ఉంగుటూరి శ్రీలక్ష్మి వాసా ప్రభావతి గారితో నా పరిచయం పది సంవత్సరాల క్రితం జరిగింది. ‘సఖ్య సాహితి’ ఆగిపోయింది. రచయితలందరినీ ఒకే చోటు చేర్చాలనే తపనతో, యద్ధనపూడి సులోచనారాణి గారు, వాసా ప్రభావతి గారు వారి ఆలోచనలకు చక్కటి రూపకల్పన చేశారు.
”లేఖిని” మహిళా రచయిత్రుల సంస్థను ప్రారంభించారు. ఎంబ్లం రూపకల్పన యద్దనపూడి వారిది. పేరు వాసా వారి ఆలోచన. ఒక సంస్థను నడపాలంటే ఎంతో అనుభవం, ఆలోచనా పటిమ, వాగ్ధాటి, ఓర్పు, నేర్పు, లౌక్యం, అందరినీ కలుపుకుని పోయే చాకచక్యం ఉండాలి. అవన్నీ పుష్కలంగా ఉన్న వ్యక్తి వాసా ప్రభావతి. సలహాలు, సంప్రదింపులు యద్ధనపూడి వారితో కలిసి చేసినా, ”లేఖిని” సంస్థను అద్భుతంగా 14 సంవత్సరాలు నడిపించిన ఘనత మాత్రం ప్రభావతి గారిదే. ఎన్నెన్నో విశిష్ట కార్యక్రమాలకు శ్రీకారం చుట్టి, నిర్విఘ్నంగా చేశారు. మూడు కొప్పులు ఒకచోట కలవవు అనేది నానుడి. కానీ ఇంతమంది రచయిత్రులను ఒకే మాటమీద నిలిపి, ఎంతో చక్కటి కార్యక్రమాలు చేసిన ఘనత ప్రభావతి గారిదే. ఇది నా మాట కాదు. డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు సభాముఖంగా చెప్పిన మాట.
డా|| సి.నారాయణ రెడ్డి, కె.వి.రమణాచారి, గోపి, దక్షిణామూర్తి, నందిని సిద్ధారెడ్డి, పార్వతీశం, డా||కృష్ణక్క, డా||నాయినీ కృష్ణకుమారి, ప్రముఖ రాజకీయవేత్త నన్నపనేని రాజకుమారి, అమృతలత వంటి మహామహులతో వేదికమీద ఎన్నో విశిష్టమైన కార్యక్రమాలు నిర్వహించారు.
”లేఖిని” వార్షికోత్సవం రోజున ”మాతృదినోత్సవం” ఘనంగా జరిపించిన ఘనత కూడా ప్రభావతి గారిదే. రచయిత్రులు, మరో రచయిత్రికి, తమ ‘మాతృదేవి’ పేరుమీద సత్కారం చేయడమే ”మాతృదినోత్సవం”. ఎంత హృద్యంగా ఉన్నదో చూడండి.
విదేశాల నుంచి వచ్చిన రచయితలు సత్యం మందపాటి, నిడదవోలు మాలతి, శొంఠి శారదాపూర్ణ మొదలైనవారే కాక అలనాటి రచయిత్రులు ‘అరవింద’, పరిమళ, సోమేశ్వర్ వంటి ప్రముఖులతో పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రచయిత్రులను, కవయిత్రులను ప్రోత్సహించడమే కాదు, రచయిత్రులతో ముఖా-ముఖి కూడా ఏర్పాటు చేశారు. దానివల్ల ఒకరి భావాలు మరొకరు పంచుకునే అవకాశం కలిగింది. ”లేఖిని” కార్యక్రమాలలో ఒక సభ్యురాలిగానే కాదు, జాయింట్ సెక్రటరీగా కూడా పాలు పంచుకునే సదవకాశం నాకు కలిగింది.
ప్రభావతిగారు స్నేహశీలి. అందరినీ కలుపుకుని పోయే మృదు స్వభావం ఆమెది.
ఇంతవరకూ ఎప్పుడూ చేయని పని రచయిత్రులందరి బయోడేటాలతో ”నేనూ, నా రచనలు” పుస్తకం ప్రచురించడమే కాదు, కాళీపట్నం రామారావు గారి చేతుల మీదుగా మా అందరికీ ఇప్పించారు. వేదగిరి రాంబాబు గారితో పాటు, గురజాడ అప్పారావు గారి కార్యక్రమాలన్నింటికీ హాజరయ్యారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో మంచి కార్యక్రమాలు చేశారు. రచయిత్రులకు హుషారు కలిగించడానికి సంజీవయ్య పార్కుకి, ప్రగతి రిసార్ట్స్‌కి కూడా తీసుకువెళ్ళారు.
”లేఖిని” మహిళా రచయిత్రుల సంస్థని, నిరాటంకంగా, వైవిధ్యమైన కార్యక్రమాలతో 14 సం||ల పాటు నిర్వహించిన మా వాసా ప్రభావతి గారు మా సభ్యులందరినీ వదిలి వెళ్ళినందుకు ఎంతో బాధగా ఉంది.
ఆమెకు ఈ అక్షర నివాళి సమర్పిస్తున్నాను.