నల్లజాతి విముక్తి చిహ్నం ‘హ్యారియెట్‌ టబ్మాన్‌’ శివలక్ష్మి

నల్లజాతీయుల ఆత్మగౌరవ ప్రతీక ‘హ్యారియెట్‌ టబ్మాన్‌’. అమెరికాలో బానిసత్వ నిర్మూలన గురించిన ఉత్కంఠభరితమైన చరిత్ర వివరాలు తెలియాలంటే దానితో పెనవేసుకుపోయిన టబ్మాన్‌ వ్యక్తిగత కథ గురించి తెలుసుకోవాలి.

టబ్మాన్‌ తల్లిదండ్రులు ‘రిట్‌, బెన్‌’లు. వీరు 1808లో వివాహం చేసుకున్నారు. ఆమె అమ్మమ్మ ‘మోడెస్టీ’. వీరు ముగ్గురూ కలిసి ఆఫ్రికా నుండి ఒక బానిస ఓడలో అమెరికాకు వచ్చారు. అమెరికాలో టబ్మాన్‌ తల్లి ‘రిట్‌’ను ‘ఎడ్వర్డ్‌ బ్రోడెస్‌’ అనే తెల్ల యజమాని తన కుటుంబానికి వంట మనిషిగా నియమించుకున్నాడు. ఆమె తండ్రి ‘బెన్‌’ ఎడ్వర్డ్‌ బ్రోడెస్‌ కుమారుడైన ‘ఆంథోనీ థాంప్సన్‌’ కలప తోటలలో వడ్రంగి పని చేసేవాడు. కోర్టు రికార్డుల ప్రకారం వారికి తొమ్మిది మంది పిల్లలున్నారు. లినా, మరియు రిట్టి, సోఫ్‌, రాబర్ట్‌, మింటీ, బెన్‌, రాచెల్‌, హెన్రీ, మోజెస్‌. వారిలో ఐదవ సంతానమైన ‘మింటీ’యే ఇప్పటి నల్లజాతి విముక్తి చిహ్నంగా, వారి స్వేచ్ఛ కోసం ఉద్యమించిన ప్రప్రథమ మహిళగా చరిత్రలో ప్రముఖంగా నిల్చిపోయిన హ్యారియెట్‌ టబ్మాన్‌!

హ్యారియెట్‌ టబ్మాన్‌ బాల్యం :

టబ్మాన్‌ 1822 మార్చి 10న మేరీల్యాండ్‌లోని డోర్చెస్టర్‌ కౌంటీ లోని అరమింటా రాస్‌లో జన్మించింది. ఆమె తల్లి ఒక పెద్ద సంస్థానం లాంటి ఎడ్వర్డ్‌ బ్రోడెస్‌ ఇంట్లో తీరికనేది లేకుండా బండ చాకిరీతో సతమతమవుతుండేది. ఆమెకు పసి వయసు పిల్లలున్నప్పటికీ కుటుంబానికి కాస్తంత సమయాన్ని కూడా కేటాయించలేకపోయేది. అందువల్ల అన్ని కుటుంబాలలో మాదిరిగానే టబ్మాన్‌ తన తమ్ముడు, చిన్న చెల్లెలి ఆలనా పాలనా చూసుకునేది. టబ్మాన్‌కు ఐదారు సంవత్సరాల వయస్సప్పుడే బ్రోడెస్‌ ఆమెను ‘మిస్‌ సుసాన్‌’ అనే మహిళ దగ్గర నర్స్‌ పనికి నియమిస్తాడు. సుసాన్‌ తన చంటిపాపను జాగ్రత్తగా చూసుకోవాలనీ, నిద్రపోతున్నప్పుడు ఊయల ఊపాలనీ టబ్మాన్‌ని ఆజ్ఞాపిస్తుంది. పాప మేల్కొని ఏడుస్తున్నప్పుడు, టబ్మాన్‌ను పట్టుకుని విచక్షణారహితంగా తిడుతూ కొరడాతో కొట్టి హింసిస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఒకరోజు ప్రత్యేకంగా పిలిచి అదేపనిగా అల్పాహారం ముందు ఐదుసార్లు కొడుతుంది.

టబ్మాన్‌ చిన్నతనంలోనే బానిస యజమానులతో చావు దెబ్బలు తిన్నది. ఆమె బాల్యంలోనే ‘జేమ్స్‌ కుక్‌’ అనే తోటల యజమాని ఇంట్లో కూడా పనిచేసింది. అప్పుడు మశూచి వ్యాధి బారిన పడింది. అయినప్పటికీ ఆమె తోటలోని చిత్తడి నేలలలో చుంచు ఉచ్చులను తనిఖీ చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో ఆమె చావుకి దగ్గరయ్యేంతలా అనారోగ్యానికి గురవుతుంది. జేమ్స్‌ కుక్‌ ఆమెను తిరిగి బ్రోడెస్‌ దగ్గరికి పంపేస్తాడు. అక్కడున్న టబ్మాన్‌ తల్లి రిట్‌ ఆమెను కాపాడుతుంది. కొంచెం తేరుకోగానే బ్రోడెస్‌ ఆమెను తిరిగి పనిలో నియమించుకుంటాడు. పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఒక బానిసపై కోపంతో ఉన్న ఆమె యజమాని రెండు పౌండ్ల బరువున్న పెద్ద బండరాయిని ఆ బానిస మీదకు విసరబోయినప్పుడు, అది పొరపాటున గురితప్పి టబ్మాన్‌ తలమీద పడి బలమైన గాయమవుతుంది. ‘నా తల బద్దలైంది బాబోయ్‌’ అని అరుస్తూ టబ్మాన్‌ అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోతుంది. విపరీతంగా రక్తస్రావం అవుతుండడంతో యజమాని ఆమెను ఇంటికి తీసుకువెళ్ళి, ఎటువంటి వైద్య సంరక్షణ లేకుండా ఒక మగ్గం సీటు మీద పడేసి ఉంచుతాడు. ఆమె యవ్వన దశలో జరిగిన ఈ సంఘటన వల్ల, టబ్మాన్‌ తరచుగా భరింపనలవి కాని తలనొప్పితో నరకయాతనను అనుభవిస్తుండేది. చాలాసార్లు మూర్ఛపోతుండేది. స్పృహలో లేనట్లు నిద్రపోతున్నట్లుగా కనిపిస్తున్నప్పటికీ, తన చుట్టూ పరిసరాల్లో ఏం జరుగుతోందో తెలుస్తుండేదని చెప్పేది. గాయం కారణంగా మైకం కమ్మి, ఆమె తాత్కాలిక మూర్ఛలతో, నొప్పితో, హైపర్నోమ్నియాతో జీవితమంతా ఎడతెగని ఘోషననుభవించింది.

రోజల తరబడి కనిపించకుండా పారిపోవడం, దెబ్బల్నుంచి తనను తాను రక్షించుకోవడం కోసం పొరలు పొరలుగా బట్టలు ధరించడం, బాధించే ప్రతి సంఘటనకూ ఎదురు నిల్చి వీరోచితంగా పోరాడడం మొదలైన ప్రతిఘటనా పద్ధతులను టబ్మాన్‌ తన జీవితం నుంచి ఆ పసి వయసు నుంచే నేర్చుకుంది! ఆమె బండ చాకిరీ చేస్తూ చేస్తూనే పెరిగి పెద్దదవుతుంది. పొలం పనులు, అటవీ పనులు, ఎద్దులను చాకచక్యంతో నడుపుతూ భూమిని దున్నించడం, సరుకుల్ని రవాణా చేయడానికి లాగన్లను లాగడం వంటి పనుల్ని సమర్ధవంతంగా చేస్తూ ఒక బలమైన యువతిగా తయారవుతుంది. కానీ బాల్యం నుండీ పడిన చిత్రహింసల గుర్తులను ఆమె జీవితాంతం మోసింది.

టబ్మాన్‌ నిరక్షరాస్యురాలు అయినప్పటికీ, ఆమె తల్లి రిట్‌ ఆమెకు చిన్నతనం నుంచీ బైబిల్‌ కథలు చెప్తుండేది. ఆమె కుటుంబంతో కలిసి మెథడిస్ట్‌ చర్చికి హాజరయ్యేది. బానిసలను విధేయులుగా ఉండమని కోరిన బైబిల్‌ కొత్త నిబంధనలోని బోధనలను ఆమె పూర్తిగా తిరస్కరించింది. పాత నిబంధనలోని విముక్తి కథలలో ఆమె తన మార్గదర్శకత్వాన్ని కనుగొన్నది. తన జాతి సమూహాల పట్ల తన బాధ్యతను గ్రహించి, అదే లక్ష్యంగా ఎంచుకుని జీవితాంతం అవిశ్రాంత కృషి చేసిన ధీరవనిత టబ్మాన్‌.

బానిసత్వం విరాట్‌ రూపంలో ఉన్నప్పుడు రిట్‌ తన కుటుంబాన్ని ఒకచోట కలిపి ఉంచడానికి చాలా కష్టపడింది. ఎడ్వర్ట్‌ బ్రోడెస్‌ ఆమె ముగ్గురు కుమార్తెలలో లీనా, మరియా రిట్టి, సోఫ్‌లను కుటుంబం నుండి శాశ్వతంగా వేరుచేసి అమ్మేస్తాడు. రిట్‌ చిన్న కుమారుడు మోషేను జార్జియాకు చెందిన ఒక వ్యాపారి కొనడానికి బ్రోడెస్‌తో సంప్రదిస్తున్నాడని తెలిసి, నల్లజాతి బానిస స్నేహితుల సాయంతో ఆ బాలుడిని ఒక నెలపాటు దాచిపెడుతుంది రిట్‌. జార్జియా మనిషి, ఎడ్వర్డ్‌ బ్రోడెస్‌ ఇద్దరూ పిల్లవాడిని పట్టుకోవడానికి బానిస గృహాలవైపు వస్తున్నప్పుడు, మనసులోని భయాల్నీ, సందిగ్ధావస్థలను, తటపటాయింపులను పక్కకు నెట్టివేసి కొడుకును దక్కించుకోవాలనే ఆరాటంలో రిట్‌ తెగించి తన యజమానికి ఎదురెళ్ళి, ”మీరు నా కొడుకు కోసం వస్తున్నారు, కానీ నా ఇంట్లోకి ప్రవేశించిన మొదటి వ్యక్తి తలను నేను నరికేస్తాన”ని ఖచ్చితంగా, ధైర్యంగా చెబుతుంది. దాంతో బ్రోడెస్‌ అమ్మకానికి తిలోదకాలిచ్చి వెనుతిరుగుతాడు. తన కుటుంబంలో జరిగిన ఈ సంఘటన గురించి బాల్యం నుంచీ ఆమె విన్న కథలు, టబ్మాన్‌ను ప్రభావితం చేశాయని, ప్రతిఘటన, పోరాటావకాశాలపై ఆమె నమ్మకాన్ని మరింత బలపరచాయని టబ్మాన్‌ జీవిత చరిత్ర రచయితలు రాశారు.

కుటుంబ, వైవాహిక జీవితాలు :

టబ్మాన్‌ తండ్రి ఆయన యజమాని ఆంథోనీ థాంప్సన్‌ 45 సంవత్సరాల వయసులో బానిసత్వం నుంచి విముక్తి చేస్తానని వాగ్దానం చేసి ఉన్నాడు. థాంప్సన్‌ మరణించిన తర్వాత, అతని కుమారుడు 1840లో ఆ వాగ్దానాన్ని అమలు పరిచాడు. కానీ టబ్మాన్‌ తండ్రి థాంప్సన్‌ కుటుంబానికి కలప పని చేస్తూ, ఫోర్‌మన్‌గా అక్కడే పనిచేయడం కొనసాగించాడు. చాలా సంవత్సరాల తర్వాత టబ్మాన్‌, తన తల్లి చట్టపరమైన స్థితిని విచారించడానికి, ఒక తెల్ల న్యాయవాదికి ఐదు డాలర్లు చెల్లించి సంప్రదిస్తుంది. టబ్మాన్‌ తల్లి రిటాకి కూడా, ఆమె భర్త వలె, 45 సంవత్సరాల వయస్సులోనే దాస్య విముక్తి చేస్తానని మాజీ యజమాని ఆంథోనీ థాంప్సన్‌ సూచనలు జారీ చేసినట్లు న్యాయవాది నుంచి తెలుసుకుంటుంది టబ్మాన్‌. రిట్‌ పిల్లలకు కూడా ఇదే విధమైన నిబంధన వర్తిస్తుందని, రిట్‌కి 45 సంవత్సరాల వయస్సు తర్వాత జన్మించిన పిల్లలు చట్టబద్ధంగా స్వేచ్ఛను పొందుతారనీ చట్టాలు నిర్దేశిస్తుండగా థాంప్సన్‌, బ్రోడెస్‌ కుటుంబాలు మాత్రం తమకు బానిసలను వారసత్వంగా పొందే హక్కున్నట్లుగా అసలు ఏ మాత్రం ఖాతరు చేయకుండా ఈ నిబంధనలు విస్మరించాయి. దీన్ని చట్టబద్ధంగా సవాలు చేయడం అనే విషయం టబ్మాన్‌కు శక్తికి మించిన అసాధ్యమైన పని.

1844లో టబ్మాన్‌ ‘జాన్‌’ అనే విముక్తి పొందిన నల్లజాతి వ్యక్తిని వివాహం చేసుకుంటుంది. జాన్‌ ఆమెకు సహచరుడిగా ఏమాత్రమైనా సహకారమందించాడో లేదో తెలియదు గానీ అక్కడున్న బానిస స్థితిగతుల కారణంగా వారిద్దరి వైవాహిక జీవితం సంక్లిష్టంగా మారింది. తల్లి స్థితి పిల్లల స్థితిని నిర్దేశిస్తుంది కాబట్టి టబ్మాన్‌, జాన్‌లకు జన్మించిన పిల్లలు భవిష్యత్తులో బానిసలుగానే ఉంటారు. వారుంటున్న మేరీల్యాండ్‌ తూర్పు ప్రాంతంలో నల్లజాతి జనాభాలో చాలా ఆఫ్రికన్‌-అమెరికన్‌ కుటుంబాలు స్వేచ్ఛగా ఉన్నాయి. కొన్ని కుటుంబాలలో మాత్రం సగం మంది బానిసలు, సగం మంది స్వేచ్ఛ పొందినవారూ ఉన్నారు. హ్యారియెట్‌ టబ్మాన్‌, జాన్‌ల మిశ్రమ వివాహం వల్ల టబ్మాన్‌, ఆమె పిల్లలు బానిసలుగా జీవించవలసిన దుస్థితి ఏర్పడుతుంది. టోనీ మారిసన్‌ నవల ”బిలవెడ్‌”లో తనలాగే తన బిడ్డ దుర్భరమైన, నీచమైన, హీనమైన పరిస్థితుల్లో బానిసగా జీవించడం భరించలేని ఒక నల్లజాతి యువతి తన రెండేళ్ళ పాపను తన చేతులతోనే చంపుకున్న దయనీయమైన సంఘటన ఇక్కడ పాఠకులకు గుర్తొస్తుంది. టబ్మాన్‌ను బానిస వ్యవస్థలోకి నెట్టడానికి రచించిన ప్రణాళికలో ఇదొక భాగమని లార్సన్‌ లాంటి ఆమె జీవిత చరిత్ర కారుల్లో కొందరు భావించారు.

బానిసత్వం నుండి టబ్మాన్‌ విమోచనం :

1849లో టబ్మాన్‌ మళ్ళీ అనారోగ్యానికి గురైనప్పుడు, ఎడ్వర్డ్‌ బ్రోడెస్‌ ఆమెను విక్రయించడానికి ప్రయత్నిస్తాడు. కానీ ఆ ప్రయత్నాలేవీ ఫలించవు. తర్వాత బ్రోడెస్‌ మరణిస్తాడు. అతని భార్య ‘ఎలిజా’ కుటుంబంలోని బానిసలను అమ్మే పనిని ప్రారంభించి, ఆ ప్రయత్నాలను ముమ్మరం చేస్తుంది. టబ్మాన్‌ భర్త జాన్‌ అమ్మకాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించినప్పటికీ, ఆమె అందుకు నిరాకరిస్తుంది. టబ్మాన్‌ మనసులో అప్పటికే తప్పించుకోవడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఉంటుంది. ”ఇక్కడ నాకు రెండే రెండు విషయాలు ఎంచుకునే అవకాశముంది. ఒకటి నేను స్వేచ్ఛను సాధించడం, రెండు ఒకవేళ విముక్తిని పొందలేని పరిస్థితిలో మరణించడం” అని దృఢంగా తేల్చి చెప్తుంది.

టబ్మాన్‌ సోదరులలో బెన్‌, హెన్రీ అనే ఇద్దరు 1849, సెప్టెంబర్‌ 17న బానిసత్వం నుంచి తప్పించుకుంటారు. అప్పటికి టబ్మాన్‌, ఆమె తండ్రితో పాటు మాజీ యజమాని ఎడ్వర్డ్‌ బ్రోడెస్‌ కుమారుడు ఆంథోనీ థాంప్సన్‌ హయాంలో బానిసగానే ఉంటుంది. పొరుగున ఉన్న కరోలిన్‌ కౌంటీలోని పోప్లర్‌ నెక్‌ అనే ప్రాంతంలో పెద్ద తోటలలో టబ్మాన్‌, ఆమె సోదరులతో కలిసి విపరీతంగా వెట్టి చాకిరీ చేస్తుండేవారు. సోదరులిద్దరూ తప్పించుకున్న తర్వాత టబ్మాన్‌ తప్పించుకునే ముందు తన ప్రణాళికలను ఆమె తల్లికి కోడెడ్‌ భాషలో ”నేను ఉదయాన్నే మిమ్మల్ని కలుస్తాను. నేను వాగ్దానం చేసిన మాటకి కట్టుబడి ఉన్నాను” అని ఒక నమ్మకమైన మేరీ అనే బానిస ద్వారా తెలియజేసి, చాలా తెలివిగా అక్కడినుంచి బయట పడుతుంది. ఆమె మొదటి ప్రయాణపు వివరాలు ఇప్పటికీ చాలా రహస్యంగా ఉంచబడ్డాయి. తప్పించుకుంటున్న బానిసలు వివిధ మార్గాలను అనుసరించారు. టబ్మాన్‌ తర్వాత జీవితంలో కూడా తన మొదటి ప్రయాణం గురించి ఎప్పుడూ చర్చించలేదు.

ఆ రోజుల్లోనే టబ్మాన్‌, ఇతర బానిసల సహాయ సహకారాలతో, సంప్రదింపులతో ఒక అద్భుతమైన నెట్‌వర్క్‌ను ఏర్పరచుకుంటుంది. బానిసలైన నల్లజాతీయులు, విముక్తి పొందిన నల్ల జాతీయులు, బానిసత్వం అంతం కావాలని కోరుకునే తెలుపు నిర్మూలన వాదులు, ఇతర బానిస కార్యకర్తలతో కలిసి ఒక ఐక్య సంఘటనగా ఏర్పడిన ఒక అనధికారికమైన చక్కటి ప్రణాళికాబద్ధమైన వ్యవస్థను రూపొందించుకుంటారు. దీనిని ‘అండర్‌ గ్రౌండ్‌ రైల్‌ రోడ్‌’ అని వారు పిలుచుకునేవారు. ఈ వ్యవస్థలోని సభ్యులందరినీ ‘క్వేకర్స్‌’ అని పిలుస్తారు. పోప్లర్‌ నెక్‌కు సమీపంలో ఉన్న ప్రెస్టన్‌ ప్రాంతంలో క్రియాశీలకంగా పనిచేస్తున్న ఒక క్వేకర్‌ సంఘం ఉండేది. టబ్మాన్‌ తప్పించుకున్న సందిగ్ధ సమయంలో ఆమెకు, ఈ క్వేకర్‌ సంఘం ఒక ముఖ్యమైన మొదటి మజిలీగా ఆశ్రయమిచ్చి ఆతిధ్యమిస్తుంది.

ఈ క్వేకర్‌ సంఘం నుండి, బానిసలను తప్పించడానికి ఆమె ఒక అసాధారణమైన మార్గాన్ని ఎంచుకుంటుంది. ఈశాన్య చోప్టాంక్‌ నదివెంట వెళ్తూ, డెలావర్‌ ద్వారా ఉత్తరాన ఉన్న పెన్సిల్వేనియాకు బానిసలను చేరుస్తుంది. ఈ ప్రయాణం మొత్తం దాదాపు 145 కిలోమీటర్లు. కాలినడకన ప్రయాణించడానికి సుమారు నాలుగు వారాల సమయం పట్టేది.

ఆ రోజుల్లో బానిసలను చాకిరీ చేయించుకోవడానికి ఒక ఇంటి నుంచి మరొక ఇంటికి పంపుతుండడం వల్ల బ్రోడెస్‌ భార్య ‘ఎలిజా బ్రోడెస్‌’ కొంతకాలం వరకూ టబ్మాన్‌, ఆమెతో ఉన్న బానిసలు తప్పించుకున్నారని తెలుసుకోలేకపోతుంది. రెండు వారాల తర్వాత, ఆమె కేంబ్రిడ్జి డెమోక్రాట్‌ పత్రికలో బానిసలు తప్పించుకున్న విషయాన్ని తెలియజేస్తూ, తిరిగి తన ఇంటికి వచ్చిన ప్రతి బానిసకు 100 డాలర్ల బహుమతి కూడా ఇస్తానని ప్రకటన చేయిస్తుంది.

బానిసల స్వేచ్ఛ, సాహసాలకు చిహ్నం హ్యారియెట్‌ టబ్మాన్‌ :

బానిసత్వ నిర్మూలన కోసం దృఢదీక్షతో పనిచేసిన ప్రప్రథమ మహిళా రాజకీయ కార్యకర్త టబ్మాన్‌. బానిసల స్వేచ్ఛను సాధించడమే తన జీవిత ధ్యేయంగా మార్చుకుంది. బానిసత్వంలో జన్మించిన టబ్మాన్‌ తను తప్పించుకుని, తన కుటుంబాన్నీ, చుట్టుపక్కల స్నేహితులతో సహా బానిసలుగా ఉన్న 70 మందిని రక్షించడానికి 17 సార్లు రానూ-పోనూ సుమారు 300 కిలోమీటర్ల దూరం కాలినడకన సురక్షితమైన భూగర్భ రైల్‌రోడ్‌ గృహాల గుండా ప్రయాణించింది. గడ్డ కట్టుకుపోయే విపరీతమైన చలిలో, దట్టమైన చీకటి రాత్రులలో రహస్య మార్గాల గుండా ప్రయాణిస్తున్నప్పుడు, ఒక్క ప్రయాణికుడికి కూడా రవ్వంత కష్టం కలిగించకుండా గమ్యం చేర్చేది. ఉత్తర ధృవ నక్షత్రం దిశగా బానిసలతో టబ్మాన్‌ రాత్రిపూట మాత్రమే ప్రయాణించవలసి వచ్చేది. ఎందుకంటే పగలైతే పారిపోయిన బానిసలను పట్టించిన వారికి బహుమతులిస్తామని బానిసల యజమానులు, ప్రభుత్వాల నుంచి వచ్చే ప్రకటనల వల్ల వారికోసం నిరంతరం పహారా కాసేవాళ్ళను తప్పించుకోవలసి వచ్చేది. భూగర్భ రైల్‌రోడ్డులోని ‘కార్యకర్తలు’ వారి రక్షణ కోసం రకరకాల ఉపాయాలతో వీరిని తప్పించేవారు. ఒక ఇంటి విడిది వద్ద ఆ ఇంటి యజమానురాలు ఎవరికీ అనుమానం రాకుండా కుటుంబ పని కోసం నియమించుకున్నారనుకునే విధంగా పెరటి ఆవరణనంతా ఊడవమని టబ్మాన్‌ని ఆదేశించింది. రాత్రయ్యాక అదే కుటుంబం ఆమెను జాగ్రత్తగా ఒక బండిలో దాచిపెట్టి, తర్వాత స్నేహపూర్వకమైన మరో మజిలీకి చేర్చేది. ఈ ప్రాంతంలోని అడవులతో, చిత్తడి నేలలతో ఆమెకున్న విస్తృత పరిచయం కారణంగా, టబ్మాన్‌ పగటిపూట ఈ ప్రాంతాలలో దాక్కునేది.

ఎన్నో కష్టాల కడగండ్ల తర్వాత చివరికి ఆమె దిగ్భ్రాంతి కలిగించే విస్మయ భావనతోనూ, గొప్ప ఉపశమనంతోనూ బానిసల స్వేచ్ఛకు గమ్యస్థానమైన పెన్సిల్వేనియాలోకి ప్రవేశించింది. కొన్ని సంవత్సరాల తర్వాత ఆ అనుభవాన్ని ఆనందంగా గుర్తుచేసుకుని ”నేను ఆ బానిస ప్రాంతపు సరిహద్దు గీతను దాటి విముక్తి నేల పెన్సిల్వేనియా సరిహద్దు గీత మీద నా మొదటి అడుగు పడిందని తెలుసుకున్నప్పుడు నేను అదే వ్యక్తినా కాదా అని నా చేతుల్ని నేను గిల్లి చూసుకున్నాను. బంగారం రంగులో చెట్లు, పొలాల మీదుగా సూర్యుడు నా వెంటే నడిచి వస్తున్నట్లు విజయగర్వంతో పొంగిపోయాను. నేను స్వర్గంలో ఉన్నట్లు, గాలిలో తేలిపోతున్నట్లు నాకు అనిపించింది. నేను స్వేచ్ఛను పొందాక, ఆ స్వేచ్ఛాలోకంలోకి నన్ను స్వాగతించడానికి అక్కడ నాకు తెలిసిన వారెవరూ లేరు. నాకు పరిచయం లేని ఒక స్వేచ్ఛా ప్రపంచంలో నేను అందరికీ అపరిచితురాలిని” అని టబ్మాన్‌ చెప్పింది.

టబ్మాన్‌కి ప్రజలు ప్రేమతో పెట్టుకున్న పేరు :

ఫిలడెల్ఫియాకు చేరుకున్న తర్వాత, టబ్మాన్‌కు తనకసలేమాత్రం తెలియని ఒక ప్రదేశంలో ఒంటరిదాన్నని ఆమెకు తోచి అప్పుడు తన కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకుంటుంది. నేను స్వేచ్ఛగా ఉండడమే కాదు, నా జాతివాళ్ళందరూ క్రూరమైన బానిసత్వపు కోరల నుంచి విముక్తి కావాలనే బలమైన కోరికతో, అత్యంత కష్టమైన ఉద్యోగాలను చేస్తూ డబ్బు కూడబెట్టడం మొదలు పెడుతుంది. టబ్మాన్‌ కొన్ని దోపిడీలు కూడా చేసి బానిసల కోసం ఖర్చు పెట్టేదని, బానిసలను విముక్తి ప్రాంతానికి చేర్చే ప్రతి పర్యటనతోనూ ఆమె మరింత కాన్ఫిడెంట్‌గా, దృఢంగా మారిందని జీవిత చరిత్ర రచయితలు రాశారు. 1851 డిసెంబరులో, టబ్మాన్‌ గుర్తుతెలియని 11 మంది బృందానికి నాయకత్వం వహించింది. ఈ బృందం, టబ్మాన్‌తో సహా బానిస నిర్మూలనవాది అయిన మాజీ బానిస ‘ఫ్రెడరిక్‌ డగ్లస్‌’ ఇంటివద్ద ఆశ్రయం పొందారు. డగ్లస్‌ తన ఆత్మకథలో, ”ఇంతమందికి ఒక్కసారిగా ఆహారం, ఆశ్రయం ఇవ్వడానికి, వారిని కెనడాకు పంపడానికి డబ్బు సమకూర్చడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది” అని రాసుకున్నాడు. బానిసత్వానికి వ్యతిరేకంగా ఇద్దరూ గొప్ప క్రియాశీలకమైన కృషి చేయడం వల్ల ఒకరి పట్ల ఒకరికి గొప్ప ఆరాధనా భావముండేది. 1868లో టబ్మాన్‌ జీవిత చరిత్ర కోసం ఆమె పట్ల అమితమైన గౌరవభావంతో, వారిద్దరూ పనులు చేసిన విధానాలను పోలుస్తూ డగ్లస్‌ ఆమెకు ఒక లేఖ రాశాడు. డగ్లస్‌ ”మేమిద్దరం బానిసత్వ నిర్మూలన కోసం అకుంఠిత దీక్షతో పనిచేసినప్పటికీ, మా ఇద్దరి పనితీరులో చాలా వ్యత్యాసముంది. నేను చేసిన పనులన్నీ బహిరంగంగా చేయడం వల్ల, నాకు బానిస సమాజం నుంచి అడుగడుగునా స్ఫూర్తినిచ్చే ప్రోత్సాహం, మంచి మద్దతూ లభించాయి. కానీ మీరు రహస్య మార్గంలో శ్రమించారు. నేను పగలు పనిచేస్తే, మీరు రాత్రి… అర్థరాత్రి ఆకాశం, నిశ్శబ్ద నక్షత్రాలు మీ స్వేచ్ఛా కాంకక్షూ, మీ సాహసానికీ సాక్షులు. బానిస ప్రజలకు సేవ చేయడానికి ఎన్నో ప్రమాదాలను, కష్టాలను ఇష్టపూర్వకంగా ఎదుర్కొన్న మీకు మీరే సాటి” అని రాశాడు. డబ్మాన్‌ డెలావర్‌లోని విల్మింగ్టన్‌ అనే ప్రాంతంలో పనిచేస్తున్న క్వేకర్‌ అనే బానిస నిర్మూలనవాది ‘థామస్‌ గారెట్‌’తో కూడా కలిసి పనిచేసింది. తప్పించుకోవాలనుకున్న ప్రతి బానిసను ఆమె కనుగొని ఫిలడెల్ఫియాకు నడిపించింది. 11 సంవత్సరాల పాటు సుమారు 13 సార్లు మేరీల్యాండ్‌ తూర్పు ప్రాంతానికి ప్రయాణించి, 70 మంది బానిసలను రక్షించింది. 50 నుండి 60 మంది దాకా ఉత్తరానికి పారిపోయిన వారికి ఆమె నిర్దిష్ట సూచనలు ఇచ్చి, విముక్తికి దారి చూపించింది. టబ్మాన్‌ చేసిన కృషికి ఈజిప్ట్‌ నుండి ఇజ్రాలేయులకు స్వేచ్ఛ కలిగించిన మోజెస్‌ ప్రవక్తతో పోలుస్తూ, ప్రజలు ఆమెను ”మోషే” అనే పేరుతో గౌరవంగా పిలుచుకుంటారు.

టబ్మాన్‌ యజమానుల కళ్ళుగప్పి తృటిలో బానిసలను తప్పించగలిగిన నేర్పరురాలు. చివరి ప్రయాణంగా ఆమె వృద్ధులైన తల్లిదండ్రులను మేరీల్యాండ్‌కు చేర్చింది. 1855లో ఆమె తండ్రి బెన్‌, ఆమె తల్లి రిట్‌ను ఎలిజా బ్రోడెస్‌ నుండి 20 డాలర్లతో కొనుక్కున్నారు. రెండు సంవత్సరాల తర్వాత, తప్పించుకున్న ఎనిమిది మంది బానిసల బృందానికి ఆశ్రయమిచ్చినందుకు ఆమె తండ్రి ఆరెస్టయ్యే ప్రమాదముందని టబ్మాన్‌కు వార్త వచ్చింది. ఆమె వెంటనే తూర్పు తీరానికి వెళ్ళి, ఉత్తర ఒంటారియోలోని సెయింట్‌ కాథరైన్స్‌లో ఆమె ప్రోద్భలంతో ఏర్పడిన ‘మాజీ బానిసల సంఘం’ ఉన్న చోటుకి చేర్చింది.

ప్రమాదకరమైన రోజుల్లో బానిసలను తప్పించడానికి టబ్మాన్‌ ఎంచుకున్న మార్గాలు-పద్ధతులు :

బానిస సమూహాలు ఎవరికీ కనిపించకుండా ఉండడానికి చలి విపరీతంగా ఉండే శీతాకాలపు రాత్రులలో టబ్మాన్‌ పనిచేసేది. ఆమె ప్రమాదకరమైన పనులను అద్భుతమైన చాతుర్యంతో చక్కబెట్టేది. టబ్మాన్‌ని ఆరాధించే ఒక వ్యక్తి ”సుదీర్ఘమైన, దట్టమైన, చీకటితో గడ్డకట్టుకుపోయే చలి రాత్రుల సమయాల్లో మనుషులందరూ ఇళ్ళనుంచి కాలు బయట పెట్టలేని పరిస్థితుల్లో ఆమె బానిసలతో ప్రయాణించేది” అని చెప్పారు.

శనివారం సాయంత్రం బయలుదేరి సోమవారం ఉదయానికి చేరుకునేలాగా ప్రణాళిక తయారుచేసేది. ఎందుకంటే ఆ సమయంలో బానిసలు తప్పించుకున్నారనే వార్తలు, నోటీసులను ముద్రించే అవకాశం ఉండదు కనుక. టబ్మాన్‌ ఒకసారి తలమీద టోపీతో, చేతిలో రెండు కోడి పిల్లలతో బయలుదేరింది. అకస్మాత్తుగా ఆమె తన మాజీ యజమాని ఇంటివైపు నడుస్తున్నట్లు గుర్తించి, వెంటనే కోళ్ళ కాళ్ళను కట్టేసిన తాళ్ళను పట్టుకుని లాగింది. అవి చేసే శబ్దం విన్నవాళ్ళు టబ్మాన్‌ని గుర్తించలేదు. ఇంకోసారి రైలు ప్రయాణం చేస్తున్నప్పుడు తోటి ప్రయాణికుడిని తన మాజీ యజమానిగా పసిగట్టి వెంటనే న్యూస్‌పేపర్‌ తీసుకుని చదువుతున్నట్లు నటించింది. టబ్మాన్‌ నిరక్షరాస్యురాలని ఆయనకు తెలుసు గనుక ఆమెను పట్టించుకోలేదు. మేరీల్యాండ్‌లో విముక్తి పొందిన నల్లజాతి మంత్రి ‘శాంగ్రీన్‌’ ఇంట్లో కొన్నిసార్లు తలదాచుకుంది. ఈ విధంగా టబ్మాన్‌ అనేక రకాలుగా యజమానులను మభ్యపెట్టే సమయస్ఫూర్తితో ప్రవర్తిస్తూ వాళ్ళ కళ్ళుగప్పి తప్పించుకునేది.

టబ్మాన్‌ తన బృందంతో శాండ్‌ టౌన్‌, విల్లో గ్రోవ్‌, డెలావర్‌ మీదుగా ప్రయాణించి కాండెన్‌ ప్రాంతానికి చేరుకునేది. అక్కడ విముక్తి పొందిన బ్లాక్‌ ఏజెంట్లు విలియం, నాట్‌ బ్రింక్లీ, అబ్రహాం గిబ్స్‌ మొదలైనవారు, డోవర్‌, స్మిర్నా, బ్లాక్‌ బర్డ్‌ వంటి ఉత్తర ప్రదేశాలకు మార్గనిర్దేశం చేసేవారు. ఆ ప్రదేశాలకు చేరుకున్న తర్వాత అక్కడున్న ఇతర ఏజెంట్లు చెసాపీక్‌, డెలావర్‌ కెనాల్‌, న్యూ కాజిల్‌ మీదుగా విల్మింగ్టన్‌కు చేర్చేవారు. విల్మింగ్టన్‌లో క్వాకర్‌ థామస్‌ గారెట్‌, విలియం స్టిల్‌ కార్యాలయానికి, ఫిలడెల్ఫియా ప్రాంతంలోని భూగర్భ రైల్‌ రోడ్ల ఆపరేటర్ల ఇళ్ళకు చేర్చే బాధ్యతను తీసుకునేవాడు. న్యూయార్క్‌, ఇంగ్లండ్‌ లాంటి సురక్షితమైన ప్రదేశాలకు పారిపోవడానికి వందలాది మందికి సహాయం చేసిన ఘనత మాత్రం టబ్మాన్‌దే.

అన్ని వేళల్లో టబ్మాన్‌ తన వెంట రివాల్వర్‌ను కూడా ఉంచుకునేది. దాన్ని ఉపయోగించడానికి కూడా ఆమె ఎప్పుడూ భయపడలేదు. బానిసల్ని బంధించేవాళ్ళ నుంచీ, వెంటాడే కుక్కల నుంచీ తప్పించుకోవడానికి తుపాకీని వాడేది. ఆఖరికి అవసరమైతే బానిసల మీద కూడా ప్రయోగించడానికి సిద్ధపడేది. ఒకసారి ఒక బానిస కష్టతరమైన ప్రయాణాలు చెయ్యలేక, వెనక్కి తిరిగి వెళ్ళిపోతానంటే అది తక్కిన బానిస సమూహాల భద్రతకు ముప్పు తెస్తుంది కాబట్టి ”మీరు ముందుకే నడవాలి, లేకపోతే చావాలి” అని అతని తలమీద తుపాకీ గురిపెట్టి అతన్ని కాల్చేస్తానని బెదిరించింది.

బానిసలను పట్టిచ్చే వ్యక్తులకు గానీ, యజమానులకు గానీ, ప్రభుత్వాలకు గానీ వాళ్ళెంత నిఘాతో పకడ్బందీగా ప్రయత్నించినప్పటికీ కూడా టబ్మాన్‌ గానీ, ఆమె నాయకత్వం వహించిన సహ బానిసలు గానీ ఎప్పుడూ పట్టుబడలేదు. ”నేను ఎనిమిది సంవత్సరాలు భూగర్భ రైల్‌ రోడ్‌ కండక్టర్‌గా పనిచేసినప్పటికీ, చాలామంది కండక్టర్ల లాగా నేను నా రైలును ట్రాక్‌నుండి ఎప్పడూ తప్పించలేదు. అంతేకాదు, ఒక్క ప్రయాణికుడిని కూడా పట్టుబడనివ్వలేదు” అని టబ్మాన్‌ ధీమాగా చెప్పింది. ఒక ప్రసిద్ధమైన కథనం ప్రకారం టబ్మాన్‌ని పట్టిచ్చినవారికి 40,000 డాలర్ల బహుమతి ప్రకటించారన్నారు. కేవలం 400 డాలర్లకు కొంత పొలాన్నయినా కొనగలిగే ఆ కారు చవక రోజుల్లో, ప్రత్యేకించి ఇంత ఎక్కువ బహుమతిని టబ్మాన్‌ కోసం ప్రకటించడం దేశప్రజలందరి దృష్టిని ఆకర్షించింది. అధ్యక్షుడు లింకన్‌ హత్యలో జాన్‌ విల్కేస్‌ బూత్‌ సహ కుటద్రారులను పట్టుకోవటానికి ఫెడరల్‌ ప్రభుత్వం 25,000 డాలర్ల అవార్డు మాత్రమే ఇచ్చింది.

1858 ఏప్రిల్‌లో అమెరికాలో బానిసత్వాన్ని నిర్మూలించాలంటే, హింసను ప్రయోగించాలని సూచించిన ‘జాన్‌ బ్రౌన్‌’ అనే బానిస నిర్మూలనవాది టబ్మాన్‌కు పరిచయమయ్యాడు. ఆమె ఎప్పుడూ శ్వేతజాతీయులపై హింసను ప్రయోగించనప్పటికీ జాన్‌ బ్రౌన్‌ అభిప్రాయంతో ఏకీభవించింది. సరిహద్దు రాష్ట్రాలయిన పెన్సిల్వేనియా, మేరీల్యాండ్‌, డెలావర్లలో ఆమె నెలకొల్పిన బానిస సంఘాలు, వారి మద్దతు, వనరులు, యంత్రాంగంపై ఆమెకు అమోఘమైన జ్ఞానం ఉన్నందువల్ల జాన్‌ బ్రౌన్‌, టబ్మాన్‌ పట్ల గౌరవాభిమానాలను పెంచుకోవడమే కాదు, విపరీతంగా ప్రభావితమయ్యాడు. అతను ఆమెని ‘జనరల్‌ టబ్మాన్‌’ అని పిలిచేవాడు. డగ్లస్‌ వంటి ఇతర నిర్మూలనవాదులు జాన్‌ బ్రౌన్‌ వ్యూహాలను ఆమోదించనప్పటికీ, విముక్తి పొందిన బానిసల కోసం కొత్త రాష్ట్రాన్ని సృష్టించాలని, అందుకు పోరాడాలని జాన్‌ బ్రౌన్‌ కలలు కంటూ సైనిక చర్యలకు సన్నాహాలు చేశాడు. మొదట తిరుగుబాటు యుద్ధాన్ని ప్రారంభిస్తే తరువాత అన్ని రాష్ట్రాల్లోని బానిసలు మద్దతిస్తారని అతను నమ్మాడు. టబ్మాన్‌ తన పోరాట శక్తిలో చేరడానికి సిద్ధంగా ఉండవచ్చనే ఉద్దేశ్యంతో దక్షిణ అంటారియోలో నివసిస్తున్న మాజీ బానిసలను సిద్ధంగా ఉంచమని జాన్‌ బ్రౌన్‌ కోరాడు. ఆమె అలాగే అందర్నీ అప్రమత్తం చేసింది. 1858, మే 8న బ్రౌన్‌ అంటారియోలోని చాథంలో ఒక సమావేశాన్ని నిర్వహించి, వర్జీనియాలోని హార్పర్స్‌ ఫెర్రీపై దాడిచేయడానికి తన ప్రణాళికను వివరించాడు. కానీ ఆ ప్రయత్నం ప్రభుత్వానికి తెలిసిపోయింది. ఇక అప్పటికి ఆ పథకాన్ని విరమించుకుని, తిరిగి అనుకూలమైన సమయంలో ప్రారంభించడానికి నిధులను సేకరించడం ప్రారంభించాడు. ఈసారి పకడ్బందీ ప్రణాళికలతో అతనికి సహాయం చేయడానికి టబ్మాన్‌ దృఢంగా నిశ్చయించుకుంది.

1859 శీతాకాలంలో జాన్‌ బ్రౌన్‌ బృందం దాడికి సిద్ధమైనప్పుడు టబ్మాన్‌ బానిస నిర్మూలన వాదులతో చర్చలు, సమావేశాలతో బిజీగా ఉండడం వల్ల జాన్‌ బ్రౌన్‌ ఆమెను సంప్రదించలేకపోయాడు. అక్టోబర్‌ 16న హార్పర్స్‌ ఫెర్రీపై దాడి జరిగినప్పుడు టబ్మాన్‌ హాజరు కాలేకపోయింది. ఆమె బాల్యపు తల గాయానికి సంబంధించి, విపరీతమైన జ్వరంతో తీవ్ర అనారోగ్యం బారిన పడడం వల్ల న్యూయార్క్‌లో ఉండిపోవలసి వచ్చింది. అంతటి అనారోగ్యంలోనూ బానిసల స్వేచ్ఛ గురించే ఆలోచిస్తుండేదని చరిత్రకారులు పేర్కొన్నారు.

జాన్‌ బ్రౌన్‌ నేతృత్వంలోని దాడి విఫలమవుతుంది. ఆయన రాజద్రోహానికి పాల్పడినట్లు భావించిన ప్రభుత్వం డిసెంబరులో ఉరితీసింది. అతని చర్యలను బానిస నిర్మూలనవాదులు గర్వించదగిన ప్రతిఘటనకు ప్రతీకగా భావించారు. ఒక గొప్ప అమరవీరుడుగా కీర్తిస్తూ, ఇప్పటికీ స్మరించుకుంటున్నారు. టబ్మాన్‌ స్వయంగా జాన్‌ బ్రౌన్‌ని ప్రశంసలతో ముంచెత్తింది. ఆమె ఒక స్నేహితుడితో ‘జీవించి ఉన్న 100 మంది పురుషులు చేసే పనిని జాన్‌ బ్రౌన్‌ ఒక్కడే చేశాడ’ని చెప్పింది.

న్యూయార్క్‌లోని ఆబర్న్‌ శివార్లలో టబ్మాన్‌ కొన్న ఇల్లు, మెరుగైన జీవితాన్ని కోరుకునే నల్ల అమెరికన్లకు సురక్షితమైన స్థలంగా మారింది. 1860 నవంబర్‌లో టబ్మాన్‌ చివరి ప్రమాదకరమైన ప్రయాణాన్ని చేసింది. టబ్మాన్‌ డోర్చెస్టర్‌ కౌంటీకి తిరిగొచ్చి చూస్తే ఆమె చెల్లెలు చనిపోగా, ఇద్దరు చిన్నపిల్లలు నిరాశ్రయులవుతారు. బానిసత్వంలో ఉన్న పిల్లల్ని విడిపించాలంటే 30 డాలర్లు కావాలి. కానీ ఆమె దగ్గర అంత డబ్బు లేదు. ఆ ప్రయాణపు ట్రిప్‌ని వృధా చేసుకోకూడదనీ, ఎలాగైనా సరే పిల్లల్ని బానిసత్వం నుంచి తప్పించాలనే పట్టుదలతో ఉంటుంది. ఆ సమయంలో తప్పించుకోవడానికి ఎంతటి రిస్క్‌నైనా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్న ఒక బానిస ‘ఎన్నాల్స్‌’ కుటుంబంతో పరిచయమవుతుంది. వారితో టబ్మాన్‌ ఇంకొక గ్రూప్‌ని తయారుచేస్తుంది. వాతావరణం మామూలు చలికాలం కంటే భీతావహంగా ఉన్న సమయంలో, చాలినంత ఆహారం కూడా లేకుండా వారు వారాల తరబడి ప్రయాణం చేస్తారు. పిల్లలు ఏడిస్తే శబ్దాలవుతాయని మత్తుమందులిస్తారు. టబ్మాన్‌ చివరికి క్షేమంగా ఆబర్న్‌ ఇంటికి చేరుకున్నారు.

అమెరికా దక్షిణ భాగంలో బానిసలను వెట్టి కోసం బంధించిన యజమానులు, ఉత్తర భాగంలో విముక్తి పొందిన బానిసల మధ్య ఘర్షణ వాతావరణముండేది. అదే సమయంలో అమెరికా కాంగ్రెస్‌ ఫ్యుజిటివ్‌ స్లేవ్‌ చట్టాన్ని 1850 సెప్టెంబర్‌ 18న ఆమోదించింది. ఈ చట్టం తప్పించుకున్న బానిసలకు కష్టాలను మరింత పెంచింది. ఉత్తర అమెరికా తప్పించుకున్న బానిసలకు మరింత ప్రమాదకరమైన ప్రదేశంగా మారిపోయినందువల్ల, తప్పించుకున్న చాలామంది బానిసలు దక్షిణ అంటారియో (అప్పటి కెనడా యునైటెడ్‌ ప్రావిన్స్‌లో భాగం)కు వలస వెళ్ళేవారు. బ్రిటిష్‌ సామ్రాజ్యంలో భాగంగా బానిసత్వాన్ని రద్దు చేయడం వల్ల, వీరిలో ఎక్కువ మంది అక్కడ ఆశ్రయం పొందారు. ఈ ఫ్యుజిటివ్‌ స్లేవ్‌ చట్టం తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్న బానిసలను క్రూరంగా శిక్షించింది. ఈ చట్టం తప్పించుకున్న బానిసలందరినీ పట్టుకుని తిరిగి వారి యజమానులకు అప్పజెప్పాలనీ, స్వేచ్ఛా రాష్ట్రాల పౌరులు, అధికారులు అందుకు సహకరించాలని నిర్దేశిస్తుంది. బానిసలను గుర్తించడానికి కుక్కలను ప్రయోగించే ఈ పైశాచిక చట్టాన్ని బానిస నిర్మూలనవాదులు మాత్రం ”బ్లడ్‌ హౌండ్‌ బిల్‌” అని తీవ్రంగా వ్యతిరేకించి నిరసించారు.

రానురానూ ఐరిష్‌ పేద ప్రజలు తండోపతండాలుగా ఫిలడెల్ఫియాకు వలసలు రావడం నల్లజాతీయులకూ, ఐరిష్‌ వారికీ మధ్య జాతి ఉద్రిక్తతలు, పనుల కోసం ఘర్షణలు కూడా చెలరేగాయి. రోజులు గడిచేకొద్దీ అనేక సమస్యల ఘర్షణలు తీవ్రమై అంతర్యుద్ధానికి దారితీసింది.

అమెరికన్‌ సివిల్‌ వార్‌ సమయంలో, టబ్మాన్‌ ఆమె మొదటి ఆర్మీకి వంట మనిషిగా, నర్సుగా పనిచేసింది. ఆ తర్వాత సాయుధ స్కౌట్‌గానూ, నమ్మకమైన గూఢచారిగానూ నియమింపబడింది. ఆ తర్వాత సంవత్సరాలలో టబ్మాన్‌ మహిళల ఓటుహక్కు పోరాటంలో ఒక ముఖ్యమైన కార్యకర్తగా పనిచేసింది. యుద్ధంలో సాయుధ దండయాత్రకు నాయకత్వం వహించిన మొదటి మహిళ టబ్మాన్‌. కాంబహీ ఫెర్రీ వద్ద జరిగిన దాడిలో ఆమె మార్గనిర్దేశం చేసి, 700 మందికి పైగా బానిసలను విముక్తి చేసింది. 1913లో ఆమె మరణం వరకూ మహిళల ఓటు హక్కు ఉద్యమంలో చురుకుగా ఉండి, ధైర్య సాహసాలకూ, స్వేచ్ఛా పోరాటాలకూ మారుపేరుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.

19వ శతాబ్దంలో అండర్‌గ్రౌండ్‌ రైల్‌రోడ్‌లో కండక్టర్‌గా నల్ల జాతీయుల బానిసత్వ నిర్మూలనకూ, వారి స్వేచ్ఛ కోసం, వారిని మనుషులుగా సమాజంలో నిలబెట్టడం కోసం అలుపెరుగని పోరాటం చేసిన టబ్మాన్‌ అమెరికన్‌ చరిత్రలో అత్యంత సాహసోపేతమైన మహిళగా, శాశ్వతమైన గొప్ప కీర్తి పొందిన మహిళగా గుర్తింపు పొందింది. పశువులకంటే హీనంగా బతుకులీడుస్తూ, అణగదొక్కుతున్న బానిస సమూహాల స్వేచ్ఛ కోసం ప్రపంచంలోనే ప్రప్రథమంగా ప్రాణాలకు తెగించి వీరోచిత పోరాటం చేసి, తన జాతి జనులకు మానవ హోదాని సంపాదించి పెట్టిన మహిళగా చరిత్రలో చిరస్మరణీయురాలైంది. టబ్మాన్‌ను వివిధ సమూహాలు రకరకాలుగా ప్రశంసిస్తారు. వారి దృష్టిలో ఆమె ఎవరు? ఆమెను పట్టుకోవడానికి ప్రయత్నించిన బానిస యజమానులకు ఆమె ఒక గజదొంగ, పరమ మోసగత్తె, జగత్జంత్రీ.

కానీ ఆమెతోపాటు బానిస విముక్తి కోసం పోరాడిన తోటివారి దృష్టితో చూస్తే, హార్పర్స్‌ ఫెర్రీ బానిస తిరుగుబాటు నాయకుడైన జాన్‌ బ్రౌన్‌కు ఆమె జనరల్‌ టబ్మాన్‌. ఉత్తరం వైపున స్వేచ్ఛను సాధించిన చాలామంది బానిసలకు ఆమె మోజెస్‌ (మోషే). బానిస నిర్మూలనవాదులకు, ఆమె ఒక మహా ప్రవక్త. ఇవే నిక్కచ్చిగా నిగ్గు తేల్చిన సత్యాలు!!

నిష్పక్షపాతంగా చేయబడిన పరిశోధనలో వ్యక్తమయ్యే హ్యారియెట్‌ టబ్మాన్‌ను ఏకకాలంలో సరళమైన, సంక్లిష్టమైన వ్యక్తిత్వంగా, సాధారణ వర్గీకరణలో ఒదగని తనంతో తన జాతి విముక్తి కోసం యజమానుల నియంతృత్వాన్ని ధిక్కరించి ఎదురు నిలిచి పోరాడిన మహిళగా ఈ ఫాసిస్టు సంక్షోభ కాలంలో ప్రపంచంలో ఆమె జీవిత చరిత్ర విస్తృతంగా ప్రశంసించబడుతుంది. అయినప్పటికీ హ్యారియెట్‌ టబ్మాన్‌ చరిత్రలో లిఖించిన దానికంటే మహోన్నతమైన వ్యక్తిత్వం కలది. ఎందుకంటే మూర్తీభవించిన దాష్టీకం, దౌర్జన్యాలకు ఎదురు నిలిచి మొదటి అడుగు వేయడమంటే మాటల్లో విశదీకరించలేని విషయం.

(అశోక్‌ కుంబము గారికి కృతజ్ఞతలు. నేను మొదటగా ఆయన ఉపన్యాసంలో హ్యారియెట్‌ టబ్మాన్‌ పేరు విని ప్రభావితమయ్యాను. అంతర్జాలంలోని హ్యారియెట్‌ గురించిన సమాచారానికి నా స్వేచ్ఛానువాదమిది)

Share
This entry was posted in సినిమా సమీక్ష. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.