జనం ప్రేమ గెలుచుకున్న అడవి చుక్క -డా|| చల్లపల్లి స్వరూపరాణి

ఆదివాసీ సమూహాలలో ఇప్పటికీ చాలావరకు మాతృస్వామిక కుటుంబ వ్యవస్థ తాలూకు లక్షణాలు కొనసాగుతున్నాయి. వాటిలో ‘కోయ’ తెగ ఆదివాసీ తెగ మాతృస్వామిక సంస్కృతికి ఒక ఆదిమ బిడ్డ వంటిది. అమ్మాయి ఇతర కులం అబ్బాయిని పెళ్ళి చేసుకుంటే అతని నాలుక మీద కాల్చిన ఇనుపకడ్డీతో వాత పెట్టి, అల్లుడికి తమ ఇంటిపేరు ఇచ్చినాక కానీ వాళ్ళు తమ ఇంటికి రానివ్వరు. అటువంటి తెగలో పుట్టిన ఒక కొండ దొరసాని… ఆదివాసుల సాధికారతను కాలరాసిన మధ్యయుగాల నాటి రాజ్య దురహంకారం మీద వీరోచితంగా పోరాడి తమ స్వాభిమానాన్ని చాటిన సమ్మక్క, సారలమ్మల పోరు వారసత్వం ఆమెది. ఆమె పేరు ‘ధనసరి అనసూయ’ అలియాస్‌ ‘సీతక్క’. అడవిలో పుట్టి అడవిలో పెరిగిన సీతక్కకి కష్టాలు, కడగండ్ల గురించి పుస్తకాలలో చదవాల్సిన పనిలేదు. గ్రంథాలయాలలో ఉండే పుస్తకాలకు మించిన జ్ఞానం ఆమెకి అనుభవాల నుంచి అబ్బింది. పట్టణాలకు, గ్రామాలకు దూరంగా విసిరేసిన కోయ గూడెంలో అరకొర సౌకర్యాలు, అగచాట్ల మధ్య పెరిగిన తనకి ఆకలి రుచి తెలుసు.

అడవిలో దొరికే ఆకూ, అలమా ఏరుకొచ్చు కుని, పోడు వ్యవసాయంలో పండిన రాగి గింజలతో అంబలి కాసుకు తాగే ధనసరి సమ్మక్క, సమ్మయ్యల బిడ్డగా మొదలైన అనసూయ ‘సీతక్క’గా మారడం వెనక ఉన్నది బతుకు నుంచి వచ్చిన తిరగబడే తత్వమే!

ఉమ్మడి వరంగల్‌ జిల్లా (ప్రస్తుతం ములుగు జిల్లా) ములుగు మండలం, జగ్గన్నపేటలో పుట్టింది. హైస్కూలు రోజుల నుంచే విద్యార్థి ఉద్యమాలలో క్రియాశీలకంగా ఉండే అనసూయ పదో తరగతి అయ్యాక జనశక్తి పార్టీ ఉద్యమకారిణిగా సాయుధ దళాలలోకి వెళ్ళింది. అక్కడే ఉద్యమ తరగతులకు హాజరై సిద్ధాంతపరమైన పుస్తకాలు, సాహిత్యం చదివింది. ఆయుధాలు ఉపయోగించడం, దళాలను ఆర్గనైజ్‌ చేయడంలో నేర్పు కలిగిన కార్యకర్తగా గుర్తింపు పొందడంతో పాటు తక్కువ సమయంలోనే దళ కమాండర్‌ స్థాయికి ఎదిగి మూడు జిల్లాలకు తన కార్యక్రమాలను విస్తరింపజేసింది. దళ కమాండర్‌ స్థాయికి ఎదిగి తన మారుపేరు ‘రణధీర్‌’గా మార్చుకుని నల్లగా, పొడుగ్గా, చలాకీగా ఖాకీ యూనిఫారంలో అచ్చం అబ్బాయిలాగే ఉండేది. అయితే అక్కడ ఉండే పితృస్వామిక ధోరణి ‘రణధీర్‌’ను ‘సీత’ను చేసింది. ఉద్యమ పెద్దలు ‘కుంజా రాము’ అనే నాయకుడితో పెళ్ళి చేయాలని నిర్ణయించి, పార్టీ పద్ధతుల్లోనే పెళ్ళి జరిపించినా, ఆ రాముడికి సహచరిగా ‘సీత’ ‘సీతక్క’ అయ్యింది.

సీత గర్భవతిగా ఉన్నప్పుడు పోలీసులకు చిక్కి అరెస్టై జైలు జీవితం గడిపింది. ప్రసవం సమయానికి బైటికొచ్చి ప్రసవం తర్వాత రెండు నెలల బాబుని బంధువులకి అప్పగించి మళ్ళీ రహస్య జీవితంలోకి వెళ్ళింది. తర్వాత బంధువుల నుంచి బాబుని ఆమె తల్లి తీసుకెళ్ళి పెంచి హాస్టల్‌లో చేర్చింది. సుమారు ఎనిమిదేళ్ళు జనశక్తి నక్సలైట్‌గా, దళ కమాండర్‌గా ఉద్యమానికి అంకితమై చావైనా, బతుకైనా జనం కోసమే అనుకున్న సీతక్కకి పార్టీలో ఏర్పడిన సిద్థాంతపరమైన విభేదాలు, చీలికలు ఆమెని జనజీవన స్రవంతిలోకి రాక తప్పని స్థితి కలిగిం చాయి. ఈ లోపల తన భర్త రాముతో విభేదాలు వచ్చి విడిపోయింది. రాము జనశక్తి పార్టీలోనే కొనసాగి కొన్నాళ్ళ తర్వాత ఎన్‌కౌంటర్‌లో చనిపో యాడు. తన ఉద్యమ సహచరులంతా తలో దారి చూసుకున్నప్పుడు సీతక్క కూడా బైటికొచ్చి మధ్యలోనే ఆగిపోయిన చదువుని కొనసాగించింది. హైదరా బాద్‌లో ఒక చిన్న గది తీసుకుని ఐదు సంవత్సరాల ఎల్‌.ఎల్‌.బి. పూర్తి చేసింది. తన ఖర్చులు, చదువు కోసం ఆదివాసుల సమస్యల మీద పనిచేసే ‘యక్షి’ అనే ఒక ఎన్జీఓలో ఉద్యోగంలో చేరింది. నక్సలైట్‌గా తెలంగాణలో బాగా గుర్తింపు పొందిన సీతక్క బైట ‘లా’ స్టూడెంట్‌ ‘ధనసరి అనసూయ’గా మళ్ళీ రహస్య జీవితం గడపాల్సి వచ్చింది. అయినా పాత కేసులు ఆమెని ప్రశాంతంగా బతకనివ్వలేదు. ఎప్పుడు బడితే అప్పుడు పోలీసులు స్టేషన్లకి పిలిపించేవారు. ఒకవైపు ఆర్థిక ఇబ్బందులు, మరోవైపు కేసులు… ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో చేరాల్సిందిగా ఆ పార్టీ అధిష్టానం నుంచి వచ్చిన పిలుపు ఆమె జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పాయి. ‘లా’ పూర్తయ్యాక వరంగల్‌ వెళ్ళి గతంలో తన కేసులు వాదించిన సీనియర్‌ అడ్వకేట్‌ వెంకటస్వామి రెడ్డి గారి దగ్గర జూనియర్‌ లాయర్‌గా చేరి కొన్ని నెలలు పనిచేసాక 2004 ఎన్నికలకు ముందు కొందరు మిత్రుల ప్రోద్భలంతో ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించింది. పట్టుదలకు, పోరాట పటిమకు మారుపేరైన సీతక్క విప్లవ పార్టీలలోనే కాక బూర్జువా పార్టీల ప్రత్యక్ష రాజకీయాలలో కూడా తనదైన ముద్ర వేసింది. ఆమె విప్లవ పార్టీలో నక్సలైట్‌గా, సీతక్కగా బాగా సాహసోపేతమైన నాయకురాలిగా, రెబల్‌గా పేరు తెచ్చుకుంది. తన నాయకత్వంలోని దళం ఆడవాళ్ళమీద దౌర్జన్యాలు చేసే మగ వర్గ శత్రువులకు మర్మాంగాలను తెగ్గోయడం, గుండు కొట్టించి ఊరేగించడం వంటి శిక్షలు విధించేవారు. ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పటికీ ఆదివాసుల సమ్మక్క, సారలమ్మ దేవతల మేడారం జాతరలో కోయ తెగవారికి భాగస్వామ్యం లేకపోవడంపై ప్రభుత్వ అధికారులతో చర్చించి ఆ దేవతల వారసులకు జాతరలో చోటు కల్పించడానికి కృషి చేసి సాధించింది. అలాగే ఆదివాసుల స్వయం ప్రతిపత్తికి సంబంధించిన ‘వన్‌ ఆఫ్‌ సెవంటీ’ చట్టంపై అసెంబ్లీలో తరచుగా ఆలోచనాత్మకమైన చర్చ లేవనెత్తుతూ వస్తోంది. ఆదివాసీ తెగల ప్రధాన సమస్యలైన మౌలిక వసతుల గురించి అసెంబ్లీలో గళమెత్తింది. ఆదివాసులు నివసించే అటవీ ప్రాంతంలో రవాణా సౌకర్యాలు, రోడ్లు, మంచినీరు, పాఠశాలలు, ఆస్పత్రులు లేకపోవడంపై ఆమె నిత్యం అధికారులతో చర్చించి కొంతమేరకు సాధించ గలిగింది. అడవి లోపల గూడేలలో జీవించేవారికి రేషన్‌ కార్డులు, ఆధార్‌ కార్డులు లేకపోవడంపై ఆమె ఆందోళన చేస్తోంది. ఆమె ఎమ్మెల్యేగా గెలిచిన రెండుసార్లూ తానున్న పార్టీలు గెలవక ఆమె ప్రతిపక్షంలోనే ఉండాల్సి వచ్చినా ఎప్పుడూ బాధ పడలేదు. సీతక్క చైతన్యవంతమైన సాహిత్యాన్ని చదవడమే కాక ‘వెన్నెల’ అనే కలం పేరుతో కవిత్వం రాసేది. ‘యక్షి’ అనే సంస్థలో పనిచేస్తున్నప్పుడు ఆదివాసీల ఉనికి మీద వ్యాసాలు కూడా రాసింది. ‘వన్‌ ఆఫ్‌ సెవెంటీ’ చట్టం మీద, ఆదివాసుల హక్కుల మీద ఆలోచనాత్మకమైన వ్యాసాలు, కవితలు రాసింది. ఆమెకి కష్టపడి పనిచేయడం ముందునుంచీ అలవాటే! ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చాక సీతక్క ఉస్మానియా యూనివర్శిటీ నుంచి పొలిటికల్‌ సైన్స్‌లో ఎమ్మే పూర్తిచేసి ఇప్పుడు అదే యూనివర్శిటీలో ‘గొత్తికోయల జీవన ప్రమాణాలు-స్థితిగతులు’ మీద పిహెచ్‌.డి చేస్తోంది. సీతక్కది అచ్చమైన ఆదివాసీ స్వాభిమానం, స్వయం పాలనని, స్వేచ్ఛని ప్రేమించే గుణం. నగరంలో ఉండి ఎమ్మే, ఎల్‌.ఎల్‌.బి చేసినా, ఎమ్మెల్యే అయినా ఆదివాసి సంస్కృతి అంటే తనకి సహజాతంలా వచ్చిన ప్రేమ వెలిసిపోలేదు. రెండేళ్ళకోసారి వచ్చే వనదేవతల మేడారం జాతరతో పాటు ఆదివాసుల గూడేలలో జరిగే పండగ పబ్బాలకు, శుభకార్యాలకు, చావులకు ఆమె తప్పకుండా హాజరవ్వడమే కాక వారి సంస్కృతిలో భాగమైన ఆట, పాటలలో పాల్గొంటుంది. పెళ్ళికీ, చావుకీ తప్పనిసరిగా మోగే డోలు వాయిద్యమంటే ఆమెకి ఇష్టం. డోలు శబ్దం వినగానే అప్రయత్నంగానే ఆమె కాళ్ళు చిందేస్తాయి. జనం ప్రేమను గెలుచుకున్న కోయ దొరసాని ఆమె. ఆమె ఆదివాసీ సాధికారతకు ప్రతీక. ముందునుంచీ స్వతంత్ర వ్యక్తిత్వం, ధైర్య సాహసాలు ఆమెకు పెట్టని ఆభరణాలు. తాను గన్‌ పట్టినా, గన్‌మెన్‌తో ఉన్నా ఆమెది పోరాట దృష్టే. ఒకప్పుడు తన వెంట పడిన పోలీసులు ఇప్పుడు తనకి రక్షణగా వెంట నడవడం చూసి నవ్వుకుంటుంది ఈ అడవి చుక్క. ఆమె మాటల్లోనే ‘ఎన్నిసార్లు చంపినా మళ్ళీ మళ్ళీ పుట్టడం/ఎన్నిసార్లు పడినా మళ్ళీ మళ్ళీ లేచి నిలబడడం’ ఆమె నైజం.

Share
This entry was posted in మిణుగురులు . Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.