మేరీ -ఎస్‌. శ్రీలత

స్కూలుకు టైం అవుతోంది అనుకుంటూ స్కూటీ తీసి గేటు వేసి బయల్దేరాను. మా ఇంటి నుంచి స్కూలు పది కి.మీ.లు ఉంటుంది. వెళ్తుంటే ఎడమవైపు ఎండిపోయిన చెరువు, కుడి చేతివైపు కొన్ని కాలనీలు ఉంటాయి. మధ్య మధ్యలో పొలాలు, అక్కడక్కడా బర్రెలు కట్టేసిన డెయిరీ ఫాంలు ఉంటాయి. చెరువుకు, పొలానికి మధ్య మెలికలు తిరిగిన రోడ్డు ఉంటుంది. ప్రైవేటు స్కూలు వ్యాన్‌లు, బైకుల మీద పిల్లల్ని వదిలిపెట్టే పేరెంట్స్‌, జి.హెచ్‌.ఎం.సి. చెత్త, పేడతో కూడిన వ్యాన్‌లు ఓవైపు కాలినడకన, సైకిళ్ళమీద వెళ్ళే స్కూలు పిల్లలు, ఇలా రోజూ ఈ టైంలో రోడ్డు బిజీగా ఉంటుంది.

ప్రార్థనకు టైం అవుతోందని బండిమీద స్పీడుగా వెళ్తున్న నాకు బ్యాగును రోడ్డుమీద ఈడుస్తూ, సరిగ్గా దువ్వీదువ్వని జుట్టుతో, మా స్కూలు యూనిఫాంతో ఒకమ్మాయి ముందు నడుస్తోంది. ఈ పిల్ల అవస్థ చూసి బండి ఆపి అడిగాను.

‘ఏ స్కూల్‌ అమ్మాయి నీది?’ అంటూ

‘నమస్తే టీచర్‌, మీ స్కూలే’ అంది.

‘ఏ క్లాసు?’ ఎప్పుడూ చూడనట్టు అనిపించింది.

‘ఆరో తరగతి ‘ఎ’ సెక్షన్‌ టీచర్‌’ అంది.

ఆ క్లాస్‌కు వెళ్ళను కాబట్టి, పైగా ఈ సంవత్సరం హైస్కూలులో జాయిన్‌ అయిన ఆ అమ్మాయిని చూడకపోయుండచ్చు అనుకుని ‘సరే బండెక్కు’ అన్నాను.

‘ఏం పేరు నానా’ అడిగాను బండి నడుపుతూ.

‘మేరీ టీచర్‌’ అంది.

‘బ్యాగ్‌ ఎందుకే అలా రోడ్డు మీద ఈడుస్తున్నావ్‌? సరస్వతీ దేవికి కోపం రాదు?’ అడిగాను తను చేస్తున్నది తప్పన్నట్టు.

‘బ్యాగు చినిగిపోయింది టీచర్‌. జిప్పులు పోయాయి. హ్యాండిల్‌ కూడా తెగిపోయింది’ అంది బాధగా.

‘నిన్న ఆదివారం కదా! కుట్టించుకొనుండొచ్చు కదా!’ పిల్లలకు ఇలాంటి సలహాలు ఇవ్వడం మాకు మామూలే.

‘డబ్బుల్లేవు టీచర్‌’ అంది.

‘మీ నాయన ఏం పని చేస్తాడు?’ అడిగాను.

‘చెత్త బండి లాగుతాడు టీచర్‌. ఆయన తెచ్చే పైసలు తాగుడుకే సరిపోతయ్‌. ఇంక పది, ఇరవై రూపాయలు ఇమ్మంటే పాపం! ఏడికెళ్ళి తెస్తాడు టీచర్‌. అందుకే అడగను’ అంది.

వాళ్ళ నాన్న ఆర్థిక పరిస్థితితో పాటు, ఆయన అలవాట్ల వల్ల ఇంట్లో ఉన్న స్థితి ఆ పిల్ల అర్థం చేసుకోవడమే కాక, వాళ్ళ నాన్న మీద జాలి కూడా చూపడం నాకు ఆశ్చర్యం కలిగించింది.

‘మీరెంతమంది పిల్లలు?’ అడిగాను.

‘నేనొక్కదాన్నే టీచర్‌’ అంది మేరీ.

‘మరి, ఒక్క పిల్లను కూడా సరిగ్గా సాకలేడా మీ నాయన, మీ అమ్మ ఏం చేస్తుంది?’ అడిగాను.

‘అమ్మ లేదు టీచర్‌, నేను సిన్నగున్నప్పుడే సచ్చిపోయింది’ అంది మేరీ.

నాకింక ఆ అమ్మాయిని కదపాలనిపించలేదు. నిజంగా గవర్నమెంటు స్కూల్లో చదివే పిల్లల్ని, ఒక్కొక్కరిని కదిలించాం అంటే కడవెడు కష్టాలు చెబుతారు. కానీ, విచిత్రమేమంటే వాళ్ళ ఆటలు, మొహంలో పసితనంతో కూడిన అమాయకపు నవ్వులు చూస్తే, వీళ్ళ వెనక ఇన్ని బాధలున్నాయా? అనిపిస్తుంది. సామాజిక, ఆర్థిక అసమానతలకు తోడు దురలవాట్లతో చిన్న వయసులోనే తండ్రినో, తల్లినో పోగొట్టుకుని దుర్భరంగా జీవించే, సింగిల్‌ పేరెంటింగ్‌ పిల్లలు కూడా చాలామందే ఉన్నారు. ఏంటో! పెద్దవాళ్ళం అయి ఉండీ చిన్న సమస్యల్నే భూతద్దంలోంచి చూస్తూ తల్లడిల్లిపోతుండటం. నిజంగా ఈ పిల్లలు గ్రేట్‌! అనుకుంటుండగానే స్కూలు వచ్చేసింది.

లంచ్‌ టైంలో లంచ్‌ చేస్తుంటే, పిల్లలు కంప్లైంట్‌తో దూసుకొచ్చేశారు. ‘టీచర్‌, టీచర్‌ భరత్‌గాడు మమ్మల్ని తంతున్నాడంటూ’ నలుగురైదుగురు పిల్లలు ఒక్కసారే గట్టిగా అరుస్తూ చెపుతున్నారు.

‘ఏరా! మమ్మల్ని అన్నం కూడా తిననివ్వరా? మేం పాఠాలు చెబ్దుమా? లేక మీ పంచాయితీలు తీరుద్దుమా? బొత్తిగా భయం లేకపోయె పిల్లలకు. కాసేపు ఆగండి. ఎలా వచ్చేశారో చూడు స్టాఫ్‌ రూంలోకి’ అంది లెక్కల టీచర్‌.

దీంతో పిల్లలు బయటికెళ్ళి నించున్నారు. మేం లంచ్‌ చేస్తూ పిల్లల గురించే మాట్లాడుకున్నాం.

‘అయినా భరత్‌గాడి ఆగడాలు రోజురోజుకు ఎక్కువయ్యాయి. ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని తన్నడమో, పైసలు దొబ్బేయడమో, ఏదో ఒకటి నానా గోల చేస్తుంటాడు’ అంది సోషల్‌ టీచర్‌.

‘కానీ మేడం! పాపం, వానికి చిన్నప్పుడే తల్లి పోయింది. తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకోకుండా పిల్లలిద్దర్నీ చూసుకుంటున్నారు. ఆయన ఆటో డ్రైవర్‌, గిరాకీల కోసం పొద్దున్నే ఇల్లొదిలి పోతే, ఈ అబ్బాయి, వీళ్ళక్క ఇద్దరే వండుకుని తాళాలేసుకుని వస్తారు. సాయంకాలం ఇంటికెళ్ళాక వీడి అల్లరి భరించలేక ఇరుగు-పొరుగు వాళ్ళు కంప్లైంట్‌ చేస్తే, వాళ్ళ నాన్న వాతలు పడేలా బెల్టుతో చితకబాదుతాడు. దాంతో వాడింకా మొండిబారిపోయాడు’ అంటూ చెప్పుకొచ్చింది భరత్‌ క్లాస్‌ టీచర్‌.

‘పిల్లలకు తల్లి లేకుంటే కష్టమే! వాళ్ళను సరైన దారిలో పెట్టడానికో మంచి బుద్ధులు చెప్పడానికో కనీసం అమ్మమ్మో, నాయనమ్మో అన్నా దగ్గరుంటే ఇలాంటి పిల్లలు పాడవ్వరు’ అంది తెలుగు టీచర్‌.

‘ నాకు మేరీ గుర్తొచ్చి, పొద్దున్న జరిగిన విషయం రందితో చెప్పాను. మేరీ క్లాస్‌ టీచర్‌ అందుకుంది. ‘అవును టీచర్‌, ఆ అమ్మాయి చాలా బోల్డ్‌. అడ్మిషన్స్‌ అప్పుడు కూడా, తన ఫాం తనే నింపుకుని వచ్చింది. పెద్దవాళ్ళు ఎవరూ వెంటలేరా? అంటే మా నాయన రాడు టీచర్‌’ అంది.

‘అయితే నేనే, పెద్దవాళ్ళనెవర్నయినా తీసుకురమ్మని బలవంతం చేస్తే, వాళ్ళ దూరపు చుట్టం ఒకామెను మా ‘అత్త’ అంటూ తెచ్చింది. ఆమె ఈ పిల్ల గురించి చెబుతుంటే నాకు కళ్ళల్లో నీళ్ళు తిరిగాయనుకోండి’ అంది.

‘అవునా, ఏమంట?’ కుతూహలంగా అడిగాను.

‘ఈ పిల్లకు రెణ్ణెల్లప్పుడు వాళ్ళమ్మకు బాలింత రోగమో, రక్తహీనతో తెలీదు కానీ, పిల్లను ఒల్ళో పడుకోబెట్టుకుని చూస్తూ అలా ప్రాణం విడిచిందంట. వాళ్ళమ్మమ్మ వాళ్ళు రెండు మూడేళ్ళు పెంచాక, మా పిల్ల మాక్కావాలంటూ గొడవపడి మేరీ నాయన, నాయనమ్మ ఇంటికి తెచ్చేసుకున్నారంట. ఇప్పుడు ఇంటి చాకిరీ మొత్తం ఈ పిల్లే. తండ్రి తాగి ఎక్కడంటే అక్కడ పడిపోతుంటడంట. వాళ్ళ నాయనమ్మ ఈడుండలేక ఇంకో కొడుకు దగ్గరకెళ్తే, ఈ పిల్లే వాళ్ళ నాన్నకు వండిపెడ్తుంది’ అంది రమ్య టీచర్‌.

వింటుంటేనే నాకు బాధనిపించింది.

ఇంటికెళ్ళాక మా వారికి ఫోన్‌ చేసి చెప్పాను. వస్తూ వస్తూ ‘కోఠి’లో ఒక స్కూల్‌ బ్యాగ్‌ తెమ్మని.

మేరీ నల్లటి నలుపు. కానీ కళ్ళు చాలా ప్రకాశవంతంగా, చీకట్లో వెలిగే దీపాల్లాగా మెరుస్తుంటాయి. పిల్ల చాలా చలాకీగా

ఉంటుంది.

ఉదయం ఆ అమ్మాయి క్లాసుకెళ్ళి, కొత్త బ్యాగ్‌ ఇచ్చాను.

‘థాంక్యూ… టీచర్‌’ అంది మెరుస్తున్న కళ్ళతో.

‘నువ్వు బాగా చదువుకో నానా. స్కూల్‌ ఎగ్గొట్టకుండా రోజూ బడికి రావాలి. నీకేమైనా అవసరమొస్తే నన్నడుగు ఏం ఫర్వాలేదు’ అన్నాను దాని భుజం తడుతూ.

ఈలోగా పిల్లలందరూ చుట్టుముట్టారు బ్యాగ్‌ చూడడానికి. నేను వెళ్ళాల్సిన క్లాస్‌కు టైం అవుతుండడంతో అక్కడినుంచి వెళ్ళిపోయాను చిన్నగా నవ్వుకుంటూ.

బోనాలు లోకల్‌ హాలిడే, సెకండ్‌ సాటర్‌ డే, సండే ఇలా వరుస సెలవులు రావడంతో మూడ్రోజుల తర్వాత స్కూలుకెళ్తే ఒక పిడుగులాంటి వార్త మమ్మల్నందర్నీ కలిచివేసింది.

మోహన్‌ అని, తొమ్మిదవ తరగతి పిల్లాడు, ‘ఆత్మహత్య’ చేసుకున్నాడని ప్రార్థన టైంలో మౌనం పాటించి, సంతాప సూచనగా బడికి సెలవు ప్రకటించారు. పిల్లలు వెళ్ళిపోయాక స్టాఫ్‌ అందరం కూర్చుని దీనిమీద చర్చిస్తే తేలిందేమిటంటే, మోహన్‌ అమ్మ, నాన్న ఊర్లో ఉంటారు. వీడిక్కడ హాస్టల్లో ఉండి స్కూలుకు వస్తున్నాడు. హాస్టల్లో చెక్‌ చేస్తే కొంతమంది పిల్లల దగ్గర ఫోన్లు, సిగరెట్లు, రకరకాల ఎలక్ట్రానిక్‌ పరికరాలు దొరికాయంట. వీళ్ళకు డబ్బులెక్కడివీ అంటే! రాత్రిపూట ఫంక్షన్‌ హాలుకి వెళ్ళి క్యాటరింగ్‌ చేసి సంపాయించు కుంటున్నారంట. చిన్న వయసులో చూడకూడని దృశ్యాలు చూసి వెర్రెక్కి ఒళ్ళు కొవ్వెక్కి వాళ్ళకంటే చిన్న పిల్లలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారంట.

పాపం! మోహన్‌ కూడా ఇలా చైల్డ్‌ అబ్యూసింగ్‌కు బలయ్యాడు. వీడియోలు తీసి, వాట్సప్‌లలో పెడతాం అని బ్లాక్‌మెయిల్‌ చేసి వాని దగ్గరున్న డబ్బులు లాక్కోవడమే కాక, కొన్ని దొంగతనాలు కూడా అంటకట్టేవారంట. వాడు మానసికంగా ఒంటరైపోయి, తన సమస్యను ఎవరితో చెప్పుకోలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కనీసం మాలాంటి టీచర్స్‌కు ఎవరికైనా వాడి సమస్యను చెప్పుకునే ‘స్వేచ్ఛ’ లేకుండా పోయిందా! అన్పించింది. అసలు సమాజం ఎటుపోతోంది? పిల్లల్లో ఈ వికృత చేష్టలు, పైశాచిక ఆనందం ఏమిటో? అసహ్యం పుడుతోంది. విచ్చలవిడిగా అందుబాటులోకి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, ఒక కంట్రోల్‌ లేని ‘యూట్యూబ్‌’ చిత్రాలు ఆఖరికి సమాజం మీద ముఖ్యంగా, పిల్లలమీద ఎంత దుష్ప్రభావం పడుతోంది అనడానికి మోహన్‌ ఒక పెద్ద సాక్ష్యంగా నిలబడ్డాడని తెలిసి తల్లడిల్లిపోయాం.

ఏదో క్లాసులకి వెళ్ళి పాఠాలు చెప్పడం వరకే మేం ఆలోచిస్తున్నామా? మోహన్‌ విషయంలో మా బాధ్యతెంత? అని ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉన్నాను.

ఒకరోజు బండిమీద స్కూలుకొస్తుంటే ముదిరాజ్‌ కాలనీ నుంచి రోడ్డుపైకి నడుచుకుంటూ వస్తున్న మేరీ కనిపించింది. బండిమీదెక్కించుకుని, బండి నడుపుతూ అడిగాను.

‘ఏంటి మేరీ, చాలా రోజులయింది కనిపించక’.

‘మా నాన్నకు పెళ్ళి చేశాం టీచర్‌. నాకు కొత్తమ్మ వచ్చింది’ అంది సంబరంగా.

‘ఇన్నేళ్ళు చేస్కోంది ఇప్పుడు చేసుకున్నాడా మీ నాయన? నీకు వంటపని తప్పిందా?’ అడిగాను.

‘నేనే చేసొచ్చినా టీచర్‌, ఆమెకు వంట రాదు’ అంది మేరీ.

‘అదేంటి?’ ఆశ్చర్యపోయాను.

‘కొత్త కదా టీచర్‌, పోను పోను నేర్చుకుంటుందిలే’ అంది మేరీ పెద్దరికంగా.

‘మీ కొత్తమ్మకు వయసెంతుంటుంది?’

‘పదిహేను, పదహారేళ్ళు ఉంటాయి టీచర్‌’ అంది అంచనా వేస్తూ మేరీ.

అంటే కేవలం కూతురికంటే ఐదారేళ్ళ తేడా ఉన్న అమ్మాయిని చేసుకున్నాడా? వాళ్ళెలా పిల్లనిచ్చారు ఈయనకు? ఆశ్చర్యమనిపించింది.

‘ఏం కూర చేశావ్‌ ఈ రోజు’ అడిగాను.

‘టమాటా చారు చేశాను టీచర్‌. కూరగాయలు కొనడానికి మా నాయన పైసలిస్తేనే కదా? ఏదుంటే అదే వండేస్తా’ అంది ఆరిందాలా.

నాకు ఎప్పుడు ఈ అమ్మాయి మాటలు విన్నా, భలే గమ్మత్తుగా అనిపిస్తుంది. ఇంత చిన్న వయసులో పరిస్థితులను విశ్లేషించుకుంటూ, కష్టపడి పనిచేస్తూ, ఆ ఇంటికి ‘ఆడదిక్కై’ సంసారాన్ని ఈదుతోంది. కష్టాలకే వణుకు పుట్టేంత ధైర్యంగా ఉండడం నిజంగా మేరీకి హాట్సాఫ్‌. బాల్యం తాలూకు సున్నిత భావాలు ఏవీ ఆ ‘పిల్ల శబరి’లో నాకెప్పుడూ కనిపించలేదు.

మొత్తానికి ఏడాది పరీక్షలు పూర్తయ్యాయి. సెలవుల తర్వాత కొత్త అకడమిక్‌ ప్రారంభమయింది. స్కూల్లో అడ్మిషన్లు నడుస్తున్నయ్‌. పరీక్షలు రాయని పిల్లల్ని తరగతులకు పంపమని ‘ఉత్తుత్తి’ బెదిరింపుగా, పేరెంట్స్‌ని తీసుకురమ్మని చెప్పడంతో, స్కూలునిండా జనాలే జనాలు.

మేరీ కూడా పరీక్షలు రాయనట్టుంది. వాళ్ళ మేనత్తంటూ ఒకామెను తీసుకొచ్చి వాళ్ల క్లాస్‌ టీచర్‌ దగ్గర మాట్లాడిస్తోంది. అటుగా వెళ్తున్న నేను, మేరీని చూసి ఆగాను.

మేరీకి ఇప్పుడు తమ్ముడు పుట్టాడు. అదనపు బాధ్యతలు ఎక్కువయ్యాయి. నాయనా, ఆ కొత్తమ్మ చెత్తబండి లాగడానికెళ్తే, ఇంటిపని, వంటపని, చంటోడి పనులతో మేరీకి ఊపిరాడడంలేదు. అందుకే స్కూలుకి డుమ్మా కొట్టి ఇంటి దగ్గరే ఉంటోంది.

‘స్కూలుకు రాకపోతే చదువెలా వస్తుందే?’ అడిగాను నేను కూడా.

‘ఏం లేదు టీచర్‌, వస్తాను. పిల్లోడు కొంచెం పెద్దై, బండిలో కూసుంటే మా అమ్మ ఎనకాల ఎల్తాడు. ఇగ అప్పుడొస్తా స్కూలుకు’ పిల్లడిని పెంచే బాధ్యత కూడా తనే నెత్తినేసుకుంది.

‘అదేం కుదరదు. మీ అమ్మను ఇంటి దగ్గరుంచి, నువ్వు రా బడికి’ అంది వాళ్ళ క్లాస్‌ టీచర్‌.

‘మా నాయన పైసలు తాగుడుకే సరిపోతాయ్‌. ఆమెళ్తేనే ఇల్లు గడుస్తుంది. అందుకే టీచర్‌! పిలగాని కోసం, నేనింటికాడ

ఉండేది. నాక్కూడా మా ఫ్రెండ్స్‌ అందరితో కల్సి సదువుకోవాలనే ఉంది. కానీ ఏం చేసేది?’ అంటూ మాకే సవాల్‌ విసిరింది మేరీ.

‘అవన్నీ చెప్పకు. బడికొచ్చేది నేర్చుకో’ అంది గద్దిస్తూ క్లాస్‌ టీచర్‌ కావేరి.

పైన్నుంచి కిందకు తల రెండుసార్లు ఊపుతూ, వాళ్ళత్తను తీసుకుని వెళ్ళిపోయింది మేరీ.

ఇంటర్వెల్‌లో స్టాఫ్‌ రూంకొచ్చాడు భరత్‌ ‘టీచర్‌ పది రూపాయిలివ్వవా?’ అంటూ.

‘ఏం, ఎందుకు?’ అన్నాను.

‘ఆకలైతుంది టీచర్‌, ఇయ్యాల మా అక్క ఏం వండలేదు’ అంటూ దీనంగా మొహం పెట్టాడు.

పాపం అన్పించింది. సరే అని పది రూపాయలిస్తే తుర్రుమని పారిపోయాడు.

ఈలోగా వాళ్ళక్క వచ్చింది. ‘టీచర్‌, మీరు మా తమ్ముడికి పైసలిచ్చారా’ అంటూ.

అవునన్నట్లు తలూపాను.

‘వద్దు టీచర్‌, ఇవ్వకండి. వాడు ఈ మధ్య అన్నీ అబద్ధాలు నేర్చుకున్నాడు. అందరి దగ్గర డబ్బులు తీసుకుని, పిచ్చివన్నీ కొనుక్కు తింటాడు. మా నాయనకు తెల్సి కొడ్తేనేమో, ఇంట్లోంచి పారిపోతానని బెదిరిస్తుండు’ అంది ఆ అమ్మాయి.

‘సరేలే’ అన్నాను నేను.

ఒకరోజు భరత్‌ వాళ్ళ నాన్న స్కూలుకి వచ్చాడు. అబ్బాయి కనిపించలేదని వెతుక్కుంటూ ఇంటికి రాక రెండ్రోజులైందని, చాలా బాధపడుతూ చెప్పాడు.

ఎవరిదో పర్సు కొట్టేసి, డబ్బులు తీసుకుని పారిపోయాడంట. వాళ్ళొచ్చి ఈయనకు చెప్పారు. ఇంటికొస్తే కొడతాడని, ఎక్కడెక్కడో తిరుగుతుండు. ఈ మధ్య కాలనీలో పెద్ద, పెద్ద పిల్లల్తో ‘దోస్తానా’ చేస్తున్నడని, పుస్తకం తీసి చదవడు, చెబితే వినడు, కొడ్తే పారిపోతుండు. వీన్తో ఏం చేయాలో అర్థం కావడం లేదంటూ చాలా బాధపడుతూ కళ్ళెంబడి నీళ్ళు నింపుకున్నాడు.

వానికి తల్లి ప్రేమ దొరక్క అది ఎక్కడెక్కడో వెదుక్కుంటున్నాడనిపిస్తుంది. తండ్రేమో క్రమశిక్షణ పేరుతో కొట్టేసరికి ఇలా ఎటూ కాకుండా తయారవుతున్నాడు. కొట్టడం కాకుండా మాటలతో బుజ్జగిస్తే వానిలో మార్పు రావచ్చేమో అంటూ అందరూ ఆయనకు సూచనలిచ్చి పంపారు.

మేరీ, భరత్‌ ఇద్దరూ తల్లిలేని పిల్లలే. కానీ, వాళ్ళ ప్రవర్తనలో, వ్యక్తిత్వంలో ఎంత వైవిధ్యం ఉంది అన్పించింది నాకు.

ఒకరోజు నేను క్లాసులో ఉండగా మేరీ నా దగ్గరకు వచ్చింది.

‘నమస్తే, టీచర్‌ బాగున్నారా’ అంది పలకరింపుగా.

‘అరె, ఇన్నాళ్ళు ఏమయ్యావు? పిల్లల్తో ఎన్నిసార్లు చెప్పి పంపినా ఇంట్లో లేవంటున్నారంట. ఎక్కడికెళ్ళావ్‌? చదువు మొత్తం పోయింది’ అంటూ ఆరా తీశాను.

‘అప్పుడు తమ్ముడు సిన్నగున్నడని రాలేదు కదా టీచర్‌! వాడిప్పుడు మా అమ్మతోని బండిలో కూచొని ఎల్తుండు. నేను స్కూలుకొస్తానంటే మా నాయన రానీయడం లేదు. నన్ను కూడా బండిలాగేకే పెట్టిండు. ఏమన్న అంటే మస్తు కొడ్తుండు టీచర్‌’ అంది.

‘అన్నీ కథలు చెప్తావు కానీ, నువ్వు గట్టిగుంటే స్కూలుకు ఎందుకు పంపడే? ఆర్నెల్ల నుంచీ లేందీ ఈ రోజెందుకు స్కూలుకు రావాలనిపించింది పాపం’ అంటూ చురక అంటించాను.

‘ఈ రోజు చెత్తబండి లాక్కెళ్తుంటే, జిహెచ్‌ఎంసి వాళ్ళు వచ్చి పట్టుకున్నారు టీచర్‌. స్కూల్‌కెళ్ళకుండా ఈ పనెందుకు చేస్తున్నావ్‌? అంటూ ఫోటోలు తీసి, వీడియోలో నన్ను మాట్లాడమన్నారు. నేను వాళ్ళతో మొత్తం చెప్పిన టీచర్‌’ అంది మేరీ.

ఆ అమ్మాయి మాటల్లో నాకు ఎప్పుడూ తన తండ్రి మీద, ఆ కుటుంబం పట్ల ప్రేమ కనిపించేది. ఈసారెందుకో వాళ్ళ మీద మనసిరిగిపోయి, విరక్తితో మాట్లాడుతున్నట్లు అనిపించింది.

‘టీచర్‌ నేను చదువుకుంటా. ఏదన్నా హాస్టల్లో చేర్పించు టీచర్‌. నేనింక ఆ ఇంటికి పోను. నామీద మా పిన్ని సానా సానా నిందలు వేసింది. నాకు జరమొచ్చి పడిపోతే, ఎవడితోనో కడుపు తెచ్చుకుందేమో అంటుంది. అది ఇని మా అయ్య గొడ్డును బాదినట్టు బాదితే ఊపిరాడక పడిపోయాను టీచర్‌. సుట్టుపక్కలోల్లు వచ్చి నీళ్ళు సల్లి లేపినారు. వాళ్ళందరికీ నా గురించి తెల్సు టీచర్‌. ఈ నరకంలో ఏముంటవ్‌? ఏడ్నైనా ఎల్లి బతుక్కుపోరాదే! అంటుండ్రు. నేనేడపోయేది టీచర్‌? మా అమ్మమ్మ వాళ్ళు కూడా మా నాయనకు భయపడి నన్ను రానీయరు టీచర్‌, నేను సదువుకుంటాను ప్లీజ్‌ టీచర్‌. ఇక్కడేడన్నా చేరితే మా నాయన అక్కడకు కూడా వచ్చి కొట్టి లాక్కెళ్తాడు. నన్ను దూరం హాస్టల్లో చేర్పించు టీచర్‌’ అంటూ వేడుకుంటోంది.

తన తండ్రితో కుటుంబాన్ని ఏర్పర్చి, బాధ్యతలన్నీ మోసి, ఆఖరుకు ఇలా రోడ్డుపాలై భవిష్యత్తు గురించి కూడా తనే ఆలోచిస్తూ చదువుకోవాలనే తపనతో, ఇల్లొదిలి వచ్చిన మేరీ పరిస్థితి నాకు దయనీయంగానూ మరియు ఆలోచనాత్మకంగానూ కన్పించింది. వెంటనే ‘1098’ ఛైల్డ్‌ హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేశాను. వాళ్ళొచ్చి ఆ అమ్మాయిని విచారించి, ఫోన్‌లో వాళ్ళ నాన్నతో మాట్లాడి సి.డబ్ల్యు.సి.కు తీసుకెళ్ళారు. డొమెస్టిక్‌ ఛైల్డ్‌ లేబర్‌ కింద కేసు నమోదు చేసుకున్నారు. ఛైల్డ్‌ వెల్ఫేర్‌ కోర్టు ద్వారా ఆ అమ్మాయి జీవితానికి భద్రత ఉండేలా ఏదైనా హోమ్‌లో జాయిన్‌ చేసి, అక్కడకు దగ్గర్లో ఉన్న స్కూల్లో చేర్పిస్తారు.

వాళ్ళతో మేరీను పంపిస్తుంటే మంచి పని చేస్తున్నాననే తృప్తితో పాటు ఎక్కడో గుండెలో ఉండే ‘తడి’ కళ్ళలోకి వచ్చి కళ్ళు చెమర్చాయి.

ఎప్పటిలా మేరీ ఆత్మవిశ్వౄసంతో వాళ్ళ వెంట వెళ్తూ వెనక్కు చూసింది. తనకళ్ళు నా పట్ల కృతజ్ఞతగా మెరుస్తున్నాయి.

(ఉపధ్యాయదర్శిని పత్రిక నుండి)

Share
This entry was posted in కథలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.