ఇవ్వాళ మనం ఒక ముఖ్యమైన చోట ఉన్నాం. ఒక ప్రత్యేకమైన చోట. ఒక వివాదాస్పదమైన చోట. ఇది- అలనాటి ఆలోచన. ఈనాటి ఆచరణ. రేపటి సందిగ్ధం. ఇది- పోలవరం! ముంపు ప్రాంతం!!
మునుపటి రామపాదసాగరం… ఈనాటి ఇందిరాసాగరం… ఏది ఏమైనా… ఇది పోలవరం ప్రాజెక్ట్ క్రింద ముంపుకు గురి కాబోయే చోటు!
దీని పూర్వాపరాలు, బాగోగులు, భవిష్యత్ ప్రణాళికల గురించి మనం కాసేపు మాట్లాడుకుందాం. ఈ సంభాషణ ఒక ప్రారంభమూ కాదు. ముగింపు కాకూడదు. ఈనాటి ఈ ఆలోచనలకు కొనసాగింపు ఉండేలా ప్రయత్నిద్దాం.
శ్రీ శొంఠి రామమూర్తిగారి ఆధ్వర్యంలో బ్రిటీష్ ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఆనకట్ట ఆలోచన 1941 -51 ల నడుమ శ్రీ కె.ఎల్ రావు గారి నిర్వహణలో అధ్యయనం పూర్తయ్యి – పరిశీలనలకు వెళ్ళింది. మొదట డిజైన్లలో ఉన్న కొన్ని ఇబ్బందుల వలననూ, ఆ తదుపరి బ్రిటిష్ ప్రభుత్వ పక్షపాత ధోరణి వలనను – ఆగింది. 1953 వరదల తరువాత మళ్ళీ పునరాలోచన జరిగి, 80 దశకంలో పూర్తిస్థాయి చర్చలలోకి వచ్చింది. సాంకేతిక నిపుణులకు, పర్యావరణవేత్తలకు ఇందులో ఎన్నో అభ్యంతరాలు. ఈ నడుమ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడడం, వాటి మధ్యలో నదీజలాల పంపకమై జరిగిన ఒప్పందాలు, ఒడిదుడుకులు- దాదాపుగా ఈ ఆలోచనలను పక్కకు పెట్టాయి. ఇప్పుడు ఏకబిగిన ప్రారంభమైన అనేక ప్రాజెక్టులతో పాటుగా ఇదీ మళ్ళీ ప్రారంభమైంది.
ఆనకట్ట: 1600మీ. పొడవున్న earth fill rock dam. కుడివైపు spillway. ఎడమవైపు విద్యుత్ కేంద్రం. Max. height – 50 m.
రిజర్వాయరు: పాపికొండలు, శబరి నదులతో సహా షుమారు 553 sq.km. (1,36,646 ఎకరాలు) ( షుమారు) Flood Rise Level ( FRL) ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్, ఛత్తీష్గఢ్, ఒరిస్సాలలో ‘‘ముంపు’’కు లోనవుతుంది. షుమారు 276 గ్రామాలతో సహా లక్షలాది ఎకరాల అడవి, సాగుభూములు నీట మునుగుతాయి. దాదాపు 1,75,000ల మంది నిర్వాసితులవుతారు. వారిలో చాలా మటుకు గిరిజనులు.
ఎడమకాలువ: బురదకాలువ, ఏలేరు, తాండవ, వరాహ, పంప మరియు శారద నదుల చాళ్ళలలో సుమారు 200 కి.మీ. ప్రవహిస్తూ – నాలుగు లక్షల ఎకరాలకు నీరందించవచ్చును.
కుడి కాలువ: ఎర్ర కాలువ, తమ్మిలేరు, బుడమేరు ద్వారా ప్రవహిస్తూ 200 కిమీ. ప్రయాణిస్తుంది. ఈ నీటిలో కర్ణాటక, మహారాష్ట్రలకు భాగం పంచగా మిగిలినవి రాయలసీమ, తెలంగాణాలకు ఉపయోగపడవచ్చును.
***
960 M.W విద్యుదుత్పాదన, లక్షలాది ఎకరాల సాగునీటి ప్రస్తావనలు, వాగ్దానాల నడుమ దీని ప్రారంభ బడ్జెట్ సుమారు 13,500 కోట్ల రూపాయలు! దీనిలో షుమారు 4,360 కోట్లు భూసేకరణకు, ముంపువాసుల పునరావాసానికి కేటాయించినట్లుగా తెలియవస్తుంది-
2004 -05 సంవత్సరానికి 3,793 కోట్ల రూపాయలు ప్రభుత్వం విడుదల చేయగా,2005-06 సంవత్సరంలో 6,350 కోట్ల రూపాయలు విడుదలకు సిద్ధం అయ్యాయి. ఇంతటి ప్రజాధనాన్ని వెచ్చించి మనం ఏ మేరకు ప్రయోజనాలను పొందుతామో- ఎంతవరకు సాధ్యమో – అసాధ్యాలు ఏమైనా వున్నాయో – చూద్దాం.
ఏమేమి లాభాలు?
– వ్యవసాయ ఉత్పత్తి పెరగడం… సుమారు 2.83 లక్షల ఎకరాలలో, విద్యుదుత్పాదన పెరగడం,విశాఖ కర్మాగారాలకు, పరిశ్రమలకు నీరు, పట్టణానికి త్రాగునీరు, ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రలలో అవసరమైన చోట నీటి లభ్యత( బుడమేరు ద్వారా కృష్ణలోకి గోదావరి జలాలను చేర్పించడం ద్వారా), విశాఖ పట్టణానికి గోదావరి నది ద్వారా అంతర్భూభాగ నౌకాయాన సౌలభ్యం, పర్యాటక కేంద్రం.
ఏం నష్టాలు?
– జలస్తంభన, ముంపు. సుమారు 15 నుంచి 20 శాతం గోదావరీ పశ్చిమ డెల్టా ప్రాంతం జలస్తంభనకు గురి అవుతుంది. జలస్తంభన, మురుగు నీటి సమస్య వలన ‘‘ ఖరీఫ్ పంటను వదిలివేయాల్సి వస్తుంది’’, కొల్లేరు నదీ పరివాహక ప్రాంతాలలోని స్వల్ప అభివృద్ధి… అది అంటూ వుంటే సంక్షోభంలో పడుతుంది, బుడమేరు పరివాహక ప్రాంతం సంక్షోభంలో పడుతుంది, విజయవాడ నగరాన్ని తరచు వరదలు ముంచెత్తుతాయి.
మనం ఏమి కోల్పోబోతున్నాం?
– హరిత విప్లవ దుష్ప్రభావంతో ఇప్పటికే మనం కోల్పోయిన ‘‘ మానవ మిత్ర’’ జీవరాశి మళ్ళీ ఒక సుడిగుండంలో పడుతుంది. ఒక దిగ్భ్రాంతికర సందర్భంలో పడబోతోంది. సరీసృపాలు, పిల్లులు తగ్గడం – ఎలుకల స్వైరవిహారం! పంటల నాశనం, నక్కలు, తోడేళ్ళు, అడవిపిల్లులు – 1940 ప్రాంతాలలో పోలిస్తే ఇప్పటికే మాయం, వలస పక్షులు, సీతాకోక చిలుకలు, అనేక కీటకాలు మాత్రమే కాక కాకి పిచ్చుకలు ఇక కాకమ్మ కథలై మిగులుతాయి, చిట్టి చేపలు, సూక్ష్మజీవులు, చిన్న ప్రాణులు, వాన పాములు, నత్తలు, జలగలు – కప్పలు… నెమ్మదిగా క్షీణిస్తాయి. ఉప్పుటేరులో అదృశ్యమైన డాల్ఫిన్స్ లాగా. పొలస/ సొలస గోదావరి నదిలోకి వలసవచ్చే చేపజాతి కనుమరుగవుతుంది. ధాన్యాలపై, పశుగ్రాసంపై తీవ్ర ప్రభావం – పడుతుంది.
(పోలవరం పర్యావరణ ప్రభావం గురించి ప్రముఖ ఇంజనీర్ శ్రీ రామకృష్ణయ్య గారి పరిశీలనలు ఇవీ!)
ఆ పైవన్నీ ‘‘ పాపికొండ వైల్డ్ లైఫ్ సాంక్చురీ’’ నుంచి రేఖవల్లి కొండల వరకు – రిజర్వ్ ఫారెస్ట్ భద్రాచలం (South Division లో)- ముంపుకు గురి కాబోయే అడవులు కోల్పోవడం – వలన జరిగే… జరగబోయే… పరిణామాలు!
– ఎంతో విలువైన బొగ్గు నిక్షేపాలు, సున్నపురాయి నీటిపాలవుతాయి. గొల్లగూడెం, రుద్రమకోట, తూటిగుంట – ఆర్కియాలజికల్ sites మాయమవుతాయి, పాపికొండలు, శబరి నది – కాలగర్భాన కలిసిపోతాయి!
విలువైన అడవి సంపదతో పాటుగా ఎన్నో పశుపక్షి జాతులు, వృక్ష, ఫల, పుష్ప జాతులను మనం కోల్పోతాం, లక్షలాది గిరిజనులు నిర్వాసితులు అవుతారు. ఒక్కసారిగా జీవన విధానం – సమూలంగా మార్చివేయబడుతుంది. వారి ప్రకృతి జ్ఞాన సంపద, సంస్కృతి మనం కోల్పోబోతున్నాం!
ప్రస్తుత పరిస్థితి
పర్యావరణపరంగా, అటవీ సంపదలపరంగా, నిర్వాసితుల సమస్యల దృష్ట్యా రాష్ట్రాల నడుమ నీటి పంపకం వలన – ఈ ఆనకట్ట మరొక టెహ్రీ లాగా నర్మద లాగా – ఒక జాతీయ వివాదం.
కేంద్ర జలసంఘం నుంచి కానీ ప్రభుత్వం నుంచి గానీ – దీనికి ‘‘ సంపూర్ణ అనుమతి’’ లభించలేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవాలకు పొంతన లేదు.
Environment Public Hearing లో నవ్వులాటకు గురి అయిన ప్రతిపాదనలు… రాజకీయ వత్తిళ్ళు, ప్రభావం, ప్రాబల్యంతో ‘‘ పర్యావరణ అనుమతి’’ ని తెచ్చుకున్నాయి.
కానీ, అడవుల సంరక్షణ శాఖ ససేమిరా అనుమతి ఇవ్వడం లేదు. కేంద్ర జలవనరుల శాఖ ఇచ్చే సాంకేతిక, ఆర్థిక పరమైన అనుమతులు లభించలేదు. కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ అనుమతి కానీ, ప్రణాళిక సంఘం ఇచ్చే పెట్టుబడుల అనుమతులు కానీ, లభించలేదు. ఇవేవీ లేకుండా ఆనకట్ట నిర్మాణం సాధ్యం కాదు.
అయినప్పటికీ – రెండు కాలువ పనులు మొదలుపెట్టడం ( ఆనకట్ట లేకుండానే) – ఆనకట్ట ఆయకట్టు ప్రాంతంలో తాటిపూడి, పుష్కరం కాలువల పనులు మొదలు పెట్టడం – వివాదానికి శ్రీకారం చుట్టాయి!
ఇప్పటికే జాతీయస్థాయిలో చర్చ ప్రారంభం కావడం పర్యావరణ వేత్తలు, ఉద్యమకారులు, సాంకేతిక నిపుణులు నిరసనలు వెల్లువెత్తించడం – ప్రజా వ్యాజ్యాలు దాఖలు కావడం – మొదలయ్యాయి. ఇక మమ్మురం అవుతాయి.
ఎందుకంటే – ‘‘కాలువలకు ఏ అనుమతి అవసరం లేదు ‘‘ అంటూ ఏకపక్ష ధోరణితో పనులు కొనసాగిస్తున్న ప్రభుత్వం – ప్రజాకోర్టుల దెబ్బతో – ‘‘పర్యావరణ అనుమతి’’ సాధించుకోగలిగింది – కానీ, అది ఎంతటి ‘‘అరాచకమో’’ చెప్పకనే చెపుతోంది.
మనం ఎందుకు మాట్లాడుకోవాలి? ఇది మనకేమిటి సంబంధం? వేలాది కోట్ల ప్రజాధనం, ప్రపంచ ఆర్థిక సంస్థల ‘‘ ఉదార రుణం’’ -మనలను, మన దేశాన్ని, మన ఆర్థిక వ్యవస్థనూ, మన అస్తిత్వాన్ని, మన మనుగడను -సంక్షోభంలోకి నెట్టబోతున్నాయి. కొద్దిమందిని తృప్తి పరిచే ఈ వేలాది కోట్ల రూపాయలు – కోట్లాది మందిని దాస్యంలోకి నడిపించబోతున్నాయి. నిస్సిగ్గుగా! ‘‘ఎవడబ్బసొమ్మని’’ చూస్తూ ఊరుకోవడానికి! ఇది మన ధనం. ఇది మన కష్టార్జితం. అర్ధాంతరంగా ఈ ఆనకట్ట ఆగిపోతే….?!? మనం చూస్తూ ఊరుకోవడమేనా? మనం ఏం చేయగలమో – ఎవరికి వారే ఆలోచించాలి. ఇది ఒక నదికో – ఒక ప్రాంతానికో – ఒక రాజకీయ పక్షానికో – ఒక ఉద్యమకారునికో సంబంధించిన విషయం కాదు. మనందరి విషయం.ఒక పక్క సహజవనరులపై కన్నువేసి ‘‘ ఆర్థిక సాయం’’ వలను విసిరిన అగ్ర రాజ్యాల దళారి సంస్థలు -మరోపక్క అవినీతిమయమైన స్వార్థపరుల ‘‘ చేతి సంతకం’’లో చిక్కుకున్న కోట్లాదిమంది భవిష్యత్తు, అన్నిటికి మించి- జీవవైవిధ్యం, ప్రకృతి జ్ఞానం, నదీ పరివాహక ప్రాంత స్వరూప స్వభావం, ఇవన్నీ-మరెన్నో మనం మాట్లాడాలి. మాట్లాడుతూనే ఉండాలి.ఏమరుపాటుగా ఉన్నామో – ఎటునుంచైనా ప్రమాదం. ఇప్పుడు కావల్సింది సంఘటిత ఆలోచన. సమీకృత ప్రణాళిక. విజ్ఞులు, వివేచనాశీలురైన మీరు ఈ విషయాలను మరింత లోతుగా ఆలోచించడం ప్రారంభిస్తారని ఆశిస్తూ మరొక్క మారు – ఇది ప్రారంభమూ కాదు. ముగింపు కానే కాదు!
(పోలవరం ప్రాజెక్టు మీద చర్చను ప్రారంభిస్తూ చంద్రలతచేసిన ప్రసంగపాఠం)