నేరము – శిక్ష
చట్టము – న్యాయము
రక్షణ వ్యవస్థ – రాజకీయాలు
అవిద్య – ధనాశ
ఇలా ఎన్నో అంశాలతో ముడిపడిపోయి ఉంటుంది ఏ సమాజమైనా. నీటిలో కొన్ని అలవోకగా కలిసి, భరించరాని అన్యాయాన్ని సృష్టించినప్పుడు మొత్తం దేశం ఒకే విధంగా స్పందించి, దాన్ని ఎదిరించడానికి నడుం కట్టడం అరుదుగా జరుగుతూ ఉంటుంది.
స్త్రీలపై దాడి, మానభంగాలు, అత్యాచారాలు, హత్యలు మరీ కొత్త విషయాలుగా భావించలేము కానీ సామూహికంగా ఒక స్త్రీపై అత్యాచారం చేయడం, హత్య చేయడం, శవం కూడా కనిపించకుండా చేసేయడం, పెట్రోల్, కిరోసిన్ పోసి కాల్చేయడం, ఎవరూ గుర్తించలేనిచోట పాతి పెట్టేయడం, నూతిలో పడేయడం, కాలువల్లో తోసేయడం… నిత్యం చూస్తుంటే, వింటుంటే మన ఉనికి మనకే ప్రశ్నార్ధకమవుతోంది.
2012 డిసెంబరు 16న ఢిల్లీ మహానగరంలో కదిలే బస్సులో కొందరు కలిసి ఆమెను అత్యాచారం చేసి, క్రూరంగా హింసించి బస్సులోంచి కిందికి తోసిపారేశారు. అంతకుముందు ఆమెతో కలిసి ప్రయాణిస్తున్న ఆమె మిత్రుడ్ని కిందికి విసిరేశారు. ఆమె తీవ్రంగా గాయపడినా, ధైర్యంగా పరిస్థితిని ఎదుర్కొని పదమూడు రోజులు మృత్యువుతో పోరాడింది. డిసెంబరు 29న మరణించింది. ఆమెను ఆరుగురు కలిసి రేప్ చేసి రకరకాల హింసలకి గురిచేశారు. కొన ఊపిరితో ఆమె వైద్యం పొందినా చివరకు మరణించక తప్పలేదు. ఆమె నిర్భయగా చరిత్రలో చట్టమై నిలిచింది. అప్పుడు దేశం అట్టుడికి పోయింది. నలుమూలల నుంచి
ఉవ్వెత్తున ఉద్యమం లేచింది. నిర్భయకు న్యాయం జరగాలని అరచిన కేకలు ఆకాశాన్ని అంటాయి.
ఇరవై నాలుగు గంటల్లో నేరస్తుల్ని అరెస్టు చేశారు. అత్యవసరంగా నిర్భయ చట్టాన్ని రూపొందించి 2013 ఏప్రిల్ నాటికి అమలులోకి తెచ్చింది ప్రభుత్వం.
నేరస్తుల్లో ఒకరు మైనరు… బాల నేరస్తుల చట్ట ప్రకారం శిక్ష విధించారు. ఒకరు జైల్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంక మిగిలిన వారికి శిక్ష పడేసరికి ఏడేళ్ళు పట్టింది. శిక్ష ఇంతవరకు అమలు కాలేదు. శిక్ష పడేందుకు, శిక్ష అమలు పరిచేందుకు ఏళ్ళకి ఏళ్ళు కాలం పడుతుంటే, అసలు ఆ శిక్షకి విలువేం ఉంటుంది? నేరస్థులకి భయమేం ఉంటుంది?
కానీ అప్పట్లో నిర్భయ చట్టం వచ్చేసింది. ఇంకా స్త్రీలకి భయం లేదు. వారు స్వేచ్ఛగా భయం లేకుండా జీవితాలు సాగించవచ్చు అంటూ అప్పట్లో అందరూ చప్పట్లు కొట్టారు. అది నిజమా! ఆ తర్వాత ఎన్ని గ్యాంగ్ రేప్‌లు, ఎన్ని హత్యలు, ఎన్ని అత్యాచారాలు. బాధితురాళ్ళు కనిపించకుండా పోయిన సందర్భాలెన్ని? పేపర్లలో చదివి, టీవీలో చూసి జనం అయ్యో అని బాధపడి ఊరకుండిపోవడానికి అలవాటు పడిపోయారు. పోలీస్‌స్టేషన్లలో నమోదు కూడా కాని సందర్భాలెన్నో! పోలీసుల దగ్గరకు వెళ్తే వారు తిరస్కరించినవి కొన్నయితే, అసలు అక్కడిదాకా పోకుండా ఉండిపోయినవి ఎన్నో!
స్త్రీల గురించి పెద్ద పెద్ద సంప్రదాయ ప్రవచనాలు వల్లె వేయడం కాదు. అసలు వాస్తవం ఏమిటో చూడాల్సిన పరిస్థితి వచ్చింది. పూర్వ పురాణాల ప్రకారం రావణాసురుడికి ఒక శాపం ఉంది. అది రంభ అతని దుష్టత్వాన్ని, క్రూరత్వాన్ని చూసి కోపించి ఇచ్చిన శాపం… అదేమంటే…
”నువ్వు ఏ స్త్రీ వంటిమీదనైనా, ఆమె ఇష్టం లేకుండా చెయ్యి వేశావంటే నీ తల వెయ్యి వక్కలైపోతుంది” అని.
అది శాపం కదా! జరిగి తీరుతుంది. అందుకే ఆ రాక్షస వీరుడు సీతను ఒప్పించడానికి బతిమాలాడు, బెదిరించాడు, చివరికి సమయం ఇచ్చాడు కానీ బలాత్కరించడానికి భయపడ్డాడు. సత్వర న్యాయం కావాలంటే మనం శాపాలుండాలని కోరుకుందామా? అవి నిజంగా ఉన్నాయా? మనకేమైనా పనికొస్తాయా? కఠినమైన శాసనమే శాపంగా అర్థం చేసుకోవాలా!
ఎంత పకడ్బందీ అయిన శాసనం తీసుకొచ్చినా అది అమలు జరపడంలో ఏళ్ళూ పూళ్ళూ గడిచి, సాగి సాగి అది న్యాయంవైపు వచ్చేసరికి బాధితుల బాధ అలాగే ఉంటుంది. నేరస్థులకు జీవితం సాగుతూ ఉంటుంది. బెయిల్ మీద బయట తిరిగేవారు కొందరైతే, జైల్లోనే కొన్నేళ్ళపాటు (సకల భోగాలతో) గడుపుతున్నారు మరి కొందరు. రక్షణ కల్పించే పోలీసు వ్యవస్థ మీద ప్రజలు పూర్తిగా విశ్వాసం కోల్పోయారు. ఎందువల్ల?
రాజకీయ నాయకుల చేతుల్లో పోలీసు వ్యవస్థ కీలుబొమ్మ అయ్యింది. వారి బలం చూసుకుని వీరు, వీరి అండదండలు చూసుకుని వారు రక్షణ వ్యవస్థను సర్వనాశనం చేసి పెట్టారు.
సామాన్యులు పోలీస్ స్టేషన్ వైపు వెళ్ళడానికి కూడా భయపడతారు. న్యాయం కోసం, రక్షణ కోసం మరోదారి రౌడీలను, గూండాలను ఆశ్రయించడం… ఎంత దురదృష్టం!?
పోలీసోడి కంటే గూండాయే నీతిమంతుడురా అనే నిశ్చయానికి ప్రజానీకం రావడం వ్యవస్థమీద అశనిపాతం కాదా!
నిర్భయ కేసు తర్వాత దేశాన్ని ఊపేసిన హైద్రాబాద్ శివార్లలో జరిగిన ప్రియాంకా రెడ్డి అత్యాచారం, హత్య, శవాన్ని తగలబెట్టడం… మొదలైన అంశాలు పేపర్లని, మీడియాని, ప్రజానీకాన్ని ఉప్పెనలా ముంచేసి ఊపిరాడనీయలేదు.
2019 నవంబరు 27న జరిగిన ఈ ఘాతుకమైన సంఘటన అందర్నీ హడలెత్తించి పారేసింది. ఆడపిల్లల తల్లిదండ్రులే కాదు, చెల్లెళ్ళున్న అన్నలు, భార్య గురించి బెంగపెట్టుకునే భర్తలు, ఈడొచ్చిన ఆడపిల్లలు, ఉద్యోగాలకెళ్తే కంగారుపడిపోతూ తల్లిదండ్రులు, ఒకరేమిటి అందరూ గడగడలాడిపోయారు. ఎక్కువ సంబంధంలేని వాళ్ళు కూడా సామాజిక బాధ్యతగా బాధపడి కన్నీరు మున్నీరయ్యారు.
అంతకుముందు రెండు, మూడు రోజుల క్రితం వరంగల్‌లో జరిగిన మానస ఉదంతం బయటకొచ్చినా, ఈ దిశ కేసుకే దేశం ఎక్కువ తల్లడిల్లిపోయిందని చెప్పాలి. ఉన్నావ్ బాధితురాలి మృతి, అసలు సాక్ష్యం లేకుండా చేసేయడం అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఒకదాని గురించి వింటుంటే మరొకటి భయం కలిగించేస్తూ ఉన్నాయి. అసిఫాబాద్ దళిత యువతి మీద కూడా దారుణమైన దాడి జరిగింది. సామూహిక అత్యాచారం, హత్య… ఈ దుర్మార్గాలను ఎలా అర్థం చేసుకోవాలి?
‘దిశ’ కేసులో కొన్ని గంటల వ్యవధిలోనే నేరస్థుల్ని పోలీసులు అరెస్టు చేశారు. రిమాండుకు పంపారు. ఆ ‘దిశ’ నేరస్థులకు వేయవలసిన శిక్ష గురించి దేశం కోడై కూసింది.
మనం చట్టంతో పోరాడగలం కానీ న్యాయాన్ని పొందగలమన్న గ్యారంటీ ఏమిటి? ఎప్పటికప్పుడు జాతీయ నేర పరిశోధక విభాగం (ఎన్.సి.ఆర్.బి.) సుమారు 2016 నుండి రిపోర్టులు ఇస్తూనే ఉంది. ఎంతవరకు ప్రభుత్వం దానిమీద దృష్టి సారించింది? ఎందుకంత నిర్లక్ష్యం? ముఖ్యంగా అందులో ఎక్కువ భాగం 10, 12, 14 ఏళ్ళలోపు పసిపిల్లలు కేవలం ఆడపిల్లలైనందున నరకం అనుభవించడంగా జరుగుతూ వస్తోంది.
ఇదేమిటి? ఇదేం సమాజం? ఇదేం దేశం? న్యాయం ఎక్కడుంది? ఆడపిల్లల్ని మనమెలా రక్షించుకోగలం?
మహిళలపై లైంగిక వేధింపులు రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. సగటున రోజుకి వెయ్యి కేసులు జరుగుతున్నాయని లెక్కలు చెప్తున్నాయి. ఇవన్నీ ఒక పక్కన పెడితే స్త్రీలమీదా, బాలికల మీదా కేవలం ‘ఆడ’ అనే దృష్టితో జరిగే ఈ లైంగిక దాడులను ఎలా అర్థం చేసుకోవాలి?
ఇంతకు పూర్వమూ ఉన్నాయి అయితే బయటకు ఇప్పుడే వస్తున్నాయి అనే వాదన వుంది. మీడియా పెరిగి, ఇలాంటి విషయాలు ఎక్కువగా బహిర్గతం చేస్తోందనీ అంటారు.
జరగని విషయాన్ని వ్రాసి, చూపించే పరిస్థితి ఇంకా మన జర్నలిజంకి, దృశ్యమాధ్యమానికీ రాలేదనే నమ్మవచ్చు. ఉన్నది పదింతలు చేసి చూపించడం ఉంది కానీ లేనిది కల్పించలేరు. మరి రోజురోజుకీ ఎందుకిలా గ్యాంగ్ రేప్‌లు, హత్యలు జరిగిపోతున్నాయి.
సమాజంలో సాంకేతికంగా వచ్చిన మార్పుకి సమాజంలో స్త్రీలు బలైపోతున్నారు. అది అభివృద్ధా, అథోగతా?
ప్రతి కుర్రాడు, కుర్రది చేతిలో స్మార్ట్‌ఫోన్ ఆభరణంగా ధరిస్తున్నారు. మన సినిమాలు ఈ దుష్ట సంస్కృతికి నీరూ, నారూ పోయడంలేదా?
విద్యని వ్యాపారం చేసి వేలం వెర్రి కలిగించి, చదువు కేవలం డబ్బు సంపాదనకే అనే స్ఫూర్తి కలిగించడం నేరం కాదా? చదువు లేకపోయినా కోట్లు సంపాదించడం ఎలా అనే ఆలోచనవైపు యువతను మళ్ళించడం నేరం కాదా? తప్పు కాదా?
డబ్బు సంపాదించడం, మందు తాగడం, ఆడది కనిపిస్తే పశువుగా మారడం నేటి నాగరికత లక్షణమా?
‘దిశ’ సంఘటనకి చలించిపోయిన అందరూ తీవ్రంగా స్పందించారు. నేరస్తుల్ని అరెస్టు చేసిన వెంటనే వారికి విధించవలసిన శిక్ష గురించి అభిప్రాయాలు, ఆక్రోశాలు వెల్లువెత్తాయి. అందులో చదువుకున్నవాళ్ళు, రచయిత్రు(త)లు కూడా ఉన్నారు. పార్లమెంటు సభ్యులు, మంత్రులు కూడా ఉన్నారు.
”మీరేం చేయవద్దు, మాకు వదిలేయండి. రోడ్డుమీద కట్టేసి, రాళ్ళతో కొట్టి చంపేస్తాం”
”పెట్రోల్ పోసి నిప్పుపెట్టి తగలబెట్టేస్తాం”
”నాలుగు రోడ్ల మధ్య ఉరి తీస్తాం”
”ఒక్కసారిగా చావకుండా చిత్రహింసలు పెట్టి చంపుతాం”
… అంటూ రకరకాల శిక్షలను చెప్తూ ఎలుగెత్తి అరిచారు. ఫేస్‌బుక్‌లో, వాట్సాప్‌లలో దుమ్మెత్తిపోశారు.
పోలీసులకు దోషుల్ని రక్షించడం సమస్యగా మారింది. ఒక్కసారిగా విచిత్రమైన మలుపు తిరిగింది పరిస్థితి.
ఆయుధాలు లాక్కుని పారిపోవడానికి ప్రయత్నించారని నలుగురు నేరస్థుల్ని పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు, అంటే కాల్చి చంపేశారు. అప్పుడు పోలీసులకు లభించిన అభినందనల వెల్లువ వాళ్ళు జీవితంలో ఎప్పుడూ చవిచూసి ఉండరు. ప్రజలు వారిమీద పూలవాన కురిపించారు. ఫోటోకి పాలాభిషేకం చేశారు. రాజకీయ నాయకుల నుంచి, పార్లమెంటు సభ్యుల నుంచి, మంత్రులు… అందరూ ఏకకంఠంతో పోలీస్ యాక్షన్ కరక్ట్ అని పొగిడారు.
నేరం చేసిన వాళ్ళు పట్టుబడ్డాక వాళ్ళని ఎన్‌కౌంటర్‌లో చంపేయడం ఏ నాగరిక వ్యవస్థను ప్రతిఫలిస్తుంది అని కొందరు మాట్లాడినా, మెజారిటీ ప్రజలు అభినందించారు. అదే కావాలనుకుంటే ఈ కోర్టులు, చట్టాలు, న్యాయవాదులు, సాక్షులు, జడ్జిలు… ఇవన్నీ ఎందుకు? న్యాయస్థానం చేయవలసిన పని పోలీసు వ్యవస్థ చేసేస్తే ఇంక న్యాయం గురించి ఎక్కడ మాట్లాడాలి అని కొందరు ఆవేదన వ్యక్తం చేశారు. అనుమానితుల్ని అరెస్టు చేసి కోర్టుకు హాజరు పరచడమే పోలీసుల పని. కానీ వాళ్ళొక అడుగు ముందుకు వేశారు.
ఇదే న్యాయం, ఇదే సరైన న్యాయం, ఇదే సత్వర న్యాయం అని నమ్మితే రాబోయే కాలంలో ఎలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలి?
నిర్భయ తల్లి, దిశ తల్లిదండ్రులు వంటి వారెందరో సరైన న్యాయం జరిగిందని, పోయినవారి ఆత్మలు శాంతిస్తాయని తృప్తిపడ్డారు. మనంఎటు పయనిస్తున్నాం?
దోషులెంత ఘోరమైన తప్పు చేసినా శిక్షించే హక్కు పోలీసు వ్యవస్థకి లేదు కదా!
చెయ్యికి చెయ్యి, కన్నుకి కన్ను అంటూ న్యాయం చెప్పినవాళ్ళు రాబోయే కాలంలో దుర్మార్గుల చేతుల్లోకి వ్యవస్థ వెళ్ళిపోతే, సామాన్యుడు ఈ మాత్రమైనా బతకగలడా? అనేది సామాన్యుడు కూడా ఆలోచించవలసిన విషయం కదా?
సినిమాల్లో పనిచేసే మేధావులు అంటే నటులు, దర్శకులు, నిర్మాతలు ఒకరేమిటి అందరూ ఇలాంటి గ్యాంగ్ రేప్‌లు, అత్యాచారాలు జరగకూడదని గట్టిగా నొక్కి వక్కాణించారు.
సమాజాన్ని కలుషితం చేసి పారేసిన కార్యక్రమంలో వారి బాధ్యత లేదా? ప్రమేయం లేదా? వారి భాగస్వామ్యం లేదా?
హీరోయిన్ పిర్రలమీద వాయిస్తూ పాటలు పాడడం, హీరోగారు ఎప్పుడూ హీరోయిన్ గుండెల ఎత్తుమీద మాత్రమే దృష్టి నిలిపి డైలాగులు చెప్పడం, ఆమె నడుమునీ, పిర్రల్ని లేకిగా చూస్తూ పాటంతా హీరోయిన్ మెడ చుట్టూ నాకేస్తూ ఆమె నడుము అందేలా కూర్చుని బొడ్డు, కడుపు నలిపేస్తూ నటించడం, ఆ సమయంలో హీరోయిన్ పరవశంలో అరమోడ్పు కన్నులతో పరవశించడం… ఇవన్నీ సామాన్యుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో వాళ్ళకి తెలీదా? ప్రేమ అంటే సెక్స్ అని ప్రతిపాదించి, నిరూపించింది సినిమా రచయితలు, దర్శకులు, నటులు, నిర్మాతలు కాదా?
అసలు చదువు, స్కూలు, క్లాసు, టీచరు, పుస్తకాలు, సభ్యత ఏమీ తెలియని తక్కువ స్థాయి ఆలోచనగల ప్రేక్షకుడు స్త్రీల గురించి ఏం తెలుసుకుంటాడు? ఇవి చూసి, ఆడది కనిపిస్తే వెంటపడడం, వేధించడం, అవమానించడం నేర్పిస్తున్నది సినిమాలు కాదా?
చివరికి ఆమె అతన్ని ఇష్టపడి వెంటపడడం ఎలాంటి సంకేతం ఇస్తుంది. యాసిడ్ దాడులకి అది దారి చూపడం కాదా? క్లాసురూంలోకి వచ్చి ”ఆ పిల్ల నాదిరా. దానివైపు ఎవ్వరూ చూడకూడదు, చూడడానికి వీల్లేదు” అని ఒక క్రాక్ శాసిస్తే ఆ సినిమా కోట్లు ఆర్జించినప్పుడు స్త్రీ స్థాయి ఈ దేశంలో ఏ స్థితిలో ఉందని మనం అర్థం చేసుకోవాలి?
నీతి, నిజాయితీ, న్యాయం, ధర్మం లాంటి మాటలు బూతుల్లా వినిపిస్తున్నాయి. బురదలోకి లాగేసి, బక్కెట్ నీళ్ళిచ్చి కడుక్కోమని, స్త్రీ ఎంత పవిత్రురాలో అంటూ ఉపన్యాసాలు వల్లిస్తే ఆమె స్థితిగతులు మెరుగుపడతాయా? దాడి జరిగిన స్త్రీ గురించి వచ్చే మొదటి మాట ‘ఆమె ఎలాంటిదో’ అని. అంటే ఆమె ఎలాంటిదో అయితే దాడి చేస్తారా? అసలా మాటకు అర్థమేమిటి? అలాంటిదీ, ఇలాంటిదీ అని దాడిచేసి అత్యాచారం చేసి చంపేయవచ్చా? ఆమె క్యారెక్టర్, నడత అన్నీ వీళ్ళే నిర్ణయిస్తారా?
అవిద్య, ధనాశ ఈ సమాజాన్ని ఎంతగా భ్రష్టు పట్టించాయో మన సినిమాలు, టి.వి.సీరియల్స్ నిరూపిస్తున్నాయి.
చంపెయ్, నరికెయ్ అనే మాటలు ఎంత సులువుగా సాగుతున్నాయి. ఈ మధ్య ఒక సినిమాలో హీరో తనని రేప్ చేశాడని హీరోయిన్ బుకాయించి తనని పెళ్ళి చేసుకునేలా చేస్తుంది. దానికి ఆ హీరోయిన్ తల్లిగారు సపోర్టు, సమర్థన. ఇంక మనమెలా బాగుపడతాం? అసలీ సినిమా రైటర్స్, నిర్మాతలు, దర్శకులు, నటులు ‘రేప్’ అంటే ఏమనుకుంటున్నారు? అదొక సరదా వ్యవహారంగా భావిస్తున్నారా? సినిమాలాంటి పవర్‌ఫుల్ మీడియం ద్వారా ఏదైనా చెప్పేటప్పుడు ఒక్క క్షణం ఆలోచించాల్సిన పనిలేదా?
సినిమాలు కోట్లు కలక్ట్ చేస్తున్నాయని డప్పు వాయించుకుంటున్నారు. కొంత దూరం వెళ్ళాక ఆ డబ్బు వాళ్ళని, సమాజాన్ని రక్షించదని గ్రహింపు లేదా?
నాశనం చేసుకున్న సమాజంలోని సంస్కృతిని బాగు చేసుకోవాల్సిన బాధ్యత మనందరిమీదా కదా ఉన్నది.
సంస్కృతి అంటే భక్తి, గుళ్ళు, గోపురాలు, గొబ్బెమ్మలు, డప్పులు, పెద్ద పెద్ద బొట్లు అనే భ్రమలో ఉన్నారు. అవి కాదని చెప్పడానికి ఎక్కడ్నుంచి మొదలుపెట్టాలి?
స్త్రీని గౌరవించడం అంటే దొంగ దండాలు పెట్టడం కాదని గ్రహించాలి. ఆమెని సాటిమనిషిగా చూసి, ఆమె ఇష్టాలమీద, వ్యక్తిత్వం మీద దాడిచేయకుండా ఉంటే చాలు. అదే గౌరవం.
ఇంట్లో తల్లులు కొడుకులకు సరైన అవగాహన కల్పించాలి. ”మా అబ్బాయి మంచివాడే, పక్కవాళ్ళ సహవాసం వల్ల చెడిపోయాడ”ని కుంటిసాకులు చెప్పడం మానేసి కొడుకుని మంచి వ్యక్తిగా, బాధ్యతగల పౌరుడిగా తయారు చేయడంలో తల్లిదండ్రులిద్దరూ సమానంగా కృషి చేయాలి. స్కూళ్ళలో టీచర్స్ కూడా పిల్లలకి ఇలాంటి విషయాలు సున్నితంగా చెప్పి, వారు గ్రహించేలా చెయ్యాలి. ఏదైనా పాడు చేయడం సులువే, మళ్ళీ బాగుచేయడం కష్టం.
‘దిశ’ కేసులో నేరస్థులు మహ్మద్ ఆరిఫ్ (డ్రైవర్), జొల్లు శివ (క్లీనర్), జొల్లు నవీన్ (క్లీనర్), చింతకుంట చెన్నకేశవులు (డ్రైవర్)… వీరు నలుగురూ చదువు, సభ్యత, సంస్కారం లాంటి విషయాలే తెలియనట్టు కనిపిస్తున్నారు. ప్రభుత్వం 18 ఏళ్ళలోపు పిల్లలు (బాలిక, బాలుడు) ఎవరైనా తప్పనిసరిగా స్కూలుకి వెళ్ళి ప్రాథమిక విద్య అభ్యసించాలని ఎందుకు కట్టుదిట్టం చేయదు? దానిమీద దృష్టిపెట్టి విద్యను వ్యాప్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? రూలు ఉంటే చాలదు. కఠినంగానైనా అమలుపరచాలి కదా!
చిన్నవయసులోనే దొంగతనాలు, తాగుడు మరిగి ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతుండే వాళ్ళను చూసి అసహ్యించుకోవాలో, జాలిపడాలో అర్థంకాదు కదా! అందులో పెళ్ళయినవాడు, భార్య గర్భవతిగా ఉన్నవాడు మరో స్త్రీని అంత క్రూరంగా ఎలా హింసించాడు. ఇంతకీ అతని వయసు ఇరవైలొపే అంటున్నారు. వాళ్ళు నలుగురినీ పోలీసులు ఎన్‌కౌంటర్ చేసి చంపేశారు. ఎంతమంది నేరస్థుల్ని ఈ విధంగా ఎన్‌కౌంటర్ చేసి చంపేయగలం? ఇది న్యాయమా? ఈ కేసులో సరే – నేర నిర్దారణ ఎలా చేస్తాం?
దోషికి శిక్ష పడకున్నా, నిరపరాధికి శిక్ష పడకూడదని కదా శాస్త్రం చెబుతోంది. అంటే ఇలాంటి దుర్మార్గమైన నేరాలు చేసినవారిని రక్షించాలనీ, కాపాడాలనీ కానే కాదు. స్త్రీలపై దాడిచేసి హింసించిన వారికి కఠిన శిక్ష అమలు పరచాల్సిందే. అది న్యాయ వ్యవస్థ ద్వారా జరగాలని మాత్రమే ఈ ఆవేదన.
ఉన్నావ్ కేసులో సాక్షులు లేకుండా చేశారు. అలాంటి రాజకీయ దుర్మార్గాన్ని అరికట్టాలి. అత్యాచారాలు చేసినవారు, హత్యలు చేయించినవారు గూండాలు, రౌడీలు, చట్టసభల్లో రాజకీయ నాయకుల్లా కూర్చునే వీలు లేకుండా చేయాలి. ఓటు హక్కు గల ప్రజలుగా మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం అది.
ఈ కేసులిలా జరుగుతూ, వార్తల్లో చూస్తూ తల్లడిల్లి పోతుండగానే ఎన్ని దుర్ఘటనలు. నలభై ఏళ్ళ వాడు తొమ్మిదేళ్ళ పిల్లని, పన్నెండేళ్ళ పిల్లాడు తొమ్మిదేళ్ళ పిల్లని, ఇలా ముక్కుపచ్చలారని పిల్లల్ని, పసిపిల్లల్ని కూడా హింసించిన వార్తలు వస్తున్నాయి.
పదేళ్ళ పిల్లవాడికి ఆడవాళ్ళని చూసే దృష్టిలో ఉండే రుగ్మతని పసిగట్టాలి. దాన్ని సరిచెయ్యాలి. స్మార్ట్‌ఫోన్లలో సెక్స్ కార్యక్రమం మొత్తం చూసే అవకాశం కలుగుతున్నప్పుడు దాన్నెలా అరికట్టాలో ఆలోచించాలి. అప్పుడే హార్మోన్లు, వాటి ప్రభావం శరీరం మీద చూపిస్తున్న తరుణంలో పిల్లవాడిలో
ఉద్రేకాలు ఎలా ఉంటాయి? వాటి పర్యవసానం ఏమిటి?
ఇంట్లో క్రమశిక్షణ లేదు. ఇంటర్నెట్ కంట్రోల్ లేదు. దిగువస్థాయిలో అల్లాడుతున్న యువతకి చదువు లేదు. సమాజ బాధ్యత లేదు.
సమాజం ఇప్పటికే భ్రష్టుపట్టి పోయింది. మరింత చెడిపోకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత అందరిమీదా ఉంది. ఒక ప్రభుత్వాన్నో, పోలీసు వ్యవస్థనో, రాజకీయ నాయకులనో, సినిమాలనో, మీడియా వాళ్ళనో, ధనవంతులనో ఎవరినో కొందర్ని వేలెత్తి చూపి ప్రయోజనం లేదు.
అందరూ సమిష్టిగా, చిత్తశుద్దితో కృషి చేస్తేనే మనకి మంచి భవిష్యత్తు ఉంటుంది. నిజంగా స్త్రీలు భద్రత కలిగి, గౌరవంగా, స్వాభిమానంతో, స్వేచ్ఛగా తిరగగలిగే రోజు కోసం ఎదురు చూడాలి. ఆ మంచి రోజుల కోసం అందరూ కృషి చెయ్యాలి.