సూర్యుడు అస్తమించి
నల్లటి ముసురు వర్షపు చీకటి కురిసే కాలాన
యుద్ధం ముగిసి నెత్తురు పారిన
ఆ అడవి చివరి సముద్ర తీరాన
ఇంకా రాని పడవల కోసం కాసిన్ని లాంతర్లను
వెలిగించి ఎదురుచూశాం
రాత్రి నక్షత్రాల మధ్య మసక వెన్నెల భుజాల మీదుగా
నెలవంక తొంగిచూసింది అనుమానంగా మాకేసి
ఇక అంతా ముగిసిందన్న వాళ్ళనూ
మౌనం వహించిన వాళ్ళనూ
భయపడే వాళ్ళనూ హెచ్చరిస్తూ
నిదురనుండి మేల్కొలుపుతూ
కంటిమీద కునుకన్నా లేక అలలు
అట్లా పాడుతూనే ఉన్నాయి ఎన్నో యుగాలుగా
ఆశలేని కాలంలోనూ ఇంకా పెదవులపై మాయని
చిరునవ్వులు గల వాళ్ళ రహస్యం
ఒక్క సముద్రానికే తెలుసు
ఇక్కడ అస్తమించిన ఆ సూర్యుడే
ఖండాంతరాలకు ఆవల మరెక్కడో
చీకటి రాత్రులని చితిమంటలలో దగ్ధం చేస్తూ
మెల్లిగా ఆకాశాన వెలుగుతాడు
మరెక్కడో వెలుగురేఖలు నేల అంతటా వ్యాపించి
నీటిపై తళతళా మెరిసి, రంగురంగుల చేపపిల్లలు
ఆనందంతో తుళ్ళి పడతాయి
అప్పుడు ప్రొద్దుతిరుగుడు పూలు
సూర్యుడికి ప్రేమలేఖ రాస్తాయి
పక్షులు గూళ్ళు వదిలి ఆకాశాన రివ్వున ఎగురుతాయి
నేలపైన మనం నడిచిన పాదముద్రల ఆనవాళ్ళు
మనిషి వెన్నంటి వచ్చే నీడలూ మళ్ళీ అగుపడతాయి
మూసుకుపోయిన దారులు మెల్లిగా విచ్చుకుంటాయి
కొత్తదేదో తెలిసినట్లు, ఈ సారి తప్పక గెలవనున్నట్లు
గొప్ప జీవనోత్సాహ సాహసంతో
మహోద్రేకంతో నిద్రలేస్తారు అందరూ
అదిగో ఆ చోట మరణించిన వాళ్ళ
ఊరేగింపు బయలుదేరింది
సమాధుల పండుగ నాడు దీపాన్ని వెలిగించి
జెండాలను ఎగరేసి, అమరుల స్మృతి గీతాల్ని పాడుతున్నారు ఎవరో
అక్కడ పురిటి వాసనల ఘాటైన పరిమళమేదో
గాలి అంతటా వీస్తున్నది
సమాధులపై అప్పుడే వికసించిన పూలు పసి పిల్లలై
కేరింతలు కొడుతూ పరుగెత్తుతాయి వీథుల్లోకి
పిల్లలు మళ్ళీ మళ్ళీ అట్లా లోకంలోకి రావడమంటేనే
మనం అలసి ముసలి వాళ్ళమైపోయాక
మనం పోగొట్టుకున్న, మరచిపోయిన
మనం మోయ లేకపోయిన మరెన్నింటినో
అందుకోవడం కోసమే
మనం వదిలిన పెద్ద పెద్ద చెప్పులను వేసుకుని
పడిలేస్తూ చిట్టి పాదాలతో పరిగెత్తే ఈ పిల్లలే
సరికొత్తగా దారులను వేస్తూ బయలుదేరుతారు.
ఇక అప్పుడు
మనకి ఆవల మరో నీటి అలల వలయం
ఇంద్రధనుస్సులా ఏర్పడి
సరికొత్తగా నాట్యం చేయడం మొదలుపెడుతుంది
సముద్రం అప్పుడు హమ్మయ్య అని గాఢంగా
నిట్టూర్చాక
మనం ఎదురు చూస్తున్న పడవలు నీటిని ఒరుసుకుంటూ
తీరాన్ని చేరిన చప్పుడు కూడా వినపడుతుంది
ఇక ఒక్కొక్కటిగా లాంతర్లు ఎటో నడిచి వెళతాయి
అలల మర్మధ్వని మంద్రంగా వినిపిస్తుండగా నిశ్చింతగా…