కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ చట్టాలు మహిళా రైతుల ప్రయోజనాలకు హాని కలిగిస్తాయి. ప్రభుత్వం వాటిని రద్దు చేయాలి, రాష్ట్రపతి తిరస్కరించాలి.
ఎపిఎంసి చట్టం, కాంట్రాక్ట్ వ్యవసాయ చట్టం, నిత్యావసర సరుకుల సవరణ చట్టం అనే ఈ మూడు చట్టాలు భారతదేశ వ్యవసాయ రంగంలో చిన్న, సన్నకారు రైతులు, కౌలు రైతులలో అత్యధిక శాతంగా ఉన్న మహిళా రైతులపై హానికరమైన ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇప్పటికే రైతులుగా గుర్తింపు లేక, భూమి, నీరు, అడవులు వంటి వనరులపై సమాన హక్కులు లేక, సాగుకు అవసరమైన రుణాలు, సబ్సిడీలు, బడ్జెట్‌లు మార్కెట్ సౌకర్యాలు వంటి మద్దతు వ్యవస్థలు అందుబాటులో లేక ప్రతికూల పరిస్థితిని ఎదుర్కొంటున్న మహిళా రైతులకు ఈ చట్టాలు మరింత నష్టాన్ని కలిగిస్తాయి. సాగుదారులుగా మహిళా రైతులు నష్టపోవడంతో పాటు మార్కెట్ ధరల అస్థిరత్వం కారణంగా వ్యవసాయ కూలీలుగా అధిక సంఖ్యలో ఉన్న మహిళల వేతనాలపై కూడా పరోక్ష ప్రభావం పడుతుంది. దాంతోపాటు ఈ చట్టాలు అటవీ ప్రాంతాలలో సహజ వనరులు, ఆహార సార్వభౌమత్వం, జీవ వైవిధ్యంపైన కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయి.
వ్యవసాయ సంక్షోభం తీవ్రతరంగా ఉన్న సందర్భంలో ఆ భారాన్ని అందరికంటే ఎక్కువగా మోస్తున్న మహిళా రైతులపై ఈ చట్టాలు తీవ్ర ప్రభావాన్ని కలిగిస్తాయి. ఇంతకు ముందటి కంటే మరింత ఎక్కువగా ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులకు అండగా ఉండి ఉపశమనం కలిగించాల్సిన సమయంలో ఈ మూడు చట్టాలను తీసుకొచ్చి తన బాధ్యత నుండి పక్కకు తప్పుకుంటోంది. ఈ చట్టాలు రైతులను సంక్షోభం నుండి బయట పడవేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోకపోగా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తాయి.
వ్యవసాయ మార్కెట్ యార్డులను నిర్వీర్యం చేసే మొదటి చట్టం రైతులు ఎక్కడికైనా తమ ఉత్పత్తులను తీసుకెళ్ళి అమ్ముకునే స్వేచ్ఛ కల్పిస్తుందని చెబుతున్నారు. కానీ రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు పెద్ద వ్యాపారస్థులతో పోటీ పడి దూరప్రాంతాలకు వెళ్ళి అమ్ముకునే పరిస్థితి లేదు. మహిళా రైతులు మార్కెట్ యార్డుల బయట ఎక్కువగా చిన్న వ్యాపారస్థులకు అమ్ముకుంటున్నారు. మార్కెట్ యార్డులు, కనీస మద్దతు ధర ఉన్నప్పుడు, మార్కెట్ బయట కొనుగోలు చేసే చిన్న వ్యాపారస్థులకు కూడా కనీస మద్దతు ధర ఒక కొలమానంగా ఉంటుంది. మార్కెట్ యార్డులు లేనప్పుడు వ్యాపారస్తులే ధరలు నిర్ణయించే పరిస్థితి ఏర్పడి మహిళా రైతులు మరింత నష్టపోతారు. దేశవ్యాప్తంగా మహిళా రైతులు ఉత్పత్తిదారుల సంఘాలుగా ఏర్పడుతున్నారు. వారు ఇప్పటికే ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం అందక తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకోవటంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వారికి సహాయం అందించే బదులు ఈ చట్టం వారిని పెద్ద కంపెనీలతో పాటు చేర్చి స్వయం ప్రతిపత్తి గల ఈ ఎఫ్.పి.ఓ లపై మితిమీరిన నియంత్రణ విధిస్తాయి.
రైతుల ఉత్పత్తుల అమ్మకాల గురించి ఒప్పందాలను చట్టబద్దం చేసే కాంట్రాక్టు వ్యవసాయ చట్టం, రైతులకు- కంపెనీలకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారాన్ని సివిల్ కోర్టుల పరిధి నుండి తీసివేసి ప్రభుత్వ అధికారులకు కట్టబెడుతోంది. పేద రైతుల వివాదాల పరిష్కారానికి అధికారుల చుట్టూ తిరగడం తలకు మించిన భారమవుతుంది. అత్యధిక శాతం రైతులు, ప్రత్యేకించి మహిళా రైతులు అక్షరాస్యత లేనివారు. వాళ్ళకి ఒప్పందాలను అర్థం చేసుకునే సామర్ధ్యం ఉండదు.
నిత్యావసర వస్తువుల సవరణ చట్టం పెద్ద కంపెనీలు చేసే నిల్వల పరిమితులను తొలగించడంతో అవి పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలను నిల్వ చేసి, మార్కెట్‌లో కొరత ఏర్పడినప్పుడు వాటిని అధిక ధరలకు అమ్ముకునే ప్రమాదముంది. దీని మూలంగా మొత్తంగా ఆహార ధాన్యాల ధరలు పెరిగి వినియోగదారులకు నష్టం కలుగుతుంది. ఇది పేద కుటుంబాలకు చౌక ధరలకు ఆహార ధాన్యాలను అందించే ప్రభుత్వ పంపిణీ వ్యవస్థకు గొడ్డలిపెట్టు అవుతుంది. పేద ప్రజల ఆహార భద్రతకు ముప్పు ఏర్పడుతుంది.
అందుకే మహిళా రైతుల హక్కుల వేదిక ప్రభుత్వాన్ని ఈ కింది డిమాండ్లను అమలు చేయాలని కోరుతోంది.
1. సంక్షోభంలో ఉన్న చిన్న, సన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలకు నగదు బదిలీ, రుణమాఫీ చెయ్యాలి. విత్తనాలు, మార్కెట్ సదుపాయాలు అందించటంపై దృష్టి పెట్టాలి.
2. రైతులకు కనీస మద్దతు ధరకు హామీ కల్పించే చట్టాన్ని తీసుకురావాలి.
3. వ్యవసాయ మార్కెట్ యార్డులలో సంస్కరణలు తీసుకొచ్చి మహిళా రైతులు మార్కెట్లను సులభంగా ఉపయోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలి.
4. స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీలలో మహిళా రైతులకు కనీసం 30% ప్రాతినిధ్యం కల్పించేందుకు ఒక కాలపరిమితితో ప్రణాళిక తయారుచేయాలి. దీనికోసం మహిళా రైతులు వ్యవసాయ మార్కెట్లలో ఎదుర్కొనే సమస్యలపై విస్తృత స్థాయి అధ్యయనం సాగించాలి.
5. వ్యవసాయ కూలీలకు ఉపాధి అవకాశాలను మెరుగు పరచటానికి జాతీయ ఉపాధి హామీ పథకంలో పనిదినాలను 200కు పెంచాలి.
6. చిరుధాన్యాలతో సహా అన్ని పంటలను వికేంద్రీకరించిన పద్ధతిలో సేకరించటానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలి.
7. మహిళా రైతుల ఉత్పత్తిదారుల సంఘాలకు ఈక్విటీ గ్రాంట్‌లు, తక్కువ వడ్డీకి పెట్టుబడులు అందించటం ద్వారా ఆ సంఘాలు పురోగతి సాధించేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించాలి. ఎఫ్.పి.ఓ లను వాణిజ్య కంపెనీలతో సమానం చేయకుండా స్వయం ప్రతిపత్తి సంఘాలుగా చూడాలి. వ్యవసాయ చట్టాల పరిధి నుండి తొలగించాలి.
8. అన్ని రకాల వైవిధ్యం గల పంటలకు గిట్టుబాటు ధరలను కల్పించేందుకు విడిగా చట్టాలను చేయాలి. పంటలకు చెల్లింపులన్నింటినీ భూమి యజమానికి కాకుండా వ్యవసాయ కుటుంబాలకు అందేటట్లు చర్యలు తీసుకోవాలి.
9. ప్రభుత్వ పంపిణీ వ్యవస్థను సార్వజనీనం చేసి చిరుధాన్యాలు, పప్పు ధాన్యాలను కూడా చౌక ధరలకు అందించాలి. ఇందుకోసం రైతులకు గిట్టుబాటు ధరలను అందిస్తూ వికేంద్రీకరించిన సేకరణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలి.
10. మహిళా రైతులు పండించే వైవిధ్యం గల మినుము, పెసర, నువ్వులు, ఉలవలు, సెనగలు తదితర పంటలను సేకరించి ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ, మధ్యాహ్న భోజన పథకం, అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసినట్లయితే వారికి మార్కెట్ హామీ కల్పించవచ్చు.