మమతల మల్లెలు – శ్రీలత అలువాల

మల్లెల సువాసనలను తన కథల ద్వారా వెదజల్లాలని ఆకాంక్షిస్తూ డా||తాళ్ళపల్లి యాకమ్మ గారు కథా రచనను మొదలు పెట్టారనిపిస్తుంది. తన అనుభవాలను రంగరించి పాఠకులకు తమ జీవితంలోని సంఘటనలను గుర్తుచేసే విధంగా ఈ కథలు కొనసాగుతాయి. అణగారిన వర్గంలో పుట్టిన దళిత బిడ్డగా, ఒక సగటు మహిళగా తన జీవితాన్ని సఫలీకృతం చేసుకోవడానికి తాను పడ్డ కష్టాలు, బాధలు, ఆవేదనలు ఈ కథలలో కనిపిస్తాయి. ఈ పుస్తకం మొత్తం 11 కథలతో రూపుదిద్దుకుంది. ఒక్కొక్క కథ కొన్ని వేల ఆలోచనలను రేకెత్తిస్తూ ముందుకు సాగుతుంది. ఇందులోని మొదటి కథ పుస్తకానికి హృదయం లాంటిది ”మమతల మల్లెలు”. ఈ కథలో రచయిత దళిత కుటుంబంలోని పరిస్థితులు, అనుబంధాలను ఎంతో గొప్పగా చిత్రీకరించారు. సంపాదనతో నిమిత్తం లేకుండా ఉన్నదాంట్లో తృప్తిగా జీవించే కుటుంబం. ఒక తండ్రికి, కూతురికి మధ్య ఉన్న ప్రేమ, అక్క చెల్లెళ్ళ మధ్య ఉన్న అనురాగం, అన్నాచెల్లెళ్ళ అనుబంధం, భార్యాభర్తల బంధం చాలా ఆత్మీయంగా చిత్రీకరించారు. మార్పును స్వీకరిస్తున్న దళిత కుటుంబాన్ని ఆవిష్కరించారు. తండ్రి తన బిడ్డలను చదివించాలని, పనికి తీసుకెళ్ళకుండా బడికి పంపడం, గుడిసె అయినప్పటికీ ఇంటి చుట్టూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం, రకరకాల చెట్లతో అందంగా అలంకరించుకోవడం వంటివన్నీ చైతన్యంతో అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న భావనలు ఆ కుటుంబంలో మనకు కనిపిస్తాయి. తల్లిదండ్రులు ఎంత కష్టం చేసినా బిడ్డల కడుపు నింపడానికి ఎంత ఆరాటపడతారో అర్థమవుతుంది. తాము కడుపు కట్టుకుని మరీ బిడ్డల కడుపు నింపుతారు. నాన్న తువ్వాలులో మడిచి తెచ్చిన కొబ్బరిముక్క, అమ్మ చేయించిన అప్పాలు అందుకు నిదర్శనం. అంతేకాకుండా ఆడబిడ్డను ఆదరించడం ఇంకో గొప్ప అంశం. సంసారాలు చక్కదిద్దుకోకుండా గొడవలతో ఎన్నో సంబంధాలు కుప్పకూలిపోతున్నాయి. అలాంటిది ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎంత మర్యాదగా, ప్రేమగా చూసుకున్నారో చక్కగా వివరించారు.

మల్లెపూల కోసం ఎంతగానో మంకుపట్టు పట్టి, పెంకితనం చూపిన అమ్మాయి తాను పెరిగాక మల్లెచెట్టు విరబూస్తే పూలు కోయబుద్ధి కావడం లేదని పూల పరిమళాలను నాన్న జ్ఞాపకాలుగా గుర్తు చేసుకుంటూ తనకు నాన్నపై ఉన్న ప్రేమను చూపిస్తూ కథ ముగించారు.

‘మౌనసాక్షి’ కథలో పాఠకులను కన్నీళ్ళు పెట్టించారు రచయిత. సగటు ఆడబిడ్డ పడే కష్టాలు కళ్ళకు కట్టినట్లు చూపించారు. పేదరికంలో పుట్టిన బిడ్డల తల్లిదండ్రుల ఆలోచనలు ఎలా ఉంటాయో వివరించారు. ఆడపిల్ల పెళ్ళిచేస్తే భారం తగ్గుతుందనే ఆలోచిస్తారు తప్ప అల్లుడి గుణగణాలు తెలుసుకోకుండా పెళ్ళిచేస్తే ఎన్ని కష్టాలు పడాల్సి వస్తుందో ఆలోచించరు. తెలివి ఉన్నా, ఆర్థికంగా స్థిరపడినా మగవాడి శారీరక బలం ముందు మౌనం వహించక తప్పలేదు. ఎన్ని ఇబ్బందులు పడినా తన సంసారాన్ని కాపాడుకోవడానికి, మౌనాన్ని సమాధానంగా ఎన్నుకొంది సీత. మరణ వాంగ్మూలం దగ్గర నుండి పరివర్తన చెంది బిడ్డ కోసం బ్రతకాలి అనే అగ్రిమెంట్‌ రాసుకునే దిశగా ఆలోచన సాగించింది. సామాన్య దిగువ మధ్య తరగతి కుటుంబాలలోని సంసార జీవితాన్ని చాలా చక్కగా వివరించారు. అందులో వచ్చే ఒడిదుడుకుల్ని కంటికి దగ్గరగా చూపించారు. ఎంత చదివినా, ఆర్థిక బలం ఉన్నా ఆడదానికి, తప్పు చేసిన భర్తకు ఎదురు తిరిగే శక్తి, హింసించే ఆడబిడ్డలను శాసించే అర్హత ఉండదు. అదే అర్థం చేసుకున్న భర్తను పొందితే ఆడబిడ్డలు కూడా అర్థం చేసుకుని మసలుకుంటారు. మొదటి కథలో ఆడబిడ్డ ఇంటికి వస్తే ఎంతో ఆనందంతో నిండింది ఇల్లు. కానీ ఈ కథలో ఆడబిడ్డలు, భర్తలు ఇలా కూడా ఉంటారు అనే విషయాన్ని గుర్తుచేశారు. ఎలా ఉన్నా కుటుంబం నిలబడాలంటే ఎవరో ఒకరు సర్దుకుపోవాలి. కథలో సీత మౌనంగానే అన్నీ భరిస్తూ తన కూతురు కోసం బ్రతకాలనుకుంటుంది. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం ఉంటుంది. చావడం సరైన పరిష్కారం కాదని ఏదో ఒక ఆశతో బ్రతుకు ముందుకు సాగాలని వివరించారు. సీత పెళ్ళి తర్వాత కష్టపడి చదువుకుని ఉద్యోగం సంపాదించినా భర్తతో కలిసి ఉండడమే సబబని ఆలోచించింది. ఒకవేళ బయటకు వస్తే సమాజంలో ఇంతకంటే ఎక్కువ ఎదురుదెబ్బలు తగులుతాయనే ఆలోచన చేసినట్లు తోస్తుంది. కూతురుని చూసుకుంటూ భర్త ఎన్ని కష్టాలు పెట్టినా, ఆడపడుచులు ఎన్ని ఆరళ్ళు పెట్టినా మౌనసాక్షిగా తనను తాను భరిస్తూ కాలం వెళ్ళదీసే కథానాయికను సృష్టించారు రచయిత్రి. పాఠకులకు ఎందుకు ఇన్ని కష్టాలు పడడం బయటకు వచ్చి బంగారంలా బ్రతకవచ్చు కదా అనిపిస్తుంది. కానీ రచయిత కుటుంబ వ్యవస్థకు ఇచ్చిన గౌరవం, ఆడపిల్లల తల్లిదండ్రులకు సమాజంలో హోదా కోసం మౌనంగానే అన్నీ భరించినట్లు కథను చిత్రించారు. తల్లిదండ్రులుండీ తనే ఇన్ని బాధలు పడితే రేపు తన బిడ్డకు తల్లి లేకపోతే ఇంకా ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో అని భవిష్యత్తును ఆలోచించి, భరించాలని నిర్ణయించుకుని తన సమస్యలను కాలానికే వదిలివేసింది సీత.

”అడుగడుగునా సుడిగుండం”లో ఆడపిల్ల పుట్టిన దగ్గర్నుండి ఎదుర్కొనే సమస్యలను వివరంగా తన అనుభవంలోకి వచ్చిన అన్ని సమస్యలను దగ్గరనుంచి చూపించే ప్రయత్నం చేశారు రచయిత్రి. తల్లిదండ్రుల దగ్గర్నుండే ఆడపిల్లకు ఆంక్షలు మొదలౌతాయి. కొద్దో, గొప్పో స్వేచ్ఛ దొరికినా ఎన్నో హద్దులు. చిన్నతనంలో పెళ్ళి, భర్త ఆరళ్ళు, ఎలాగోలా చదువుకుని ఉద్యోగం సంపాదించినా సమాజంలోని మగమహారాజులతో వచ్చే ఇబ్బందులను కళ్ళముందుకు తీసుకువచ్చారు. కథ చివరలో నాయిక అమ్మతో చెప్పించిన మాటలు ”ఆడపిల్లకు అడుగడుగునా సుడిగుండమే. వాటిని దాటుకుని జీవితాన్ని నిలబెట్టుకోవాలి. పంతానికి పోయి సంసారం పాడుచేసుకోవద్దు బిడ్డా” అని. ఏది ఏమైనా ఆడపిల్ల జీవితంలో అమ్మల మాటలు ఎంత బలంగా నాటుకుపోతాయో అని తెలిసింది.

”గురుబ్రహ్మ” కథలో రచయిత్రి తన కుటుంబాన్ని, ఉద్యోగ బాధ్యతను నిర్వహిస్తూనే ఎమ్‌.ఫిల్‌ చేసిన అనుభవాలను వివరించారు. ఎంతో అమాయకత్వం నిండి క్రమక్రమంగా చైతన్యంవైపు దూసుకెళ్తున్న మహిళకు ఆసరాగా గురువు తోడ్పాటు ఎంత అండగా నిలిచిందో ఈ కథలో తెలుస్తుంది. విద్యపైన ఉన్న ఆపేక్షతో ఎమ్‌.ఫిల్‌ చేస్తూనే సైట్‌, నెట్‌లలో ఉత్తీర్ణత సాధించడం, తర్వాత వెంటనే పిహెచ్‌డిలో చేరడం, పూర్తి చేయడంలో తన గురువు సహకారాన్ని వివరించారు. గురువు స్థానాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుతూనే తానూ అంతటి స్థానాన్ని చేరుకుంది.

ఒక ఉద్యోగస్తురాలైన మహిళ తల్లిదండ్రులను చూసుకోవడం కోసం తన వ్యక్తిగత జీవితాన్ని కూడా త్యాగం చేయడానికి వెనుకాడదు. అవసాన దశలో తన తల్లిదండ్రులను చూసుకోవడానికి భాగస్వామి అవసరం తప్పనిసరి. అందుకు ఎలాంటి వాడిని ఎంచుకోవాలి అనే అంశంపై స్పష్టమైన అవగాహన, ఆలోచన ఉంటుంది. దాని ప్రకారం తన జీవితాన్ని ఎలా చక్కదిద్దుకుందో తెలిపారు. ‘నిండు చందమామ’ అందరికీ సమానంగా వెన్నెలలు పంచినట్లు చైతన్యంతో ముందుకు దూసుకెళ్ళే మహిళ తన జీవితంలో వెలుగు ఎలా నింపుకుంటుందో స్ఫష్టంగా చూపించారు. ఉస్మానియా క్యాంపస్‌లో పి.జి. చేయడానికి వెళ్ళిన అమాయకురాలైన, పల్లెటూరి దళిత మహిళ అనుభవాలు, ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విజయాలు, విప్పారిన చైతన్యం, పొందిన స్నేహబంధం గురించి గొప్పగా వివరించారు. మహిళల గొప్పతనాన్ని చాలా చక్కగా వివరించారు. ఎటువంటి వాళ్ళయినా యూనివర్శిటీ క్యాంపస్‌లో అడుగుపెట్టి బయటకు వచ్చే సమయానికి విరబూసే మొగ్గల్లాగా అందరికీ సువాసనలు వెదజల్లే స్థాయికి ఎదుగుతారని అక్కడి జ్ఞాపకాలు, బంధాలు, జీవితాంతం గుర్తుండిపోతాయని నెమరు వేసుకున్నారు. ”తెలంగాణ పల్లెల్లో ఉన్న కులాల ప్రస్తావన” మరియు వాటి గొప్పదనాన్ని వివరించారు. పల్లెల్లో నివసించి కష్టం చేసుకుని బ్రతికే ప్రతి ఒక్కరూ అసామాన్యులుగా కొనియాడారు. సమాజం ముందుకు సాగాలంటే అన్ని కులాలు, అన్ని మతాలు కలిసి పనిచేస్తేనే సాధ్యమవుతుంది. పల్లెల అవసరం ఎంత ఉందో నేటి తరానికి తెలిపారు. ‘అపరంజి’ కథలో చాలాకాలం తర్వాత ఎదురుచూడగా పుట్టిన బిడ్డపై చూపిన తల్లి ప్రేమ. ఒక ఆడది తల్లి కావడానికి పడే తాపత్రయం అంతా ఇంతా కాదు. తల్లి కాకపోతే సమాజం చూసే చిన్నచూపు. బిడ్డను కని తల్లి అయిన తర్వాత కాలం కలిసిరాక బిడ్డను కోల్పోతే ఆ తల్లి పడే బాధ… ఇవన్నీ కథలో అల్లారు. పాఠకుల హృదయం ద్రవించేలా సాగిందీ కథ. ఇలాంటి అనుభవాలు కథలా అల్లడానికి పాఠకులను కథలోకి లాక్కెళ్ళడానికి రచయిత్రి రచనా కౌశలం ఎంతో అద్భుతంగా సాగింది.

కష్టం చేసుకుని బ్రతికే జీవనం ఎలా ఉంటుంది? వాళ్ళ పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటారు? చిన్నప్పటి నుండే పిల్లలకు బాధ్యతలు ఎలా పంచుతారు? అనే విషయాలు ‘బాల్యం’ కథలో వివరించారు. తల్లిదండ్రుల ప్రేమను వర్ణించడానికి ఒక్క ఉదాహరణ కూడా దొరకదు, ప్రకృతి తప్ప. అంతటి ప్రేమ తల్లిదండ్రులదైతే ఆ పిల్లలకు శ్రీరామరక్షే. పాము కుట్టిన బిడ్డను కాపాడుకునేందుకు తండ్రి పడ్డ తపన కథలో కనబడుతుంది. తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు బిడ్డలకు ఏ విషపు పురుగులు కుట్టినా కాపాడతాయి.

పెళ్ళయిన అమ్మాయి డిగ్రీ చదివేందుకు పడ్డ శ్రమ ”ఉమెన్స్‌ కాలేజీ”. అత్తగారింటి నుండి ఒక అమ్మాయి కాలేజీకి వెళ్ళి దదువుకోవాలంటే తను ఎన్ని పనులు చేయాలో చూపించారు. చదువుకోవాలనే తాపత్రయం ముందు ఇవన్నీ దూదిపింజలే. ఒక అమ్మాయి ఏదైనా అనుకుందంటే ఎన్ని కష్టాలు, నష్టాలు ఎదురైనా విజయవంతంగా పూర్తి చేస్తుంది. దళిత కుటుంబంలో పుట్టి చిన్నతనంలో పెళ్ళి చేసుకుని, చదువుకోవాలనే ఆశ చావక కుటుంబాన్ని ఒప్పించి అన్ని బాధ్యతలు నిర్వహిస్తూ చదువుతూనే తాను సాధించిన తీరు అందరికీ ఆదర్శప్రాయం. నేడు ఎన్ని సౌకర్యాలు కల్పించినా చదవాలనే తపన చాలామంది పిల్లల్లో చూడలేకపోతున్నాం. అలాంటి విద్యార్థి లోకానికి ఇదొక చక్కని ఉదాహరణ.

సీరియల్స్‌ ప్రభావం వల్ల ఇంట్లో ఎన్ని అనర్థాలు జరుగుతాయో వదిన, మరదళ్ళ సంభాషణల ద్వారా ”కాలగమనం” కథలో తెలిపారు. స్మార్ట్‌ఫోన్స్‌, టీవీ వంటి ఏ మాధ్యమాలైనా మోతాదుకు మించి వాడితే ఎలా చెడిపోతామో, ఇలాంటి వాటికి బానిసలై ఇళ్ళు,

ఒళ్ళు నాశనం చేసుకునే వాళ్ళక చక్కని గుణపాఠంగా ”కాలగమనం” కథను తీర్చిదిద్దారు.

ఇలా కథలన్నింటినీ తన జీవిత చట్రంలోని అనుభవాలను అల్లి చక్కని కథల్లాగా పాఠకుల ముందు పరిచారు. ప్రతి కథ తన కథే అనిపిస్తుంది. అప్పుడప్పుడూ మన అనుభవం కూడా తాకుతుంది. ఒక దళిత మహిళగా తను పెరిగిన వాతావరణం, చదువుకోవడానికి పడ్డ తాపత్రయం, ఎదిగిన తీరు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలనే తత్వం, కుటుంబానికి ఇచ్చిన గౌరవం వంటి ఎన్నో విషయాలను రంగరించి సువాసనలు వెదజల్లే మమతల మల్లెలను మన దోసిళ్ళలో పోసింది వర్ధమాన రచయత్రి.

Share
This entry was posted in పుస్తక సమీక్షలు. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి)


తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.