ఇంటికి తాళం పెడుతూ సరిగా పడిందా లేదా అని మళ్ళీ చూసుకుని ఒకసారి ఇంటిముందు ఉన్న చెట్లని, పూలమొక్కలని తనివితీరా చూస్తూ, మనసులో తన అర్ధాంగి లలితను గుర్తు చేసుకున్నాడు మోహనరావు. ఆవిడ ఈ లోకం విడిచి సరిగ్గా నలభై రెండు రోజులు. యాదయ్యకు గేటు తాళం వేసి వెళ్ళమని చెప్పగానే, అతని వెనకాలే సూట్‌కేస్ పట్టుకొస్తున్న యాదయ్య అట్లాగేనన్నట్టు తలూపాడు గబగబా.
వయసు ఆరైనా నూరైనా ఏ మాత్రం బిగి సడలని శరీరంతో, చక్కగా ఇన్‌షర్ట్ వేసుకున్న ఇస్త్రీ నలగని డ్రెస్‌తో ఎంతో గంభీరంగా కనిపిస్తాడు స్ఫురద్రూపి అయిన మోహనరావు. దానికి తోడు గుబురు మీసాలు చూడగానే గంభీరంగా కనిపిస్తాడు.
టక్ టక్‌మని బూట్ల సందడి చేసుకుంటూ గేటు బయట ఆగి ఉన్న కారు దగ్గరికి వస్తున్న మోహనరావు తమ ఇంటిముందు ఆగుతున్న పోలీస్ కారుని చూసి ఆగిపోయాడు, అవాక్కయినట్టుగా…
అందులోనుంచి దిగుతున్న ఏసిపి కిరణ్ ‘సారీ సార్! యు ఆర్ అండర్ అరెస్ట్ మీ మీద కేసు నమోదయింది…’ అంటూ కటువుగా అన్నాడు. అతని చేతిలోని అరెస్ట్ వారెంట్ చూడగానే మాట పడిపోయిన వాడై వెంట నడిచాడు మోహనరావు. అరెస్ట్‌కి కారణం అతనికి తెలుసు.
… … …
లలితమ్మ దశదిన కర్మ చాలా ఘనంగా జరిపిస్తున్నాడు మోహనరావు. తల్లిని ఆఖరి చూపుకు నోచుకోకపోయినా కర్మ సమయానికి కూతురు, కొడుకు కుటుంబాలతో సహా విదేశాల నుంచి వచ్చారు.
వచ్చిన ముత్తైదువులందరికీ మోహనరావు కూతురు సంప్రదాయం ప్రకారం చేటలో పుణ్యస్త్రీ అలంకరణ సామగ్రి అంతా అతి ఖరీదయినవి పెట్టి దగ్గర ఉండి పసుపు, కుంకుమలతో పాటు పంచింది. ‘పుణ్యాత్మురాలు లలితమ్మ’ అంటూ అవిడని తలచుకుని ఆత్మశాంతికై ప్రార్ధించారు వచ్చిన ముత్తైదువులు.
సమయం లేదంటూ కొడుకు, కూతురు తండ్రిని కూడా వాళ్ళవెంట రమ్మని ఒత్తిడి చేశారు. ఆయన ఇక్కడ చూసుకోవలసినవి చాలా ఉన్నాయి, అన్ని చక్కబెట్టుకుని మెల్లగా వస్తానని చెప్పాడు.
వాళ్ళంతా వెళ్ళిపోయారు రెండురోజుల్లో…
మోహనరావు అన్న, వదిన యాక్సిడెంట్‌లో చనిపోతే వారి కొడుకు ముకుంద్‌ని తీసుకువచ్చి, తన పిల్లలతో పాటుగా చదివించాడు. ఆ తరువాత ముకుంద్ ఉద్యోగరీత్యా సిటీలో స్థిరపడినా, బాబాయిని, పిన్నిని చూడడానికి తరచుగా తన కుటుంబ సభ్యులతో పాటుగా గ్రామానికి వస్తూ ఉండేవాడు. తనతో పాటుగా పనిచేస్తున్న సునందను ఎంతో ఇష్టపడి పెళ్ళి చేసుకున్న ముకుంద్‌కి ఇద్దరు అమ్మాయిలు. పిన్నమ్మ కర్మ కోసమని భార్యా పిల్లలతో సహా వచ్చాడు ముకుంద్. అతని పెద్ద కూతురు అంజలి బీటెక్ పూర్తి చేసింది. పెళ్ళి కుదిరి, మరో రెండు నెలల్లో ముహూర్తం కనుక ఇంకా ఎక్కడా ఉద్యోగంలో జాయిన్ కాలేదు. కర్మ పూర్తయ్యాక, అందరూ వెళ్ళిపోతుంటే ఒంటరిగా, దిగులుగా కూర్చున్న బాబాయిని చూస్తుంటే, తాను వెళ్ళడానికి మనసొప్పలేదు. అక్కడ లీవ్ సమస్య, చిన్నదానికి పరీక్షలు… అందుకే పెద్ద కూతురు అంజలిని అడిగాడు, ఒక పది రోజులు తాతయ్యకు తోడుగా ఉండమని.
చిన్నప్పటినుంచీ ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండే అంజలికి ఈ ఊరన్నా, ఇల్లన్నా పంచప్రాణాలు. అకస్మాత్తుగా బామ్మ చనిపోతే చాలా బాధపడింది, ఒంటరి వాడైపోయిన తాతయ్యను తలుచుకుని. చిన్నప్పటినుంచీ ఎత్తుకుని ఆడించిన మోహనరావుకు అంజలి అంటే చాలా ముద్దు. సరే, అతనికి తోడుగా ఉంటే తన దుఃఖం కాస్త్తయినా మరుగున పడుతుందని భావించిన అంజలి ఆయన అమెరికా వెళ్ళేవరకూ ఉండాలని అనుకుంది. ఇంటికి కాస్త దూరంలో గంభీరంగా ప్రవహించే గోదావరి నది, ఇంటి చుట్టూ ఎన్నో పూలు, ఫలవృక్షాలతో శోభాయమానమైన ఆ వాతావరణంలో కొన్నాళ్ళు ఉండాలని, తండ్రి అడిగిన వెంటనే అంగీకరించింది.
వంటకి వంటమనిషి, పనులకు, తోటకు వేరే మనుషులు ఉన్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా హాయిగా, స్వేచ్ఛగా తిరగసాగింది. ‘తాతయ్యా తాతయ్యా’ అంటూ వెనుక వెనుక తిరిగి కబుర్లు చెబుతూ, సరదాగా నవ్విస్తూ దగ్గర ఉండి కొసరి కొసరి తినమని ఒత్తిడి చేస్తూ… అసలతనికి సమయం తెలియనివ్వడం లేదు అంజలి.
టీవీ చూస్తూ సోఫాలో కూర్చుని, పాప్‌కార్న్‌ను బౌల్‌లో నుంచి తీసుకుని తింటూ, పక్కనే కూర్చున్న తాతయ్యకు కూడా ఇస్తూ కామెడీ వచ్చినప్పుడు పడీ పడీ నవ్వుతోంది అంజలి. ఆమెనే చూస్తున్న మోహనరావు ఆమె చేతిని గట్టిగా పట్టుకుని, ‘అమ్మలూ! నీవు ఉండకుండా ఉండి ఉంటే నేనేమైపోయేవాడినో తలచుకుంటుంటే భయమేస్తుందిరా. నీ ఋణం ఎలా తీర్చుకోనురా…’ ఎమోషనల్‌గా అంటుంటే అంజలికి ఏం మాట్లాడాలో తెలిసేది కాదు.
… … …
మోహనరావుది న్యూ బ్రారడ్ లేటెస్ట్ స్మార్ట్ మొబైల్ ఫోన్. చాలాసేపటి నుంచి సెల్‌ఫోన్‌లో తదేకంగా చూసుకుంటూ తన్మయమవుతున్న అతని దగ్గరకు పరుగున వచ్చి ”తాతయ్యా ఒకసారి మీ సెల్ ఇస్తారా… నా దాంట్లో ఛార్జ్ అయిపోయింది. అర్జంటుగా అమ్మతో మాట్లాడాలి…” అని ముందుకు వంగింది అంజలి.
ఒక్కసారి గాభరాపడిపోయి సెల్ దాచే ప్రయ్నం చేశాడు. (ఎందుకంటే అతను ఇంటర్నెట్‌లో నీలి చిత్రాలు చూస్తున్నాడు). అది కిందపడి ఆఫ్ అయిపోయింది. ‘హమ్మయ్య’ అని ఊపిరి పీల్చుకున్నాడు.
”సారీ తాతయ్యా” అమాయకంగా అంటూ సెల్ తీసి ఇచ్చింది.
అప్పుడు సెల్ ఆన్ చేసి వేరే ఏమీ కనిపించకుండా అన్నీ డిలీట్ చేసి ఇచ్చాడు ఆ అమ్మాయిని మాటల్లో పెట్టి.
వంటపని చేస్తూ వీళ్ళని గమనిస్తున్న చిట్టెమ్మ ‘పాపం బిడ్డ అమాయకురాలు’ అనుకుంది. ఆమె వయసు అరవై అయిదు ఉండొచ్చు. లలితమ్మే ఆమెను వంటపనిలో కుదుర్చుకుంది… ఆమె వంటలు చాలా బాగా చేస్తుంది, ఇంట్లోనే
ఉంటుంది అని. ‘తనకు అందరూ ఉన్నా ఎవరూ లేనట్టే’ అని చెబుతుంది పట్టెడన్నం పెట్టలేని కొడుకులను తలచుకొని.
… … …
”తెలిసినవాళ్ళ ఇంట్లో పెళ్ళి ఉంది సాయం రమ్మన్నారు…” అని చెప్పి చిట్టెమ్మ సాయంత్రం వంట ముగించి అన్నీ సర్దిపెట్టి వెళ్ళింది. ఆ పూట ఎందుకో ఆకలి అనిపించలేదు అంజలికి. కాబోయే శ్రీవారు రేవంత్‌తో కాసేపు చాటింగ్ చేసి మధురోహలు మదిని చుట్టేసి మైమరపిస్తూ ఉంటే ఇక నిద్ర వస్తోందని దిండును వాటేసుకుని పడుకుంది అంజలి.
ఘాటైన వాసన తనకు ఎప్పుడూ తెలియనిది తన శ్వాసలో మిళితమవుతుంటే… బలమైన రెండు చేతులు తనని గట్టిగా బంధించి ఊపిరి ఆడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే… ఏదో కలలోనా అనుకుని గబుక్కున కళ్ళు తెరిచి ఒక్కసారిగా భయపడిపోయింది.
వదిలించుకోజూస్తూ చిక్కటి చీకటిలో ”ఎవరు… వదలండి… మా తాతయ్యను పిలుస్తా… ప్లీజ్ వదలండి…” అంటూ కళ్ళనీళ్ళ పర్యంతమౌతూ పెనుగులాడసాగింది. ఉక్కు సంకెళ్ళలా ఆ చేతులు మరింతగా బిగుసుకోసాగాయి. విదిలించుకుంటూ రెండు కాళ్ళతో కసిగా తన్నింది. ఆ ఊపుకు దూరం జరిగాడు. వెంటనే మంచం మీదినుంచి కిందికి దొర్లింది. అదే అదనుగా అతను కూడా రాక్షసుడిలా మీదపడ్డాడు అందివచ్చిన బట్టలను పీలికలుగా చింపేస్తూ…
ఆ పిల్ల ఎంత పెనుగులాడుతుంటే వాడు అంత మదపిశాచి అవుతున్నాడు. ”తాతయ్యా… ఎక్కడున్నావ్?” అమె అరుపు బయటకు వినపడకుండా ఆమె నోటిని గట్టిగా మూసేశాడు. ఆ బలానికి శక్తిని కోల్పోయిన అంజలి… అభం శుభం తెలియని అమ్మా నాన్నల చాటు ఆడపిల్ల గాలిలో కలిసిపోయిన ఆర్తనాదాలతో స్పృహను కోల్పోతూ, మూతలు పడుతున్న రెప్పల సందులో నుంచి వెంటిలేటర్ నుండి సూటిగా పడుతున్న వరండా లైటు వెలుగులో అతన్ని చూసి హతాశురాలైంది. ఇప్పటివరకూ తనని రక్షించమని పిలుస్తున్న తాతయ్యే తాచుపామై తనను కాటేశాడని గ్రహించి, ఆ షాక్‌తో తెలివి తప్పింది.
… … …
నూట మూడు డిగ్రీల జ్వరంతో బాధపడుతూ అపస్మారక స్థితి నుంచి అప్పుడే మెల్లిగా కళ్ళు తెరిచిన అంజలికి స్టెతస్కోపుతో డాక్టర్, కన్నీళ్ళ పర్యంతమవుతూ అమ్మా నాన్నలు, ఆ వెనుక దీనావస్థలో జాలిగొలిపేలా ముఖం పెట్టిన మోహనరావు కనిపించారు. ఒక పురుగును చూసినట్టు అతని వైపు చూసింది అంజలి.
”అమ్మలూ! ఎలా ఉందిరా… తాతయ్య కాల్ చేసి నీకు బాగుండలేదని చెప్పేసరికి చాలా భయపడ్డాము. నిన్ను చూడగానే ప్రాణం పోయిందిరా… ఏమైందో అని. మూసిన కన్ను తెరువలేదమ్మా! రెండు రోజులైంది. ఒకటే కలవరింతలు ఏదో చూసి భయపడినట్టు. ఏమైందమ్మా బంగారూ!” ఒళ్ళంతా తడుముతూ అంజలిని ఆ స్థితిలో చూసి విలవిలలాడిపోతూ అంది తల్లి సునంద.
ఏదో చెప్పబోయిన అంజలికి గొంతు పెగల్లేదు.
అంజలి కాళ్ళ దగ్గర మంచం మీద కూర్చుని పాదాలు రాస్తూ ”నీకు మేం ఉన్నాముగా నాన్నలు… బెంగ ఎందుకురా?” భరోసాగా తండ్రి ముకుంద్ చెబుతుంటే…అసహాయంగా కళ్ళు మూసుకుని, మౌనంగా కన్నీళ్ళు కారుస్తూ ఉండిపోయింది.
ఆ అమ్మాయికి జరిగిన అన్యాయమేంటో ఆ రోజు పొద్దున్నే వచ్చిన చిట్టెమ్మ గుర్తుపట్టేసింది. కానీ ఏం మాట్లాడితే ఏమవుతుందో అన్న భయంతో మాటలు కరువయినదానిలా మిన్నకుండిపోయింది. తనలో తానే బాధపడసాగింది. అయ్యో తానైనా యజమాని గురించి ముకుంద్ బాబుకు చెప్పవలసిందని అపరాధ భావనతో విలవిల్లాడింది. తాను ముసలిది, బక్కచిక్కిపోయి వంట్లో కండలేక పదేళ్ళ వయసు ఎక్కువగా కనిపిస్తుంది కనుక వదిలేశాడు కానీ, ఇంట్లో చేరిన ఏ పనిమనిషినీ వదల్లేదు మోహనరావు. ఆ సంగతి తనకు తెలుసు. కానీ మనవరాలిని సైతం కబళించేటంత నరరూప రాక్షసుడని ఊహించలేదు. లోలోపల ఏడుస్తూ పని చేసుకుపోతోంది చిట్టెమ్మ.
… … …
తల్లిదండ్రుల పర్యవేక్షణలో కొంచెం లేచి కూర్చోగలుగుతోంది అంజలి. కానీ ఆలోచించసాగింది జరిగింది చిన్న విషయం కాదు. ఇది జీవిత సమస్య. అమ్మానాన్నలకి చెబితే వాళ్ళు ముందు కుప్పకూలిపోతారు. ఆ తరువాత ఆ ముసలాడిని ఊరుకోరు. అంతా రచ్చ రచ్చ అవుతుంది. ఎలా? ఏం చేయాలి?’ అనుకుంటూ…
”మామయ్యగారు, అంజలికి కొంచెం నెమ్మదించింది కదా. మేము ఇంటికి తీసుకువెళ్తాం. అక్కడ మా ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపిస్తామండి. మీరు ఏమీ బాధపడకండి. అంజలి ఎప్పుడూ మమ్మల్ని వదిలి ఇన్ని రోజులు ఉండలేదు. అందులోనూ ఇక్కడ కొంచెం నిర్మానుష్యంగా ఉంటుంది కదా… ఏదైనా చూసి భయపడిందేమో… అత్తయ్యగారి జ్ఞాపకాల నుంచి మీకు కూడా కొంచెం మార్పు
ఉంటుంది. మీరు కూడా మాతోపాటే వచ్చేయండి” అంజలి బట్టల సూట్‌కేస్ సర్దుతూ అంది సునంద.
పైకి బింకంగా ఉన్నా లోపల్లోపల ఒకటే భయంగా ఉంది మోహనరావుకి, ఆ పిల్ల ఎక్కడ చెప్పేసి ఏం గొడవలు సృష్టిస్తుందో అని. అయితే తాను చేసింది తప్పు అని అతనికి కొంచెమైనా పశ్చాత్తాపం లాంటిది కలగలేదు. తన ముద్దుల మనవరాలు అని మనసులో ఏదో మూల అనిపించినా, ఆడది మగాడికి సుఖాన్నివ్వడానికే, అది ఎవరైనా సరే… అని అంతరాత్మ నోరు నొక్కేశాడు ఆ మదపిశాచి.
… … …
అంజలి దగ్గర నుంచి వచ్చిన మెయిల్ ఓపెన్ చేసి చదువుతూ అచేతనుడయ్యాడు రేవంత్. ఒక్క క్షణం తల గిర్రున తిరిగింది. ”ఛీ! ఎంత సిగ్గుచేటు… చిన్న పిల్ల… మనవరాలు… వెధవలు ఉచ్చం నీచం లేకుండా ఇలా కూడా ఉంటారా…” అనుకున్నాడు రేవంత్.
”బాబోయ్! అంజలి… ఎలా తట్టుకున్నావు నా బంగారం…” గుండె తొలిచేస్తుంటే వస్తున్న కంటితడిని తుడుచుకుంటూ తక్షణ కర్తవ్యంగా సెల్ తీసుకుని అంజలికి కాల్ చేశాడు రేవంత్.
ఆమె కాల్ లిఫ్ట్ చెయ్యగానే ”ప్లీజ్ అంజలీ! నీవు ఏ అఘాయిత్యం చేయనని మాట ఇవ్వు. ముందు ఒకసారి మనం కలిసి మాట్లాడుకుందాం. నీకు జరిగింది కేవలం ఒక యాక్సిడెంట్ మాత్రమే. ఇది నీవు కావాలని చేసింది కాదు. నీవు ఇందులో సూసైడ్ చేసుకునేంత తప్పు ఏమీ జరగలేదు. నీకు ఏ వేళయినా నేను ఉన్నాను. అర్జెంటుగా నిన్ను కలవాలి” అన్నాడు ఎంతో ఎమోషనల్‌గా…
”సూసైడా? నేనంత పిరికిదాన్ని కాదు. ద్రోహిని ఎలా శిక్షించాలో ఆలోచిద్దాం. కలుద్దాం రేవంత్” అంటూ ఫోన్ పెట్టేసింది అంజలి.
… … …
మాఘమాసపు చలి గిలిగింతలు పెట్టేదే… ప్రశాంతమైన ఆకాశంలో పూర్ణచంద్రుడు ధారాళంగా కురిపిస్తున్న వెన్నెలంతా మనకోసమే… ఆ వెన్నెలని పులుముకుని ఉక్కిరిబిక్కిరవుతూ ఒక్కటై వెచ్చని కౌగిళ్ళలో ఒదిగిపోదాం అనిపించేదే ఆ జంటకి… కానీ కాబోయేవాడు దగ్గరకు రాగానే, తనకు జరిగిన అవమానానికి, గాయపడిన హృదయంతో తనలో తానే కుమిలిపోతూ, దుఃఖంతో ఎగసిపడుతున్న గుండెలతో, కన్నుల నుండి ఉబికివస్తోన్న కన్నీళ్ళ వరదని దాచే ప్రయత్నంలో దోసిట్లో ముఖం దాచుకుని వెక్కి వెక్కి ఏడ్వసాగింది అంజలి.
‘తన బాధను కన్నీళ్ళ రూపంలో బయటకు పంపనీ’ అన్నట్లుగా కాసేపు మౌనంగా ఉండి ఆ తరువాత ఆమెను తన చేతుల్లోకి తీసుకుని చెదిరిపోయిన జుట్టును సరిచేస్తూ అనునయించాడు రేవంత్.
”ఆ ఊరు, ఆ ఇల్లు, అక్కడ ఏం జరిగింది అంతా పీడకల అని పూర్తిగా మైండ్‌లో నుండి తీసెయ్యి అంజలీ. అతను ఒక మద పిశాచి. నీతో జరిగింది మొదటిది అయి ఉండదు. అతని జీవితంలో ఎన్ని ఘోరాలు చేశాడో, ఎంతమంది ఆడపడుచులను బలి తీసుకున్నాడో.. ఇవన్నీ నేను తప్పనిసరిగా ఎంక్వయిరీ చేయిస్తాను. ఎ.సి.పి. కిరణ్ నా కజిన్ బ్రదర్. అతని ద్వారా అన్ని వివరాలు సేకరింపజేస్తాను. మనం ఊరుకోవద్దు. ఇంకా ఇంకా మృగం అవుతాడు వాడు. వయసు మీద పడుతోందన్న ఆలోచన కూడా లేదు వెధవకి…” ఆవేశంతో ఊగిపోతున్నాడు రేవంత్.
అయోమయావస్థలో మూగదైంది అంజలి.
కాసేపాగి నెమ్మదిగా ”ఒక్కటే రిక్వెస్ట్ రేవంత్! అమ్మా నాన్నలకు ఇప్పుడిప్పుడే ఈ విషయం తెలియనివ్వకూడదు అనుకున్నా. నాన్నకి తాతయ్య అంటే భక్తి, అనాధ అయిన తనని చేరదీసి పెంచి చదివించాడని. అతను ఇలా చేశాడంటే అమ్మా, నాన్నలు కృంగిపోతారు” అంది.
”అలాగే అంజలీ… అన్నీ సక్రమంగా జరిగి అతన్ని అరెస్ట్ చేయించేటప్పుడే తెలియనీ…” అంజలి చేతిని తీసుకుని తన రెండు చేతుల్లో బంధించి నొక్కుతూ అన్నాడు రేవంత్.
… … …
కిరణ్ కజిన్ నమ్రత రంగంలోనికి దిగింది. పల్లెటూరి అమ్మాయిలా వేషం మార్చుకుని ముందు ఆ ఊరు వెళ్ళి అక్కడ ఏమీ తెలియని దానిలా మోహన్‌రావు గురించి అడిగింది. ”అటువైపు వెళ్ళకమ్మా… ఆ రాక్షసుడు మంచివాడు కాదు…” చెప్పాడు ఒక పెద్దాయన.
‘నోట్ దిస్ పాయింట్’ అనుకుంటూ అతని ఇంటికి బయలుదేరింది నమ్రత. అతను ఇంట్లో లేడని, బయటకు వెళ్ళాడని చెప్పింది చిట్టెమ్మ. ఇదే సమయమని చిట్టెమ్మని మంచి చేసుకుని సెల్‌లో వీడియో ఆన్ చేసింది ఆమెకు తెలియకుండా.
”మీ అయ్యగారు ఎలాంటి వాళ్ళు. అమ్మగారిని బాగా చూసుకునేవాళ్ళా…” అంటూ ప్రశ్నలడగసాగింది.
ముందు కొంచెం సందేహించినా ఏమైతే అదయ్యింది, అంజలమ్మకు జరిగిన అన్యాయం ఇంకో ఆడ కూతురికి జరగకూడదు, అందుకే అన్నీ చెప్పేయాలని నిర్ణయించుకుని మోహన్‌రావు గురించి తనకు తెలిసిన నిజాలన్నీ బైటపెట్టింది చిట్టెమ్మ. ”లలితమ్మగారు ఏమీ మాట్లాడలేకపోయేవారమ్మా. ముందే ఆమెను చిత్రహింస పెట్టేవాడు. ఆమెను దేనికీ పనికిరాని వస్తువుగా తీసిపారేసేవాడు. చివరికి అంజలమ్మని కూడా కిరాతకంగా నాశనం చేశాడు. పొద్దున్నే నేను వచ్చేసరికి ఆ అమ్మ గజగజ వణుకుతూ మంచంకు ఆవల రక్తం మరకలతో…” చెప్పలేక కొంగు అడ్డం పెట్టుకుంది చిట్టెమ్మ.
అర్థమయ్యింది నమ్రతకు.
”అయ్యో! అట్టాగా. మా ఊరోళ్ళు ఇక్కడ పెద్దాయనని చూసుకోవడానికి మనిషి కావాలంటే మాయమ్మ పంపింది. మంచిదయింది నువ్వు అన్నీ సెప్పి నన్ను కాపాడినావు. మరి నేను పోతున్నా” అంటూ బయటికి వెళ్ళేదల్లా ఒకసారి ”లలితమ్మగారి గది ఏది? ఆయమ్మ ఫోటో అయినా సూసిపోతా” అని అడిగింది నమ్రత.
చిట్టెమ్మ చూపించిన గదిలోకి వెళ్ళి ఒకసారి కలియచూసింది. చక్కగా సర్ది ఉన్న కబోర్డులో ఒక పక్కగా ఒక డైరీ కనిపించింది. చేతిలోకి తీసుకుని చూసింది. అది గుండ్రని అక్షరాలతో ”లలిత మనసు” అని రాసి ఉంది.
డైరీని కూడా తీసుకుని బయటికి వచ్చిన నమ్రత దూరంగా ఆగి ఉన్న కారు దగ్గరకు వడివడిగా నడుస్తూ వెళ్ళి కారు డోర్ తెరిచి అందులో కూర్చుని డోర్ లాక్ చేస్తూ ‘పోనీ వాసు’ అని డ్రైవర్‌తో చెప్పింది.
మెల్లగా డైరీ ఓపెన్ చేసి చదవసాగింది నమ్రత.
”జీవితం శూన్యం, అవును మనసులేని జీవితం శూన్యమే…” అన్న కాప్షన్‌తో ఆవిడ మనసునంతా పరిచింది.
”మూడు ముళ్ళ పసుపుతాడు మెడలో పడి నలభై సంవత్సరాలు దాటినా ‘నేను’ అనే అహంకారంతోనే బ్రతికాడు. కళ్ళ నిండా మాత్రమే కాదు ఒళ్ళంతా కామమే భర్త అనే ఆ రాక్షసునకు. ప్రతి రాత్రి కాళరాత్రే. శరీరం, మనసు, ఇల్లు దేవాలయంలా ఉంచుకోవాలనుకుంటాను నేను. ద్వేషం, పొగరుతో పాటు అనుమానం… అతను. ఇతర ఆడవాళ్ళను అదే దృష్టితో చూస్తాడు కాబట్టి నన్ను కూడా వేరే మగవాడు అలానే అనుకుంటాడని అతని అభిప్రాయం.
అందుకే ఎవరితోనూ మాట్లాడనిచ్చేవాడు కాదు. వయసు పెరుగుతున్న కొద్దీ ఒంట్లో కోర్కెలు అతిగా మారి ఎన్నో, ఎన్నెన్నో అఘాయిత్యాలు చేస్తున్నాడు. ఎవరికి ఏమని చెప్పను? ఈ ఇంటర్నెట్ వచ్చిన దగ్గర్నుండి బూతు బొమ్మలు, వీడియోలు సెల్ ఫోన్ నిండా. ఒక్కోసారి నాకు కూడా చూపెడుతూ అలా ఉండాలి అంటూ రక్కేసేవాడు. దేవుడా! ఎందుకయ్యా నాకు ఈ జన్మని ఇచ్చావు అని ఏడవడం తప్ప ఏమీ చేయలేని అశక్తురాలిని. ఈ స్మార్ట్ ఫోన్ల వల్ల పిల్లలు, యువతరమే కాదు ఇలాంటి వయసు పైబడుతున్న వాళ్ళు కూడా ప్రేరేపితమవుతూ అఘాయిత్యాలు చేస్తున్నారు. ఇది ఎక్కడ, ఎవరికి తెలిసినా పరువు పోతుంది అని సామాజిక భయం ఓ పక్క…” ఇలా అవిడ ఆవేదనను అంతా అక్షర రూపంలో బంధించింది లలితమ్మ.
”ఈ ఆధారాలు చాలు మోహన్‌రావుకు శిక్ష పడడానికి” అనుకుంది నమ్రత డైరీ మూసివేస్తూ.
నమ్రత సేకరించిన ఆధారాలను, అంజలి స్టేట్‌మెంట్‌కు జతచేసి ఎఫ్.ఐ.ఆర్ తయారుచేసి మోహన్‌రావును అరెస్ట్ చేయడానికి పోలీసు కారు ఎక్కాడు ఎ.సి.పి. కిరణ్.
కారుకి అడ్డంగా ఎద్దు రావడంవల్ల డ్రైవర్ అదేపనిగా హారన్ కొడుతుంటే ఈ లోకంలోనికి వచ్చిన కిరణ్ పక్కకు చూశాడు. ఎటో చూస్తూ నిర్లక్ష్య ధోరణిలో ఉన్నాడు మోహన్‌రావు.
”హు నూరు గొడ్లను తిన్న రాబందు కూడా ఒకే ఒక్క గాలివానకు సఫా… నీ ఆట కట్టింది మోహనరావ్…” స్వగతంగా అనుకున్నాడు కిరణ్. పోలీస్ కారు స్టేషన్ ముందు ఆగింది.