నైల్‌ నది – వేలూరి కృష్ణమూర్తి 

తమిళం: ఎస్‌.రామకృష్ణన్‌, మైసూరు

కన్నడం: నల్లతంబి

ఆ కారులో ఐదుమంది ఉన్నారు. మంచు మూసుకొన్న దారిలో కారు ముందుకు సాగిపోతోంది. కారులో ఉన్నవారిలో ఇద్దరు భారతీయులు. మిగిలిన ముగ్గురు ఉగాండాకు చెందినవారు. కారు నడుపుతున్నవాడు ఆ ఐదుగురిలో చాలా చిన్నవాడు. అతడి పేరు మువాంగా. అతనికి పద్దెనిమిదేళ్ళ వయసు. కానీ, అతడు మంచి దృఢకాయుడు. ఆరడుగుల కంటే ఎత్తైనవాడు. రాతి శిలవలె గడ్డ కట్టిన ముఖం. అతడు కారు నడుపుతుంటే ఒక యంత్రాన్ని నడుపుతున్నట్లుంది.

ఉగాండా తూర్పు ప్రాంతంలోని పుసోకావి ఉపప్రాంతమైన జింజావిలో ప్రవహించే నైల్‌ నది ఉన్న దిక్కుకు వారి ప్రయాణం సాగుతోంది. కంపాలా నుండి వారు ఆ దారి మార్గంగా ప్రయాణిస్తున్నారు. కారులో ఉన్న ఇద్దరు భారతీయులు, చాలా వయసైన వారు. ముప్ఫై ఏళ్ళ కంటే ఎక్కువగానే వారు ఉగాండా దేశం ప్రజలుగా ఉంటున్నారు.

నరేశ్‌ కిద్వాని వయసు డెబ్భై ఏళ్ళు దాటి ఉండవచ్చు. ఆయన తెల్లని ఖద్ధర్‌ టోపీ ధరించాడు. అదే తెల్లటి రంగు ఖద్దర్‌ జుబ్బా, పైజమా ధరించాడు. విశాలమైన నుదురు, తలనిండా నెరిసిన వెంట్రుకలు, అయినా దట్టంగా ఉన్నాయి. తన ముఖానికి సరిపోని పెద్ద కంటి అద్దాలు పెట్టుకొన్నాడు. ఆయనకు తోడుగా ఉన్న శుక్లాకు అరవై ఏళ్ళ వయసు ఉండవచ్చు. ఆ మనిషి పొట్టిగా ఉన్నాడు. నల్లని పెదాలు, దప్పంగా ఉన్న బొజ్జ, వంకరగా ఉన్న ముక్కు, అతడూ ఖద్దర్‌ వస్త్రాలనే ధరించాడు.

వారి ఒడిలో ఒక చెక్క పెట్టె ఉంది. దాన్ని వారు చాలా జాగ్రత్తగానూ, బాధ్యతాయుతంగానూ పట్టుకున్నారు.

శుక్లా, కిద్వాయి ఇద్దరూ తమలో తాము ఎక్కువగా ఏమీ మాట్లాడుకోవడం లేదు. తమకు ఇచ్చిన కర్తవ్యాన్ని సక్రమంగా చేసి ముగించాలని అనుకొన్న వారిలాగా కారులో కూర్చున్నారు. కారు మితమైన వేగంలో పోతోంది.

… … …

19వ శతాబ్దం ప్రారంభంలో సిక్కులు ఉగాండాకు కూలీలుగా పిలిపించుకోబడ్డారు. ఇంపీరియల్‌ బ్రిటిష్‌ వారు మధ్యవర్తి అలీభాయ్‌ ముల్లా జీవన్‌ జీ సహాయంతో, ఉగాండా రైల్వేను మొంబాసా నుండి కీకము వరకు 1901 లోనూ, 1931వ సంవత్సరంలో కంపాలాలోనూ నిర్మించారు. ఈ కఠినమైన రైలు మార్గాన్ని నిర్మించే కార్యంలో కొందరు భారతీయులు చనిపోయారు. కొందరు కాళ్ళూ, చేతులూ కూడా పోగొట్టుకున్నారు.

రైలు మార్గాన్ని నిర్మించి ముగించినంతనే కొన్ని కుటుంబాలు తమ ఒప్పందం ముగిసిందని భారతదేశానికి వెనుదిరిగాయి. మరికొన్ని కుటుంబాలు ఉగాండాలోనే నివసించడానికి నిర్ణయించాయి. వారు మాత్రమే కాక బట్టల వ్యాపారం చేయడానికి వచ్చిన గుజరాతీవారు అక్కడి ప్రజలుగా మారిపోయారు. వారిలో కొందరు భారతదేశ స్వాతంత్య్ర పోరాటానికి నిధులను సంగ్రహించి ఇవ్వడమే కాక భారతీయ ప్రజల కోసం ఒక ప్రత్యేక వార్తా పత్రికను కూడా నడిపేవారు.

కారు ముందు సీటులో కూర్చొని ఉన్న చార్లీకి యాభై ఏళ్ళు ఉండవచ్చు. గిరిజాల వెంట్రుకలు నిండుకొన్న తల. చిట్లిన క్రింది పెదవి. కనుబొమ్మను కత్తిరించినట్టు ఒక మచ్చ. వెడల్పాటి చెవులు. అతను కొంతకాలం పోస్టల్‌ శాఖలో ఉద్యోగం చేసినందున అక్కడి భారతీయులతో చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. చార్లీ కుటుంబం చాలా పెద్దది. అతనికి ఇద్దరు భార్యలు, తొమ్మిది మంది పిల్లలు.

చార్లీకి ఒకసారి భారతదేశానికి వెళ్ళి చూసి రావాలని కోరిక ఉండేది. దానికి ముఖ్యమైన కారణం భారతదేశ స్త్రీల సౌందర్యం. దాన్ని అతడు చాలా రసికతతో గమనించేవాడు. ఉగాండాలో నివసిస్తున్న భారతీయ స్త్రీల గుండ్రని ముఖాలు, వారు చీరను కట్టే విధానమూ అతనికి చాలా ఇష్టంగా ఉండేది. చార్లీకి తోడుగా కూర్చొన్న ఒబాడే అన్న యువకుడు కాలేజి విద్యాభ్యాసాన్ని మధ్యలోనే నిలిపేశాడు. అతనికి ఫుట్‌బాల్‌ ఆటలో ఆసక్తి ఎక్కువ. రాత్రింబవళ్ళు త్రాగడమే అతని బ్రతుకు. కారులోకి ఎక్కే ముందే, ప్రయాణించే సమయంలో మద్యపానం చేయకూడదని అతనికి గట్టిగా షరతు పెట్టారు. అయినా, అతను తన జేబులో ఒక చిన్న మద్యం సీసాను ఉంచుకున్నాడు. కానీ, దాన్ని బైటికి తీయలేదు. వారు నైల్‌ నది వైపునకు ఎందుకు ప్రయాణిస్తున్నారని ఒబాడే అడగలేదు. అతనికి ఈ ప్రయాణం అసహనంగా ఉంది. చార్లీ బలవంతం మీద అతను ఈ ప్రయాణానికి అంగీకరించాడు. అతనికి నదిలో నావను నడపడం తెలియడంవల్ల అతన్ని తమవెంట తీసుకువచ్చారు వాళ్ళు.

శూన్యంలోకి చూస్తూ ‘ఇంకా ఎంత దూరముంది?’ అని అడిగాడు కిద్వానీ.

‘నది దగ్గరికి చేరుకోవడానికి రెండు గంటల సమయం పట్టవచ్చు’ అన్నాడు చార్లీ.

ఒబాడే అసంతృప్తితో ‘శవం మెరవణి పోతున్నట్లు, కారు ఇంత నిదానంగా పోతోంది. ఇలా వెళ్తే నది దగ్గరికి చేరుకునే సరికి మధ్యాహ్నమవుతుంది’ అన్నాడు.

‘ఇది కూడా ఒక శవం మెరవణే’ అన్నాడు శుక్లా.

ఒబాడేకు వారు చెప్పిన మాటల అర్థం తెలియలేదు. అతడు చార్లీని చూసి అడిగాడు ‘నిజంగా మనం నైల్‌ నది దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము. అక్కడ నాకేం పని?’

‘నదిలో అస్థికలను విసర్జించడానికి నావ నడపాలి. అదే నువ్వు చేయాల్సిన పని’ అన్నాడు చార్లీ.

‘నాకు ఆకలిగా ఉంది. తలనొప్పిగా కూడా ఉంది. వయసైన వారితో ప్రయాణం చేయడమంటే చనిపోయిన ఆవుకు కావలి కాచినంత బేజారు కలిగించేటటువంటిది’ అన్నాడు ఒబాడే.

కిద్వాని శాంత స్వరంతో ‘అందరూ ఒకరోజు ముసలివారైపోతారు. అప్పుడు నువ్వు ముసలితనం బాధను అర్థం చేసుకుంటావు’ అన్నాడు.

‘మేము వయసును లెక్కచేయం. వయసును లెక్కించడం పరంగీవాళ్ళు ఒడ్డిన తంత్రం. మా దేహంలో ప్రవహించే రక్తం వేడిగా ఉండేవరకూ మేము యవ్వనం నిండుకున్న వాళ్ళమే’ అన్నాడు చార్లీ.

దాన్ని ఆమోదిస్తున్నట్లు ఒబాడే అన్నాడు, ‘మేము ఆకాశంలోని మేఘాలలాంటి వారం. మేఘాలకు ఎప్పటికీ యవ్వనం నిండి

ఉంటుంది కదా! మనిషిని విడిచి ఏ ప్రాణీ తన వయసును లెక్కపెట్టదు’.

‘అదలా కాదు. చెట్టకు కూడా వయసవుతుంది. చెట్ల చెక్కలను చూచి దాని వయసును లెక్క వేస్తారు’ అన్నాడు కిద్వానీ.

‘భారతీయులకు గణితంలో చాలా ఆసక్తి’ అన్నాడు చార్లీ.

‘ఒకటి, రెండు, మూడు, నాలుగు… తర్వాత అంతా గుంపే. అంత మాత్రం లెక్కలు తెలుసుకుంటే చాలు’ అంటూ నవ్వాడు ఒబాడే.

‘నీ నవ్వును ఆపు. కొంచెం నోరు మూసుకుని ఉండు’ అని కొంచెం కోపంగానే అన్నాడు శుక్లా.

దారిలో ఉన్న గుంతలోనికి కారు దిగి, ఎక్కినందువల్ల వారివద్ద ఉన్న చెక్క పెట్టె కదలడంతో బిడ్డను పట్టుకున్నట్లు శుక్లా దాన్ని చాలా జాగ్రత్తగా, భద్రంగా పట్టుకున్నాడు.

‘ఈ పెట్టెలో ఉన్నది చనిపోయిన మనిషి బూడిదా?’ అని ప్రశ్నించాడు ఒబాడే.

‘ఔను. మహాత్మాగాంధీ గారి అస్థికలు ఇవి’ అన్నాడు కిద్వాని.

‘ఎవరు మహాత్మాగాంధీ, మీ తండ్రా?’ అన్నాడు ఒబాడే.

‘కాదు. భారతదేశానికి తండ్రి. కోట్ల మంది భారతీయులు ఆయనను తండ్రి అనే పిలిచారు’ అన్నాడు శుక్లా.

‘ఒక మనిషి భారతదేశం మొత్తానికి తండ్రి కావడం ఎలా సాధ్యం?’ అని అయోమయంతో ప్రశ్నించాడు ఒబాడే.

‘ఆయన అందరికీ తండ్రిలా నడుచుకొన్నాడు. తండ్రి అన్నది బాధ్యతకు సంకేతం. ఎలాంటి ప్రత్యుపకారం ఆశించకుండా ప్రేమించే మార్గం. ఏసు ప్రభువును మీరు తండ్రిగా కదా గుర్తించేది!’ అని అన్నాడు శుక్లా.

‘ఆయన దేవుడు’ అన్నాడు చార్లీ.

‘ఈయన దేవుడిలాంటి మనిషి’ అన్నాడు కిద్వాని.

‘చనిపోయిన మనిషి బూడిదను నదిలో ఎందుకు కలుపుతారు?’ ప్రశ్నించాడు ఒబాడే.

‘చనిపోయిన తర్వాత ఆ మనిషి ప్రపంచానికి చెందుతాడు. అతని బూడిదను ప్రపంచంలోని ముఖ్యమైన నదులలో కలపడం వల్ల జగత్తుకు వారిని మరలా ఒప్పించినట్లవుతుంది. ఈ నదులు ఉండేవరకూ వారి జ్ఞాపకాలు ఉంటాయి కదా?’ అన్నాడు శుక్లా.

‘నదులకు జ్ఞాపకాలుండవు’ ఆన్నాడు ఒబాడే.

‘నది తన జ్ఞాపకాలను వడగండ్ల మీద వ్రాస్తుంది’ అన్నాడు చార్లీ.

‘నిజమే సరిగ్గా చెప్పారు. వడగండ్లలో ఉన్నవి నది జ్ఞాపకాలే’ అన్నాడు అద్వాని.

‘గాంధీ ఎప్పుడైనా నైల్‌ నదిని చూశారా?’ అని ప్రశ్నించాడు ఒబాడే.

‘లేదు. ఆయన బూడిదే నదిని అర్థం చేసుకోవడానికి బయల్దేరింది’.

‘తన జీవిత కాలంలో చూడని నదిని జీవితం ముగిసిన తర్వాత అర్థం చేసుకోవడం విచిత్రం’ అన్నాడు చార్లీ.

‘ఢిల్లీలో ఆయనను హత్య చేశారు. అక్కడే ఆయన అంతిమ సంస్కారం జరిగింది. దక్షిణాఫ్రికాకు గాంధీ అస్థికలను పడవలో తీసుకుని వచ్చారు. గాంధీ కుటుంబానికి స్నేహితులైన విలాస్‌ మెహతా వాటిని పొంది, ప్రత్యేకమైన ప్రార్థనలకు ఏర్పాటు చేశారు. వారినుండే ఈ అస్థికలను మేము పొందాము. మాకు ఇచ్చిన ఆదేశం గాంధీ అస్థికలను నైల్‌ నదిలో కలపాలని. ఇక్కడ మాత్రమే కాదు, ప్రపంచంలోని ఎన్నో నదులలోనూ, సముద్రాలలోనూ గాంధీ అస్థికలను కలిపారు’ అన్నాడు కిద్వాని.

‘మీరు గాంధీని నేరుగా చూశారా?’ అని ప్రశ్నించాడు చార్లీ.

కారు ఒక మలుపులో తిరుగుతున్నప్పుడు ఒక స్త్రీ రెండు కుక్కలను గొలుసుతో కట్టి పట్టుకొని నడుచుకుంటూ పోతోంది. వాలిపోయిన పై కప్పు గుడిసెలున్న ఒక చిన్న పల్లె కనపడింది. ఉగాండాలోని పల్లెలు కూడా భారతదేశంలోని పల్లెల మాదిరిగానే ఉంటాయి.

‘గాంధీని ఫోటోలో మాత్రమే చూశా. ఆయన స్వరం ఎలా ఉంటుందో కూడా తెలియదు’ అన్నాడు శుక్లా.

‘ఒక్కసారి కూడా నేరుగా చూడని గాంధీని, బూడిదగా ఒడిలో ఎలా ఉంచుకున్నారు. గాంధీగారి తూకాన్ని అనుభవిస్తున్నారా?’ ప్రశ్నించాడు ఒబాడే.

‘గాంధీ ఇప్పుడు తూకం లేనివారయ్యారు’ అన్నాడు శుక్లా.

‘బూడిద భారాన్ని మనవల్ల కొలవడానికి సాధ్యం కాదు. ప్రాణంతో ఉన్న మనిషి చేయలేని దాన్ని కూడా చనిపోయిన మనిషివల్ల చేయించి ముగించడానికి సాధ్యం. చనిపోయిన వారి గురించి తేలికగా భావించకు’ అన్నాడు చార్లీ.

‘అది కూడా నిజమే. ఒక మనిషి చావు అతడి దేహానికి మాత్రమే ముగింపును ఇస్తుంది. అతడు చేసిన మంచి కార్యాలు ప్రపంచంలో చాలా కాలం జీవించి ఉంటాయి. వారి భావనలను, వారు చేసిన కార్యాలను అనుసరించే చివరి మనిషి ఉండేవరకూ ఆ మనిషికి మరణం ఉండదు. గాంధీ కూడా అలాంటివారే’ అని దృఢమైన స్వరంతో అన్నాడు శుక్లా.

‘గాంధీ భారతదేశానికి ఏం చేశాడు?’ అని అడిగాడు ఒబాడే.

‘మంచి ధర్మం, ప్రేమ, అహింస… భారతీయుల సహజమైన గుణాలన్న వాటిని ఆయనే గుర్తించి ప్రపంచానికి చూపారు. భారతీయుల మనఃసాక్షితో మాట్లాడిన ఒకే ఒక మనిషి ఆయన. ప్రపంచంలోని ఏ దేశంలోనైనా కోట్లానుకోట్ల ప్రజల చేత ప్రేమించబడిన ఒక నాయకుడు తన శౌచాలయాన్ని తానే శుభ్రం చేశాడా? నడుముకు క్రింద మాత్రమే ఎవరైనా సగం వస్త్రం ధరించాడా? ఆయన చేసిన పోరాట రూపాలు, దానికి ముందు భారతదేశం కనీవినీ ఎరుగనివి. ఆయన ప్రేమను పోరాటానికి ఆయుధంగా చేసుకొన్నారు. బ్రిటిష్‌ ప్రభుత్వం దాన్ని చూసి బెదిరిపోయింది. సామాన్య ప్రజల ధ్వనిగా వారు ఎల్లప్పుడూ ధ్వనించారు. గాంధీ పోరాటం దక్షిణాఫ్రికాలోనే ప్రారంభమైంది. ఆయన ప్రజల సౌహార్ద్రం కోసమే పోరాడి జైలుకు వెళ్ళారు’

దీన్ని విన్న ఒబాడే ముఖం వాడిపోయింది.

‘ఆయన నల్లని మనిషా?’ అని అడిగాడు ఒబాడే.

‘నల్లనివాడు, కానీ భారతీయుడు’ అన్నాడు శుక్లా

‘ఆయన ఏ ఆయుధాన్నీ ఎత్తకుండా ఎలా పోరాడాడు?’ విస్మయంతో అడిగాడు చార్లీ.

‘అహింసే ఆయన మార్గం’ అన్నాడు కిద్వాని.

అంతవరకూ అందరి మాటలూ వింటూ మౌనంగా కారు నడుపుతున్న మువాంగా మెల్లని ధ్వనిలో అడిగాడు ‘ఆయనేమీ దేవదూత కాదు కదా?’

‘దేవదూతలూ పుట్టినప్పుడు మనుష్యులే’ అన్నాడు కిద్వాని.

‘గాంధీ ఎలా మరణించారు? అనారోగ్యంతోనా?’ అని ప్రశ్నించాడు మువాంగా.

‘లేదు. కాల్చి చంపబడ్డారు’ అన్నాడు శుక్లా.

‘బ్రిటిష్‌ వారిచేతా?’ అడిగాడు ఒబాడే.

‘కాదు, మరొక భారతీయుడే అతన్ని కాల్చి చంపాడు’ వ్యథతో కూడిన స్వరంతో అన్నాడు శుక్లా.

‘విచిత్రంగా ఉందే. భారతదేశపు తండ్రిని ఒక భారతీయుడే ఎందుకు చంపాడు?’

‘అదే మాకూ అర్థం కావడంలేదు’ అన్నారు కిద్వాని. ‘ప్రార్థనకు వెళ్ళే దారిలో ఆయన హత్య చేయబడ్డారు. ఆయనను చంపిన వ్యక్తి కూడా చేతులెత్తి నమస్కరించిన మీదటే తుపాకిని ఎత్తాడు’

‘హంతకుడు ఆయనకు ఎందుకు నమస్కరించాడు?’ అని అయోమయం నిండిన ముఖంతో అడిగాడు ఒబాడే.

‘అతడికీ ఆయన తండ్రే కదా’ అని తగ్గు స్వరంతో అన్నాడు శుక్లా.

‘వింటుంటే దుఃఖం కలుగుతోంది. మంచి మనుష్యులు ఎందుకు అన్యాయంగా చంపబడుతున్నారు? ఏసు ప్రభువుకు కూడా ఇలా అయింది కదా?’ అన్నాడు మువాంగా.

శుక్లా ఏదో చెప్పడానికి ప్రయత్నించాడు. కానీ, మాట్లాడలేక అతని కంటినుండి కన్నీళ్ళు కారసాగాయి.

దాన్ని చార్లీ గమనించి ఉండవచ్చు. ఒబాడేను చూస్తూ మౌనంగా ఉండమని సంజ్ఞ చేశాడు.

కారు మెల్లిగా పోసాగింది. కారు నడుపుతున్న మువాంగా అడిగాడు ‘మహాత్ముడి ఫోటో మీ వద్ద ఉందా? నాకొకసారి దాన్ని చూడాలని ఉంది’.

‘నది వద్దకు వెళ్ళగానే ఖచ్చితంగా చూపిస్తాను’ అన్నాడు శుక్లా.

‘నైల్‌ నది దేవుడు చెప్పిన అసత్యం వల్ల సృష్టించబడింది. ఆ విషయం మీకు తెలుసు కదా?’ అన్నాడు చార్లీ.

‘ఇదేమిటి! క్రొత్త కథ?’ అన్నారు కిద్వాని.

‘ఔను. నైల్‌ నది సృష్టికి సంబంధించిన ఒక కథ ఉంది. జీయస్‌ అనే గ్రీకు దేవుడికి హీరా అన్న అందమైన భార్య ఉండేది. ఆమె కన్నుల నుంచీ ఎవరూ దేన్నీ దాచి ఉంచడానికి సాధ్యమయ్యేది కాదు. జీయస్‌ ఒకసారి లో అన్న యువతిని కలిశాడు. ఆమెపై అతనికి ప్రేమ కలిగింది. ఈ విషయాన్ని భార్య నుండి దాచి ఉంచడానికి ఎన్నో తంత్రాలను చేశాడు. అసత్యం చెప్పాడు. దీన్ని తెలుసుకున్న హీరా, లో అనే ఆ యువతిని ఎడారికి తరిమివేసింది. ఎప్పుడూ అసత్యం చెప్పని జీయస్‌ అసత్యం చెప్పిన కారణం వల్ల ఉధృతంగా వర్షం పడింది. సంవత్సరాలకొద్దీ అలా వర్షం పడి ఆ నీళ్ళన్నీ ఒక పెద్ద కొలనుగా తయారయింది. ఎడారిలో ఉన్న లో కోసం ఆ నీళ్ళు ఒక నదిగా ప్రవహించసాగింది. అదే ఈ నైల్‌ నది’ అని చెప్పాడు చార్లీ.

‘అన్ని నదులకూ ఇలా ఏదైనా ఒక విచిత్రమైన కథ ఉంటుంది’ అన్నాడు శుక్లా.

‘కథలు లేని నదులే లేవు. వర్షం అనేది దేవుడు కార్చే కన్నీళ్ళు కదా?’ అన్నాడు కారు నడుపుతున్న మువాంగా.

‘దేవుడెందుకు కన్నీళ్ళు కారుస్తాడు?’ అడిగాడు కిద్వాని.

‘మనుషులు చేస్తున్న పనులను చూసే. మరేమిటి!’ అన్నాడు మువాంగా.

‘మనుషులు చేస్తున్న పనులను చూసి గాంధీ ఊరికే కన్నీళ్ళు కార్చలేదు. మనుషుల దుఃఖాల్ని తుడిచి వేయడానికి బయలుదేరారు. గాలిలాగా పూర్తి భారతదేశాన్ని వ్యాపించారు. సరళతే వారి శక్తి’ అన్నాడు కిద్వాని.

‘మీరు మాట్లాడడం వింటుంటే ఆ మనిషిపై చాలా గౌరవం కలుగుతోంది’ అన్నాడు మువాంగా.

‘నీలాగానే మేము కూడా ఆయనను ప్రేమించాము. ఆయన మార్గంలో నడిచాము. ఆయన కార్యాలను అనుసరించాము. ఆయన మరణం మమ్మల్ని కలచివేసింది’ అన్నాడు కిద్వాని.

‘గాంధీ చంపబడకుండా ఉండాల్సింది’ దృఢమైన స్వరంతో అన్నాడు మువాంగా.

‘గాంధీతో కలిసి ఆయన బోధించిన నీతులను, ధర్మాన్ని పాతిపెట్టడానికి చూస్తున్నారు. అదే నాకు చింత కలుగుతోంది’ అన్నాడు కిద్వాని.

‘ఇకముందు భారతదేశం ఏమైపోతుందోనని తలచుకుంటే భయమేస్తోంది’ అన్నాడు శుక్లా.

‘నెహ్రు ఆయనను స్వతంత్రంగా కార్యనిరతులు కావడానికి వదలరు’ అన్నాడు కిద్వాని.

‘గాంధీ స్థానాన్ని ఎవరితోనూ నింపడానికి సాధ్యం కాదు. గాంధీ ముందు దేహంతో ఉండేవారు. ఇకమీదట వెలుగుతో ఉంటారు’ అన్నాడు శుక్లా.

‘మీరు చాలా బాగా చెప్పారు. గాంధీ వెలుగు కదా? వెలుగు ప్రపంచానికంతా చేరింది కదా? ఒక్కొక్క దేశానికి ప్రత్యేకమైన వెలుగు అన్నదేమైనా ఉంటుందా?’ అని ప్రశ్నించారు కిద్వాని.

దీని తర్వాత వారెవరూ మాట్లాడలేదు. నది ఉన్నవైపు కారు ప్రయాణించసాగింది. ఒకచోట కారును ఆపి అందరూ నడక ప్రారంభించారు. నది ఒడ్డున కొన్ని నివాస స్థలాలు కనిపించాయి.

‘గాంధీ అస్థికలున్న పెట్టెను నేను మోసుకురానా?’ అడిగాడు మువాంగా.

శుక్లా ఒక్క నిమిషం ఆలోచించాడు. అనంతరం ఆ పెట్టెను మువాంగా భుజం మీదకు మార్చాడు.

‘మనం గాంధీ గారిని మోసుకొని పోతున్నాం’ అన్నాడు చార్లీ.

వారందరూ మౌనంగా నడిచారు.

‘గాంధీ దేహానికంటే వారి అస్థికల భారం అధికంగా ఉండవచ్చు. కారణం, ఆరు కోట్ల భారతీయుల కన్నీటిని నింపుకొని ఉంది కదా!’ ఆన్నాడు శుక్లా.

మువాంగా నది ఒడ్డు వరకూ ఆ అస్థికలను మోసుకొని వచ్చాడు. వారు ఒక నావలోనికి ఎక్కి నైల్‌ నదిలో ప్రయాణాన్ని ప్రారంభించారు. నురగలు నిండిన ప్రవాహంలా పారుతున్న నైల్‌ నది… తెలుపు, పచ్చని నీళ్ళు… సముద్రంలా పొంగి ఎగురుతున్నట్లుంది. నది వేగానికి ఆ నావ అల్లాడుతూ ముందుకు సాగింది. నది మధ్యలో నావను నిలిపి శుక్లా చెక్క పెట్టెలో ఉన్న కంచు కలశమొకదాన్ని బయటికి తీశాడు. దాన్ని తన చేతితో పట్టుకుని కళ్ళకు హత్తుకున్నాడు. చార్లీ, కిద్వాని, మువాంగా దానికి నమస్కరించారు. కంచు కలశంలో ఉన్న గాంధీ అస్థికలను వారు ఆ నది నీటిలో కలిపారు. గాలి వేగానికి అస్థికల బూడిద ఎగిరి మువాంగా కన్నులను తాకింది. అతడు దాన్ని చెరపలేదు. ప్రపంచంలోని అత్యంత పెద్ద నదిలో గాంధీ కలిసిపోయారు. ఎంతోమంది సామ్రాట్టులనూ, రాజ్యాలనూ చూసిన నైల్‌ నది మహాత్ముడిని తనలో కలుపుకొని ప్రవహింపసాగింది.

వారు కారు వద్దకు వెనుదిరిగి వచ్చినప్పుడు మెల్లని స్వరంతో మువాంగా అన్నాడు ‘తండ్రిని చంపడం పెద్ద పాపం. మీలో దాని గురించి పాప భీతి లేదా?.

శుక్లా ముఖంలో గందరగోళం ప్రారంభమైంది.

‘గాంధీ వెలుగే భారతదేశాన్ని కాపాడాలి’ అన్నాడు.

దాన్ని ఆమోదిస్తున్నట్లు దూరంగా ఒక చెట్టు నుండి ఒక పక్షి కూత పెద్దగా వినపడింది.

Share
This entry was posted in గల్పికలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.