నింగిన చుక్కలు మిణుకు మిణుకుమంటూ మెరుస్తున్నాయి. ‘‘అమ్మా నేను వెళ్ళొస్తాను’’ అంటూ టేబుల్‌పైన ఉన్న కీ చెయిన్ అందుకొని చెప్పులు వేసుకుంటున్న పద్మను ఉద్దేశించి ‘‘ఎక్కడికమ్మా…! ఇంత రాత్రివేళ బయటికి ఒంటరిగా ఎందుకు తల్లీ’’ అంది పద్మ తల్లి ప్రేమగా.
‘‘అమ్మా! నా స్నేహితురాలు హాస్పిటల్‌లో ఉంది. వెళ్ళి చూసి వెంటనే వస్తాను. ఇప్పుడు పెద్దగా రాత్రేమీ కాలేదు, ఆరు దాటిందంతే. ఇప్పుడు చలికాలం కాబట్టి చాలా రాత్రయినట్లు అనిపిస్తోంది. ఒకసారి టైం చూడమ్మా…!’ అని తల్లి భుజాలపై చేతులు వేసి చూపుడు వేలుతో గోడ గడియారం వైపు చూపించింది తల్లికి.
‘‘అయినా సరే పద్మా. ఇప్పుడెందుకు వెళ్ళడం? రేపు ఉదయమే వెళ్ళమ్మా’’ అని నచ్చచెప్ప చూసింది తల్లి.
‘‘అమ్మా! రేపు ఉదయమే నేను హాస్పిటల్‌కి వెళ్ళాలి కదా. మార్నింగ్ డ్యూటీ కదా. డెలివరీ కేసులు ఎక్కువగా వస్తున్నాయి. నాకు టైం ఎప్పుడు దొరుకుతుంది చెప్పు’’ అంటూ తల్లిని ఒప్పించింది పద్మ.
‘‘సరేనమ్మా త్వరగా వెళ్ళిరా మరి’’ అంటూ తల్లి చెప్పగానే ఆనందంతో ‘‘మా మంచి అమ్మ’’ అంటూ తల్లి బుగ్గపై ముద్దుపెట్టి బయటకు వెళ్ళి స్కూటీ స్టార్ట్ చేసింది.
పద్మ పాతిక సంవత్సరాల పాలవెల్లి. కల్లాకపటం తెలియని సుగుణాల రాశి. భాగ్యనగరానికి యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక జిల్లా కేంద్రంలో మెటర్నిటీ హాస్పిటల్‌లో ప్రభుత్వ వైద్యురాలిగా పనిచేస్తోంది. వృత్తి పట్ల నిబద్ధత కలిగిన పద్మ తన వైద్య సేవలతో అందరి మనస్సులను ఆకట్టుకుంది.
ఇంటినుండి బయలుదేరిన అరగంటలో హాస్పిటల్‌కు చేరుకుంది. స్కూటీ పార్క్ చేసి డిక్కీలో ఉన్న కవర్ తీసుకుంది. పర్సు తీసుకుని అందులో సెల్‌ఫోన్ పెట్టుకుని లోపలికి వెళ్ళింది పద్మ.
అనారోగ్యంతో హాస్పిటల్‌లో చేరిన స్నేహితురాలితో మాటల్లో పడి సమయం తెలియకుండా హాస్పిటల్‌లోనే
ఉండిపోయింది. హఠాత్తుగా అమ్మ తొందరగా రమ్మందనే విషయం గుర్తుకు రాగానే టైం చూసుకుని అప్పుడే మూడు గంటల సమయం గడిచిపోయింది, ఇప్పటికే ఆలస్యమైందని చింతిస్తూ స్నేహితురాలి దగ్గర వీడ్కోలు తీసుకుంది.
‘‘జాగ్రత్త పద్మా…! చీకటి పడిరది’’ అంటూ హెచ్చరించింది స్నేహితురాలు. ‘ఫర్వాలేదు లేవే’ అంటూ బయటకు వడివడిగా అడుగులేస్తూ వచ్చి స్కూటీ లాక్ తీసి స్టార్ట్ చేస్తుంటే వెనుకనుండి ఇద్దరు యువకులు వచ్చి ‘‘మేడం, స్కూటీ టైర్ పంక్చర్ అయింది’ అన్నారు. పద్మ వెనుదిరిగి చూసేసరికి నిజంగానే వెనుక టైర్ పంక్చర్ అయింది. ఏం చెయ్యాలని ఆలోచిస్తున్న టైంలో ‘‘మేడమ్, మీరు ఫికర్ చెయ్యకండి. స్కూటీ టైర్ పంక్చర్ మేం చేయించుకొస్తం. బండి కీస్ ఇటు ఇవ్వండి. ఈ పక్కనే మెకానిక్ షెడ్ ఉంది’ అన్నారు వినయంగా.
‘‘అయితే నేను కూడా వస్తాను’’ అంది పద్మ. ‘‘అయ్యో మీరు నడవలేరు మేడం. కొంచెం ఎక్కువ దూరమే ఉంది. మీరు ఇక్కడే ఉండండి’’ అన్నారిద్దరూ ముక్తకంఠంతో.
ఏం చేయాలో పాలుపోక అటూ ఇటూ చూస్తున్న పద్మకు తళుక్కున మెరుపులా ఏదో ఆలోచన వచ్చినదానిలా ‘‘వద్దులెండి నేను మా నాన్నకు ఫోన్ చేస్తాను’’ అంది.
‘‘అరే ఈ మాత్రం దానికే మీ నాన్నగారిని ఎందుకు మేడం ఇబ్బందిపెట్టడం. మీరొక్క పది నిమిషాలు ఇక్కడే నిలబడండి’’ అంటూ చేతులు కట్టుకొని చాలా వినయంగా చెప్పారు.
‘‘మీరెవరో నాకు తెలియదు. అయినా మీకెందుకు శ్రమ’’ అంటుండగానే ‘‘నా పేరు రాము, వీడి పేరు రహీం మేడమ్. మాది ఈ పక్క బస్తీనే. అంతకయితే మేము టైర్ పంక్చర్ వేయించుకొచ్చినంక మాకు ఎంతో కొంత డబ్బు ఇవ్వండి మేడం’’ అంటూ చేతిలోని తాళం తీసుకున్నారు. కాదనలేకపోయింది పద్మ.
వాళ్ళు స్కూటీని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళారు. మెయిన్ రోడ్డుకు అడ్డంగా ఒక వ్యాన్ ఆగి ఉంది. రోడ్డు మీది మనుషులు కనిపించకుండా ఆ వ్యాన్ అడ్డుగా ఉంది. అక్కడ ఇద్దరు యువకులు కన్పించారు. సమయం గడుస్తున్న కొద్దీ చీకటి అలుముకుంటోంది. ఎందుకో పద్మకు గుండెల్లో భయం ఆవహించింది, ఆ ఇద్దరి కదలికలు చూస్తుంటే. అయినా ఏమీ కాదులే అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది.
పది నిమిషాల తర్వాత, స్కూటీని నెట్టుకుంటూ ముందుకు వెళ్ళిన ఇద్దరూ మళ్ళీ యధాలాపంగా స్కూటీని నెట్టుకుంటూ వెనక్కి వచ్చి ‘‘మేడం, అక్కడ మెకానిక్ షాప్ మూసి ఉంది. ఈ పక్క కొంచెం దూరంలో ఇంకో షాప్ ఉంది’’ అంటూ అటుగా వెళ్తున్నారు.
వద్దంటూ ఎంత వారించినా పద్మ మాటలను వినకుండా ముందుకు నడుస్తున్నారు. అంతకుముందు అక్కడ కదలాడిన ఇద్దరు యువకులు ఇటుగా వస్తున్నారు. పద్మకు భయం మొదలైంది. వెంటనే ఇంట్లో ఉన్న తన చెల్లెలికి ఫోన్ చేసి ‘‘బుజ్జీ! నాకు భయంగా ఉంది. ఇక్కడ స్కూటీ టైర్ పంక్చరైంది. అది రిపేర్ చేయిస్తామని ఇద్దరు అబ్బాయిలు దాన్ని తీసుకుని వెళ్తున్నారు. నువ్వు నాతో మాట్లాడుతూనే ఉండు’’ అంటూ తను ఎక్కడి నుండి మాట్లాడుతోందో అడ్రస్ చెబుతుంటేనే స్కూటీ తీసుకుని వెళ్ళిన ఇద్దరు, చాలాసేపటి నుంచి అక్కడే తచ్చాడుతున్న మరో ఇద్దరు కలిసి మొత్తం నలుగురూ ఒక్కటై పద్మను చుట్టుముట్టారు.
జనారణ్యంలో మానవ మృగాల గురించి వినడమే తప్ప చూడని అమాయకురాలు. చాలా ప్లాన్‌గానే స్కూటీ టైర్ పంక్చర్ చేశారనే విషయం గ్రహించలేని సౌమ్యురాలు. పద్మకు భయంతో నోట మాట రావడం లేదు. ‘‘అక్కా! అక్కా! ఏమైంది మాట్లాడు’’ అంటూ అవతలివైపు మాటలు వినిపిస్తున్నాయి. ఇటునుండి మాటలేమీ లేకపోగా సెల్‌ఫోన్ ఒక్కసారిగా స్విఛ్ఛాఫ్ అయిపోయింది.
పద్మ భయంతో ముందుకు పరుగుతీసింది. అన్నీ చెట్లు, తుప్పలు ఉన్నాయి. చిమ్మ చీకటి. జనసంచారం లేదు. వెనుక నుండి మృగాళ్ళు తరుముతున్నారు. ఆమెను పట్టుకోవాలనే కసితో పరిగెత్తుతూ పట్టుకోబోయారు. ఆమె దొరకలేదు. ఒకడు అతి దగ్గరిగా వెళ్ళి చున్నీ పట్టి లాగాడు. చున్నీని వదిలేసి వేరేవైపుగా మళ్ళింది. రోడ్డువైపు పరుగులు తీయాలని ప్రయత్నిస్తోంది. చెమటలు నిలువెల్లా తనువును తడిపేస్తున్నాయి. గొంతు తడారిపోయింది.
‘‘హెల్ప్… హెల్ప్…’’ అంటూ అరుస్తోంది కానీ తన మాటలు తనకే కలలో అరుస్తున్నట్లుగా వినిపిస్తున్నాయి. కాళ్ళు తడబడుతున్నాయి, అయినా పరుగు ఆపలేదు.
కిలోమీటర్ల వరకు నాగరికత పరుచుకున్న హైవే పక్కనే కామాంధులు అనాగరికంగా వెంటపడుతున్నారు. వారి కళ్ళకు కామం తప్ప తల్లుల ఆక్రందనలు కనిపించడం లేదు. పోలీసు బలగాల పహారాల భయాలు వాళ్ళను తాకడం లేదు.
‘‘నువ్వు మా నుండి తప్పించుకొని ఎక్కడికి పారిపోతావే పిచ్చిదానా…!’’ అంటూ వారి గొంతులో నుండి సామూహిక వెటకారం ధ్వనిస్తోంది. ఒక్కసారిగా కాలికి ఏదో అడ్డు తగిలి కింద పడిపోయింది పద్మ. నలుగురూ ఆమెను చుట్టుముట్టారు. దొరికినకాడికి ఆమె ఒంటిమీద బట్టలు చింపుతున్నారు. అయినా ఆమె ధైర్యం కోల్పోలేదు. తప్పించుకోవాలనే ప్రయత్నం మానడం లేదు. పెనుగులాటలో ఆమె చేతికి ఒక సీసా దొరికింది. దాన్ని తీసుకొని బలంగా కొట్టింది. చీకట్లో ఒకడి తలకు గాయమైంది.
‘‘అమ్మా..! ఇది రాక్షసిరా, చంపిందిరా..’’ అంటూ కేక వినిపించింది. వాడికి దెబ్బ తగలగానే, అమ్మా అని అరిచాడు కానీ అమ్మాయిని వెంటాడడం మాత్రం మానలేదు. అమ్మ కూడా ఒక ఆడదే అనే విషయం మరిచాడు మృగాడు.
దుర్మార్గులు గోర్లతో రక్కుతున్నారు. అయినా శక్తినంతా కూడదీసుకుని వారితో పోరాడుతోంది, తనను తాను కాపాడుకోవాలనే దృఢ సంకల్పంతో. పెనుగులాటలో తలకు పెట్టుకున్న చెంపపిన్ను చేతికి దొరికిది. ఒక్క సెకన్ కూడా ఆలోచించకుండా బలంగా దాంతో గుచ్చింది. అది తన చేతివైపుగా ఉన్నవాడి కంట్లో గుచ్చుకుంది. పిన్ను చాలా పదునుగా ఉన్నందువల్ల వాడి కనుగుడ్డుపై గుచ్చుకొని విలవిల విలపిస్తూ పద్మను వదిలి దూరంగా జరిగాడు.
పద్మకు గుండెల నిండా దుఃఖం గూడుకట్టుకుంది, కానీ కన్నీళ్ళు రావడంలేదు.
‘‘అమ్మా…! దుర్మార్గపు మృగాలు సాధు జంతువుల్లా ముందు నటిస్తాయి. ఎంతో నమ్మకాన్ని కలిగిస్తాయి. ఎంతో విశ్వాసం ఉన్న కుక్కల్లా తోక ఊపుతాయి. మాటలో మాట కలుపుతాయి. నమ్మవద్దు. ఆ మృగాలు ఒక్కొక్కసారి ప్రేమ అనే తోలు కప్పుకొని వస్తాయి, నమ్మకు. అడవిలో పులులు కూడా అంత ప్రమాదకరమైనవి కావు. బుసలు కొట్టే కాలనాగు కూడా దాని దారికి అడ్డు వస్తేనే కాటు వేస్తుంది. కానీ ఈ మానవారణ్యంలో అనుక్షణం ప్రమాదం నీ పక్కనే పొంచి ఉంటుంది. రాత్రి, పగలు తేడా ఏమీ లేదు. అనుక్షణం వేయికళ్ళతో నీ ఆత్మస్థైర్యాన్ని ఆయుధంగా మలచుకోవాలి. సమయస్ఫూర్తినే దివిటీగా నిన్ను నీవు రక్షించుకోవాల’’ని తల్లి తరచుగా చెప్పే మాటలు మనసులో మెదులుతున్నాయి.
గాయపడిన ఇద్దరు ‘‘ఒరే! దాన్ని వదలొద్దురా. అది మనల్నే చంపాలని చూస్తోంది’’ అంటూ మిగతా ఇద్దరినీ రెచ్చగొడుతున్నారు. కిందపడిన పద్మ వెనకెనకకు జరుగుతోంది. ఆమె చేతులు అటు ఇటు వెతుకుతున్నాయి, ఏదైనా దొరుకుతుందనే ఆశతో. చివరకు చేతికి ఇసుక కుప్ప తగిలింది. రెండు పిడికిళ్ళ ఇసుక తీసుకుని ముందుకు గుప్పింది. ఆమెను అమాంతం ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తున్నవాడి కళ్ళల్లో పడిరది. ‘‘అమ్మా…!’’ అంటూ కళ్ళు నలుపుకుంటూనే ఆమెను పట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఆమె వేగంగా వెనక్కు జరిగింది. లేచి కొంత దూరం పరుగెత్తింది. నాలుక పిడచగట్టుకు పోతోంది. ఊపిరి ఆడడంలేదు. కళ్ళు బైర్లు కప్పి ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
ముగ్గురు గాయపడగా మిగిలిన మృగాడు ‘ఆసాంతం ఆమె ఇక నాకే సొంతం’ అని మనసులోనే సంబరపడుతూ మిణుకు మిణుకుమంటున్న నక్షత్రాల వెలుతురులో ఆమె దగ్గరకు చేరుకున్నాడు. పశువులా ఆమె మీద పడి సొంతం చేసుకోవాలని యత్నిస్తున్నాడు. ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన పద్మకు ఊపిరి ఆడడం లేదు. కదిలే సత్తువ కూడా లేదు. అయినా ఊపిరి బిగపట్టుకుని శక్తినంతా కూడగట్టుకొని మోకాలితో అతడి రెండు కాళ్ళ నడుమ బలంగా తన్నింది. ఆయువుపట్టున గట్టిగా తగలడంతో గిర్రున తిరిగి అడ్డంగా పడ్డాడు మృగాడు.
గాయపడిన మృగాలు ఈ రోజు ఆమెను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నంత కసిగా ఒకడ్ని ఒకడు కలుపుకొని ముందుకు వస్తున్నారు. చిన్నగా లేచి రోడ్డువైపు పరుగుతీస్తోంది పద్మ. నాలుగో వాడికి లేచే సత్తువ లేదు. వాడ్ని అక్కడే వదిలి ముగ్గురూ ఆమె వెనుక పరుగులు తీస్తున్నారు. ముందు పద్మ, వెనుక మృగాలు… చివరకు ఆమెను చుట్టుముట్టారు. ఇక పరిగెత్తే ఓపిక, శక్తి ఆమెలో నశించిపోయాయి. మొదలు నరికిన చెట్టులా కుప్పకూలిపోయింది నిలుచున్న చోటునే. అంతిమ విజయం తమదేనని, ఈ రాత్రికి పండగేరా అనుకుంటూ ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు. చిమ్మ చీకట్లో కూడా వారి కళ్ళల్లో పైశాచికానందం మోరుస్తోంది.
మృగాళ్ళ మనసులు ఉత్సాహంగా ఉరకలేస్తుండగా వారి ఊహలను చెదరగొడుతూ ఒక్కసారిగా రెండు జీపులు వచ్చి ఆగాయి. పోలీసులు ఆ మృగాళ్ళను చుట్టుముట్టారు. మరో తెల్లటి కారులో నుండి పద్మ తల్లిదండ్రులు, చెల్లెలు దిగారు. భయంతో వణికిపోతున్న బిడ్డను తనలోకి పొదుపుకొని తన పైట కొంగులో దాచుకుంది పద్మ తల్లి, కోడి తన పిల్లలను రెక్కల చాటున దాచుకున్నంత జాగ్రత్తగా. నాలుగో వాడిని కూడా పట్టుకుని వచ్చారు పోలీసులు. మహిళా పోలీసులు వారిపై లాఠీలు రaళిపించారు. రక్తాలు కారుతున్న మృగాళ్ళను పోలీసులు జీపులోకి ఎక్కించారు.
పద్మ చెల్లెలికి ఫోన్ చేయడానికి ముందే, ఆ మృగాలు తనను చుట్టుముట్టకముందే, ఆ భయానక వాతావరణంలో తన మనసెందుకో కీడును శంకించి, 100 నంబర్‌కు ఫోన్ చేసింది. అంతేకాకుండా పద్మ తన చెల్లెలికి ఫోన్ చెయ్యగానే ఆమె వెంటనే 112 నంబర్‌కు ఫోన్ చేసి ఏరియా వివరాలు చెప్పి, వెంటనే తల్లిదండ్రులను తీసుకొని బయలుదేరింది.
‘‘పద్మా…! నువ్వు చాలా సమయస్ఫూర్తితో వ్యవహరించి మాకు ఫోన్ చేయడం మంచిదైంది. మీ కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు అడ్రస్‌తో సహా సమాచారం అందించి, ఇంట్లోనే భయంతో ఎదురుచూడకుండా వెంటనే బయలుదేరి చాలా మంచి పని చేశారు. నీలాగే ప్రతి ఒక్క ఆడపిల్ల అప్రమత్తంగా ఉండాలి. ఎప్పుడూ మీ ఫోన్‌లో పోలీసుల నంబర్లు ఉండాలి. మీకు సహాయం చేసేవాళ్ళ నంబర్లు, మీ కుటుంబ సభ్యుల ఫోన్ నంబర్లు మీ నోటికి వచ్చి ఉండాలి. అందరికీ ఫోన్లు చేయడమే కాదు ఎటునుండి ఎంతమంది దాడి చేసినా వారితో పోరాడి గెలవగలిగే యుద్ధ విద్యలను నేర్చుకోవాలి. అందరూ నీలాగా చివరి వరకు ఆత్మస్థైర్యంతో పోరాడి ఈ సమాజానికి ఆదర్శం కావాలి. ఈ మానవ మృగాలను తరిమికొట్టి నీలాగా మాన ప్రాణాలు కాపాడుకోవాలి’’ అంటూ పద్మను అభినందించింది మహిళా సేఫ్టీ వింగ్ ఎస్.ఐ. సరళ.
పద్మను తల్లిదండ్రులు కారులో ఎక్కించారు. వెనుక సీట్లో తల్లి ఒడిలో తల వాల్చింది పద్మ. కారు ఇంటివైపు, జీపులు పోలీస్ స్టేషన్ వైపు పరుగులు తీశాయి.