నక్షత్రాలను పొదుముకొని
మెరిసిపోయే ఆకాశమే… నాకు చీరంటే
సప్తవర్ణాల సోయగాలతో నను
చుట్టుకున్న ఇంద్రధనుస్సే…చీరంటే
అలనాటి…
సంచారి సేకరించిన నారపోగుల
జలతారు సెలయేరే… చీరంటే
భూమాత ఒడిలోంచి పచ్చపచ్చగా విచ్చుకున్న వరి నారే నాకు చీరంటే…
రైతన్న చెమట చుక్కలు
నేతన్న ఒడుపుగా వడికిన అల్లిబిల్లి పోగులే
నాకు చీరంటే…
నను బుట్టబొమ్మలా దిద్దిన
మొట్టమొదటి
పట్టంచు పసుపు చీరె…
నా పుట్టింటికి నను చుట్టం చేసిన మహాతల్లి
చీరలను
పోగేసుకునేందుకు ఎన్ని సందర్భాలో!!
పెట్టిపోతలూ పుట్టినరోజులూ
పుట్టింటి కానుకలూ
కంటికి నచ్చినవీ కానుకలిచ్చినవీ
ఇప్పుడు అలమారీ నిండా
కదిపితే రాలిపడేన్ని గుట్టలు గుట్టలుగా
సమయానికేదీ నచ్చదు
కాలానికి తగినట్లు లేవనో… పూలూ లతలూ
వన్నె తగ్గాయనీ ఎన్ని వంకలో…!
ఒక్కో చీర… ఓ అమూల్య జ్ఞాపకాల నిధి
దేన్నీ త్యజించ మనసొప్పదు…!!
అవునూ ఏమాటకామాటే…!
ఇప్పటి ఆధునిక మహిళ
నూరు చేతుల పనితో
తీగె మీద కదా తన పరుగులు
అందంగా దిద్దుకున్న నిండైన కుచ్చిళ్ళే
ఆమె వేగానికి అవరోధం ఇప్పుడు
అన్నట్టు
ఆనాటి ద్రౌపదీ అపర ధీశాలే…!
నిండు సభలోనే చీర లాగినోడి చెయ్యి విరిచేదే…
కానెందుకో…
చేతులెత్తి వేడుకుంది కాపాడమంటూ…
అదీ చీరతో వచ్చిన అణకువేమో…!
ఇప్పుడది కొండవీటి చాంతాడేనట
నేటి సాధికారపు సర్కస్ పిల్లకి
మూడు మూరల నిలువూ
ముప్ఫై మూరల పొడవూ…
దేహానికి చుట్టుకుంటే ఒక్క జంగన్నా బలంగా
వెయ్యలేని స్వీయబందీ ఆమె
ఆర్మీ నుంచి అంతరిక్షం దాకా రెక్కవిప్పిందామె
సాంప్రదాయాన్ని ధిక్కరించిందని
చెవులు కొరుక్కుంటే ఎలా!?
సౌకర్యానికీ సౌలభ్యానికీ కదా పచ్చజెండా…!
అయినా
దీని సరిజంట పంచాదోతీ
ఎప్పుడో కనుమరుగై కంఫర్ట్ జోన్‌కెళ్ళింది
ఈ చీరే…
ఇంకా తడబడుతూ పెనుగులాడుతోంది
నిన్నటి జాడలని విడువలేక…!