జయశ్రీ గత మూడు దశాబ్దాలుగా ఆంధ్రప్రదేశ్‌లో హక్కుల ఉద్యమంలో పని చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని వెనకబడిన రాయలసీమ ప్రాంతంలో జయశ్రీది కంగు కంగున మోగే ఒక ధిక్కార స్వరం. ఒకవైపు అధికారులతో నిర్భయంగా, నిర్మొహమాటంగా మాట్లాడుతూ మరోవైపు బాధాతప్తులకు అండగా నిల్చే జయశ్రీది కడప జిల్లాలో ఒక బలమైన గొంతు.
ప్రతిపక్షాలకు చెందిన ఫ్యాక్షన్ నాయకులు సైతం అధికారపక్ష ఫ్యాక్షన్ ఆగడాలను ప్రశ్నించడానికి భయపడే ఫ్యాక్షన్మయ కడప జిల్లాలో ఫ్యాక్షనిస్టులను నిలదీస్తున్న ఏకైక వ్యక్తి జయశ్రీ. ధైర్యం పురుష లక్షణం అనుకునే కొందరు ఆమెను ‘కడప జిల్లాలో ఏకైక మగాడు’ అని పిలుస్తారు. అనేక మలుపులు తిరిగిన తన వ్యక్తిగత, ఉద్యమ జీవితం నుండి జయశ్రీ బోలెడన్ని జ్ఞాపకాలు మూటగట్టుకున్నారు. ప్రతి అనుభవం నుండి, పాఠాలు నేర్చుకుని, మరింత శక్తి పుంజుకుని తనని తాను పునరావిష్కరించుకుంటూ హక్కుల ఉద్యమంలో చురుగ్గా పని చేస్తున్నారు. పనికి మరో ప్రత్యామ్నాయం లేదని, అన్నింటికీ అదే జవాబని ఆమె నమ్ముతారు. కటిక చేదు అనుభవాలను కూడా కడుపుబ్బా నవ్వించేటట్లు చెప్పడం కొందరికి చేతనవుతుంది. కమ్మటి కడప మాండలికంలో మాట్లాడే జయశ్రీ కథ కడప జిల్లా హక్కుల డైరీ.
జయశ్రీ 1988 నుంచి స్త్రీల సమస్యలపై పని చేయడం మొదలుపెట్టారు. ఈనాటికీ అది కొనసాగుతోంది. ఆమె వద్దకు వచ్చే కేసులు వింటే మానవత్వంపై పూర్తిగా నమ్మకం పోతుంది. తనలో ఉన్న ఆర్తినంతా కూడదీసుకుని ఈ సమస్యలను చేపడతారామె. కూతుళ్ళపై అత్యాచారం చేసిన తండ్రులు, ఇంటికి బీగం వేసి కోడల్ని రోడ్డుపాలు చేసిన అత్తమామలు, అమెరికాలో భార్యకు ఘోర కలి చూపిన భర్తలు, నగ్న చిత్రాలు తీసి మొబైల్‌లో, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసి బ్లాక్‌మెయిల్ చేసే నయవంచక ప్రియులు, జీవితాంతం దెబ్బలు కాసినా కోడలి ముందు భర్త అనే బూతు మాటలు భరించడానికి సిద్ధపడని అత్తగారు, తల్లిని వీథిపాలు చేసిన కొడుకు, ఒకటికి నాలుగు పెళ్ళిళ్ళు చేసుకుని అందరినీ మోసం చేసే ఘనులు, కింది ఉద్యోగినిపై లైంగిక అత్యాచారం చేసే అధికారి, ప్రేమించిన పాపానికి చెల్లెలిని చంపి పూడ్చిపెట్టిన అన్న, అందుకు వత్తాసు పలికే పోలీసులు, ఫ్యాక్షనిస్టులు… ఈ జాబితాకి అంతులేదు. కొన్ని మచ్చు తునకలను మాత్రమే ప్రస్తావించడం సాధ్యపడుతుంది.
ఒక స్త్రీ భర్తను కొట్టి చంపేసిందనే వార్త చదివి జయశ్రీ ఆమెను జైలుకు వెళ్ళి కలుసుకుంది. నిందితురాలు పిట్టంత మనిషి. ఎందుకమ్మా ఈ పని చేశావంటే భర్త తాగి వచ్చి తన బిడ్డపై అత్యాచారం చేయబోతుంటే బిడ్డను కాపాడడానికి మరో మార్గం లేక చంపేశానని చెప్పింది. అతని శరీరంపై మొత్తం 56 గాయాలున్నాయి. ఇటువంటి స్త్రీలకు ఇంట్లో తాత్కాలికంగా షెల్టర్ ఇవ్వడం దగ్గర్నుండి అధికారులతో మాట్లాడడం మొదలు చేయగల సహాయం ఏదైనా వెరవకుండా చేస్తారామె.
ఆశ్రమ పాఠశాలల్లో బాలికలపై జరిగే లైంగిక అత్యాచారాలపై ఆమె ఎప్పటికప్పుడు స్పందిస్తున్నారు. వనిపెంట బాలికల రెసిడెన్షియల్ పాఠశాల ప్రిన్సిపాల్ పిల్లలపై లైంగిక వేధింపులకు పాల్పడగా జయశ్రీ ఆ పిల్లల చేత కేసు పెట్టించారు. అతన్ని అరెస్టు చేసి రిమాండుకు పంపారు. సరస్వతిపేట పాఠశాల హెడ్ మాస్టర్ నాల్గవ తరగతి చదువుతున్న పసిపిల్లలకు ఫోనులో నీలిచిత్రాలను చూపిస్తుంటే భరించలేక పిల్లలు ఒకరోజు రోడ్డున పడ్డారు. ‘మాకు మగ సార్ వద్దు. ఆడ టీచర్ కావాలి’ అని జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం ఇమ్మని ఆమె వారికి సలహా ఇచ్చారు. ఆ తర్వాత ఆ టీచర్‌ను అక్కడనుంచి బదిలీ చేశారు. ఈ విధంగా జిల్లా వ్యాప్తంగా 12 పాఠశాలల్లో లైంగిక అత్యాచారాలకు పాల్పడుతున్న టీచర్లపై ఫిర్యాదు చేసి వారిపై అధికారులు చర్యలు తీసుకునేలా చేశారు.
ఫేస్‌బుక్ మాధ్యమం ద్వారా కూడా కడప జిల్లాలో జరుగుతున్న హక్కుల ఉల్లంఘనలను జయశ్రీ ఎప్పటికప్పుడు బయట ప్రపంచానికి తెలియజేస్తున్నారు. ఈ సంఘటనలపై ఆమె ప్రతిస్పందించే తీరు చదివి సాటి హక్కుల కార్యకర్తలు సైతం చాలా నేర్చుకోగలుగుతున్నారు, ఉత్తేజితులవుతున్నారు. ఆమె సమస్యల గురించి రాయడమే కాకుండా ఫోటోలు, వీడియోలు కూడా జత చేస్తున్నారు. ఫేస్‌బుక్‌ను హక్కుల పరిరక్షణకు ఒక బలమైన మాధ్యమంగా ఆమె ఉపయోగించుకుంటున్నారు.
జయశ్రీ ఏనాడూ సిద్ధాంత రాద్దాంతాల జోలికి పోలేదు. పని చేసుకుంటూ పోయారు. చిన్నప్పుడు ‘గడప ఉంది
పడతావు అనేలోపే రెండో గడప, మూడవ గడప దగ్గర పడే’ జయశ్రీ జీవితంలో ఎదురైన గడపలెన్నింటి దగ్గర పడినా లేచి నిలబడి మరింత శక్తి పుంజుకుని నడవడం నేర్చుకున్నారు. పనికి మరో ప్రత్యామ్నాయం లేదని చెప్పిన బాలగోపాల్ ఆమెకు స్ఫూర్తి. స్నేహితురాలు, హక్కుల కార్యకర్త, బాలగోపాల్ సహచరి అయిన వి.వసంత లక్ష్మి ఆ స్ఫూర్తిని కాపాడుకుంటూ వచ్చారు. హక్కుల ఉద్యమంలో జయశ్రీని అభిమానించేవారు చాలామందే ఉన్నారు. జయశ్రీ కుటుంబం మొత్తం ఇప్పుడు ఆమె వెంట ఉన్నారు. ఆమె కుమారుడు అనోష్ రాజ్ అమెరికాలో ఉద్యోగం చేస్తూ యూదురాలైన అమెస్టర్ మోర్గాన్ స్ట్రన్‌ని వివాహం చేసుకున్నారు. ఇప్పుడు వారి ఇంట్లో మూడు మతాల సామరస్యం నడుస్తోంది. అనోష్, అమెస్టర్‌లకి ఇటీవలే డిలాన్ రాజ్ అనే బాబు పుట్టాడు.
జయశ్రీ ఖాళీగా కూర్చునే మనిషి కాదు. ఆమె ఇంటి తలుపులు తెరవగానే వాకిట్లో సూర్యకాంతి వాలుతుంది. సూర్యకిరణాల వెంటే వెంకటేశ్వరమ్మలు, మల్లేశ్వరులు, నూర్జహాన్‌లు, రాజేశ్వరులు… వచ్చి ఆమె ముంగిట వాలుతారు. అది ఫ్యాక్షనిస్టులు, పోలీసులు, కుటుంబం, కులం, మతం మొదలైన రకరకాల ఆధిపత్య వ్యవస్థలకి వ్యతిరేకంగా ఏర్పరచుకున్న గూడు. మహిళావరణం, హక్కుల ఆవరణం. ఆమె పని చేస్తూనే ఉన్నారు.
అలాంటి హక్కుల స్వరం జయశ్రీ హఠాత్తుగా గుండెపోటుతో మరణించడం కడప జిల్లాలోనే కాకుండా మొత్తం రాయలసీమలోనే గొప్ప విషాదం అలుముకుంది. ఆమె వదిలివెళ్ళిన శూన్యం ఇప్పుట్లో భర్తీ కాకపోవచ్చు. హక్కుల ఉద్యమంలో తనదైన ముద్రను వదిలి వెళ్ళిన జయశ్రీకి అశ్రు నివాళి.
(మానవ హక్కుల వేదిక కరపత్రం నుండి సంక్షిప్తంగా…)