పొద్దున్నే సరోజ ఫోన్. ఇంత పొద్దున్న ఆమెకు క్షణం తీరికుండదు. ఇంట్లో పనులు పూర్తి చేసుకుని ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న స్కూల్‌కు పరుగెత్తాలి. స్కూళ్ళు మొదలయ్యాయి కూడా. ఫోన్ ఎత్తాను. ‘‘ఏంటీ, ఈ రోజు ఉదయాన్నే తీరికైంది’’ అన్నాను నవ్వుతూ. అటువైపు మాటల్లేవు. వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. ‘‘సరోజా ఏమైందే. అందరూ
బావున్నారు కదా?’’ అసలే కరోనా మరణాల వార్తలతో బేజారై ఉన్నాను. ‘‘అందరూ బాగానే ఉన్నారు. నేనే బాగాలేను’’ కోవిడ్ బారిన పడిరదా? ఏమిటి? అసలే ఒక్కర్తి ఉంటుంది. ‘‘ఉద్యోగానికి రిజైన్ చెయ్యాలన్పిస్తున్నదే’’ అంది ఏడుపు గొంతుతో. షాకింగ్… ఎంతో కష్టపడి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగం సంపాదించింది. తనకి ఉద్యోగం చాలా అవసరం. ‘‘ఏంటే! ఏమైంది. ఓ గంటలో నీ దగ్గరుంటాను. సరేనా’’ అని ఫోన్ పెట్టేశాను. ఉద్యోగం మానేసేంత సమస్య ఏమొచ్చిందా అని ఆలోచిస్తూ తన దగ్గరికి బయలుదేరాను.
‘‘వీళ్ళు నా విద్యార్థులు. తొమ్మిది, పది చదువుతున్నవాళ్ళు. వాళ్ళు నాకు పంపిస్తున్న మెసేజ్‌లు, ఫోటోలు చూస్తుంటే నా మీద నాకే అసహ్యం కలుగుతోంది. రోజూ నేను వాళ్ళకి ఆన్‌లైన్‌లో పాఠాలు చెబుతుంటే వాళ్ళు ‘‘టీచర్, నువ్వీరోజు చాలా సెక్సీగా ఉన్నావ్ అని మెసేజ్ పెడతాడొకడు. మీరొక్కళ్ళే ఉంటారు కదా! ఇంటికొస్తాం క్లాసులు చెప్పొచ్చు కదా! అంటాడు ఇంకొకడు. చాలా ఘోరమైన వీడియోలు పంపిస్తున్నారు’’ సరోజ కళ్ళల్లోంచి జలజలా నీళ్ళు జారాయి. నాకు కంపరమొచ్చింది. ‘‘ఛీ… ఛీ… వెదవలు. వీళ్ళు స్టూడెంట్లా? రౌడీలా? షీ టీమ్స్‌కి కంప్లయింట్ ఇద్దాం.సైబర్ క్రైమ్స్ కింద బుక్ అయితే తెలుస్తుంది’’ అన్నాను కోపంతో. ‘‘వద్దే! వాళ్ళ జీవితాలు నాశనమైపోతాయి. ఆ వయసులో వాళ్ళ చేతుల్లో స్మార్ట్ ఫోన్‌లు ఉండడం, ఆ ఫోన్‌లతో వాళ్ళేం చేస్తున్నారో ఎవ్వరూ గమనించకపోవడం. మధూ! వాళ్ళ ముఖాలు చూడాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. వీళ్ళు టీచర్‌తోనే ఇలా ప్రవర్తిస్తుంటే అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేస్తున్నారో. తలుచుకుంటుంటే చాలా భయమేస్తోంది’’ సరోజ గొంతు పూడుకుపోయింది. ‘‘ఏం చేద్దామో ఆలోచిద్దాంలే. ఉద్యోగం మానెయ్యడం ఏంటి?’’ అన్నాన్నేను. ఇద్దరం పిల్లలతో ఎలా మాట్లాడాలో చర్చించుకుంటూ కూర్చున్నాం. నేను పైన రాసింది కథ కాదు. ఆన్‌లైన్ క్లాసులు చెపుతూ చాలామంది టీచర్లెదుర్కొన్న అనుభవాలు. మింగుడుపడని, జీర్ణం చేసుకోలేని విషాదానుభవాలు. సరోజ మాట్లాడేటప్పుడు నా మనసులో కూడా ఒక అలజడి రేగడం మొదలైంది. ఆన్‌లైన్ క్లాసులు మొదలైనప్పటి నుండి కొంతమంది ఫ్రెండ్స్ కలిసి అమ్మాయిలకి స్మార్ట్ ఫోన్లు కొనిచ్చాం. అదో ఉద్యమంలా తయారై చాలామంది అమ్మాయిలకి, అబ్బాయిలకి కూడా ఫోన్స్ కొనివ్వడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది అమ్మాయిలు ఎవరెవరో ఫోన్ చేస్తున్నారు, బ్లాంక్ కాల్స్ వస్తున్నాయని కంప్లయింట్ చేశారు. వాళ్ళకి ఎలా జాగ్రత్తగా ఉండాలో, ఫోన్‌ని కేవలం ఆన్‌లైన్ క్లాసులు వినడానికి మాత్రమే పరిమితంగా ఎలా వాడుకోవాలో చెప్పాం. అసభ్యకరమైన మెసేజ్‌లు, వీడియోలు వస్తే షీటీమ్స్‌కి ఫిర్యాదు చేయాలని ఆయా నంబర్లు కూడా ఇచ్చాం.
టెక్నాలజీ రెండువైపులా పదునున్న కత్తిలాంటిది. కూరగాయలు కోసుకోవచ్చు, కుత్తుకలు కొయ్యొచ్చు. అది వాడే వాళ్ళ విచక్షణ బట్టి ఉంటుంది. కరోనా కల్లోల సమయం, విద్యా సంస్థలు తెరవలేని పరిస్థితిలో ఆన్‌లైన్ క్లాసులంటూ మొదలుపెట్టడం వల్ల వేలాదిమంది దళిత, ఆదివాసీ పిల్లలు ఫోన్లు లేక, ఇంటర్నెట్ సౌకర్యం లేక తమ క్లాసుల్ని కోల్పోయారు. డబ్బున్న వాళ్ళ పిల్లలకి ఆయాచితంగానే టెక్నాలజీ అరచేతుల్లోకి వచ్చేసింది. మరి అట్టడుగు వర్గాల పిల్లల పరిస్థితేంటి? ఆ ఆలోచనల్లోంచే సాధ్యమైనంత మంది పిల్లలకి ఫోన్లు కొనిచ్చారు చాలామంది. ఆ వయసు పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్లుంటే ఆకతాయి పిల్లలు ఏం చేస్తారో వందల్లో రుజువవుతున్నాయి. ఎన్నో రకాల వేధింపులకు తోడు స్మార్ట్ ఫోన్ వేధింపులు మొదలయ్యాయి. అవి పిల్లల్ని దాటి టీచర్ల వరకు పాకడం చాలా ఆందోళన కలిగించే విషయం. టీచర్లకు అసభ్య మెసేజ్‌లు, వీడియోలు పంపుతున్న వైనాలు టీచర్లకి తీవ్ర మనోవేదనని కలిగిస్తున్నాయి. దానికి మంచి ఉదాహరణ సరోజ. క్లాసులో తన ముందు కూర్చుని పాఠాలు వినే పిల్లాడు తన అంగాంగ వర్ణన చేస్తూ మెసేజ్‌లు పంపడాన్ని ఏ టీచరైనా ఎలా తట్టుకుంటారు. మైనర్ పిల్లలు… వాళ్ళమీద ఫిర్యాదు చేయాలనే ఆలోచనని చెయ్యలేరు. తన విద్యార్థి సైబర్ క్రైమ్‌లో దొరికితే వాడి భవిష్యత్తు అంధకార బంధురమైపోతుందనే మానసిక వేదన సరోజ ఉద్యోగం వదిలెయ్యాలనే తీవ్రమైన నిర్ణయం తీసుకునేలా చేసింది.
నాలో రకరకాల ఆలోచనలు చెలరేగుతుండగా సరోజకి ఫోన్ చేశాను. మర్నాడు కలుద్దామని ప్లాన్ చేసుకున్నాము. సరోజకి మెసేజ్‌లు చేసిన నలుగురు అబ్బాయిలతో మాట్లాడాలని నిర్ణయించుకున్నాక సరోజ మనసు కొంత శాంతించింది. పిల్లల మీద చెడిపోయారని ముద్ర వేయడం తేలిక. దానివల్ల ప్రయోజనం లేదు. వాళ్ళతో మాట్లాడడం ద్వారానే ఈ సమస్యకి ఒక పరిష్కారం దొరుకుతుందనే ఆలోచనతో ఇద్దరం చాలాసేపు మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ ఉండిపోయాం. ‘‘సరోజా! మన పని రేపటితో అయిపోతుందనుకోను. సోషల్ మీడియాలో దీనిమీద పెద్ద చర్చను మొదలుపెడదాం. మన ఆలోచన ఎక్కువమందికి చేరేలా చేద్దాం. నీలాగా ఇంకా చాలామంది ఉపాధ్యాయులు ఈ సమస్యని ఎదుర్కొంటుండొచ్చు. అలాగే అమ్మాయిలతో కూడా మనం మాట్లాడాలి’’ అన్నాను. ‘‘అవును మధూ! ఇప్పటికి ఇదే మన ఎజెండా. రేపు కలుద్దాం’’ అంటూ సరోజ ఫోన్ కట్ చేసింది.