అమ్మా అని పిలవగానే
పెదవులు తియ్యబడ్డాయి
నీ తలపుల ఆలోచనలన్నీ
నా చుట్టూ గిరగిరా తిరుగుతున్నాయి
కల్తీ తాండవం చేసే ఈ సమాజంలో
స్వచ్ఛమైన ప్రేమ నీదే కదమ్మా…
నీ జోలపాట గుర్తొచ్చినప్పుడల్లా
పసిపాపనై ఊయలూగుతున్నాను
నీవు కలిపి పెట్టిన గోరుముద్దల కమ్మదనాన్ని
నా నాలుక మరిచిపోలేక కలలో కూడా
అప్పుడప్పుడు చప్పరిస్తుంది అమ్మా…
జ్వరం వచ్చిన ఆ రోజుల్లో
నీ ఒడిలో నిద్రపోతే చాలు
మందు, మాకు అవసరం లేకుండానే
నిద్రలో మటుమాయం అయ్యేది కదమ్మా…
ఇప్పటికీ జ్వరం వస్తే ఆ రోజుల్ని తలుచుకుంటే
చాలు స్వస్థత పరిమళాలు వెదజల్లుతాయి…
నా ముఖాన్ని చూసి మనసును
స్కాన్ చేస్తుంటివి గుర్తుందా అమ్మా…
అంతేకాదు కడుపునొప్పి అంటే
ఉప్పు, ఎండుమిరప కాయతో దిష్టితీసేస్తుంటివి
నేటికి కూడా మనసుకు కలిగిన అస్వస్థతను
తీర్చే మానసిక వైద్యురాలివి నువ్వే కదమ్మా…
నీతో ఆడిపాడిన గమ్మత్తులన్నీ
జ్ఞాపకాల తెరలుగా గుండెనిండా పరుచుకున్నాయి
అమ్మా… నువ్వు నాకు ప్రాణం పోసిన
తల్లివి మాత్రమే కాదు
మంచి స్నేహితురాలివి
అంతకుమించి నా జీవితాన్ని తీర్చిదిద్దిన మహాకావ్యానివి…