ఈనాటికీ మంచి చదువరి కోటేశ్వరమ్మ. సాహిత్యం పట్ల, ఉద్యమాల పట్ల ఎంతో ఆసక్తి ఉండడమే కాక, సమాజం మార్పు కోసం పోరాడే వారందరూ తనవారే అనుకునే దృక్పథం ఆమెది.
‘నాకు నమ్మకముంది. మన రాజ్యం తప్పక వస్తుంది ఎప్పటికన్నా. నిరాశ పడకూడదు. ఎర్రజెండా పట్టుకున్నవాళ్ళంతా ఒకటి కావాలమ్మా”.
చీకట్లు ముసురుకుంటున్న ఆ సాయంత్రం వేళ మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ముడతలు పడ్డ తన బలహీనమైన చేతితో నా చేయి పట్టుకుని అన్నారు కోటేశ్వరమ్మ. ఎవరీ మనిషి? అపురూపంగా చేతులలోకి తీసుకున్న అరుణ పతాకం ముక్కలైనా, గాజు కెరటాల వెన్నెల సముద్రాల పాదాల చెంత భళ్ళున పగిలి చెదిరిపోయినా, గాయపడిన హృదయంతో, నెత్తురోడుతున్న పాదాలతో ఆశను, కలలను వదలక ప్రయాణాన్ని ఎక్కడా ఆపకుండా ముందుకు నడిచి వెళ్తున్న ఈ సాహసి ఎవరు?
నేను అడిగాను ”ఇంతటి జీవితేచ్ఛ, రేపటిపై ఆశ మీకు ఎక్కడినుంచి వచ్చాయి?”
”కమ్యూనిస్టు సిద్ధాంతం, పార్టీ, నేను కలిసి పనిచేసిన కామ్రేడ్స్, నా జీవితం, అనుభవాల వల్ల” అంది అమ్మమ్మ.
వృద్ధాప్యం శరీరానికే తప్ప ఆలోచనలకి అంటని ఆవిడ కళ్ళల్లో మెరుపులు, మొఖంపైన చెదరని చిరునవ్వు. ఆవిడలో అంతటి నిబ్బరాన్ని చూశాక, ఆ ఉద్యమం కోసం అమరులైన వాళ్ళు గుర్తుకొచ్చి దుఃఖం కలిగింది నాకు. చెమ్మగిల్లిన కళ్ళతో ఆవిడ చేతిని గట్టిగా పట్టుకున్నాను. ప్రశాంతమైన నవ్వు, నమ్మకం, ఆత్మవిశ్వాసం మూర్తీభవింఇన అరుదైన వ్యక్తి కదా కోటేశ్వరమ్మ అనుకున్నాను.
నిజంగానే ఎల్లలెరుగని నూతన విశ్వమానవులు ఉదయించే సామ్యవాద సమాజం కోసం కలలు కని, ప్రాణాలతో సహా తమ సర్వస్వాన్నీ అర్పించడానికి సిద్ధపడ్డ ఆ తరం నుండీ మనం నేర్చుకోవలసిన విషయాలు అనేకం ఉన్నాయి. కలిసినప్పుడల్లా మల్లు స్వరాజ్యం, సుగుణమ్మ, నంబూరి పరిపూర్ణ, లలితా జోషి… ఇలా ఆ తరానికి చెందిన వాళ్ళు ఎవరైనా సరే నా రాజకీయ అభిప్రాయాలు ఏమిటన్న దానితో ప్రమేయం లేకుండా ఆప్యాయంగా దగ్గరికి తీసుకుని మాట్లాడినపుడు మనమంతా ఒకటే అన్న భావనే వాళ్ళందరిలో కనపడేది నాకు. ఆ పాత తరం మహిళా కార్యకర్తలకు కమ్యూనిస్టులలోని శాఖా విభేదాల పట్ల అంతగా పట్టింపు లేకపోవడం ఒక నిజమైతే,
ఉద్యమాలు చీలికలు పీలికలై విడిపోవడం పట్ల వారిలో విపరీతమైన బాధ, కోపం ఉండడం మరో నిజం. ఏటికి ఎదురీదిన, చీకటిలో మిణుగురులను చూడగలిగిన, తుది శ్వాసవరకు ప్రజల పక్షాన నిలిచి పోరాడాలనే పట్టుదల కలిగిన ఆ తరానికి చెందిన వ్యక్తి కోటేశ్వరమ్మ.
కృష్ణాజిల్లా పామర్రులో ఎగువ మధ్య తరగతి కుటుంబంలో 1920 ప్రాంతంలో పుట్టిన కోటేశ్వరమ్మ తల్లిదండ్రులు అంజమ్మ, సుబ్బారెడ్డి గార్లు. ఒక తమ్ముడు. పేరు వెంకటరెడ్డి. ఇంటివద్ద సంగీతం నేర్చుకుని, శ్రావ్యంగా పాడుతూ బడిలోనూ చురుకైన విద్యార్థినిగా గుర్తింపు తెచ్చుకున్న కోటేశ్వరమ్మ సుమారు పదేళ్ళ వయసులోనే గాంధీగారు పామర్రుకి వచ్చినపుడు తన ఒంటిమీద ఉన్న నగలని ఒలిచి ఇచ్చేసింది. జాతీయోద్యమ ప్రభావంతో దేశభక్తి గీతాలను నేర్చుకుని సభల్లో పాడేది. ఆ ఆనందకర బాల్య జీవితంలో ఆమె జీవితాన్ని కుదిపేసిన మొదటి విషాదం తాను బాల వితంతువునని తెలియడం. సాటి పిల్లల అవహేళనలను తట్టుకోలేక ఎనిమిదవ తరగతిలోనే చదువు ఆపేసి, పూలు, బొట్టు పెట్టుకోవడం మానేసింది కోటేశ్వరమ్మ. కూతురి మీద ప్రేమతో ఆమె తల్లి కూడా మానేసింది. తన చివరి క్షణం వరకు కూతురుని అంటిపెట్టుకుని, ఆమె క్షేమం కోసం నిరంతరం తపించిన అరుదైన తల్లి అంజమ్మగారు. ఒక రకంగా చెప్పాలంటే ఆవిడా, కోటేశ్వరమ్మా కలిసే రాజకీయ ప్రయాణం చేశారు. జాతీయోద్యమ ప్రభావంతో ఇంట్లో రాట్నం తిప్పి నూలు వడకడమే కాదు, కోటేశ్వరమ్మ తండ్రి సంఘానికి, కట్టుబాట్లకు వెరచినా, సంస్కరణోద్యమం నుండి పొందిన ప్రేరణ వల్ల ఆయనకన్నా ధైర్యంగా, అభ్యుదయంగా ఆలోచించి కూతురికి పునర్వివాహం చేసేందుకు పూనుకున్నారావిడ.
కమ్యూనిస్టు భావజాలం ప్రభావానికి లోనైన యువతరం, నాయకులు అన్యాయాలకు వ్యతిరేకంగా గ్రామీణ ప్రాంతాలలో ప్రజలను సంంఘటితపరచడం మొదలుపెట్టిన కాలం అది. యువజన సంఘంలో పనిచేస్తున్న కొండపల్లి సీతారామయ్యతో కోటేశ్వరమ్మకి అనేక ప్రతికూల పరిస్థితుల మధ్య వివాహం జరిగింది. అత్తవారింట ఎదురైన అనుభవాలు ఆమెకు కుటుంబ వ్యవస్థలోని అసమ, ఆధిపత్య సంబంధాలను, కుల వివక్షలను మరింత బాగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయి. అప్పుడే కమ్యూనిస్టు సాహిత్యాన్ని చదవడం, వారి కార్యక్రమాల్లో తాను కూడా భాగస్వామి కావడం మొదలుపెట్టింది. కొంతకాలానికి కమ్యూనిస్టు పార్టీపైన ప్రభుత్వం నిషేధం విధించడంతో సీతారామయ్య అజ్ఞాతవాసంలోకి వెళ్ళాడు. జొన్నపాడులో కోటేశ్వరమ్మ ఒక్కతే ఆ నిర్బంధకాలంలో జీవించాల్సి వచ్చింది.
అప్పటిదాకా కోటేశ్వరమ్మకు అన్నివిధాలా అండగా నిలబడిన పుట్టింటివారు వ్యాపారంలో తీవ్రంగా నష్టపోయి ఆర్థికంగా అనేక ఇబ్బందులో ఇరుక్కొన్నారు. ఆ సమయంలోనే తల్లి అంజమ్మ కులం, ఊరు విధించే కట్టుబాట్లకన్నా కూతురే ముఖ్యమనుకొని కోటేశ్వరమ్మకి సహాయపడేందుకు ఆమె దగ్గరికి వచ్చేసింది. కొంతకాలానికి కమ్యూనిస్టు పార్టీమీద నిషేధాన్ని ఎత్తివేయడంతో, పార్టీ నిర్ణయం మేరకు విజయవాడలో ఉంటూ ప్రజా
ఉద్యమాలని నిర్మించేందుకు పూనుకొన్నాడు సీతారామయ్య. కోటేశ్వరమ్మ మకాం విజయవాడకు మారింది.
అనేక సామాజిక కట్టుబాట్లు, కుల, మతపర ఆంక్షలు, నిషేధాలు, పురుషాధిపత్యం ఉన్న ఆనాటి సమాజంలో ఆడవాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉండేది. స్త్రీ పురుష సమానతను కాంక్షించే కమ్యూనిస్టులు ఆ మార్పును తమ ఇండ్లనుంచే ప్రారంభించాలనుకున్నారు. నిజానికి అప్పటి కాలంకన్నా ఎంతో ముందున్నారు వాళ్ళు. తమ భార్యలు, అక్క చెల్లెళ్ళను ఉద్యమంలో భాగం చేశారు. దీనిలో ఆ స్త్రీలకున్న నిర్ణయాధికారం ఎంత అన్న ప్రశ్నలున్నప్పటికీ, ఈ క్రమం స్త్రీలు చైతన్యవంతులు కావడానికీ, అసమానత్వాన్ని, అన్యాయాలను ఎదిరించి నిలబడడానికి దోహదపడింది.
మానికొండ సూర్యావతి, తాపీ రాజమ్మ, కంభంపాటి మాణిక్యాంబ తదితరులతో కలిసి విజయవాడ వీథుల్లో తిరుగుతూ పార్టీ పత్రిక ప్రజాశక్తిని అమ్మటమే కాక, గ్రామీణ ప్రాంతాలలో వైజ్ఞానిక, సాంస్కృతిక అంశాల గురించి, స్త్రీల ఆరోగ్యం, పారిశుధ్యం వంటి విషయాల గురించి విస్తృతంగా ప్రచారం చేశారామె. స్త్రీలు వేదికలు ఎక్కి సాంస్కృతిక ప్రదర్శనలు ఇవ్వడాన్ని అసభ్యతగా భావించే ఆ కాలంలో కోటేశ్వరమ్మ, తాపీ రాజమ్మ, వీరమాచినేని సరోజిని, కొండేపూటి రాధ తదితరులు ఆ విలువలని ధిక్కరించి ప్రదర్శనలిచ్చారు. ప్రజారాజ్య మండలిలో ఒకరిగా కోటేశ్వరమ్మ అనేక ప్రదర్శనలలో ముఖ్య భూమికను పోషించటమే కాకుండా ప్రముఖుల ప్రశంసలను కూడా అందుకుంది. ప్రజా ఉద్యమాన్ని అడ్డుకునేందుకు భూస్వాములు, రౌడీలు, పోలీసులు సాగించిన దుష్ప్రచారాలను, భౌతిక దాడులను పార్టీతోపాటు ఈ మహిళా కార్యకర్తలు కూడా ధైర్యంగా ఎదుర్కొన్నారు.
”రక్త సంబంధాలకన్నా వర్గ సంబంధాలే మిన్న” అని భావించే కమ్యూనిస్టు కుటుంబాల మధ్య ఉండే ఆత్మీయ మైత్రీ సంబంధాలవల్ల , తోడుగా నిలబడ్డ తల్లి అండదండల వల్ల, అప్పటికే ఇద్దరు పిల్లల తల్లయినప్పటికీ కోటేశ్వరమ్మ ఎక్కడా వెనక్కి తగ్గకుండా పోరాటాల్లో పాల్గొంది.
మరి కొంతకాలానికి, తెలంగాణ సాయుధ పోరాటంపైన అమలవుతున్న నిర్బంధకాండ, ఆ పోరాటానికి అండదండగా నిలిచిన ఆంధ్ర ప్రాంతంపై కూడా విస్తరించింది. కమ్యూనిస్టు పార్టీపైన, దాని ప్రచురణపైన నిషేధం విధించి, కార్యకర్తలను, నాయకులను నిర్బంధించడమే కాకుండా కాల్చి చంపుతున్న కాలం అది. కోటేశ్వరమ్మ పనిచేస్తున్న మహిళా సంఘం వెలువరించే ఆంధ్ర మహిళా పత్రికను కూడా నిషేధించింది ప్రభుత్వం. ఈ నిర్బంధాలను, నిషేధాలను ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ వీథులలో వేలాదిమంది స్త్రీలు ఊరేగింపు చేశారు. పోలీసులు భాష్పవాయువు ప్రయోగించి, లాఠీచార్జి జరిపి వందలాది స్త్రీలను నందిగామ జైలుకు తరలించారు. నిర్బంధం కారణంగా, ఉద్యమం అవసరాల కోసం పురుషులు అజ్ఞాతవాసంలోకి వెళ్ళగా బయట బహిరంగంగా ఉంటూ పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్న మహిళా కార్యకర్తలకి రక్షణ కరువైంది. పోలీసులు, రౌడీ మూకల దాడులను, దౌర్జన్యాలను స్త్రీలు ఎదుర్కోవలసి వచ్చింది. ఈ నిర్బంధకాండకు భయపడి, స్వంత తల్లిదండ్రులు, తోబుట్టువులు సైతం కమ్యూనిస్టు స్త్రీలకు ఆశ్రయం ఇచ్చేందుకు భయపడేవారు. ఇలాంటి వాతావరణం మధ్యే కోటేశ్వరమ్మ పిల్లలని వదిలిపెట్టి, పార్టీ రహస్య నిర్మాణంలో భాగమైంది. అజ్ఞాత జీవితంలోకి వెళ్ళి, రహస్య స్థావరాల నిర్వహణ, పార్టీ డాక్యుమెంట్ల ప్రతుల తయారీ నుండి ఆయుధాల సరఫరా వరకు అత్యంత ప్రమాదకర పనులలో ప్రాణాలకు తెగించి పాలుపంచుకొంది. నాయకులు, తనతో పనిచేసిన సహచరులు దారుణంగా చంపబడడాన్ని చూస్తూ, వదిలి వచ్చిన పసిపిల్లలు, కన్నతల్లి జాడన్నా తెలియకుండా, ఈ పూట కలిసిన భర్త రేపటికి బతికి ఉంటాడో లేదో తెలియని స్థితిలో పనిచేయడం అంత సులువైన సంగతేమీ కాదు. పోలీసులకు పట్టుబడితే ఎదుర్కోవలసిన దారుణ హింస, మృత్యువు ఆమె తలపై నిత్యం వేలాడేకత్తిలా
ఉన్న ఆ సమయంలోనే, మరో రహస్య స్థావరం నిర్వహణలో ఉన్న తన తల్లినీ, పిల్లలను కలుసుకుంటుంది. వ్యక్తిగత జీవితాలకన్నా ఉద్యమాన్ని కాపాడుకోవడం ఎలా అన్నదే ఆ రోజు వాళ్ళ ముందున్న ముఖ్య సమస్య. అదే తమ కర్తవ్యంగా భావించారు వాళ్ళు.
ఆ రహస్య జీవితంలో తమతో పాటు పనిచేస్తున్న మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించిన పురుష కామ్రేడ్స్‌తో పాటు, సంస్కారవంతులు, ఉదారులు అయిన మగవాళ్ళని కూడా కోటేశ్వరమ్మ చూసింది.
తెలంగాణ సాయుధ పోరాటం దారుణమైన అణచివేతకు గురైన తర్వాత, అనేక అంతర్గత చర్చల అనంతరం పార్టీ పోరాట విరమణకు పిలుపునిచ్చింది. అజ్ఞాత జీవితం నుండి బయటకు వచ్చిన కోటేశ్వరమ్మ 1952, 1955లలో జరిగిన ఎన్నికలలో పార్టీ తరపున ప్రచారం చేసేందుకు ఇతర మహిళా కామ్రేడ్స్‌తో పాు అనేక ప్రాంతాలు తిరిగింది. ఆ సమయంలోనే తన సహచర కామ్రేడ్స్‌ను జ్ఞాపకం చేసుకుంటూ గీతాలను రాయడం మొదలుపెట్టింది.
అప్పటివరకు ఒకటిగా పనిచేసిన, ఎంతో స్నేహంగా మెలిగిన సహచరులు పార్టీలో సైద్దాంతిక విభేదాలు తలెత్తగానే ఒకరిపట్ల మరొకరు శత్రుపూరితంగా వ్యవహరించటం కోటేశ్వరమ్మను కలచివేసింది. పార్టీ వ్యక్తులు డాక్టర్ అచ్చమాంబ పట్ల వ్యవహరించిన తీరు ఆమెను చాలా బాధపెట్టింది. అదే సమయంలో ఆవిడ వ్యక్తిగత జీవితం అనేక ఆటుపోట్లకు గురయింది. పార్టీతో సీతారామయ్యకి ఏర్పడ్డ విభేదాలతో పాటు, మరొక యువతితో ఆయన పెంచుకున్న సాన్నిహిత్యం వారి జీవితాల్లో కల్లోలానికి కారణమయింది. పార్టీలో చీలికలు, ఆర్థిక ఇబ్బందులకు తోడు సీతారామయ్య వదిలి వెళ్ళిపోవడంతో కోటేశ్వరమ్మ ఒంటరిదయ్యింది. తనను తాను నిలబెట్టుకునేందుకు ఆర్థికంగా తన కాళ్ళమీద తాను నిలబడేందుకు ఎన్నడో వదిలేసిన చదువును ఆంధ్ర మహిళా సభలో చేరి కొనసాగించింది. అక్కడా సాంస్కృతిక కార్యక్రమాలలో, రేడియో నాటకాలలో పాలుపంచుకుంది. కథలు, కవితలు రాయడం మొదలుపెట్టింది.
చివరికి కాకినాడ పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టల్ మేట్రన్‌గా ఉద్యోగం వస్తే చేరింది. ఈ క్రమంలో అనివార్య పరిస్థితుల్లో ఇద్దరు పిల్లలూ, చదువుల నిమిత్తం వరంగల్‌లో ఉంటున్న సీతారామయ్య వద్దా, నాయనమ్మ వద్దా ఉండి చదువుకున్నారు. ఉద్యోగంవల్ల ఆర్థికంగా కొంత వెసులుబాటు చిక్కినా, పిల్లలకు దూరమైన వేదన జీవిత పర్యంతం ఆవిడని వీడలేదు. ఆ సమయంలో హాస్టల్ పిల్లలతో కలిసి ఉండడం, అరసం, సాహిత్య లహరి వంటి సాహిత్య సంస్థల కార్యక్రమాలలో పాల్గొనడం, రచనా వ్యాసంగం కోటేశ్వరమ్మకి కాస్త స్వాంతన చేకూర్చిన విషయాలు.
కమ్యూనిస్టు పార్టీలు విభేదాలతో చీలిపోవడంతో పాటు అంతవరకూ కలిసి పనిచేసిన మనుషుల మధ్య ఉండాల్సిన కనీస మానవ సంబంధాలు కూడా దూరం చేశాయని కోటేశ్వరమ్మ చాలా బాధపడింది. ఆ చీలికని జీర్ణించుకోలేక కోటేేశ్వరమ్మ రెండు పార్టీలకూ సభ్యత్వ రుసుమును పంపేది. ఎందుకంటే ఆమె ఎంతగానో ఇష్టపడే, గౌరవించే ఇద్దరు నాయకులు …చండ్ర రాజేశ్వరరావు సిపిఐలోను, సుందరయ్య సిపిఎమ్‌లోను ఉన్నారు మరి. అందరూ తనవారే అని కోటేశ్వరమ్మ అనుకున్నా, ఒక పార్టీ వారి ఇంటికెళితే మరొకరికి కోపం వచ్చిన సందర్భాలెన్నింటినో చూసింది. మగవాళ్ళకు మానన సంబంధాలకన్నా రాజకీయాలే ప్రధానం కనుక విడిపోయిన పార్టీలలోని మహిళా కామ్రేడ్స్ ఒకరినొకరు కలుసుకోవడాన్ని వాళ్ళు ఇష్టపడలేదేమో అనుకుంటుందామె ఒక సందర్భంలో.
వరంగల్ రీజియనల్ ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకుంటున్న కొడుకు చందు చదువును అర్థాంతరంగా వదిలేసి, చారుమజుందార్ రాజకీయాలలో చేరి పనిచేస్తున్న క్రమంలో అరెస్టయి, పార్వతీపురం కుట్ర కేసులో ఇరికించబడి, ఏడాది పాటు జైలులో ఉండి బెయిల్‌పైన బయటకు వచ్చి విజయవాడలో అమ్మమ్మతో పాటు ఉన్నాడు. కాకినాడ నుండి కోటేశ్వరమ్మ వస్తూ పోతూ ఆనందంగా గడిపిన కొన్ని దినాలవి. కేసు నిమిత్తం అని చెప్పి పోలీసులు ఇంటికి వచ్చి పార్వతీపురం తీసుకువెళ్ళిన చందు మరి తిరిగి రాలేదు. పోలీసులు చిత్రహింసలు పెట్టి చంపేసి, శవాన్ని సైతం మాయం చేశారు.
ఈ దుఃఖానికి తోడు మరికొంత కాలానికి కూతురు డాక్టర్ కరుణ సహచరుడిని కోల్పోయి పుట్టెడు దుఃఖంతో విజయవాడకు చేరుకుంది. తండ్రి పనిచేస్తున్న పీపుల్స్ వార్ పార్టీ కార్యకర్తలకు, సాహితీకారులకు, ప్రజాస్వామిక వాదులకు ఆమె ఇల్లే కేంద్రమయింది.
కష్టసుఖాలన్నింటా వెన్నంటి ఉండడమే కాకుండా అందరిచేతా గోర్కి అమ్మలా ప్రశంసించబడిన తల్లి అంజమ్మ మరణం, ఆ తరువాత కరుణ అకాల మరణం ఆమెను కుంగదీసినా, ఆ పెను తుపానులను కూడా తట్టుకుని నిలిచింది కోటేశ్వరమ్మ.
రాజకీయ విభేదాల కారణంగా తాను నిర్మించిన పార్టీ నుండే కొండపల్లి సీతారామయ్య బయటకు వచ్చి అరెస్టయి, జ్ఞాపకశక్తి దెబ్బ తిని, చివరకు మనవరాలి ఇంటికి చేరుకున్నాక, విడిపోయిన 36 ఏళ్ళ తర్వాత మళ్ళీ మొదటిసారి అతడిని చూసింది కోటేశ్వరమ్మ. జీవితం చిత్రమనిపించిందామెకు.
చండ్ర ాజేశ్వరరావు పేరుతో హైదరాబాద్‌లో నిర్మించిన వృద్ధాశ్రమంలో చేరి చదవటం, రాయటంలోనూ ఆ హోంలో తనతోపాటు నివసిస్తున్న వారికి చేతనైన సహాయం చేయడంలోనూ తృప్తిని వెతుక్కుంటున్న నమయంలో సీతారామయ్య మరణవార్త ఆమెకి చేరింది. ఇద్దరిమధ్యా వ్యక్తిగత దూరాలు ఎన్ని ఉన్నా, తనకు మొట్టమొదట ఉద్యమస్పూర్తినిచ్చిన కామ్రేడ్ సీతారామయ్యకి ఆమె విప్లవ జోహార్లు చెప్పి వృద్ధాశ్రమానికి తిరిగి వచ్చింది. కొంతకాలం తరువాత అక్కడినుండి వచ్చేసి, ప్రస్తుతం మనవరాళ్ళ వద్ద విశాఖపట్నంలో ఉంటున్న కోటేశ్వరమ్మది నిండు నూరేళ్ళ జీవితం.
ఆమె ఆత్మకథలో రాసుకున్నట్లు తనతో నడిచి వచ్చిన వారంతా వెళ్ళిపోగా, ఒంటరిగా మిగిలిన నిర్జన వారధి ఆమె. తన స్మృతుల నుండి వెలికివచ్చిన వెతల బతుకు గాధను, తాను భాగమైన సాగరమంత గొప్పదైన ఉద్యమ సంస్కృతిని, దాని నుండి
ఉదయించిన ఉన్నతమైన విలువలను భవిష్యత్ తరాలకు అందించాలనుకున్న కోటేశ్వరమ్మ జీవితం నుండి మనం నేర్చుకోవాల్సిన సంగతులు అనేకం. ఇన్ని ఒడిదుడుకులను, ఇంత దుఃఖాన్ని, ఇంత ఒంటరితనాన్ని భరించి కూడా అమ్మమ్మ ఎంతో సంయమనంతో తన జీవితం గురించి మాట్లాడుతూ ఉంటే విన్నాను నేను. ఎక్కడా ఎవరినీ తక్కువ చేసి మాట్లాడలేదు. తానొక ప్రేక్షకురాలిలలా నిలబడి, రాగద్వేషాలని జయించిన ధీరురాలిలా తన జీవితం గురించి చెబుతూ ”నాకు ఎవరిమీదా కోపం లేదమ్మా ఇప్పుడు” అంది.
వేదనామయ జీవితంలో ఆమెకి శాంతి సాహిత్యంలో దొరికింది. అక్షరాలలో సేదతీరిన కోటేశ్వరమ్మ నాలుగు పుస్తకాలలో తన సృజనను పదిలపరిచింది. అమ్మ చెప్పిన ఐదు (గేయ) కథలు, అశ్రు సమీక్షణం కవితా సంకలనం, సంఘమిత్ర కథా సంకలనం, నిర్జన వారధి పేరుతో ఆత్మకథ రాసారామె.
ఈనాటికీ మంచి చదువరి కోటేశ్వరమ్మ. సమకాలీన సాహిత్యం పట్ల, ఉద్యమాల పట్ల ఎంతో ఆసక్తి ఉండడమే కాక, సమాజం మార్పు కోసం పోరాడేవారందరూ తనవారే అనుకునే విశాల దృక్పథం ఆమెది. అందరితోనూ ఆప్యాయంగా మాట్లాడే అమ్మమ్మను ఇష్టపడని వారెవరూ ఉండరు. వ్యక్తితగతం అంటూ ఏమీ లేకుండా రాజకీయాలను, ఉద్యమాలనే జీవితంగా చేసుకుని బతికిన అమ్మమ్మలాంటి స్త్రీల జీవితాలు ఆ ఉద్యమాల వెనుక పట్టు పట్టినపుడు, ఆ రాజకీయాలు చీలికలకు గురయినప్పుడు చిన్నాభిన్నం అయిపోతాయి. సామూహిక ఉద్యమ జీవితం నుండి పొందిన చైతన్యం వల్ల వాళ్ళు మళ్ళీ సాధారణ జీవితంలోకి పోలేరు. పోయినా అక్కడ ఇమడడం కష్టం. స్త్రీలను ఉద్యమాలకు సహాయకులుగానేతప్ప నాయకులుగా, నిర్ణయాత్మక శక్తులుగా పరిగణించని రాజకీయ సంస్థలు వారికి తగిన చోటు సంస్థలలోనూ ఎన్నడూ కల్పించవు. ఈ స్థితి అనేకమంది స్త్రీ కార్యకర్తలకు ఆత్మహత్యాసదృశ్యంగా మారుతుంది. ఎటుపోవాలో, ఏం చేయాలో తెలియని ఇలాంటి పరిస్థితుల మధ్య సహచరుడు విడిపోయి, పిల్లలు దూరమై, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు, ఆప్తులంతా మరణించినప్పుడు, మరల మరల జీవితాన్ని పునర్నిర్మించుకోవాలన్న తెగువను ఆమెకు ఇచ్చినవి కూడా ఆమె విశ్వసించిన ఆ రాజకీయాలే. వ్యక్తిగతం, సామాజిక జీవితం కలగలిసిపోయిన వెలుగు చీకట్ల కంటకావృతమైన దారులలో ఆమె ఆత్మవిశ్వాసమే వెలుగై ఆమెకి దారి చూపింది. కష్టకాలంలోనూ, ఆత్మ గౌరవాన్నీ ఆశావహ దృక్పథాన్ని ఆమె ఎన్నడూ వీడలేదు. అనేక ఆటుపోట్ల మధ్య కూడా కలలు కనగల శక్తిని ఆమె ఎన్నడూ కోల్పోలేదు. తన వైయుక్తిక విషాదాలను తనలోనే దాచుకుని, చుట్టూ ఉన్న మనుష్యులను, పిల్లలను, మొక్కలను ప్రేమించటం, తనకు చేతనైన సహాయాన్ని ఇతరులకు చేయడం తన జీవన విధానంగా ఆమె మలచుకుంది.
అన్నింటికన్నా మిన్నగా ఆమె జీవిత పర్యంతం పీడిత ప్రజల పక్షాన నిలిచింది. తాను నడిచివచ్చిన దారిని ఎన్నటికీ మరువని అమ్మమ్మ, నూతన తరాలన్నా తాము కలలు కన్న సమసమాజాన్ని తీసుకురాగలవన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తుంది. ఆమె నుండి మన తరం నేర్చుకోవాల్సిన విలువైన సంగతులు ఇవే.
అమ్మమ్మలాంటి స్త్రీలు చేసిన పోరాటాల వల్లే మనం ఇవ్వాళ ఇలా ఉండగలిగాం. వాళ్ళు వేసిన పునాదులను మర్చిపోతే చరిత్ర మనల్ని ఎప్పటికీ క్షమించదు. కోటేశ్వరమ్మ వందేళ్ళ సజీవ అనుభవాలు, జ్ఞాపకాలు స్త్రీల చరిత్రలలో చిరస్మరణీయంగా నిలిచిపోయే ఒక విలువైన శకలం అవుతుందనడంలో సందేహం లేదు.
కోటేశ్వరమ్మ నడిచి వచ్చిన దారులను, చెదరని ఆమె పాదముద్రల జాడలను, అనుభవాలను, జ్ఞాపకాలను పంచుకునేందుకు ఆగస్టు ఐదవ తేదీ విశాఖ వేదిక కానుంది. వందేళ్ళ ఆమె స్ఫూర్తిదాయక సాహస జీవిత గాథ ముందు తరాలకు ఎన్నో విలువైన అనుభవాలను అందించగలదు. (సారంగ వెబ్ మ్యాగజైన్)