ఎన్ని ఉద్యమాలు, తిరుగుబాట్లు, ఎన్ని యుద్ధాలు చూసింది ఈ నేల. శతాబ్దంపైన దశాబ్దం కాలం క్రితం నాడు అంకురించిన మహిళోద్యమం ప్రపంచాన్ని మేల్కొలుపుతూ మిలీనియం మార్చ్‌ను పూర్తి చేసుకుంది. అన్ని అసమానత్వాలు అంతమై సామ్యవాద వ్యవస్థలు ఏర్పడాలని ప్రపంచ శాంతికై పబ్బతి బట్టిన వందేళ్ళ పోరాటం మహిళా శక్తిది. సాధించిన హక్కులు, విజయాలు సగమే, సాధించాల్సిన అంశాలు ఎన్నో. సమాన ప్రపంచం, సమర్థ ప్రపంచం అన్న భావనతో 8 మార్చ్ ఉద్యమ స్ఫూర్తితో సాధించిన గెలుపును పండుగగా చేసుకుంటూనే ఉన్నాం. ‘ప్రతి ఒక్కరూ సమానత్వం కోసం’ అని నినదిస్తూనే ఉన్నాం.
1911లో ప్రారంభమై ఒక మిలియన్ ప్రజల మద్దతుతో అడుగులు వేసిన ఉద్యమం సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విజయాలను నమోదు చేసుకుంటూ నేడు అసంఖ్యాక ప్రజల మద్దతుతో 2020 సంవత్సరంలోకి జుaషష్ట్ర టశీతీ జునబaశ్రీ అన్న సందేశంతో వచ్చేసింది. కదనాన్ని కొనసాగించే కొత్త స్ఫూర్తినీ, కొత్త శక్తినీ ఉద్యమ అజెండాగా ప్రకటించింది.
… … …
2019 డిసెంబరు నెల రాబోయే కొత్త క్యాలెండర్ సంవత్సరానికి అన్ని దేశాల ప్రభుత్వాలు ఎన్నో ప్రణాళికలూ, కార్యక్రమాలూ రూపొందించుకుంటున్న సమయం. 2020 ముఖచిత్ర రచనలో ఎవరి రనచల్లో వాళ్ళు… ఎప్పటిలాగే దేశ రాజ్యాంగ లక్ష్యాలను, ప్రవేశిక సూత్రాలను మరచి కొత్త సంవత్సరానికి ధూంధాంగా స్వాగతం పలికేందుకు ఎవరి వ్యూహాల సందడిలో వాళ్ళున్నారు. ఆ డిసెంబరు ఆఖరులో 1947, నవంబర్‌న దేశంలో అమలులోకి వచ్చిన మన రాజ్యాంగం ఏ మాత్రం జ్ఞాపకం రాని 70 ఏళ్ళ కాల నిస్తబ్దతను ఛేదిస్తూ దేశ పౌరుల నెత్తిమీద పౌరసత్వ సవరణ చట్టం పిడుగు పడింది. దాన్ని అనుసరించి ఎన్‌పిఆర్, ఎన్నార్సీ చట్టాల పిడుగులు పడి నిలువునా దహించివేయసాగాయి. దేశంలోని పేదలూ, బడుగుజీవులూ, మైనార్టీ ప్రజలూ, మహిళలూ ఆ మంటల్లో చిక్కుకుని హాహాకారాలు చేశారు.
డెబ్భై ఏళ్ళ స్వతంత్ర పాలనలో వచ్చిన, కొనసాగిన విధానాలలో అధికంగా నష్టపోయిన భారతీయ మహిళా లోకం అప్రమత్తమైంది. వెంటనే అనివార్యంగా చిన్న సమూహంగా ఏర్పడి ఢిల్లీ షాహీన్‌బాగ్ ప్రాంతంలో ‘తిరంగా జెండా’ పట్టుకొని రోడ్డుపైకి వచ్చేసిన మహిళా లోకం అక్కడ బైఠాయించింది. అది మొదలు ప్రతి రోజూ సమూహం పెద్దగా మారుతూనే ఉంది. తమ కాళ్ళకింది నేలను తవ్వి తీసుకుపోతుంటే ఊరుకునేది లేదనీ, తమ పౌరసత్వ అస్తిత్వం నిరూపించేందుకు కాగితం చూపించమని చట్టం కోరుతుంటే అది జరగదనీ ‘హమ్ కాగజ్ నహీ దిఖాయేంగే’ అనే నినాదం మోగించారు. ‘హమ్ దేఖేంగే’ అన్న పాటకు పల్లవులై చట్టాన్ని (సిఏఏ) సవాలు చేశారు. రోజులు వారాలుగా రెండు నెలల కాలం గడిచిపోయింది. షాహీన్‌బాగ్ తరహా దీక్షా శిబిరాలు ఢిల్లీలో మరి కొన్నిచోట్ల ఏర్పడ్డాయి.
పౌరసత్వ చట్టం గురించి యదార్థం తెలియని, దేశవ్యాప్తంగా ఉన్న మెజార్టీ ప్రజలకు క్రమంగా ఆ చట్టం నిజస్వరూపం, ఉద్దేశ్యం తెలియసాగింది. ఉద్యమానికి మద్దతు పెరగసాగింది. ఇదే సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం ఫరీదాబాద్ టు ఢిల్లీ రహదారికి అడ్డంగా ఉన్న శిబిరం వల్ల ట్రాఫిక్ సమస్య తీవ్రమయిందని, ఆ శిబిరాన్ని మరో చోటుకు మార్చుకోమని ఆదేశించింది. ప్రజలు నిరసన దీక్ష చేసుకునే హక్కును కాదనలేదు.
… … …
అత్యంత వికృతంగా, క్రూరంగా చీల్చబడిన ముక్కలుగా జనవరి 2020 ముఖచిత్రం దేశానికి మచ్చలా ప్రవేశించింది. దేశ ప్రేమతో దేశ సమగ్రత పట్ల ఆలోచనతో దేశ ప్రజాబాహుళ్యం ఒకవైపు, దేశాన్ని చీల్చి మరో దిక్కు తిప్పాలనే దురుద్దేశంలో పాలకస్వామ్యం మరోవైపు. విచిత్రమైన ఉద్విగ్న భరితమైన సందర్భం. మహిళలే నాయకత్వం (జశీశ్రీశ్రీవష్‌ఱఙవ Iఅసఱఙఱసబaశ్రీఱరఎ) తో కూడిన మహా ప్రజా ఉద్యమం ఉధృతి దాల్చడం జీర్ణించుకోలేక హిందూత్వ ధోరణులు పెచ్చరిల్లి పురుష దురహంకారం, పురుషాధిక్యత, హింసాత్మకత, మహిళా వ్యతిరేకత అలవాటైన ఉన్మాదంతో భీభత్సకాండను ప్రయోగించాయి.
ఈ దేశ మహిళలు, మైనార్టీలు, పేదలపై, రాజ్యాంగంపై దారుణ మారణకాండ చేసి విందులతో వికటాట్టహాసం చేస్తూ మేకతోలు కప్పుకొని మే..మే.. అంటూ నటిస్తున్నాయి.
బాబా సాహెబ్ అంబేద్కర్ తన సమస్త మేథోశక్తుల్నీ, సమయాన్నీ, జ్ఞానాన్నీ ధారపోసి రచించి అమల్లోకి తెచ్చిన రాజ్యాంగాన్ని, విలువల్నీ నీచాతినీచంగా దమనకాండతో అవమానపర్చింది మతోన్మాద మూక. దేశాన్ని అలజడికీ, ఆందోళనకూ గురిచేసి వీర తిలకాలు దిద్దుకున్నది అధికార పాలక దుర్వినియోగం.
రాజ్యాంగ గ్రంథాన్ని ఆర్తితో చేతబట్టి జైహింద్ అనే నినాదాలతో మువ్వన్నెల పతాకాలను ప్రదర్శిస్తూ ప్రజలు శాంతియుతంగా ఉద్యమానికి కూర్చుంటే ఫాసిజం ముదిరిన అధికారపు ఉన్మాదంలో ప్రజల కళ్ళను పొడిచి నెత్తుటి చారలు గీస్తూ హెచ్చరికలు చేసిన ప్రజా వ్యతిరేకత చరిత్రలో ఉండబోదేమో.
… … …
ఇంతటితో ‘హమ్ దేఖేంగే’ పాట ఆగిపోతుంటే మూగబోయి గాలిలో కలిసిపోతుందా? కాగితం మీద తమ జన్మకుండలీలను, రుజువులను చూపించలేని జనమంతా సవ్‌వఅ్‌ఱశీఅ షaఎజూర లో బంధించబడతారా? ఒకవేళ దేశం విడిచి పొమ్మని తరిమేస్తే తలలు తెంచబడిన ఆ మొండాలన్నీ ఎక్కడికి వలస పోవాలి?
ఆ రోజుల్లో ఒక సమావేశంలో వాదనలు జరుగుతున్నప్పుడు గాంధీగారితో వాదించి విసిగిపోయిన డా||అంబేద్కర్ ఆవేదనతో ”నాకొక దేశమే లేదు మహాత్మాజీ” అంటూ అక్కడినుంచి లేచి వెళ్ళిపోయినట్లుగా ఇప్పడు హఠాత్తుగా ‘అనుమానాస్పద పౌరులు’గా మారిన ఈ గడ్డమీది బిడ్డలందరూ ఎక్కడికి లేచిపోవాలి? ఎందుకని తిరస్కృతులూ బహిష్కృతులూ కావాలి?
ఒకప్పటి మహ్మద్ బిన్ తుగ్లక్ శాడిస్టు చర్యలను ‘పిచ్చి తుగ్లక్’ అనే పేరున ఇప్పటకీ వాడుతుంటాం. ఆ తుగ్లక్ వారసులు మరో రంగు (కాషాయం) వేసుకొని, మరో ఇజం (బ్రాహ్మనిజం) ఎక్కించుకొని దేశాన్ని సంస్కరిస్తామని సాంస్కృతిక పతనానికి పాల్పడుతూ పౌర జీవనాన్ని కల్లోలితం చేస్తున్నారని అనిపించేలా చేస్తున్నారు.
…
కొత్తగా చరిత్ర రచించబూనిన నా భారతదేశ మహిళా ఉద్యమ వీరంగనలారా హమ్ సబ్ సాత్ సాత్ హై. ఆవాజ్ దో హమ్ ఏక్ హై! ఎన్ని జీవన్మరణ పోరాట సందర్భాలు మనకు ‘జీనా హై తో మర్‌నా సీఖో, కదమ్ కదమ్ పర్ లడ్‌నా సీఖో’ అని నేర్పించలేదు! ఎన్ని చావో రేవో తేల్చుకునే సమయాలు మనకు ఎదురుకాలేదు! మనం స్త్రీలమైనందుకు కర్మభూమిలో పుట్టినందుకు ఎప్పుడు శాంతిగా జీవించాము? నిత్యం జీవించే హక్కు కోసం, మానవ గౌరవం కోసం సంఘర్షణలతో త్యాగాలతో కోట్ల సంఖ్యలో మనం అదృశ్యమైపోతూ అంతరించిపోతూనే ఉన్నాం. సమరాంగనలమై ప్రాణాలు పణంగా పెడుతూనే ఉన్నవాళ్ళం. ఈ లోకం తెలుసుకోవడానికి మనం రక్తం అర్పిస్తున్నవాళ్ళం. మన ఆశయం ఆకాశమంత ఉన్నతం, విశాలం. మన స్ఫూర్తికి మరణం లేదు. మన యుద్ధానికి విరామమే లేదు.
మరో వందేళ్ళయినా తెగించి ఉద్యమోన్ముఖంగా లాంగ్ మార్చ్ చేస్తూనే ఉంటాం. హమ్ దేఖేంగే! హమ్ దేశ్‌కో బచాయేంగే! హమ్ దేశ్ కో సంభాలేంగే. దేశ్‌కేలియే ఖుర్బాన్ హోంగే. ఇన్సానియత్ కో జిందా రఖేంగే! మహాన్ భారత్ దేశ్ హమారా జిందాబాద్. నారీ శక్తి అజరామరం!
ముందు దేశం మన తల్లి. తరువాత మన ఊరు మన తల్లి. మనలను కన్న తల్లి. ముగ్గురు అమ్మలను ఒక్కటి చేసి మూడు రంగుల జెండా ఎగరేస్తూ జై భారత్ అంటూ ఉప్పొంగిన జాతీయ గీతమై ఆకాశమంత పయనంతో మనమే ఉద్యమమై… భారత నారీమణుల పౌరత్వశక్తికి శత కోటి వందనాలు!