అసహజమనిపించే సహజం -శాంతిశ్రీ బెనర్జీ

”ప్రతిసారీ ఏదో ఒక వంక చెప్పి సంబంధాలు చెడగొడ్తున్నావు. ఇలా అయితే ఎలా కమలినీ? నీకిక పెళ్ళయ్యేదెప్పుడూ? ఇప్పటికే ముప్ఫయిమూడేళ్ళొచ్చినయ్‌. ఇక జీవితాంతం ఇలాగే

ఉండిపోదల్చుకున్నావా?” కోపంగా అంది నీరజ.

”అమ్మా! ఇక ఈ పెళ్ళిచూపుల తతంగాలు నేను భరించలేకపోతున్నాను. నా అంతట నేనే నాక్కావల్సిన విధంగా పెళ్ళి చేసుకుంటాను. నాన్నకి ఎలాగో సర్దిచెప్పు. సరేనా?” తల్లి చేతులు పట్టుకుని ప్రాధేయపడుతూ అంది కమలిని.

”నిజంగా? అలా అయితే మరీ మంచిది. ఒకసారి విడాకులు తీసుకున్నదానివని నీమీద ముద్ర పడిపోయింది. ఇలాంటి అరేంజ్డ్‌ మ్యాచెస్‌ కంటే నీ అంతట నువ్వు చేసుకోవడమే మంచిదని అనిపిస్తోంది. నీమీద అనుమానంతో నిన్ను యక్షప్రశ్నలు వేసి అసలు నీవెందుకు విడాకులు తీసుకున్నావో తెల్సుకోవాలని వాళ్ళు చూపే ఉబలాటం నీకే కాదు నాక్కూడా నచ్చటంలేదు” అంది నీరజ.

”నిజంగా అమ్మా! ఈ సమస్యని నాకొదిలెయ్‌. నా విడాకుల తర్వాత మూడు, నాలుగు సార్లు పెళ్ళి చూపులయ్యాయి. ఇక నా వల్ల కాదు” అంది కమలిని.

కూతురి జవాబుతో కొంత స్థిమితపడి ”సరే! నీకు కొంత టైమిస్తాను. నాన్నని కూడా ఒప్పిస్తాను. కానీ మరీ ఆలస్యం చేయకుండా త్వరపడు” అంది నీరజ.

తల్లికి సమాధానం చెప్పి ఒప్పించగలిగింది కానీ, ఈ సమస్యని ఎలా పరిష్కరించాలా అన్న ఆలోచనలో పడింది కమలిని. గత ఆరేడేళ్ళుగా తన జీవితంలో జరిగిన సంఘటనలు ఆమె కళ్ళముందు గిర్రున తిరిగాయి.

… … …

తల్లిదండ్రులకి కమలిని ఒక్కతే సంతానం. చిన్నప్పటి నుంచి గారాబంగా పెరిగింది. ఎమ్మే ఎకనామిక్స్‌లో ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యింది. ఆ తర్వాత కొన్ని ఉద్యోగాలు చేసింది. ఇరవై ఆరేళ్ళ వయస్సులో ఒక అమెరికన్‌ కంపెనీలో మంచి ఉద్యోగం వచ్చింది. అప్పటివరకు సరైన ఉద్యోగం రాలేదంటూ, తల్లిదండ్రులు పోరుపెడుతున్నా పెళ్ళి వాయిదా వేస్తూ వచ్చింది. నిజానికి ఆమెకి పెళ్ళిపట్ల ఆసక్తి లేదు. అందరి ఆడపిల్లల్లా చక్కని ఉద్యోగం, అందం ఉన్న అబ్బాయిని చేసుకోవాలన్న కోరిక ఆమెకి కలగలేదు. ఇలాగే ఉద్యోగం చేసుకుంటూ, హాయిగా ఒంటరిగా ఉండాలనిపించేది. కానీ తననెంతగానో ప్రేమించే తల్లిదండ్రులను బాధపెట్టలేకపోయింది.

చివరికి తనకోసం వెతికి వెతికి తెచ్చిన చైతన్య సంబంధాన్ని వద్దనడానికి కారణాలు కనిపించలేదు. చైతన్య ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో మంచి హోదా ఉన్న ఉద్యోగం చేస్తున్నాడు. మరీ అందగాడు కాకపోయినా, చూడడానికి బాగానే ఉంటాడు. ఒక్కడే కొడుకు. అక్క ఉంది. పెళ్ళయి వేరే ఊర్లో

ఉంటోంది. చైతన్యకి తండ్రి లేడు. అతను, తల్లి ఒక మంచి కాలనీలో, అన్ని హంగులు ఉన్న పెద్ద ఫ్లాట్‌లో ఉంటున్నారు.

తల్లిదండ్రులు ఈ సంబంధం మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. కమలినికి ఎన్నో విధాలుగా నచ్చచెప్పారు. చివరికి కమలినికి ఒప్పుకోక తప్పలేదు. పెళ్ళి వైభవంగా జరిగింది. ఎన్నో కానుకలతో, ఆడంబరంగా అత్తవారింటికి పంపారు.

పెళ్ళయిన తర్వాత అసలయిన సమస్యలు ప్రారంభమయ్యాయి. వైవాహిక జీవితం పట్ల కమలినికి ఆసక్తి లేకపోవడం చైతన్యను ఆశ్చర్యపరచింది. మొదట్లో అలాగే ఉంటుందేమో!? నెమ్మది నెమ్మదిగా అన్నీ సర్దుకుంటాయి అనుకున్నాడు. ఆమెని సంతోషపెట్టడానికి ప్రయత్నించేవాడు. సినిమాలు, షికార్లు, అందమైన ప్రదేశాలకు తీసుకెళ్ళడం వలన ఆమె మారుతుందేమోనని ఆశించాడు. అందంగా, చక్కని ఫిగర్‌తో ఉండే కమలిని అతన్ని కోరికలతో ముంచెత్తేది. దగ్గరికి తీసుకున్నప్పుడల్లా తప్పదన్నట్లు సహకరించేది. హనీమూన్‌లో కూడా ఆసక్తి లేకుండా ముభావంగా సెక్స్‌లో పాల్గొనడం చేసింది.

అలా సంవత్సరం గడిచింది. చైతన్యకు విసుగు కలగసాగింది. అసలు కారణమేమిటో తెలుసుకుందామని చాలాసార్లు కోపంగా ప్రశ్నించాడు. ఏమీ లేదనో, ఒంట్లో బాగాలేదనో, ఆఫీసులో వర్క్‌ ఎక్కువగా ఉందనో సాకులు చెప్పేది. ఆ సాకులతోనే సెక్స్‌లో పాల్గొనడానికి చాలాసార్లు నిరాకరించేది. చైతన్యకి ఓపిక నశించింది. కోపంతో ఎన్నోసార్లు చేయి చేసుకున్నాడు. ఆమె ఏడ్చేది కానీ సమాధానం చెప్పేది కాదు. ఒకసారి ఆమె నిరాకరించినపుడు విసురుగా ఒక్క తోపు తోశాడు. ఎడమ చేతివైపు నేలమీద పడిపోయింది. లేచి చెయ్యి పట్టుకుని నొప్పితో విలవిల్లాడింది. ఫ్రాక్చర్‌ అయిందని తెలుసుకుని, ఆమెని వెంటనే డాక్టర్‌ దగ్గరికి తీసుకెళ్ళి ప్లాస్టర్‌ వేయించాడు. ఆమె బట్టలు సూట్‌కేస్‌లో సర్ది, తల్లికి చెప్పి ఆమె పుట్టింట్లో వదిలేసి వచ్చాడు. ఇక మళ్ళీ ఆమె అత్తారింటికి వెళ్ళలేదు.

చైతన్య ఆమె తల్లిదండ్రులతో మాట్లాడి, కమలినికి తనతో ఉండడం ఇష్టం లేదని, తనలో ఓర్పు నశించిందని, విడాకులకు అప్లయ్‌ చేస్తున్నానని చెప్పాడు. కమలిని తల్లిదండ్రులు అతన్ని ప్రాధేయపడ్డారు. కొంత టైమివ్వమని, కమలినికి సర్ది చెప్తామని అన్నారు. చైతన్య వాళ్ళ తృప్తి కోసం సరేనన్నాడు. కానీ కమలిని సహకరించలేదు. చైతన్య తనమీద అనేకసార్లు చెయ్యి చేసుకున్నాడని, ఇక అతని దగ్గరికి వెళ్ళే ప్రసక్తే లేదని పట్టుబట్టింది. కమలిని తల్లిదండ్రులు ఇక వేరే దారిలేక విడాకులకు సమ్మతించారు. ఇద్దరి సమ్మతితో ఆరునెలల్లో విడాకులు జరిగిపోయాయి.

ఒక సంవత్సరం తర్వాత కమలిని తల్లిదండ్రులు ఆమెకు మళ్ళీ పెళ్ళి చేయాలనుకున్నారు. బలవంతం మీద ఆమె పెళ్ళి చూపులకు ఒప్పుకునేది. కానీ ప్రతిసారీ ఏదో ఒక సాకుచెప్పి పెళ్ళి తప్పించుకునేది. చైతన్య సంబంధం అలా అయినందువల్ల ఆమెకి విముఖంగా ఉందని అనుకుని ప్రతిసారీ ఇలా జరగాలని లేదని ఆమెకి ధైర్యం చెప్పసాగారు. కానీ కమలినికి తన సమస్య ఏమిటో నెమ్మది నెమ్మదిగా అర్థమవసాగింది.

యుక్తవయస్సు వచ్చినప్పటి నుంచి కమలిని మనస్తత్వం మిగతా అమ్మాయిలకంటే భిన్నంగా ఉండేది. తన వయస్సు ఆడపిల్లల్లా తోటి యువకుల మీద ఆకర్షణ, ఆసక్తి ఆమెలో ఉండేవి కావు. సినిమాల్లోనూ, కథల్లోనూ చదివే ప్రేమకథలు ఆమెని కదిలించేవి కావు. కాలేజీలో ఉన్నప్పుడు తన స్నేహితురాళ్ళు తోటి యువకులని ఆకర్షించడానికి చేసే ప్రయత్నాలు ఆమెకి విసుగు కలిగించేవి. అందంగా

ఉన్న ఆమెకు దగ్గరవ్వాలని చూసే యువకులను ఆమె దూరంగా ఉంచేది.

పైపెచ్చు ఆమెకి తన చుట్టూ ఉన్న యువతులలో కొందరు ఎంతో నచ్చేవారు, ఆకర్షించేవారు. వారితో స్నేహం చెయ్యాలని, వారికి దగ్గరవ్వాలని అనిపించేది. ఇలా ఎందుకు జరుగుతోందో ఆమెకి అర్థమయ్యేది కాదు. ఒక విధమైన అయోమయంలో ఉండేది. స్వతహాగా సాత్వికురాలు, మితభాషిణి అయిన ఆమె ఎటువంటి చొరవ తీసుకోలేకపోయేది. తర్వాత స్వలింగ సంపర్కం గురించి తెలసుకుంది. కానీ తాను కూడా అలాంటి స్థితిలో ఉన్నానా అన్న విషయం ఆమెకి రూఢిగా తెలిసేది కాదు.

ఇక చైతన్యతో పెళ్ళి కావడం, ఆ సంసార జీవితం ఆమెని ఆనందపరచలేక పోవడంతో తన గురించిన మరిన్ని నిజాలను ఆమె తెలుసుకుంది. ఇక పెళ్ళనే ఆ నరకంలోకి వెళ్ళదలచుకోలేదు. తన తల్లిదండ్రులకి ఈ విషయం చెప్పడం అసాధ్యం. ఎలాగయినా వాళ్ళకి నచ్చచెప్పి ఒంటరిగా జీవించాలని ఆమె కోరుకుంది.

… … …

ఇలా ఉండగా ఆఫీసులో రాగిణి అనే కొత్త కొలీగ్‌ చేరింది. ఆమెని కంపెనీవాళ్ళు డెప్యుటేషన్‌ మీద న్యూయార్క్‌ నుండి ఇండియాకు పంపించారు. చామనఛాయతో, మంచి పర్సనాలిటీతో ఉండే ఆమెలో అందంకన్నా ఆకర్షణ ఎక్కువ. అందరితో కలుపుగోలుగా ఉండి, చొరవగా ఉంటుంది. మొదటిచూపులోనే రాగిణి, కమలిని ఒకరినొకరు ఇష్టపడ్డారు. త్వరలోనే మంచి స్నేహితులయ్యారు. మనస్తత్వాల్లో

ఉన్న భిన్నత్వమే వారిని మరింత దగ్గర చేసిందేమో?!

ఒకసారి కంపెనీవాళ్ళు ఏర్పాటు చేసిన కులు, మనాలీ ట్రిప్‌కి మిగతావారితో పాటు వెళ్ళి హోటల్‌లో బస చేశారు. స్నేహితులవడం వలన వారిద్దరికీ ఒకే గది ఇచ్చారు. రాత్రి పార్టీ తర్వాత ఇద్దరూ గదికి వచ్చి, బట్టలు మార్చుకుని పడుకున్నారు. బెడ్‌లైట్‌ వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. హఠాత్తుగా రాగిణి కమలినిని దగ్గరకు లాక్కుంది. ఆ స్పర్శ ఎంతో బావున్నట్లు అనిపించింది కమలినికి. ఆమె కౌగిలిలో ఒదిగిపోయింది. నెమ్మదిగా రాగిణి ఆమెను ముద్దు పెట్టుకుంది. కమలినికి ఎంతో బాగున్నట్లనిపించింది. తను కూడా సహకరించింది. ఇక వాళ్ళిద్దరి శరీరాలు వాళ్ళ మాట వినలేదు. ఒకరినొకరు పెనవేసుకుని ఉద్రేకంతో ఆనందపుటంచులు చేరుకున్నారు.

ఆ తర్వాత వాళ్ళు మనస్సులు విప్పి మాట్లాడుకున్నారు. కమలినికి ఇదే మొదటి అనుభవం అయితే, రాగిణి ఈ విషయంలో ముందున్నదని, అనుభవజ్ఞురాలని అర్థమయింది. సంకోచపడుతున్న కమలినికి రాగిణి ధైర్యం చెప్పింది.

”ఇందులో భయపడవలసిందేమీ లేదు. అమెరికాలో ఇలాంటివి సర్వసాధారణం. నీకు నేనున్నాను. నీకేం ఫర్వాలేదు” అని భరోసా ఇచ్చింది.

ఆ తర్వాత వాళ్ళిద్దరూ అప్పుడప్పుడూ కలుసుకుంటున్నారు. ఒక్కోసారి రాగిణి ఫ్లాట్‌లో, ఒక్కోసారి కమలిని బెడ్‌రూంలో. కమలినికి ఈ జీవితం ఎంతో బాగున్నట్లు అనిపించసాగింది. అదివరకటి నిరాశ, దిగులు మాయమయ్యాయి. మనిషి సరదాగా, సంతోషంగా ఉంటోంది. కూతురులోని ఈ మార్పునకు ఆమె తల్లి నీరజ, తండ్రి వేణుగోపాల్‌ ఎంతో సంతోషించారు. రాగిణి వల్లే తమ కూతురిలో మార్పు వచ్చిందని అనుకుని రాగిణిని ఇష్టపడసాగారు. ఆమెని తమ ఇంటికి వస్తూపోతూ ఉండమని ఆహ్వానించారు. కానీ వాళ్ళకి అసలు విషయం తెలియదు. ఇద్దరూ మామూలుగా మంచి స్నేహితురాళ్ళని అనుకుంటున్నారు.

ఒకసారి యథాప్రకారం రాగిణి, కమలిని ఇంటికి వచ్చింది. రాత్రి భోజనాల తర్వాత కొంచెంసేపు నీరజతోను, వేణుగోపాల్‌తోను కబుర్లు చెప్పి ఇద్దరూ పైన ఉన్న కమలిని బెడ్‌రూమ్‌కి వెళ్ళారు.

మర్నాడు ఆదివారం. కమలిని తల్లిదండ్రులు అరవై మైళ్ళ దూరంలో ఉన్న ఫామ్‌హౌస్‌కి చీకటితోనే లేచి వెళ్ళాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ విషయం కమలినికి చెప్పడం మర్చిపోయారు.

”రేపు సెలవు కదా? వాళ్ళిద్దరూ పొద్దున్నే లేవరు. వాళ్ళకు చెప్పిరా” అని నీరజకి చెప్పాడు వేణుగోపాల్‌.

నీరజ సరేనని పైకి వచ్చి తలుపుమీద నెమ్మదిగా తట్టి, వెంటనే తలుపు నెట్టింది. లాక్‌ చేయడం మర్చిపోయినందువల్ల తలుపు బార్లా తెరుచుకుంది. ఒంటిమీద బట్టలు లేకుండా ఒకరినొకరు పెనవేసుకుని ముద్దులు పెట్టుకుంటున్న ఇద్దర్నీ చూసి ఖంగు తింది. అలికిడికి వాళ్ళిద్దరూ కూడా ఆమెవంక చూశారు. ‘అమ్మా!’ అని లేచి ఏదో చెప్పబోయింది కమలిని. వాళ్ళిద్దర్నీ ఒకసారి నిశితంగా చూసి దబాలున తలుపు వేసి కిందికి వెళ్ళిపోయింది నీరజ.

నీరజ భర్త దగ్గరికి వెళ్ళకుండా డ్రాయింగ్‌ రూంలో సోఫాలో బొమ్మలా కూర్చుండిపోయింది చాలాసేపు. చూసింది జీర్ణం చేసుకోవడానికి ఆమెకి టైం పట్టింది. ఆమె డిగ్రీవరకు చదువుకుంది. స్త్రీలలో స్వలింగ సంపర్కులు ఉంటారని, వాళ్ళని లెస్బియన్స్‌ అంటారని ఆమె పుస్తకాల్లో చదివింది. చివరికి తన కూతురే అటువంటి స్థితిలో ఉందని ఆమె ఊహించలేకపోయింది. చైతన్యతో విడాకులు తీసుకోవడం, పెళ్ళిచూపులకు అతి కష్టమీద ఒప్పుకోవడం, సంబంధాలన్నీ ఏదో ఒక సాకుతో వద్దనడం… వీటన్నింటి వెనక ఉన్న గూడార్థం ఆమెకి ఇప్పుడు అర్థమయ్యింది. భర్తకు ఈ విషయం ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. చివరకు చెప్పకూడదన్న నిర్ణయానికొచ్చింది. ముందుగా కమలినితో మాట్లాడాలనుకుంది. ఫామ్‌హౌస్‌కి వెళ్ళాలన్న కోరిక నశించింది. భర్తకు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంది. ఆ రాత్రంతా ఆమెకు సరిగ్గా నిద్రపట్టలేదు.

వారం రోజులు గడిచిపోయాయి. ఆ సంఘటన తర్వాత కమలిని సిగ్గుపడి తప్పించుకు తిరుగుతుందనుకున్న నీరజ అంచనాలు తలక్రిందులయ్యాయి. కమలిని ఏమీ జరగనట్లు ఎప్పటిలాగే మెలగసాగింది. ఆమె ముఖంలో వచ్చిన నిశ్చలత కనపడసాగింది. దానికి తోడు రాగిణి ”నువ్వు అధైర్యపడకు. అమెరికాలో జరిగిన ఇలాంటి సంఘటనలు నాకెన్నో తెలుసు. ఇండియాలోని న్యాయస్థానం కూడా స్వలింగ సంపర్కాన్ని చట్టబద్దం చేసింది. ఈ విషయంలో నెమ్మది, నెమ్మదిగా మనుషుల్లో అవగాహన వస్తోంది” అని వివరించింది. రాగిణి మాటలతో కమలినికి మరింత ధైర్యం కలిగింది.

ఆ తర్వాత ఆదివారం కమలిని తల్లితో తప్పకుండా మాట్లాడాలన్న నిర్ణయానికి వచ్చింది. తండ్రి పొద్దున్నే లేచి ఏదో పనిమీద బయటికి వెళ్ళడం ఆమెకు మరింత ప్రోత్సాహాన్నిచ్చింది. పైనుంచి దిగి వచ్చి చూసింది. తల్లి సోఫాలో కూర్చుని న్యూస్‌ పేపర్‌ తిరగేస్తోంది. దగ్గరగా వెళ్ళి పక్కన కూర్చుని, ఆమె చదువుతున్న పేపర్‌ మడిచి పక్కనపెట్టి ”అమ్మా! నీతో మాట్లాడాలని వచ్చాను. నాకు కొంత టైమివ్వు” అంది.

ఆ సమయం కోసమే ఎదురుచూస్తున్న నీరజ కూతురివంక చూసి ”అలాగే! చెప్పు వింటాను” అంది.

ఎలా మొదలుపెట్టాలో తెలియక కొంత తికమకపడి చివరికి ”అమ్మా! ఈ విషయం నీతో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించాను. కానీ నువ్వెలా అర్థం చేసుకుంటావోనన్న భయంతో చెప్పలేకపోయాను. ఇక నీకు చెప్పకుండా ఉండలేని పరిస్థితి వచ్చింది. అదీ ఒకందుకు మంచిదేనేమో? నాకు వయస్సు వచ్చిన దగ్గర్నుంచి నాలో జరుగుతున్న అలజడి, మిగతా యువతులకు భిన్నంగా నా మనస్తత్వంలో, శరీరంలో కలుగుతున్న మార్పులు నన్ను అయోమయంలో పడేశాయి. ఆ తర్వాత చైతన్యతో వివాహం, ఆ సంసార జీవితంలో ఇమడలేక నేను పడ్డ బాధల వల్ల నా గురించిన కొన్ని నిజాలను నేను తెలుసుకున్నాను. రాగిణితో పరిచయమయ్యాక అసలు నేనేమిటో పూర్తిగా తెలుసుకున్నాను. ఆమె సాహచర్యం నాలో ఆనందాన్ని, సంతృప్తిని కలిగించింది. కానీ నన్నెంతో ప్రేమగా పెంచుకున్న మీకు ఈ విషయం మనస్థాపం కలిగిస్తుందని తెలుసు. అదే నేను భరించలేకపోతున్నాను. నన్నర్థం చేసుకోవడానికి ప్రయత్నించమ్మా! నాన్నకి నువ్వే సర్దిచెప్పాలి” అని తల్లి ఒడిలో పడుకుని విలపించసాగింది.

తన చేతుల్లో గారాబంగా పెరిగిన తన చిన్నారి కమలిని దఃఖం చూసి నీరజ తనను తాను కంట్రోల్‌ చేసుకోలేక పోయింది. కమలిని వీపుమీద చెయ్యివేసి నిమురుతూ ఏడవసాగింది. అలా కొంచెంసేపయిన తర్వాత ముందుగా తేరుకుని కళ్ళు తుడుచుకుని, కమలినిని కూర్చోబెట్టి కన్నీరు తుడిచింది.

”కమలినీ! ఏడవకు. ధైర్యం తెచ్చుకో. నిన్నర్ధం చేసుకోగలను. నువ్వు మామూలు వైవాహిక జీవితంలో ఇమడలేవని నాకు తెలుసు. నెమ్మది మీద నాన్నకు చెప్పే భారం నామీద వేసుకుంటున్నాను. నువ్వు మామూలుగా ఉండడానికి ప్రయత్నించు” అంది.

తల్లి ఇంత తొందరగా సమస్యని పరిష్కరించడం కమలినికి ఎంతో సంతోషాన్ని కలిగించింది. ఒక్కసారిగా తల్లిని గట్టిగా హత్తుకుని ”ఐ లవ్‌ యూ సో మచ్‌ అమ్మా!” అంది.

కానీ కమలినికి తెలియనిది ఏంటంటే, తన తల్లి ఈ విషయం గురించి ఎంతో రిసెర్చి చేసిందని, ఇంటర్నెట్‌లోనూ, పుస్తకాల్లోనూ చదివి అనేక విషయాలు రాబట్టిందని.

… … …

ఆర్నెల్లు గడిచిపోయాయి. ఒకరోజు ఆఫీసునుంచి వచ్చి కమలిని స్తబ్దుగా కూర్చుండిపోయింది. నీరజ టీ తీసుకొచ్చి ఇచ్చింది. కమలిని ముఖంలోకి పరీక్షగా చూస్తూ ”ఏమిటి అలా ఉన్నావు?” అని అడిగింది.

”రాగిణిని ఆఫీసువాళ్ళు తిరిగి న్యూయార్క్‌కు పంపిస్తున్నారు. ఇంకో నెలరోజుల్లో ఇక్కడినుంచి వెళ్ళిపోవాలి”అంది దిగులుగా.

నీరజకేం చెప్పాలో తెలియలేదు. ఆ నెలరోజులు రెస్ట్‌లెస్‌గా గడిపింది కమలిని. రాగిణిని ఎయిర్‌పోర్టులో దింపి వచ్చిన దగ్గరనుంచి ఆమె స్వభావమే మారిపోయింది. ఏదో పోగొట్టుకున్నట్లు ప్రవర్తించసాగింది. అదివరకటి ఉత్సాహం, చురుకుదనం మృగ్యం అయిపోయాయి. కూతుర్ని ఈ స్థితిలో చూడలేకపోయింది నీరజ.

ఒకరోజు ”కమలినీ! నువ్వు కూడా న్యూయార్క్‌లో ఉన్న నీ కంపెనీకి ట్రాన్స్‌ఫర్‌ కోసం ఎందుకు ప్రయత్నం చేయకూడదు?” అంది నీరజ.

”అమ్మా! నిజంగానే అంటున్నావా? నేను లేకుండా మీరిద్దరూ ఇక్కడ ఉండగలరా?” అంది.

”నీ సంతోషంకంటే మాకు కావల్సిందేముంది కమలినీ? ప్రయత్నించి చూడు” అంది.

తల్లి మాటలు విని కమలిని ఎంతో ఆనందపడింది. ”అమ్మా! యు ఆర్‌ గ్రేట్‌” అని తల్లిని కౌగిలించుకుని ముద్దు పెట్టింది. ఈ విషయం రాగిణికి ఫోన్‌లో చెప్పడానికి ఒకేసారి రెండేసి మెట్లెక్కుతూ చురుగ్గా పైకి వెళ్ళింది.

Share
This entry was posted in కధానికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.