ఆయన కథలు నేటివి, రేపటివి కూడా! -లాంగుల్య

మాస్టారి కొన్ని కథల గురించి ఈ సందర్భంలో రేఖామాత్రపు స్పర్శగా ఇక్కడ గుర్తు చేసుకుందాం. మాస్టారి ‘యజ్ఞం’తో తొమ్మిది కథా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. మాస్టారికి అనేక పురస్కారాలు అందడం ద్వారా వాటికి గౌరవం

పెరింగిందని అనుకుంటాను. ప్రముఖ కథకుడు… మాస్టారికి ఇష్టుడు అట్టాడ అప్పల్నాయుడు ఇలా అంటారు, ‘‘కారా వ్యక్తిగా అప్పల్రాముడు, రచయితగా సీతారాముడు’’ అని. అప్పల్రాముడు కీర్తి కోసం, మంచివాడ్నని అనిపించుకోవాలనే పేరు కోసం కొడుకుల చేత అప్పుపత్రం మీద వేలిముద్రలు వేయిస్తాడు ‘యజ్ఞం’ కథలో. చూడండి సీతారాముడి మాటల్లో… ‘‘నీకు జనం మెప్పు కావాల, అప్పల్రాముడు సేనా మంచోడు, ఆడి తప్పనోడన్న మాట కావాల, నీ బిడ్డపాపలెలాగన్నా పోనీ. నీకున్న దంబం అంతా ఏటట? దరమం తప్పడు’’ అని. అప్పల్రాముడు కీర్తికాముకుడని బోధపడుతుంది. మాస్టారు కీర్తికాముకుడు కారు. మంచివాడిననిపించుకోవడానికి ఎప్పుడూ తాపత్రయపడరు. నమ్మిన లక్ష్యం ప్రధానం తప్ప పేరు, కీర్తి అతనికి ప్రధానం కాదని మాస్టారికి దగ్గరగా ఉన్న అందరికీ ఎరుకే. మరి మాస్టారు వ్యక్తిగా అప్పల్రాముడని ఎలా అనుకోగలను. వక్తిగానూ, రచయితగానూ సీతారాముడే. కుండబద్దలు కొట్టినట్టు తన అభిప్రాయాలను వ్యక్తం చేయడానికే యజ్ఞం కథ రాశారని నేననుకుంటాను. తీవ్రమైన భావాన్ని సౌమ్యంగానే చెప్పడం మాస్టారి జీవ లక్షణం.
కారా రచనలు చదువుతున్నప్పుడు నాకు మా నాగావళి నది గుర్తుకొస్తుంది. నది విశాలంగా విస్తరించి ప్రవహిస్తుంది కదా. అక్కడక్కడా తెల్లగా మెరుస్తూ కనిపించే చోట్ల చూస్తే నీరు ప్రవహిస్తున్నట్టుండదు, నీరు నిలిచిపోయినట్టుంటుంది. అటువంటి వాటిని ‘తెమ్మ’ అంటారు. నీరు ప్రవహిస్తున్నట్టు కనిపించే చోట ఉన్న లోతుకంటే తెమ్మలో లోతు ఎక్కువ. అదుగో… అలాంటి తెమ్మలాంటి కథలు మాస్టారి కథలు. చాలా జాగ్రత్తగా లోతును గ్రహించాల్సినవి. యజ్ఞం కథ పైపైన చదివేవాళ్ళకి ఒక తగువు గురించి అనిపిస్తుంది. కానీ లోతుగా విశ్లేషించేకొద్దీ పేద, ధనిక వర్గాల మధ్య ఘర్షణ, అభివృద్ధి మాటున విధ్వంసం, ఆర్థిక నమూనాలు, పరిణామం… ఇలా ఎన్నో అంశాలు చర్చకు వస్తాయి. బహుశా ఒక కథ మీద ఇంత చర్చ జరగడం ప్రపంచ కథాసాహిత్యంలోనే లేదేమో. ఇప్పటికీ చర్చించాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న వర్తమాన అంశంగా ఉంటుందీ కథ.
మాస్టారి తొలి కథల మీద మాస్టారే తన అభిప్రాయం చెబుతూ ‘‘నాకు ఇష్టమైన కథలు వేరు, నాకు చేతనైన కథలు వేరు. నాకు ఇష్టమైన కథలు ఎలా రాయాలో నాకు నాడు తెలియదు. నాకు చేతనైన కథలు రాసి ప్రయోజనం లేదని తేలిపోయింది’’ అన్నారు. పరిశీలనా శక్తితోపాటు ప్రాపంచిక దృక్పథం లేనివారు గొప్ప కథలు రాయలేరు అంటారు. మాస్టారికి నిశ్చితమైన ప్రాపంచిక దృక్పథం ఏర్పడ్డాక రాసిన ఆర్తి, చావు, హింస, నో రూమ్‌, భయం, జీవధార, యజ్ఞం, శాంతి, వీరుడు మహావీరుడు, కుట్ర వంటి కథలు ఒక గొప్ప ఆలోచనాపరుని మేథోమధనం నుంచి ఆవిర్భవించిన గొప్ప కథలు. తెలుగు కథాసాహిత్యంలో మేలిమి ముత్యాలు.
ఆర్తి, చావు కథల్లో చూస్తే మనకు స్పష్టంగా కనిపించేవి మాలపేటల్లోని కష్టజీవుల నికృష్ట జీవన వ్యథలు, వారి దుర్భర జీవితాలు. పేదరికం మనుషుల మధ్య గల బంధాలను ఎంతగా విచ్ఛిన్నం చేస్తుందో… ఎంత వికృతంగా మారుస్తుందో చూపిస్తుందీ కథ. ఎర్రెమ్మ, బంగారి కుటుంబాల మధ్య ఘర్షణకి మూలం పేదరికమే. సన్నెమ్మ కాపురం కన్నా ఆమె కూలి డబ్బులే ముఖ్యమైపోతాయి. కన్నోరింటికీ, అత్తోరింటికీ మధ్య అగాధం ఏర్పాటవ్వడానికి కేవలం దారిద్య్రమే కారణం. శ్రమ సొమ్ముగా, వస్తువుగా రూపొందే క్రమంలో జరిగే వికృతరూపానికి దర్పణం ‘ఆర్తి’ కథ.
కుటుంబంలో పేదరికం తన ముద్ర ఎంత దుర్మార్గంగా వేస్తుందో అత్యంత సహజంగా కళ్ళకు కట్టిన కథ ‘చావు’. కుటుంబ సభ్యులంతా చిన్నపిల్లల్ని, ముసలమ్మను వదిలి చేనుకోతలకు వెళ్తారు దళితులు. అలా వెళ్తేకానీ వారికి దినం దీరదు. ముసలమ్మ కన్ను మూస్తుంది. అప్పుడు పిల్లల స్థితిని, తిరిగివచ్చే కుటుంబసభ్యుల డోలాయమాన దయనీయ పరిస్థితిని వర్ణించిన విధం అద్భుతం. ఎంతో పరిశీలనా శక్తి ఉంటేకానీ సాధ్యం కానిది. ముసలమ్మ చావు వార్త విన్న నారమ్మ అనుకోవడంలోని వాస్తవికతను చూస్తే అబ్బురమే. చూడండి ‘‘గోయిందా… నా సేతెండి కడియాలు గోయిందా’’ అని అనుకోవడానికి కారణం శవాన్ని తగలెయ్యడానికి కడియాలు అమ్ముకోవాల్సిన దుస్థితి. శవాన్ని కాల్చడానికి కర్రలుండాల, అందుకు డబ్బులుండాల. శ్రమ చేయించుకున్నోళ్ళే గాని సాయం చేసేవాళ్ళు కారు ఊరోళ్ళు. రాత్రికి రాత్రే శవాన్ని దహనం చెయ్యకపోతే మరుసటిరోజు ఒప్పుకున్న కూలీపనికి వెళ్ళలేరు. అందుకోసం కుర్రాళ్ళు కర్రల్ని చాటుగా తీసుకొస్తారు. ఈ కథ చదువుతుంటే గుండె నీరై కళ్ళలోకి వస్తుంది.
‘కీర్తికాముడు’ కథ సొంత సేద్యం ఉన్న వెంకయ్య నాయుడు అనే రైతు ఎలా చితికిపోయాడో చిత్రిస్తుంది. కథ పేరును బట్టి నాయుడి కీర్తికాముకత్వం కారణంగా కనిపిస్తుంది, కానీ లోతుగా అధ్యయనం చేస్తే చాలా అంశాలు చర్చకు వస్తాయి. అసలు కీర్తి, యశము అనే మాటలు సృష్టించింది ఎవరు? ‘దానం’ ఎవరికి ఏమి దక్కుతుంది? ఇలా ఆలోచిస్తే నాయుడు కీర్తికాముడు కావడానికి కారణం మన పురాణ సాహిత్యం… అందులో చెప్పిన ధర్మాలు అని తేలుతుంది. రంతిదేవుడూ, హరిశ్చంద్రుడూ వంటి కథలు ఎవరి ప్రయోజనాల కోసం? బ్రాహ్మణులకు భూరిదానాలు, గోదాన, భూదాన, హిరణ్యదానాలు చేస్తే కీర్తి పేరుతో నష్టపోయేదెవరు? లాభపడేదెవరు? చాలా సూక్ష్మాంశాలను చర్చకు పెడతారు.
సంక్రాంతి సంబరాల్లో రౌడీల పోట్లాట నేపథ్యంలో ప్రపంచాధిపత్యం కోసం ఆనాటి అగ్రరాజ్యాల కుతంత్రాలు, చిన్న దేశాల బానిస ప్రవర్తనను ప్రతీకాత్మకంగా చెప్పిన కథ ‘వీరుడు, మహావీరుడు’ కథ. యజ్ఞం, చావు, ఆర్తి… ఇవేనా? మాస్టారి ప్రతి కథా పాఠకుల్ని కలవరపరుస్తాయి. కన్నీరు పెట్టిస్తాయి. కన్నీరు పెట్టించడంతో పాటు ఆలోచింపజేస్తాయి.
మాస్టారు తొలి కథల్లో రాసిన మధ్యతరగతి శిష్ఠ వ్యావహారికాన్ని వదిలి దళిత పేదల్ని గురించి వారి భాషలో రాయడం మరో మలుపు. గ్రామీణ అట్టడుగు వర్గాల జీవితాల్ని వారి భాషలో రాసి ఉత్తరాంధ్ర మాండలికానికి గౌరవం తెచ్చిపెట్టిన తొలి కథకులు మాస్టారే అనుకుంటాను. కారా కథలు ఒకసారి చదివి వదిలేద్దామంటే కుదరదు. ‘‘పురాతన చరిత్ర కోసం భూమిపొరలను తవ్వే ఆర్కియాలజిస్టులా పొర పొరా విడదీసి చూపేదాకా చరిత్ర సమాచారం ఆవిష్కారం కానట్టు మాస్టారి కథల్ని పొరాపొరా జాగ్రత్తగా విప్పుకోనిదే బోధపడదు’’ అన్న వేల్చేరు నారాయణరావు గారి మాటలు అక్షర సత్యం. మాస్టారి ప్రతి కథనూ లోతుగా అధ్యయనం చేయాల్సిందే. అవి నిన్నటివే కావు, నేటివి రేపటివి కూడా!

Share
This entry was posted in వ్యాసం. Bookmark the permalink.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v
 

S

sh

s
   
h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.