దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ -అక్కిరాజు రమాపతి రావు

(గత సంచిక తరువాయి…)

చదువు సంధ్యలు, పెళ్ళి

చదువుగాని, ఆటగాని, పాట గాని దుర్గాబాయికి ఎవరూ ఏమీ నేర్పనక్కరలేదు. నేర్చుకుంటానంటే చాలు. కానీ ఆ ఎనిమిదేళ్ళ ఆరిందా, తొమ్మిదేళ్ళ ఆలోచనపరురాలు, అనుభవశాలి, ఇతరులకు నేర్పుతుంది. ఆ ప్రతిభ ఆమెకు పుట్టుకతోనే సహజంగా వచ్చినట్లనిపిస్తుంది.

ఎవరికైనా తెలుగులో పాండిత్యం సంపాదించాలనో, ఇంగ్లీషు బాగా నేర్చుకోవాలనో, లేదా సంస్కృతంలో ప్రావీణ్యం సంపాదించాలనో బాల్యంలో ఉబలాటం ఉండవచ్చు. కానీ హిందీ నేర్చుకోవాలన్న అభిలాష కొంతవరకు అపురూపమే. కాకినాడలో హిందీ బాలికా పాఠశాల అవసరం అప్పట్లో ఏముంది? తాను తొమ్మిదేళ్ళ పిల్లే కదా!

విద్యుదుత్పాదక యంత్రాన్ని (డైనమో) పనిచేయిస్తే అది విద్యుత్తును తప్ప దేన్ని ప్రసారం చేస్తుంది. విద్యుద్దీపాలను మరేదీ వెలిగలించలేదు? దుర్గాబాయికి హిందీపట్ల అభిలాష కలగడానికి, అభీష్టం ఏర్పడడానికి సుప్త చైతన్య ప్రభావం, ప్రబోధం ఏదో ఉందన్నట్లు అనిపిస్తుంది. అదేమంటే తాను గాంధీజీతో సన్నిహితంగా మాట్లాడాలని కావచ్చు. ఆయన్ని మెప్పించాలని కావచ్చు. తనలోని చైతన్యాన్ని ఆయనకు ఎరుక పరచాలని కావచ్చు. లోకమాన్య తిలక్‌ స్వరాజ్య నిధిని ఏర్పరచాలని, దేశంలో కోటి రాట్నాలను నెలకొల్పాలని గాంధీజీ దేశాటన ప్రబోధం చేస్తూ రాజమండ్రి వచ్చిపుడు, భవిష్యత్‌ శుభసూచన సంఘటనలకు ఆధారంగా దుర్గాబాయి ప్రథమ కౌమార దశలోనే ఆయన్ను సందర్శించింది.బంధువులింట్లో పెళ్ళికి వచ్చిన దుర్గ గాంధీగారి సభకు తాను ఒక్కతే లేదా తనతోటి ఒకరిద్దరు పిల్లలతో పోకపోతే ఏం నష్టం? ఆ పిల్లకు నష్టమేమీ కలగకపోవచ్చు. కానీ దేశానికి అరిష్టం తొలగించడానికి కదా ఆమె పుట్టింది! ఆ సభకు పోకుండా ఎట్లా ఉండగలదు. అది 1920 లేదా 21 కావచ్చు.

గాంధీజీ సందర్శనోత్సుకులై వేలాదిమంది వచ్చిన సభ అది. తిలక్‌ మహారాజ్‌ పరమపదించాడు. నరరూప రాక్షసుడు డయ్యర్‌ జలియన్‌ వాలాబాగ్‌లో అంతకు ముందే ఘోరకలి సృష్టించాడు. దేశమంతా అల్లకల్లోలంగా ఉంది. విషమ పరిస్థితులలో కొట్టుమిట్టాడుతున్నది. మరి గాంధీగారి సభకు జనం నేల ఈనినట్లు రారా! ఆ సభలో గాంధీజీ ప్రబోధం ఆమెకు పూర్తిగా బోధపడిందో లేదో. అయితే సభలో జరుగుతున్న సంరంభం చూసింది. ఎవరో ముచ్చటపడి ఆమెకు గాంధీ టోపీ ఇచ్చారు. బారుల వెంట జన సందోహంలో విరాళాల వసూలుకు దుర్గ పూనుకొన్నది. ఆనాటి భావోద్వేగం అటువంటిది. కమల నయన దుర్గ, పసిడి బుగ్గల దుర్గ, ఖద్దరు టోపీ పెట్టుకొని విరాళ సేకరణకు వస్తే ఎవరు నిస్తబ్దంగా, నిస్తేజంగా

ఉండగలరు. ఇట్టే ఆమె చేతుల్లో టోపీ అంచులదాకా, అది ఇక మరి పట్టనట్లు నిండిపోయింది. ఈ విరాళ సేకరణను మహాత్ముడికి చేర్చాలి. తాను స్వయంగా ఆయన దరిచేరి తను మురిసిపోవాలి, ఆయనను మురిపించాలి అని సతమతమైపోతున్న దుర్గను ఆ జనసందోహపు తాకిడి నుంచి పదిలంగా నడిపించుకొనో, ఎత్తుకొనో ఒక మహాశయుడు గాంధీజీ వద్దకు చేర్చాడు. గాంధీజీ ఈ ‘మహానాయకురాలి’ని, ఈ దేశభక్తురాలిని చూసి పులకించిపోయాడు. బోసి నవ్వుల్లో తడిపి వెన్నెలలు విరియింపచేశాడు. ఆ నిధిని, ఆ పెన్నిధిని తన సుకుమార సుదృఢ హస్తాలతో ఆయనకు సమర్పిస్తుండగా ముద్దు మూటకట్టే వాత్సల్యంతో ఆమె రెండు చేతులు దొరకబుచ్చుకొని మరి ‘వీటి మాటేమిటి?’ అని దుర్గ చేతుల బంగారు గాజులను

ఉద్దేశించారు గాంధీజీ. ఆయనా మాటలు హిందీలోనే అడిగి ఉంటారు. ఎటువంటి బెరుకు లేకుండా దుర్గ ఆ పసిడి గాజులాయనకు దూసి ఇచ్చింది. ఈ సంఘటనతో గాంధీ మహాత్ముడామెను పోల్చుకున్నాడు.

శ్రీ రామకృష్ణ పరమహంస, వివేకానందుణ్ణి ప్రథమ వీక్షణంలోనే పోల్చుకోలేదా? అట్లా! ఆధ్మాత్మిక దివ్య పురుషుల జీవిత సంఘటనలలో ఇటువంటివి సహజమే. ఈ విధంగా దుర్గాబాయి, గాంధీజీని మొదటిసారి దర్శించడం ఒక ఆత్మిక సంఘటన, పారమార్థిక సన్నివేశం.

అప్పుడా బాలిక అంతరాంతరాలలో తనకు తెలియకుండానే తాను ఆయన ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకోవాలని భావించి ఉంటుంది. దానికి హిందీ నేర్చుకోవడం సులభ సాధనం. ఆ సభలో గాంధీజీ దేశ పరిస్థితులను వివరించి ఉంటారు. విదేశీ వస్తు బహిష్కారం ప్రబోధించి ఉంటారు. ఇంగ్లీషు వారి చదువులు, ఇంగ్లీషు వారి కోర్టులు, వారి ఉత్పత్తులు బహిష్కరించాలని 1929ల నాటికే దేశనాయకులు ప్రబోధిస్తూ వచ్చారు. అనేక ప్రాంతాలలో జాతీయ పాఠశాలలు, జాతీయ విద్య నెలకొన్నాయి. కాబట్టి ఇంగ్లీషు నేర్చుకోవడంకన్నా, దేశీయ భావ సమైక్యానికి హిందీ నేర్చుకోవడం అగత్యం అని దుర్గాబాయి ఆ లేత ప్రాయంలోనే గ్రహించింది. ఆమె జీవితంలోని తరువాత సంఘటనలన్నీ ఆమెపై గాంధీజీ ప్రభావాన్ని నిరూపిస్తున్నాయి. 1920 నుండి 1930 దాకా ఆంధ్ర దేశంలో హిందీ ప్రచారం దేశభక్తి ప్రబోధాత్మకంగా బాగా వ్యాపించింది. 1921లోనే దక్షిణ భారత హిందీ ప్రచార సభ స్థాపనమైంది. 1923లో జరిగిన కాకినాడ కాంగ్రెస్‌ మహాసభలో ఆహ్వాన సంఘ అధ్యక్షోపన్యాసం హిందీలోనే జరిగినట్లు కొండా వెంకటప్పయ్య పంతులు స్వీయచరిత్రలో స్వాభిమాన పూర్వకంగా ప్రస్తావించారు.

రాజమండ్రి నుంచి కాకినాడ చేరిన తర్వాత కాకినాడలో త్వరలో జరగబోయే అఖిల భారత కాంగ్రెస్‌ సమావేశ సభలు కూడా దుర్గాబాయి దృష్టికి వచ్చి ఉంటాయి. ఆమెలో బోధక సామర్ద్యం, ప్రబోధక ఆదర్శం మొదటినుంచి వెల్లివిరుస్తూనే ఉన్నాయి. చుట్టుపక్కల ఇళ్ళలోని పెద్దవాళ్ళకూ, తన ఈడూ, ఇంకా చిన్నపిల్లలకు దుర్గాబాయి ఎప్పుడూ ఒక అయస్కాంతమే, ప్రబలాకర్షణమే. ఆమెకు వచ్చిన విద్యలు తమలో ఎవరికీ రావు. ఆమె పెట్టే రకరకాల ముగ్గులు, రంగు రంగుల ముగ్గులు కాకినాడలోనే ఎవరికీ రావు. 1923లో కాకినాడలో జరగబోయే కాంగ్రెస్‌ మహా సభలకు ఒక ఏడాది ముందునుంచే సన్నాహాలు జరుగుతూ వచ్చాయి. అంతకు పూర్వమే కాకినాడలో ఖాదీ అమ్మకాల ఉద్యమం ఊపందుకుంది. స్థానిక నాయకులు ఇంటింటికీ వెళ్ళి ఖాదీ అమ్మకాన్ని ప్రోత్సహిస్తున్నారు. అతి నాజూకైన, నాణ్యమైన నూలు వడకి తీసి అపురూపమైన ఖాదీ కాకినాడ, చుట్టపక్కల తయారవుతున్నది. కాకినాడ సమీపంలోని ఉప్పాడలో తయారయ్యే ప్రశస్తమైన ఖాదీ భారతదేశంలోనే పేరు తెచ్చుకుంది. ఇంటింటి అమ్మకాలకు దువ్వూరి సుబ్బమ్మగారికి నాయకత్వం లభించింది. మోయలేనంత పెద్ద ఖాదీ బట్టల మూట నెత్తికెత్తుకొని ఆమె వీథి వీథికి తిరిగేది. అప్పటికి పది, పదకొండేళ్ళ వయసు కూడా దాటని దుర్గాబాయమ్మ, ఆమె తల్లి కృష్ణవేణమ్మ ఈ ఖాదీ అమ్మకాల ఉద్యమంలో ప్రధాన పాత్ర ధరించారు. పోలీసులు వారి వెంటబడి వేధించినా జంకలేదు.

విదేశీ వస్త్ర నిషేధం, ఖాదీ ప్రచారం, మద్యపాన నిరోధం ప్రచారం ప్రారంభమయ్యే నాటికే ఆంధ్రదేశంలో చాలా మేలిరకపు ఖాదీ తయారవుతున్నట్లు తెలుస్తున్నది. హిందీ ప్రచారం, దేశభక్తి, స్వాతంత్రోద్యమ సంరంభం, జాతీయోద్యమం దృష్ట్యా తెలుగువారు త్రికరణశుద్ధిగా పాటించారు. దుర్గాబాయి పుట్టటానికి ముందే జాతీయ భావన తెలుగునాట బలంగా వేళ్ళూనుకున్నది.

ఖాదీ ప్రచారానికీ, తిలక్‌ నిధికీ గాంధీజీ ఆంధ్రదేశంలో పర్యటిస్తున్న సందర్భంగా తణుకు వచ్చినపుడు ఆయన ఎర్రమిల్లి రామనాథం గారనే దేశభక్తుడింట బసచేశారు. అప్పుడాయనతో టంగుటూరి ప్రకాశం, భోగరాజు పట్టాభి సీతారామయ్య ప్రభృతులున్నారు. దువ్వూరి సుబ్బమ్మగారు గాంధీజీని దర్శించడానికి వచ్చింది. ఖాదీ ప్రచారంలో సుబ్బమ్మగారికి తెలుగునాట ఎంతో ప్రసిద్ది ఉంది. ఆమెను చూసి గాంధీగారు హాస్య స్ఫోరకంగా, వేళాకోళంగా దేశీయ పరిశ్రమలను, చేనేతను ప్రోత్సహించమంటూ, ఖద్దరు వాడకాన్ని ప్రచారం చేయడమంటే మరీ అంత నాజూకైన, పొందికైన ఖద్దరు ధరించడం కాదు కదా! అని ఆమె ధరించిన అందమైన ఖద్దరు ఉడుపులను చూసి ఛలోక్తి విసిరారట. అప్పుడు సుబ్బమ్మగారు ఊరుకోకుండా ‘బేరసారాల కుటుంబంలో పుట్టి, ఎల్లపొద్దులు లాభనష్టాలలో మునిగి తేలే మీ కులానికి నాజూకు, నాణ్యత గూర్చి ఎందుకు? అందచందాలు, పొందికా అక్కర్లేదా? ఒకవేళ అవి మీకు పట్టవేమో’ అని ఆయనకు బదులు చెప్పిందట. దగ్గరనే ఉన్న ప్రకాశం గారో, పట్టాభిగారో ఆమె మాటలను హిందీలోకి అనువదించి చెప్పగా గాంధీజీ పగలబడి నవ్వినట్లు బులుసు వెంకటేశ్వర్లు గారి స్వీయ చరిత్రలో ప్రస్తావన ఉన్నది. భారతదేశంలోనే అత్యంత ప్రశస్తమైన చేనేత వస్త్రాలు ఆంధ్రదేశంలో తయారయ్యేవి.

ఇక హిందీ వ్యాప్తి కూడా బహుశా హిందీయేతర ప్రాంతాలను మినహాయిస్తే దక్షిణాదిన ఆంధ్ర దేశంలో

ఉద్యమంగా కొనసాగింది 20వ శతాబ్ది ఆరంభానికే. 1906 ప్రాంతాలలోనే బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్రదేశంలో స్వాతంత్రోద్యమ ప్రచారానికి వచ్చారు. ఆయనను ఆహ్వానించి చెన్నపట్నం (చెన్నై) తీసుకు వెళ్ళడానికి సుబ్రహ్మణ్య భారతి రాజమండ్రి వచ్చినట్లు ఆనాటి పెద్దల కథనం. బిపిన్‌ చంద్రపాల్‌ బెజవాడ, బందరు కూడా దర్శించాడు. మద్రాసులో ఆయన బహిరంగ సభలకు అధ్యక్షత వహించడానికి ఎవరూ ముందుకు రావడానికి సాహసించకపోతే ప్రకాశం పంతులుగారు అధ్యక్షత వహించినట్లు ఆనాటి పెద్దల స్వీయచరిత్రలలో ప్రస్తావితమై ఉంది.

బిపిన్‌ చంద్రపాల్‌ బందరు వచ్చినప్పుడు ఆయన గౌరవార్ధం కొన్ని హిందీ నాటకాలు ప్రదర్శించారు స్థానిక నాటక రంగ ప్రముఖులు. ఆ నాటకాలన్నీ దేశభక్తి పూరితమైనవి. ఈమని లక్ష్మణస్వామి గారనే గొప్ప నటుడు ఈ నాటకాలలో అద్భుతంగా నటించేవారు. నాదెళ్ళ పురుషోత్తమ కవి అనే బందరు వాస్తవ్యుడు తెలుగులో కాకుండా హిందీలో మాత్రమే నాటకాలు రచించారు ఆ రోజుల్లో. ఆ నాటకాలు చూసిన బిపిన్‌ చంద్రపాల్‌ ఆంధ్ర దేశంలో అప్పటికే జాతీయోద్యమం, దేశభక్తి, స్వాతంత్య్రకాంక్ష మహత్తరంగా ఉన్నాయనీ, వారికెవరూ బోధించనక్కరలేదనీ, వారికి బోధించే బదులు దేశం వారి వద్దనే నేర్చుకోవాలని ప్రశంసించినట్లు నవ్యాంధ్ర సాహిత్య వీధులు అనే ఇరవయ్యో శతాబ్ది తెలుగు సాహిత్య, సామాజిక వికాస చరిత్రలో ఆనాటి నాటక ప్రదర్శనలు, దేశభక్తి రచనలను గురించి ప్రస్తావన ఉంది.

దుర్గాబాయి జన్మించడానికి పది, పదిహేనేళ్ళ పూర్వం నుంచీ తెలుగునాట చెన్నాప్రగడ భానుమూర్తి, చిలకమర్తి లక్ష్మీ నరసింహం వంటి కవులు దేశభక్తిని, జాతీయోద్యమాన్ని ప్రభావితం చేస్తూ వచ్చారు. ఇక ఆమెకు పదేళ్ళు వచ్చేనాటికి స్వాతంత్రోద్యమం తెలుగునాట తీవ్రతరమైంది. కాబట్టి ఆమెకు తెలుగునాట హిందీ వ్యాప్తి పట్ల ఆసక్తి ప్రబలడం సహజమే.

కాకినాడ కాంగ్రెస్‌ సమావేశం యావద్భారతదేశంలోనూ గొప్ప సంచలనం సృష్టించింది. గాంధీజీ ఎరవాడ జైలులో ఉన్నందువల్ల ఆయన ఒక్కరు తప్ప, సమస్త ప్రాంతాల నుంచి స్వాతంత్రోద్యమ నాయకులంతా ఆ మహాసభ సమావేశానికి హాజరయ్యారు. ఆ సభలతో పాటు అఖిల భారత హిందీ సాహిత్య సమ్మేళనం, జాతీయ ఉత్పత్తుల ప్రదర్శన కూడా ఏర్పాటయ్యాయి.

రాజమండ్రిలో తొలిసారిగా గాంధీజీని దర్శించి వచ్చిన తర్వాత కాకినాడలో దుర్గాబాయి తమ ఇంట్లో ఉన్న విలువైన విదేశీ వస్త్రాలను ప్రజలలో స్వాతంత్రోద్యమ చైతన్యాన్ని రగిల్చేందుకు నడివీథిలో అగ్గిపాలు చేసింది. ఆమె కుటుంబం అందుకు ఆమెను మెచ్చుకున్నదే కానీ ఏ మాత్రం నొచ్చుకోలేదు. ఏడాది తర్వాత జరగబోయే కాంగ్రెస్‌ మహా సమావేశానికి 1922 నుంచే స్థానిక ప్రముఖులు గొప్ప సన్నాహాలు చేశారు. కాంగ్రెస్‌ కార్యాలయం స్థాపించారు. ఆ కార్యాలయం గృహప్రవేశోత్సవం జరుపుతున్నప్పుడు పన్నెండు, పదమూడేళ్ళ దుర్గాబాయిని సాదరంగా పిలుచుకొని వచ్చి ముగ్గులు పెట్టించారు. అప్పుడామె రథం ముగ్గు వేసి రథంపై జాతీయ పతాకను త్రివర్ణ శోభితంగా అలంకరించినట్లు, గాంధీగారు రథ సారథి కాగా, జవహర్‌లాల్‌ నెహ్రు శరసంథానం చేస్తున్నట్లు చిత్రించినట్లు దుర్గాబాయి జీవిత చరిత్రలో శ్రీమతి నేతి సీతాదేవి వర్ణించింది. అంతేకాక షౌకత్‌ఆలీ, మహ్మదాలీ, చిత్తరంజన్‌దాస్‌, ప్రకాశం, పట్టాభి ప్రభృతులు ఆ రథాన్ని లాగుతున్నట్లు ఒక పాట కూడా పాడిందంట.

ఆమె స్థాపించి నిర్వహిస్తున్న బాలికా పాఠశాల నుంచి ఆమె కాంగ్రెస్‌ సమావేశాలలో పనిచేయడానికి ఒక సేవా దళాన్ని కూడా రూపొందించింది. హిందీలో మాట్లాడగలిగిన నలభైమంది ఐచ్ఛిక సేవాదళ సభ్యురాళ్ళతో పాటు ఆరువందల మంది సాధారణ దళాన్ని కూడా ఆమె సృష్టించడం దుర్గాబాయి అసాధారణ నిర్వహణ ప్రజ్ఞకు గొప్ప నిదర్శనం. ఇదంతా ఆ పదమూడేళ్ళ బాలిక ఒకటి, రెండేళ్ళ వ్యవధానంలోనే నిర్వహించగలిగింది.

ఇంతటి అద్భుత ప్రజ్ఞాశాలి అయిన ఆమెకు ఎనిమిదేళ్ళు పూర్తి అయీ కాకుండానే తల్లిదండ్రులు పెళ్ళి చేయడం ఆశ్చర్యాలన్నింటిలో పరమాశ్చర్యకరమయిన విషయం. ఆ తల్లిదండ్రులు అత్యంత నవీన సంస్కార భావ సంపన్నులు అయి ఉండి కూడా ఆమె పెళ్ళికి అంత తొందరపడడం, ఆమెలోని అపూర్వ చైతన్యం, చురుకుతనం, చలాకీతనం, ప్రజ్ఞ, ప్రతిభ గమనిస్తూ ఉండి కూడా మరీ అంత చిన్న వయసులో పెళ్ళిచేయడం ఆ తండ్రిలో తనకే తెలియని ఒక బలహీనత ఏదో ఉన్నట్లు భావించాలి. తన జీవితంలో తాను చేసిన ఒకే ఒక్క అతి పెద్ద పొరపాటు ఇది అని దుర్గాబాయి తండ్రి రామారావుగారు తరువాత పశ్చాత్తాపపడినట్లు దుర్గాబాయి స్వీయచరిత్రలో చెప్పినా, తరువాత కాలంలోని పరిణామాలను కలగనలేక పోయినాడనుకొన్నా ఆయన పుత్రికా ప్రేమను ఆయన అంతరాంతరాలలోని ఒక బలహీనత, సంపన్న కుటుంబంలో బిడ్డనిస్తున్నానన్న ఉత్కంఠ ఆయనను ప్రేరేపించి ఉంటాయి. ఈ సంఘటనకు సహేతుకతను కానీ, తర్కబద్దతలను కానీ ఆపాదించలేము, ఊహించలేము కూడా.

రామారావు గారు తమ కూతురు భోగభాగ్యాలతో తులతూగుతుందనీ, అది జమిందారీ ఫాయా సంబంధమనీ, తమకన్నా హోదాగల, సంపన్నమైన వియ్యమనీ తలచి ఉంటారు, ఊహించి ఉంటారు. రామారావు గారికి కూడా బెండమూరు లంకలో ఒక చిన్న ‘ఎస్టేటు ‘ ఉండేదట. అదీకాక వరుడు గుమ్మిడిదల వెంకట సుబ్బారావు జమీందారీ వారసుడు. ఆస్తికంతకూ ఏకైక వారసుడు.

ఇంటర్మీడియట్‌ చదువుతూ స్వాతంత్రోద్యమం పట్ల ఆసక్తితో చదువు మానేశాడు. గోదావరి జిల్లాలో పరువు ప్రతిష్ట గల కుటుంబం. గుమ్మిడిదల వారితో తనకు మమేకమైన సంబంధం ఉండనే ఉంది. ఇవన్నీ ఆలోచించుకొని ఉంటారు రామారావు గారు. వధూవరులకు వయస్సులో కూడా పదేళ్ళకు మించి తేడా ఉన్నట్లు కనబడుతుంది. ఆ రోజుల్లో అది మామూలే. కానీ దుర్గాబాయి పెళ్ళి ఆమెకు లోకం దృష్టిలో సఫలం కాకపోయినా లోకానికెంతో మేలు చేసింది. సుబ్బారావు సౌమ్యుడు. స్వాతంత్య్రాభిమాని. దుర్గాబాయికి అన్ని విధాలా సహకరించాడు. ఉత్తమ సంస్కారి ఆయన.

ప్రముఖ బ్రహ్మసమాజ ప్రవక్త అయిన కేశవ చంద్రసేన్‌ కుటుంబంలో కూడా ఇటువంటి ఉదంతం ఒకటి ఉంది. బ్రహ్మసమాజం నవీన సంస్కరణ పరాయణం. స్త్రీ విద్యను, సమానత్వాన్ని ప్రోత్సహిస్తుంది. మూఢ నమ్మకాలను నిరసిస్తుంది. విద్యా వివేకాలతో మహిళ రాణించాలంటుంది. అయినా కేశవచంద్ర సేన్‌ తన కూతురికి కూచిబిహార్‌ రాజవంశం నుంచి సంబంధం వచ్చిందని మురిసిపోయి బాల్య వివాహం చేశాడు. విమర్శలను లెక్క చేయలేదు. పొరపాటో, గ్రహపాటో బెన్నూరి రామయ్య తమ కూతురికి ఎనిమిదేళ్లకే పెళ్ళి చేయడంలో కూడా ఇటువంటి అంతర్యమేదో ఉండి ఉంటుంది. ఆ తరువాత ఇంకో పదేళ్ళకు యుక్తవయస్సున దుర్గాబాయి పెళ్ళి జరిగి ఉంటే ఆమె చరిత్ర ఎట్లా ఉండేదో! సంతానవతి అయితే ఎట్లా పరిణమించేదో!

వాల్మీకి తమసా నదికి కాస్త ముందుగానో లేదా వేటగాడు క్రౌంచ పక్షిని బాణంతో కొట్టడానికి తర్వాత ఆలస్యంగానో వస్తే ఎట్లా ఉండేదో! శోకం శ్లోకంగా పర్యవసించడానికి ప్రేరణ ఎట్లా కలిగేది. కాబట్టి మహోన్నతులైన వ్యక్తుల జీవితాలలో కొన్ని అనూహ్యమైన సంఘటనలు జరుగుతుంటాయి. దుర్గాబాయి బాల్యవివాహం కూడా అటువంటిదే అనుకోవాలి. ఎంతో ఓర్పుతో, సహనంతో, అభిమానంతో, ఆదరంతో దుర్గాబాయి పట్ల ఆయన దాంపత్య ధర్మాన్ని నిర్వర్తించాడని దుర్గాబాయి చిన్ననాటి స్నేహితురాండ్రు, జీవిత చరిత్రకారులూ చెపుతున్నారు. తరచూ ఉద్యమాలలో పాల్గొనటం, కారాగార వాసం చేయటం, చదువు కారణంగా బెనారస్‌లోనూ, ఆంధ్ర విశ్వవిద్యాలయంలోనూ ఐదారేళ్ళు దూరంగా, విడిగా విద్యా వ్యాసంగంలో నిమగ్నం కావడం దుర్గాబాయి జీవితంలో భవిష్యత్పరిణామాలకు దారితీశాయి. అయినా భార్యాభర్తలు సఖ్యంగా, సానుభూతియుతంగా విడిపోయారు. దుర్గాబాయి బెనారస్‌లో, విశాఖపట్టణంలో చదువుకోవడానికి సుబ్బారావు గారు ఆర్థిక సహకారం కూడా చేసేవాడని తెలుస్తోంది. ఆమె స్వాతంత్రోద్యమంలో గొప్ప త్యాగశీలిగా పేరు తెచ్చుకోవడానికి, ఉన్నత విద్యావంతురాలు కావడానికి ఆయన ఎంతో ఉదారంగా ప్రోత్సహించేవాడని తెలుస్తున్నది.

భర్తకు ఆరోగ్యం బాగా లేకపోయినందువల్ల ఆయనకు వైద్యం చేయించడానికే ఆయనతో దుర్గాబాయి మద్రాసు వెళ్ళింది. కాశీనాథుని నాగేశ్వరరావుగారి దానశీలత, వితరణ స్వభావం, స్వాతంత్రోద్యమ కృషి అప్పటికే లోకంలో బాగా వినపడుతున్నాయి కాబట్టి తన భర్త వైద్య చికిత్స నిమిత్తం తామిద్దరూ వస్తున్నామని, తమకు మద్రాసు మహానగరంలో ఆశ్రయం కల్పించవలసిందనీ కోరుతూ దుర్గాబాయి, కాశీనాథుని వారికి లేఖ రాసింది. అప్పటికామెకు పదిహేడు, పద్దెనిమిదేళ్ళ కంటే వయసు లేదు. జవాబుగా ఆయన తమ ఇంటి విశాలావరణలో వెనుకవైపున ఉండే ఖాళీ గదులలో ఉండవచ్చునని రాశాడు. ఆ విధంగా వాళ్లు చెన్నపట్నం చేరారు.

ఈ సంఘటనే ఆమె భవిష్యజ్జీవితానికి నాంది అయింది. ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమయింది.

గాంధీజీ ప్రభావం

ఊహ తెలిసినప్పటి నుంచీ, తన చుట్టూ ఉన్న లోకం అర్థమవుతున్నప్పటి నుంచీ దుర్గాబాయిపై గాంధీ మహాత్ముడి ప్రభావం ఉంది. గాంధీజీ భారతదేశ భవితవ్యాన్ని రెండు విడదీయరాని ప్రధాన విభాగాలుగా ఆకాంక్షించారు. ఒకటి, స్వాతంత్య్ర సముపార్జనం; రెండు, నవభారత నిర్మాణం. ఈ రెండింటినీ నిర్వహించగలిగిన సామర్ధ్యమున్న అనుచర గణాన్ని, అనుయాయులను, శక్తి సముపేతులను ఆయన మొదటినుంచీ అవలోకిస్తూనే వచ్చారు. నిర్థారణ చేసుకుంటూనే వచ్చారు. ఆయా పనులు వాళ్ళవల్లనే సాధ్యమని ఆయన కాంక్షిస్తూ వచ్చారు.

ఎనిమిదేళ్ళ వయసులోనే నిస్సంకోచంగా ఆమె గాంధీజీ అభ్యర్థన మేరకు తన చేతుల బంగారు గాజులు ఒలిచి ఇచ్చివేసింది. తన పనికి ఈ బాలిక ప్రబలాయుధమూ, ప్రకృష్ట సాధనమూ కాగలదని ఆయన ఈ ఉదంతంతోనే గ్రహించి ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఐదారేళ్ళ తర్వాత కానీ, దుర్గను దర్శించే సన్నివేశం గాంధీజీకి సమకూరలేదు. స్వరాజ్య నిధికి విరాళాలు పోగుచేసే నిమిత్తం గాంధీజీ ఆంధ్రదేశ పర్యటన చేస్తున్న సందర్భంగా అది తటస్థించింది.

బహుశా అంతసేపు ఆయన ఏ బహిరంగ సభలోనూ, ఏ సందర్భంలోనైనా ఉపన్యసించారో లేదో కానీ కాకినాడలో దుర్గ అనే పదహారు, పదిహేడేళ్ళ బాలిక ఏర్పాటు చేసిన సభలో రెండు గంటలసేపు దుర్భరమైన భారతీయ సామాజిక వేదనలను గురించి ఆయన ఉపన్యసించారు. ఆ పరిస్థితులు మారాలని బోధించారు. ఆ రోజుల్లో ఐదువేలంటే ఇప్పటి ఐదు లక్షలతో సమానం. అతి స్వల్ప వ్యవధిలో ఆమె ఆ మొత్తం సేకరించగలిగిందనీ, అదీ దైన్య జీవితం, హైన్య జీవితం గడుపుతున్న మహిళా సమాజం నుంచి తేగలిగిందనీ ఆయనకు తెలిసి ఉంటుంది. వాళ్ళు సమాజంలో నిరాదృతులు, నిస్సహాయులు. ఆ సభకు గాంధీజీని పరిచయం చేసింది దుర్గాబాయే. ఆయన హిందీ ప్రబోధాన్ని అనువదించి చెప్పింది కూడా ఆమే. గాంధీజీ విజ్ఞప్తి మేరకు, ప్రబోధం మేరకు ఆ ఉపేక్షిత మహిళా సమాజం తమాభరణాలు, అలంకారాలు ఆయనకు ఇచ్చివేశారు. వాటి విలువ ఆ రోజుల్లోనే పాతికవేలదాకా ఉండవచ్చునని దుర్గాబాయి జీవిత చరిత్రకారులు అంచనా వేస్తున్నారు. దుర్గాబాయి తమకొక ఆశను, ఆశ్వాసాన్ని చూపినట్లు ఆ మహిళలు భావించి ఉంటారు. గాంధీజీ విరాళ సేకరణలో ఒక విశిష్టత ఉంది. అవి ఎవరు ఇస్తున్నదీ ఎప్పటికప్పుడు నమోదు చేసే అత్యంత విశ్వాసపాత్రులైన సహాయకులు ఆయనకు ఉండేవారు. ఏ రోజు లెక్కలు ఆ రోజు ఆయనకు నివేదించవలసిందే. గోనె బస్తాల నిండా బంగారు ఆభరణాలు ఆయనకు సమర్పితమయ్యేవని సమకాలీన చరిత్రకారులు రాశారు. ఇప్పటి బంగారం ధరకు అప్పటి బంగారం ధరకు మదింపు వేస్తే ఆయనకు ప్రజలు ఎన్ని కోట్ల విలువగల ధనం సమర్పించారో భావించవచ్చు.

అన్నిటికన్నా ముఖ్యంగా కాకినాడలో ఆయనకు వెలకట్టలేని వజ్రం లభించింది. అందువల్లనే ఆ తరువాత ఇరవై ఏళ్ళకు కస్తూరిబా స్మారక నిధి ఏర్పాటులో దుర్గాబాయిని ఆయన ప్రాంతీయ సంఘ అధ్యక్షురాలిని చేశారు. అప్పట్లో భారతదేశంలో ఏ ప్రాంతం నుంచీ వసూలు కాని మొత్తం దుర్గాబాయి వసూలు చేసి గాంధీజీకి సమర్పించిందని చరిత్రకారులు రాశారు. అప్పటికే ఆమె ఆంధ్రమహిళా సభ నిర్మాణ కార్యక్రమాలలో పూర్తిగా నిమగ్నురాలై ఉంది. వదాన్యుల నుంచి విరాళాలు సేకరిస్తూ ఉంది. అయినా సమాజానికి ఆమె అంటే గొప్ప అభిమానం. ఆమె ఏ ఆశయం కోసం అర్థించినా ప్రజలు ఆమెకు విరాళాలు అందచేస్తారు. పాతిక సంవత్సరాలపాటు గాంధీజీకీ, ఆమెకూ పితృ పుత్రికా అనుబంధం కొనసాగింది. ఆమెకంటే ఆయన నలభై ఏళ్ళు పెద్దవారు. దుర్గాబాయి వంటి కుమార్తె కంటే ఆయన మరి ఏమి ఆశించగలరు? అప్పటి నుంచి అంటే కాకినాడలో మహిళా సభ జరిగినప్పటి నుంచి గాంధీజీ ఆమె గురించి తెలుసుకుంటూనే ఉన్నారు. ఆమె కూడా ఆయనను గురించి అనునిత్యం తెలుసుకుంటూనే ఉంది.

మద్రాస్‌లో జరిగిన ఉప్పు సత్యాగ్రహం నాటి నుంచి గాంధీజీ దుర్గాబాయిదైన సింహ వాహన స్వరూపం బాగా అవగతం చేసుకొని ఉంటారు. ఇరవై ఏళ్ళు కూడా నిండని యువతి కాశీనాథుని వారినీ, ప్రకాశాన్నే ప్రభావితం చేసిన విషయం మహాత్ముడికి తెలియదా? ఆమె కారాగారవాస విషయం ఆయన తెలుసుకొని ఉండరా? భారతదేశ నవజీవన పునర్నిర్మాణ సంఘటితోద్యమంలో ఆమె ఎంతో పాత్ర నిర్వహించగలదని మొదటిసారి కాకినాడ మహిళా సమాజ సభలోనే గాంధీజీ గ్రహించి ఉంటారు. మొదట్లో ఆ సభ నిర్వహించడానికి కాకినాడలో ఆమెకు స్థలమే దొరకలేదు. పురమందిరంలో జరిగే భారీ జనసందోహ సభకు ఆమె సామాజిక వివక్షకు, పురుషాధిపత్యానికీ గురయిన దీన మహిళలను ఎలా ఆహ్వానించగలదు? వారిచ్చిన విరాళాల మొత్తం వారి తరపున గాంధీజీకి ఎట్లా అందజేయగలదు? మునిసిపాలిటీ వారు నిర్వహించే బాలికా పాఠశాల ప్రధానోపాధ్యాయులు శివయ్య శాస్త్రి గారు దుర్గాబాయిని దేవుడిలా ఆదుకొన్నారు. ఆమె వెళ్ళి అర్థించగానే స్కూలు ఆవరణలో ఆ సభ జరుపుకోవచ్చునని ఆయన అంగీకరించారు. సర్కారు కన్నెర్ర జేస్తుందని ఆయన జంకలేదు.

అట్లా ఆ సభ మునిసిపల్‌ బాలికా పాఠశాలలో సమకూరింది. రైల్వేస్టేషన్‌ నుంచి పురమందిరం వెళ్ళే దారిలోనే ఉంది ఆ స్కూలు. కాకినాడ పురప్రముఖులు, పుర మందిర సభా నిర్వాహకులు పోనీ దారే కదా! ‘ఐదు నిమిషాలలో ఆ సమావేశం ముగిసిపోతుందంటున్నది దుర్గ’ అని అట్టహాసంగా గాంధీజీని మునిసిపల్‌ బాలికా పాఠశాలకు తోడ్కొని వెళ్ళారు. అక్కడ గాంధీజీకి దుర్గ అసలు (శక్తి) తత్వం అర్థమైంది, విశ్వరూపం తెలిసింది.

సభ ముగిసి పురమందిరానికి వెళ్తూ తనకు వీడ్కోలు చెపుతున్న దుర్గాబాయిని ఆయన విడిచిపెట్టలేకపోయినాడు. ‘కారెక్కవమ్మా తల్లీ!’ అన్నాడు. కొండా వెంకటప్పయ్య, బులుసు సాంబమూర్తి ప్రభృతులు విస్మితులైనారు. పురమందిరం సభలో గాంధీజీ ప్రసంగించడానికి పూనుకోగానే కొండా వెంకటప్పయ్య ఆయన ప్రసంగానికి తెలుగు అనువాదం చెప్పడానికి సిద్ధమైనాడు. కానీ గాంధీజీకే మనిపించిందో, ‘నువ్వుండవయ్యా పెద్దమనిషీ! నేను చెప్పేదాన్ని దుర్గ తెలుగులో చెపుతుంది’ అన్నారు. దుర్గాబాయి అప్పటికే హందీ పరీక్షలెన్నో పాసైంది. అనర్గళ వాగ్ధోరణి ఆమెది. ప్రజలను ఉత్తేజపరచి త్యాగాలకు సమాయత్తం చేయగల వాక్పటిమ గలది. ఆ విషయం గాంధీజీకి తెలియకపోతే గదా! పురమందిరం సభలో కూడా దుర్గే ఆయన ప్రబోధాన్ని తెలుగు చేసింది. దాంతో గాంధీజీ ఆమెను మరింత ఆత్మీయురాలిని చేసుకున్నారు. బాలికా పాఠశాల నుంచి పురమందిరానికి వెళ్తున్న సందర్భంలో ఆమె కస్తూరిబా ప్రేమాభిమానాలను కూడా కారులో ఆమె పక్కనే కూర్చుని పొందగలిగింది. కాకినాడ జాతీయ కాంగ్రెస్‌ మహాసభల భోగట్టా అంతా గాంధీజీ అప్పటికే విని ఉంటారు. అధ్యక్షోపన్యాసం హిందీలో సాగటం, ఐచ్ఛిక సేవా భటదళం పెంపొందించిన జాతీయ సమైక్య భావోద్వేగ సుధృడానుబంధం అప్పటికే ఆయన దృష్టిలోకి వచ్చిన విజయాలు. తదాదిగా దుర్గాబాయిని గాంధీజీ గమనిస్తూనే ఉన్నారు. అందువల్లనే ఆంధ్ర మహిళా సభ భవన శంకుస్థాపనను ఆయన ఆశీర్వదించారు. 1946లో ఈ శంకుస్థాపన జరిగింది. అంతకు పది పన్నెండేళ్ళనాడే అంటే ఉప్పు సత్యాగ్రహం, ఆ తరువాత కారాగార వాసం అనుభవించిన మూడు, నాలుగేళ్ళకే ఆమె అఖిల భారత స్థాయిలో గుర్తింపు పొందిన జాతీయోద్యమ ప్రముఖురాలైంది. గొప్ప కార్యకర్తగా కాంగ్రెస్‌ కార్యనిర్వాహక వర్గం మన్ననలు పొందింది. వారి సమావేశాలలో ఆమెను గురించి వారు ముచ్చటించుకునేవారు. ఆంధ్రదేశం వచ్చినప్పుడల్లా గాంధీజీ వెంట ఆమె ఉండేది. గౌతమీ సత్యాగ్రహాశ్రమంలో గాంధీజీ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు గాంధీజీకి ఆమె పరిచర్యలు చేసేది. 1933, 34 సంవత్సరాలలో అప్పుటికెప్పుడో ఇరవైఏళ్ళ నాడు అటకెక్కిన ఆమె నియత విద్యాసముపార్జన పట్ల ఆమె దృష్టి మళ్ళింది. డిగ్రీలు లేని చదువు అట్టే అక్కరకు రాదని కూడా ఆమె గ్రహించింది. నియత విద్యా విధానం ద్వారా కూడా తాను విద్యావంతురాలు కావాలని దుర్గాబాయి ఆరాటం చెందింది. మూడు, నాలుగేళ్ళు సత్యాగ్రహోద్యమానికి, జాతీయ పోరాటానికి దూరంగా ఉండదలచిన ఆమె ఆశయం కాంగ్రెస్‌ పెద్దలకు రుచించలేదు. కార్యనిర్వాహక వర్గ సమావేశాలలో ఈ విషయం ప్రస్తావనకు వచ్చి ఉంటుంది. బహుశా గాంధీ మహాత్ముడికి కూడా ఆమె తన నిర్ణయాన్ని తెలుపుతూ ఆమోదాన్ని కోరి ఉంటుంది. మద్రాసులో ఉప్పు సత్యాగ్రహం చేయడానికి ఆమోదాన్ని ఆర్థిస్తూ కాశీనాథుని నాగేశ్వరరావుగారి ద్వారా గాంధీజీకి ఆమె లేఖ పంపినప్పుడు తన చదువు సాగించే విషయమై గాంధీజీ అనుమతిని ఆమె అభ్యర్థించడం సహజం, సతార్కికం. కాశీనాథుని వారి ద్వారా గాంధీజీకి పంపిన లేఖలో దుర్గాబాయి ఉప్పు సత్యాగ్రహం మద్రాసులో ప్రారంభించడం విషయంలో ఆయన అనుమతి ఒకవేళ లభించకపోయినా తాను వెనుకంజ వేసేది లేదని కూడా స్పష్టం చేసింది. తండ్రి దగ్గర ప్రేమ పాత్రురాలైన తనయ చూపే మంకు పట్టు అది. అట్లానే తాను వారణాసి హిందూ విశ్వవిద్యాలయంలో చదువుకొనే విషయం కూడా గాంధీజీ ఆమోదాన్ని ఆమె కోరింది. కానీ గాంధీజీ ఇందుకు సౌముఖ్యం వెల్లడించలేదు.పాతికేళ్ళకు మెట్రిక్యులేషన్‌ పూర్తిచేసి కళాశాల విద్యాభ్యాసానికి పూనుకుంటే తన నిర్మాణాత్మక కార్యక్రమం ఏమి కాను? అని ఆయన తటపటాయించి ఉంటారు. ‘వద్దమా! ఇప్పుడీ డిగ్రీ చదువు జంజాటం ఎందుకు?’ అని తన అభిప్రాయం దుర్గాబాయికి తెలియజేసి ఉంటారు. కానీ భర్తృహరి సుభాషితం ఆయన విన్నారో లేదో ‘నిశ్చితార్థంబు వదలరు నిపుణమతులు’ అని. మాలవ్యాజీ శుభాసీస్సులు ఆమెకు లభించాయి. అక్కడ మహిళల వసతి భోజన సౌకర్య గృహం కూడా ఉంది. అక్కడా తన ఆత్మాభిమానాన్ని చాటుకుంది దుర్గాబాయి. ఇంటర్మీడియట్‌ చరిత్ర, రాజనీతి, ఆర్థిక శాస్త్రంలో ప్రథమశ్రేణి కృతార్థత సాధించింది. స్నాతకోత్సవ సభకు యోగ్యతా (పట్టా) ప్రదాన సభకు గాంధీజీ ముఖ్య అతిథిగా విచ్చేశారు. హిందీ వక్తృత్వ పోటీలో ప్రథమ బహుమానం సంపాదించుకున్నది అక్కడ దుర్గాబాయి. ”బాపూ! నేను చదువుకుంటానంటే వద్దన్నారు. ఇప్పుడు చూశారా? నేనేమి సాధించానో! బంగారు పతకం, వక్తృత్వ సామర్థ్య ప్రథమ బహుమానం ఆర్జించలేదా?’ అని చనువుగా గాంధీజీతో నిష్టూరమాడింది దుర్గాబాయి. గాంధీజీ ఎంతో సంబరపడిపోయారు. ‘నాది తప్పేనమ్మా, నిజంగా తప్పే’ అని ఆమెను అనునయించారు, బుజ్జగించారు, ఆ సన్నివేశాన్ని చూసి ఎంతో ఆనందించారు, అభినందించారు. అందువల్లనే మాలవ్యాజీ, గాంధీజీల ప్రభావం ఆమె జీవితంలో అమేయం అంటారు ఆమె జీవిత చరిత్రకారులు. 1944లో కస్తూరిబా గాంధీ స్వర్గతి చెందినప్పుడు ఆంధ్ర దేశంలో తనకు కావలసిన వారెంతమంది ఉన్నా దుర్గాబాయికే కస్తూరిబా స్మారకనిధి వసూలు ఏర్పాటు అప్పగించారు గాంధీజీ. తక్కిన అన్ని ప్రాంతాల కంటే ఎంతో పారదర్శకంగా, అంకిత భావంతో దుర్గాబాయి ఈ విషయంలో తన కర్తవ్యం నిర్వహించిందని బాపూజీ ప్రశంసించారు కూడా.

దుర్గాబాయి ఎం.ఎ, ఎల్‌.ఎల్‌.బి.కావడం కూడా చూసి గాంధీజీ ఎంతో సంతోషించి ఉంటారు. ఆమె కాన్స్టిట్యుయెంట్‌ అసెంబ్లీ సభ్యత్వం కూడా గాంధీజీని ఎంతో తృప్తిపరచి ఉంటుంది. అయితే గాంధీజీ భారతదేశ స్వాతంత్య్ర భానోదయం వేళకు అనేక సంతాపకర పరిస్థితుల మధ్య చిక్కుకున్నారు. తన కళ్ళముందే నాలుగు దశాబ్దాలుగా తాను కంటున్న కల పీడకలగా పరిణమించింది. తనకు తోడు నీడ, ఓదార్పు, అండదండలు క్రమేపీ కరువవుతూ వచ్చాయి. అందువల్ల దుర్గాబాయి శేముషిని ఆయనా తర్వాత కాలంలో అనుగమించి

ఉండరు. దుర్గాబాయి కూడా ఆ స్వాతంత్రోద్యమం నాలుగో దశాబ్ది కాలంలో రాజకీయాలకు దూరంగా, భారతదేశ పునర్నిర్మాణ కారక్రమాన్ని తాదాత్మ్యంతో స్వీకరించి అందులో నిమగ్నమై తన పనులలో తాను ఉండిపోయింది. ఆ తరువాత రాజ్యాంగ నిర్మాణం బాధ్యతను నిర్వహించింది. మద్రాసులో న్యాయవాద వృత్తి నిర్వహిస్తూ, ఆంధ్ర మహిళా సభ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ గాంధీజీ జీవిత కాలంలోని చివరి నాలుగైదు సంవత్సరాలు దుర్గాబాయి ఆయనకు కాస్త దూరంగానే ఉండిపోయిందనుకోవచ్చు. ఆయన నిర్మాణాత్మక కార్యక్రమాన్ని సర్వాత్మనా నిర్వహిస్తున్న దుర్గాబాయికి రాజకీయాలకు దూరంగా ఉండిపోవడం అసంతృప్తికరం కాదు కూడాను.

స్వాతంత్య్రం ఎట్లాగూ సిద్ధించబోతున్నది? ఆ తరువాత కార్యక్రమాలే ఆమె చేపట్టింది. క్రాంతి పథగామిని ఆమె. పెద్ద మర్రి చెట్టుపై వేల పక్షులు గూళ్ళు కట్టుకుంటాయి. అట్లా పెద్ద సంస్థలను నిర్మిస్తే నిరాశ్రయులు జీవన భారాన్ని సహించి బతకగలుగుతారు. ఆ పెద్ద సంస్థలనే జీవనదులకు ఉపనదులవసరం. అప్పుడే అవి జీవనదులు కాగలుగుతాయి. వయోజన విద్యా కార్యక్రమాలు, చేతి వృత్తులలో శిక్షణ, మధ్య తరగతి ప్రజలకు వైద్య సౌకర్యాలు, అల్పాదాయ వర్గాల వారిని ఆదుకోవడం, మాతృ శిశు సంరక్షణ పథకాలు, విద్యా వినోదం విజ్ఞానం ఉల్లాసం ఆరోగ్యం సమాజంలో అన్ని వర్గాల వారికి అందే సదుపాయం ఆమె సంయోజించి ఆయా కార్యక్రమాలు ప్రారంభించింది.

గాంధీజీ ఆశించింది ఒక్క విదేశీ పాలన అంతమొందడమే కాదు, సంపూర్ణ స్వరాజ్యాన్ని ఆయన కోరుకున్నారు. గ్రామాలు స్వయం పోషకంగా ఉండడం, నీతి నిజాయితీలతో ఉండే రాజకీయాలు, సమాజ హితానికి తోడ్పడే విద్య, ధర్మబద్దమైన సంపాదన దేశంలో అభివృద్ది పొందాలని ఆయన బోధించారు. ఆయన ఆత్మకథ తన మాతృభాష గుజరాతీలోనే రాసుకున్నారు. సాధ్యమైనంత వరకు ఆయన రాజకీయ ఉద్బోధలు కూడా తన మాతృభాషలోనో లేదా దేశభాషలోనో నిర్వహించేవారు. ప్రజల పాలన తమ మాతృభాషలోనే

ఉండాలని ఆయన అభిమతాన్ని. ఆయన పదే పదే ప్రకటించారు. విద్య దర్పానికి, డంబానికి, దురాశకు, స్వార్థానికి కాక సమాజ ప్రయోజనాలకు వినియోగించాలని ఆయన ప్రబోధించారు. ఆర్థికంగా, సామాజికంగా భారతదేశం స్వావలంబన లక్ష్యంగా ప్రగతి సాధించాలని చేతివృత్తులు, కుటీర పరిశ్రమలు, పునరుద్ధరణ కావాలని గాంధీజీ ఉద్బోధించారు. గ్రామ స్వరాజ్యం ద్వారానే దేశ స్వరాజ్యం పటిష్టంగా

ఉంటుందని బోధించారు.

ఆయన ప్రతిపాదించిన ధర్మకర్తృత్వ సిద్ధాంతం ఆచరణశీలం కాదని నిరూపణమవుతున్నా, పెట్టుబడిదారీ వ్యవస్థ కర్షకుల, శ్రామికుల సంక్షేమం విధిగా పాటించాలని ఆయన నాయకత్వం వహించి నిర్వహించిన సమ్మెల ద్వారా, ఉపవాస దీక్షల ద్వారా, సత్యాగ్రహాల ద్వారా మిల్లు యజమానులలో, భూస్వాములలో కొంత మానసిక పరివర్తన ఆయన తేగలిగారు.

గాంధీజీ పెద్ద పరిశ్రమలకు వ్యతిరేకి అనీ, యంత్ర నాగరికతను ఆమోదించరనీ ఒక అపోహ ఉంది. పారిశ్రామిక ప్రగతికి దూరగుడని ఒక అపార్థం ఉంది. ఆయన దృష్టిలో కొందరు మాత్రమే కోటీశ్వరులు కావడం సామాజిక దురన్యాయం. సామాజిక విరుద్ధం. అంతూపంతూ లేని పెట్టుబడిదారీ ఆశాపాతక వ్యవస్థకది సంకేతం. కొందరు దురాశతో ఎంతకైనా సిద్ధమై తమ సంపదను పెంచుకోవడం దూష్యం. ప్రజలందరికీ ఉపయోగపడే యంత్రాల పట్ల, పరిశ్రమల పట్ల ఆయన వ్యతిరేకి కాదు. సమాజంలో అధిక సంఖ్యాక వర్గమైన బీదలను, పేదలనుగా ఉంచి, వేళ్ళమీద లెక్కపెట్టగలగిన వారి సంఖ్య మహాదైశ్వర్యంతో తులతూగడం ఆయన అంగీకరించరు. పెద్ద పరిశ్రమలు స్థాపించగలిగిన వాళ్ళు ఈ సామాజిక న్యాయాన్ని పాటించరు. అదీ ఆయన అభ్యంతరం.

రామచంద్రన్‌ అనే యువకుడు శాంతినికేతన్‌లో చదువుకున్నాడు. అప్పుడతను ఎఫ్‌.ఆండ్రూస్‌ శిష్యరికం చేశాడు. కొంతకాలం ఆండ్రూస్‌ సిఫార్సుతో, సహాయంతో అతడొకసారి గాంధీజీని కలుసుకొని యంత్ర నాగరికాభివృద్ధి, పారిశ్రామిక ప్రగతి పట్ల మహాత్ముడి వ్యతిరేకత ఏమిటో, ఎందుకో చర్చించాడు.

సకల మానవ సౌకర్యం కోసం, సౌఖ్యం కోసం, శ్రమ నివారణ కోసం సృష్టించే, పెంపొందే యాంత్రికాభివృద్ధి పట్ల తాను వ్యతిరేకిని కానని మహాత్యుడు వెల్లడించాడు. అందుకాయన సింగర్‌ మిషన్‌ను పోలికకు తెచ్చాడు. సులభంగా ఉపయోగించగల ఇటువంటి చిన్న కుట్టు యంత్రం సామాన్య సంసారులకు కూడా మేలు చేస్తుంది కాబట్టి దీన్ని వినియోగించుకోవచ్చునన్నాడు. అప్పుడు రామచంద్రన్‌ ఆ సింగర్‌ కుట్టు మిషన్‌ వంటి పరికరాలనే, యాంత్రిక సాధనాలనే బహుళ సంఖ్యలో ఉత్పత్తి చేయడానికి పెద్ద పరిశ్రమలు స్థాపించదలచుకుంటే అప్పుడేమంటారు అని అడిగాడు. అటువంటప్పుడు అటువంటి పరిశ్రమలను ప్రభుత్వ రంగంలో స్థాపించి నిర్వహించాలన్నాడు మహాత్ముడు. అటువంటి పరిశ్రమలపైన విశేష లాభాలు ప్రభుత్వ రంగం రాబట్టకూడదని కూడా చెప్పాడాయన. విలాసవంతమైన, సంఘ వ్యతిరేకమైన, వ్యసన పరత్వాన్ని పెంచే సంపద కొందరి చేతులలో, చేతలలో చిక్కుకొని పోకూడదనేదే ఆయన సిద్ధాంతం. అటువంటి సంపద వల్ల దేశానికెన్నో అనర్థాలు, కష్టాలు దాపురిస్తాయని ఆయన సామాజిక తత్వ విచింతనం. జూద గృహాలకు, పాన మందిరాలకు, వ్యభిచార నిలయాలకు ఆకర్షవంతమైన, విలాస సౌకర్యాలు గల భవనాలు అక్కరలేదు. వాటిని అనుమతించకూడదు. ప్రోత్సహించకూడదు. కానీ విద్యాలయాలకు, ఆస్పత్రులకు, ఆహార వస్తూత్పత్తి నిలువ చేసే గిడ్డంగులకు అన్ని సౌకర్యాలతో కూడిన మహాభవనాలను కాంక్షించినా, నిర్మించినా, నిర్వహించినా అటువంటి కార్యక్రమాలు కోరుకోదగినవే అని ఆయన హితబోధ. ప్రజలకు

ఉపకారమా, అపకారమా అనేది ప్రశ్న. పారిశ్రామిక అభివృద్ది, అక్రమ లాభాలు, దేశ ఆర్థిక వ్యవస్థను శాసించకూడదు. సంపద అంతా ఏ కొందరి ఆధీనమో కాకూడదు. ఈ దృష్టితో ఆయన పారిశ్రామిక పెట్టుబడిదారీ వ్యవస్థను నిరాకరించారు. అందరికీ విద్య, వైద్యం, కనీస వసతి గృహ సౌకర్యం, సాంఘిక సంక్షేమం కాంక్షించి యాంత్రిక నాగరికతను, పారిశ్రామిక సత్వరీకరణను వ్యతిరేకించారు. దుర్గాబాయి ఏ సామాజిక సంక్షేమ పథకాన్ని, ప్రణాళికను రూపకల్పన చేసినా, నిర్వహించినా గాంధీజీ ఆశయాలను నెరవేర్చడానికే కృషి చేసింది.

(ఇంకా ఉంది…)

Share
This entry was posted in జీవితానుభవాలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.