డాక్టర్ జె. భాగ్యలక్ష్మి
21-22 , మే, 2009 తేదీలలో తీన్‌మూర్తి భవన్ ఆడిటోరియం న్యూఢిల్లీలో ”సమాచారం హక్కు, మానవహక్కులు, ప్రస్తుతి స్థితి” గురించి ఒక చర్చ ఏర్పాటు చేసింది. ఇందులో ప్రముఖులు పాల్గొని సమాచార హక్కుకు సంబంధించిన వివిధాంశాలు చర్చించారు.
21వ తేదీ ప్రారంభ సమావేశంలో, ప్రతి ఏడూ కమిషన్ హిందీలో సృజనాత్మక పుస్తకాలకు, అనువాద రచనలకు ఇచ్చే అవార్డులను ప్రముఖ రచయితులకు అంద చేశారు. ”హిందీ మే సృజనాత్మక్ పురస్కార్ యోజన” అనే కార్యక్రమం 1998-99లో ప్రారంభమైంది. మానవ హక్కులకు సంబంధించిన సమాచారాన్ని, మంచి ప్రమాణాలతో, సృజనాత్మకతలో పుస్తకాల ద్వారా అందజేసే వారి పుస్తకాలు పరిశీలించి బహుమతులు నిర్ణయిస్తారు. హిందీలో మౌలిక రచనలతో పాటు, ఇతర భారతీయ భాషలనుండి, ఇంగ్లీషు నుండి హిందీలోకి అనువదింపబడిన పుస్తకాలకు కూడా బహుమతులివ్వాలని కమిషన్ నిర్ణయించింది.
2006-2007 సంవత్సరాలకు హిందీలో మూడు మౌలికరచనలకు, భారతీయ భాష నుండి అనువదింపబడిన ఒక హిందీ రచనకు బహుమానాలిచ్చారు. ఇవి గాక కొన్ని విశేష పురస్కారాలు కూడా ఇచ్చారు.
హిందీ మౌలిక రచనలకు ప్రొఫెసర్ మధుసూదన్ త్రిపాఠీ, శ్రీ భజరంగు లాల్ జేఠూ, శ్రీరమేశ్ కుమార్ పటేల్, డాక్టర్ పి.కె. అగ్రవాల్, శ్రీమతి సరోజ్ పరమార్‌లకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులందాయి. రెండవ, మూడవ బహుమానాలకు ఇద్దరిద్దరు ఎంపికయ్యారు. భారతీయ భాషనుండి హిందీలోకి అనువదించిన ”ఆగు లగీ ఫూల్ వారీ మే” అనే పుస్తకానికి ఆర్. శాంతసుందరికి ప్రథమ బహుమతి లభించింది. అనువాదాలలో ఇదొక్కటే బహుమతి పొందిన పుస్తకం.
డాక్టర్ నిశి అగ్రవాల్, శ్రీ ఓం ప్రకాశ్ సింహ్, శ్రీ బి.ఎల్. ఓహ్రా, డాక్టర్ ముకుల్ శ్రీవాత్సవ్, శ్రీమతి బనీతారానీ సిహ్‌లకు విశేష పురస్కారాలు అందజేశారు. వీరందరూ హిందీలో తమ రచనల ద్వారా మానవహక్కులు విషయమై కృషి చేసినవారే.
స్నేహశీలి, ”భూమిక” పత్రికతో దగ్గరగా ముడిపడిన శాంతసుందరి ఎన్నేళ్ళగానో అనువాదంలో కృషి చేస్తూ వచ్చారు. ఢిల్లీనుండి హైద్రాబాదుకు నివాసం మార్చిన తర్వాత ఆమెకు పని ఒత్తిడి ఎక్కువయిందని పులుపత్రికలలో వెలువడే రచనల ద్వారా తెలుస్తూనే ఉంది. ఇదిగాక కొన్ని ప్రముఖ ప్రచురణ సంస్థలకు కూడా ఆమె అనువాదాలు చేస్తుంటారు. ఇదివరకే ”డాక్టర్ గార్గీ గుప్త” పురస్కారాన్ని పొందిన శాంతసుందరిగారికి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ అవార్డు జాతీయ స్థాయిలో హిందీ అనువాదానికి మంచి గుర్తింపు తెచ్చింది.
అవార్డు పొందిన తర్వాత తమరచన గురించి హిందీలో పరిచయం చేస్తూ (కమిషన్ వారి మొత్తం ఫంక్షన్, సెమినార్‌తో సహా హిందీలోనే జరిగింది. హిందీని అభివృద్ధి చేసి, ప్రోత్సహించే విధానం ప్రభుత్వ సంస్థలు అవలంబిస్తుంటాయి) శాంతసుందరి ఎయిడ్స్ పట్ల అవగాహన ఎంత అవసరమో, దురవగాహన వల్ల ఎంత అనర్థమో తెలియజేశారు. వేదికమీద, ఆ తర్వాత ఆలిండియా రేడియో, ప్రతినిధితో మాట్లాడుతూ తమకు ”భూమిక”తో ఉన్న అనుబంధాన్ని తెలిపారు. శాంతసుందరిగారికి హృదయ పూర్వక అభినందనలు.