ఉమ్మ నీటిలో కదులుతున్నప్పుడే…
కమ్మనైన నీతి కథలు వినిపించండి!
ఉగ్గునూరి గుక్క గుక్క తాగించేటప్పుడే
విచక్షణా స్తన్యాన్ని రంగరించండి!
మొదటిసారి మిఠాయి దొంగిలించినప్పుడే
మైనపు మనసుని నిగ్రహంతో గట్టిపరచండి!
కొసరి కొసరి కడుపారా తినిపించేటప్పుడే
కాని పనుల పర్యవసానం కళ్లకు కట్టండి!
చెడు తలపులు మది మడిలో అరటుకడుతున్నప్పుడే
చేలోని కలుపువలె ఏరివేయండి
ముద్దు ముద్దుగ ముస్తాబయ్యే తొలియవ్వనమప్పుడే
హద్దుల లక్ష్మణ రేఖని గుండెలోతుల దాకా గీయండి!
వ్యసనాల ఊబిలో కాలూనేటప్పుడే
విలువల ఉలితో యెడదను సరిజేయండి!
ఆడదంటె వేడుకని భ్రమ పడేటప్పుడే
అతివ తోడు భోగం కాదు, భాగ్యమని విడమరచండి!
మానవత్వం మరిచి మగువని చెరబడితే…
మర్యాద పోయి, కుటుంబం కుప్ప కూలుతుందని హెచ్చరించండి!
అబ్బాయిల పెంపకాన మీరిలా కఠిన శిక్షకులైనప్పుడే
అమ్మాయిల రక్షణ సాధ్యమవుతుందని గ్రహించండి!
ఏదేమైనా… అమ్మలూ!
మీరు కాయకల్ప చికిత్సకు నడుం బిగిస్తేనే
మాయమయ్యేది సామాజిక రుగ్మతలని తెలుసుకోండి!
కడుపుతీపి కలిపిన మీ మాటలు
కఠిన చట్టాలకన్నా కడు శక్తివంతమని నమ్మండి!