If I had a hammer I’d smash patriarchy
నేను పురుష ద్వేషిని ఏమీ కాదు కానీ…
”నెలసరిలో ఉన్న స్త్రీ వంట చేస్తే మరు జన్మలో ఆడకుక్కగా పుడుతుంది” అన్న గుజరాత్‌లోని భుజ్ పట్టణంలోని స్వామి నారా యణ్ గుడిలోని స్వామి కృష్ణస్వరూప్ దాసాజీ ఉవాచ చదివాక చాలా కోపంగా ఉంది.
Gloria Steinem మరీ మరీ గుర్తొస్తోంది. వ్యంగ్యంగా అన్నా… ఎంత బాధ ఉండి ఉంటే ఈ మాటలొస్తాయి.
“So what would happen if suddenly, magically, men could menstruate and women could not?
Clearly, menstruation would become an enviable, worthy, masculine event.
Men would brag about how long and how much.
Young boys would talk about it as the the envied beginning of manhood.
The prevent monthly work loss among the powerful, congress would fund a National Institute of Dysmenorrhea. Doctors would research little about heart attacks, from which men would be hormonally protected, but everything about cramps. Statistical surveys would show that men did better in sports and won more Olympic medals during their periods.”
If Men could could menstruate” అనే వ్యాసంలో గ్లోరియా అంటుందిలా.
నిజమే. ఏదో ఒక అద్భుతం జరిగిపోయి ఉన్నపళాన పురుషులకి ఋతుస్రావం మొదలయ్యి స్త్రీలకి ఆగిపోతే పరిస్థితి ఎలా
ఉంటుంది
ఋతుస్రావం అనేది మగతనానికి సంబంధించిన ఒక గొప్ప విషయంలా, అందరూ అసూయపడే అద్భుతమైన విషయంలా మారిపోయేదా. మగవాళ్ళంతా ”తామెంతసేపు ఎంత బాగా” అన్న లెవల్‌లో మాట్లాడుకునేవారా.
… … …
మాకు సైకిల్స్ మొదలయినపుడు,
ఉడుకుడుకు నీళ్ళతో హాయిగా స్నానం చేయించి సాఫ్ట్ ఫుడ్, మెత్తటి బట్టలు వేసి సేదతీర్చిన మా అమ్మమ్మ కాలిగోటికి కూడా వీళ్ళు సరిపోరు కదా.
ఇదంతా పక్కనబెడితే అసలు స్త్రీ ఋతుస్రావం అన్నది ఎప్పటికప్పుడు ప్రధాన వార్తగా ఎందుకు మారాల్సి వస్తుంది. లింగభేదాన్ని బట్టి మనిషికి ఉండే శారీరక ధర్మాల్లో స్త్రీకి సంబంధించిన శరీర ధర్మమది. ఋతుచక్రంలో అదొక భాగం.
అదేదో పాపం అని భయపెట్టి యుగ యుగాలుగా స్త్రీని ఒక ఆత్మరక్షణలోకి నెట్టివేసి వేడుక చూసింది ఇక చాలు.
గోవు ఇంట్లోకి వస్తే శుభమంటూ ఇంట్లో ఉన్న గదులన్నీ తిప్పి దానికి సాష్టాంగ నమస్కారాలు చేసే సమాజం, అదే ఇంట్లో పొద్దుటి నుండి రాత్రి వరకూ రెక్కలు ముక్కలు చేసి కష్టపడే స్త్రీకి మాత్రం ఆ మూడు రోజులూ తన ఇంట్లోకి ప్రవేశం లేదట. ఏమి ధర్మమిది? ఎవరు రాసిన ధర్మమిది?
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రౌత్ గరా అనే ఊళ్ళో స్థానికంగా ఉన్న బడికి నెలసరి రోజుల్లో అమ్మాయిలు వెళ్ళరట. ఎందుకంటే వాళ్ళు వెళ్ళాల్సిన దారిలో చాము అమ్మవారి గుడి
ఉందట. నెలసరి రోజుల్లో ఆ గుడి దాటితో అమ్మ వారి ఆగ్రహానికి గురవుతామనే భయం అట. ఎక్కడినుండి పుట్టింది ఈ భయం? ఇది ఒక్కనాటిదా?
ఆది నుండి స్త్రీ పురుషుల మధ్య సాంఘిక సర్దుబాట్లు పురుషులకే అనుకూలంగా
ఉన్నాయి. కాబట్టే కదా ఈ భయాలు ఇంకా కొనసాగుతూ ఉన్నాయి? సమాజంలో చాలా మంది మంచి మగవాళ్ళు ఉండొచ్చుగాక స్వామి కృష్ణ స్వరూప్ దాసాజీ లాంటి కుళ్ళు కూడా ఇదే సమాజంలో ఉందిగా. వేలికి కొంచెం ఇన్‌ఫెక్షన్ చాలుగా కాలు మొత్తం పాకడానికి. ఇలాంటి మనుషులూ అంతే. వీళ్ళకి అన్నీ అపవిత్రమే.
సహజ ప్రక్రియ అయిన ఋతుస్రావాన్ని చూపించి స్త్రీపై ‘అపవిత్ర’ అని ముద్ర వేయడం ఏ అనాగరిక యుగపు లక్షణం? స్త్రీ గర్భసంచిలో నుండి వచ్చే రక్తమే అపవిత్రం అయినప్పుడు అదే గర్భసంచిలో 9 నెలలు
ఉండి వచ్చిన మగవారు ఎలా పవిత్రం? మరి పుట్టుకతోనే అపవిత్రమైన మీరు ప్రవచించే ధర్మాలు ఎలా పవిత్రమవుతాయి? ఎలా ఆచరణీయం అవుతాయి?
ఒక పక్క అర్థనారీశ్వర తత్వమంటూనే మరో పక్కన…
”పితాః రక్షతి కౌమారే
పతి రక్షతి యౌవనే
పుత్రో రక్షతి వార్దక్యే
న స్త్రీ స్వాతంత్య్రమర్హతి
అంటే (కౌమార దశ వరకు తండ్రిచే రక్షింపబడాలి, యౌవనంలో భర్తచే రక్షింప బడాలి, వార్ధక్యంలో కొడుకులచే రక్షింపబడాలే కానీ, స్త్రీ స్వాతంత్య్రానికి అర్హురాలు కాదు’ అని చేప్పేదీ వారే.
అంటే స్త్రీకి తనను తాను రక్షించుకునే హక్కు లేదు అనే కదా?
అసలు స్త్రీ రక్షింపబడాల్సింది ఎవరినుంచి? వారి నుండి ప్రమాదం ఎందుకు పొంచి
ఉంటుంది? మరో ఇంటి తండ్రి నుండో, ఇంకో ఇంటిలోని భర్త నుండో, లేదా వేరే ఇంటిలోని కొడుకునుండో… మరి వాళ్ళకి లేవా ఏ ధర్మాలూ? ఒకవేళ ఉండి ఉంటే అవెందుకు సంఘంలో ప్రాచుర్యం పొందలేదు?
స్త్రీ బహిష్టు ఐతే వంట చెయ్యకూడదు.
స్త్రీ బహిష్టు ఐతే ఇంట్లోకి రాకూడదు.
స్త్రీ బహిష్టు ఐతే గుడిలోకి వెళ్ళకూడదు…
ఇలా ఎన్ని ఆంక్షలన్నా పెట్టండి. మా నెత్తురు చూసి మేం ముడుచుకుపోయిన రోజులింక రావు. ఇప్పుడిక మరక మంచిదే. ఇప్పుడిక మా హార్మోన్లు ఆడే ఆటని చూసి మేమూ నవ్వుకుంటాం. మమ్మల్ని కించపరచి వెలివేసిన రోజులకిక చెల్లు. ఇప్పుడిక పూల కుండీలను హాయిగా ఆ రోజుల్లోనూ స్పృశిస్తాం.
మీరెంతగా అయినా మా గొంతు నొక్కండి… అంతకంత ఎలుగెత్తడం మా కలవాటే.
మరొక్కసారి చెప్తున్నాం..”Happy to Bleed”.