నిర్భయ నుంచి దిశ దాకా – సి. వనజ

నిర్భయకు ముందు కానీ, ఆ తర్వాత కానీ భారతదేశంలో ఇటువంటి దారుణాలు జరగలేదని కాదు. కానీ, ఈ రెండు సంఘటనలకు ఒక ప్రాధాన్యత ఉంది. హక్కులే కాదు, బాధ్యతలు కూడా చెప్పకుండా పెంచిన, సహకారం బదులుగా పోటీ, తృప్తికి బదులుగా విజయం, త్యాగానికి బదులుగా స్వార్థం విలువలుగా నేర్చుకుంటున్న మిలీనియం తరాన్ని, సంపద ఎలా వచ్చినా ఫర్వాలేదు దాన్ని పోగేయడాన్ని మాత్రమే విజయంగా భావిస్తూ, నేను బాగుంటే చాలు ప్రపంచం ఏమైనా ఫర్వాలేదని భావిస్తూ భద్రలోకాల్లో విహరిస్తున్న మధ్యతరగతిని ఛెళ్ళున కొట్టి లేపిన సంఘటనలు ఇవి. రెండు సంఘటనల్లోనూ అత్యాచారానికి గురయినవాళ్ళు మధ్యతరగతికి చెందినవాళ్ళు కావడంతో అత్యంత దారుణంగా జరిగిన ఈ సంఘటనలతో ఈ రెండు వర్గాలు సహానుభూతి చెందాయి. అప్పటిదాకా దళితుల మీద, మైనారిటీల మీద జరిగిన అత్యాచారాలకు, పోలీస్‌స్టేషన్లలో, మిలిటరీ ఉన్న ప్రాంతాలలో ఇంతే దారుణంగానో, ఇంతకన్నా దారుణంగానో జరిగిన సంఘటనల మీద ఎప్పుడూ గొంతెత్తని వాళ్ళు కూడా ఇప్పుడు రోడ్డున పడ్డారు.

కోపం, ఆవేశం, నిస్సహాయతలతో పాటు తాము ఉందనుకున్న భద్రత లేదన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయిన ఈ రెండు వర్గాలు, హింసకు ప్రతి హింస తప్పుడు విలువగా మాట్లాడే వర్గాలు కూడా ఇక్కడ మాత్రం పరిష్కారంగా ప్రతిహింసనే కోరాయి. నిర్భయ సంఘటన సమయంలో నిందితులను వెంటనే ఉరి తీయాలని డిమాండ్‌ చేసిన వాళ్ళు దిశ సంఘటన సమయానికి వాళ్ళను కాళ్ళు, చేతులు విరిచి వాళ్ళు చేసిన హింసకు పదిరెట్లు హింసించి చంపాలని డిమాండ్‌ చేశారు. బహుశా దేశంలో పెరిగిపోయిన లించింగ్‌ సంస్కృతికి ఈ వర్గాల నుంచి ఉన్న ఒక నిశ్శబ్ద ఆమోదానికి ఇది సూచిక కావచ్చు.

ముందుగా ”చంపేయండి, విరిచేయండి” అని మధ్యతరగతి అడుగుతున్న పేదల విషయం తీసుకుందాం. ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వాళ్ళు చదువురాని పేద కుటుంబాల పిల్లలే అన్న అభిప్రాయం సమాజంలో ఉంది. దానికి తగ్గట్టే అటు నిర్భయ కేసులో, ఇటు దిశ సంఘటనలో పట్టుబడిన నిందితులు కూడా చిన్న వయసులో ఉన్న చదువులేని పేద వర్గాల వాళ్ళే. కేవలం పేద పిల్లలే ఇటువంటి నేరాలు చేస్తున్నారా? మిగిలిన పిల్లలు చేయడంలేదా? అసలు ఏ పిల్లలు అయినా ఈ నేరాలు ఎందుకు చేస్తున్నారు? ఇవి ఆలోచించాల్సిన, అర్థం చేసుకోవాల్సిన ప్రశ్నలు.

భారతదేశంలో అధికారిక లెక్కల ప్రకారం ప్రైమరీ స్కూళ్ళలో 90 శాతం మంది చేరితే (వచ్చినా, రాకపోయినా ఊళ్ళో ఉన్న పిల్లలందర్నీ హాజరు పట్టీలో చేర్చే ప్రాథమిక పాఠశాలల్లో) అందులో సెకండరీ స్కూల్లో చేరేసరికి దాదాపు సగం మంది బడి మానేస్తున్నారు. ఇలా బడి మానేసే పిల్లలంతా పేద పిల్లలే. సరైన బళ్ళు లేక, బళ్ళు ఉన్నా ఈ పిల్లల కోసం కన్సర్న్‌తో పాఠాలు చెప్పేవాళ్ళు లేక, ఇంట్లో పేదరికంతో గడవక, ఆడపిల్లలయితే వీటన్నిటికీ తోడు బయట భద్రత లేక, సరిగ్గా టీనేజ్‌ వచ్చేసరికి వీళ్ళంతా బడి బయట ఉంటారు.

అదే సమయంలో, భారతీయ కుటుంబ వ్యవస్థ గురించి ఎవరు ఎంత డబ్బా కొట్టుకున్నా భారతీయ కుటుంబాలలో విపరీతంగా గృహహింస పెరిగిందన్నది ఒక వాస్తవం. ముఖ్యంగా సరళీకరణ విధానాల తర్వాత కుటుంబాల మీద విపరీతంగా ఆర్థికపరమైన ఒత్తిడి, వలసలు పెరిగాయి. మద్యం మీద ఆధారపడి నడిచే ప్రభుత్వాల వల్ల విపరీతంగా మద్యం వాడకం, దానితోపాటు కుటుంబాల్లో హింస కూడా పెరిగింది. అయితే, బ్రోకెన్‌ కుటుంబాలు, లేదా సింగిల్‌ పేరెంట్‌ కుటుంబాలు కూడా ఎక్కువయ్యాయి.

ఈ కుటుంబాల నుంచి వచ్చి 13, 14 ఏళ్ళకు బడి బయట ఉన్న పిల్లల పరిస్థితి ఏమిటి? పని చేయడానికి అవసరమైన నైపుణ్యం ఉండదు. పని చేసినా పిల్లలు కనుక అందులోనూ విపరీతమైన ఆధిపత్యం, దెబ్బలు, హింస ఉంటాయి. ప్రేమ, భద్రత, గౌరవం అన్నీ కరువైన ఈ పిల్లలకు తేలిగ్గా దొరికేది వెయ్యి రూపాయిల స్మార్ట్‌ ఫోన్‌, దాంట్లో వంద రూపాయిలకు అపరిమితమైన డేటా. కాబట్టి, ఇటు జెండర్‌ ఎడ్యుకేషన్‌ కానీ, అటు సెక్స్‌ ఎడ్యుకేషన్‌ కానీ ఎప్పుడూ అందని వీరికి, 140 కోట్ల మందిని 4జి పేరుతో తమ స్నేహితులకు పళ్ళెంలో పెట్టి ఇచ్చిన ప్రభుత్వాల పుణ్యమా అని, అతి తేలిగ్గా దొరికేది విచ్చలవిడి పోర్న్‌. అందులోనూ కావలసినన్ని రేప్‌ వీడియోలు. చిన్నప్పటినుంచీ రకరకాల హింస (అసలు పేదరికమే హింస అనుకోండి) చూసి అనుభవించిన పిల్లల్లో కొందరికి హింస పట్ల నిర్లిప్లతతో కూడిన ఆమోదం కలిగితే, మరికొంత మందికి దూకుడుతో కూడిన హింసాతత్వం అలవడుతుంది. వాటికి తోడు, సినిమాల్లో విపరీతంగా గ్లామరైజ్‌ అయిన హింస, అరచేతిలో ఎప్పుడంటే అప్పుడు కనిపించే అసహజ హింసాత్మక అత్యాచార దృశ్యాలు, ఇక కావలసిందల్లా ఒక విక్టిమ్‌ మాత్రమే.

ఇక ఒక బిడ్డ తనకు రాజ్యాంగం ఇచ్చిన గౌరవంగా జీవించే హక్కు పొందటానికి అవసరమైన ఏ పనీ చెయ్యని ప్రభుత్వాలు ఈ పిల్లలు తప్పు చేస్తే మాత్రం మరింత కఠినంగా శిక్షించటానికి కొత్త కొత్త చట్టాలు తెస్తాయి. ఒకసారి తప్పు మీద పడితే అది నిజమో కాదో చెప్పుకునే అవకాశం కూడా దొరకని వాళ్ళను ‘చంపెయ్యండి, నరికెయ్యండి’ అని అరవటం కూడా తేలిక.

అయితే కేవలం ఒక వర్గంలోనే ఇలాంటి ధోరణులున్నాయనుకుంటే పొరపాటు. ఇక మధ్యతరగతికి వద్దాం. మధ్య తరగతి కుటుంబాలు కూడా హింసాత్మక ప్రవృత్తికి ఏమీ దూరంగా లేవు. కుటుంబ వ్యవస్థ నిలబడడానికి భార్యను ఒక దెబ్బ వెయ్యడం తప్పు కాదని 90 శాతం మంది పురుషులు, 50 శాతం మంది స్త్రీలు కూడా నమ్మే దేశమిది. సమానత్వం, గౌరవం, ప్రేమ ఆధారంగా కాక, కులం, కట్నం, జాతకం ఆధారంగా ఏర్పడే కుటుంబ వ్యవస్థలో ప్రధానంగా ఉండేవి ఆధిక్యత, విధేయత. ఇందులో ఆధిపత్య ధోరణికి, అవసరమైతే దాన్ని నిలబెట్టుకోవడానికి ఏదో ఒక మోతాదులో హింసను ప్రయోగించటానికి ఆమోదం ఉంటుంది. భార్యాభర్తల మధ్యనే కాదు, తల్లిదండ్రులకు, పిల్లలకు మధ్య కూడా అదే రకమైన సంబంధాలు ఉంటాయి. చెప్పేవాళ్ళు-వినేవాళ్ళు, నిర్ణయించేవాళ్ళు- ఆమోదించేవాళ్ళు ఇలా పాత్రలు నిర్ణయమైన అసమాన కుటుంబాల నుంచి సమానత్వ భావనను పిల్లలు నేర్చుకోవటం సాధ్యం కాదు. ఒకవేళ స్త్రీ, పురుష సమానత్వం గురించి పిల్లలకు చెప్పినా ఆ కుటుంబం కులపరమైన, ఆర్థిక పరమైన సమానత్వాన్ని పాటించలేకపోతే వాళ్ళు సమానత్వ భావన నేర్చుకోరు సరికదా అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దాన్ని ఎలా మానిప్యులేట్‌ చెయ్యొచ్చో నేర్చుకుంటారు.

మరోవైపు పిల్లలకు ఉగ్గుపాలతో పాటు చూపించే హింసా దృశ్యాలు. చాలామంది పిల్లలు ఏడాది, రెండేళ్ళు వచ్చేసరికి టామ్‌ అండ్‌ జెర్రీ లాంటి కార్టూన్లు చూస్తుంటారు. ఈ కార్టూన్లలో అదేపనిగా ఒకరినొకరు కొట్టుకుంటూ ఉంటారు. కొట్టుకోవడం కూడా చాలా దారుణంగా. కానీ ఆ దారుణమైన కొట్టుకోవడం ఒక ఆటగా, వినోదంగా చూపిస్తారు. అది చూసీ, చూసీ పిల్లలు కొట్టుకోవడం ఒక ఆటగా భావించటం మాత్రమే కాదు, దానివల్ల వచ్చే బాధ లేదా పరిణామాల పట్ల సున్నితత్వాన్ని పోగొట్టుకుంటారు. అందుకే చాలా తరచుగా స్కూళ్ళలో పెరిగిపోతున్న దుడుకు పిల్లల గురించి వింటున్నాం. టామ్‌ అండ్‌ జెర్రీలతో ప్రారంభించి ఛోటా భీమ్‌లు కూడా ముగిశాక వాళ్ళిక ఫోన్లలో, ట్యాబ్‌లలో ఆటలు మొదలుపెడతారు. ఇందులో మూడేళ్ళ వయసు పిల్లల ఆటల్లో విల్లంబులు ఉంటే ఆపై వయసు పిల్లల ఆటల్లో తుపాకులు ఉంటాయి. పెరిగేకొద్దీ మరింత రక్తపాతం ఉండే పబ్జీ లాంటి ఆటలు మొదలవుతాయి. ఆయుధాలను అత్యంత అలవోకగా వాడే తత్వం పిల్లలు టీనేజ్‌కు వచ్చేసరికి అలవాటు అవుతుంది. అవతలి వాళ్ళను చంపటం, ఆ చంపటం విజయ సూచకం కావటం తప్పు కాదని నేర్చుకుంటారు. పబ్జీ లాంటి ఆటల్లో అయితే నలుగురు జట్టుగా కలిసి అవతలి వాళ్ళను చంపేస్తే సరిపోదు. తన జట్టులోనే ఉన్న మిగిలిన ముగ్గురిని కూడా చంపినప్పుడే విజేతగా మారతాడు. చంపటం మాత్రమే కాదు విజేతగా నిలవాలంటే తనతోనే ఉన్నవాళ్ళను ద్రోహబుద్ధితో చంపెయ్యటం కూడా తప్పు కాదన్న విలువను నేర్చుకుంటారు.

ఇక 12, 13 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళకు లైంగికత పట్ల కుతూహలం మొదలవుతుంది. సెక్స్‌ ఎడ్యుకేషన్‌ను మమ అనిపించే, జెండర్‌ ఎడ్యుకేషన్‌ ఆలోచనేలేని స్కూళ్ళల్లో వాళ్ళకు ఆ కుతూహలానికి సమాధానాలు దొరకవు. ఇళ్ళలో ఎవరూ మాట్లాడరు. ఇక ఈ పిల్లలు కూడా స్కూలు బయట ఉన్న పిల్లలు ఫోన్‌లో ఏం చూస్తారో అవే చూడడం మొదలుపెడతారు. కాకపోతే ఇంకొంచెం మంచి ఫోన్లలో మరింత నాణ్యమైన వీడియోల్లో. దిశ సంఘటన జరిగాక ఆమె అత్యాచార వీడియో కోసం ఇంటర్నెట్‌లో వెతికిన పిల్లల్లో అన్ని వర్గాల పిల్లలూ ఉన్నారు.

ఇక ఇళ్ళల్లో మరోవైపు ద్వేషం, పగ, కన్నీళ్ళు మాత్రమే ఆధారంగా నడిచే సీరియళ్ళు నిరంతరం నడుస్తుంటాయి, లేదా హింసను సెన్సేషనలైజ్‌ చేసే వార్తలు వస్తుంటాయి. ఇవన్నీ కాకపోతే విపరీతమైన హింసను, జెండర్‌ ఇన్సెన్సిటివిటీని గ్లామరైజ్‌ చేసే సినిమాలు. ఒకవేళ థియేటర్‌కి వెళ్ళకపోయినా అవి ‘ఎ యు’ సర్టిఫికెట్‌ తీసుకుని ఇంట్లో టివిలో వస్తాయి. కుటుంబాలకు కుటుంబాలు ఆ హింసను కళ్ళార్పకుండా భయంతో కూడిన ఆరాధనతో చూస్తుంటాయి.

వీటిల్లో కొన్ని డైలాగులుంటాయి. ‘వాడు మగాడ్రా బుజ్జీ’, ‘నువ్వు మగాడివేనా?’, ‘మగాడంటే అలా ఉండాలి’ లాంటివి. దాదాపు ఈ డైలాగులన్నీ ఏదో ఒక హింసాత్మక సంఘటనకు లేదా ఆధిపత్య ప్రవర్తనకు ఆమోదం తెలుపుతూ ఆయా సందర్భాల్లో వచ్చేవే. ఏ మాత్రం విమర్శ లేకుండా కుటుంబాలు ఆ సినిమాలు చూస్తూ ఆ డైలాగులు వింటున్నప్పుడు కుటుంబం అంతటిలోనూ ఆ ప్రవర్తన పట్ల, ఆ ధోరణుల పట్ల ఆమోదం ఏర్పడుతుంది. అంతేకాదు, ఆ డైలాగులు ఇళ్ళల్లోనూ, ఇతర సామాజిక సందర్భాల్లోనూ, చివరికి రాజకీయాలకు సంబంధించిన చర్చల్లోనూ చాలా సాధారణంగా వినపడుతుంటాయి. ‘పాకిస్తాన్‌ మీద యుద్ధం చేసాడు, వాడు మొగాడు’, ‘ఫలానా రాష్ట్రంలో ఫలానా పని చేసాడు, ఇరగదీసాడు, వాడు మొగాడు’, ఇలా ఉంటాయి సంభాషణలు. ఈ మాట అన్న ప్రతిసారీ తాము ఒక హింసను ఆరాధిస్తున్నామని కానీ, ఆహ్వానిస్తున్నామని కానీ జ్ఞానం ఉండదు చాలామందికి.

ఇంకో వైపు జెండర్‌ వయొలెన్స్‌. ఇది కేవలం కొట్టడం, తిట్టడానికి సంబంధించింది మాత్రమే కాదు. ఆడపిల్లను చూస్తే ‘ఆమె కావాలని’ అనిపిస్తే, ‘ఆమె నాది’ అని చెప్పటం, ఆమెను ‘స్వంతం’ చేసుకోవటం హీరోయిజంగా చూపించే సినిమాలు. అలాంటి సినిమాలు ఇవాళ అన్ని భాషల్లోనూ బ్లాక్‌ బస్టర్లే. వీటిని సినిమా హాల్లోనో, లేకపోతే ఎ యు సర్టిఫికెట్‌ ముసుగులో టీవీలో వచ్చినప్పుడో, లేదంటే పెద్దవాళ్ళు టీవీలో చూస్తే, చిన్నవాళ్ళు ఫోన్‌లోనో అందరూ చూసేస్తారు. మొత్తంగా ఎవరూ ఏమీ మాట్లాడుకోకుండానే ఒక టాక్సిక్‌ మాస్క్యులినిటీ (ప్రమాదకర, విషపూరిత పురుషత్వం) కి పట్టం కట్టే సంస్కృతికి ఆమోదం తయారవుతూ ఉంటుంది.

ప్రతి మనిషికీ ఒక వ్యక్తిగా తృప్తినిచ్చేవి రెండు అంశాలు. ఒకటి, బయట తనకు గుర్తింపునిచ్చే పని. రెండు, వ్యక్తిగత జీవితంలో ప్రేమ. యుక్తవయసులో అయితే ఈ రెండూ పొందటమే చాలా కీలకం. నిరుద్యోగంలో 40 ఏళ్ళ రికార్డు స్థాయికి చేరిన దేశంలో చదువుకున్నా కూడా (చదువు, నైపుణ్యం లేకపోతే ఎలాగూ లేదు) గౌరవప్రదమైన జీవితం దొరికే అవకాశం లేని నిస్పృహలో మగాడిగా నిరూపించుకునే ఒకే ఒక్క అవకాశం లైంగిక ఆధిపత్యం లేదా లైంగిక హింస. అలాంటప్పుడు కావలసింది కూడా తేలిగ్గా దొరికే ఒక విక్టిమ్‌ మాత్రమే. తరచుగా మనం వినే సంఘటనల్లో తమ క్లాస్‌మేట్‌ మీద అత్యాచారం చేసిన ఇంజనీరింగ్‌ విద్యార్థి లాంటి వార్తలు ఉంటాయి.

ఇంకొంచెం పైకి వెళ్దాం. ఆ మధ్య ముంబాయిలో చాలా పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు చదివే స్కూలులో పెద్ద తరగతి పిల్లల వాట్సాప్‌ సంభాషణలు బయటికి వచ్చాయి. అందులో 15 ఏళ్లు కూడా నిండని మగపిల్లలు తమ క్లాసులో ఉన్న ఆడపిల్లలపై ఎవరెవరు ఎవరెవర్ని ఎలా రేప్‌ చేయాలనుకుంటున్నారో చర్చించుకున్నారు. ఫాంహౌస్‌లలో ఇచ్చే రేప్‌ డ్రగ్స్‌, రేవ్‌ పార్టీలలో ఉండే విశృంఖలత్వాల గురించి తెలియనిది కాదు. కానీ అక్కడ బయటికి రాకుండా ఉంచడానికి, వస్తే మేనేజ్‌ చేయడానికి అవసరమైన అన్ని అండదండలు ఉంటాయి. అందుకే ఇప్పటివరకూ ఇన్ని జరుగుతున్నా ఈ దేశంలో ఏ సంపన్న వర్గాల వ్యక్తులు అత్యాచార నేరంలో బోనెక్కడం చాలా అరుదు.

ఇక బాధితులు ఎవరు? ‘బేటీ పడావో, బేటీ బచావో’ అని నినదించే రాజ్యం స్కూలుకి వెళ్ళడానికి కనీసం బస్సు కూడా ఏర్పాటు చేయకపోతే నాలుగైదు మైళ్ళు డొంక దారుల్లో నడిచి పోయే హాజీపూర్‌ పిల్లలు కావచ్చు, అమ్మ పక్కన ఆదమరిచి నిద్రపోయే నెలల పాప కావచ్చు, ఇంతమంది తిరిగే చోట భద్రమే అనుకుని స్కూటర్‌ పార్క్‌ చేసుకున్న దిశ కావచ్చు, స్నేహితుడే కదా అని నమ్మిన మానస కావచ్చు, రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని ఇల్లు చేరుకునే తొందరలో ఉన్న టేకు లక్ష్మి కావచ్చు, హాస్టల్లో ప్రశాంతంగా ఉన్నాననుకున్న ఆయేషా మీరా కావచ్చు, సినిమా తార అయి కూడా (బహుశా అయినందువల్లనే) రక్షణ లేని ప్రత్యూష కావచ్చు, మనకు తెలియని మరెవరో కావచ్చు. నేర స్వభావం అనేది పేద, ధనిక భేదం లేకుండా పెరుగుతూ ఉందన్నది ఒక వాస్తవం. కానీ నేరస్తులు పేదవారో లేదా బాధితులు మధ్య తరగతి లేదా ఆపై వర్గం వాళ్ళో అయినప్పుడు మాత్రమే అవి వార్తలు కావడం, లేదా అందులో నేరస్థులకి శిక్షలు పడడం ఈ దేశపు వాస్తవం. నేరస్థులు పై వర్గం వాళ్ళయితే, వాళ్ళకు రాజకీయ అండదండలు ఉంటే ప్రత్యూష కేసులో లాగా వాస్తవాలు బయటికి రావు., ఆయేషా మీరా కేసులో లాగా నిందితులు దొరకరు. అవసరమైతే ఒక అర్భకుడిని లోపల వేసి ఏళ్ళ తరబడి బైటకు రాకుండా చూడొచ్చు.

ఒకసారి నిర్భయ సంఘటనకు వెళ్తే, అప్పుడు కూడా తక్షణ న్యాయం గురించి ఎంత డిమాండ్‌ వచ్చినప్పటికీ దేశంలో మానవ హక్కుల కోసం పనిచేస్తున్న, రమీజాబీ సంఘటన నుంచి మధుర, భన్వారీ దేవిల దాకా అత్యాచార ఘటనల మీద పనిచేస్తున్న స్త్రీల హక్కుల ఉద్యమకారుల వల్ల, అప్పటికి ఇంకా ఈ స్థాయిలో ప్రభుత్వాలే హింసను ప్రోత్సహించే సంస్కృతి రాకపోవడం వల్ల వీటికి పరిష్కారం కనుక్కొనే ప్రయత్నం కొంతైనా జరిగింది. ఫలితంగా వచ్చిందే జస్టిస్‌ వర్మ కమిషన్‌.

కొన్ని వేలమంది నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఇచ్చిన నివేదికలో జస్టిస్‌ వర్మ ప్రజల నుంచి వచ్చిన మరణశిక్ష డిమాండ్‌ను సమర్ధించలేదు. ప్రతి పదినిమిషాలకు ఒక అత్యాచార సంఘటన నమోదయ్యే (అసలు పది సంఘటనలు జరిగితే ఒకటే నమోదు అవుతుందనేది ఒక అంచనా) దేశంలో అత్యాచారానికి మరణశిక్ష విధించడం మొదలుపెడితే, సాక్ష్యాలు లేకుండా చేయడానికి బాధితులను చంపేసే అవకాశం పెరుగుతుందన్న వాదన సుప్రీంకోర్టు న్యాయమూర్తికి తెలియనిది కాదు. శిక్షాస్మృతిలో అనేక మార్పులు సూచించారు. ప్రధానంగా చిన్నచిన్నవిగా ఇటు సమాజం, అటు వ్యవస్థలు చూసీ చూడనట్లు పోయే రకరకాల వేధింపులకు కూడా శిక్షలు కఠినం చేయాలన్నారు.

వర్మ కమిషన్‌ చేసిన మరో మంచిపని ఏమిటంటే ఆయన సమస్యను కేవలం నేరం-శిక్షకి మాత్రమే పరిమితం చేయకుండా మొత్తంగా లైంగిక నేరాల నిరోధానికి కీలక వ్యవస్థల్లో రావలసిన మార్పులు, సంస్కరణల గురించి చెప్పారు. అందులో మొదటిది, చాలా వివరంగా చెప్పింది పోలీసు సంస్కరణలు. పోలీసులకు జెండర్‌ సెన్సిటివిటీ పెంచడంతో పాటుగా లైంగిక నేరాలను సరిగ్గా డీల్‌ చేయడానికి అవసరమైన శిక్షణ కూడా ఇవ్వాలని సూచించారు. బాధితులు ఫిర్యాదు చేసినప్పుడు జ్యూరిస్‌డిక్షన్‌తో సంబంధం లేకుండా ఫిర్యాదులు తీసుకోవాలని, ఫిర్యాదులు తీసుకోవడానికి నిరాకరించిన పోలీసు అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇంకా రాష్ట్ర స్థాయిలో భద్రతా కమిషన్‌లు ఏర్పాటు చేయాలని, అత్యాచారాలను విచారించడానికి అవసరమైన మద్దతు అందించడానికి రేప్‌ క్రైసిస్‌ సెల్‌లను ఏర్పాటు చేయాలని, ఎక్కడ అత్యాచార ఘటన జరిగి ఫిర్యాదు అందినా వెంటనే సెల్‌కి సమాచారం అందించాలని సూచనలు చేశారు. సంస్కరణలు చేయాల్సిన రెండవ సమూహం రాజకీయ నాయకులన్నది జస్టిస్‌ వర్మ అభిప్రాయం. లైంగిక నేరాలకు పాల్పడినవారే అసెంబ్లీలలో, పార్లమెంటులో కూర్చునే పరిస్థితి ఉండకూడదని అన్నారు. అందుకోసం చట్టం సవరించి వాళ్ళు ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేకుండా చేయాలని కూడా చెప్పారు.

మూడవది, విద్యా సంస్కరణలు. అన్ని విద్యాసంస్థలలో స్కూలు స్థాయి నుంచి, సెక్స్‌ ఎడ్యుకేషన్‌ ఏర్పాటు చేయడంతో పాటు స్కూలు బయట ఉన్నవాళ్ళకు వయోజన విద్య ద్వారా స్త్రీ, పురుష సమానత్వం బోధించాలన్నారు.

అప్పటికి ముగుస్తున్న యుపిఎ-2 ప్రభుత్వం వర్మ కమిషన్‌ సిఫారసు చేసినట్లుగా లైంగిక వేధింపులకు, దాడులకు సంబంధించిన చట్ట పరమైన మార్పులతో పాటు కమిషన్‌ వద్దన్నప్పటికీ సామూహిక అత్యాచారాలకు మరణశిక్షను కూడా జోడించింది.

దేశంలో పెరిగిపోయిన అత్యాచార సంస్కృతికి అప్పటిదాకా ఉన్న ప్రభుత్వాలదే బాధ్యత అని తిట్టిపోసినవాళ్ళు అధికారంలోకి వచ్చారు. వర్మ కమిషన్‌ చేసిన మిగిలిన సిఫారసులను బుట్టదాఖలు చేసిన కొత్త ప్రభుత్వం నిర్భయ సంఘటనలో లాగా నేరస్థులు మైనర్లు అయితే తప్పించుకు పోకుండా హీనమైన నేరాలకు పెద్దవాళ్ళను విచారించినట్లే విచారించే విధంగా, నిందితుల వయసును 16కు తగ్గిస్తూ పోక్సో చట్టానికి సవరణలు చేసింది. మరింత మందికి మరణశిక్షలు విధించే అవకాశం కల్పించింది. ఈ సవరణలు పార్లమెంటులో ప్రవేశపెడుతూ మంత్రి మనేకా గాంధీ ఒక వ్యాఖ్య కూడా చేశారు, ”పేదరికం నేరాలు చెయ్యడానికి సాకు కారాదు” అని. అంటే ఇటువంటి నేరాలు చదువు, సంధ్య లేని పేదలే చేస్తారని, కాబట్టి వాళ్ళను శిక్షించడానికి వాళ్ళ పేదరికం కానీ, వాళ్ళ వయసు కానీ అడ్డంకి కాకూడదన్నది ఆమె అభిప్రాయం.

నేరస్థులను, బాధితులను తయారుచేసే సమాజాలు, రాజ్యాలు ఏ మాత్రం దాన్ని మార్చే లేదా సంస్కరించే బాధ్యత తీసుకోకపోగా అత్యంత హీనమైన నేరం జరిగిన ప్రతిసారీ కఠిన శిక్షలు వేస్తామంటూ రంకెలు వేస్తాయి. విగ్రహాలకు వేల కోట్ల రూపాయలు కేటాయించే ప్రభుత్వాలకు అత్యాచార బాధితులను ఆదుకోవడానికి చెయ్యి రాదు. ఇచ్చిన అరకొర కూడా ఏ స్వచ్ఛభారత్‌కో తరలిపోతాయి. మాట్లాడితే భారతీయ సంస్కృతి గురించి ఘనంగా చెప్పుకునేవాళ్ళు అత్యాచార సంస్కృతిని మార్చడానికి మాత్రం ఏమీ చెయ్యరు. ప్రతి ఊరికీ పోలియో చుక్కలు వెయ్యాలన్న సందేశాన్ని తీసుకుపోగలిగిన ప్రభుత్వాలు తలచుకుంటే ఆడపిల్ల ఆమోదం లేకుండా ఆమెపై చెయ్యి వెయ్యకూడదన్న సందేశం కూడా తీసుకుపోగలవన్న స్పృహ ఉండదు. ఆడపిల్లను చూస్తే కళ్ళు పీకేస్తామని ప్రగల్భాలు పలికే చోట ఆడపిల్లకు సమస్య వస్తే చెప్పుకోవడానికి ఒక వ్యవస్థ

ఉండదు. సమాజంలో, పాలనలో ఉన్న లోపాలవైపు చూసే బదులు ప్రభుత్వం నేరస్థుడివైపు చూపిస్తుంది. నేరాన్ని చంపడం కాక నేరస్థుడిని చంపడం మీద శ్రద్ధ పెడుతుంది. నేరస్థులే రాజకీయ నాయకులుగా, నేరమే అధికారమై రాజ్యమేలే చోట చిన్న చేపను తినే పెద్ద చేపలాగా, చంపడానికి చిన్న నేరస్థులు కావాలి. సత్వర న్యాయం కోసం చెయ్యవలసిన దీర్ఘకాలిక చర్యలు వదిలేసి తక్షణ న్యాయం పేరుతో మాయ చేస్తారు.

ఇక ఈ మొత్తం నేరపూరిత వాతావరణంలో నేరము-శిక్షలో ప్రధాన పాత్ర వహించే పోలీసు వ్యవస్థ గురించి మాట్లాడుకోవాలి. అత్యాచార సంస్కృతిని అరికట్టడానికి తొలి సంస్కరణలు ఇక్కడినుంచే ప్రారంభించాలని జస్టిస్‌ వర్మ అన్నారంటేనే ఇక్కడ సమస్య ఎంత తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. పురుషాధిక్య భావజాలానికి, టాక్సిక్‌ మాస్క్యులినిటీకి ప్రతిరూపంగా ఉండే ఈ వ్యవస్థలో స్త్రీలపై జరిగే నేరాల పట్ల ఆమోదంతో కూడిన తృణీకారం ఉంటుంది. పదేళ్ళ పాప నుంచి 70 ఏళ్ళ పెద్దమనిషిదాకా ఒక స్త్రీ కనిపించడం లేదంటే ఆమె లేచిపోయి ఉంటుంది అనే నిర్లక్ష్యంతో మొదలుకొని, గృహ హింస పడలేక వచ్చిన మనిషి పట్ల ఇంటి పరువు తీసిన తప్పుడు మనిషిలా భావించడం నుంచి, అత్యాచార బాధితురాలు వస్తే న్యూసెన్సుగా చూడడం దాకా, స్త్రీలపై జరిగే నేరాలన్నింటి పట్ల పోలీసులలో నేరపూరితమైన నిర్లక్ష్యం కనిపిస్తుంది. కేసులు కట్టడంలో నిర్లక్ష్యం మొదలుకొని అసలు కేసుల్లో ఛార్జిషీటు వెయ్యకపోవడం, ఛార్జిషీటు వేస్తే తప్పుల తడకలా, కొట్టుడుపోయేలా తయారు చేసేదాకా అనేక వైఫల్యాలు. అనేక కేసుల్లో శిక్షలు పడకపోవడానికి కారణాలు ఇవే. ఇక రేప్‌ కేసుల్లో సంధి కుదిర్చి పెళ్ళిళ్ళు చేయడానికి ఊళ్ళల్లో కుల పంచాయితీల నుంచి మొదలుకుంటే, పోలీస్‌స్టేషన్లు, చివరికి కోర్టులు కూడా ఉత్సాహం ప్రదర్శిస్తాయి. ఈ మధ్య చెన్నై హైకోర్టు కూడా అలాంటి ఉత్సాహం చూపించి సుప్రీంకోర్టుతో అక్షింతలు వేయించుకుని వెనక్కు తగ్గిందంటే అత్యాచారాల పట్ల ఎంత ఆమోదంతో కూడిన నిర్లక్ష్యం ఉందో అర్థమవుతుంది.

నిర్భయ తీవ్రమైన గాయాలతో చావు బతుకుల మధ్య నడిరోడ్డు మీద విలవిల్లాడుతున్నప్పుడు కూడా గంటసేపు ఎవరి జ్యూరిస్‌డిక్షన్‌లోకి వస్తుందో చర్చించగలిగే వెసులుబాటును ఆ నిర్లక్ష్యమే ఇస్తుంది. హాజీపూర్‌లో ఒకరి తర్వాత ఒకరు 13, 14 ఏళ్ళ పిల్లలు మాయమవుతున్నా లేచిపోయి ఉంటుందన్న నిర్లక్ష్యపు సమాధానం చెప్పడం సాధ్యమవుతుంది. జ్యూరిస్‌డిక్షన్‌ పేరుతో కాలయాపన చేయకూడదన్న విషయం దేశమంతటికీ తెలిసినా తెలియాల్సిన పోలీసులకు మాత్రం తెలియకుండా ఉండే అవకాశం ఉంటుంది. అంటే జస్టిస్‌ వర్మ చెప్పిన జెండర్‌ సెన్సిటివిటీ కానీ, స్త్రీలపై జరిగే నేరాల పట్ల వ్యవహరించాల్సిన తీరుపై శిక్షణ కానీ, ఐదు సంవత్సరాలు గడిచినా పట్టించుకోనేలేదన్నమాట. చివరికి దిశ సంఘటనలో కూడా కనిపించింది అటువంటి నేరపూరిత నిర్లక్ష్యమే. కూతురు ప్రమాదంలో ఉందని ఫోన్‌ చేస్తే మా జ్యూరిస్‌డిక్షన్‌ కాదంటే మా జ్యూరిస్‌డిక్షన్‌ కాదని ఒక గంట అలస్యం చెయ్యడమే కాక చివరికి ఏ పోలీస్‌స్టేసనో కూడా కనుక్కొని వెళ్తే ఎవరితోనో లేచిపోయి ఉంటుందని బాధితురాలి తల్లిదండ్రులతో వెకిలిగా మాట్లాడగలిగే ధైర్యం కూడా ఆ నిర్లక్ష్యం నుంచే వస్తుంది.

వెంటనే స్పందించి ఉంటే కనీసం దిశ బతికి ఉండేదన్నది ఒక వాస్తవం. తమ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టానికి సమాధానం ఇవ్వలేని వ్యవస్థ తన తప్పు నుంచి బయట పడడానికి నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసి తన ఇమేజ్‌ మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఇదే తప్పు చేసి హాజీపూర్‌లో ముగ్గురు ఆడపిల్లలను బలి ఇచ్చిన తర్వాతైనా వ్యవస్థ తన పద్దతి మార్చుకుని ఉంటే దిశ బతికి ఉండేది. అక్కడ అట్లా మాట్లాడిన అధికారుల మీద చర్య తీసుకుని ఉంటే మిగిలినవాళ్ళు నేర్చుకునేవాళ్ళు. నేరము-శిక్షలో అంత నమ్మకం ఉన్న వ్యవస్థ ఆ పని మాత్రం చెయ్యదు.

ఇప్పటికైనా మార్చుకుంటుందన్న నమ్మకం లేదు. ఎందుకంటే మారాలన్నా, మార్చాలన్నా చాలా పెద్ద ప్రయత్నం చేయాలి. పనిచేయాలి. జెండర్‌ సెన్సిటివిటీ పెంచాలి. ఈ నేరాల పట్ల వ్యవహరించే పద్దతి మీద శిక్షణ ఇవ్వాలి. అవన్నీ చెయ్యడానికి రాజ్యానికి తీరికలేదు. నేరస్థులుగా మారిన తమకు రక్షకులుగా మాత్రమే పనిచేస్తూ ఉంటే ప్రతిఫలంగా మంచి, మంచి వాహనాలు, వసతులు, నిధులు విసురుతూ ఉంటారు. ఇదేంటి అని ప్రశ్నించేవాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి బయటకు రాకుండా చూస్తే చాలు. అదనంగా ఎప్పుడో ఐదేళ్ళకో, ఏడేళ్ళకో ఒకసారి ప్రజాగ్రహం వచ్చినప్పుడు వాళ్ళ మొహాన పడెయ్యడానికి ఒక ఎన్‌కౌంటర్‌ చేస్తే సరిపోతుంది. బహుశా ఇప్పటి ఎన్‌కౌంటర్‌కి వచ్చిన స్పందన చూశాక ఇక నుంచి ఆయేషా మీరా కేసులో లాగా ఎవరో ఒకరిని తప్పుడు కేసు పెెట్టి లోపల పడెయ్యడం కాకుండా ఇలా నేరాలు జరిగిన ప్రతిసారీ ఎవరో ఒకరిని ఎన్‌కౌంటర్‌ చేసేస్తారన్నమాట. అత్యాచారం చేసి సాక్ష్యం లేకుండా చంపేసినట్లు. జనానికి న్యాయం జరిగినట్లూ ఉంటుంది, తమకు కావలసిన వాళ్ళను రక్షించుకోనూ వచ్చు.

ఇలాంటి దారుణ సంఘటన జరిగిన ప్రతిసారీ ప్రజలలో ఇంకో రెండు రకాల వాదనలు వస్తాయి. ఒకటి, ఆడపిల్లల ప్రవర్తన వల్లనే లేదా ధరించిన దుస్తుల వల్లనే ఇలాంటి సంఘటనలు జరుగుతాయని. ఇది విక్టిమ్‌ బ్లేమింగ్‌. బాధితుల మీదనే నెపం వెయ్యటం. సమస్యలను గుర్తించడానికి నిరాకరించడం. లేదా తమలో ఉన్న అత్యాచార మనస్తత్వాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నించడం. రెండవది, పిల్లల పెంపకం లేదా కుటుంబ బాధ్యత చర్చ. ఒక బిడ్డను గ్రామమంతా కలిసి పెంచుతుంది అని సామెత. కానీ ఇప్పటి పరిస్థితి అలా లేదు. కొందరు తల్లిదండ్రులకు బతుకే ఒక పోరాటమైతే కొందరికి గెలవడం కోసం, సంపాదన కోసం ఆరాటం. పిల్లలు మూసిపెట్టిన ఇళ్ళలో లేదా మూసిపెట్టిన స్కూళ్ళలో పెరుగుతున్నారు. తల్లిదండ్రులకు పిల్లలను పట్టించుకునే సమయం లేదు. స్కూళ్ళకు ఆ బాధ్యత లేదు. పిల్లల ఎమోషన్లకు విలువ లేదు. ఆటలు లేవు, పాటలు లేవు. ఇప్పుడున్నంత ఒత్తిడి పిల్లల మీద ఎప్పుడూ లేదు. వాళ్ళ కోసం ఏమీ చెయ్యని సమాజం, ప్రభుత్వాలు వాళ్ళు చేసే తప్పులను దండించడానికి మాత్రం ముందుకు పరిగెత్తుకు వస్తాయి.

కానీ సామాజిక జీవితం ఇంత ఒత్తిడిగా మారడానికి ఎవరు కారణం? జీవితమే ఒక ప్రెజర్‌ కుక్కర్‌గా మారడానికి మన విధానాలు కారణం కాదా? ఎందుకు దేశం దేశమే ఎప్పుడూ ఆనంద సూచిక (హ్యాపీనెస్‌ ఇండెక్స్‌) లో వెనకబడి

ఉంటుంది? ఎందుకు ఎప్పుడూ ప్రతి మనిషికీ చుట్టూ ఒక ఉద్రేకపూరిత వాతావరణం ఉంటుంది? ఎందుకు అందరికీ అన్ని వ్యవస్థల మీదా నమ్మకం పోయింది? న్యాయం జరగని చోట ప్రతీకారమే సరైనదని ఎందుకు నమ్ముతున్నారు? గొడ్డు మాంసం తింటే కూడా మనుషుల్ని నరికెయ్యడం న్యాయంగా మారినప్పుడు అత్యాచారానికి కూడా విరిచెయ్యడం న్యాయంగా మారకుండా ఎలా ఉంటుంది? ఒక దేశ సంస్కృతి మారాలంటే దేశ పాలనా సంస్కృతి, పాలకుల సంస్కృతి మారాలన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. పార్లమెంటులో, అసెంబ్లీలో కూర్చునే ఎంపీలు, ఎమ్మెల్యేల మీదనే అత్యాచార నేరాలు ఉంటే వాళ్ళు ఈ సంస్కృతిని ఎట్లా మారుస్తారు?

ఈ ప్రశ్నలకు వెతికే సమాధానాల్లోనే ఆ సమస్యకు పరిష్కారాలూ ఉంటాయి. లేదంటే మరో దారుణ సంఘటన జరిగేదాకా వేచి చూడొచ్చు. ఈసారి ప్రజలు కోరుకున్నట్లుగా ఒక ఆర్థిక, రాజకీయ బలం, బలగం లేని నిందితుడ్ని ప్రజల చేతికి అందించవచ్చు విరిచెయ్యడానికి వీలుగా. ఈలోగా 50, వందేళ్ళలో ఆడపిల్లలకు అందివచ్చిన కాస్త చదువు, కాసిని ఉద్యోగాలు కూడా ఈ కొత్త అభద్రతతో వెనక్కి పోతాయి. అప్పుడిక స్త్రీ, పురుష సమానత్వ సమన్యాయం ఉన్న సమాజం, జెండర్‌ జెస్ట్‌ సమాజం అనేది కలగా కూడా మిగలదు.

(‘వీక్షణం’ జనవరి 2020 సౌజన్యంతో)

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.