డా|| రోష్నీ
ఇదేదో కాస్త వయసుపైబడ్డాక అంటే 35 సం|| దాటాక వచ్చే బాధ కదా, అప్పుడే చూసుకుందాం అని వదిలేయొద్దు. బాల్యంలోనే ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోవాలి. బాల్యంనుంచే సరయిన పోషకాహరం (సరిపడా కాల్షియం ఉండేలా) అందేలా చూడాలి.
శారీరక వ్యాయామం క్రమం తప్పకుండా చేయాలి. ఒక వయసు వచ్చాక అసలు ఆడపిల్లలను ఆటలే ఆడనివ్వరు. అది మంచిదికాదు. ఎముకలు బలంగా ఉండాలంటే వ్యాయామం అవసరం. నిటారుగా నడవటం అలవాటు చేసుకోవాలి. ముఖ్యంగా ఆడపిల్లల్ని తల, మెడ వంచుకుని నడవమంటారు. ఇదీ మంచిది కాదు. కూర్చుని చదివేటప్పుడు, టీవి చూస్తున్నప్పుడు కూడ నిటారుగా కూర్చోడానికి ప్రయత్నించాలి. వంకర టింకరగా కూర్చుంటే మెడనొప్పి. నడుంనొప్పి తప్పవు.
కాల్షియం ఎక్కువగా పాలు, పాలతో తయారయిన పదార్ధాల్లో, పప్పు ధాన్యాల్లో, ఆకుకూరల్లో, రాగుల్లో (ఇది బియ్యంకంటే చౌక) ఉంటుంది. ఎండుకొబ్బరి, నువ్వులలో కూడా కాల్షియం రిచ్‌గా ఉంటుంది. ఆడపిల్లలు పెద్దమనుషి అయినపుడు బంధువులు వీటిని తీసుకొచ్చి ఇస్తారు. ఈ సాంప్రదాయంలో ఎంత అర్థం ఉందో చూసారా? ఇక మనం తాలింపు కోసం వాడే ఆవాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు – వీటిలో కూడా కాల్షియం ఎక్కువగా ఉంటుంది.
మీకు ఇప్పటికే నడుంనొప్పి ఉందనుకోండి. అయితే ఒకసారి ఎముకల డాక్టరుకి (ఆర్థోపెడిస్ట్‌కు) చూపించుకోండి. ఎందుకంటే వెన్నెముక టి.బి., కేన్సర్ సంబంధిత ట్యూమర్లు ఉంటే గనక అక్కడ చిట్కా వైద్యాలు పనికిరావు. ఎంత త్వరగా స్పెషలిస్టు వైద్యం చేస్తే అంత మంచిది.
సాధారణ నడుమునొప్పికి తీసుకోవలసిన జాగ్రత్తలు :
1. కరెక్టుగా (నిటారుగా) కూర్చోడం, నిలబడటం.
2. క్రమం తప్పకుండా వ్యాయామం (ఈత కొట్టడం, యోగ మొ||వి)
3. ఒకే పొజిషన్‌లో ఎక్కువసేపు ఉండొద్దు.
4. నడుము దగ్గర వంగి బరువులెత్తొద్దు. (అసలు బరువులు ఎత్తడం మానేస్తే మంచిది, కుదరదు అనుకుంటే మోకాళ్ళ దగ్గర వంగి బరువు ఎత్తడం మంచిది. ఈకింది బొమ్మలో చూపినట్లుగా
5. ప్రయాణాల్లో కుదుపు లేకుండా చూసుకోండి. (గతుకుల రోడ్లపై, స్కూటర్‌పై, ఆటోలో, బస్సులో ప్రయాణం మంచిది కాదు)
6. కూర్చునేటపుడు క్రింది నడుముకు సపోర్టుగా కుషన్ వాడండి.
7. పడుకునేటప్పుడు ఎగుడు దిగుడుగా వుండే నవ్వారు మంచాలు, మడత మంచాలు వాడొద్దు. చెక్క బల్ల అయితే మంచిది. ఫోమ్ బెడ్‌లు కూడా వెన్నెముకకు సరైన సపోర్టు ఇవ్వవు. తలదిండు వేసుకోకపోవడమే మంచిది.
ఇక నొప్పి అప్పటికే మొదలయితే క్రోసిన్ లాంటి మాత్రలు వాడొచ్చు. హోమియోపతి, ఆయుర్వేదం మందులు కూడా ఉపయోగపడతాయి. అయితే ఒకసారి నొప్పి తగ్గాక మళ్ళీ రాకుండా ఉండాలంటే కాల్షియం ఎక్కువగా ఉండే ఆహారం, వ్యాయామం, పని-మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం చేయాలి. మరి ప్రయత్నించండి. ఆల్ ది బెస్ట్.
అలా అని రిలాక్స్ అయిపోకండి. కొన్ని సందర్భాల్లో ఎమర్జన్సీగా స్పెషలిస్టుని కలవాల్సొస్తుంది. అదెప్పుడంటే : 1. నడుంనొప్పితో పాటు మూత్రం గాని, విరేచనంగాని కంట్రోల్ లేకపోతే 2. చేతుల్లోగాని, కాళ్లలో గాని మొద్దుబారినట్లనిపిస్తే – వెంటనే డాక్టరుని సంప్రదించండి. సి.టి. స్కాన్, యంఆర్‌ఐ లాంటి పరీక్షలు అవసరమవుతాయి. వెంటనే సరయిన వైద్యం కూడా అవసరం. లేకపోతే ప్రమాదం.
రిపోర్టు
నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జరిగిన నేషనల్ రైటర్స్ మీట్
కె. వరలక్ష్మి
ఆగష్ట్ 8,9 తేదీలోల్ల ఉదయగిరిలో నేషనల్ రైటర్స్‌్ మీట్ జరగబోతోందనీ, నన్నూ పాలుపంచుకొమ్మని కోరుతూ ఇండియన్ సొసైటీ ఆఫ్ ఆదర్స్ మరియు పెన్నా రైటర్స్ అసోసియషన్ తరఫున పెరుగు రామకృష్ణగారి నుంచి ఆహ్వానం అందింది. నేను స్టేషన్ నుంచి తిన్నగా రామకృష్ణ ఇంటికి వెళ్ళాను.
నేను వెళ్ళేసరికే వారింట్లో థార్వాడనుంచి వచ్చిన కన్నడ కవయిత్రి సుకన్యామారుతి ఉన్నారు. నేను వెళ్ళిన కాస్సేపటికి చిత్తూరు నుంచి రచయిత్రి అరుణకుమారి వచ్చారు. అందరం కల్సి డి.ఆర్. హోటల్‌కి వెళ్లేం. అక్కడ కేరళనుంచి శ్రీధరన్, కర్ణాటక నుంచి నాగరాజుశెట్టి, స్థానిక రచయితలు సురేంద్రబాబు, దగ్గుమాటి పద్మాకర్, ఖాదర్‌షరీస్ ఉన్నారు. మా అందరితో ప్రెస్ మీట్ జరిగింది. ‘ఎందుకు రాస్తున్నాం?’ అనే మెయిన్ ఎయిమ్ అందరం చెప్పాం. అదే హోటల్లో డిన్నర్ తర్వాత డిస్టర్స్ అయ్యాం.
8వ తేదీ ఉదయాన్నే మేం బస్సు దగ్గరకి చేరుకునే సరికి రాత్రి, తెల్లవారు ఝూమున చేరుకున్న మరికొందరు రాష్ట్ర, రాష్ట్రేతర కవులు, రచయితలు సింహపురి హోటల్ దగ్గర ఉన్నారు. వారిలో వరంగల్ నుంచి వచ్చిన ప్రసిద్ధ కవి, రచయిత విమర్శకుడు రామాచంద్రమౌళి, ప్రసిద్ద స్త్రీవాద రచయిత్రి ప్రతిమ కూడా ఉన్నారు.నిండుగా ఉన్న ప్రత్యేకమైన బస్సులో ఒక పిక్నిక్ టూర్‌లాగా పర్యావరణ పరిరక్షణకోసం రచయితల ఉదయగిరి యాత్ర ప్రారంభమైంది. ఈ సంవత్సరం వేసవి ఇంకా కొనసాగుతూ, వర్షాలు లేకపోవడం వలన పచ్చగా ఉండాల్సిన పైర్లులేక బోసిపోయిన పొలాలు చూసి కొంతా, వాతావరణంలోని వేడికి కొంతా అందరం కొంచెం డిస్టర్భయ్యాం. కొంతదూరం ప్రయాణించి బస్సు కొండకోనల వైపుగా వెళ్తున్నపుడు అందరూ హుషారుగా కబుర్లు చెప్పుకోవడం కన్పించింది. బస్సు ఒక చోట నాలుగురోట్ల కూడలిలో ఆగినపుడు ఈ కార్యక్రమానికి మరో కన్వీనర్, రచయిత పొట్లూరు సుబ్రహ్మణ్యం వచ్చి మాతో కలిసారు.
అక్కడి నుంచి బస్సు నర్రవాడ వైపుగా వెళ్లింది. నర్రవాడలోని వెంగమాంబ పేరంటాలు ఆలయ కమిటీ వారి ఆహ్వానం మేరకు అంతా అక్కడికి చేరుకున్నాం. ఆలయ దర్శనం తర్వాత అక్కడి గెష్ట్‌హౌస్‌లో సేదతీరి, కమిటీవారు ఏర్పాటు చేసిన వేడి వేడి వంటకాలతో భోజనాలు ముగించి తిరిగి బస్సెక్కాం. బస్సు ఉదయగిరి మీదుగా కొండకోనల్లో ప్రయాణించి సాయంకాలానికి భైరవకోన చేరుకుంది. అజయ్‌ప్రసాద్ రాసిన ‘లోయ’ కథకు నేపధ్యమైన భైరవకోనకు చూస్తూ ఆ కథను మరోసారి గుర్తు చేసుకున్నాం. చిత్తూరు జిల్లాలోని తలకోనలా కాక భైరవకోనలో ఇంచుమించు జలపాతం సమీపం వరకు బస్సు వెళ్ళడం వలన అందరం హుషారుగా ఆ ప్రాంతమంతా తిరిగి చూసాం.
జలపాతం, కాలభైరవుని చిన్ని ఆలయం, ఒకే కొండ రాతిలో చెక్కబడిన తొమ్మిది శివలింగాల గుహాలయాలు, కొండ పైన యోగిశిల్పం, అక్కడి గుహాలో వెలిగే అఖండదీపం, సత్రం, దానికి సమీపంలో ఒకే ఒక చాయ్ దుకాణం, ఇంతటి నీటి కరువు రోజుల్లోనూ రాతి పగుళ్లలోంచి వెలువడుతూ గులకరాళ్ల మీదుగా గల గలమని ప్రవహిస్తున్న సన్నని నీటి కాల్వ అన్నీ చూస్తూ ఏదో ఓ ప్రత్యేకమైన లోకంలో తిరుగాడుతున్న అనుభూతిని పొందేం.పశ్చిమాద్రిలో అస్తమించబోతున్న సూర్యబింబాన్ని, గులకరాళ్ళతో నిండిన నేలల్ని, దూరంగా తిరుమలకొండని తలపింపచేస్తున్న ఉదయగిరి పర్వతాన్నీ చూస్తూ తిరుగు ప్రయాణమై చీకట్లు ముసిరేవేళకు కృష్ణపాలెం జవహర్ నవోదయా స్కూలుకు చేరుకున్నాం. అక్కడి హాస్టల్ విద్యార్ధులు మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యంగా అక్కడి విద్యార్ధుల డిసిప్లిన్, కొత్త వాళ్ళతో కలిసిపోయే లక్షణం, అవగాహన నాకు చాలా నచ్చాయి.
ఆ సాయంకాలంవేళ అక్కడి ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం స్టేజిపైన నవోదయా ప్రిన్సిపాల్ నారాయణారవు, డిప్యూటీ కలెక్టర్, పొయెట్ షంషీర్ అహమ్మద్, ప్రొ.సుకన్యామారుతి, అంధకవి మోపూరు పెంచలనరసింహం వంటి ప్రముఖులు, ఇతర రాష్ట్రాల కవులు, విద్యావూత్తలు ఆశీనులై ఉండగా విద్యార్ధులు పర్యావరణం పైన కవిత్వం చదివి, పాటలు పాడి, జోక్స్‌చెప్పి, వివిధ కళల్లో వాళ్ళు సృజనాత్మకతను ప్రదర్శించి ఆహుతుల్ని ముగ్ధుల్ని చేసారు. పర్యావరణ పరిరక్షణ మీద డా. రామలింగేశ్వర రావు (శ్రీహరికోట) ప్రొ. నాగరాజుశెట్టి (కర్ణాటక) పేపర్క్ సబ్మిట్ చేసారు. సుభద్రా దేవి పిల్లలకు నచ్చేలా చక్కని సందేవాన్నిచ్చారు. వక్తలు మాట్లాడినా, కవిత్వం విన్పించినా విద్యార్ధులంతా చాలా అవగాహనతో స్పందించారు. హైదరాబాద్ నుంచి వచ్చిన రచయిత జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి రాసి విజువలైజ్ చేసిన ఒక మంచి పాటను స్క్రీన్ పైన చూడడంతో ఆనాటి కార్యక్రమం ముగిసింది. విద్యార్ధులు కొసరి కొసరి వడ్డించిన చక్కని భోజనం చేసి ఆ రాత్రికి అక్కడే విశ్రాంతి తీసుకున్నాం. భోజనాల తర్వాత అందరం ఒక చోట చేరి కవిత్వాలు విన్పించుకోవాలనీ, కబుర్లు చెప్పుకోవాలనీ అనుకున్నాం కాని కాలాతీతం కావడంవలన కొంతా, వాతావరణంలోని వేడికీ ప్రయాణపు బయలికకూ కొంత అలసిపోయిన అందరం నిద్రకుపక్రమించేసాం.
ఈ రోజు చీకట్నే లేచి ఆరుగంటలకంతా సిద్ధమైపోయాం. కేంటిన్లో అందరం కలిసేసరికి నిన్నటి బడలికపోయి అందరూ ఫ్రెష్‌గా కళ కళలాడుతూ కన్పించేరు. తిరిగి బస్సెక్కి ఉదయగిరి వైపుగా సాగిపోయాం. దారిలో కృష్ణదేవరాయలకాలంనాటి శిధిలయాలన్ని చూసాం. పెట్టని కోట గోడలా పశ్చిమాన ఉదయగిరికొండ నిలిచి ఉండగావిశాలమైన ప్రాంగణంలో అత్యద్భుతమైన మంటపాలతో, ప్రాకారాలతో, శిధిల శిల్పాలతో, గోపురాలతో ఆనాటి వైభవాన్ని చెప్పకనే చెప్తున్న ఆలయమది. తురుష్కుల దాడి సమయంలో ఆలయంలోని ప్రధానమూర్తి రంగనాధస్వామి విగ్రహాన్ని ఆ గ్రామ ప్రజలు అర్ధరాత్రి బండిలో రహస్యంగా తరలించి నెల్లూరుకి చేర్చారట. అదే ఇప్పటి నెల్లూరు రంగనాథాలయంలోని ప్రధాన మూర్తి అట.
అక్కడికి దగ్గర్లోనే ఉన్న మేకపాటి రాజ్‌మోహన్‌రెడ్డి సైన్స్ మరియు టెక్నలాజికల్ ఇన్స్‌ఇ్టట్యూట్‌కి చేరుకున్నాం. పెద్ద ప్రాంగణంలో పెద్ద పెద్ద భవనాల్తో ఉన్న ప్రైవేటు కాలేజ్ అది. ఆ కాలేజ్ ఇన్ డోర్ ఆడిటోరియంలో నేషనల్‌సెమినార్ ‘ఎన్విరాన్ మెంటల్ కాన్షస్‌నెస్ ఇన్ ఇండియన్ లిటరేచర్’ జరిగింది. జ్యోతి ప్రజ్వలన తర్వాత స్టేజి పైకి ఆ కాలేజీ ప్రిస్పిపాల్ ఎన్.వి.రామమూర్తి, స్థానిక ఎం. పి. ఎం.ఎల్‌ఏ,ల ప్రతినిధిగా బి. సుబ్బారెడ్డి,ప్రోగ్రామ్ కన్వీనర్స్ మరియు ఐఎన్‌ఎస్‌ఏ మెంబర్స్ మరియు పెన్నా రైటర్స్ అసోసియేషన్ మెంబర్స్ అయిన పెరుగు రామకృష్ణ, పొట్టూరు సుబ్రమ్మణ్యం, కవి రామాచంద్రమౌళి, పుదుకై రజనీకాంత్, బిప్లవ్‌మాజి,శ్రీధరన్ ఆహ్వానించబడ్డారు. సావనీర్ ఆవిష్కరణ జరిగింది. నెల్లూరు నారాయణాకాలేజ్, ప్రొ. కె. సరోజాదేవి, అసోసియేట్ ప్రొఫెసర్ విక్టర్ రవికిరణ్, పుదువై రజనీకాంత్ డా, వారణాసి రామబ్రహ్మం పేపర్స్ సబ్మిట్ చేసారు, ఒక్క పర్యావరణంలోనే కాదు అన్ని రంగాలలో పెఛ్చరిల్లుతూన్న కాలుష్యం తగ్గించేందుకు రచయితలు కృషి చేయాలని రామాచంద్రమౌళి అన్నారు. అరుణకుమారి తన కథను నాటకీయంగా చదివి విద్యార్ధుల అభినందనలు అందుకున్నారు. ఖాదర్‌షరీష్,సురేంద్రబాబు, సునీల్ ఇంకా వర్ధమాన రచయితలు కొందరు తమ కవిత్వాన్ని విన్పించారు. ఆ కాలేజ్ విద్యార్ధులు కూడా తమ కవితల్ని, అభిప్రాయాల్ని ఉత్సాహంగా విన్పించారు. అందరికీ జ్ఞాపికలు, సర్టిపికేట్లు బహూకరించడంతో కార్యక్రమం ముగిసింది.
కాలేజ్ కేంటిన్లో లంచ్ ముగించేఉకుని, ఉదయగిరి కోటను చూసేందుకు టైం చాలక కొంత నిరుత్సాహంతో బస్సెక్కేం. రెండు రోజులు కలిసి ప్రయాణం చేసి కబుర్లు కలబోసుకున్న అందరం నెల్లూరులో వీడ్కోలు చెప్పుకొని మళ్లీ కలుసుకుందాం అంటూ తిరుగు ప్రయాణమయ్యాం.
-
Recent Posts
Recent Comments
- Aruna Gogulamanda on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- Manasa on ‘మిళింద’ మానస ఎండ్లూరి కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార్ గ్రహీతతో కాసేపు -వి.శాంతి ప్రబోధ
- రవి పూరేటి on తండ్రి ప్రేమలు సరే… తల్లి ప్రేమలెక్కడ?-కొండవీటి సత్యవతి
- Seela Subhadra Devi on సంక్షిప్త జీవన చిత్రాలు – తురగా జానకీరాణి కథలు శీలా సుభద్రాదేవి
- Pallgiri Babaiiahh on వీర తెలంగాణ విప్లవయోధ చెన్నబోయిన కమలమ్మ -అనిశెట్టి రజిత
Blogroll
- Bhumika HelpLine Bhumika HelpLine., Helping Women across AndhraPradesh !
- Bhumika Womens Collective
- Streevada Patrika Bhumika Streevada Patrika Bhumika published by K. satyavati
December 2024 S M T W T F S 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 Meta
Tags