ప్రజాస్వామ్య దేశాల్లో ప్రజలను రక్షించాల్సిన గురుతరమైన బాధ్యతతో పోలీసు శాఖ పనిచేస్తుంది. శాంతి భద్రతలను కాపాడడం, ప్రజల ధన, మాన రక్షణ చేయడం పోలీసుల ప్రథమ బాధ్యతగా ఉంది. ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా ఠక్కున గుర్తొచ్చేది పోలీసులే. అందుకే వారు రక్షక భటులయ్యారు. ప్రజల్ని రక్షించాల్సిన బాధ్యత రక్షక భటులది. 100 నెంబర్ పోలీసుల ఎమర్జెన్సీ నెంబర్. సర్వకాల, సర్వావస్థల్లోను, ఇరవై నాలుగు గంటలూ ఈ నెంబరు మోగుతూనే ఉంటుంది. కాల్స్ తీసుకుంటూనే ఉంటారు. ఉరుకులు, పరుగులతో కాల్ వచ్చిన దగ్గరకు వెళ్తారు. ఆపదలో ఉన్నవారిని రక్షిస్తారు.
మనకి ఇంటిలో సమస్య వచ్చినా, పక్కింటి వారితో సమస్య వచ్చినా, ఎవరైనా అవమానపరిచినా, అసభ్య పదజాలం వాడినా, దొంగతనం జరిగినా మనం వెళ్ళేది మన దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్‌కే. ఇంతకు ముందు పోలీసులంటే ప్రజలకు చాలా భయం ఉండేది. కానీ, ఫ్రెండ్లీ పోలీసింగ్ కాన్సెప్ట్‌ను అవలంభించడం వల్ల ప్రజల్లో ఉండే వ్యతిరేక భావం ప్రస్తుతం లేదు. ఇంతగా ప్రజలతో మమేకమై పనిచేసే పోలీసుల జీవితాలు వడ్డించిన విస్తర్లేమీ కాదు. చాలాసార్లు ప్రమాదకర పరిస్థితులు, మత కల్లోలాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మొదటి వరుసలో నిలబడి సేవలందించేవారు పోలీసులే. అలాగే అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు అగ్నిమాపక సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి మంటలార్పే పనిలో నిమగ్నమవుతారు. ప్రాణాలు కూడా పోగొట్టుకుంటారు.
పోలీసు అమరవీరుల దినం ఎలా ప్రకటించారనే విషయం గురించి తప్పకుండా తెలుసుకోవాలి. 1959 సంవత్సరంలో అక్టోబర్ 20న కశ్మీర్‌లోని లడఖ్ ప్రాంతంలో చైనా సైనికుల దాడిలో 10 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు చనిపోయారు. సిఆర్‌పిఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్ కరమ్‌సింగ్ నాయకత్వంలో 16,000 అడుగుల ఎత్తులో అతి శీతల ప్రదేశంలో మన జవాన్‌లు చైనా జవాన్లతో పోరాడి ప్రాణాలు కోల్పోయారు. ఈ జవాన్‌లు ధైర్యసాహసాలతో చేసిన పోరాటాన్ని గుర్తిస్తూ, వారి అమరత్వాన్ని శ్లాఘిస్తూ, 1959 నుండి ఇండో టిబెటన్ బోర్డర్ ఫోర్స్ దేశ నలుమూలల నుంచి పోలీసులను ఆహ్వానించి అమర వీరులకు అంజలి ఘటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
యుద్ధంలో అమరులైన వారి ఆయుధాలను భద్రపరచి వారి స్మృతి చిహ్నంగా రెండు నిమిషాలు మౌనం పాటించడం జరుగుతోంది. అప్పటి నుండి అక్టోబర్ 21, 1959ని పోలీసు అమర వీరుల సంస్మరణ దినంగా పాటిస్తూ విధి నిర్వహణలో అమరులైన పోలీసులను జ్ఞాపకం తెచ్చుకోవడం, వారి స్మృతి సూచకంగా అమర వీరుల సంస్మరణ దినం జరుగుతోంది.
పోలీసులు తమకు కేటాయించిన విధులకు తోడు గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ప్రజల మీద విరుచుకుపడిన ప్రస్తుత కరోనా కల్లోల సమయంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన ఎందరో పోలీసుల్ని మనం తప్పకుండా స్మరించుకోవాలి. ఒకవైపు లాక్‌డౌన్ సమయం, మరోవైపు భయంకరమైన అంటువ్యాధి కరోనా వైరస్ వ్యాప్తి. ప్రపంచమంతా గడగడలాడుతున్న సమయం. దేశం మొత్తం తాళాలు వేసుకుని ఇంట్లో కూర్చుంటే పోలీసు సిబ్బంది బయట ఉండి లాక్‌డౌన్‌ను అమలు చేయాల్సిన ప్రమాదకర పరిస్థితి. ఏ మూల నుండి ఎవరి నుండి వైరస్ విరుచుకు పడుతుందో తెలియని భయంకర పరిస్థితి. అలాంటి పరిస్థితులలో మొత్తం పోలీసులు చేసిన కృషి, సేవ మాటల్లో వర్ణించలేం. ప్రజలు సురక్షితంగా ఉండడం కోసం పోలీసులు తమ ప్రాణాలు దారపోసారు. ఎంతో మందికి వైరస్ సోకింది. చాలా మంది ప్రాణాలు కోల్పోయారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోను ఎంతో మంది పోలీసులు, వివిధ స్థాయిల్లో ఉన్నవారు ప్రాణాలు కోల్పోయారు. వారి కృషిని, త్యాగాన్ని మనం తప్పకుండా గుర్తు చేసుకోవాలి. అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా వారికి ఘనంగా నివాళులు అర్పించుకోవాలి.
హఠాత్తుగా లాక్‌డౌన్ ప్రకటించడం వల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలకు పనుల కోసం వచ్చిన వలస కార్మికులు పెద్ద సంఖ్యలో తమ సొంత ఊళ్ళకు సామాన్లతో వందల కిలోమీటర్లు నడిచిన సందర్భంలో పోలీసులు చేసిన మానవీయ కార్యక్రమాల గురించి తప్పకుండా ప్రస్తావించుకోవాలి. మొత్తం లాక్‌డౌన్‌లో హైదరాబాద్ నగరం బందీ అయిపోయినప్పుడు, తినడానికి తిండి, తాగడానికి నీళ్ళు లేక వలస కార్మికులు అల్లాడిపోతున్నప్పుడు స్వచ్ఛంద సంస్థలు ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాయి. మహానగర పరిధిలోని మూడు పోలీసు కమిషనరేట్ల అధికారులు కూడా తమ సిబ్బంది ద్వారా బాధితులకు భోజన సదుపాయాల కల్పనతో పాటు డ్రై రేషన్‌ను కూడా పంచి వలస కార్మికులను ఆదుకున్నారు. నగరంలోని ఎన్నో బస్తీలలో బియ్యం, పప్పులు పంచారు.
తెలంగాణ పోలీసుల కృషిని తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. పోలీసు ఉన్నతాధికారులు తమ సిబ్బందిని మోటివేట్ చేసిన వైనం కూడా ప్రశంసనీయం.
ఇంకొక ముఖ్యమైన విషయం కూడా ఇక్కడ ప్రస్తావించాలి. వందల సంఖ్యలో కరోనా వైరస్ సోకి కోలుకున్న
పోలీసులు ప్రాణదాతలుగా కూడా ముందుకొచ్చిన సందర్భమిది. కరోనాతో పోరాటం చేస్తూ విషమమైన ఆరోగ్య స్థితిలో హాస్పిటల్స్‌లో ఉన్న కరోనా రోగులకు తమ ప్లాస్మాను దానం చేసిన పోలీసుల వందల సంఖ్యలో ఉన్నారు. పోలీసు ఉన్నతాధికారులు తమ సిబ్బందికి స్ఫూర్తినిచ్చి ప్లాస్మా దానం చేయమని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం విశేషం.
సాధారణంగా ప్రజలకు పోలీసులంటే భయం ఒక వ్యతిరేకత ఉంటుంది. కొడతారని, అసభ్య పదజాలం వాడతారని ఒక నెగెటివ్ ఫీలింగ్ ఉంటుంది. అయితే కరోనా వ్యాధి సమయంలోను, ఇటీవలి హైదరాబాదు వరదల సమయంలోను పోలీసులు నిర్వహించిన పాత్ర సర్వత్రా ప్రశంసలు అందుకున్నది. చాలా కాలంగా భూమిక పోలీసుశాఖతో చాలా దగ్గరగా పనిచేస్తున్నది. వారికి జెండర్ ట్రైయినింగ్‌లు నిర్వహిస్తున్నది. పోలీస్ స్టేషన్‌లలో మహిళలు, పిల్లల కోసం సపోర్ట్ సెంటర్లు నిర్వహించడం వెనక ఉన్నది పోలీసులతో కలిసి మహిళల సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్న లక్ష్యంతోనే.
తెలంగాణ పోలీసుల ఫ్రెండ్లీ పోలీసింగ్ రింగ్‌టోన్‌కి అనుగుణంగానే వారు చాలా అంశాలలో పనిచేయడం గమనిస్తూ
ఉన్నాం. ముఖ్యంగా ఇటీవలి ఉపద్రవాల సమయంలో వారు నిర్వహించిన పాత్ర చాలా మన్ననలు పొందింది. మూడు కమీషనరేట్‌ల పరిధుల్లో గత ఎనిమిది నెలలుగా జరుగుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాల్లో మేము కూడా పాల్గొన్న అనుభవంలోంచి నేను సంపాదకీయం రాసాను. లా అండ్ ఆర్డర్ అంశం ఇందులో లేదు. కేవలం వీరు నిర్వహించిన సంక్షేమ కార్యక్రమాల మీదే మా ఫోకస్. ఇక ముందు కూడా పోలీసుశాఖ ఇంతే నిబద్ధతతో పనిచెయ్యాలని ఆశిస్తూ, వారికి అభినందనలు తెలియచేస్తున్నాను.
తమ విధులు, బాధ్యతలు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమర వీరులకు స్మృత్యంజలి ఘటిస్తూ, కరోనా కాటుకు బలైన పోలీసులను గుర్తుచేసుకుంటూ వారందరికీ నివాళులు అర్పిస్తున్నాను.