ఎడిటర్ గారికి,
జనవరి సంచికలో ప్రచురితమైన రేణుక అయోలగారి కథ ‘డైరీ’ బాగుంది. మొదట ధోరణి కొంతవరకూ ఈనాడు అసంఖ్యాకంగా వస్తున్న స్త్రీవాద కథల మాదిరిగానే అనిపించినా చివర ఆ డైరీ పడవలసిన వారి చేతులోనే పడడం అన్న ట్విస్ట్ కథకు ఒక కొత్తదనాన్ని సంతరించింది. అయితే ఫోనుల్లో పలికే హెల్ప్‌లైనుల గురించి రచయిత్రి ఆపార్ధం చేసుకున్నట్లనిపిస్తుంది. ఒక క్రైసిస్‌లో ఉన్న వ్యక్తులు ఈ లైన్లకు ఫోను చేస్తే అప్పటికి వారి బాధ విని వారిని ఆత్మహత్యా ప్రయత్నం నించి తప్పించడానికే ఇవి ఉద్దేశించబడతాయి. దు:ఖించడానికి ఒక భుజం మాత్రమే ఈ హెల్ప్‌లైన్లు.
-పోడూరి కృష్ణకుమారి, హైద్రాబాద్
ఎడిటర్ గారికి,
పేరుపాలెం బీచ్ టు పేరంటపల్లి సాహితీయాత్ర లాంటి చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భూమికకు అభినందనలు. అంతే ఉత్సాహంగా పాల్గొని ఓ సాహితీ సమూహంగా ఏర్పడటం చక్కటి పరిణామం. వివరంగా అనుభవాలను పంచుకున్న రచయిత్రులందరినీ చూసి ఈర్ష్య పడుతున్నాను. ఇతరత్రా జరుగుతున్న సాహితీ కార్యక్రమాల్లో, సాహితీ సమూహాల్లో రచయిత్రులకు సరైన భాగం దొరకట్లేదనేది నేను వ్యక్తిగతంగా అంగీకరిస్తాను. తెలుగు సాహితీ లోకంతో నాకు ఈమధ్యనే ఏర్పడ్డ అతికొద్ది పరిచయంతో ఈ మాట అంటానికి సాహసిస్తున్నాను. అదే సందర్భంలో ఓ చిన్న సూచన. ఓ రచన పట్ల విమర్శ చేసేటప్పుడు రచన చేసింది ఆడ, మగ అని చూసి చెయ్యాల్సిన పరిస్థితి రాకుండా చూసుకోవడం మనకందరికి మంచిది. నేను గొరుసు జగదీశ్వరరెడ్డి కధలోగాని, ఖదీర్‌బాబు కధలో గాని లోపాలను ఎంత ధైర్యంగా వాళ్ళకే చెప్పానో అంతే చనువు నాకు ప్రతిమ గారి కథో, చంద్రలత గారి కథో చదివినపుడు కూడా వుండాలని కోరిక. ఇపుడు లేదని కాదు. మనమెవ్వరం ఈ గీత దాటకుండా చూసుకుందామని మాత్రమే.
-అక్కిరాజు భట్టిప్రోలు
(ఇమెయిల్ ద్వారా)
ఎడిటర్ గారికి,
బాల కార్మికుల గురించి, కుటుంబ హింసల గురించి వాటికి సంబంధించిన చట్టాల గురించి జనవరి సంచికలో చదివాను. మనదేశంలో చట్టాలు కాగితాలకే పరిమితం అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఏ చట్టం సక్రమంగా అమలు అవుతున్నదో మచ్చుకి ఒక్కటి చెప్పండి! అంగబలం, అర్ధబలం లేనివాళ్ళని బాధలు పెట్టడానికి తప్ప న్యాయం చేకూర్చటానికి కాదు అనేది నగ్నసత్యం. దేశంలో జరుగుతున్న అరాచకాలు తెలిసిన ఎవరైనా మన దేశంలో చట్టాలు అమలులో ఉన్నాయి అని అనుకోగలరా? మన చట్టాల ప్రతిభ సభలు, సమావేశాలు, ఉపన్యాసాలు, పత్రికలలో రాతల వరకే పరిమితం.
-కె. రామారావు, హైదరాబాద్
సత్యవతిగారూ,
హెచ్ఐవి/ఎయిడ్స్ ప్రత్యేక సంచిక చాలా బాగుంది. హృదయాన్ని కదిలించే జీవితానుభవాలతో, అత్యంత విలువైన సమాచారంతో సంచిక తెచ్చారు. ‘నాకీ రోజు పూలు కానుకగా వచ్చాయి’ కవిత మనసును కలిచి వేసింది. ఇంత మంచి సంచిక తెచ్చినందుకు మీకు అభినందనలు.
-దమయంతి, కలెక్టర్, వరంగల్
(ఫోన్ ద్వారా)
సత్యవతి గారికి,
జనవరి సంచిక కవర్ పేజీ మీది కవిత కన్నీళ్ళు పెట్టించింది. కత్తి పద్మారావుగారు ఫోన్ చేసి భూమికలో తన కవిత వచ్చిందని, చదవమని చెప్పినపుడు, నా కళ్ళు కవర్ పేజీ మీదే ఆగిపోయాయి. ‘నాకు పూలు కానుకగా వచ్చాయి’ కవిత గుండెల్ని పిండేసింది.
-ఎ.విద్యాసాగర్, డెరెక్టర్ ఆఫ్ షుగర్స్, హైదరాబాద్
(ఫోన్ ద్వారా)
ఎడిటర్ గారికి,
హెచ్ఐవి/ఎయిడ్స్ మీద ప్రత్యేక సంచిక వెలువరించడం గొప్ప ప్రయత్నం. ఈ భగీరథ ప్రయత్నానికి అభినందనలు. ఈ వ్యాసాలు చదివి కొందరి దృక్పధాల్లోనైనా మార్పు వస్తే అదే పదివేలు.
-డా|| ఇస్మాయిల్, పెనుగొండ
(ఇమెయిల్ ద్వారా)