కొండాపూర్ వెళ్ళాలి, ఛాయాదేవి గారితో కొంత సమయం గడపాలనే ఉత్సాహానికి ముగింపు పలికి మూడు నెలలు దాటిపోతోంది. ”సారీ! మీరేదైనా పనిలో ఉన్నారేమో! ఫోన్ చేసి డిస్టర్బ్ చేసాను” అంటూ మొదలయ్యే ఆవిడ టెలిఫోన్ సంభాషణ మూగపోయింది. కొండాపూర్ వైపు వెళితే ఆవిడ ఉండే సి.ఆర్.ఫౌండేషన్ వేపు పడే అడుగులు హఠాత్తుగా ఆగిపోయాయి. కానీ ఆవిడ జ్ఞాపకాలు, ఆవిడ చమత్కరించే జోక్స్, ఆవిడ జీవన విధానం మనసులో అలాగే ముద్రించుకుపోయి ఉన్నాయి. అంత తొందరగా మరుపు పొరల్లోకి జారే వ్యక్తి కాదు. వ్యక్తిత్వమూ కాదు ఛాయాదేవిగారిది.
ఛాయాదేవిగారి ప్రత్యేక సంచికగా భూమికను తీసుకురావాలని అనుకున్నప్పుడు, అక్టోబరు 13 తన పుట్టిన రోజునాడు ఆవిష్కరించాలని, అందరినీ పిలిచి తన పేరు మీద భూమిక అలంకరించిన గదిని చూపించాలని అనిపించింది. ప్రస్తుతం ప్రత్యేక సంచిక తయారైంది. ఛాయాదేవిగారి గది రెడీయ్యింది. నా కిష్టంలేని ఒక పని మిగిలి ఉంది. ఆవిడ తన బ్యాంకు డిపాజిట్లను ఎవరెవరికి అందించాలని నన్ను కోరారో వారందరికీ ఇచ్చేసాను. వారందరూ డబ్బుగా మార్చుకుని ఉంటారు కూడా. అయితే నాకు వద్దని ఎంత చెప్పిన వినకుండా ఎనిమిది లక్షలు నా పేరు మీద ఫిక్సిడ్ డిపాజిట్ చేసారు. నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు. మొదట నా కప్పగించిన బ్యాంకు డిపాజిట్‌లలో నాపేరు లేదు. హమ్మయ్య అనుకున్నాను. అయితే 2018లో ఆవిడ నామినీల పేర్లు మార్చారని, నాపేరు మీద ఎనిమిది లక్షలకు ఫిక్సడ్ డిపాజిట్ ఉందని, బ్యాంక్ మేనేజర్ చెప్పినపుడు నాకు చాలా బాధన్పించింది. కూతురుగా భావించడమంటే ఇదేనా? కానీ నాకు వ్యక్తిగతంగా ఆ డబ్బుతో అవసరం లేదు. భూమికను దృష్టిలో పెట్టుకునే ఆ ఫిక్సడ్ డిపాజిట్ చేసి
ఉంటారు. ఆవిడకి భూమికంటే చాలా ప్రేమ. కానీ ఆ సొమ్మును భూమికు కూడా ఉపయోగించదలుచుకోలేదు.
ప్రతి సంవత్సరం ఛాయాదేవి గారి స్మారక ఉపన్యాసంతో పాటు, జాతీయ స్థాయిలో కానీ, రెండు తెలుగు రాష్ట్రాల స్థాయిల్లో కానీ ”అబ్బూరి ఛాయాదేవి స్మారక అవార్డు” ఇవ్వాలని నిర్ణయించుకున్నాము. దాని కోసం ఒక కమిటీని ఏర్పరచి, వారి ఆధ్వర్యంలో విజేతల ఎంపిక జరగాలని నేను భావిస్తున్నాను. ఛాయాదేవి గారి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ సందర్భంగా, తన పుట్టిన రోజు అక్టోబరు 13న అందరి సమక్షంలో ఈ నిర్ణయం ప్రకటించాలని ఏర్పాట్లు చేసుకుంటున్నాము.
తనదైన ప్రత్యేక మార్గంలో హుందాగా, అందంగా, గొప్ప చైతన్య స్ఫూర్తితో పయనించి, అంతే గొప్పగా తను కోరుకున్న విధంగా తన అంతిమ ప్రయాణాన్ని ముగించుకున్న అబ్బూరి ఛాయాదేవి గారి స్ఫూర్తి ఎప్పటికీ మనందరి గుండెల్లో గూడుకట్టి ఉంటుంది. అద్భుత ఆత్మీయమూర్తికి భూమిక నివాళి.