నల్లమల మా తల్లి, వదిలేది లేదు… వీడేది లేదు – సత్యవతి

”యురేనియం” అంటే ఏమిటి? జూలై 27వ తేదీన మేమందరం నల్లమల అడవి ప్రాంతంలోని మన్ననూరు, ఆమ్రాబాద్‌ మండలాల్లోని గ్రామాల్లో తిరుగుతూ పదే పదే యురేనియం పదాన్ని వాడుతున్నప్పుడు నా ప్రక్కన కూర్చున్న ఒకమ్మాయి నన్నడిగింది. మేము అప్పటికే నాలుగైదు గ్రామాల్లో మాట్లాడాం. ”యురేనియం” అంటే ఏమని చెప్పను? రెండో ప్రపంచం యుద్ధంలో అమెరికా అమానుషంగా జపాన్‌ మీద ప్రయోగించిన ఆటంబాంబు అని చెప్పనా? హిరోషిమా, నాగసాకి అనే రెండు పట్టణాలు ఆ అణుబాంబువల్ల భస్మీపటలమై, లక్షలాది మంది ప్రజలు చనిపోయారని, ఇప్పటికీ రేడియో ధార్మికత ప్రభావం ఆ ప్రాంతాలమీద ఉందని చెప్పనా? ఝార్ఖండ్‌లోని జాదుగూడ యురేనియం ప్లాంట్‌ ఆ ప్రాంత ప్రజల్ని, ముఖ్యంగా ఆదివాసుల్ని పీల్చి పిప్పి చేస్తున్న వైనాన్ని చెప్పనా?

‘యురేనియం’ అంటే మీరంతా నల్లమల అడవుల్లోంచి, మీ ఊర్లోంచి, మీ ఇంట్లోంచి గెంటేయబడడం” అన్నాను. ”మేమేడికి పోతాం, ఎందుకు పోం. మేం నల్లమల వదిలి పోం” అందా అమ్మాయి వెంటనే. మా మీటింగ్‌ ముగిసింది. ”మేం నల్లమలని విడిచి పోపం. మా చావు, మా బతుకూ, మా నవ్వూ, మా ఏడుపూ అన్నీ నల్లమల అడవే. మేము చచ్చినా సరే ఇక్కడి నుంచి కదలం”. వారి సామూహిక ప్రకటనలో నా పక్కన కూర్చున్న అమ్మాయి గొంతు కలిపింది.

జూలై 27వ తేదీన మహిళా సంఘాల ఐక్య వేదిక నుండి పదకొండు మందిమి నల్లమలకు బయలుదేరాం. నల్లమల అడవిలో యురేనియం తవ్వకాలకు ప్రభుత్వాలు అనుమతులిచ్చాయనే వార్త వెలువడిన అనంతరం మేం అక్కడి ప్రజలతో ముఖ్యంగా నల్లమల నిండా నివసిస్తున్న చెంచులను కలవాలని, వారి మనోగతాలను, వారి ఆలోచనలను, వారి ప్రతిస్పందనలను వినాలని అనుకున్నాం. మన్ననూర్‌, ఆమ్రాబాద్‌ మండలాల్లోని చాలా గ్రామాలు తిరిగాం. వెళ్ళిన ప్రతిచోటా ఎక్కడ పదిమంది నిలబడి ఉంటే అక్కడే నిలబడి వాళ్ళతో మాట్లాడాం.

”ఈ యురేనియం గురించి చాలా సంవత్సరాలుగా వింటున్నాం. నీళ్ళ కోసమంటూ 4000 బోర్లేశారు. అవెందుకేశారో ఆ తర్వాత మాకు తెలిసింది. ఈ మధ్య హెలికాఫ్టర్‌తో సర్వే చేశారు. మా తలల మీదుగా హెలికాఫ్టర్‌ తిరుగుతుంటే ఎందుకో అప్పుడు తెలవలేదు. ఇప్పుడు అర్థమైంది. నల్లమల మా తల్లి. అడవి మా జీవనం. మమ్మల్ని అడవి నుండి పొమ్మనే హక్కు ఎవరికీ లేదు. మేం నల్లమల వదలం. మా గ్రామం వదలం. మా ఇంటిని వదలం.” వటవర్లపల్లిలో ఓ యువకుడు ఆవేశంగా చెప్పాడు.

”నేను పుట్టినా చచ్చినా ఈ అడవిలోనే. నాకెవరూ లేరు. అడవిలో దొరికే కాయ, కమ్మ అమ్ముకుని బతుకుతున్నాను. అడవి వదిలితే నేను బతకలేను. నేనెక్కడికీ పోను” ఆ అవ్వ గొంతులోని దుఃఖజీర మనసును కదిలించింది.

ఇలా ఎవరిని కదిలించినా ఏం జరుగుతోందో తెలియని ఒక అభద్రత, భయం. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోవడం, స్థానిక ఎమ్మెల్యే ఏం కాదు, నేను భరోసా ఇస్తున్నాను కదా అంటున్నాడు కానీ వాళ్ళకి నమ్మకం కలగడం లేదు. ఏమి చెయ్యాలో పాలుపోవడం లేదు. ఒక ఆందోళన వాళ్ళల్లో రగులుకుంటోంది. ఇది ఏ రూపం తీసుకుంటుందో త్వరలోనే కనిపిస్తుంది. మేము ఆ గ్రామాల్లో తిరుగుతున్నప్పుడే శ్రీశైలం రోడ్డు మీద రాస్తారోకో నిర్వహించారు. ”నల్లమలని రక్షించుకుంటాం. ఇక్కడి నుండి కదిలేది లేదు” అంటూ నినాదాలతో హోరెత్తించారు. పోరాటం తీవ్రమయ్యే సూచనలే కనిపిస్తున్నాయి.

నిజానికి ప్రపంచవ్యాప్తంగా అణుపదార్ధాల ఉత్పత్తికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఊపందుకుంటున్న వేళ, చెర్నోబిల్‌, ఫుకుషిమాలో అణు రియాక్టర్లు పేలిపోయి ఎలాంటి భయంకర రేడియో ధార్మికత వివిధ రూపాల ద్వారా ప్రజానీకం మీద దాడి చేశాక కూడా ప్రభుత్వాలు యురేనియం వేటకి తయారవ్వడం తీవ్ర దిగ్భ్రమని కలిగించక మానదు. యురేనియం తవ్వకాల వల్ల ఝార్ఖండ్‌లోని జాదుగూడలో ఆదివాసులు ఎదుర్కొంటున్న తీవ్ర అనారోగ్య సమస్యలు కళ్ళముందు కనిపిస్తున్నాయి. విజృంభించిన క్యాన్సర్లు, అవిటితనాలు, బ్లడ్‌ డిజార్డర్లు, ఒకే కన్నుతో పుట్టడం, పెద్ద పెద్ద తలకాయలు… ఇలా ఎన్నో భయంకర వ్యాధులు, శారీరక, మానసిక వికలాంగత్వం జాదుగూడలో యురేనియం తవ్వకాలు సృష్టించిన విలయం పూర్తవలేదు, ఇంకా కొనసాగుతోంది. ”బుద్ధా వీప్స్‌ ఇన్‌ జాదుగూడ” లాంటి డాక్యుమెంటరీలు జాదుగుడాలో యురేనియం తవ్వకాల విధ్వంసాన్ని రికార్డు చేశాయి. అయినా ప్రభుత్వాలు ఎందుకు తవ్వకాలకు అనుమతులిస్తున్నాయ్‌?

తెలుగు రాష్ట్రాలకు ఊపిరితిత్తుల్లాంటి నల్లమల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాలు మొదలుపెడితే జరిగే అనర్థం చాలా తీవ్రమైంది. నల్లమలలో వందల సంవత్సరాలుగా నివాసముంటున్న చెంచుల జీవితాలు అస్తవ్యస్తమౌతాయి. అడవుల్లో తప్ప బతకలేని చెంచుల్ని బలవంతంగా మైదానాలకు తరలిస్తే చెంచు జాతి అంతమయ్యే ప్రమాదం ఉంది. నీళ్ళల్లోంచి బయటపడేసిన చేపల్లా వాళ్ళ జీవితాలు ఉక్కిరిబిక్కిరి అయిపోతాయి. రెండో అంశం నల్లమల మీదుగా ప్రవహిస్తున్న కృష్ణానది, కృష్ణా పరీవాహక ప్రాంతం. కోట్ల సంవత్సరాలుగా భూమి పొరల్లో నిక్షిపమై ఉన్న యురేనియం వల్ల మానవాళికి ఎలాంటి ప్రమాదమూ లేదు. ఒకసారి భూమి పొరల్ని చీల్చి టన్నుల కొద్దీ మట్టిని తవ్విపోసి, యురేనియంని వెలికితీశాక జరిగే మొత్తం ప్రాసెస్‌లో యురేనియం అణుధార్మిక నీళ్ళల్లోకి, గాలిలోకి వ్యాపిస్తుంది. టెయిల్‌ పాండ్లు నిర్మించి వ్యర్థాలను నిలవ ఉంచుతాం, ఒక్క చుక్క కూడా బయటకు రాదు అని చెబుతారు కానీ వర్షాకాలంలో ఈ పాండ్‌లు పొంగి పొర్లే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ వ్యర్థాలు బయటికి వస్తే కృష్ణా పరీవాహక ప్రాంతమంతా కలుషితమవుతుంది. ఇప్పుడు కృష్ణా గోదావరి నదుల అనుసంధానం జరిగింది. అంటే గోదావరి నీరు కూడా యురేనియం అణుధార్మికతతో కలుషితమవుతుంది. తెలుగు రాష్ట్రాలకు జీవనాడులైన రెండు జీవనదుల్ని కలుషితం చేయబోతున్న యురేనియం తవ్వకాలవల్ల ఒరిగేది ఏంటయా అంటే… అణువిద్యుత్‌ కోసం, బాంబుల కోసం, రాకెట్ల తయారీ కోసం మాత్రమే యురేనియం మైనింగ్‌ జరుగుతుంది. భారతదేశంలాంటి దేశంలో ప్రత్యామ్నాయ విద్యుత్‌ చౌకగా అందుబాటులోకి తెచ్చుకోగలిగిన పద్ధతులున్నాయి. 365 రోజులూ సూర్మరశ్మి అందుబాటులో ఉంటుంది. ఎక్కడికక్కడ సోలార్‌ ఎనర్జీని తయారు చేసుకోవచ్చు. దాదాపు 1000 కిలో మీటర్ల తీరప్రాంతముంది. విండ్‌ మిల్స్‌ ద్వారా కూడా విద్యుత్‌ తయారు చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు ఆ దిశగా ఆలోచించకుండా పర్యావరణానికి, ఆదివాసులకి మరణ శాసనాలు విధిస్తున్నాయి. పచ్చటి అడవుల్ని నాశనం చేయబోతున్నాయి. అడవిలో ఉండే జీవ వైవిధ్యాన్ని సమూలంగా చిదిమేయబోతున్నాయి. భవిష్యత్తరాల ప్రజలకి తీవ్ర అన్యాయం తలపెడుతున్నాయి.

నల్లమల అడవిలో గుర్తించిన ప్రాంతంలో భూమిని తవ్విపోసి, ముడి ఖనిజం వెలికితీసి, దాన్నుంచి 15 శాతం మాత్రమే యురేనియాన్ని తీస్తారు. మిగతా 85% యురేనియం వ్యర్థాలను టెయిల్‌ పాండ్స్‌లో నిల్వ చేస్తారు. ఈ టెయిల్‌ పాండ్స్‌ని యు.సి.సి.ఎల్‌. కంపెనీ 20 సంవత్సరాలపాటు భద్రంగా ఉండేట్టు చూస్తుంది. ఆ తర్వాత అది వదిలేసిన టెయిల్‌పాండ్‌ ఎవరి అజమాయిషీలోనూ

ఉండదు. యురేనియం అణుధార్మికత ప్రభావం వేలాది సంవత్సరాలుంటుంది. జాదుగూడాలో ఇలా వదిలేసిన టెయిల్‌ పాండ్స్‌ సృష్టిస్తున్న విధ్వంసం ఇంతా అంతా కాదు.

నిజానికి ఆ ప్రమాదం నల్లమల వాసులకే కాదు జరగబోతున్నది మనందరికీ కూడా. రెండు రాష్ట్రాల్లోని ఐదు జిల్లాల ప్రజలకు పెనుముప్పుగా మారబోతున్న నల్లమలలో యురేనియం తవ్వకాలను ఐక్యంగా అందరం అడ్డుకోవాల్సిందే. ఐక్య కార్యాచరణలోకి దిగాల్సిందే.

”నల్లమల మా తల్లి. మేం వదలం. ఎక్కడికీ వెళ్ళం” అంటూ నినదిస్తున్న ఆ ప్రాంత వాసులతో గొంతు కలిపి నినదించడమే మన ముందున్న తక్షణ కర్తవ్యం.

Share
This entry was posted in సంపాదకీయం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.