యుద్ధం చిదిమేసిన ప్రేమ: ‘ది క్రేన్స్‌ ఆర్‌ ఫ్లయింగ్‌’ (1957) -బాలాజీ

ప్రపంచాన్నే జయించాలనుకున్న జాత్యాహంకారి ఫాసిస్ట్‌ నాజీ హిట్లర్‌ దురాక్రమణకు అడ్డుకట్ట వేయడానికి సోవియట్‌ రష్యా సైనికులూ, పౌరులూ కలిపి రెండు కోట్ల డెబ్భై లక్షల మంది ప్రాణాలొడ్డారు. ‘ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గేది లేదు’ అనుకునే ఒక నియంత కోసం దేశ, పరదేశ ప్రజలు చెల్లించే భారీ మూల్యాలు ఈ స్థాయిలో ఉంటాయి. ఈ అశేష త్యాగాల ఫలితంగా ప్రపంచ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. చెదిరిన జీవితాల్లో మిగిలిన చిగురుల్ని ప్రోదిచేసుకుని ముందుకు సాగారు. సుదూరాల్లోంచి, భవిష్యత్తులోంచి చూస్తే యుద్ధం కొన్ని గణాంకాల సమాహారమే. కానీ, సమీపంలోంచి చూస్తే సమసిన ప్రతి జీవితం ఒక విషాద గాధను వినిపిస్తుంది. అటువంటి రణరక్తసిక్తమైన సోవియట్‌ ప్రేమ జంట కథే ‘ది క్రేన్స్‌ ఆర్‌ ఫ్లయింగ్‌’.

రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియట్‌ త్యాగాలను చిత్రీకరించిన సినిమాలు స్టాలిన్‌ హయాంలోనూ చాలా వచ్చాయి. కానీ, వాటిలో అధిక భాగం ప్రభుత్వ నిర్దేశాల మేరకు తయారవుతూ, మహా నాయకుల నేతృత్వంలో ప్రజా పోరాటాలు, త్యాగాలు అన్న మాదిరిగా ప్రచార ధోరణిలో, ఒకింత మూస ధోరణిలో సాగేవి. కాబట్టి అవి స్థల కాలాలకతీతమైన శాశ్వతత్వాన్ని సంతరించుకోలేకపోయాయి. స్టాలిన్‌ అనంతర కాలంలో కళారూపాల వ్యక్తీకరణలో సడలింపులు వచ్చాయి. ‘అలా వచ్చిన స్టాలిన్‌ యుగానంతర అతి గొప్ప సినిమా ఇది’ అని ప్రశంసించారు సినీ విశ్లేషకురాలు జోసెఫిన్‌ వోల్‌. యుద్ధం ఒక సామాన్య రష్యన్‌ స్త్రీ జీవితాన్ని ఛిద్రం చేసిన వైనాన్ని ఆమె దృక్కోణంలో చిత్రించింది ఈ సినిమా. సోవియట్‌ బయట సినీ ప్రపంచం ఈ సినిమాని వెంటనే గుర్తించి గౌరవించింది. 1958లో ఈ సినిమా కేన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో పామ్‌ డియోర్‌ అవార్డును గెలుచుకుంది. ఈ అవార్డు పొందిన ఏకైక సోవియట్‌ సినిమా ఇదే కావడం విశేషం. ఈ సినిమా తర్వాత వచ్చిన ‘బల్లాడ్‌ ఆఫ్‌ ఎ సోల్జర్‌’ (1959), ‘ఇవాన్స్‌ ఛైల్డ్‌ హుడ్‌’ (1962) లాంటి సినిమాలు కూడా బహు ప్రశంసలు పొందాయి.

సినిమా కథ:

యువ ఇంజనీర్‌ బోరిస్‌ (అలెక్సీ బటారోవ్‌), వెరోనికా (టటియానా సమోయిలోవా) గాఢ ప్రేమికులు. సువిశాలాకాశంలో ఎగిరే కొంగలు వారికి ప్రేరణ. వారి నిష్కపట ప్రేమకు అడ్డే లేదు. తాము ఏ డ్రెస్సులు వేసుకుని, ఎలా వివాహం చేసుకోబోతున్నారో కలలు కంటున్నారు వారు. కుమారుడు అర్థరాత్రి ఇంటికి వస్తే నిద్ర నటిస్తున్న తండ్రి ‘ప్రేమ అనేది ప్రమాద రహిత మానసిక రోగంలే’ అనుకుంటాడు. బోరిస్‌ తండ్రి ఫ్యోడర్‌ ఇవనోవిచ్‌ (వాసిలి మెర్కురీవ్‌) ఆ ఊరిలో పేరున్న వైద్యుడు. తండ్రితో పాటు తల్లి, అక్క ఇరినా, కజిన్‌ మార్క్‌ (అలెగ్జాండర్‌ ష్వోరిన్‌) ఆ ఇంట్లో

ఉంటున్నారు. మార్క్‌కి కూడా వెరోనికా అంటే ఇష్టం. ఆమెను మెప్పించడానికి వ్యర్థ ప్రయత్నాలు చేస్తుంటాడు.

ఇంతలో జర్మనీ సోవియట్‌పై దాడి చేస్తుంది. మాతృదేశ రక్షణ కోసం పిలుపు రాక మునుపే తన స్నేహితుడు స్టెఫాన్‌తో కలిసి రణక్షేత్రానికి దరఖాస్తు పెడతాడు బోరిస్‌. బోరిస్‌ నిర్ణయాన్ని విని విస్తుపోతుంది వెరోనికా. కానీ దేశ రక్షణ కోసం బోరిస్‌ కృతనిశ్చయం ముందు ఆమె ఏమీ మాట్లాడలేదు. వెరోనికా పుట్టినరోజు నాడే ఆర్మీలో చేరతాడు బోరిస్‌. తను ‘ఉడుతా’ అని ప్రేమగా పిలిచే ప్రేమికురాలి కోసం ఒక ఉడుత బొమ్మను కానుకగా పంపిస్తాడు. కానీ, ఆ బొమ్మలో దాచిపెట్టిన ఉత్తరం సంగతి వెరోనికాకి తెలీదు. వెరోనికా తన ప్రేమికుడికి వీడ్కోలు చెబుదామని ఆర్మీ కార్యాలయానికి వెళ్తుంది. కానీ ట్రాఫిక్‌ రద్దీ కారణంగా అతడిని కలిసి వీడ్కోలు చెప్పలేకపోతుంది. అక్కడ్నుంచి ఆమె కష్టాలు పెరుగుతూనే ఉంటాయి.

జర్మన్‌ సైన్యాలు సోవియట్‌ జనావాసాలపై బాంబు దాడులు చేస్తాయి. ప్రజలు కందకాలలో దాక్కుంటారు. కానీ, వెరోనికా తల్లిదండ్రులు తమ అపార్ట్‌మెంట్‌ నుండి రావడానికి నిరాకరిస్తారు. ఫలితంగా, ఆ దాడుల్లో ప్రాణాలు కోల్పోతారు. వారి ఆనవాళ్ళు కూడా దొరకవు. ‘అయినా ముందుకు సాగిపో’ అని చెప్పడానికా అన్నట్లు ఒక్క గోడ గడియారం మాత్రం నడుస్తుంటుంది. అనాధగా మారిన వెరోనికాను ఫ్యోడర్‌ తన ఇంటికి ఆహ్వానిస్తాడు. బోరిస్‌ నుండి ఉత్తరాలు రావడం లేదన్న బాధకు తోడు వెరోనికాకు మార్క్‌ వేధింపులు ఎక్కువవుతాయి. బోరిస్‌ కోసం ఎదురు చూస్తున్న ఆమె అతన్ని నిరంతరం తిరస్కరిస్తుంది. మరో బాంబు దాడి సమయంలో ఒంటరిగా

ఉన్న వెరోనికాపై మార్క్‌ అత్యాచారం చేస్తాడు. అపరాధ భావంతో, అలసటతో, ఏదో ఆవహించిన జడత్వంతో వెరోనికా మార్క్‌ను వివాహం చేసుకోవడానికి అంగీకరిస్తుంది. విషయం తెలియని బోరిస్‌ కుటుంబ సభ్యులు బోరిస్‌కు ద్రోహం చేసిందని వెరోనికాను తప్పుగా అర్థం చేసుకుంటారు.

మార్క్‌ చేతిలో వెరోనికా జీవితం నలిగిపోయిన కాలంలోనే అటు యుద్ధ రంగంలో గాయపడిన స్నేహితుడు స్టెఫాన్‌ ప్రాణాలను కాపాడుతూ తాను తూటాకు గురై మరణిస్తాడు బోరిస్‌. ఆ సంగతి అతని కుటుంబానికి కానీ, వెరోనికాకి కానీ తెలియదు. జర్మన్‌ దాడుల నుండి కాపాడడానికి చాలా కుటుంబాలతో పాటు ఫ్యోడర్‌ కుటుంబాన్ని కూడా తూర్పు ప్రాంతానికి తరలిస్తారు. తాత్కాలిక గృహాలలో నివసిస్తూ ఫ్యోడర్‌, ఇరినా, వెరోనికాలు గాయపడిన సైనికులకు సైనిక ఆస్పత్రిలో వైద్య సేవలు అందిస్తుంటారు. వెరోనికాను సాధించేసుకున్న మార్క్‌ తన సమయాన్ని పార్టీల్లో, జల్సాల్లో గడుపుతుంటాడు. వెరోనికాకు ఆ వివాహ బంధంలో సంతోషమన్నది మిగల్లేదు.

తాను యుద్ధ మైదానంలో ఉండగా తన ప్రేయసి మరొకతన్ని పెళ్ళి చేసుకుందని తెలుసుకున్న సైనికుడొకడు ఆస్పత్రిలో గోల చేస్తుంటాడు. తనను చావనీయమని, వైద్యం వద్దనీ కేకలు వేస్తుంటాడు. ఫ్యోడర్‌ అతన్ని కోప్పడి సముదాయిస్తాడు. ‘యుద్ధానికి వెళ్ళిన వీరుడి కోసం వేచి ఉండలేకపోయిన అటువంటి ఆడదాన్ని మరిచిపోవడమే మేలు’ అన్న ఫ్యోడర్‌ మాటల్ని చాటుగా విన్న వెరోనికా కలత చెందుతుంది. ఆ మాటలు తనను ఉద్దేశించినవిగా అన్పిస్తాయి. అసలే వివాహ బంధంలో దెబ్బతిన్న వెరోనికా తీవ్ర అపరాధ భావంతో వేగంగా వచ్చే రైలు ముందు దూకి చనిపోవాలనుకుంటుంది. కానీ ఆఖరు క్షణాల్లో కారు కింద పడబోతున్న ఒక పసివాణ్ణి కాపాడుతూ తన ప్రయత్నాన్ని విరమించుకుంటుంది. ఆ యుద్ధ అనాధ బాలుడి పేరు కూడా బోరిస్‌ కావడంతో అతడ్ని దత్తత తీసుకుని తన జీవితానికి ఒక లక్ష్యం దొరికిందనుకుంటుంది.

ఫ్యోడర్‌కి మార్క్‌ అసలు స్వరూపం తెలుస్తుంది. తన మంచి పేరును వినియోగించి, ఒక అధికారికి లంచమిచ్చి మరీ యుద్ధానికి వెళ్ళకుండా తప్పించుకున్నాడని తెలుస్తుంది. మార్క్‌ రష్యాకు మాత్రమే కాకుండా, తన కుటుంబానికి కూడా ద్రోహం చేశాడని తెలుసుకున్న ఫ్యోడర్‌ మార్క్‌ను తన ఇంటి నుండి తరిమేస్తాడు.

బోరిస్‌ ప్లాటూన్‌లోని ఒక సైనికుడు అతని మరణవార్తను మోసుకొస్తాడు. వెరోనికా మాత్రం తాను ఆ వార్తను నమ్మనంటుంది. జర్మన్‌ పతనంతో యుద్ధం ముగిసిన తర్వాత, వీర సైనికులు తిరిగి వచ్చినపుడు స్టెఫాన్‌ బోరిస్‌ మరణవార్తను ధృవపరుస్తాడు. వెరోనికాకు ఒక పుష్పగుచ్ఛం అందిస్తాడు. జయజయ ధ్వానాల జనసమూహం మధ్య కన్నీళ్ళతో తూలుతూ అడుగులు వేస్తుంది వెరోనికా. రైలింజన్‌ పైకి ఎక్కి స్టెఫాన్‌ ఉద్వేగపూరితమైన ప్రసంగం చేస్తాడు.

”కాలం ముందుకు సాగుతుంది.

పట్టణాలు, గ్రామాలు పునర్నిర్మితమవుతాయి.

మన గాయాలు నయమవుతాయి.

కానీ యుద్ధంపై మనకున్న తీవ్రమైన ద్వేషం ఎప్పటికీ తగ్గదు.

ఈ రోజు తమ ప్రియమైన వారిని కలవలేని వారి బాధను మనం పంచుకుందాం.

ప్రేమికులు మళ్ళీ యుద్ధం వలన వేరుపడకూడదు, అందుకు ఏమైనా చేద్దాం.

తల్లులు తమ పిల్లల జీవితాల కోసం మరలా భయపడనవసరం రాకూడదు.

దాచిన కన్నీళ్ళు తండ్రులను ఎప్పటికీ ఉక్కిరిబిక్కిరి చేయకూడదు.

గెలిచిన మనం వినాశకరమైన పనులు చేయకూడదు.

కొత్త జీవితాన్ని నిర్మించడానికే పనిచేయాలి”.

వెరోనికా తన దుఃఖాన్ని దిగమింగుతూనే ఒక్కో పువ్వునూ తిరిగొస్తున్న సైనికులకు అందిస్తుంది. అదే సమయంలో ఆకాశంలో ‘వి’ ఆకారంలో ఒక కొంగల గుంపు ఎగురుతూ కనిపిస్తుంది. సినిమా ఆరంభంలో వెరోనికా వర్ణించినట్లు ‘అందమైన కొంగలు, ఆకాశంలో ఓడల్లా! తెల్లతెల్లని కొంగలు, ఊదారంగు కొంగలు, పొడుగాటి ముక్కులతో ఎగురుతున్న కొంగలు!’ – ఎన్నో విషాదాల మధ్య మరో కొత్త జీవితానికి ప్రతీకలా!

దర్శకుడు – సాంకేతిక వర్గం:

ఈ సినిమా దర్శకుడు మిఖాయిల్‌ కలటోజోవ్‌. విక్టర్‌ రోజోవ్‌ నాటకం ‘ఫరెవర్‌ అలైవ్‌’ ఆధారంగా ఈ సినిమాను రూపొందించాడు. సంభాషణలకంటే సినిమా భాష ద్వారా, నటన ద్వారా కథను అర్థం చేయడానికి ప్రయత్నిస్తాడు దర్శకుడు. అందుకు సరిజోడిగా అతడితో గతంలో కలిసి పనిచేసిన సినిమాటోగ్రఫర్‌ సెర్గీ ఉరుసేవ్స్కీ, అంతే ప్రతిభావంతంగా ఎడిటర్‌ మరియా టిమోఫేయేవా సహకరించారు. మెయిసీ వాన్బెర్గ్‌ సంగీతం దృశ్యాన్ని మింగేయకుండా దానికి సహాయకారిగా పనిచేస్తుంది. వంకర్లు తిరిగిన మెట్లపై కథానాయకుడు పరుగెత్తే సందర్భాల్లో వినిపించే నేపథ్య సంగీతం ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో మనం విన్నదేననిపిస్తుంది.

కొన్ని కొన్ని ఐకానిక్‌ దృశ్యాలు సదా గుర్తుండిపోతాయి. వాటిలో అతి గొప్ప దృశ్యం బోరిస్‌కు తుపాకి గుండు తగిలి చనిపోతున్నప్పటి దృశ్యం. గుండు తగలగానే కళ్ళు బైర్లు కమ్మడం, చనిపోతున్నానని అన్పించగానే ఉన్నపళంగా ప్రేయసి దగ్గరికి తిరుగుడు మెట్లమీద నుంచి పరిగెడుతున్నట్లు కలగనడం, గది తలుపు తెరుచుకోగానే లోపల్నుంచి మ్యారేజ్‌ గౌన్‌లో వెరోనికా, నల్లని కోట్‌లో తానూ, సుకుమారమైన ఆ గౌన్‌ వస్త్రంతో దృశ్యమంతా కప్పబడిపోవడం, ఆ దృశ్యంపైనే పొడుగాటి చెట్లు గిరగిరా వేగవంతంగా తిరగడం, రెండు మూడు దృశ్యాలు ఒకదానిపై ఒకటి సూపరింపోజ్‌ చేసి చూపిన వైనం ఆనాటికి సరికొత్త ప్రయోగం. నిజంగా అలానే చనిపోతారేమో అన్పించే ఆ దృశ్యాన్ని ఆ తర్వాత ఎందరు దర్శకులు ఎన్నిసార్లు కాపీ కొట్టారో!

మిలట్రీ క్యాంప్‌ దగ్గర వెరోనికా బోరిస్‌ను వెదుకుతున్న దృశ్యం కూడా మరో గుర్తించదగ్గ దృశ్యం. ఇది వెరోనికా కథే అని చెప్పడానికి కెమెరా నిత్యం ఆమెకు సమీపంగా మసలుకోవడం మనం గమనించవచ్చు. ప్రేమికుడ్ని ఒకసారి మనసారా చూడడానికి వీథుల్లోంచి వెళ్తున్న ట్యాంక్‌ల మధ్య వెరోనికా పరుగెడుతున్నట్లు చూపిన క్రేన్‌ షాట్‌ మరో హైలైట్‌. అమెరికా సినిమాటోగ్రఫర్‌ హస్కేల్‌ వెక్లైర్‌ తనపై అత్యంత ప్రభావం చూపిన షాట్‌ ఇదే అని చెబుతాడు. కొంగల్ని, తెల్లని పువ్వుల్ని, మెలికలు తిరిగిన మెట్ల వరుసల్ని సింబాలిక్‌గా వినియోగించుకున్నాడు దర్శకుడు. ప్రేమికురాలిని చేరడానికి ఒకసారి, తల్లిదండ్రుల మృత్యువును తెలపడానికి ఒకసారి, ఒకసారి ఆనందానికి, మరోసారి విషాదానికి దారి చూపుతుంది మెట్ల వరుస. విధ్వంసం శిధిలాల మధ్య కూడా గడియారంలోని లోలకం శబ్దం చేస్తూ, కాలం ఆగిపోదని చెబుతుంది.

ఆత్మహత్య దృశ్యంలో వెరోనికా పరిస్థితిని ప్రేక్షకులు తామే అనుభవించేలా దృశ్యీకరించాడు దర్శకుడు. వెరోనికా మనసును మార్చడానికా అన్నట్లు పసివాడితో కొంచెం కామిక్‌ టచ్‌ ఉన్న మాటలు మాట్లాడించాడు దర్శకుడు. ‘ఎవరి అబ్బాయివి నువ్వు?’ అని అడిగితే ‘మా అమ్మ అబ్బాయిని’ అని చెబుతాడు. ‘నీ వయసెంత?’ అన్న ప్రశ్నకు ‘మూడు నెలల మూడు సంవత్సరాలు’ అని బదులిస్తాడు బుల్లి బోరిస్‌. అంత విషాదంలోనూ, అతి చిన్న చిరునవ్వు మెరిపిస్తుంది నటి. రష్యన్‌ సినిమాలో నిజంగా మరపురాని నటి టటియానా. ఈమెను హాలీవుడ్‌ అడ్రి హప్బర్న్‌తో పోల్చారు చాలామంది.

రెండో ప్రపంచ యుద్ధం ముగిసి 75 ఏళ్ళు కావస్తోంది. ప్రపంచం మరో ప్రపంచ యుద్ధానికి సమాయత్తమవుతోందా అనిపించేలా ఉంది ఈనాటి వాతావరణం. ”యుద్ధాన్ని మానవీకరించుకునే పరిస్థితి లేదు, దాన్ని నిషేధించాల్సిందే”నంటాడు ఐన్‌స్టీన్‌. యుద్ధ బీభత్సాన్ని చూపే ఇటువంటి నలుపు-తెలుపు దృశ్య కావ్యాలు ఈ కాలానికి ఒక హెచ్చరికలా పనిచేస్తాయి.

(రస్తా వెబ్‌ మ్యాగజైన్‌ నుండి)

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.