్ట, గౌరవాల వ్యక్తీకరణకు కొలమానాలు పోలీస్‌ స్టేషన్‌లలో ఉండే వారి ప్రవర్తన, వారు వాడే భాష, జెండర్‌ సెన్సిటివిటీ, సామాజిక సమస్యల పట్ల అవగాహన, ముఖ్యంగా మహిళలు, పిల్లల పట్ల వారు వ్యవహరించే తీరు. ఇదే పోలీసుల వ్యవస్థ ముఖచిత్రాన్ని అద్దంలో చూపిస్తుంది.

మేము మహిళా కారాగారంలో పనిచేస్తున్నాం కాబట్టి వివిధ పోలీస్‌ స్టేషన్ల నుండి జైలుకొచ్చే ఖైదీలతో మాట్లాడే అవకాశం

ఉంది. చాలాసార్లు బలమైన గాయాలతో జైలుకొస్తారు. రెండు, మూడు రోజులు స్టేషన్లలో ఉండిపోయిన వారు వస్తారు. పోలీసులు మాట్లాడే భాష, వారి శరీర భాష ఇవన్నీ చెబుతారు. మేము చాలాసార్లు ఆయా పోలీస్‌ స్టేషన్లకి వెళ్ళి మాట్లాడిన సందర్భాలూ ఉన్నాయి. పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వ్యవస్థలో ఇలా జరగకూడదు కదా అని వాదించిన సందర్భాలూ ఉన్నాయి.

ఈ వ్యాసం మొదట్లో నేను ప్రస్తావించిన గర్భిణీ స్త్రీ అంశంతో మొదలుపెట్టి పోలీస్‌ స్టేషన్‌లు, జెండర్‌ స్పృహతో ఎలా

ఉండొచ్చు, ఉండాలి అనే విషయం మీద రాయాలనుకుంటున్నాను. ప్రస్తుతం పోలీస్‌ స్టేషన్‌లు ఆధునిక వసతులతో విశాలంగా

ఉంటున్నాయి. వనరులకు కూడా లోటు లేదు. స్త్రీలు, పిల్లలు, వృద్ధులు, శారీరక వైకల్యాలతో బాధపడేవారు తమ ఫిర్యాదులు దాఖలు చేసుకోవటానికి పోలీస్‌ స్టేషన్‌కి వచ్చినపుడు వారికి ప్రాధాన్యతనిస్తూ, వారు కూర్చోడానికి ఒక గదిని కేటాయించొచ్చు. అక్కడ

మంచినీళ్ళు ఏర్పాటు ఉండాలి. వారి సహాయం కోసం ఒక హోమ్‌ గార్డును అక్కడుండేలా చూడవచ్చు. వృద్ధులు వచ్చినపుడు వారిని ఎక్కువసేపు ఉంచకుండా పంపించివేసేలా చర్యలు తీసుకోవచ్చు. వారికి ఎన్నో వృద్దాప్య సంబంధ వ్యాధులుండొచ్చు, మందులు వేసుకోవాల్సి రావొచ్చు. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా. పోలీసులకు ఇవి అధిక భారం కలగించే అంశాలేమీ కాదు. వారి దృష్టి కోణాలకు సంబంధించిన అంశమిది.

చివరగా పోలీసులు వాడే భాష విషయంలో అధికార స్థాయిలో ఉన్నవారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అదే పోలీస్‌ స్టేషన్‌లో మహిళా సిబ్బంది కూడా ఉంటారనే స్పృహ తప్పకుండా కల్పించాలి. అన్ని స్థాయిల సిబ్బందికి జెండర్‌ ట్రయినింగ్‌ తప్పనిసరి చేయాలి. జెండర్‌ స్పృహతో, సున్నితంగా ఎందుకుండాలి, ప్రజలతో ఎలా వ్యవహరించాలి, పోలీస్‌ వ్యవస్థ ప్రతిష్ట ఇనుమడించేలా ఎలా పనిచేయాలి అనే అంశాలను జెండర్‌ ట్రయినింగ్‌లో అర్థం చేయిస్తారు. కాబట్టి ఈ ట్రెయినింగ్‌లు అందరికీ తప్పనిసరి కావాలి. ఈ ప్రయత్నాలన్నీ అమలైనపుడు నిజమైన పీపుల్స్‌ ఫ్రెండ్లీ పోలీస్‌ వ్యవస్థ ఏర్పడి ప్రజల ప్రేమాభిమానాలు చూరగొంటుంది.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.