ఆకలితో పేగులు అరుస్తున్నా
అవమానాలు కురుపులై సలుపుతున్నా
అపనిందలు ఈగలై ముసురుతున్నా
అవరోధాల ముళ్ళు గీసుకుంటున్నా
అన్నింటినీ పంటి బిగువన భరిస్తుంది!
ఈతి బాధల కొలిమిలో కాలుతున్నా
ఓటమి ఊబిలో కూరుకుపోతున్నా
గండాల కొండలు ఎదుట నిలుస్తున్నా
రోగాలు ఒంటి నంటి పెట్టుకునే ఉన్నా
గతి తప్పకుండా అడుగు ముందుకేస్తుంది!
వయోభారంతో తనువు విల్లు అవుతున్నా
అపశృతులు నిత్యం ఉనికి చాటుతూనే ఉన్నా
మృత్యువే ముంగిట తిష్టవేసి కూర్చున్నా
గుండె చిక్కబట్టుకుని ధైర్యం చూపుతుంది!
బిడ్డల భవితకై కరుగుతూనే ఉంటుంది!
పేగు బంధమింత బలమైంది కాకుంటే…
కడుపుతీపి ఇంత కమ్మగా లేకుంటే…
అడుగడుగునా పొంచి ఉన్న ఆపదల్నధిగమించి
ఇందరు అమ్మలు భూమిపై నడయాడే వారే కాదు!
నిర్ద్వంద్వంగా సంతుపై ప్రేమే అమ్మల ఆయువుని పెంచే ఔషధం!